
భానుడు ఉగ్రరూపం దాల్చే ఏప్రిల్ నెలలోనే ప్రాణం కుదుటపడేలా జూన్‌లో ఆగమించే నైరుతి రుతుపవనాల తీరుతెన్నులు చెప్పడం మన వాతావరణ సంస్థలకు అలవాటు. ఈసారి భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించినదాన్నిబట్టి సాధారణ వర్షపాతంకన్నా అధికంగానే వానలు పడొచ్చు. అంతేకాదు... వర్షాభావానికి దారితీసి కరువు కాటకాలకు కారణమయ్యే ఎల్ నినో బెడద కూడా ఉండకపోవచ్చని కూడా ఆ విభాగం తెలియజేసింది. అయితే వాతావరణ స్థితి గతులను అంచనా వేసే మరో సంస్థ స్కైమెట్ మాత్రం ‘సాధారణ’ స్థాయిలోనే రుతుపవనాలుంటాయని చెబుతోంది.
ఈ నెల మొదట్లోనే ఇందుకు సంబంధించిన లెక్కలు ప్రకటించి, సాధారణంకన్నా అధికంగా వర్షాలు పడే అవకాశం 30 శాతం మాత్రమే ఉన్నదని తెలిపింది. నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ 1న ప్రవేశించి చకచకా విస్తరించుకుంటూపోయి సెప్టెంబర్ మధ్య కల్లా నిష్క్రమిస్తాయి. దేశ జనాభాలో 42.3 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం పూర్తిగా రుతుపవనాలపై ఆధారపడి వుంటుంది. అది సక్రమంగా వచ్చి వెళ్తే దేశం కళకళలాడుతుంది.
మందగమనంతో అడుగులేస్తే, అంతంతమాత్రంగా ముగిసిపోతే అనేక సమస్యలకు దారితీస్తుంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం వాటా 18.2 శాతం. అయితే ‘వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరికీ తెలియద’న్న నానుడి మరిచిపోకూడదు. వర్షపాతం బాగుంటుందన్నా, అది అధికంగా ఉండొచ్చని చెప్పినా దేశవ్యాప్తంగా అన్నిచోట్లా అదే మాదిరిగా ఉంటుందని ఆశించలేం. స్థానిక కాలమాన పరిస్థితులనుబట్టి కొన్నిచోట్ల అధిక వర్షపాతం, మరికొన్నిచోట్ల అవసరమైన దానికన్నా తక్కువగావుండొచ్చు. బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్ ఒక సందర్భంలో చెప్పినట్టు వాతావరణం అనేది ప్రభుత్వం వంటిది. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది!
ఎక్కడో భూమధ్య రేఖకు ఆనుకునివున్న పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడివున్న వర్తమాన వాతావరణ పరిస్థితులు మన రుతుపవనాలను నిర్దేశిస్తాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై, ముఖ్యంగా దక్షిణమెరికా తీర ప్రాంతంవైపు ఉష్ణోగ్రతలు అధికంగావుంటే గాలిలో తేమ శాతం పెరిగి ఎల్ నినో ఏర్పడి రుతుపవనాలు బలహీనపడతాయి. వర్షాలు లేక కరువుకాటకాలు విజృంభిస్తాయి. ఆ ఉష్ణోగ్రతలు తక్కువుంటే లానినా ఏర్పడి కుంభవృష్టికి దారితీసి వరదల బెడదవుంటుంది. ప్రస్తు తానికి అక్కడ తటస్థ పరిస్థితులున్నాయంటున్నారు.
ఒక్కోసారి మన హిందూ మహాసముద్రంపై ఆవరించివుండే మేఘాల స్థితిగతులు, ఆ వాతావరణంలోవుండే గాలి తుంపరలు, మనకుండే అటవీ సాంద్రత వంటివి ఎల్ నినోను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంవల్లనే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినా ఒక్కోసారి మన రుతుపవనాలు సజావుగా వచ్చివెళ్తాయి. అందుకే ఎల్ నినో గురించి పట్టించుకోవటం, రుతుపవనాలను ముందుగా అంచనా వేయటం అశాస్త్రీయం అంటారు కొందరు శాస్త్రవేత్తలు. ఎల్ నినోను నియంత్రించే ఇతరేతర పరిస్థితులు అనేకం ఉన్నప్పుడు దాని ఆధారంగా వర్షాల గురించి అంచనా వేయటం వృధా ప్రయాస అని వారి భావన.
