Editorial.
-
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్‌లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్‌లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్‌తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్‌కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్‌లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
న్యాయాన్యాయాలు
న్యాయం చేయటమే కాదు... చేసినట్టు కూడా కనబడాలంటారు. శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరిస్తూ లోక్‌సభ మూజువాణీ ఓటుతో తీర్మానం ఆమోదించిన తీరు ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించింది. మొయిత్రాపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటి, వాటి తీవ్రత ఎంత... ఎథిక్స్ కమిటీ ఆ ఆరోపణలను పరిశీలించవచ్చునా లేదా వంటి సందేహాల వరకూ పోనవసరం లేదు. అసలు బహిష్కరణకు గురయ్యే సభ్యులు ఆ నిర్ణయంపై సభలో తమ స్వరం వినిపించటానికి అవకాశం ఇవ్వకపోవటం సబబేనా? మొన్న 4న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 22వ తేదీ వరకూ సాగుతాయి. నివేదికపై శుక్రవారం అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ విపక్షం వాకౌట్‌చేసింది. ఎథిక్స్ కమిటీలో మొయిత్రాకు అవకాశమిచ్చామని, కానీ అడిగిన వాటికి జవాబులివ్వకుండా ఆమె దూషణలకు దిగారని కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్ సోంకార్, కమిటీలోని బీజేపీ సభ్యులు ఇప్పటికే ఆరోపించారు. ఫిర్యాదుకు సంబంధంలేని ప్రశ్నలతో వేధించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆ ప్రశ్నలున్నాయని మొయిత్రా కూడా ప్రత్యారోపణ చేశారు. ఒకవేళ మొయిత్రా చేసిన ఆరోపణలన్నీ అబద్ధమే అనుకున్నా... అంతమాత్రాన సభలో తన వాదన వినిపించేందుకు ఆమె అనర్హురాలవుతారా? చట్టసభల్లో జరిగే చర్చలు, వాటి ప్రత్యక్ష ప్రసారాలు పాలక, విపక్ష సభ్యుల్లో ఎవరు ఎవరికంటే బాగా మాట్లాడుతున్నారో నిర్ణయించటానికి కాదు. తాము ఎన్నుకున్న సభ్యులు చర్చిస్తున్నదేమిటో, తీసుకుంటున్న నిర్ణయాలేమిటో, వాటిలోని మంచిచెడ్డలేమిటో తెలుసుకోవటం కోసం. మొయిత్రా కావొచ్చు...మరొకరు కావొచ్చు – చర్చ సందర్భంగా అప్రామాణికంగా లేదా అసంబద్ధంగా మాట్లాడితే వారి వాదనలోని డొల్లతనాన్ని ప్రజలే గ్రహిస్తారు. అది పాలకపక్షానికే మంచిది. సభలో అధికారపక్షానికి కావలసినంత మెజారిటీ వుంది. కనుక మొయిత్రాకు అవకాశమిచ్చినంత మాత్రాన కలిగే నష్టం ఏమీ లేదు. అసలు ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశ ప్రారంభం రోజైన ఈనెల 4నే ప్రవేశపెట్టాలి. కానీ పాలక పక్షం శుక్రవారానికి వాయిదా వేసింది. అయినా ఈ వ్యవహారం ఇలా ముగియటం మన పార్లమెంటరీ వ్యవస్థ లోపాన్ని తెలియజెబుతోంది. నివేదికను కమిటీలోని ఆరుగురు అంగీకరించగా, నలుగురు దాన్ని వ్యతిరేకించారు. ఎథిక్స్ కమిటీ నిర్ణయం సబబే కావొచ్చు... అది మెజారిటీ ప్రకారమే తీసుకుని వుండొచ్చు. కానీ సభలో మొయిత్రాకు అవకాశమీయటంవల్ల ఎంపీగా ఆమె ప్రవర్తనలోని గుణదోషాలను పౌరులు తెలుసుకునే అవకాశం వుంటుంది కదా! దాన్ని నిరాకరించటం ఏం సబబు? మొయిత్రాపై వున్న ఆరోపణల పూర్వాపరాలు పరిశీలిస్తే పార్లమెంటు సభ్యురాలిగా ఆమె తన పరిమితులు అతిక్రమించారా అన్న సందేహాలు కలుగుతాయి. సభలో వేయదల్చుకున్న ప్రశ్నలను సభ్యులు ఎక్కడి నుంచి అయినా ఎన్ఐసీలో లాగిన్ అయి, నేరుగా స్పీకర్‌కు చేరే విధంగా పోస్ట్ చేయొచ్చు. ఆ ప్రశ్నల అర్హతను స్పీకర్ నిర్ణయించాక అవి సంబంధిత మంత్రిత్వ శాఖలకు వెళ్తాయి. అనర్హ ప్రశ్నలను తొలగిస్తారు. ఇదంతా ఆమె నేరుగా చేసివుంటే ఇంత రచ్చయ్యేందుకు ఆస్కారం వుండేది కాదు. తన స్నేహితుడైన దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్, పాస్వర్డ్ అందజేసి అందులో ప్రశ్నలు పోస్ట్ చేయించమని చెప్పారు. తన నియోజకవర్గ పనుల్లో తీరిక లేకుండా వున్నందున ఇలా చేయించానని మొయిత్రా సంజాయిషీ. మామూలుగా ఇది సబబు అనిపించదు. కానీ 800మంది ఎంపీల్లో అత్యధికులు ఇలాగే చేస్తున్నారని, ప్రతిదీ వారే చేయాలంటే అసాధ్యమని ఆమె చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక నిబంధనేదీ లేదంటున్నారు. ఒకరిద్దరు సభ్యులు సైతం తామూ అలాగే చేస్తున్నామని చెప్పారు. ఎథిక్స్ కమిటీ మాత్రం ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చే చర్య అంటున్నది. పైగా లంచం తీసుకుని అదానీ సంస్థ లపై ఆమె ఈ ప్రశ్నలు వేశారని బీజేపీ సభ్యుల ఆరోపణ. ఈ సందర్భంగా 2005లో ఆన్లైన్ పోర్టల్ ‘కోబ్రా పోస్ట్’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ గురించి ప్రస్తావించుకోవాలి. 11మంది ఎంపీలు ప్రశ్నలు అడిగేందుకు తాము ఇవ్వజూపిన డబ్బు తీసుకున్నారని ఆ పోర్టల్ తేల్చింది. వీరిలో బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ, బీఎస్పీలకు చెందినవారున్నారు. ఇందులో 10 మంది లోక్‌సభ సభ్యులు, మరొకరు రాజ్యసభకు చెందినవారు. ఇదంతా ఒక చానెల్లో ప్రసారమైంది. ఆ ఎంపీలను సభ నుంచి బహిష్కరిస్తున్న సందర్భంలో మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ ఇందులో అవినీతికన్నా ఎంపీల బుద్ధిహీనత వెల్లడవుతోందన్నారు. అందుకు బహిష్కరణ శిక్ష విధించటం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మొయిత్రా విషయంలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? అసలు మొయిత్రాపై వచ్చిన ఆరోపణలకు విడిపోయిన ఆమె సహచరుడు జైఅనంత్ దేహద్రాయ్ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు రాసిన లేఖ ప్రాతిపదిక. మొయిత్రా, దేహద్రాయ్‌లకు బోలెడు తగువులున్నాయి. పెంపుడు కుక్క విషయం మొదలుకొని ఎన్నిటిపైనో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అందువల్ల ఆ లేఖకు ఎంతవరకూ ప్రాధాన్యమీయవచ్చో ఆలోచిస్తే బాగుండేది. అలాగే ప్రభుత్వంపై మొయిత్రా తరచు నిశిత విమర్శలు చేస్తుంటారు గనుక, ఆ కారణంతోనే చర్య తీసుకున్నారన్న అపప్రద రాకుండా చూసుకోవాల్సింది. అసలు ఆమెకు సభలో మాట్లాడే అవకాశ మిస్తే ఆదరాబాదరాగా చేశారన్న నిందకు అవకాశం వుండేదే కాదు. – డా‘‘ గుబ్బల రాంబాబు, రాజమహేంద్రవరం (డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం) -
అమెరికా చదువు సంస్కృతులు
అమెరికా విద్యారంగంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, రాజకీయులు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు పాఠశాలల నిర్వహణ అద్భుతంగా ఉండేది. యువ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చనువుగా ప్రవర్తించే వారు. పిల్లల విషయాలను చర్చించడానికి ఒక రోజయినా వారితో గడిపేవారు. నేటి విద్యార్థులు, యువత అతి తక్కువ సమయంలో ఊహించని, తీవ్రమయిన మార్పులకు గురవుతున్నారు. యుక్త వయసులోకి ప్రవేశిస్తున్న వీరు జ్ఞానాన్ని గ్రహించటానికి పెనుగు లాడుతున్నారు. పాఠశాలలకూ సమస్యలున్నాయి. విపరీతంగా సాగదీయ బడిన ప్రతిష్ఠాత్మక పునర్నిర్మాణ పథకం, ఆశించిన స్థాయిని అందు కోలేని దూరవిద్య, కరోన మహమ్మారి కాలపు అలవాట్ల నుండి బయటపడలేని దుఃస్థితి అందులో కొన్ని. విద్యాలయాల వద్ద మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు మరో తీవ్ర సమస్య. బాంబుల, తుపాకుల ఉపయోగ సంస్కృతి సకారాత్మక నిర్ణయా లకు అడ్డుతగులుతున్నాయి. మహమ్మారి కాలంలో కోల్పోయిన పాఠ్యాంశాలను విద్యా ర్థులు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. రెండేళ్లలో తప్పిన సాంఘికీకరణ, పరిపక్వతలను సంపాదిస్తున్నారు. సామాజిక అభివృద్ధిలో విద్యార్థులు రెండేళ్ళు వెనుకబడ్డారని మానసికశాస్త్ర ఉపాధ్యాయుల అభిప్రాయం. అందుకే బళ్ళలో అంతా బాగుందనేవాళ్ళ సంఖ్య తగ్గింది. విద్యారంగం పిచ్చివాళ్ళ, తీవ్రవాదుల హస్తాల్లో చిక్కుకుందని కొన్ని పత్రికలు ప్రచారం కూడా చేస్తున్నాయి. అమెరికాలో విడాకులు పెరిగాయి. పిల్లలకు ఇద్దరు తల్లిదండ్రుల పెంపక అవకాశం లేదు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరే పిల్లలను పెంచవలసి వస్తోంది. 25 శాతం పిల్లలు ఇలాంటి వారే. ఏ దేశంలోనూ ఈ స్థితి ఈ స్థాయిలో లేదు. ఈ చేదునిజం అమెరికాలో సింగిల్ పేరెంట్ సంరక్షణ శిశువులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనితో సమాజం నష్టపోతోంది. ఈ పిల్లలు ప్రవ ర్తనా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో వీరి సంఖ్య తక్కువ. వారిలో అవగాహన, బోధనాంశాలను అర్థం చేసుకోవడంలో తేడా ఉంటోంది. పిల్లల చదువు, భావిపౌరుల శ్రేయస్సుకు... అమెరికాలో పతనమయిన కుటుంబ, సామాజిక సంబంధాలను మెరుగుపర్చడమే మార్గం. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
వైద్యంలో వీరుడు
అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడిగా పేరొందిన డాక్టర్ సోహన్ సింగ్ అచ్చమైన తెలుగువాడు. గదర్ వీరుడు సోహన్ సింగ్ జోషీ స్ఫూర్తితో ఆయనకు ఆ పేరు పెట్టారు. దానికి తగ్గట్టుగానే, రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగానూ ఉచిత హోమియో ప్రజా వైద్య శిబిరాలు నెలకొల్పుతూ, మందులు అందిస్తూ తాను చనిపోయేదాకా విశిష్ట సేవలు అందించారు సోహన్ సింగ్. వైద్యంలో వీరుడిగా నిలిచారు. అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడు, హోమియోలో కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సోహన్ సింగ్ వైద్య వృత్తిలోనూ ‘గదర్’ వీరుల వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న సామాజిక కార్యకర్త. నరనరాన ప్రజా సేవలోనే తరించుతూ ఈ నెల 24న తన 76వ ఏట కన్నుమూశారు. అభ్యుదయ కవి పండితులు, పాత్రికేయ కురువృద్ధు తాపీ ధర్మారావు మనవరాలు విమలను సోహన్ సింగ్ పెళ్లాడారు. ఈమె ‘విశాలాంధ్ర’ దినపత్రిక సంపా దకునిగా పనిచేసిన తాపీ మోహనరావు కుమార్తె. మా తరం అంతా తాపీ మోహనరావు ఆధ్వర్యంలో పాత్రికేయ వృత్తి మెలకువలు దిద్దుకున్న వాళ్లమే. ఒక తెలుగువాడికి ‘సోహన్ సింగ్’ అని పేరు పెట్టడానికి కారణం, ‘గదర్ పార్టీ’ వీరులలో ఒకరైన ‘సోహన్ సింగ్ జోషీ’. దరిశి చెంచయ్య స్థాపించిన ఈ పార్టీ తెలుగునాట విప్లవోద్యమ బీజాలు నాటిందని మరచిపోరాదు. ఇంతటి పూర్వ చరిత్ర స్ఫూర్తితో ఎదుగుతూ, రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగానూ ఉచిత హోమియో ప్రజా వైద్య శిబిరాలు నెలకొల్పుతూ, మందులు అందిస్తూ తాను చనిపోయేదాకా విశిష్ట సేవలు అందించారు సోహన్ సింగ్. ఈ ఆచరణలో భాగంగానే ‘ధర్మకిరణ్ హోమియో రీసెర్చి ఫౌండేషన్’ను, అదే పేరిట హోమియో వైద్యశాలను, ఆదర్శ హోమియో ఫార్మసీ, కళాశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి హోమియో రీసెర్చి కేంద్రం ఏర్పా టుకు తన చొరవతో పథకం రచించగా దాన్ని కేంద్రం గుర్తించింది. పెక్కు శారీరక రుగ్మతలకు శాశ్వత పరిష్కా రాలు చూపిన ఘనాపాఠి సోహన్ సింగ్. ఎన్నో కుటుంబాలకు, స్కూళ్లకు 1999 నుంచి 2022 దాకా హోమియో మందుల ‘కిట్స్’ను అందించుతూ వచ్చారు. వైద్య సదుపాయాలు అందక పెక్కు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించారు. పెక్కు దేశీయ, రాష్ట్రీయ కేంద్రా లలోని వైద్య శాఖల సమన్వయ కర్తగా అమూల్యమైన సేవలందించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ హోమియో మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు దాదాపు 26 సంవత్సరాలుగా సలహాదారుగా ఉన్నారు. హోమియో రీసెర్చి ఫౌండేషన్ ఫార్మా యూనిట్ ఆధ్వర్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే మందుల స్థానే దేశీయ నాణ్యమైన హోమియో మందుల ఉత్పత్తికి కృషి చేశారు. దేశీయ వృక్ష జాతుల నుంచి లభించే ముడి సరుకు ఆధారంగా హోమియో టించర్లను, టిష్యూ సాల్ట్స్‌ను ఉత్పత్తి చేయించారు. ‘‘సోహన్ సింగ్ కర్మయోగి, పని.. పని.. పని... తప్ప మరో ధ్యేయం, యావ లేని వైద్యుడు. కొందరు రోజుకు 24 గంటలేనా అని బాధపడతారు, కొందరు జీవితాలకు లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. అతి కొద్దిమంది మాత్రమే నెలలకు, సంవత్సరాలకూ కూడా లక్ష్యాలు పెట్టుకుంటారు. ఒకటి పూర్తవగానే ఇంకొకటి, అలా లక్ష్యాలను వెంటాడుతూనే ఉంటారు. పనే ప్రాణం, లేకపోతే వారికి ఊపిరాడదు! ఆ లక్ష్యాల నుండి ఎడబాటుండదు, తడబాటుండదు. వారికి వయస్సు విరోధి కాదు, రోగాలను గురించి తలచుకునే సమయం ఉండదు. వారెవరో కాదు, మన సోహన్ సింగ్. భారత హోమియోపతి వైద్యంలో సోహన్ సింగ్ చూడని లోతులూ లేవు, ఎక్కని ఎత్తులూ లేవు... తెల్లవారు జామున సుదూర ప్రయాణాలు చేసి ఆయన ఇచ్చే తెల్లపంచదార మాత్రల కోసం జనాలు చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆయన ఇచ్చే మందులు తన వ్యవసాయ క్షేత్రంలో పెంచిన మూలికల నుంచే తీసుకుని తన సొంత ఫార్మసీలోనే తయారు చేసుకుంటారు. అత్యుత్తమమైన వైద్య సేవలు అందించిన సోహన్ సింగ్ వైద్యనారాయణుడు, వైద్యులందరికీ ఆదర్శనీయులు’’ అని డాక్టర్ చెరుకూరి బాలచంద్రమోహన్, సతీమణి డాక్టర్ సత్యవతీ దేవిల అభిభాషణ. ‘ధర్మకిరణ్ హోమియో పరిశోధనా సంస్థ’ అధ్యక్షురాలు పి. నీలిమా సతీష్ మాటల్లో చెప్పాలంటే, ‘‘చెట్లను, మొక్కల్ని కాపాడుకోగల్గితే, అవి తిరిగి మనల్ని రక్షించి, పక్కవాటు రోగాలు రాకుండా కాపాడతాయి.’’ ఆరోగ్య ప్రదాయినిగా మన దేశంలో హోమియో వైద్య విధానాన్ని పెంచి పోషించి, ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యానికి అనితర సాధ్యంగా దోహదకారి అయి, మనందరి ఆరోగ్య భావి భాగ్యోదయాల్ని కాంక్షిస్తూ శాశ్వతంగా సెలవు తీసుకున్న ప్రజా వైద్యుడు సోహన్ సింగ్‌కు ఇదే నివాళి! abkprasad2006@yahoo.co.in (సుప్రసిద్ధ హోమియో వైద్యుడు డాక్టర్ సోహన్ సింగ్ సెప్టెంబర్ 24న మరణించారు.) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్‌లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్‌లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్‌కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
బంగ్లాదేశ్‌లో ఎవరి ప్రయోజనాలేంటి?
బంగ్లాదేశ్‌ను అస్థిరంగా ఉంచాలని అమెరికా చూస్తుంది. ఈ పరిస్థితి తన తూర్పు రాష్ట్రాల్లోకి లక్షలాది మంది వలసలకు కారణం అవుతుంది కాబట్టి దాన్ని భారత్ నిరోధించడానికి ప్రయత్నిస్తుంది. చైనాకు సంబంధించినంతవరకూ, ఢిల్లీ హసీనాను ఒత్తిడి చేస్తుంది. కానీ ఆమె అధికారాన్ని నిలుపు కోవడంలో సహాయపడుతుంది. మరోవైపు, హసీనా వరుసగా నాలుగోసారి గెలుపొందే విషయం పట్ల అమెరికా ఉత్సాహంగా లేదు. బలమైన దేశీయ మద్దతు ఉన్న నాయకులు అమెరికా ఆదేశాలను తిప్పికొట్టడం దానికి కారణం. అమెరికాలాగా భారత్ కూడా, చైనా వ్యతిరేక శిబిరంలో బంగ్లాదేశ్ ఉండాలని కోరుకుంటోంది. అయితే బంగాళాఖాతంలో స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అమెరికాతో ఢిల్లీ ఎంత దూరం వెళ్తుందనేది అనిశ్చితం. 1975లో తమ వ్యవస్థాపక అధ్యక్షుడు షేఖ్ ముజీబుర్ రహమాన్ హత్య వెనుక అమెరికా హస్తం ఉందని బంగ్లాదేశ్‌లోని చాలామంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ముజీబుర్ రహమాన్‌ను పడగొట్టిన సైనిక తిరుగుబాటులో వాషింగ్టన్ పాత్ర పోషించిందా లేదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఈ దక్షిణాసియా దేశ తొలి సైనిక పాలకుడు జనరల్ జియావుర్ రహమాన్‌కు అమెరికా మద్దతునిచ్చింది. ఇప్పుడు, దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, హత్యకు గురైన అధ్యక్షుడి కుమార్తె, ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా, అమెరికా తనను పడగొట్టి తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని, జియావుర్ రహమాన్ వితంతువు అయిన ఖలీదా జియాను అధికారంలోకి తేవాలనుకుంటోందని ఆరోపిస్తున్నారు. ‘‘అమెరికన్లు నేను అధికారంలో కొనసాగాలను కోవడం లేదు,’’ అని ఆమె ఇటీవల ‘బీబీసీ’తో అన్నారు. ఇంకా దారు ణంగా, ఆమె ఏప్రిల్‌లో పార్లమెంటులో మాట్లాడుతూ, ‘‘ఎటువంటి ప్రజాస్వామ్య ఉనికిని కలిగి ఉండని ప్రభుత్వాన్ని ఇక్కడ తేవాలని అమెరికా భావిస్తోంది’’ అని ఆమె ఆరోపించారు. గత సంవత్సరం, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై వాషింగ్టన్, హసీనా ప్రభుత్వంలోని పలువురు అధికారులపై, భద్రతా దళాలపై ఆంక్షలు విధించింది. కానీ బంగ్లాదేశ్‌లో తమ అనుకూల సైనిక పాలనా కాలంలో, సరైన విచారణ లేకుండానే వందలాదిమంది తిరుగుబాటు సైనికులను ఉరితీసినప్పుడు మాత్రం ఇలాంటి చర్య లను అమెరికా చేపట్టలేదు. ఇటీవలే, రాబోయే జాతీయ ఎన్నికలను మలినపర్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటివారిని దేశంలో అడుగుపెట్టకుండా తిరస్కరిస్తానని అమెరికా బెదిరించింది. ఇలాంటి బెదిరింపులు బంగ్లాదేశ్‌లో కనీవినీ ఎరుగని రాజకీయ సుడిగుండాన్ని సృష్టించాయి. ఇది రాడికల్ ఇస్లామిక్ సంస్థలతో సహా అనేక శక్తులను నిద్రాణస్థితి నుండి బయటకు లాగి, దాదాపు 16.5 కోట్లమంది బెంగాలీలు గల దేశాన్ని కేవలం ఒక దశాబ్దం క్రితం కొత్త అఫ్గానిస్తాన్‌గా మార్చివేసింది. అయితే, చట్టవిరుద్ధమైన వ్యూహాలను ఉపయోగించినప్పటికీ, వాషింగ్టన్, ఢిల్లీ నుండి ఆమోదం పొందిన తర్వాత హసీనా వారిని దాదాపుగా అణచివేశారు. హసీనాపై అమెరికా ఆరోపిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల మూలాలు, తీవ్రవాద మతశక్తులపై ఆమె సాగించిన అణిచివేతలో దాగి ఉన్నాయి. వాస్త వానికి, ఆమె మరింత విస్తృతమైన వల వేశారు. అదేక్రమంలో తన రాజకీయ ప్రత్యర్థులను కూడా తుడిచిపెట్టారు. 1971 వరకు బంగ్లాదేశ్ భాగమై ఉన్న పాకిస్తాన్ లో సైనిక నియంతలకు మద్దతు ఇచ్చిన అమెరికా, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే పేరుతో హసీనాపై ఇప్పుడు లాఠీని ప్రయోగిస్తోంది. ఢాకాలో ఈ సిద్ధాంతం చెల్లుబాటవడం కష్టమే. వాషింగ్టన్ ప్రజాస్వామ్య చర్చ తమను మభ్యపెట్టడానికేననీ, దానిలో వారి సొంత ప్రయోజనాలు దాగి ఉన్నాయనీ బంగ్లాదేశీయులు భావిస్తున్నారు. నిజానికి, చైనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో హసీనాను తమవైపు తిప్పుకోవడమే అమెరికా అసలు లక్ష్యం. చైనా ప్రపంచ శక్తిగా ఎదగడం, మరింత ప్రభావం కోసం బీజింగ్ వ్యక్తపరుస్తున్న ఆకాంక్షను భగ్నం చేయడానికి అమెరికా యత్నిస్తోంది. బంగాళా ఖాతం సమీపంలో దాని స్థానం కారణంగా బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా మారింది. బంగాళాఖాతంలోని బంగ్లాదేశ్ ద్వీపంలో అమెరికా తమ నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఇద్దరు వామపక్ష పార్లమెంటు సభ్యులు ఇటీవల పేర్కొన్నారు. ఇటువంటి స్థావరం వల్ల ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలకు చైనా సముద్ర వాణిజ్య మార్గాన్ని అమెరికా సులభంగా నిరోధిస్తుంది. అది చైనా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే వాషింగ్టన్ కు అలాంటి ఆలోచనే లేదని ఢాకా లోని అమెరికా రాయబార కార్యాలయం నిర్ద్వంద్వంగా ఖండించింది. అమెరికాలాగా భారత్ కూడా, చైనా వ్యతిరేక శిబిరంలో బంగ్లా దేశ్ ఉండాలని కోరుకుంటోంది. అయితే వాషింగ్టన్ నిజంగానేబంగాళాఖాతంలో స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అమెరికాతో ఢిల్లీ ఎంత దూరం వెళ్తుందనేది అనిశ్చితం. దాని పెరట్లో అమెరికా సైనిక స్థావరం ఉండటం ఇష్టపడదు. హసీనా విషయానికి వస్తే, ఆమె భారత్, అమెరికాల ఒత్తిడికి తలొగ్గి, ‘పెద్దన్నలను’ తృప్తిపరచడానికి బీజింగ్‌కు సురక్షితమైన దూరంలో ఉండవచ్చు. బెంగాలీలు ఒక సమూహంగా ఏదైనా సైనిక కూటమిలో చేర డాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారత్ లేదా అమెరికా బంగ్లాదేశ్ వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి తగినంత డబ్బు ఇవ్వలేవు. ఈ పరిస్థి తుల్లో చైనా రక్షకుడిగా కనిపిస్తోంది. అత్యంత విభేదాలతో ఉండే బంగ్లాదేశీయులు అందరూ అంగీకరించే విషయం ఏదైనా ఉందంటే, అది ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే. కాబట్టి దేశాన్ని ఎవరు పాలించినా, చైనాతో బంగ్లాదేశ్ బలమైన బంధం కొనసాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో భారత ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా ఉంటాయి. భారతదేశ ప్రధాన లక్ష్యం దాని తూర్పు పార్శ్వంలో భద్రత. హసీనా దశాబ్దాలుగా దీనికి సహాయం చేశారు. బంగ్లాదేశ్ రాజకీయ దృశ్యంలో అన్ని పువ్వులు వికసించడాన్ని అమె రికా చూడాలనుకోవచ్చు. కానీ ఇస్లామిక్ రాడికల్స్ పట్ల భారత్‌కు కని కరం లేదు. ఖలీదా జియాపై న్యూఢిల్లీ అవిశ్వాసంతో వ్యవహరిస్తుంది. బంగ్లా దేశ్‌ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఢిల్లీ చేసిన ఫిర్యాదులను తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖలీదా జియా తోసిపుచ్చి భారత్‌కు ఆగ్రహం తెప్పించారు. బంగ్లాదేశ్‌ను అస్థిరంగా ఉంచాలని అమెరికా చూస్తుంది. అయితే ఈ పరిస్థితి తన తూర్పు రాష్ట్రాల్లోకి లక్షలాది మంది వలసలకు కారణం అవుతుంది కాబట్టి దాన్ని భారత్ నిరోధించడానికి ప్రయ త్నిస్తుంది. చైనాకు సంబంధించినంతవరకూ, ఢిల్లీ హసీనాను ఒత్తిడి చేస్తుంది. కానీ ఆమె అధికారాన్ని నిలుపుకోవడంలో సహాయపడు తుంది. మరోవైపు, ఈ ఏడాది ఎన్నికల్లో హసీనా వరుసగా నాలుగో సారి గెలుపొందే విషయం పట్ల అమెరికా ఉత్సాహంగా లేదు. బల మైన దేశీయ మద్దతు ఉన్న నాయకులు అమెరికా ఆదేశాలను తిప్పి కొట్టడం దానికి కారణం. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, హంగరీకి చెందిన విక్టర్ ఓర్బన్ దీనికి ఉదాహరణలు. కాబట్టి దాని వినాశ కరమైన హింసాత్మక పాలన–మార్పు సూత్రాన్ని వదిలి వేసి, బ్యాలెట్ బాక్స్ ద్వారా పాలన మార్పును తేవడానికి అమెరికా యత్నిస్తోంది. దీంతో బంగ్లాదేశ్‌కు సంబంధించినంత వరకూ భారత్‌తో అమె రికా విభేదిస్తోంది. భారత్ ప్రణాళికలు విజయవంతమైతే, బంగ్లా దేశ్‌లో మళ్లీ అంత స్నేహపూర్వకంగా లేని పరిస్థితిని అమెరికా ఎదు ర్కొంటుంది. బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పటినుంచి ఇది ఉనికిలో ఉన్నదే. విదేశీ ఒత్తిడికి తలొగ్గబోననీ, వాషింగ్టన్ పరోక్ష దూకుడుకు లొంగిపోననీ హసీనా ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తామనే వాక్చాతుర్యం కంటే నిశ్శబ్ద దౌత్యం, శిక్షకు సంబంధించిన ముప్పు హసీనాపై మెరుగ్గా పని చేస్తాయి. కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ బంగ్లా ప్రధాని మౌలికంగా అమెరికాకు వ్యతిరేకం కాకపోవచ్చు. వాస్తవానికి, ఆమె 2009లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముస్లిం ప్రపంచానికి ఢాకా నుండి ప్రసంగాన్ని అందించాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రహస్యంగా ఆహ్వానించ డానికి ప్రయత్నించారు. వ్యక్తిగత స్థాయిలో ఈ ఆసియా ఉక్కు మహిళ అమెరికాతో కుటుంబ సంబంధాలను కలిగి ఉన్నారు. ఆమె తన కోడలు అయిన అమెరికన్ మహిళను అరాధిస్తారు. ప్రతిపక్ష సభ్యుడు ఆమె మతాన్ని గురించి ప్రశ్నించినప్పుడు హసీనా పార్లమెంటులో తన కోడలిని బహిరంగంగా సమర్థించారు. బెంగాలీ సంస్కృతిలో, వ్యక్తి గత సంబంధాలు అధికారిక మర్యాదలను అధిగమిస్తాయి. బి.జెడ్. ఖస్రూ వ్యాసకర్త, పాత్రికేయుడు, యుద్ధ వ్యవహారాల నిపుణుడు (‘ద స్టేట్స్‌మన్’ సౌజన్యంతో) -
గండం గట్టెక్కిన అమెరికా
ఎట్టకేలకు ఒక పెను సంక్షోభం సమసిపోయింది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని మింగేసే మూడో ముప్పుగా ఆర్థిక నిపుణులు అభివర్ణించిన అమెరికా గరిష్ఠ రుణపరిమితి (డెబిట్ సీలింగ్) సంక్షోభంపై పాలక డెమాక్రాటిక్ పార్టీ, విపక్ష రిపబ్లికన్ పార్టీల మధ్య చివరి నిమిషంలో కుదిరిన అవగాహన పర్యవసానంగా కథ సుఖాంతమైంది. నిజానికి కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఊహించని రీతిలో వచ్చిపడ్డాయి. కానీ అమెరికా సంక్షోభం అలా కాదు. అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబు మాదిరి కొన్ని నెలలుగా ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ముడిపడి ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా, అగ్రరాజ్యంగా ఉన్న అమె రికా తన ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా క్రమశిక్షణతో నడపలేకపోవటమే ఈ సమస్యకు మూలం. తొలిసారి 1917లో గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు అమెరికన్ కాంగ్రెస్ అనుమతించగా, ఆ తర్వాత 1939లో, 1941లో రుణ సేకరణకు ప్రత్యేక చట్టాలు చేయాల్సివచ్చింది. ఇక అది రివాజుగా మారింది. ఆ తర్వాత 2011 వరకూ 78సార్లు గరిష్ఠ రుణ పరిమితికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయాల్సివచ్చింది. అమెరికా ప్రస్తుత గరిష్ఠ రుణ పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లు కాగా, దాన్ని మరింత పెంచేందుకు ప్రతినిధుల సభ, సెనేట్ తాజాగా అంగీకరించాయి. రుణ పరిమితిని పెంచే బదులు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవాలంటూ మొన్న ఏప్రిల్‌లో రిపబ్లికన్ పార్టీ పట్టు బట్టడంతో జో బైడెన్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. రిపబ్లికన్ల ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో బైడెన్ సర్కార్ ప్రతిపాదించిన బడ్జెట్‌కు 4.8 లక్షల కోట్ల మేర కోత పెట్టే తీర్మానం ఏప్రిల్ నెలాఖరున ఆమోదం పొందింది. ఆ కోత తీర్మానం ద్వారా హరిత ఇంధన రంగ పెట్టుబడులకు ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న పన్ను మినహాయింపులకూ, విద్యార్థుల రుణాల మాఫీకీ రిపబ్లికన్లు మోకాలడ్డారు. ఈ చర్య అమెరికా పౌరులపైనా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా తుపాకి గురిపెట్టడంతో సమానమని అమెరికా ఖజానా మంత్రి జానెట్ యెలెన్ మండిపడ్డారు. ఆ మాటెలావున్నా ప్రతి నిధుల సభ, సెనేట్ల ఆమోదం లభించకపోతే ఆపద్ధర్మంగా బైడెన్ 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తనకు లభించే విశేషాధికారాలతో ప్రత్యేక చర్య తీసుకునే వీలుంటుంది. కానీ అది సంక్షోభాన్ని తాత్కాలికంగా ఒకటి రెండు నెలలు వాయిదా వేయగలదే తప్ప నివారించలేదు. ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితిని పోగొట్టలేదు. అందుకే సమస్యకు పరిష్కారం సాధ్యమా కాదా అన్న సంశ యంలో ప్రపంచం పడిపోయింది. ఇరు పార్టీల మధ్యా ఒప్పందం కుదరకపోతే అమెరికా తన రుణాలను చెల్లించలేని స్థితిలో పడేది. టీచర్లు, పబ్లిక్ రంగ సంస్థల కార్మికులతో సహా లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు నిలిపేయాల్సివచ్చేది. పింఛన్లు, అనేకానేక సాంఘిక సంక్షేమ పథకాలు కూడా ఆపాల్సివచ్చేది. కేవలం తాను చెల్లించక తప్పని రుణాలకూ, వడ్డీ చెల్లింపులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సివచ్చేది. దాని సెక్యూరిటీలు పల్టీలు కొట్టేవి. సారాంశంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేది. ఒక అంచనా ప్రకారం స్వల్పకాల దివాలా అయినా కనీసం 5 లక్షల మంది ఉద్యోగులకు అది ముప్పుగా పరిణమించేది. మరింత కాలం కొనసాగితే అనేకానేక వ్యాపారాలూ మూతబడి 83 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యేవి. అంతేకాదు, అది కార్చిచ్చులా వ్యాపించి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేది. ఇరుపక్షాలూ పరిణతి ప్రదర్శించటం వల్ల ప్రస్తుతానికైతే అంతా సర్దుకుంది. కానీ మున్ముందు ఇదంతా పునరావృతం కాకమానదని గత చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యం అంచుల్లో ఉంది. కరోనా మహమ్మారి లక్షలాదిమంది ప్రాణా లను బలితీసుకోవటంతోపాటు మహా మహా ఆర్థిక వ్యవస్థలనే తలకిందులు చేసింది. దాన్నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు సాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ పొరుగునున్న చిన్న దేశం ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగారు. కొన్ని నెలల్లో సమసిపోతుందనుకున్న ఆ దురాక్రమణ యుద్ధం ఏణ్ణర్థం నుంచి ఎడతెగకుండా సాగుతోంది. ఇదే అదునుగా రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికా యూరోప్ దేశాలన్నిటినీ ఏకం చేసి ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగా అండదండలందిస్తోంది. అదే సమయంలో రష్యాపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. తమ సమస్త అవసరాలకూ రష్యాపై ఆధారపడక తప్పని యూరోప్ దేశాలు ఈ ఆంక్షల పర్యవసానంగా ఒడిదుడుకుల్లో పడ్డాయి. జర్మనీ ఆర్థిక మాంద్యంలో పడింది. ఈలోగా గోరుచుట్టుపై రోకటి పోటులా ఈ రుణ గరిష్ఠ పరిమితి సంక్షోభం వచ్చిపడింది. తన శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేస్తున్నవారికి రిపబ్లికన్లతో ఒప్పందం ద్వారా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి షాక్ ఇచ్చారు. రిపబ్లికన్లకు చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్తీ తన పార్టీలోని అత్యుత్సాహులను కట్టడి చేయగలిగారు. అయితే అమెరికా డాలర్‌తో, అక్కడి ఫైనాన్షియల్ మార్కెట్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ముడిపడివున్న సంగతిని ఆ దేశం మరువ కూడదు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు విశ్వసనీయత లేకపోవటంవల్ల తప్ప ఇందులో తన ప్రయోజకత్వం ఏమీ లేదని అది గుర్తించాలి. తాజా ఒప్పందం పర్యవసానంగా 2025 జనవరి వరకూ గండం గట్టెక్కినట్టే. ఆ తర్వాతైనా సమస్యలు తప్పవు. ఇప్పటికైనా అమెరికా సొంతింటిని చక్కదిద్దుకునే చర్యలు మొదలెట్టాలి. హద్దూ ఆపూలేని వ్యయానికీ, పన్నులకూ కళ్లెం వేసి హేతుబద్ధ విధానాలను రూపొందించుకోవాలి. -
‘మేడిన్ ఇండియా’ బంగా!
భారత్ మూలాలున్నవారు ప్రపంచ యవనికపై తళుక్కున మెరవటం ‘అలవాటైపోయిన’ వర్తమానంలో కూడా ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఇక్కడే పుట్టి పెరిగి పెద్ద చదువులు చదివిన అజయ్ బంగాను అమెరికా ప్రతిపాదించిందంటే అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారతీయ మూలాలున్నవారే. కుదిరితే రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న వివేక్ రామస్వామి సైతం ఇక్కడివారే. ఇక కోకా కోలా మొదలు అనేకానేక బహుళజాతి సంస్థలకు చాన్నాళ్లనుంచి భారతీయ సంతతికి చెందినవారు సారథ్యం వహించారు, వహిస్తున్నారు. మునుపటంత కాకపోయినా ఇప్పటికీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులనూ, వాటి తలరాతలనూ నిర్దేశించటంలో ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వర్ధమాన దేశానికి చెందిన ఒక వ్యక్తి అలాంటి సంస్థలకు నేతృత్వం వహించటమంటే సాధారణం కాదు. ఆ రెండు సంస్థలూ ఆవిర్భవించిన నాటినుంచీ వాటిపై వస్తున్న ప్రధాన విమర్శ– ఎప్పుడూ సంపన్న దేశాల నుంచీ, ప్రధానంగా అమెరికా నుంచీ మాత్రమే వాటి సారథులను ఎన్నుకుంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం తీవ్రంగా దెబ్బతిన్న అంత ర్జాతీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటం కోసం బ్రెటెన్‌వుడ్స్ సదస్సు జరగ్గా, అందులో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఉనికిలోకొచ్చాయి. ప్రపంచ బ్యాంకుకు ఆది నుంచీ అమెరికా పౌరులే అధ్యక్షులు. అలాగే ఐఎంఎఫ్ ఉపాధ్యక్ష పదవి కూడా ఆ దేశానిదే. ఐఎంఎఫ్ అధ్యక్ష పదవి మాత్రం యూరోపియన్ దేశాలకు చెందినవారిది. నిజానికి ఇప్పుడు అమెరికా ఎంపిక చేసిన బంగా ఇక్కడివారే అయినా, ప్రస్తుతం పూర్తి స్థాయి అమెరికా పౌరుడు. సుపరిపాలన... సంప్రదింపులు... పాలుపంచుకోవటం అనేవి ప్రపంచబ్యాంకు మూల సూత్రాలు. కానీ ఆ మూడింటిని రుణం కోసం వచ్చే వర్ధమాన దేశాధినేతలకు ప్రవచించటం తప్ప సంస్థ పాటించదన్న విమర్శ చాన్నాళ్లుగా ఉంది. అందులో 189 సభ్యదేశాలుంటాయి. సంపన్న దేశాలైన అమెరికా, యూరోప్ దేశాల పెట్టుబడులు అధికం గనుక, బ్యాంకులోని ప్రధాన భాగస్వామ్య ఆర్థిక సంస్థలన్నీ ఆ దేశాలకు సంబంధించినవే గనుక బ్యాంకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఆ దేశాలకే సొంతం. అయితే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న డిమాండ్ మొదటినుంచీ ఉంది. గతంలో అమెరికా నిర్ణయించినవారిలో కొందరికి ఆర్థికరంగ నేపథ్యమే లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ ఎజెండాలోకొచ్చిన వర్తమానంలో ప్రపంచ బ్యాంకు దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలనీ, రుణాలిచ్చే క్రమంలో అదొక షరతుగా ఉండాలనీ కొన్నేళ్లుగా ఉద్యమ కారులు కోరుతున్నారు. ఇంకా ఏడాది పదవీకాలం ఉండగానే రాబోయే జూన్‌లో పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న డేవిడ్ మల్పాస్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినీ. పర్యావరణంతో సహా ప్రపంచాన్ని వేధిస్తున్న కీలక అంశాల విషయంలో ట్రంప్ అభిప్రాయాలే ఆయనవి కూడా. నిరుడు సెప్టెంబర్‌లో ఒక సదస్సు సందర్భంగా శిలాజ ఇంధనాలవల్ల భూగోళానికి జరిగే ప్రమాదంపై ప్రశ్నించినప్పుడు ‘నేను శాస్త్రవేత్తను కాదు’ అని జవాబిచ్చి అందరి ఆగ్రహానికీ గురయ్యారు. నిజానికి అంతక్రితమే ప్రపంచ బ్యాంకుపై ఆర్థికరంగ నిపుణులకు ఆశలు పోయాయి. పేరులో తప్ప నిజంగా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే, దాన్ని నడిపించే లక్షణాలు బ్యాంకుకు సన్నగిల్లాయని వారి అభిప్రాయం. దాని నిబంధనలు, అదిచ్చే రుణాలకుండే షరతులు కఠినమైనవి. రుణ మంజూరులో అలవిమాలిన జాప్యం. ఇప్పుడు ధైర్యంగా సత్వర నిర్ణయాలు తీసుకునే కెనడాకు చెందిన సీడీపీక్యూ, ఎన్డీబీ(గతంలో బ్రిక్స్ బ్యాంక్), ఎన్ఐఐఎఫ్, అమెరికాకు చెందిన ఐడీఎఫ్సీ వంటివి రంగంలోకొచ్చాయి. అయితే ఫలానా ప్రాజెక్టుకు లేదా సంస్థకూ ప్రపంచ బ్యాంకు అప్పిచ్చిందంటే అది భారీ ప్రాజెక్టు, అన్నివిధాలా మేలైందని అభిప్రాయపడేవారు చాలామందే ఉంటారు. అయితే బంగాయే స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన నూరుశాతం ‘మేడిన్ ఇండియా’వాడు. ప్రపంచ మార్కెట్లను శాసించే అమెరికాకు చెందిన ‘వాల్ స్ట్రీట్’నుంచి నేరుగా వస్తున్నవాడు. ఈసారి మహిళను ప్రోత్సహించదల్చుకున్నామని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ప్రకటించిన కొన్ని గంటలకే బంగా ఎంపికను ప్రకటించటం అందరినీ ఒకింత ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అందుకు కారణం ఉంది. బ్యాంకు పేదరిక నిర్మూలన లక్ష్యం నుంచి పర్యావరణ పరిరక్షణ వైపు పోవటం బ్యాంకులోని వర్ధమాన దేశాలకు నచ్చటం లేదు. ఇందువల్ల తమ అభివృద్ధి ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడతాయన్నది వాటి అభిప్రాయం. భారత్‌కు చెందిన బంగా ఈ విషయంలో అందరినీ ఒప్పిస్తారనీ, ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణలో విజయం సాధిస్తారనీ అమెరికా విశ్వ సిస్తోంది. భారత్ మార్కెట్ ఆవిర్భవించి విస్తరిస్తున్న తొలి దశలో దాన్ని చాలా దగ్గరగా చూసిన అనుభవం బంగాకు ఉన్నదని ఆ దేశం భావన. దాదాపు దశాబ్దకాలం నుంచి మాస్టర్‌కార్డ్ సారథిగా ఆ సంస్థ విస్తరణలో, దాని రెవెన్యూ పెంపులో బంగా పాత్ర ప్రధానమైనది. అదీగాక 2021లో గ్లాస్గోలో జరిగిన కాప్–26 సదస్సు సందర్భంగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలనుద్దేశించి బహిరంగ లేఖ రాసిన డజను మంది సీఈఓల్లో ఆయనొకరు. ఇక పర్యావరణ పరిరక్షణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించదల్చుకున్న ప్రపంచ బ్యాంకుకు బంగాను మించిన అర్హుడు మరొకరుండరని అమెరికా భావించటంలో ఆశ్చర్యమేముంది? -
న్యాయం’పై నెతన్యాహూ కక్ష