వర్షరుతువులో ఏటా వర్షపాత సగటు(ఎల్‌పీఏ) ఎంతవుంటున్నదో లెక్కేయటం ఐఎండీ పని. ఆ సగటు దీర్ఘకాలంలో ఎంతవుందో గణించి, దానికన్నా ఎంత ఎక్కువగా లేదా ఎంత తక్కువగా వర్షాలు పడే అవకాశం వుందో తెలియజేస్తారు. ఎల్‌పీఏను 87 సెంటీమీటర్ల వర్షపాతంగా గణించి, ఈసారి వర్షాలు దీన్నిమించి 105 శాతంవరకూ ఉండొచ్చని అంచనా కట్టారు. నిరుడు మొదట్లో 106 శాతం అధిక వర్షపాతం అంచనా వేయగా, అది 108 శాతం వరకూ పోయింది. ఎల్‌పీఏ 96 శాతంకన్నా తక్కువుంటే సాధారణంకన్నా తక్కువ వర్షపాతంగా లెక్కేస్తారు. 96–104 మధ్యవుంటే సాధా రణ వర్షపాతంగా, 104–110 శాతం మధ్యవుంటే అధిక వర్షపాతంగా పరిగణిస్తారు.
ఐఎండీ 105 శాతంవరకూ ఉండొచ్చని అంచనా వేయగా, స్కైమెట్ మాత్రం 103 శాతానికి పరిమితమైంది. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతంవరకూ వర్షాధారమే. కనుక వర్షాలు సమృద్ధిగా పడితేనే మన సాగురంగం బాగుంటుంది. అందరికీ పనులు దొరికి సుఖసంతోషాలతో వుంటారు. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వర్షపాతం అంచనాలు సక్రమంగావుంటే ఎక్కడ ఎలాంటిపంటలు వేసుకోవచ్చునో, వేటికి అననుకూలతలు ఏర్పడవచ్చునో తెలుస్తుంది.
రైతులు నష్టపో కూడదంటే ఇలాంటి అంచనాలు ఎంతో అవసరం. కానీ నిర్దుష్టంగా అంచనాలు చెప్పటం అన్ని వేళలా సాధ్యపడకపోవచ్చు. గతంతో పోలిస్తే వాతావరణ విభాగం అంచనాలు మెరుగ్గా ఉంటు న్నాయి. ఆ రంగంలో పెరిగిన సాంకేతికతలే అందుకు కారణం.వర్షాలు సాధారణంకన్నా ఎక్కువుంటాయని వేసిన అంచనాలు చూసి మురిసిపోలేం. ఎందుకంటే కురిసిన వర్షాన్నంతటినీ ఒడిసిపట్టి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చుకునే మౌలిక సదుపాయాలు మనదగ్గరుండాలి. తొలకరినాటికల్లా సాగుపనుల కోసం రైతులకు డబ్బు అందు బాటులో వుండాలి. సకాలంలో నాట్లు పడకపోతే పైరు ఎదుగుదల బాగుండదు.
భిన్న దశల్లో ఎరువులూ, పురుగుమందులూ దొరకాలి. అన్నిటికన్నా ముందు విత్తనాల లభ్యత సక్రమంగావుండాలి. కల్తీ విత్తనాల బెడద నిరోధించాలి. వీటికోసం ఎలాంటి ముందస్తు చర్యలు అమలు కావాలో, రైతులకు బ్యాంకుల నుంచి రుణసదుపాయాలెలా కల్పించాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. రుతుపవనాలు సక్రమంగా ఉండబోతున్నాయని ఐఎండీ ప్రకటించింది కనుక ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికలు రూపుదిద్దుకోవాలి.