అంతా అనుకున్నట్టే అయింది. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిసెంబర్లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు. ఆ వ్యవస్థలో సంస్కరణల పేరిట దాని అధికారాలు తెగ్గోసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని నెలలక్రితం నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్ పార్టీకి ఎగబడి ఓట్లేసిన జనమే ఇప్పుడు న్యాయవ్యవస్థ రక్షణ కోసం వీధుల్లోకొచ్చారు. పార్లమెంటు వెలుపల అయి దారు రోజులుగా ఎడతెగకుండా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ చట్టసభలో న్యాయసంస్కరణల బిల్లు ప్రాథమిక స్థాయిలో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 47 వచ్చాయి. నెతన్యాహూ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద కూటమి ప్రభుత్వం పార్లమెంటులోని 120 స్థానాల్లో 64 గెల్చుకుంది. రాగల నెలల్లో న్యాయ సంస్కరణల బిల్లు మరో రెండు దశలు దాటాలి గనుక ఇప్పటికిప్పుడే అంతా అయిపోయినట్టు కాదు. అయితే అధికార కూటమి వరస చూస్తుంటే ఏదేమైనా చట్టం చేసితీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. ప్రచార సమయంలోనే నెతన్యాహూ తాము అధికారంలోకొస్తే న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించారు. దేశ శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తుంటే సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నదని, ఇందువల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోందని ఆయన భావన. అంతే కాదు... న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వా నిది పైచేయిగా ఉండాలన్నది ఆయన కోరిక. నెతన్యాహూ సుభాషితాల వెనకున్న అంతరార్థం వేరు. ఆ వ్యవస్థ తమకు సాగిలపడివుండాలన్నదే ఆయన మాటల్లోని సారాంశం. తాజా బిల్లు చట్టమైతే సుప్రీంకోర్టు కొట్టేసిన నిర్ణయాన్ని పార్లమెంటు తిరగదోడొచ్చు. కనీస మెజారిటీతో...అంటే పార్లమెంటులోని 120 మంది సభ్యుల్లో 61 మంది కాదంటే సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయొచ్చు. దేశ రాజ్యాంగంగా ఉండే మౌలిక చట్టంలోని అంశాలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టునుంచి తొలగించటం మరో ప్రతిపాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ వర్గానిదే పైచేయి కావడం మూడో ప్రతిపాదన. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సభ్యులుగా ఉండే నియామకాల కమి షన్ పనిచేస్తోంది. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటం ఆనవాయితీగా వస్తున్నా న్యాయవ్యవస్థ ప్రతినిధుల ఆధిక్యత ఉన్నందువల్ల చాలాసార్లు ఆ వ్యవస్థ నిర్ణయమే అంతిమంగా అమలవుతోంది. ఇప్పుడు చేసిన ప్రతిపాదన దాన్ని తారుమారు చేస్తుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న అతి ఛాందసవాద యూదు పార్టీలు తమ మతంలోని యువకులను నిర్బంధ సైనిక శిక్షణనుంచి తప్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆ చట్టం తీసుకొస్తే సమాన న్యాయం పేరిట సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న భయాందోళనలు ఆ పార్టీలకున్నాయి. అందుకే ఆ పార్టీలు గట్టిగా మద్దతునిస్తున్నాయి. మరో కీలకమైనది పాలస్తీనా సమస్య. పాలస్తీనా పౌరులను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా యూదుల్లో తమకు మద్దతు పెరుగుతుందని దాదాపు అన్ని పార్టీలూ భావిస్తాయి. యూదుల్లో జాతీయ భావాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం వాటికి అలవాటుగా మారింది. ఒకపక్క ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలన్న డిమాండ్ ప్రపంచ దేశాలన్నిటి నుంచీ వస్తుంటే ఆ ఆక్రమణలను మరింత పెంచుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పాలక పక్షాలు పని చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఈ ఆక్రమణలు చట్టవిరుద్ధమైనవి. అయినా అవి ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలెంలలో ఆక్రమిత భూభాగాల్లో దాదాపు ఏడున్నర లక్షలమంది ఇజ్రాయెల్ పౌరుల ఆవాసాలున్నాయి. వీటిని మరింత పెంచుకోవాలంటే సుప్రీంకోర్టు అడ్డంకిని తొలగించుకోవాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. న్యాయసంస్కరణల బిల్లుకు జనంలో పెద్దయెత్తున వ్యతిరేకత రావటం చూసి దేశాధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఈ బిల్లుపై విపక్షాలతో చర్చించాకే తదుపరి చర్యలుండాలని హితవు పలికారు. అయితే నెతన్యాహూకు ఇది రుచించలేదు. విపక్షాలతో చర్చలకు సిద్ధమే అయినా చట్టం తీసుకురావటం ఖాయమని న్యాయశాఖ మంత్రి చెప్పారంటేనే ప్రభుత్వ సంకల్పం ఏమిటో అర్ధమవుతోంది. ఇప్ప టికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహూ శిక్షపడే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ఈ బిల్లును తెచ్చారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణఇజ్రాయెల్కు నిర్దిష్టమైన రాజ్యాంగం లేదు. ఫెడరల్ వ్యవస్థ లేదు. దేశానికంతకూ ప్రాతినిధ్యంవహించే పార్లమెంటు నిర్ణయమే అంతిమం. ఇందువల్ల పార్లమెంటులో బలాబలాలే అన్నిటినీ నిర్ణయిస్తాయి. ఈ స్థితిలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలను సమీక్షించి సమతుల్యత సాధించే మరో వ్యవస్థ ఎంతో అవసరం. ఆ పాత్రను సుప్రీంకోర్టు సమర్థవంతంగా పోషిస్తోంది. దేశ జనాభా 90 లక్షలమందిలో అయిదోవంతుమంది అరబ్బులు. మరో 30 లక్షలమంది పాలస్తీనా పౌరులు వెస్ట్‌బ్యాంక్‌లో నివసిస్తున్నారు. వీరందరి ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని నిర్ణ యాలు చేయాల్సిన నేపథ్యంలో మెజారిటీవాదమే చెల్లుబాటు కావాలనుకోవటం ఆత్మహత్యాసదృశమవుతుంది. స్వప్రయోజనాల కోసం దేశాన్నే పణంగా పెట్టిన నేతగా చరిత్రలో నిలుస్తారో, జనాభి ప్రాయానికి తలొగ్గుతారో నెతన్యాహూ తేల్చుకోక తప్పదు. -
Covid Alert: మళ్ళీ ప్రమాదఘంటికలు
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా అని జనవ్యవహారం. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు సాచే ప్రమాదం కనిపిస్తోంది. నిన్నటి దాకా కఠిన నిబంధనలు, లాక్డౌన్లు, సామూహిక పరీక్షలతో జీరో–కోవిడ్ విధానాన్ని అనుసరించిన చైనా గత నెలలో జనా గ్రహంతో హఠాత్తుగా ఆంక్షలు సడలించేసరికి పరిస్థితి అతలాకుతలమైంది. కేసులు, మరణాలు ఒక్కసారిగా పెరిగి, ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఫార్మసీల్లో మందులు ఖాళీ. శవాల గుట్టలతో శ్మశా నాల్లో తీరిక లేని పని. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లోనూ కేసులు ఉన్నట్టుండి పెరుగుతుండ డంతో, భారత్ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ జరిపి, కొత్త వేరియంట్లపై కన్నేయాలని భారత సర్కార్ ఆదేశించడం సరైన చర్య. ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్షాసమావేశంతో అప్రమత్తత బావుంది. కాకపోతే, 80 కోట్ల చైనీయులకు కొత్తగా కరోనా సోకే ముప్పు, లక్షలాది మరణాల అంచనా, భారత్‌లో కరోనా చాటు రాజకీయాలే ఆందోళనకరం. కరోనా విషయంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితం కానంత వరకు, ఏ ఒక్కరూ సురక్షితం కానట్టే. ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా, ఇట్టే వ్యాపించే ఈ మహమ్మారితో ప్రతి ఒక్కరికీ ముప్పే. ఇది రెండేళ్ళుగా వైద్యనిపుణులు ఘోషిస్తున్న మాట. కానీ, చైనా మూర్ఖత్వం ఇవాళ మిగతా ప్రపంచానికి శాపమైంది. కరోనా నియంత్రణలో పాశ్చాత్య ప్రపంచం కన్నా తామే గొప్ప అని చైనా చెప్పుకుంటూ వచ్చింది. పొరుగున భారత్ సహా ప్రజాస్వామ్య ప్రపంచమంతా అనుసరిస్తున్న పద్ధతులకు భిన్నంగా లోపభూయిష్ఠ ‘జీరో–కోవిడ్’ విధానాన్ని చైనీయులపై బలవంతాన రుద్దింది. తొలినాళ్ళలో అది ఫలితమిచ్చినా, టీకాలతో, లాక్డౌన్లు ఎత్తేసి జీవనం సాగించడమే ప్రత్యామ్నా యమని ప్రజలకు వివరించడం నిరంకుశ సర్కారుకు కష్టమైపోయింది. తీరా ప్రత్యామ్నాయ వ్యూహం కానీ, క్రమంగా సాధారణ పరిస్థితి తేవడం కానీ చేయక ఒక్కసారిగా ఆంక్షల గేట్లు ఎత్తేయడం ఘోర తప్పిదమైంది. ఒక్క నెలలో 10 లక్షల పైగా కేసులు బయటపడ్డాయి. మూడేళ్ళ క్రితం ప్రపంచానికి కరోనాను అంటించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న చైనా నేటికీ ఆ మహమ్మారి నుంచి బయటకు రాలేకపోవడం విధి వైచిత్రి. ఈ దుఃస్థితికి స్వయంకృతాపరాధాలే కారణం. అతి జాతీయవాదంతో దేశీయంగా తయారైన టీకాలనే చైనా వాడడం, తీరా అవి సమర్థంగా పనిచేయకపోవడం, ఇప్పటికీ చైనా జనాభాలో అధిక శాతం మందికి టీకాకరణ జరగకపోవడం, వాస్తవాలను బయట పెట్టకపోవడం – ఇలా చైనా చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. మూడేళ్ళలో మూడు ప్రధాన కరోనా వేవ్‌లు చూసిన పొరుగు దేశం భారత్ ఈ విషయంలో మెరుగ్గా వ్యవహరించింది. శాస్త్రీయ శోధనకు ప్రభుత్వ సహకారం, దేశీయ టీకాల పనితనం, దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో టీకాకరణ, పలు విమర్శ లున్నా కోవాగ్జిన్‌ను ప్రోత్సహించడం కలిసొచ్చాయి. అయితే, మన దగ్గర కరోనా రాజకీయాలకూ కొదవ లేదు. తాజా కరోనా భయాన్ని సైతం అధికారపక్షమైన బీజేపీ రాజకీయాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ 100 రోజుల పైగా చేస్తున్న ‘భారత్ జోడో యాత్ర’కు బాణం గురి పెట్టింది. విమానయానాలు సహా దేశమంతటా కరోనా నిబంధనలపై మాట్లాడని కేంద్ర వైద్య మంత్రి తీరా త్వరలో దేశ రాజధానికి చేరనున్న ప్రతిపక్ష నేత పాదయాత్రకు కోవిడ్ ప్రోటోకాల్ సాకుతో లేఖ రాయడం చిత్రమే. ‘టీకాలు వేసుకున్నవారే రాహుల్‌తో యాత్ర చేయాలి, యాత్ర చేసినవారు ఐసొలేషన్‌లో ఉండా’లంటున్న పెద్దలు రాజస్థాన్, కర్ణాటకల్లో బీజేపీ యాత్రలను మాత్రం విస్మరించడమేమిటి? కేంద్రం కరోనా మార్గదర్శకాలివ్వాల్సింది యావత్ భారత్‌కే తప్ప ఒక్క భారత్ జోడో యాత్రకు కాదు. చైనాలో విస్తృతంగా వ్యాపిస్తూ, సంక్షోభం సృష్టిస్తున్న బీఎఫ్.7 కరోనా వేరియంట్ ఇప్పటికే గుజరాత్లో బయటపడింది. అలాగే, టీకా వేసుకున్నా ఈ ఒమిక్రాన్ ఉప వేరియంట్ సోకడం ఆగట్లేదట. ఈ మాటలు ఆందోళనకరమే. అయితే, 2021 మధ్యలో మన దేశంలో సంక్షోభం రేపిన డెల్టా వేరియంట్‌తో పోలిస్తే, ఈ ఏడాది మొదటి నుంచి మన దగ్గరున్న ఒమిక్రాన్ ఆ స్థాయి కల్లోలం రేపలేదు. ఆ మాటకొస్తే ఈ ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్.7 భారత్‌లో సెప్టెంబర్ నుంచే ఉందని కథనం. మనకు సహజ వ్యాధినిరోధకతా వచ్చింది. దేశంలో పెరిగిన కరోనా వైద్య వసతుల రీత్యా మనం మరీ బెంబేలెత్తాల్సిన పని లేదు. కానీ మాస్క్‌ధారణ, గుంపులకు దూరంగా ఉండడం, భౌతిక దూరం, చేతులకు శానిటైజర్ లాంటి ప్రాథమిక జాగ్రత్తలను మళ్ళీ ఆశ్రయించక తప్పదు. చైనా దెబ్బతో కొత్త వేరియంట్లు తలెత్తే ముప్పుంది. గతంలో చైనాలో కరోనా మొదలైనప్పుడు అలక్ష్యం చేసి, మనతో సహా ప్రపంచం పీకల మీదకు తెచ్చుకుంది. ప్రస్తుతానికి మన పరిస్థితి బాగున్నా రానున్న సెలవులు, పెరగనున్న పర్యటనలతో అప్రమత్తత కీలకం. కరోనా పరీక్షలు పెంచి, కొత్త వేరియంట్లపై కన్నేసి ఉంచాలి. కరోనా టెస్టింగ్, కేసుల ట్రేసింగ్, ట్రీటింగే ఇప్పటికీ మహా మంత్రం. దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరే బూస్టర్ డోస్ వేయించుకున్నందున ప్రభుత్వం ప్రజల్ని చైతన్యపరిచి, ప్రోత్సహించడం అవసరం. ఏమైనా, ఒక విషయం తప్పక గుర్తుంచు కోవాలి... కరోనా కథ ఇంకా కంచికి చేరలేదు. మన జాగ్రత్తే మనకు రక్ష. ప్రమాదఘంటికలు మోగుతున్న వేళ అవసరానికి మించి సంసిద్ధంగా ఉన్నా తప్పు లేదు కానీ... అత్యవసరమైనదాని కన్నా తక్కువ సిద్ధపడితేనే తిప్పలు – అది ప్రభుత్వానికైనా, ప్రజలకైనా! -
గ్రహణాలు వీడాలి!
దీపాలు లేని లోకాన్ని ఊహించగలమా? దీపాలే లేకుంటే రోజులో సగం చీకటిమయమయ్యేది; జీవితాల్లో సగం అంధకారబంధురమయ్యేది. నాగరకత ఇంకా నత్తనడకనే కొనసాగే లోకంలో అలముకున్న తిమిరాన్ని తరిమికొట్టేవి దీపాలే! నిప్పు రాజెయ్యడం నుంచి వివిధ తైలాలతో ప్రమిదలను నింపి దీపాలు వెలిగించడం వరకు సాగిన పరిణామ క్రమానికి సహస్రాబ్దాల కాలం పట్టింది. విద్యుద్దీపాలను కనుగొన్న తర్వాత నాగరకత విద్యుద్వేగాన్ని పుంజుకుంది. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అంటూ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోల్చారు మన పూర్వులు. పరంజ్యోతి అంటే పరబ్రహ్మమే! మనుషుల్లో అజ్ఞానం తొలగిపోవాలంటే, జ్ఞాన దీపాలను వెలిగించాల్సిందే! దీపావళి పండుగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నరకాసుర వధకు సంబంధించిన గాథ ప్రసిద్ధమైనది. రావణ వధా నంతరం రాముడు అయోధ్యకు చేరుకుని ఈరోజే పట్టాభిషిక్తుడయ్యాడనే గాథ ప్రచారంలో ఉంది. బలి చక్రవర్తిని వామనుడు ఇదేరోజు పాతాళానికి అణగదొక్కాడని పురాణాల్లో ఉంది. దీపావళి ముందురోజు చతుర్దశినాడు యమధర్మరాజును దీపాలు పెట్టి పూజించితే పితృదేవతలు నరక విముక్తులవుతారని, అందువల్లనే దీనికి ‘నరక చతుర్దశి’గా పేరు వచ్చిందని కూడా చెబుతారు. పితృదేవతలను నరక విముక్తులను చేసే పర్వదినంగానే దీపావళిని జరుపుకోవడం మొదలైందని సురవరం ప్రతాపరెడ్డి ‘హిందువుల పండగలు’లో అభిప్రాయపడ్డారు. ఆరుద్ర కూడా సురవరం అభిప్రాయాన్నే బలపరుస్తూ ‘వాస్తవానికి నరకాసురుడికి, దీపావళికి సంబంధం లేదు. బలి చక్రవర్తితో కొంత సంబంధం ఉంది’ అంటూ ‘వ్యాసపీఠం’లో ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను ఉటంకిస్తూ రాశారు. నరకాసుర వధ తదితర గాథలను తదనంతర కాలంలోనే దీపావళికి ఆపాదించుకున్నారని అనుకోవచ్చు. కథలూ గాథలూ ఎలా ఉన్నా, జనాలందరూ వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. దీపావళికి మన సంస్కృతిలోనే కాదు, దేశంలోని వివిధ భాషల సాహిత్యంలోనూ ఇతోధిక స్థానం ఉంది. దీపావళి ఆలంబనగా కొందరు హర్షాతిరేకాలను ప్రకటిస్తే, మరికొందరు నిరాశా నిర్వేదాలను పలికించారు. పురాణ ప్రబంధ సాహిత్యాల్లో దీపావళి వర్ణన పెద్దగా కనిపించదు గాని, ఆ తర్వాత వెలువడిన సాహిత్యంలో దీపావళి ప్రస్తావన కనిపిస్తుంది. ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి తొలికావ్యం ‘దీపావళి’. ‘లోన జ్వలియించు చున్న మహానలమున/ కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని/ శైశవమ్మాది ప్రేమ శ్మశానమైన/ జీవి కొకనాటి కేటి దీపావళి యిక’ అంటూ నిర్వేదాన్ని పలికిస్తారు. సరిగా అరవయ్యేళ్ల కిందట– 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు తిలక్ చైనాను నరకాసురుడితో పోలుస్తూ ‘మళ్లీ ఒక దీపావళి’ కవిత రాశారు. ‘మన ప్రధాని శ్రీకృష్ణుడు, ప్రజాశక్తి సత్యభామ/ దొంగచాటు బందిపోటు చైనాసురుడొరుగుతాడు/ మన పతాక హిమగిరిపై మళ్లీ ఆడుతుంది–/ మళ్లీ ఒక దీపావళి మళ్లీ ఒక దీపావళి’ని మనసారా ఆకాంక్షించారు. దాదాపు అదేకాలంలో మల్లవరపు జాన్ ‘కుమతులై దేశమును దురాక్రమణ జేయు/ ద్రోహచిత్తులు భీతిల్లి తొలగిపోవ/ ఢమ ఢమ యటంచు నశని పాతముల బోలి/ ధ్వని జనించె; దీపావళి దినముఖమున’ అంటూ దీపావళి విజయోత్సవ సంరంభాన్ని వర్ణించారు. హైదరాబాద్ విలీనమై తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు వానమామలై వరదాచార్యులు ‘దీనికె రాములు సెట్టి/ జీవితమును ముడిబెట్టి/ కడకు విశాలాంధ్ర గలుప/ కాస్త అయ్యెను పొట్టి... ఈ దీపావళి వెలుగున/ ఇరువురమును సోదరులుగ/ తెలిసికొంటి మెడద నెడద/ కలిపికొంటి మొకటైతిమి’ అంటూ ‘అపూర్వ దీపావళి’కి ఆహ్వానం పలికారు. ప్రపంచ దారుణాలకు మనసు చెదిరిన బైరాగి ‘పీడిత దరిద్ర శాపంతో/ క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి/ వెలిగిన ప్రళయ ప్రదీపావళి/ దీపావళి వచ్చిందండీ’ అంటూ ‘చీకటి నీడలు’లో నిష్ఠుర పోయాడు. అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండుగ దీపావళి. మన కవులలో కొందరు దీపావళిలో అమావాస్య చీకట్లనే చూస్తే, ఇంకొందరు ఆశల వెలుగులను తిలకించారు. వెలుగులు, చీకట్లను చూసిన కవులూ తమ సమకాలీన చారిత్రక పరిణామాలను నమోదు చేయడం విశేషం. ఈసారి దీపావళి గ్రహణాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. దీపావళి, సూర్యగ్రహణం ఒకేసారి రావడం చాలా అరుదు. ఇలాంటి పరిణామం ఇరవై ఏడేళ్ల కిందట ఒకసారి ఏర్పడింది. గ్రహణం శుభ సంకేతం కాదని చాలామంది నమ్ముతారు. అమవాస్య రోజు సూర్యగ్రహణం, పున్నమి రోజున చంద్రగ్రహణం ఏర్పడతాయి. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాల కిందటే కనుగొన్నారు. అయినా గ్రహణాల చుట్టూ అల్లుకున్న నమ్మ కాలు జనాల్లో ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి. ఖగోళ పరిణామాల వల్ల ఏర్పడే గ్రహణాల సంగతి అలా ఉంచితే, మనుషులు నిత్యం ఎదుర్కొనే గ్రహణాలు చాలానే ఉన్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడించి, అతలాకుతలం చేసిన ‘కరోనా’ గ్రహణం ఇప్పుడిప్పుడే వీడింది. అంతమాత్రాన సమాజానికి గ్రహణమోక్షం లభించిందని సంతోషించే పరిస్థితులు లేవు. ఆకలి బాధలు, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, కుల మత లింగ వివక్షలు, నేరాలు ఘోరాలు వంటి గ్రహ ణాలు సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ గ్రహణాలు వీడినప్పుడే మానవాళికి అసలైన దీపావళి! అంతవరకు ఆశల దీపాలను వెలిగించి ఉంచుదాం. -
స్వాతికిరణం సిండ్రోమ్
మజ్రూ సుల్తాన్‌పురి అప్పుడప్పుడే కవిత్వం రాసి పేరు సంపాదిస్తున్నాడు. సుల్తాన్‌పూర్‌లో ఇది కొందరికి కడుపులో గులామ్ బులామ్ రేపింది. ఆ ఊళ్లోనే ఉండే మసియుద్దీన్ మసీ అనే కవిని రెచ్చగొడితే అతను మజ్రూ వెంటబడ్డాడు. మజ్రూ ఏం రాసినా వెక్కిరిస్తూ రాసేవాడు. మజ్రూ బాగా క్షోభ పడ్డాడు. ఇబ్బంది పడ్డాడు. కొన్నాళ్లకు భవిష్యత్తును వెతుక్కుంటూ సుల్తాన్పూర్ నుంచి బాంబే వెళ్లాడు. సినీ గేయరచయిత అయ్యాడు. సూపర్ హిట్ పాటలు రాశాడు. సర్వోన్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నాడు. ఇవాళ్టికీ మనం రోజూ మజ్రూని వింటూనే ఉన్నాం. మరి మసియుద్దీన్ మసి సంగతి? మంట వెలిగినట్టు మసి వెలుగునా? మనం కూడా తక్కువ తిన్లేదు. మహా పండితుడు చిన్నయసూరి ఎంతో శ్రమించి, మేధను కరిగించి ‘బాల వ్యాకరణం’ రాస్తే, ఫస్ట్ ఎడిషన్ వచ్చి రికార్డు స్థాయిలో అమ్ముడు పోతుంటే శిష్టు కృష్ణమూర్తి అనే కవి దానిని ‘కాపీ’ అని గగ్గోలు లేవదీశాడు. (అబ్రాహ్మణుడైన) చిన్నయ సూరికి అంత సామర్థ్యం ఎక్కడ చచ్చింది అన్నాడు. ఆ కాలంలోని ఒకరిద్దరు గట్టి పండితులు ఈ విమర్శకు వత్తాసు పలికితే చిన్నయసూరి మౌనంగా ఉండిపోయాడు. సత్యాన్ని ఎంత అణుచుదామని చూసినా అది పొట్ట మీదే నేలక్కరుచుకుంటుంది తప్పితే వీపు మీద కాదు. తెలుగు భాషాకాశంలో భాస్కరుడు చిన్నయసూరి. గగ్గోలుదారులు ఆ మార్తాండ తేజానికి నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోయారు. పి.శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల సంచలనం. ఒక పరిణీత తప్ప దానిని మరొకరు రాయలేరని చదువరులు గ్రహిస్తారు. ‘అబ్బే... ఆ నవలను గోరా శాస్త్రి రాశాడండీ’ అని ఆయన అకౌంట్లో వేయడానికి చూసే పెద్దమనుషులు ఉన్నారు. గోరా శాస్త్రి తెచ్చిన ‘తెలుగు స్వతంత్ర’లోనే ఆరుద్ర ‘త్వమేవాహం’, ఆలూరి బైరాగి ‘నూతిలో గొంతుకలు’ వచ్చాయి. అయితే వాటిని గోరా శాస్త్రి రాయలేదట. ‘తెలుగు స్వతంత్ర’లోనే వచ్చిన పి.శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ మాత్రం గోరా శాస్త్రి రాశాడట. ఇంతా చేసి గోరా శాస్త్రి శబ్ద నాటికలు తప్ప ఒక్క గొప్ప నవలను అటెంప్ట్ చేయలేదు. ఆయనకు నవల రాసే ఆసక్తి ఉంటే రాసే చేయి ఊరకే ఉండేది కాదు. కళాకారుల లోకంలో కీర్తి అనే వెలుతురుతో పాటు కల్మషం అనే నీడ కూడా ఉంటుంది. సృజన లోకంలో రాణించాలనుకున్నవారు, రాణించేవారు, వెలిగినవారు, వెలగలేక ఆరిపోయిన, స్టేక్‌హోల్డర్స్ అయిన పాఠకులతో సహా ఈ వెలుగు నీడల ప్రభావానికి ఏదో ఒక సందర్భంలో గురి కాకుండా పోలేదు. శ్రీశ్రీని తగ్గించి శ్రీరంగం నారాయణబాబును నిలబెట్టాలని ఒక వర్గం ఎంత ప్రయత్నించినా శ్రీశ్రీయే మిగిలాడు. చలంను తెలుగు సరిహద్దుల నుంచి తరిమి కొట్టగలిగారుగానీ తెలుగు హృదయాల నుంచి కాదు. చిన్నబుచ్చేకొద్దీ జాషువా పద్యం ఎదిగి పండింది. అయినా సరే మనం గత పాఠాల నుంచి ఏమీ నేర్చుకోలేదు. ‘సాగర సంగమం’లో తన కళా వికాసానికి వీలు దొరకని కమలహాసన్ తన ఫెయిల్యూర్‌కి కుంగిపోతాడు. ఎవరినీ నిందించడు. కానీ ‘స్వాతికిరణం’లో మమ్ముట్టి అలా కాదు. ఆస్తిపాస్తి, పేరు, కీర్తి అన్నీ ఉన్నా తన సమ కళాకారులనే కాదు ఎక్కువ–తక్కువ ప్రతిభ ఉన్నవారిని చూసి కూడా ఓర్వలేకపోతాడు. అతడి ఈర్ష్య ఎంత తీవ్రమైనదంటే బంగారు భవిష్యత్తు ఉన్న ఒక బాలకళాకారుడు ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఎదుటివారి ప్రాణాలు తీసేంత, పిచ్చివాళ్లను చేసేంత, జడిసి సాధన విరమింపజేసుకునేంత, వగచి ఒంటరితనంలోకి వెళ్లేంత ఈర్షా్య ద్వేషాన్ని కలిగి ఉండటం నుంచి కళాలోకం– ఆ అసూయాపరుల సంఖ్య ఎంత తక్కువైనా కానీ– ఎదగలేక పోతున్నది. సోషల్ మీడియా వచ్చాక ఈ వెర్రి శ్రుతి మించిపోతోంది. నాలుగు వ్యూస్ కోసం ‘తేనెమనసులు రామ్మోహన్ని సూపర్‌స్టార్ కృష్ణ ఎలా తొక్కేశాడో తెలుసా?’ అనే థంబ్‌నెయిల్ పెడితే ‘అవునవును... మాకు తెలుసు’ అని డయపర్ల వయసు దాటని వారు కూడా కామెంట్లు పెడుతుంటారు. ఇద్దరూ ఒకే సినిమాతో బయలుదేరినా కృష్ణ పద్మాలయ చేరడానికీ, రామ్మోహన్ మాసిన గడ్డంతో రాక్ క్యాజిల్‌లో తారసపడటానికీ కారణం ఎవరికి వారే! మనమే మన గమ్యం. మన ఫలితం. విషాదం ఏమంటే ఈ ‘స్వాతికిరణం సిండ్రోమ్’ ఇప్పుడు అన్ని సామాజిక దొంతరల్లోనూ నిండి కనపడటం! గతంలో ‘నువ్వు బాగుపడితే చూడాలని ఉంది’ అని వీధిలో వాళ్లు కూడా అనేవారు. ఇప్పుడు ‘నువ్వెలా బాగుపడతావో చూస్తాను’ అని ఆత్మీయులే అనుకుంటున్నారు. ఏదో లాటరీ తగిలి రాత్రికి రాత్రి బాగుపడితే ఈర్ష్య పడటం సరే. కానీ కష్టపడి పిల్లాడు ర్యాంకు తెచ్చుకున్నా, అమ్మాయికి మంచి సంబంధం కుదిరినా, లోన్ పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నా, అప్పోసప్పో చేసి కారు ఇంటికి తెచ్చుకున్నా, మొగుడూ పెళ్లాలు కొట్లాడుకోకుండా ఉన్నా, పిల్లలు బుద్ధిగా మాట వింటూ ఉన్నా, ఆఖరికి మన ఇంట్లో మొక్కలు బాగా పెరుగుతూ ఉన్నా కుతకుతలాడిపోయేవారు, లోలోపల కీడు కోరుకునేవారు, బంధాలను అనుబంధాలను తెంపుకుపోయేవారు, చెడు ప్రచారానికి పూనుకునేవారు, చేతలతో కాకపోయినా మాటలతో హాని చేద్దాం అనుకునేవారు ఉంటే ఇది ఏమి సంస్కారం? ఇది ఏమి సమాజం? ఈర్ష్యతో ఒకరి చెడుకు చేసే ‘అసత్య వాదన మహాపాపం’ అన్నది వేదం. ‘గీబత్’ (చాడీలు), ‘తొహమత్’ (లేనివి కల్పించడం) చేసేవారికి నిష్కృతి లేదు అంది ఇస్లాం. ‘ఈర్ష్య పడువాని ఎముకలు కుళ్లును’ అన్నది బైబిల్. ప్రేమించేంత ఐశ్వర్యం లేనప్పుడు హాని చేయలేనంత పేదరికంలో ఉందాం! లోకం అదే బతుకుతుంది. -
దీపస్తంభాల వెలుగులో...
చీకటి తెరలు కరిగిపోయే వేళ, వెలుగు రేకలు ప్రసారమయ్యే క్రమంలో దృగ్గోచరాలపై ఒక స్పష్టత వస్తుంది. లోకం మీద, దాని నడవడి మీద అవగాహన కుదురుకుంటుంది. భారత రిపబ్లిక్ ‘అనే నేను’ పేరుతో ప్రజాపాలన ప్రారంభమై డెబ్బయ్ రెండేళ్లు గడిచింది. ఈ కాలంలో అధికారం చెలాయించిన నాయకుల చిత్తశుద్ధిలో తరతమ భేదాలున్నాయి. అయినప్పటికీ భారత రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం ప్రభావం ఫలితంగా కొందరు పాలకులు నిండు మనసుతో, మరికొందరు అర్ధమనస్కంగా సామాజిక పరివర్తన క్రమానికి లంగరెత్తక తప్పలేదు. ఫలితంగా ‘నిమ్న’ జాతి పొరల్ని చీల్చుకుంటూ సామాజిక నిచ్చెనమెట్లను ఒక్కొక్కటే ఎక్కుకుంటూ కొందరు అధోజగత్ సహోదరులు ‘సోషల్ డెమోక్రసీ’ అనే అంతస్థుకు చేరుకోగలిగారు. చదువు అనే చేదోడు లభించిన కారణంగా వారికీ అధిరోహణ సాధ్యమైంది. ఇరుగుపొరుగు పరిసరాలు వారికిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిచ్చెన కింది మెట్టు మీద నిలబడి ఉన్నప్పుడు విన్న కాకమ్మ కథల డొల్లతనం ఇప్పుడు వెల్లడవుతున్నది. అద్భుతాలుగా వినిపించిన స్వాములోర్ల ప్రతిమల కంటే, సర్దార్ల విగ్రహాల కంటే సమున్నతమైన శిఖర సమానమైన మూర్తిని మనోనేత్రంతో వాళ్లు చూడగలుగుతున్నారు. ఆ మూర్తి చూపుడువేలు ప్రబోధం వారికిప్పుడు సరైన రీతిలో అర్థమవుతున్నది. ఇన్నాళ్లూ మన నాయకులూ, బోధకులూ చెబుతున్నట్టుగా అంబేడ్కర్ కేవలం దళిత నాయకుడు కాదు. జాతీయ నాయకుడు. నేటి దేశావసరాలకు గాంధీ, నెహ్రూల కంటే అంబేడ్కర్ ఎక్కువగా సరితూగగలడని నిరూపణవుతున్నది. ఆయనను కేవలం రాజ్యాంగ రచయితగానే మన పాఠ్య పుస్తకాలు మనకు పరిచయం చేశాయి. కానీ, ఈనాటి సామాజిక, రాజకీయ సమస్యలను కూడా ఏడెనిమిది దశాబ్దాలకు పూర్వమే దర్శించి భాష్యం చెప్పిన మహోపాధ్యాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన పుట్టిన తేదీ ఏప్రిల్ 14. రోజురోజుకూ ఈ తేదీకి ప్రాధాన్యం పెరుగుతున్నది. భారతీయ సమాజం విద్యాప్రపూర్ణమవుతున్న కొలదీ, వివేకపూరితమవుతున్న కొలదీ ఈ తేదీ మరింత కాంతులీనబోతున్నది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏప్రిల్ 14వ తేదీతో ముడిపడిన మరో ఉత్తేజభరితమైన వృత్తాంతం కూడా ఉన్నది. ఉస్మానియా విద్యార్థి నాయకుడైన జార్జిరెడ్డిని పెత్తందారీ శక్తులు కుట్రపూరితంగా మట్టుపెట్టిన రోజది. అది జరిగి ఇప్పటికి యాభయ్యేళ్లయింది. జార్జిరెడ్డిని గురించి ఆనాటి పరిశీలకుల్లో రెండు రకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. జార్జిరెడ్డి ఇంకొంతకాలం జీవించి ఉంటే, రాజకీయాల జోలికి – గొడవల జోలికీ వెళ్లకుండా ఉండి ఉంటే ఈ దేశానికి ఐన్‌స్టీన్ వంటి ఒక గొప్ప శాస్త్రవేత్త లభించి ఉండేవాడని కొందరు అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో జార్జి గోల్డ్‌మెడలిస్ట్. పరిశోధక విద్యార్థి. జార్జి పరీక్ష పేపర్లు దిద్దడానికి ఉస్మానియా ప్రొఫెసర్లు తటపటాయిస్తే, వాటిని బొంబాయి యూనివర్సిటీకి పంపించారట. జార్జి సమాధానాలు చదివిన అక్కడి ప్రొఫెసర్ ఒక్కసారి ఈ యువ మేధావిని వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న కోరికతో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారట. జార్జిరెడ్డి బతికి వుంటే ఇండియాకు ఇంకో చేగువేరా లభించి ఉండేవాడని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. గ్రామీణ పేద రైతు కుటుంబాల నుంచీ, బీసీ, ఎస్సీ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ స్థాయికి అప్పుడప్పుడే చేరుకుంటున్న రోజులవి. పెత్తందారీ, సంపన్న వర్గాల పిల్లల్లో కొందరు గూండా తండాలను వెంటేసుకుని యూనివర్సిటీలో అరాచకం సృష్టిస్తున్న రోజులు. గ్రామీణ విద్యార్థుల్ని ర్యాగింగ్ చేయడం, అవమానించడం, వారిపై దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ దశలో యూనివర్సిటీలో ప్రవేశించిన జార్జి గ్రామీణ విద్యార్థులను సంఘటితం చేసి, వారికి అండగా నిలబడ్డాడు. వారికి తిరగబడడం నేర్పించాడు. జార్జి స్వయంగా బాక్సర్. ధైర్యశాలి. అతని ధాటికి గూండా గ్యాంగ్‌లు హడలిపోయేవి. ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందం’ పేరుతో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జార్జి విజయబావుటా ఎగరేశాడు. ఈ దశలోనే జార్జిరెడ్డి హత్య జరిగింది. విద్యార్థిలోకంపై ఈ హత్య తీవ్రమైన ప్రభావం చూపింది. అనంతర కాలంలో జార్జిరెడ్డి స్ఫూర్తితో వందలాదిమంది విద్యార్థులు విప్లవకారులుగా తయారయ్యారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత కథ అందరికీ తెలిసిందే. అణచివేతను, అవమానాలను స్వయంగా అనుభవించి కృషితో, సాహసంతో ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన ధీశాలి. భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించే వ్యక్తిగా ఆయన పేరును విస్మరించడానికి వీల్లేని దశకు ఆయన ఎదిగారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని దేశంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సామాజిక పరివర్తనకు దోహదపడే బాటలు వేశారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగున పడి దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతికి ఆయన రాజ్యాంగంలో చోటు కల్పించారు. భిన్న భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలతో కూడిన ఈ దేశాన్ని ఒక సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలదొక్కుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది రాజకీయ భావన మాత్రమే కాదు. సామాజిక భావన కూడా! ఆర్థిక భావన కూడా! అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల వెనుకబడిపోయిన విశాల ప్రజానీకం మిగిలిన వారితో పోటీపడగలిగే స్థాయికి చేరుకోవడానికి ప్రత్యేక అవకాశాలు కల్పించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ముఖ్యంగా రాజ్యాంగ పీఠిక ఈ దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అద్దంపడతాయి. పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వేచ్ఛ, అవకాశాల్లోఅందరికీ సమానత్వం, వ్యక్తిగత గౌరవాన్ని జాతి సమగ్రతను సంరక్షిస్తూ అందరి నడుమ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం రాజ్యాంగ లక్ష్యాలుగా పీఠికలో సంకల్పం చెప్పుకున్నారు. ఈ రాజ్యాంగ లక్ష్యాలను ఇప్పటికే సంపూర్ణంగా సాధించి ఉన్నట్లయితే సమాజంలో ఇంత విపరీతమైన వ్యత్యాసాలు ఉండేవి కావు. రాజ్యాంగం నిర్దేశించినట్లు అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించి ఉన్నట్లయితే జార్జిరెడ్డి వంటి యువకులు విప్లవ మార్గం వైపు మొగ్గు చూపేవారు కాదు. అంతరాలు లేని రాజ్యాన్ని సృష్టించాలని ఆ మార్గంలో వెళ్లిన వేలాదిమంది యువకులు ఆత్మబలిదానాలు చేశారే తప్ప గమ్యం మాత్రం ఇంతవరకూ కనుచూపు మేరలోకి రానేలేదు. అదే లక్ష్యసాధన కోసం అంబేడ్కర్ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకోసం దారిచూపే పవిత్ర గ్రంథంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. పాలకుల సహాయ నిరాకరణ వలన రాజ్యాంగ లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరకపోయినా కొంతమేరకైనా సత్ఫలితాలనిస్తున్నాయి. నెమ్మదిగానైనా సామాజిక పరివర్తన జరుగుతున్నది. నాణ్యమైన విద్యను దళిత, గిరిజన వెనుకబడిన వర్గాలకు ఉచితంగా అందజేసి ఉన్నట్లయితే పరివర్తన మరింత వేగంగా జరిగేది. దోపిడీ – పీడనా లేని సమాజాన్ని కాంక్షించేవారెవరైనా సరే, మనిషి మనిషిగా ఆత్మగౌరవంతో బతకగలిగే వ్యవస్థను కోరుకునేవారు ఎవరైనా గానీ, పేదరికం లేని కరువు కాటకాలు లేని రోజులు రావాలని కోరుకునేవారందరూ కూడా, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య కావాలని నినదించేవారందరూ కూడా ఆ దిశలో పడుతున్న ప్రతి అడుగునూ స్వాగతించాలి. ప్రేమించాలి. అభినందించాలి. ఆ అడుగు విప్లవకారులదైనా, ప్రజాస్వామికవాదులదైనా సరే! కేంద్ర ప్రభుత్వాలదైనా, రాష్ట్ర ప్రభుత్వానిదైనా సరే! ఒక్కో ముందడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుందని మరిచిపోరాదు. అంబేడ్కర్ జయంతికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. 70 శాతం మంత్రిపదవులను బలహీనవర్గాలకు కేటాయించారు. ఇన్ని పదవులు ఈ సెక్షన్లకు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇది అభినందించదగిన సందర్భం కాదా? ఐదు ఉపముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకు కేటాయించారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే చర్య కాదా? దేశవ్యాప్తంగా దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్న వారిలో దళితులు, మహిళలే అత్యధికంగా ఉన్నారంటూ దశాబ్దాలుగా జాతీయ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. ఆ సవాల్‌కు జవాబుగా ఒక దళిత మహిళకే హోంశాఖను అప్పగించడాన్ని మనం స్వాగతించలేమా? ఇలా అప్పగించడం వరుసగా ఇది రెండవసారి కూడా! హోం, రెవెన్యూ, వైద్యం–ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్, పురపాలన, పరిశ్రమలు, రవాణా – ఇలా కీలకమైన శాఖలన్నింటినీ ఈ వర్గాలకే కేటాయించడాన్ని ఇదివరకెప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలోగానీ, వేరే రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ చవిచూసి ఉన్నామా? గతంలో యాదవ – కురుబ కులాలకు కలిపి జాయింట్‌గా ఒకటి, గౌడ – శెట్టిబలిజలకు కలిపి జాయింట్‌గా ఒకటి, పొలినాటి వెలమ – కొప్పుల వెలమలకు కలిపి ఒకటి చొప్పున కేటాయించే సంప్రదాయాన్ని వదిలిపెట్టి విడివిడిగా మంత్రి పదవులిచ్చారు. రాయలసీమలో జనాధిక్యం కలిగిన బోయలకూ, ఉత్తరాంధ్రలో అధికంగా వుండే తూర్పు కాపులకూ, సముద్ర తీరం వెంబడి నివసించే మత్స్యకారులకూ మంత్రి పదవులు దక్కాయి. ఎక్కువ మంత్రి పదవులను ఇవ్వడమే కాకుండా కీలక శాఖలను కట్టబెట్టడం సాధికారత సాధనలో ఒక గొప్ప ముందడుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ముందు స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు యాభై శాతం కుర్చీలను కట్టబెట్టింది. మొత్తం స్థానిక సంస్థల పదవుల్లో యాభై శాతాన్ని మహిళలకు రిజర్వు చేసింది. నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం, నామినేటెడ్ పనుల్లో యాభై శాతం ఈ వర్గాలకు కేటాయింపును చట్టబద్ధం చేసింది. ఈ మొత్తంలో కూడా సగం మహిళలకు! ఈ చర్యలు రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణమైనవే కదా! గమ్యాన్ని మరింత దగ్గర చేసేవే కదా! విద్య – వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విప్లవాత్మకమైనవిగా ఇప్పటికే నీతి ఆయోగ్, కేంద్రం, ఇతర రాష్ట్రాలు ప్రశంసించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు గానీ, మీడియా గానీ వీటి గురించి ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. వ్యవసాయ రంగంలో చిన్న కమతాలు లాభదాయకం కాదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తల నుంచి సోషలిస్టు ఆర్థికవేత్తల వరకూ అందరూ అభిప్రాయ పడతారు. దీనికి పరిష్కారంగా కార్పొరేట్ వ్యవసాయాన్ని కొందరు సూచిస్తున్నారు. సమష్టి వ్యవసాయాన్ని మరికొందరు సూచిస్తున్నారు. ఇవేవీ కూడా భారతీయ వ్యవసాయ సంస్కృతికి సరిపడేవి కావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్లు చిన్న కమతాలకు శ్రీరామరక్షగా నిలబడగలుగు తాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని కూడా స్వాగతించలేమా? రాజ్యాంగం నిర్దేశించిన గమ్యాన్ని ముద్దాడే దిశగా పడే ప్రతి అడుగునూ స్వాగతించడం, అభినందించడమే అభ్యుదయమవుతుంది. వ్యతిరేకించడం అభివృద్ధి నిరోధకమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిజమే, ఓట్లు చీలవు!
కొన్ని రకాల జంతువులు, పక్షులు రాబోయే భూకంపాన్ని ముందుగానే పసిగట్టగలుగుతాయి. వాటికున్న అయస్కాంత శక్తి వల్ల అది సాధ్యమవుతుంది. పసిగట్టిన క్షణాల నుంచి వాటి ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయట! ఈ బెటాలియన్‌లో ప్రముఖంగా చెప్పుకోదగినవి జాగిలాలు, గబ్బిలాలు. అధికార సౌధపు గోడలకు గబ్బిలాల మాదిరిగా నిరంతరం వేలాడాలని కోరుకునే రాజకీయ పక్షులు కొన్ని ఉంటాయి. రాబోయే రాజకీయ ప్రకంపనల్ని ఈ పక్షులు పసిగట్ట గలుగుతాయి. మూడేళ్ల కిందట వచ్చిన ఒక పెను ప్రకంపన కారణంగా ఈ పక్షుల గూడు చెదిరింది. ఇంకో రెండేళ్లకు అటువంటి ప్రకంపనే మరోసారి తప్పదని వాటి మాగ్నెటిక్ తరంగాలు అలారం బెల్స్ మోగిస్తున్నాయి. పక్షుల్లో విపరీత ప్రవర్తన మొదలైంది. కంపనాన్ని నిరోధించగలిగే మార్గాలపై అన్వేషణ మొదలైంది. కార్యాచరణ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం మొన్నటి సూపర్ విక్టరీని మరోసారి నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షులు ఈ సంగతిని ఎప్పుడో పసిగట్టి ఉంటాయి. ఈ రాబోయే పరిణామాన్ని నిరోధించడానికి అవసరమని తాము భావించిన, అందు బాటులో ఉన్న అన్నిరకాల క్షుద్రపూజలను ప్రారంభించాయి. వారి పెంపుడు మీడియా నిర్నిద్ర గాత్రంతో భౌ కొడుతున్నది. మరోపక్క చడీచప్పుడు లేని రాజకీయ కౌటిల్యం చాప కింద ప్రవహిస్తున్నది. బేతాళ మాంత్రికోపాసన మొదలైంది. అధికార పార్టీని ఓడించడానికి సమస్త వ్యక్తులూ, శక్తులూ ఏకం కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ, పవన్ పార్టీ నుంచి కమ్యూనిస్టుల వరకూ అందరూ ఏకమై తనను గెలిపించే చారిత్రక కర్తవ్యాన్ని భుజాల మీద మోయాలని ఆయన తలపోస్తున్నారు. ఇందుకోసం తెర వెనుక తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గంటను మాత్రం తన హితుడైన పవన్ కల్యాణ్ మెడలో వేసి తెర ముందు నిలబెట్టారు. సాలార్జంగ్ మ్యూజియంలోని ప్రాచీన మ్యూజికల్ గడియారంలో గంటకోసారి ఓ మరుగుజ్జు బొమ్మ వచ్చి, గంటలు మోగించి వెళుతుంది. పవన్ కల్యాణ్ పీరియాడికల్‌గా వచ్చి గంట మోగించి ఓట్లు చీలనివ్వబోమని ప్రకటించి వెళుతున్నారు. ‘ఒక్కొక్క ఓటేసి చందమామా...’ అని పాడుకుంటూ ఓట్లు ఏరుకోవలసిన పరిస్థితి ప్రతిపక్ష శిబిరానికి ఏర్పడింది. ఈ దురవస్థ స్వయంకృతం. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మనుషుల్ని విభజించింది. బలహీనుల్ని ద్వేషించింది. మేడల్నీ, మిద్దెల్నీ ప్రేమించింది. వాడలనూ, గూడేలనూ చిన్న చూపు చూసింది. పంట పొలాలనూ, పారే జలాలనూ కూడా కుల కలుషితం చేశారు. వీచే గాలుల్లో, విచ్చుకునే పువ్వుల్లో విద్వేషపు విషగంధం కలిపారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టడ మేమిట’ని ఈసడించుకున్నారు. బీసీలను జడ్జీలుగా నియమించ రాదంటూ కేంద్రానికి ఉత్తరాలు రాశారు. నామినేటెడ్ పదవుల్లో బలహీన వర్గాలకు ఎక్కడైనా ఒకచోట కొంచెం కొసరు వాటా మాత్రం దక్కేది. పేద కుటుంబాల్లోని పిల్లల చదువును అటకెక్కించారు. పేదవాడికి రోగం రాకడ, ప్రాణం పోకడ అన్న చందంగా ప్రజారోగ్య వ్యవస్థను వ్యాపారమయం చేశారు. ఈ మూడేళ్లు ప్రభుత్వ పాలన అందుకు వ్యతిరేక దిశలో సాగింది. కుల మతాలకు అతీతంగా మనుషుల్ని ఐక్యం చేసే ప్రయత్నం జరిగింది. చారిత్రక దురన్యాయం కారణంగా వెనుక బడుతున్న వారికి చేయందించి నడిపించే ప్రయత్నం జరిగింది. డబ్బు లేని కారణంగా చదువుకోలేని నిస్సహాయతను తొలగించ డానికి నడుం కట్టారు. అభివృద్ధి క్రమంలో ఆఖరుమెట్టు పైనున్న వాడు కూడా సమాన స్థాయిలో నిలబడి పోటీ పడగలిగే రోజు కోసం విద్యావ్యవస్థను సమాయత్తం చేస్తున్నారు. అందరికీ ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. నాణ్యమైన విద్య అందరికీ లభించేలా పాదు చేస్తున్నారు. పది పదిహేనేళ్లపాటు ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేయగలిగితే నేటి బలహీన వర్గాల ప్రజలు ఏ ప్రత్యేక రక్షణలూ, ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయికి చేరుకోగలుగుతారు. మనుషుల మధ్య విభజన రేఖలు చెరిగిపోతాయి. ఇంత గొప్ప ఆలోచనతో విద్యా సంస్కరణలను వై.ఎస్. జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి పేదింటి తలుపును కూడా ‘వారి’ ఫ్యామిలీ డాక్టర్ నెలకోసారి తట్టే రోజులు చేరువలో ఉన్నాయి. అందుక వసరమైన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవం ఇనుమడించేలా దేశంలో ఎక్కడా లేని పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రభుత్వ సాయంతో త్వరలో 30 లక్షల మంది మహిళలు గృహ యజమానులు కాబోతు న్నారు. పిల్లల చదువులకు సంబంధించిన నిర్ణయాధికారం ‘అమ్మ ఒడి’ రూపంలో ఆమెకు సంక్రమించింది. చిల్లర ఖర్చులకు కూడా భర్తలపైనో, పిల్లలపైనో ఆధారపడే నడి వయసు మహిళల చేతుల్లో ఇప్పుడు నాలుగు రాళ్లు కనబడుతున్నాయి. వారు మదుపు చేస్తున్నారు. రాబడి కోసం పోరాడుతున్నారు. ఆ కళ్లల్లో ఇప్పుడు సాధికారతా కాంతుల్ని చూడగలుగుతున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సరికొత్త తిరుమంత్రం – సాధికారత. ప్రజా సంక్షేమం అనే భావన ఒక దశను దాటి సాధికారతా సాధన దశలోకి ప్రవేశిస్తున్నది. మనిషి మనిషిగా తన కాళ్లపై తాను బలంగా నిలబడగలిగే స్థితిలోకి చేరు కోవడమే– ఎంపవర్మెంట్, సా«ధికారత సాధించడం! వర్గ పోరాటాలు, కులయుద్ధాల ప్రసక్తి లేకుండా సమసమాజ స్థితికి చేరుకునేందుకు ప్రజా స్వామ్యం పరిచిన బాట సాధికారత. వైఎస్ జగన్ ప్రభుత్వం వివిధ సామాజిక క్షేత్రాల్లో వెదజల్లిన సాధికారతా విత్తనాలు ఇప్పుడు మొలకెత్తు తున్నాయి. మరోపక్క ఏకకాలంలో చేపట్టిన పరిపాలనా సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసల్నీ, స్థానిక ప్రజల అభిమానాల్నీ చూరగొన్నాయి. ఈ నేపథ్యమే ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని ప్రతిపక్ష శిబిరాన్ని కలవ రపెడుతున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి యాభై శాతానికి పైగానే ఓట్లు రాగల క్షేత్రస్థాయి వాస్తవికత ప్రతిపక్షానికి అవగతమైంది. అందుకే తన పాత ద్విముఖ వ్యూహానికి మరింత పదును పెట్టే పనిలో అది నిమగ్నమైంది. వీలైనన్ని పార్టీలను తమ కూటమిలోకి లాగే ప్రయత్నాలను ఒకపక్క చేస్తూనే, మరోపక్కన శరపరంపరగా అధికారపక్షంపైకి నిందారోపణల్ని కురిపిస్తున్నారు. రెండు పత్రికలు, ఐదారు చానళ్లతో కూడిన ఎల్లో మీడియా, దానికి అనుబంధంగా ఒక అక్షౌహిణి సైన్యంతో ఏర్పాటైన ఎల్లో డిజిటల్, ఎల్లో సోషల్ మీడియా కార్ఖానాలు ఇప్పుడు మూడు షిఫ్టులూ పనిచేస్తు న్నాయి. టన్నులకొద్దీ అసత్యాలనూ, వార్తా వ్యర్థాలనూ సొసైటీలోకి వదులుతున్నాయి. ప్రతి వార్తకూ, ప్రతి సంఘట నకూ వక్రీకరణ భాష్యం నిత్యకృత్యమైంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం ఆవరించి ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే ఎల్లో మీడియా వేలెత్తి చూపిస్తున్నది. ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చి మొదటి వారం నుంచే ఎండలు భగ్గుమన్నాయి. గృహ వినియోగం, వాణిజ్య వినియోగం అంచనాలకు మించి పెరిగింది. వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా చేసిన ఫలితంగా వినియోగం భారీగా పెరిగింది. బొగ్గు ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించింది. ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా చాలా దేశాల్లో బొగ్గు కొరత ఏర్పడింది. ఫలితంగా బొగ్గు ఆధారిత ధర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు దొరకడమే గగనం. దొరికినా టన్నుకు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు ధర పలుకుతున్నది. ఆ ధరలకు కొనుగోలు చేయడమంటే డిస్కమ్‌లకు ప్యాకప్ చెప్పడమే! ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు, గ్యాస్ ధరలకు యుద్ధం మరింత ఆజ్యం పోసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విద్యుత్ వినియోగ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లుగా ఉన్నదని ఇంధన శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉన్నది. ఇంకో 55 మిలియన్ యూనిట్లు లోటు. పవర్ ఎక్స్ఛేంజీల్లో ఈ మొత్తం లోటు మేరకు కొనుగోలు చేయాలనుకుంటే రోజుకు రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాల్సిందే. ప్రభుత్వం అందుకు సిద్ధపడినా కూడా ఆ మేరకు ఎక్స్ఛేంజిల్లో కూడా లభ్యత లేదు. దొరికినంత మేరకు కొనుగోలు చేసి సర్దుబాటు చేస్తున్నామని ఇంధన శాఖ అధికారి చెప్పారు. ఈ నెలాఖరు నాటికి వరి కోతలు మొదలవుతాయి కనుక వ్యవసాయ డిమాండ్ పడిపోతుందనీ, వచ్చే నెల మొదటి వారానికల్లా ఈ సంక్షోభం తగ్గిపోతుందనీ చెబుతున్నారు. ఒక ప్రకృతి వైపరీత్యం, ఒక యాక్సిడెంట్ లాగా ముంచు కొచ్చిన సమస్య ఇది. తాత్కాలికమైనది. అభివృద్ధి చెందిన పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లే పవర్ హాలిడే లను ప్రకటించాయి. ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో గంటల తరబడి అప్రకటిత కోత అమలవుతున్నది. మెయిన్టెనెన్స్ పేరుతో చెన్నైలోనూ కోతలు విధిస్తున్నారు. సొంత బొగ్గు గనులున్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే అడపాదడపా అప్రకటిత కోతలు తప్పడం లేదు. దేశమంతా ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను జగన్ తలకు చుట్టేందుకు ఎల్లో సిండికేట్ ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నదో చూస్తూనే ఉన్నాము. వైజాగ్‌లో ఎన్సీసీ అనే సంస్థకు భూ కేటాయింపుల విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని రద్దు చేయాలన్నది ఎల్లో మీడియా డిమాండ్. కానీ అమరావతిలో మాత్రం రద్దు చేయకూడదట! ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పుల ఫలితంగా త్వరలో మరో శ్రీలంక మాదిరిగా కాబోతున్నదని ఎల్లో మీడియా చేస్తున్న బృందగానం వింటూనే ఉన్నాము. బాబు హయాంలో చేసిన అప్పుల గురించి కానీ, ఈ మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ఆర్థికాభివృద్ధిని గురించి కానీ ఎల్లో మీడియా మాట్లాడదు! చంద్రబాబు పాలన చివరి సంవత్సరం రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1,54,031 రూపాయలు. 2021– 22లో అది 2,07,771కి పెరిగింది. దీని గురించి మాట్లాడదు! చంద్రబాబు పాలన చివరి సంవత్సరంలో (2018–2019) జీఎస్డీపీ వృద్ధి రేటు 5.36 శాతం. 2021–22లో అది 11.43 శాతం. దేశంలోనే అత్యధికంగా వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. జీఎస్డీపీ పెరగడ మంటే... ఆర్థిక కార్యక్రమాలు పెరగడం, ఉత్పత్తులు, సేవలు పెరగడం, ద్రవ్య చలామణీ పెరగడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమని అర్థం. గత ఆర్థిక సంవత్సరం జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. 52 వేల కోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల ఆదాయంగా సమకూరింది. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పురోగామి రాష్ట్రంగా ఉన్నదని ఈ గణాంకాలన్నీ ఘంటాపథంగా చెబుతున్నాయి. కానీ ఎల్లో సిండికేట్‌కు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఓడించిన ఆంధ్రప్రదేశ్‌లో లంకాదహన దృశ్యమే కనిపిస్తున్నది. వారికి కనువిందు చేస్తున్నది. అసత్య ప్రచారాలతో అధికార పార్టీ ఓటింగు బలాన్ని ఎంతో కొంత తగ్గించే తాపత్రయానికి తోడు ప్రతిపక్షం ఓట్లు చీలకుండా, చంద్రబాబు పెట్టబోయే మహాకూటమి జోలెలోనే పడాలన్నది మరో వ్యూహం. ఇక్కడ రాజకీయ నాయకులు మరిచిపోతున్న విషయం ఒకటున్నది. అలయెన్స్లూ, ఐక్య సంఘటనలూ రాజకీయ పార్టీలకే కాదు... ప్రజలకూ ఉంటాయి. ఆ విషయం గతంలో అనేకసార్లు నిరూపణయింది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ స్వయంగా ఓటమి పాలై కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఇందిరాగాంధీ ‘కాంగ్రెస్(ఐ)’ పేరుతో చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జాతీయ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. బ్రహ్మా నందరెడ్డి అధ్యక్షుడిగా ఉండేవారు కనుక ‘రెడ్డి కాంగ్రెస్’గా పిలిచేవారు. ముఖ్యమంత్రిగా ‘రెడ్డి కాంగ్రెస్’ నేత వెంగళరావు ఉన్నారు. కాంగ్రెస్ అతిరథ మహారథులంతా ‘రెడ్డి కాంగ్రెస్’లోనే ఉన్నారు. మరికొందరు జనతా పార్టీలోకి వలసపోయారు. ప్రతిపక్ష యోధానుయోధులు, అధికార పక్షం నుంచి వచ్చిన అతిరథులతో కూడిన జనతా పార్టీ బలీయంగా కనపడింది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ ప్రచార పోరు! ఇందిరా కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్లకు టిక్కెట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ అధికారంలో ఉండగా సామాన్య ప్రజలకు చేసిన మేలును వారు మరిచిపోలేదు. ‘గరీబీ హఠావో’ ఉద్యమాన్ని వారు మరిచిపోలేదు. సంపన్నుల సేవలో తరిస్తున్న బ్యాంకుల మెడలు వంచి, వాటిని జాతీయం చేసి సామాన్య ప్రజలకు రుణాలిప్పించిన జ్ఞాపకమూ చెదిరిపోలేదు. ఇందిరమ్మ పార్టీ గుర్తు కూడా కొత్తది. పెద్దగా ప్రచారం చేసే నాధుడు లేడు. అయినా, బలమైన స్థానిక నాయకత్వమున్న రెండు పార్టీలకు వ్యతిరేకంగా బీదాబిక్కీ జనమంతా ఒక్కటైనారు. తమ ఓట్లను చీలనివ్వలేదు. ఇందిరమ్మ గుర్తును తెలుసుకొని, బ్యాలెట్ పేపర్లో వెతికి పట్టుకొని మరీ ఓట్ల వర్షం కురిపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ‘మహా కూటమి’గా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఓట్లకు కోతపెట్టిన ‘ప్రజారాజ్యం’ ఒక్కటే విడిగా పోటీ చేసింది. ‘మహాకూటమి’కి ధీటుగా వైఎస్ఆర్ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా మహత్తర కూటమిగా ఐక్యమై, రాజకీయ కూటమిని మట్టి కరిపించారు. తమకు మేలు చేసే, తమ శ్రేయస్సుకు బాటలు వేసే ప్రభుత్వాల మీద జరిగే కుట్రలనూ, కుయుక్తులనూ జనం గమనిస్తారు. ‘ఓట్లు చీలనివ్వం’ అనే మాట పవన్ కల్యాణ్, చంద్రబాబు చెప్పడం కాదు... ప్రజలే చెబుతారు. సామాజిక వర్గాల సంయుక్త అలయెన్స్‌ను వారే ప్రకటించుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, అగ్రవర్ణ అభ్యుదయ వర్గాలతో కూడిన అఖండమైన ఓటు బ్యాంకును చెదరనివ్వరు! వారి ఓట్లు చీలవు!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇది ప్రజల బడ్జెట్.. ఆత్మనిర్భర బడ్జెట్
ఇది ప్రజల బడ్జెట్. మరింత ఇన్ఫ్రా, మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు, మరింత వృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్. పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఇందులోని ప్రధాన హైలైట్. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూనే, సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సరికొత్త అవకాశాలు చూపడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందింది. ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు, టాయిలెట్, నల్లా నీరు, గ్యాస్ కనెక్షన్ల కలను సాకారం చేయనుంది. ఆధునిక ఇంట ర్నెట్ కనెక్టివిటీకీ ప్రాధాన్యమిచ్చింది. యువతకు మెరుగైన భవిష్యత్తుకు భరోసానిచ్చింది. హిమాచల్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల వంటి కొండ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థకు బాటలు వేస్తోంది. రైతులకు డ్రోన్లు, వందే భారత్ ట్రైన్లు, డిజిటల్ కరెన్సీ, 5జీ సేవలు, నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ తదితరాలతో యువత, మధ్యతరగతికే గాక పేద, దళిత, వెనకబడ్డ వర్గాలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. గంగా ప్రక్షాళనతో పాటు నది పరీవాహక రాష్ట్రాల్లో సహజ సాగును ఈ బడ్జెట్ ప్రోత్సహించనుంది. అగ్రి స్టార్టప్‌లకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ప్యాకేజీ వంటివి రైతు ఆదాయాన్ని బాగా పెంచేవే. వారికి రుణ హామీతో పాటు మరెన్నో పథకాలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. రక్షణ బడ్జెట్లో 68 శాతాన్ని దేశీయ పరిశ్రమకే రిజర్వ్ చేయడం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, అన్ని రంగాలూ మనస్ఫూర్తిగా స్వాగతించిన ’ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్’ ఇది! -
సొంత గూటికి... మహారాజా!
సరిగ్గా ఏడు దశాబ్దాల తర్వాత మహారాజా సొంత గూటికి చేరారు. 1932లో జేఆర్డీ టాటా పూనికతో ‘టాటా ఎయిర్‌లైన్స్’గా ఆరంభమై, జాతీయీకరణతో 1953లో ప్రభుత్వం చేతికొచ్చి, మహారాజా చిహ్నంతో పాపులరైన భారత విమానయాన సంస్థ ఎయిరిండియా ఇప్పుడు మళ్ళీ టాటాల చేతికే వచ్చింది. ప్రభుత్వం అధికారిక అప్పగింతలతో కొత్త శకం ఆరంభమైంది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన విక్రయంలో దాదాపు రూ. 18 వేల కోట్లకు టాటా సంస్థ తన బిడ్డను మళ్ళీ చేజిక్కించుకుంది. దాంతో పాటు సంస్థ తాలూకు రూ. 15,300 కోట్ల మేర ఋణభారాన్ని భుజానికెత్తుకుంది. రోజుకు రూ. 20 కోట్ల మేర నష్టపోతున్న ఈ సంస్థను మళ్ళీ గగనతలంలో దూసుకుపోయేలా చేయడం ఇప్పుడు టాటాల ముందున్న పెనుసవాలు. అటు ఎయిరిండియా, ఇటు దేశ విమానయాన రంగం, వివిధ రంగాలు – వ్యాపారాల్లో ప్రభుత్వ పాత్ర... అన్నిటా ఇది ఓ కీలక ఘట్టం. మోదీ గద్దెనెక్కిన తరువాత గడచిన ఎనిమిదేళ్ళలో విజయవంతంగా పూర్తయిన తొలి ప్రైవేటీకరణ ప్రయత్నం ఇదే. కానీ, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా కలిసొచ్చిందేమీ లేదు. పేరుకు రూ. 18 వేల కోట్లకు కొన్నా, అందులో రూ. 2,700 కోట్లే ప్రభుత్వానికి ఇచ్చేది. మిగతా రూ. 15,300 కోట్లు ప్రభుత్వమిచ్చిన అప్పుగా టాటా దగ్గరే ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటీకరణ సాగుతున్న తీరుపై విమర్శలూ అనేకం. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు గడించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ఇప్పటి దాకా కేవలం రూ. 9,330 కోట్లే వచ్చినట్టు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ‘పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) వారి లెక్క. అవన్నీ అటుంచితే, ఈ విక్రయం ద్వారా వెలువడ్డ సిగ్నల్స్‌ను మర్చిపోలేం. నిజానికి, ఎయిరిండియా ప్రైవేటీకరణ చాలాకాలంగా వినపడుతున్నదే. ఒకప్పుడు ఉజ్జ్వలంగా వెలిగిన సంస్థ ఇది. 1932 అక్టోబర్‌లో మొదలై, టాటాలు నడుపుతున్న సంస్థలో స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం ప్రవేశించింది. మొదట 49 శాతం వాటా తీసుకుంది. 1953లో మిగతా వాటాను కూడా కొని, జాతీయీకరణ జరిపింది. తర్వాత కొన్ని దశాబ్దాలు ఎయిరిండియాదే హవా. ఆర్థిక సరళీకరణ, ఆ పైన పెరిగిన ప్రైవేట్ సంస్థల పోటీతో గత ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఈ ప్రభుత్వరంగ సంస్థ నిర్వహణలో అనేక లోటుపాట్లూ చోటుచేసుకున్నాయి. నష్టాలను తగ్గించుకోవడం కోసం 2007లో అంతర్జాతీయ విమానాలు నడిపే ఎయిరిండియాను, దేశీయ విమానయాన ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’లో కలిపారు. అయినా సరే, అప్పటి నుంచి ఇప్పటి దాకా లాభమన్నది కళ్ళజూడలేదు. చివరకు అన్నీ కలిసి సంస్థను ప్రైవేటీకరణ బాట పట్టించాయి. వాజ్‌పేయి సారథ్యంలో 2001లోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణకు తొలి ప్రయత్నం చేసింది. 40 శాతం వాటాలు విక్రయించాలనుకొని విఫలమైంది. మోదీ సర్కార్ మొదటి విడత పాలనలో 2018లో 76 శాతం మేర వాటా అమ్మాలనుకుంది. ఒక్కరైనా ముందుకు రాలేదు. 2020 జనవరిలో పాక్షికంగా కాక వాటాలను పూర్తిగా అమ్మేస్తామంటూ, తాజా ప్రయత్నం ప్రారంభించింది. ప్రభుత్వ వాటాలుంటే దాని పెత్తనమూ ఉంటుందనీ, స్వేచ్ఛగా సంస్థ నిర్వహణ సాధ్యం కాదనీ ఇంతకాలం సంశయిస్తూ వచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఇది నచ్చింది. ఎట్టకేలకు ఇప్పటికి అమ్మకం పూర్తయింది. ఇప్పటికే అనేక సంస్థలు పోటీపడుతూ, కరోనా కష్టాలతో మథనం తప్పనిసరి అయిన వేళ ఎయిరిండియాను టాటాలు చేపట్టడం గమనార్హం. తాము పురుడు పోసిన సంస్థను మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోవడం భావోద్వేగభరిత ఘట్టమే అయినా, అందులోని సవాళ్ళు అనేకం. ఒకపక్కన పాతబడుతున్న విమానాలు, మరోపక్క వేల సంఖ్యలో ఉద్యోగులు వారసత్వంగా సంక్రమించాయి. కనీసం ఏడాది పాటు ఉద్యోగులెవరినీ తొలగించబోమని హామీ ఇచ్చిన టాటాలు నష్టాల్లో ఉన్న సంస్థను ఓ గాడిన పెట్టాలంటే అసాధారణ కృషి అవసరం. విమానయాన రంగంలో ఇప్పటికే ఒకటికి రెండు సంస్థల్లో టాటాల పెట్టుబడులున్నాయి. దేశంలో ఇప్పుడు మిగిలిన ఏకైక ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ ‘విస్తారా’లో, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణాలకు తోడ్పడే విమానయాన సంస్థ ‘ఎయిర్ ఏషియా’ భారతీయ శాఖ (ఎయిర్ ఏషియా ఇండియా)లో టాటాలకు భాగముంది. ఇప్పుడు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో నూటికి నూరుపాళ్ళ యాజమాన్యం, క్షేత్రస్థాయి నిర్వహణ సంస్థ ‘ఎయిరిండియా – శాట్స్’లో 50 శాతం వాటా వచ్చింది. ఒకే గొడుగు కింది విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిరిండియాలు మూడూ పోటాపోటీ పడాల్సిన గమ్మల్తైన పరిస్థితి. అందుకే, ఏదో ఒక దశలో వీటన్నిటినీ ఒక్కటి చేసినా, ఆశ్చర్యం లేదు. ఏమైనా, ప్రైవేటీకరణతో గూటిలోని గువ్వ పిల్లకు కొత్త రెక్కలొస్తాయా? ఈ కరోనా కాలంలో ఎయిరిండియాకు టాటా ఎలాంటి బూస్టర్ షాట్ ఇస్తుంది? జవాబుల కోసం ఇంకొంతకాలం వేచి చూడాలి. ప్రభుత్వమేమో ప్రైవేటీకరణ లక్ష్యంలో భాగంగా ఖజానాకు మరింత సొమ్ము సమకూర్చు కోవడానికి మార్చి ఆఖరున ‘భారత జీవిత బీమా సంస్థ’ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇస్యూ గడువు పూర్తయ్యే దాకా ఆగకతప్పదు. అభ్యంతరాలు, అడ్డంకుల మధ్యనే భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ముందుకు సాగే సూచనలూ కనిపిస్తు న్నాయి. అనివార్యతలెలా ఉన్నా, ప్రజా ప్రయోజనాల్ని కాపాడాల్సిన ప్రభుత్వ సారథ్యంలోని స్వేచ్ఛా విహంగాలు ప్రైవేటు చేతిలో పతంగులుగా మారిపోవడానికి దారి తీసిన పరిస్థితులే తీరని దుఃఖం! -
పంచముఖ పంజాబీ చిత్రం
ఎన్నికలు రెండు, మూడు నెలల్లో ఉన్నాయనగా రాజకీయాలు వేడెక్కడం మామూలు. ఎత్తులు, కొత్త పొత్తులతో రంగస్థలం రంజుగా మారడమూ సాధారణం. కానీ, పంజాబ్‌లో శరవేగంతో మారుతున్న సమీకరణాలు ఎవరూ ఊహించనివి అనే చెప్పాలి. మరోసారి గెలుపు పక్కా అనుకున్న పంజాబ్‌లో కాంగ్రెస్ కష్టాల్లో పడడం, ఆ రాష్ట్రంలో ‘ఆప్’ క్రమంగా పాగా వేస్తుండడం, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టిన మాజీ సీఎం అమరీందర్ సింగ్‌తో – శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్) అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం, రైతు సంఘాలు కలసి ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం – ఇవన్నీ ఫిబ్రవరి, మార్చిలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రాన్ని చకచకా మార్చేస్తున్నాయి. నిన్నటి దాకా రెండున్నర పార్టీల రణస్థలి లాంటి రాష్ట్రం ఇప్పుడు కొత్త ఆటగాళ్ళతో క్రిక్కిరిసి, ఉత్కంఠ రేపుతోంది. ఏడాది పైగా సాగిన రైతు ఉద్యమంతో కొత్త సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్న తర్వాత పంజాబ్‌లో జరిగిన తాజా తొలి ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. సోమవారం వెలువడ్డ పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. 2016 నుంచి ఇప్పటి దాకా మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ కార్పొరేషన్లో అధికారంలో ఉన్న బీజేపీని రెండో స్థానానికీ, అలాగే కాంగ్రెస్‌ను మూడో స్థానానికీ నెట్టేస్తూ, 35 స్థానాలకు గాను 14 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుపొందింది. 2016 కన్నా బీజేపీ స్కోరు 8 తగ్గి, 12 వార్డుల దగ్గర నిలిచింది. బీజేపీ ప్రస్తుత మేయర్ – ఇద్దరు మాజీ మేయర్లు ఓడిపోవడం, తొలిసారి అక్కడ మునిసిపల్ బరిలోకి దిగుతూనే ‘ఆప్’ పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. ఢిల్లీ ముఖ్యమంత్రి – ‘ఆప్’ సారథి అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో చెప్పాలంటే, ‘‘పంజాబ్‌లో మారుతున్న పరిస్థితులకు ఇది సూచన’’. ప్రతిసారీ కాంగ్రెస్, బీజేపీల మధ్య సాగే చండీగఢ్ ఎన్నికలు ఈసారి ‘ఆప్’ రాకతో, త్రిముఖ పోటీగా మారడం గమనార్హం. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను పంజాబ్ అంతటికీ బారోమీటర్ అనలేం. కానీ, ఒక్క చండీగఢ్‌లోనే కాదు... రాష్ట్రం మొత్తం మీద కొత్త రాజకీయ ఆటగాళ్ళు పెరిగారు. కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ, కేంద్ర బీజేపీ సర్కారుపై పోరాడిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం)లో భాగమైన 22 రైతు సంఘాలు కలసి తాజాగా ‘సంయుక్త సమాజ్ మోర్చా’ (ఎస్ఎస్ఎం) పేరిట ఓ రాజకీయ పార్టీ పెట్టాయి. సీనియర్ రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఈ కొత్త రాజకీయ కూటమి తాలూకు ముఖచిత్రం. పంజాబ్‌లోని 117 స్థానాలకూ పోటీ చేస్తామని ఈ రైతు సంఘాల పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కానీ, కొన్ని రైతు సంఘాల ఈ రాజకీయ రంగ ప్రవేశాన్ని సాక్షాత్తూ వాటన్నిటికీ గొడుగు సంస్థ లాంటి ఎస్కేఎం వ్యతిరేకించింది. ప్రజా ఉద్యమానికి పరిమితులున్నా, అలా కొనసాగినప్పుడు జనంలో ఉండే గౌరవం, ప్రతిష్ఠ వేరు. పార్టీ పెట్టేసరికి ఉద్యమాన్నీ రాజకీయ దృష్టితోనే చూస్తారనేది కొట్టిపారేయలేం. మరి, ఉద్యమం ద్వారా రైతులను ఏకం చేయగలిగిన సంఘాలకు రేపు ఎన్నికలలో ఓట్లు రాలతాయా అన్నది చెప్పలేం. ఏడెనిమిది నెలల క్రితం పంజాబ్‌లో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కొంత అయోమయంలో పడింది. పంజాబ్ పీసీసీ సారథిగా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూను బరిలోకి దింపి, సీఎం స్థానంలోని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పొమ్మనకుండా పొగబెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వమే! తీరా అమరీందర్ ఇప్పుడు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంత కుంపటి పెట్టుకొని, బీజేపీతో కలసి కాంగ్రెస్‌ను మట్టి కరిపించే పనిలోకి సీరియస్‌గా దిగారు. దళిత సిక్కు చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం పీఠమెక్కించి, ఓటర్ల కులసమీకరణాల్లో కాంగ్రెస్ విసిరిన పాచిక పారుతుందా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. మరోపక్క సొంత ప్రభుత్వం పైనే విమర్శల బ్యాట్ జళిపిస్తున్న సిద్ధూ ఆ పార్టీకి చెప్పుకోలేని తలనొప్పిగా తయారయ్యారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం 22 జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలన్నిటిలో జరిగిన తాజా ‘ఔట్లుక్ – హన్సా రిసెర్చ్’ పంజాబ్ మనోగతం సర్వేలో సీఎం అభ్యర్థిగా మంచి మద్దతే లభించడం కాంగ్రెస్‌కు కాస్తంత ఊరట. చతికిలబడ్డ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం – పంజాబ్ బరిలో కీలక అంశాలు కానున్నాయని సర్వేల మాట. అమరీందర్, బీజేపీ నేతలేమో జాతీయ భద్రతను అస్త్రంగా ఎంచు కుంటారు. అందుకే, ఇటీవల జరిగిన పవిత్ర స్థలాల అపవిత్ర యత్నం, నిందితుల్ని కొట్టి చంపడం, బాంబు పేలుడు ఘటనల్లో కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. తగినంత మంది అభ్యర్థులైనా లేని బీజేపీ ఇప్పటికే జాట్ సిక్కు రైతుల కోపానికి గురై, ఎలాగోలా ఉనికి నిలుపు కోవాలని తపిస్తోంది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తమలోకి కలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇక, సర్వం తానే అయిన కేజ్రీవాల్ ప్రచారం చూసి, ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలనకు పంజాబీలు సిద్ధపడతారా అన్నదీ ప్రశ్నే. ఏమైనా, కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్, బీజేపీ, రైతు పార్టీల పంచముఖ పోరులో ఏ ఒక్క పార్టీకో సొంతంగా మెజారిటీ వస్తుందా అన్నది ఇప్పటికైతే సందేహమే. ముఖచిత్రం మారుతోంది. అనిశ్చితి పెరుగుతోంది. ఓ ‘ఆప్’ ఎమ్మెల్యే అన్నట్టు, చండీగఢ్ మునిసిపల్ ఎన్నికలు రానున్న అసెంబ్లీ పోరుకు ట్రైలర్. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే, సినిమా మరింత ఆసక్తికరంగా ఉండనుంది. దాని కోసం మార్చిలో రిజల్ట్స్ రిలీజ్ దాకా వేచిచూడక తప్పదు. -
భారీ పోరుకు... బూస్టర్!
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు... జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆదేశాలు... ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ ఎక్కువవుతున్న భయాలు... వీటన్నిటి మధ్య ప్రధాని మోదీ శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన కొత్త టీకా విధాన ప్రకటన నైతిక స్థైర్యాన్ని నింపవచ్చు. నియమిత రెండు డోసులే కాక, అదనపు మూడో డోస్‌ను బూస్టర్ డోస్‌గా ఇవ్వాలంటూ కొద్ది రోజులుగా దేశమంతటా చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని చేసిన ఆ ప్రకటన – క్రిస్మస్ హెల్త్గిఫ్ట్. భారత్ బయోటెక్ సంస్థ తయారీ కోవాగ్జిన్ టీకాను 12 ఏళ్ళు పైబడ్డవారికి వేయవచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించిన కాసేపటికే మోదీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. నూటికి 50 మందిలో టీకా రోగనిరోధకతను ఒమిక్రాన్ తోసిపుచ్చినట్టు దేశంలో ప్రాథమిక డేటా. అందుకే, బూస్టర్‌డోస్‌లు, టీనేజర్లకు టీకాలతో కరోనాపై పోరాటపటిమనీ, పరిధినీ పెంచడం స్వాగతించాలి. పెద్దనోట్ల రద్దు ప్రకటన నాటి నుంచి చీకటి పడ్డాక మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నా రంటే, ఒక విధమైన ఉత్కంఠ! ఒమిక్రాన్ కేసులు, లాక్డౌన్ పుకార్ల మధ్య శనివారమూ అదే పరిస్థితి. చివరకు మోదీ 15 – 18 ఏళ్ళ మధ్యవయసు పిల్లలకు టీకాలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు – ఆరోగ్య సంరక్షణ వర్కర్లు – తీవ్ర అనారోగ్య సమస్యలున్న 60 ఏళ్ళు పైబడ్డ పెద్దలకు ‘ముందు జాగ్రత్త డోస్’ (ప్రపంచమంతా బూస్టర్ అంటున్న మూడో డోస్)లు జనవరి నుంచి ఇస్తామనేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే కాస్తంత ఆలస్యమైందని కొందరు అంటున్నా, కనీసం ఒమిక్రాన్ వేళ ధైర్యమిచ్చే ప్రకటన చేశారనే భావన కలిగింది. ప్రస్తుతం దేశంలో నెలకి 30 కోట్ల పైగా (కోవిషీల్డ్ 25 – 27 కోట్లు, కోవాగ్జిన్ 5–6 కోట్ల) డోస్‌లు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్రాల వద్ద 18 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయట. 11 రాష్ట్రాల్లో దేశ సగటు కన్నా తక్కువగా టీకాకరణ జరుగుతోంది. తాజా ప్రకటనతో నాలుగు వారాల తేడాతో వేసే రెండు డోసుల కోవాగ్జిన్ టీకా, మూడు డోసుల డీఎన్ఏ ఆధారిత టీకా జైకోవ్–డి... ఈ రెండిటికీ మనదేశంలో 12 ఏళ్ళు పైబడ్డవారికి వాడేందుకు అనుమతి ఉన్నట్టయింది. జైడస్ క్యాడిలా తయారీ జైకోవ్–డికి ఆగస్టులోనే భారత్‌లో అనుమతి లభించింది. అదింకా మార్కెట్లోకి రాలేదు. అంటే, దాదాపు ఏడాదిగా విపణిలో ఉన్న కోవాగ్జిన్ ఒక్కటే మన టీనేజర్లకు శరణ్యం. అటు జైకోవ్–డి విషయంలో కానీ, ఇటు కోవాగ్జిన్ విషయంలో కానీ ఈ నిర్ణీత వయసు వారిపై ఆయా టీకాల సామర్థ్యంపైనా, సురక్షితమేనా అన్నదానిపైనా సరైన పరిశోధన పత్రాలు లేవు. బాహాటంగా సమాచారమూ లేదు. తయారీ సంస్థల పత్రికా ప్రకటనలే ప్రజలకు ఆధారం కావడం విచిత్రం. నిజానికి, 2 ఏళ్ళు పైబడిన పిల్లలకు సంబంధించిన డేటాను భారత్ బయోటెక్, 12 ఏళ్ళు పైబడిన వారి డేటాను జైడస్ క్యాడిలా సమర్పించాయి. కానీ, 15 – 18 ఏళ్ళ మధ్యవయస్కులకే టీకాలు పరిమితం చేస్తూ మోదీ ప్రకటనకు కారణాలేమిటో తెలియదు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక వర్ధమాన దేశాల్లో సరఫరా సరిగ్గా లేదు. టీకాల కొరత ఉంది. పైపెచ్చు పిల్లలకూ, టీనేజర్లకూ కరోనా తీవ్రంగా వచ్చే అవకాశం తక్కువనీ, అత్యధిక రిస్కున్నవారికి సైతం అన్ని దేశాల్లో టీకాకరణ పూర్తి కాలేదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 22న కూడా పేర్కొంది. అందుకే, అర్హులైన వయోజనులందరికీ టీకాలు వేయడం పూర్తయ్యే దాకా భారత్‌లో టీనేజర్లకు ఓకే చెప్పరని భావించారు. ప్రభుత్వ విధానానికి మార్గదర్శనం చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం పదే పదే సమావేశమైనా, బాహాటంగా ఏమీ చెప్పలేదు. ఎట్టకేలకు ప్రధానే స్వయంగా కొత్త నిర్ణయం ప్రకటించే ఘనత తీసుకున్నారు. టీకాల సరఫరా సమృద్ధిగా ఉన్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ఇప్పటికే పసిపిల్లలకూ, టీనేజర్లకూ టీకాలు వేసేస్తున్నాయి. మన దేశ తాజా కోవిడ్ టీకా విధానంపై అది సహజంగానే ప్రభావం చూపింది. ఆ మాటకొస్తే, ఐరోపాలోని అనేక దేశాలతో పాటు కెనడా, బహ్రయిన్, ఇజ్రాయెల్, ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా లాంటివి కూడా ఇప్పటికే 12 ఏళ్ళ లోపు వారికి టీకాలకు ఓకే అనేశాయి. భారత్‌లో వయోజనుల్లో 40 శాతం మందికి (38 కోట్ల మందికి) పూర్తిగా టీకాలేయడం అవనే లేదు. అందుకే, వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్, ఇప్పటికీ తొలగిపోని డెల్టా వేరియంట్ ముప్పు నేపథ్యంలో – 18 ఏళ్ళ లోపు వారి కన్నా వయోజనులకే మరింత రిస్కుంది అనేది మరో వాదన. మొత్తం మీద టీకాకరణలో కొత్త దశలోకి కొత్త ఏడాది అడుగిడనున్నాం. రెండో డోస్ వేసుకున్నా 8 నుంచి 9 నెలల్లో రోగనిరోధకత తగ్గుతుందన్న అధ్యయనాలతో ‘ముందు జాగ్రత్త’ పేరుతో కొందరికి బూస్టర్ డోసులూ వేయనున్నాం. మొదటి డోస్ వేసుకొని రెండో డోసుకు రాని వారిని ఒప్పించడంతో పాటు, అవసరార్థులకు బూస్టర్ డోస్ వేయడం ఇప్పుడున్న సవాలు. వ్యాధి లక్షణాలు కనపడ్డ 5 రోజుల్లోగా తీసుకుంటే, అమెరికా, బ్రిటన్లలో ఆసుపత్రి కష్టాలు, మరణాలను 89 శాతం తగ్గిస్తున్నాయంటున్న యాంటీ వైరల్ మాత్రల్నీ అనుమతించవచ్చేమో ఆలోచిస్తే మంచిదే! సమస్యల్లా – దేశ జనాభా మొదలు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల దాకా అందరూ కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించడం, రిస్కు లేని దేశాల నుంచి వస్తున్నవారు అసలు నిబంధనల్నే పాటించక పోవడం! దేశంలో తాజా కేసుల పెరుగుదలకు అదే కారణమని అధికారులు మొత్తుకుంటున్నారు. కానీ, మాస్కులు తీసేసి, భౌతిక దూరమైనా లేకుండా, గుంపులుగా తిరుగుతున్నవారికి ఏమని చెప్పాలి? ఎన్నిసార్లని జాగ్రత్తల బుద్ధి గరపాలి? కరోనాపై పోరులో అదే పెను సమస్య! -
Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం
ఈశాన్య భారతంలో తిరుగుబాట్లను అణిచే పేరిట దశాబ్దాలుగా అమలవుతున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం పౌరుల జీవితాల్లో ఎంతటి కల్లోలం సృష్టిస్తున్నదో తెలియడానికి శనివారం చోటుచేసుకున్న నాగాలాండ్ నరమేథమే తార్కాణం. ఆ రాష్ట్రంలోని మోన్ జిల్లాలో 13మంది పౌరులు, ఒక జవాను మరణించడానికి దారి తీసిన ఈ ఉదంతం అత్యంత విషాదకరమైనది. వాహ నంలోని వారిని తిరుగుబాటుదారులుగా పొరబడి కాల్పులు జరిపామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ నేర తీవ్రతను తగ్గించలేదు. వారి ప్రకటన ప్రకారం నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ –ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)లోని చీలిక వర్గం తిరుగుబాటుదారులు ఫలానా వాహనంలో వస్తున్నారని నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దాని ఆధారంగా కాల్పులు జరిపామని సైన్యం అంటున్నది. తిరుగుబాటుదారుల గురించి అంత ఖచ్చితమైన సమాచారం అందించిన నిఘా సంస్థకూ, దాన్ని విశ్వసించిన సైన్యానికీ సమీపంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ రోజూ అదే సమయా నికి వాహనంలో కూలీలు వెళ్తారన్న ఇంగితం లేకపోవడం, జాగరూకతతో వ్యవహరించాలన్న స్పృహ కొరవడటం క్షమార్హంకాదు. పద్ధతిగా అయితే ఇలాంటి దాడుల సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. కానీ, అక్కడ కార్యకలాపాలు చూసే అస్సాం రైఫిల్స్‌కు కూడా చెప్పకుండా సైన్యంలోని ఒక ఎలైట్ యూనిట్ తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడిందని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. బలగాలమధ్య సమన్వయం లేదని దీన్నిబట్టి అవగతమవుతోంది. అసలు సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీరుతెన్నులనే ఈ ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఆ వాహనంలో నిజంగా తిరుగుబాటుదారులే వెళ్తున్నా అచ్చం వారి మాదిరే పొంచివుండి దాడి చేయాలనుకోవడం సరికాదు. గత నెలలో మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్‌నూ, మరో ఆరుగురినీ తిరుగుబాటుదారులు బలితీసుకున్ననాటినుంచీ సూత్రధారుల కోసం గాలింపు మొదలైంది. తిరుగుబాటుదారులను సజీవంగా పట్టుకుంటేనే ఆ అధికారి మరణానికి కారకులెవరో, వారి కార్యకలాపాలేమిటో తెలిసేది. అందుకు భిన్నంగా పొంచివుండి హఠాత్తుగా గుళ్ల వర్షం కురిపించడం వల్ల దేశ భద్రతకు కలిగే ప్రయోజనమేమిటి? కాస్తయినా ఆలోచించారా? వాహ నాన్ని ఆపడానికి బలగాలు ప్రయత్నించాయని, కానీ వారు ‘పారిపోయే ప్రయత్నం’ చేయడంతో అందులో తీవ్రవాదులు వెళ్తున్నారని భావించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన హేతుబద్ధంగా లేదు. తీవ్రవాదులు వాహనంలో ఉండుంటే మారణాయుధాలతో దాడికి దిగరా? వాహనం ఆపనంత మాత్రాన అందులో తీవ్రవాదులే ప్రయాణిస్తున్నారన్న నిర్ధార ణకు రావడం సబబేనా? నాగాలాండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఘటన జరిగాక మృతదేహాలపై ఉన్న దుస్తులను తొలగించి, ఖాకీ దుస్తులు వేసేందుకు బలగాలు ప్రయత్నించాయని ఆ దర్యాప్తు చెబుతోంది. మరణించినవారు తీవ్రవాదులని కట్టుకథలల్లడానికి ఈ పని చేశారా అన్నది తేలాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీపీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం. కానీ బీజేపీ నేతలకే అక్కడ రక్షణ కరువు! ఘటనాస్థలికి బీజేపీ జెండాతో వెళ్తున్న తమ వాహనంపై కూడా బలగాలు కాల్పులు జరిపి, ఒకరి ప్రాణం తీశాయని, మరో ముగ్గురు గాయపడ్డా రని మోన్ జిల్లా బీజేపీ నేత అంటున్నారు. ఇదంతా వింటుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నామా అనే సందేహం రాకమానదు తీవ్రవాదాన్ని అదుపు చేయడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం. మయ న్మార్కూ, చైనాకూ కూతవేటు దూరంలో ఉండే నాగాలాండ్ వంటిచోట అది మరింత అవసరం. కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చట్టాలు ఉండకూడదు. రాజ్యాంగంలోని అధికరణలను సైతం అపహాస్యం చేసేలా సైన్యానికి అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం ఈ పోకడే పోతోంది. పర్యవసానంగా ఇది అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన సాగుతూనే ఉంది. అక్రమ నిర్బం ధాలు, అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు, మనుషుల్ని మాయం చేయడం వంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ ఘటనలపై 2013లో దర్యాప్తు చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్ సాయుధ బలగాల చట్టం అశాంతికి కారణమవుతున్నదని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధ చర్య లకు పాల్పడిన భద్రతా బలగాలకు ఏ రక్షణా ఉండబోదని సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఆ చట్టాన్ని రద్దు చేయాలని 2005లో సూచించింది. నిర్భయ ఉదం తంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నివేదిక సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయినా ఆనాటి యూపీఏ సర్కారుకు పట్టలేదు. అది జరిగితే భద్రతా బలగాల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందన్నదే ప్రభుత్వాల వాదన. మరి పౌరుల నైతిక స్థైర్యం సంగతేమిటి? నాగాలాండ్ ఉదం తంలో కారకుల్ని శిక్షిస్తామని సైన్యం అంటున్నది. కేంద్రం కూడా హామీ ఇస్తోంది. మంచిదే. కానీ ఇన్ని దశాబ్దాలుగా ఎంతమందిని శిక్షించారు... లెక్కలు తీస్తారా? సాయుధ బలగాల (ప్రత్యేకాధి కారాల) చట్టం అమల్లో ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. చట్టం రద్దు చేయాలన్న నాగాలాండ్, మేఘాలయ సీఎంల తాజా డిమాండ్ ముమ్మాటికీ సబబే. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. -
జీవనయానం వలస ప్రయాణం
చరిత్ర గురించి చాలా నిర్వచనాలే ఉండొచ్చు. స్థూలంగా మానవుల వలస పరిణామాన్ని నమోదు చేసే కథనమే చరిత్ర. వలసలు లేకుండా మానవాళికి మనుగడ లేదు. చరిత్ర అంతా వలసల మయమే! ప్రకృతి సానుకూలత లేని ప్రదేశాలను విడిచిపెట్టి, సురక్షిత ప్రదేశాలకు వలస వచ్చిన మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు నాగరికతలు ఏర్పడ్డాయి. నాగరికతల పరిణామ క్రమంలో స్థిర నివాసాల సంస్కృతి వ్యాప్తిలోకి వచ్చినంత మాత్రాన మనుషుల వలసలు ఆగిపోలేదు. ప్రకృతి బీభత్సాల నుంచి, యుద్ధాల నుంచి, నియంతృత్వ పీడనల నుంచి, కరవు కాటకాల నుంచి వీలైనంత దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవడానికే మనుషులు ప్రయత్నిస్తారు. పుట్టిపెరిగిన చోట చాలీచాలని బతుకులను బలవంతంగా నెట్టుకొచ్చే కంటే, ఎంత దూరమైనా వెళ్లి బతుకులను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మెరుగైన జీవితాల కోసం మనుషులు తాము పుట్టి పెరిగిన ప్రదేశాలను విడిచిపెట్టి, దేశాలను దాటి వలసలు వెళుతూనే ఉన్నారు. వలసలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. భూమ్మీద మనుషులే కాకుండా, జలచర ఖేచరాదులు కూడా సానుకూల పరిసరాలను వెదుక్కుంటూ సుదూర ప్రదేశాలకు వలస వెళతాయి. ఇప్పుడు మన దేశంలో వలసపక్షుల కాలం మొదలైంది. ఖండాంతరాలను దాటి శరదృతువులో ఇక్కడకు చేరుకునే నానాజాతుల పక్షులు వసంత రుతువు వరకు ఉంటాయి. మనుషుల వలసలకు, పక్షుల వలసలకు తేడాలున్నాయి. మనుషులకు తాము పుట్టి పెరిగిన ప్రదేశం కంటే వలస వచ్చిన ప్రదేశమే సురక్షితంగా, తమ అభివృద్ధికి భేషుగ్గా ఉన్నట్లయితే, అక్కడే స్థిరపడిపోయి, తరతరాలుగా పాతుకుపోతారు. పాపం, పక్షులు అలా కాదు. వాటి వలసలన్నీ కేవలం రుతుధర్మాన్ని అనుసరించే సాగుతాయి. వలసల్లో పక్షుల క్రమశిక్షణ తిరుగులేనిది. కచ్చితంగా నిర్ణీత కాలానికి వస్తాయి.æఅంతే కచ్చితంగా నిర్ణీత కాలానికి తమ తమ నెలవులకు తిరిగి వెళ్లిపోతాయి. మనుషుల మాదిరిగా ఆస్తులు కూడబెట్టుకుని, శాశ్వతంగా ఉండిపోవాలనుకోవు. శరదృతువు ఆగమనంతోనే మన దేశంలోని ప్రధానమైన సరస్సుల వద్ద వలసపక్షుల సందడి మొదలవుతుంది. ఒడిశాలోని చిలికా, ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్, కొల్లేరు, గుజరాత్‌లోని నలసరోవర్, కేరళలోని కుమరకోమ్ వంటి సరస్సుల వద్దకు, పశ్చిమబెంగాల్లోని సుందర్బన్, అరుణాచల్‌లోని ఈగల్నెస్ట్ వంటి అభయారణ్యాలకు వందలాది జాతులకు చెందిన లక్షలాది వలస పక్షులు వస్తాయి. ధ్రువప్రాంతంలోని శీతల వాతావరణానికి దూరంగా, కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలకు ఈ పక్షులు వలస వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. పిల్లలకు రెక్కలు రాగానే, వాటితో కలసి వేసవి మొదలవుతుండగా తిరిగి వెళ్లిపోతాయి. వలసల్లో మనుషుల పద్ధతి కాస్త భిన్నం. తరతరాల కిందట మన దేశం నుంచి వలసవెళ్లిన మనవారు వివిధ దేశాల్లో పూర్తిగా స్థిరపడిపోయారు. కొన్ని దేశాల్లో అధికార పదవులనూ దక్కించుకున్నారు. అలాగని వలసలన్నీ సుఖప్రదమైన ప్రయాణాలు కావు. పక్షులకైనా, మనుషులకైనా వలసల్లో ఆటుపోట్లు, అడుగడుగునా ప్రమాదాలూ తప్పవు. ప్రకృతి వైపరీత్యాల నుంచి వలసపక్షులకు మార్గమధ్యంలో ఆపదలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ అధిగమించి సానుకూల వాతావరణంలోకి వలస వచ్చి, గూళ్లు ఏర్పాటు చేసుకున్నా, వాటి మనుగడకు పూర్తి భద్రత ఉండదు. వేటగాళ్ల వలలకు, ఉచ్చులకు చిక్కి బలైపోతుంటాయి. ఇన్ని కష్టనష్టాల తర్వాత ప్రాణాలతో మిగిలినవి మాత్రమే తిరిగి తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోగలుగుతాయి. బతుకుతెరువు కోసం వలస వెళ్లే మనుషుల పరిస్థితీ అంతే! ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులు దళారుల చేతిలో మోసపోయి, వెట్టి చాకిరి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. అనుకోని దుర్ఘటనల్లో అయినవారికి దూరంగా ప్రాణాలు పోగొట్టుకునే ఉదంతాలూ ఉన్నాయి. మంచు గడ్డకట్టే శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు ఏకకణ జీవి అమీబా మొదలుకొని, క్షీరదమైన మంచు ఎలుగుబంటి వంటి జీవులు శీతాకాలమంతా ఉన్న చోటనే కదలకుండా పడిఉండి సుప్తావస్థలో గడుపుతాయి. నిత్యచైతన్యశీలత కలిగిన పక్షులు ఇలా సుప్తావస్థలోకి జారుకోలేవు. అందుకే తమ స్వేచ్ఛా విహారానికి తగిన మెరుగైన పరిసరాలను అన్వేషిస్తూ వలసలు ప్రారంభిస్తాయి. వాతావరణం ఎంత ప్రతికూలంగా మారినా, ఎక్కడికక్కడే ఉండిపోయి సుప్తావస్థలోకి జారుకోవడం స్తబ్ధతకు పరాకాష్ఠ! ఇలాంటి స్తబ్ధత కొందరు మనుషుల్లోనూ ఉంటుంది. పరిస్థితుల్లోని మార్పులకు స్పందించకుండా, ఎలాంటి కదలికా లేకుండా శీతలనిద్రలోకి జారుకునే మనుషులు చరిత్ర ప్రవాహంలో ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోతారు. బలమైన ఆకాంక్షలతో వలసల బాట పట్టిన సమూహాలు, వ్యక్తులు చరిత్రగతిని మార్చేసిన ఉదంతాలు మనకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చిన సమూహాలు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని, శతాబ్దాల తరబడి పాలన సాగించాయి. స్థానికులపై నిర్దాక్షిణ్యంగా అణచివేత సాగించాయి. ఉన్నత విద్య కోసం బ్రిటన్‌కు, ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన గాంధీజీ, తన వలస ప్రస్థానాన్ని స్వాతంత్య్రోద్యమానికి పునాదిగా మలచుకున్నారు. శ్వేతజాతీయుల వలస ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తే, గాంధీజీ వంటి జాతీయ నాయకుల వలస ఈ దేశ స్వాతంత్య్రానికి ఊపిరిపోసింది. అన్ని ప్రయాణాల్లో మాదిరిగానే వలసల్లోనూ ప్రమాదాలు అనివార్యం. అంతమాత్రాన వలసలు ఆగిపోవు, చరిత్రా ఆగిపోదు! -
షేడ్స్ ఆఫ్ రెడ్!
మనం జనజీవన స్రవంతిగా పిలుచుకునే లోకంలో ఆర్కే అనే పేరు అంత సుపరిచితమైనదేమీ కాదు. అధికార పదవుల్లో చక్రం తిప్పిన వ్యక్తి కాదు. వ్యాపారాలు చేసి వేలకోట్ల టర్నోవర్ సాధించడం వంటి ఘనతలేమీ లేవు. చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం వారిచ్చే ‘పద్మశ్రీ’ బిరుదు రాలేదు. ప్రైవేట్‌వాళ్లు బహూకరించే ‘సేవారత్న’ కూడా లేదు. జీవన సాఫల్య పుర స్కారం లేనేలేదు. అయినప్పటికీ ఆయన మరణవార్తకు తెలుగు మీడియా తగిన ప్రాధాన్యమిచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక స్కూల్ టీచర్ పెద్దకొడుకు అక్కిరాజు హరగోపాల్ ఉరఫ్ ఆర్కే. వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం ఎన్ఐటీ)లో ఇంజనీరింగ్ చదివాడు. అప్పట్లో తెలి వైన విద్యార్థులకే ఇంజనీరింగ్‌లో సీటు దొరికేది. ఆర్ఈసీలో ఆ సీటు సంపాదించడమంటే మరింత నాణ్యమైన సరుకని అర్థం. ‘జనజీవనస్రవంతి’లోనే అతను కొనసాగి ఉన్నట్లయితే ‘నాణ్య మైన’ జీవితాన్నే గడిపి ఉండేవాడు. జీవన సాఫల్య పురస్కారా ల్లాంటివి కూడా లభించి ఉండేవేమో! ఆ రోజుల్లో ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులపై కమ్యూనిస్టు తీవ్రవాద భావజాల ప్రభావం బలంగా ఉండేది. చేగువేరా వేగుచుక్కలా కనిపించేవాడు. జార్జిరెడ్డి ఆదర్శం ఉత్తే జితం చేసేది. వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆ బాట వెంట పయనమయ్యారు. ఉద్యోగాలు, విలాసవంత మైన జీవితావకాశాలను తృణప్రాయంగా వదిలేశారు. వారిలో ఆర్కే ఒకరు. సమష్టిగా ప్రజలందరికీ చెందవలసిన భూమి, ప్రకృతి, సహజ వనరులపై కొందరి పెత్తనమేమిటనే ప్రశ్నలోంచే కమ్యూ నిస్టు సిద్ధాంతం పుట్టింది. ఆ కొంతమంది వ్యక్తుల ‘దోపిడీ’ కారణంగానే అత్యధిక ప్రజానీకం పేదరికంలో మగ్గవలసి వస్తున్నదని అది నిర్ధారించింది. అటువంటి ‘దోపిడీ వ్యవస్థ’ను కూలదోసి, సమసమాజాన్ని ఏర్పాటుచేసే మార్గాలను ఉపదేశిం చింది. అనుసరించవలసిన ఆ మార్గాలపై ఏర్పడిన భిన్నాభిప్రా యాల ఫలితంగా పార్లమెంటరీ కమ్యూనిస్టులూ, విప్లవ కమ్యూనిస్టులుగా చీలిపోయారు. ఈ రెండు భాగాల్లోనూ మరో రెండు డజన్లకు పైగా చీలికలున్నాయి. విప్లవ కమ్యూనిస్టుల్లో ప్రధాన పాయగా ఉన్న మావోయిస్టు పార్టీలో ఆర్కే పొలిట్ బ్యూరో సభ్యుడు. తెలంగాణ నుంచి బెంగాల్ వరకు 8 రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల పాటు మావోయిస్టులకు, ప్రభుత్వాలకు మధ్య నడుమ యుద్ధం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జీవితాలు కల్లోలిత మయ్యాయి. వేలాదిమంది ప్రజలు, పోలీసులు, విప్లవకారులు ఈ కల్లోలానికి బలయ్యారు. మావోయిస్టులు – ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలు జరిగితే ఈ హింసాకాండను కొంతమేరకు కట్టడి చేయొచ్చని కొందరు తటస్థ మేధావులు భావించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఆ చర్చల సమ యంలోనే ఆర్కే మీడియా దృష్టిని ఆకర్షించారు. చర్చల్లో మావోయిస్టు బృందానికి నాయకత్వం వహించారు. ఫలితంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లోకి అందరికంటే ఎక్కువ మీడియా సంపర్కం ఆర్కేకు ఏర్పడింది. ఆయన ఫొటోలు, జీవిత విశే షాలు మీడియా వద్ద సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన వివరాలను మీడియా ప్రజలకు తెలియజేయగలిగింది. ఆర్కే మరణవార్త మావోయిస్టు పార్టీ స్థితిగతులపై చర్చను రేకెత్తిస్తుంది. ఆ చర్చ కమ్యూనిస్టు మూలసిద్ధాంతాలను కూడా తడుముతుంది. ప్రస్తుత ప్రపంచంలో, మన దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ సిద్ధాంతాలు ఏ మేరకు నప్పుతాయనే అంశం కూడా చర్చల్లోకి రాకుండా ఉండదు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకొని వందేళ్లయింది. వందేళ్లలో సమాజంలో అసమానతలు తగ్గాయా? తగ్గలేదు పెరిగాయని స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు సాక్ష్యాధారాలతో లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ఉమ్మడి సంపద ఎంత ఉంటుందో ఒక్క శాతం కుబేరుల సంపద అంతకంటే ఎక్కువగా ఉందట. మన దేశంలో 119 మంది బిలియనీర్ల సంపద 130 కోట్ల మంది తలరాతలు రాసే భారతదేశ వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువట. కనీస వేతనంపై పనిచేసే ఒక కార్మికుడు మన దేశంలోని ఒక కార్పొరేట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ సంపాదించినంత డబ్బు సంపాదించాలంటే 941 ఏళ్ళ పాటు పనిచేయాలట. కోవిడ్ తర్వాత ఈ అసమానతలు మరింత పెరిగాయి. ఆక్స్‌ఫామ్ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంక్షోభంలో కోల్పోయిన సంపదను కుబేరులు ఇప్పటికే భర్తీ చేసుకున్నారు. మెజారిటీ పేదవర్గాల ప్రజలు కోలుకోవడానికి మాత్రం ఇంకో పదేళ్లయినా పడు తుందట. అసమానతలు మరింత పెరిగే విధానాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలవుతున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమ లను ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి కారుచౌకగా కట్ట బెడు తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచు కున్న ప్రబుద్ధులను విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తు న్నారు. లేదా రాజ్యసభ సభ్యత్వమిచ్చి సత్కరిస్తున్నారు. రైతు లకు అండగా ఉన్న భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారు. కార్మికులతో 12 గంటలపాటు పని చేయించుకు నేందుకు అనువుగా లేబర్ చట్టాలను మార్చారు. ఉద్యోగ భద్రత ఊసు మాత్రం అందులో లేదు. రైతులు ససే మిరా అంటున్నా వినకుండా వ్యవసాయ చట్టాలను మోసు కొచ్చారు. ఈ చట్టాల అంతిమ ధ్యేయం మెజారిటీ రైతులను వ్యవసాయరంగం నుంచి వెళ్లగొట్టడమేనని నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను జీపుతో తొక్కించి నాలుగు నిండు ప్రాణాలు తీశాడు ఓ కేంద్ర మంత్రి కుమారుడు. ఇప్పటికీ సదరు కేంద్ర మంత్రి పదవిలోనే కొన సాగుతున్నాడు. వారం రోజులపాటు మీనమేషాలు లెక్కించి గానీ అతడి కుమారుడిని అదుపులోకి తీసుకోలేదు. అదే, మైనా రిటీ మతస్థుడైన సూపర్‌స్టార్ కొడుకు విషయంలో ఆగమేఘాల మీద చట్టం తన పని తాను చేసుకొనిపోయింది. జాతీయస్థాయి ప్రత్యామ్నాయంగా రూపొందడానికి వామ పక్ష రాజకీయాలకు అనువైన కాలమిది. కానీ దేశంలో మావోయి స్టులతో సహా కమ్యూనిస్టు పార్టీలన్నీ అవసానదశకు చేరుకుం టున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యూహాల్లోనూ, ఎత్తుగడ ల్లోనూ ఆ పార్టీలు దశాబ్దాలుగా విఫలమవుతూనే వస్తున్నాయి. అదే పరంపర ఇప్పుడూ కొనసాగుతున్నది. కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ లాంటి యువ నాయకులను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్‌కు ఎర్రరంగు పులమాలని రాహుల్ గాంధీ ఉత్సాహ పడుతున్నారు. కానీ మధ్యేవాదమే కాంగ్రెస్ బలమనే చరిత్ర పాఠాన్ని ఆయన అర్థం చేసుకోలేదు. ఫలితంగా మత శక్తుల ప్రాబల్యం పెరిగినప్పుడు కాషాయరంగు పూసుకోవడం, వాటికి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు ఎర్రరంగు కోసం వెతకడం వంటి ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. జాతీయస్థాయి ప్రత్యామ్నా యంగా నిలబడగలిగే అవకాశాలను ఆయనే స్వయంగా దెబ్బతీసుకుంటున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరంటే ప్రాంతీయ పార్టీలే. ఇదొక విచిత్ర పరిస్థితి కానీ యథార్థం. ఇప్పుడు కేంద్ర విధానాలపై గొంతు విప్పుతున్నది ప్రాంతీయ పార్టీలే. తాజా విద్యుత్ సంక్షోభంలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వా తనే జాతీయ ప్రతిపక్ష నేతలు మేల్కొన్నారు. ఇప్పుడు అధి కారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తున్నాయి. నిఖార్సయిన లౌకిక విధానాలను అవలంబిస్తున్నాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాలను సాధికార శక్తులుగా మలిచేందుకు తరతమ తేడాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో అందరి కంటే ముందున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పైసా ఖర్చు లేకుండా ఉన్నతస్థాయి వరకూ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఒక విప్లవానికి ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉన్నతస్థాయి ప్రైవేట్ స్కూళ్లలో ఉండే వసతులను అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్య క్రమంలో ఇప్పటికే ఒక దశ పూర్తయింది. ప్రతి క్లాస్‌కూ ఒక టీచర్, ప్రాథమికోన్నత స్థాయి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ఒక టీచర్ ఉండేవిధంగా ఏర్పాటు చేసింది. మాతృభాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లిషును ప్రాథమిక స్థాయి నుంచే బోధనాభాషగా ప్రవేశపెట్టింది. ఫలితంగా రాబోయే తరం పేద విద్యార్థులు నిండైన ఆత్మవిశ్వాసంతో సంపన్నుల పిల్లలతో సమాన స్థాయిలో పోటీపడి నెగ్గగలుగు తారు. విజేతలు కాగలుగుతారు. సాధికార శక్తులుగా తమను తాము నిర్మించుకోగలుగుతారు. అప్పుడు వనరుల అసమాన పంపిణీ వ్యవస్థను వారు సవాల్ చేయగలరు. ఒక ప్రత్యా మ్నాయ సంస్కృతిని నిర్మించగలరు. ప్రభుత్వ వైద్య రంగంలో సోషలిస్టు క్యూబాను తలపించే విధమైన విస్తరణనూ, ఆధునికీకరణనూ ప్రభుత్వం ప్రారం భించింది. ప్రతి కుటుంబాన్నీ, ప్రతి రోగినీ నెలలో ఒకసారైనా వైద్యుడే స్వయంగా వారివద్దకే వెళ్లి పలకరించే ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. ఇది జనవరి 26 నుంచి అమలులోకి రావాలని ఆయన ఆశిస్తున్నారు. అట్లాగే వ్యవసాయ రంగం కూడా. ఒక విప్లవాన్ని ప్రసవించ బోతున్నది. ఊరూరా నెలకొంటున్న ఆర్బీకే సెంటర్లే ఈ ప్రస వానికి మంత్రసానులు. చిన్న రైతును స్వయంపోషకం గావించ గలిగే మహత్తర సామర్థ్యంతో ఆర్బీకే సెంటర్లు పనిచేయ నున్నాయి. నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి వ్యవసాయ ఆహార విభాగం ఉన్నతాధికారులు, ఏపీ అధికారులను పిలిపించుకొని మరీ ఆర్బీకేల ప్రజంటేషన్ తిలకించారు. హర్షధ్వానాలు చేశారు. సగం జనాభాగా ఉన్న మహిళా శక్తిని ఎంపవర్ చేయడాన్ని ఒక అతి ప్రాధాన్యాంశంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దేశిం చుకున్నది. చంద్రబాబు వాగ్దాన భంగం వల్ల మరణావస్థకు చేరిన ‘మహిళా పొదుపు సంఘా’లను ఈ ప్రభుత్వం పునరు జ్జీవింపజేసింది. నడివయసు మహిళలకు అండగా నిలబడి, వారు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి నామినేషన్ పదవుల్లోనూ, పనుల్లోనూ రిజర్వేషన్ కల్పిం చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలను సాధికారిక శక్తులుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఏ విధంగా ఉండాలి? పేద వర్గాల పట్ల అనుకూలంగా కదా ఉండవలసింది! ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టు పార్టీల్లో ముఖ్యంగా ఒక పార్టీ వైఖరి ఆశ్చర్యం గొలుపుతున్నది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన రాజధాని భూసమీకరణలో దాగివున్న కుంభకోణాన్ని అంగీకరించడానికి ఈ పార్టీ నిరాకరిస్తున్నది. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒడంబడికలో ఇమిడి ఉన్న దుర్మార్గమైన అంతర్జాతీయ స్కామ్‌ను అంగీక రించడానికి తటపటాయిస్తున్నది. పైపెచ్చు తెలుగుదేశం పార్టీతో కలిసి రాజధాని ఉద్యమాన్ని మొదలుపెట్టింది. రైతులూ, డ్వాక్రా మహిళల పట్ల చంద్రబాబు వాగ్దాన భంగాన్ని విస్మరిస్తున్నది. మహిళలూ, బలహీన వర్గాల పట్ల బాబు వ్యతిరేక వైఖరి పలుమార్లు బహిరంగంగా వ్యక్తమైనప్పటికీ ఆ పార్టీ తప్పు పట్టలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం వరస మారింది. ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజానుకూల కార్యక్రమాలను చూడటానికి నిరాకరిస్తూ కళ్ళు మూసుకుంది. అలా వాల్చిన కనురెప్పల మాటున వారికొక గొప్ప సత్యం సాక్షాత్కరించింది. డ్రగ్స్ మాఫియాతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సంబంధం ఉందట. బట్టకాల్చి మీద వేసినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన అడ్డగోలు ఆరోపణ ఇది. దాన్నే మన కామ్రేడ్ నారాయణ ‘కోరస్’గా అందుకున్నారు. కమ్యూనిస్టులు కూడా నిరాధా రమైన ఎంగిలి ఆరోపణలు చేయవచ్చునా? ఒక్క వర్షానికే కొట్టుకొనిపోయే రోడ్లువేసి కాంట్రాక్టర్ల జేబులు నింపడాన్ని అభివృద్ధిగా గుర్తించి, సకలజన సాధికారతా యజ్ఞాన్ని గుర్తించక పోవడం ఒక జన్యు లోపంగా పరిగణించవలసి ఉంటుంది. 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్లు కట్టించే బృహ త్తరమైన మానవీయ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రారం భించింది. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు కోర్టుకెక్కించి ఆపించాడు. ఇది తప్పని కామ్రేడ్ నారాయణకు తోచకపోవడం చిత్రం. తాకట్టు గురించి ఆయన మాట్లాడిన తీరు ఆయన పట్ల చాలా అనుమానాలకు తెరతీసింది. ఆస్తుల తాకట్టు సంగతేమో గానీ సిద్ధాంతాలను తాకట్టుపెట్టడం అత్యంత హేయమైన విష యమని గ్రహిస్తే మంచిది. వైఖరి మార్చుకొని వెంటనే ప్రజల పక్షాన నిలబడకపోతే ఒక మహత్తర చరిత్ర కలిగిన పార్టీని భ్రష్టు పట్టించిన వాళ్లవుతారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మానవహక్కులు–భాష్యాలు
మానవహక్కులను కొందరు రాజకీయ దృక్కోణంలోనుంచి చూస్తున్నారని...అందువల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చేసిన వ్యాఖ్యపై విస్తృతంగానే చర్చ నడుస్తోంది. ఒకచోట ఏ చిన్న ఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించే కొందరు ఆ మాదిరి ఘటనలే మరోచోట చోటుచేసుకుంటే మౌనంవహిస్తారన్నది ఆయన ఆరోపణల సారాంశం. ప్రధాని ప్రస్తావించిన అంశాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మరికొంత విశదీకరించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమను తాము దళిత హక్కుల చాంపియన్లుగా చెప్పుకుంటూ రాజస్థాన్‌లోనూ, కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ దళితులపై సాగుతున్న అత్యా చార ఘటనల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు కొత్త కావొచ్చు గానీ... మన దేశంలోనూ, వేరే దేశాల్లోనూ హక్కుల సంఘాలు ఏదో ఒక దశలో పక్షపాత ఆరోప ణలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల సంఘంలో చీలిక కూడా వచ్చింది. అధికార, విపక్షాల నడుమ సాగే వ్యాగుద్ధాల్లో ఇది వినబడటం తాజా పరిణామం. ఈమధ్య ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేడిలో రైతు ఉద్యమనేతలను పట్టపగలు వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఈ నెల 1, 7 తేదీల్లో రాజస్థాన్‌లో దళితులపై అత్యంత అమానుషంగా జరిగిన దాడి ఘటనలను మరుగుపరుస్తున్నదని బీజేపీ చేసిన వ్యాఖ్య కొట్టిపారేయదగ్గది కాదు. ఈ ఉదంతాల్లో కేసులు నమోదుచేశామని, నిందితు లను అరెస్టు చేశామని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నా అక్కడ తరచుగా దళితులపై, మైనారిటీలపై సాగుతున్న దాడులను నిలువరించలేకపోవటం ఆ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే. ఏటా డిసెంబర్ 10న మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1948లో ఐక్య రాజ్యసమితి పిలుపునిచ్చింది. దారిద్య్రం అత్యంత అమానుషమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించింది. తర్వాత ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక మార్గదర్శకాలు రూపొందుతూ వచ్చాయి. ఈలోగా హక్కులు కాలరాసే ప్రభుత్వాల తీరుపై పలు దేశాల్లో ఉద్యమాలు బయల్దేరాయి. పాలకు లపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. మన దేశంలో 60వ దశకం చివరిలో హక్కుల ఉద్యమాలు మొగ్గతొడి గాయి. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వ ఆగడాలు, బోస్నియా, రువాండా, బురుండీ, అంగోలా వంటిచోట్ల సాగిన నరమేథాలు, తూర్పు యూరప్ దేశాల్లో హక్కుల ఉల్లంఘనలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేశాయి. ఆ తర్వాతే ప్రపంచ దేశాలన్నీ వ్యవస్థాగతమైన, తటస్థమైన మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని 1991లో పారిస్‌లో జరిగిన మానవహక్కుల సదస్సు పిలుపునిచ్చింది. దీన్ని 1993లో ఐక్యరాజ్య సమితి కూడా ధ్రువీకరించాక అనేక దేశాల్లో మానవ హక్కుల సంఘాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఆచరణలో సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఉపయోగపడిన దాఖలా లేదు. వీటికి నామమాత్ర అధికారాలులిచ్చి, లాంఛనప్రాయం చేసిన ప్రభుత్వాలే ఇందుకు కారణం. ఆ సంఘాలకు చేసే నియామకాలు కూడా అసంతృప్తినే మిగులుస్తున్నాయి. మన దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరంగా జరిగే లోటుపాట్లను వేలెత్తి చూపేందుకు, సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ఏర్పాటైనా యేటా ఈ సంఘాలు ఇచ్చే నివే దికలనూ, వివిధ సందర్భాల్లో ఇవి చేసే సిఫార్సులనూ ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడంలేదు. వాటి అమలుకు తిరిగి న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సివస్తోంది. మానవ హక్కుల సంఘాలు చేసే సిఫార్సులు అమలుపరిచి తీరవలసినవా కాదా అనే అంశంపై చాన్నాళ్లుగా అయోమయం ఉంది. మానవ హక్కుల సంఘాల అధికారాలు, విచారణలు న్యాయపరమైన కార్యకలాపాలుగానే పరిగణిం చాలని, వాటికి సివిల్ కోర్టులకుండే అధికారాలుంటాయని సుప్రీంకోర్టు వేరే సందర్భంలో చెప్పినా పరిస్థితి పెద్దగా మారలేదు. మానవహక్కుల సంఘాలు చేసే సిఫార్సులకు మానవహక్కుల చట్టం సెక్షన్ 18 ఇస్తున్న భాష్యంపై ఇన్నేళ్లయినా సుప్రీంకోర్టుతోసహా దేశంలోని ఏ న్యాయస్థానమూ సంది గ్ధతకు తావులేని విధంగా తీర్పులు వెలువరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు ఫుల్ బెంచ్ ఆ పని చేసింది. సెక్షన్ 18 మానవ హక్కుల సంఘాలకు తిరుగులేని అధికారాలిస్తోందని తేల్చిచెప్పింది. ఈ చట్టం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు తగిన సవరణలు అవసరమని సూచించింది. దానిపై కేంద్రం ఇంతవరకూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మానవ హక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు ఆ సంఘాల పటిష్టతపై చర్చ జరిగితే, వాటికి విస్తృతమైన అధికారాలు కల్పించే దిశగా చర్యలుంటే బాగుండేది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప లఖింపూర్ ఖేడి ఘటనలో ప్రధాన బాధ్యుడని ఆరోపణలొచ్చిన కేంద్ర మంత్రి కుమారుణ్ణి యూపీ పోలీసులు అరెస్టు చేయలేని దుస్థితి నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో ఆ సంఘాల బలోపేతాన్ని కోరుకోవడం దురాశే కావొచ్చు. మీ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా... మా ఏలుబడి ఉన్నచోట్ల ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా అని రాజకీయ పక్షాలు వాదులాడుకుంటే, సవాళ్లు విసురుకుంటే, మానవ హక్కులకు ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకుంటే నిజంగానే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారుతుంది. ముఖ్యంగా మానవహక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు అలాంటి వాదనలు అప్రస్తుతం. అందుకు బదులు మానవహక్కుల పటిష్టతకు సమష్టిగా ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే సాధారణ పౌరులకు మేలు కలుగుతుంది. -
China: జగమొండి డ్రాగన్
ఒకటి కాదు... రెండు కాదు. తాజాగా ఆదివారం భారత, చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగినవి – ఏకంగా 13వ విడత చర్చలు. తొమ్మిది గంటల పాటు ఉన్నతస్థాయి చర్చల తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో ఒక్క అంగుళమైనా పురోగతి లేదు. తప్పంతా అవతలివాళ్ళదే అన్నది ఇరుపక్షాల వాదన. వివాదాస్పదమైన కొన్ని కీలక ప్రాంతాలపై పరిష్కారం కోసం ‘నిర్మాణాత్మక సూచన’లిచ్చామనీ, చైనా ‘అంగీకరించలేద’నీ భారత సైన్యం సోమవారం ఉదయం ప్రకటించింది. చైనా మటుకు భారత్ ‘అసంబద్ధమైన, అవాస్తవిక డిమాండ్లు చేస్తోంద’ని ఆదివారం రాత్రే ఆరోపించింది. వెరసి ప్రతిష్టంభన కొనసాగుతోంది. గమనిస్తే, డ్రాగన్ మంకుపట్టుతో వరుసగా రెండో ఏడాది, ఈ రానున్న చలికాలంలోనూ తూర్పు లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ సైనిక మోహరింపులు తప్పవు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట ఆక్సిజన్ కూడా అందని చోట, మైనస్ 30 డిగ్రీల గడ్డ కట్టే చలిలో 50 వేల మంది భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి, పహారా కాయక తప్పదు. శత్రువుల చొరబాట్లు లేకుండా కళ్ళలో ఒత్తులేసుకొని, సరిహద్దులను కాపాడకా తప్పదు. 2020 మే నెలలో చైనా బలగాలు తమ వార్షిక విన్యాసం కోసం టిబెటన్ పీఠభూమి ప్రాంతానికి వచ్చాయి. కానీ, చైనా ఆ బలగాలను తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వైపు మళ్ళించింది. దాంతో, సరిహద్దు వెంట కీలకమైన పీపీ15, పీపీ17ఏ అనే రెండు గస్తీ పాయింట్లలోనూ రెండు దేశాల సైనికులు ఎదురుబొదురయ్యాయి. భారత్‌తో ప్రతిష్టంభన నెలకొంది. అప్పటికే గాల్వన్ లోయలోని పీపీ14, పాంగ్‌గాంగ్ త్సో సరస్సు ఉత్తరపు ఒడ్డున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం ఈ 4 గస్తీ పాయింట్లలోనూ చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, మోహరించాయి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 1976లో చైనాపై ఉన్నతస్థాయి నిర్ణాయక బృందం ‘చైనా స్టడీ గ్రూప్’ (సీఎస్జీ) ఏర్పాటైంది. ఆ బృందమే ఈ గస్తీ పాయింట్లను నిర్ణయిస్తుంది. భారత, చైనాల మధ్య ఇప్పటికీ అధికారికంగా సరిహద్దులు నిర్ణయం కాని నేపథ్యంలో ఎల్ఏసీని చైనా బలగాలు దాటడం మునుపటి ఒప్పందానికి తూట్లు పొడవడమే! ఈ వివాద పరిష్కారం కోసం గత ఏడాది మే నుంచి ఇప్పటికి సంవత్సరం పైగా భారత, చైనాల మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో వరుసగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, నేటికీ అనేక సమస్యలకు పరిష్కారం సాధ్యం కాలేదు. ఆ మధ్య ఫిబ్రవరిలో పాంగాంగ్ త్సో ప్రాంతంలో, అలాగే ఆగస్టులో జరిగిన 12వ విడత చర్చల్లో గోగ్రా ప్రాంతంలోనూ బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. రెండు పక్షాలూ కలసి సంయుక్త ప్రకటన ఇచ్చాయి. కానీ, ఈసారి చర్చల్లో అలాంటి ఏ పురోగతీ లేదు. సంయుక్త ప్రకటనా లేదు. హాట్‌స్ప్రింగ్స్, దెమ్చోక్, దెప్సాంగ్ లాంటి అనేక ఘర్షణాత్మక ప్రాంతాలపై అంగుళమైనా ముందడుగు పడలేదు. పైపెచ్చు, రెండు వర్గాల మధ్య విభేదాలూ బాహాటంగా బయటపడ్డాయి. సరిహద్దుల్లో ఇటీవలి ఘటనలూ ఆ విభేదాలను స్పష్టం చేశాయి. తాజా విడత చర్చలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో జరిగిన సైనిక ఘర్షణ – చైనా సైనికులను కొన్ని గంటలు నిర్బంధించడం లాంటివి బయటకొచ్చాయి. చైనా వైపు నుంచి గతంలో గాల్వన్ లోయలో భారత సైనికుల నిర్బంధ చిత్రాలు లీకయ్యాయి. అలాగే, మరో విషయం. చర్చల తర్వాత అటువైపు నుంచి చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలు చేయడం సాధారణం. కానీ, గత కొన్ని విడతల చర్చల్లో చైనా సైన్యం ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’కి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఈ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. అంటే, చైనా ఈ చర్చలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న మాట. చర్చలు నత్తనడకన సాగుతున్నా డ్రాగన్ పట్టించుకోవడం లేదన్న మాట. ఘర్షణ కొనసాగినా సరే ఆ అగ్రరాజ్యానికి కావాల్సింది ఆధిపత్యమే తప్ప, సమస్యకు పరిష్కారం కాదన్న మాట. తాజా చర్చల్లో వైఫల్యంతో భారత భూభాగంపై చైనా కొనసాగుతోందనే మాట మళ్ళీ పైకొచ్చింది. సరిహద్దులోని వాస్తవ పరిస్థితిని దాచకుండా దేశానికి చెప్పాలంటూ కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు భారత ప్రధాని మోదీని ప్రశ్నించాయి. మరోపక్క భారత – చైనా సరిహద్దు ప్రాంతాల్లో అతి కష్టంపై ఈ మాత్రమైనా వెసులుబాటు దక్కినందుకు భారత్ సంతోషించాలంటూ చైనా కటువుగా మాట్లాడుతోంది. సైనిక అధికార ప్రతినిధి చేసిన ఆ అహంభావపూరిత ప్రకటనలో సామరస్యం కన్నా బెదిరింపు ధోరణే కనిపిస్తోంది. రాజు కన్నా మొండివాడు బలవంతుడట. మరి, ఏకంగా రాజులు, రాజ్యాలే మొండివాళ్ళయితే? చైనా అనుసరిస్తున్న వైఖరి అలాంటిదే. అగ్రరాజ్యం ఆ వైఖరిని మార్చుకుంటే... భారత సరిహద్దులో, తద్వారా ఉపఖండంలో శాంతి వెల్లివిరుస్తుంది. కానీ, చైనా లక్ష్యం మాత్రం వాస్తవాధీన రేఖను తమకు అనుకూలంగా ఏకపక్షంగా మార్చేసుకోవడమే. మరీ ముఖ్యంగా, దెప్సాంగ్ మైదానప్రాంతాల్లో ఆ పని చేయాలన్నది పొరుగు దేశం లోలోపలి ఆకాంక్ష. డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరే అందుకు సూచిక. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. మూసుకుపోని చర్చల ద్వారాన్ని తెరిచే ఉంచాలి. మలి విడత చర్చలకు సిద్ధమవుతూనే, చైనా ఆటలకు అడ్డుకట్ట వేసే వ్యూహరచన చేయాలి. మన భూభాగం అంగుళమైనా వదలకుండా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చే మార్గాలూ అన్వేషించాలి. కానీ, జగమొండి డ్రాగన్‌కు ముకుతాడు వేయడం మాటలు చెప్పినంత సులభమేమీ కాదు. అదే ఇప్పుడు అతి పెద్ద సవాలు. -
ముసురుకుంటున్న చీకట్లు!
కరెంట్ కోత, లైట్లు లేక కొవ్వత్తులతో కాలక్షేపం... ఒకప్పుడు నిత్యానుభవం. కొన్నేళ్ళుగా దూరమైన ఆ అనుభవం త్వరలోనే మళ్ళీ దేశమంతటా ఎదురుకాక తప్పేలా లేదు. వస్తున్న వార్తలను బట్టి చూస్తే, ఒకప్పటిలా మళ్ళీ విద్యుత్ కోతలు దేశమంతటా నిత్యకృత్యం కానున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి. సొంతంగా విద్యుదుత్పత్తి చేద్దామంటే బొగ్గు కొరత. థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతపడే పరిస్థితి. పోనీ... ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తే కొందామంటే, అనూహ్యమైన విద్యుత్ కొనుగోలు రేట్ల మోత. యూనిట్‌కు పాతిక రూపాయలు పెట్టినా, విద్యుత్ లభించని దుఃస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే, గృహావసర విద్యుత్ వినియోగం తగ్గించుకొని, విద్యుత్ ఆదా చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వాలూ ప్రజలను అభ్యర్థించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలకు విద్యుత్ కోతలు తప్పవన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యం ఇది. మన దేశంలో 135 థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అవన్నీ మునుపెన్నడూ లేనంత బొగ్గు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నాయనీ, విద్యుత్ కొరత తప్పదనీ సాక్షాత్తూ ‘భారతీయ కేంద్ర విద్యుత్ అథారిటీ’ డేటాయే స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా అవసరమైన విద్యుత్తులో 70 శాతాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. కానీ, బొగ్గు నిల్వల తీవ్ర కొరత కారణంగా ఈ 135 థర్మల్ ప్లాంట్లలో 106, అంటే దాదాపు 80 శాతం ప్లాంట్లు సంక్షోభ, లేదా అతి తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలుండాలని భారత ప్రభుత్వం మాట. కానీ, ఇప్పుడు రెండు రోజులకు మించి లేవు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లలోని బొగ్గు, లిగ్నైట్ గనులున్న ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల బొగ్గు రవాణాకు చిక్కులొచ్చాయి. వర్షాకాలానికి ముందే తగినంత బొగ్గు నిల్వలు చేసుకొనే దూరదృష్టి లేకుండా పోయింది. మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు సైతం చతికిలబడ్డాయి. షిప్పింగ్ ఆలస్యాల కారణంగా అంతర్జాతీయ గొలుసుకట్టు సరఫరా దెబ్బతింది. అంతర్జాతీయ బొగ్గు రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 40 శాతం మేర బొగ్గు ధరలు పెరిగినట్టు లెక్క. కొన్నిచోట్ల ఒక టన్ను 60 డాలర్లుండేది ఇప్పుడు దాదాపు 120 డాలర్లు అయిందని కథనం. దాంతో, అవసరమైన అంతర్జాతీయ బొగ్గును కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ రేట్లకు కొనలేక, తమ సామర్థ్యంలో సగం కన్నా తక్కువ విద్యుత్తునే ఆ కేంద్రాలు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి. కేరళలో 4, మహారాష్ట్రలో 13 థర్మల్ విద్యుత్కేంద్రాలు మూతబడ్డాయి. పంజాబ్‌లో దాదాపు సగం థర్మల్ విద్యుత్కేంద్రాలు ఆగిపోయాయి. ఇక, దక్షిణాదినా పలు విద్యుత్కేంద్రాలు మూతబడే పరిస్థితి. ఇప్పటికే రాజస్థాన్‌లో రోజుకో గంట, పంజాబ్‌లో 3 గంటలు, ఢిల్లీలో విడతల వారీగా విద్యుత్ కోత నడుస్తోంది. అలాగే, కేరళ, గుజరాత్, తమిళనాడు, అతి తీవ్రమైన బొగ్గు కొరత ఉన్న జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు సైతం పవర్ కట్ బాటలోకి వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ విద్యుత్ సంక్షోభంపై ఇప్పటికే కేంద్రానికి వివరంగా లేఖ రాశారు. కోవిడ్ తర్వాత విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందనీ, రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కొనాలన్నా అందుబాటులో లేదనీ వాస్తవాల్ని వివరించారు. 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయింపు సహా అనేక తక్షణ పరిష్కారాలూ సూచించారు. ఢిల్లీ సహా కొందరు ఇతర ముఖ్యమంత్రులూ తమ కష్టాలు కేంద్రానికి విన్నవించారు. కానీ, సంక్షోభ పరిష్కారానికి కేంద్రం మీనమేషాలు లెక్కించింది. చైనా లాంటి చోట్ల ఇప్పటికే విద్యుత్ సంక్షోభం కనిపిస్తున్నా, మన పాలకులు అంతా బాగుందన్నారు. సమాచార లోపం వల్లే అనవసర భయాలన్నారు. ఎట్టకేలకు సోమవారం కేంద్ర హోమ్‌మంత్రి సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. నిజానికి, విద్యుత్ లాంటి విషయాల్లో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ పని సమర్థంగా చేస్తున్నట్టు కనిపించదు. రాష్ట్రాలు విద్యుత్ కోసం అధిక రేట్లకైనా సరే ప్రైవేట్ సంస్థల వద్దకు పరిగెత్తాల్సిన పరిస్థితి కల్పించే కుట్ర ఈ కొరతకు కారణమని కొందరి వాదన. 1957 నాటి చట్టంలో తేనున్న సవరణలతో అరణ్యాలు, గిరిజన భూముల్ని కేంద్రం సేకరించి, బొగ్గు గనుల తవ్వకాలకు ప్రైవేట్ వారికి కట్ట బెట్టడానికే ఇదంతా అని ఆరోపిస్తున్నవారూ లేకపోలేదు. వాటిలో నిజానిజాలు ఏమైనా, కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న వేళ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలపై అజాగ్రత్త స్వయంకృతమే. పాలకులు ‘ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో సరిపెట్టకుండా, బొగ్గు, చమురు, సహజవాయువుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు తగిన పరిస్థితులు కల్పించాలి. ఇవాళ మంచినీటి లానే విద్యుత్ కూడా! విద్యుత్ లేకపోతే నాగరక జీవి మనుగడే కష్టం. అందుకే, విద్యుత్ రంగంలోనూ ఆచరణవాదంతో సంస్కరణలు తేవడమూ ముఖ్యం. మన దేశ విద్యుత్ అవసరాల్లో 90 శాతం శిలాజ ఇంధనాల నుంచి తీర్చుకుంటున్నాం. భవిష్యత్తుకు ఇది సరి కాదు. ఎక్కడైనా బొగ్గు నిల్వలు శాశ్వతంగా ఉండవు కాబట్టి, ఎప్పటికైనా పునర్వినియోగ విద్యుత్ వైపు మళ్ళాల్సిందే. దేశవ్యాప్తంగా సౌరశక్తి అనే ఉచిత, సహజ వనరును సమర్థంగా ఉపయోగించుకొని, సోలార్ పవర్ ఉత్పత్తి పెంచుకుంటే, సమస్యలుండవు. పవన విద్యుదుత్పత్తి పైనా గట్టిగా దృష్టి పెట్టక తప్పదు. ఆ మధ్య ఆక్సిజన్ కొరత... ఇప్పుడు బొగ్గు కొరత. కళ్ళ ముందున్నా సరే... సమస్యను గుర్తించడానికి నిరాకరిస్తే, కాలం గడిచేకొద్దీ కష్టమే! -
శరత్కాల వెన్నెల
‘విత్ ఫ్రీడమ్, బుక్స్ అండ్ ది మూన్ హూ కుడ్ నాట్ బి హ్యాపీ’ అన్నాడు ఆస్కార్ వైల్డ్. కోరుకున్న స్వేచ్ఛ, చదువుకోదగ్గ పుస్తకాలు, వెన్నెల కురిపించే జాబిల్లి... ఆనందానికి మరేం కావాలి. అందుకే ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ అని మన కవి సినారె రసాస్వాదన చేశాడు. మానవజాతి సూర్యుణ్ణి చూసి నమస్కారం పెట్టుకుంది. గౌరవించింది. పూజించింది. అష్షో బుష్షో అనీ అంది. చంద్రుడు? వారికి నేస్తం. బెడ్‌లైటు. మామ. ఊసులు చెప్పుకునే చెలికాడు. తక్కిన రుతువులు ఎవరివైనా కావచ్చు. శరత్కాలం చంద్రుడిది. ఈ కాలంలో చంద్రుడు చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకున్నట్టు ఉంటాడు. ఇది శరత్కాలం. ‘పిండారబోసినట్టుంది వెన్నెల’ అని పుస్తకాల్లో కనిపిస్తుంది. ‘కొబ్బరి ఆకుల సందుల్లో నుంచి వెన్నెల కురుస్తోంది’ అని రచయితలు రాస్తే వయసులో ఉన్న యువతీ యువకుల రొమాంటిక్ భావాలతో మైమరుస్తారు. ఏ అడ్డంకీ లేని నిర్మల ఆకాశంలో, పలుచటి గాలులు వీచే రాత్రి సమయాన, దాపున చుక్కల సింగారంతో, శరత్కాలంలో పూర్ణచంద్రుడు ఉదయిస్తే, దానిని చూడలేకపోతే మన దగ్గర మణులుంటే ఏంటి... మాణిక్యాలుంటే ఏంటి... ఫోన్‌పేలో ఎంత ఉంటే ఏంటి... సాహిత్యంలో వసంత రుతువుది ఏకఛత్రాధిపత్యమే. కాని శరదృతువు తక్కువ తిన్లేదు. ఆ మాటకొస్తే వేదకాలం గుర్తించింది మూడు రుతువులనే. గ్రీష్మం, వసంతం, శరత్తు. ‘సమస్త సృష్టి అనే యజ్ఞంలో వసంతం ఆజ్యం అయితే గ్రీష్మం ఇంధనం, శరత్తు హవి’ అనే అర్థం వచ్చే శ్లోకం ఋగ్వేదంలో ఉంది. ప్రకృతి వర్ణనలో పరాక్రమశాలి అయిన కాళిదాసు శరత్కాలపు వెన్నెలను ఏల వదులుతాడు. ‘ఈ వెన్నెల ఎలా ఉందంటే గడ్డ కట్టిన చిక్కటి తెల్లటి పెరుగులా ఉంది’ అని వెన్నెల రుచి చూపించాడు. వెన్నెలలో రెల్లుగడ్డికి గ్లామర్ తీసుకు వచ్చింది కూడా ఆ మహాకవే. శరత్కాలంలో రెల్లుగడ్డి వెన్నెలను తాగి మత్తుగా ఊగుతున్నట్టు ఉందని రాశాడాయన. ‘వెన్నెల కాస్తుంటే కొందరు కిటికీలు మూసుకుంటారు’ అని గుడిపాటి వెంకటాచలం విసుక్కున్నాడు కాని తిలక్ వెన్నెల కాసిందంటే చాలు కవిత్వం రాశాడు. ‘దవుదవ్వుల పడుచు పిల్లలు పకపక నవ్వినట్టుంది వెన్నెల... దాపరికం లేని నాతి వలపులాగుంది వెన్నెల’ అని రాశాడు. అంతేనా? ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. తన పుస్తకాన్ని ‘అమృతం కురిసిన రాత్రి’ అన్నాడు. ఇక్కడ అమృతం వెన్నెలామృతమే. అయినా సరే ‘ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది’ అని రాసిన నండూరి సుబ్బారావూ మొనగాడే. ఎంకిని ఆచ్ఛాదన లేని చంద్రుని కింద నాయుడు బావ చూశాడో లేదో కాని తెలుగు పాఠకులు కన్నులు ఇంతింత చేసుకుని చూశారు. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజ పున్నమి వాల్మీకి మహర్షి జన్మదినం. రామాయణం ఈ భరతభూమి మీద అనాదిగా ఆధ్యాత్మిక వెన్నెలను కురిపిస్తూ ఉంది. రాముడు రామచంద్రుడు. చంద్రుణ్ణి నేలకు దించమని కోరి గోరుముద్దలు తిన్నవాడు. సీతమ్మ మోము చంద్రబింబం కంటే ఏం తక్కువ. మహా భారతాన్ని తెలుగు అనువాదం చేస్తున్న నన్నయ్య ‘అరణ్య పర్వం’లో శరత్కాలాన్ని వర్ణిస్తూ ఒక పద్యం రాసి అక్కడితో రచన చాలించాడు. 200 ఏళ్ల తర్వాత ఎఱాప్రగడ కొనసాగింపుగా శరత్కాల వర్ణన చేసే మరో పద్యం రాసి ఆ అనువాదాన్ని కొనసాగించాడు. తెలుగు మహాభారతం ఆ విధంగా ఒక శరత్కాలానికి మరో శరత్కాలానికి మధ్య సుదీర్ఘ విరామం తీసుకుంది. రుతువులు ఏం చేస్తాయి? ఏవో సంకేతాలు ఇస్తాయి. ఆ ప్రకారం నడుచుకోమని మనుషులకు చెబుతాయి. శరత్కాలం స్త్రీ, పురుషుల సన్నిహిత కాలం అని శృంగార శాస్త్రాలు చెబుతాయి. భర్తృహరి ‘శృంగార శతకం’ ఆ సమయంలో ఆలుమగలు ఎలా వ్యవహరించాలో చెబుతుంది. ‘శరత్కాలంలో ఆలుమగలు ఏకాంతంగా మేడ మీదకు చేరాలి. అర్ధరాత్రి వరకు కాలక్షేపం చేయాలి. చంద్రుడు నడిమింటికి వస్తాడు... వెన్నెల ధార కురుస్తూ ఉంటుంది... ఆ సమయంలో ఒకరి స్పర్శను ఒకరు ఆస్వాదించాలి’ అని చెప్పింది. చలం కూడా ‘ఆరోగ్యవంతమైన స్త్రీ పురుషులు వెన్నెల రాత్రుళ్లలో సముద్రపు ఒడ్డున భూమే శయ్యగా కలిసేది ఎప్పుడో’ అని రాశాడు. రుతువు అంటే స్పందన. వెన్నెల అంటే స్పందన. స్పందనాగుణం కోల్పోవడమే ఇప్పుడు మనిషిని బాధిస్తున్న సంగతి. విషాదం ఏమంటే తాను స్పందనాలేమితో బాధ పడుతున్న సంగతి కూడా మనిషికి తెలియదు. పూవు పూస్తే, హరివిల్లు విరిస్తే, చినుకు చూరు నుంచి చిటుకూ పుటుకూ మంటే, గాలికి ఒక తీవ ఝల్లుమని కదిలితే ఆగి చూసి ఆస్వాదించి స్పందించే సమయం మనిషికి ఎక్కడిది? అది ఉంది. కాని లేదు అని పరుగు పెట్టడమే మనిషి నేడు చేస్తున్నది. ఈ స్పందన కరువైన కొద్దీ జీవితంలో ఆస్వాదన కరువవుతుంది. స్త్రీ, పురుషుల మధ్య శుష్కమైన కోరిక మిగిలి రససిద్ధి అడుగంటుతుంది. నేడు భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య నిజమైన రసస్పందన కరువవుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫేక్– కపట మోహ ప్రదర్శనే మిగులుతున్నది. సంవత్సరానికి ఒకసారి శరత్ రుతువు వస్తుంది. సోముడు తేజోవంతమై అందాక పేరుకు పోయిన భావాల నిరాసక్తతను వదలగొడతాడు. వెన్నెల గుమ్మరిస్తాడు. గుండెలకు లాలిత్యం ఇస్తాడు. హాయి పడాల్సిన కాలం ఇది. పున్నములను చూడాల్సిన కాలం. దాంపత్య అనుబంధాన్ని వెలిగించుకోవాల్సిన కాలం. వెలగడం మీ వంతు.