థాయ్‌ గుహ : నేర్వదగిన పాఠాలు ఎన్నో..! | Thai Cave Rescue, A Great Humanity By Whole World | Sakshi
Sakshi News home page

మానవత పరిమళించిన క్షణాలు!

Published Thu, Jul 12 2018 2:18 AM | Last Updated on Thu, Jul 12 2018 12:19 PM

Thai Cave Rescue, A Great Humanity By Whole World - Sakshi

గుహలో చిక్కుకున్న థాయ్‌లాండ్‌ ఫుట్‌బాల్‌ టీం బాలురు (ఫైల్‌ ఫొటో)

పదిహేడు రోజులుగా ప్రపంచం మొత్తం కళ్లప్పగించి భయం భయంగా... ఉత్కంఠభరితంగా చూసిన అత్యంత సంక్లిష్టమైన ప్రమాదకర విన్యాసం సుఖాంతమైంది. థాయ్‌లాండ్‌లోని థామ్‌ లుయాంగ్‌ నాంగ్‌ నాన్‌ గుహలో చిక్కుకున్న 12మంది బాలురనూ, వారి కోచ్‌నూ వివిధ దేశాల గజ ఈతగాళ్ల బృందం మంగళవారం క్షేమంగా వెలుపలికి తీసుకొచ్చింది. ఒకపక్క ప్రపంచమంతా రష్యాలో జరుగుతున్న సాకర్‌ పోటీల మైకంలో మునిగి ఉండగా హఠాత్తుగా థామ్‌ లుయాంగ్‌ గుహ ఉదంతం తోసుకొచ్చి దాన్నంతటినీ తుడిచిపెట్టింది. పిల్లల బృందం చిక్కుకున్న సమాచారం వెల్లడైనప్పటినుంచీ దేశమేదైనా, మతమేదైనా, ఏ జాతీయులైనా, ఏ భాష మాట్లాడేవారైనా కోరు కున్నదొకటే... ఆ పిల్లలు సురక్షితంగా బయటకు రావాలని.

గత నెల 23న గుహను చూడటానికెళ్లిన పిల్లల ఫుట్‌బాల్‌ బృందం ఉన్నట్టుండి కురిసిన భారీ వర్షాలు, వాటితోపాటు వచ్చిన వరద నీటితో ఎటూ కదలడానికి లేకుండా చిక్కుకుపోవడం, వారి ఆచూకీ బయటి ప్రపంచానికి తెలియకపోవడం అందరిలోనూ భయాందోళనలు కలిగించింది. వారు ఆ గుహలోకి వెళ్లి ఉండొచ్చునన్న అంచనాకు రావడానికే రెండురోజుల సమయం పట్టింది. ఆ తర్వాత బృందం ఎత్తయిన ప్రదేశంలో సజీవంగా ఉండొచ్చునని నిర్ధారించుకోవడానికి మరికొన్ని రోజులు పట్టింది. చివరకు తొమ్మిది రోజుల తర్వాత ఈ నెల 2న తొలిసారి గజ ఈతగాళ్ల బృందం బాలుర సమీపానికి చేరుకుని వారితో మాట్లాడింది. వీడియో తీసింది. వారు ఆహారం, నీళ్లు తీసుకెళ్లేవరకూ ఆ పసి ప్రాణాలు తమ దగ్గరున్న అరకొర తినుబండారాలతో అర్థాకలితో గడిపాయి.

వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు ఈ ఉదంతంపై స్పందించిన తీరు అద్భుతమని చెప్పాలి. ఆ పసి ప్రాణాలను కాపాడాలని వరద నీటితో నిండిన గుహల్లో ఈదడానికి ప్రత్యేక శిక్షణ పొందిన మెరికల్లాంటి గజ ఈతగాళ్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, స్పేస్‌ ఎక్స్‌ ప్రాజెక్టు సృష్టికర్త ఎలాన్‌ మస్క్‌ సైతం ఆ గుహలో పనికొచ్చేలా ఒక జలంతర్గామిని తయారు చేయించుకుని వచ్చి అక్కడే ఉండిపోయాడు. అది చివరకు ఉపయోగపడకపోయినా ఆ పిల్లల క్షేమంపై ఆత్రుత ప్రదర్శించి శ్రద్ధ పెట్టిన మస్క్‌ తీరు మెచ్చదగ్గది.

ఈ మొత్తం ఆపరేషన్‌ ఎవరి ఊహలకూ అందనంత ప్రాణాంతకమైనది. సుశిక్షితుడైన థాయ్‌ నావికాదళ గజ ఈతగాడొకరు మరణించడం దీనికి తార్కాణం. సర్వసాధారణంగా గుహలు మనుష్య సంచారానికి అనువుగా ఉండవు. ప్రకృతిసిద్ధమైన వింతలు, విశేషాలను చూసితీరాలన్న ఆసక్తి ఉన్నవారు సైతం ఎంతో శ్రమకోర్చేవారైతే తప్ప అలాంటిచోటుకు వెళ్లరు. సరిగ్గా ఎనిమి దేళ్లక్రితం చిలీ గనిలో 33మంది కార్మికులు చిక్కుకున్న ఉదంతంతో కూడా దీన్ని పోల్చలేం. ఎందు కంటే వారంతా నిత్యం గనికి రాకపోకలు సాగించే పనిలో ఉన్నవారే. ఎలాంటి ప్రమాదమైనా ఏర్ప డవచ్చునన్న ఎరుకతో నిరంతరం అప్రమత్తమై ఉంటారు.

కానీ ఈ ఉదంతం అలాంటిది కాదు. గుహ వెలుపలి నుంచి బాలురు చిక్కుకున్న ప్రాంతం నాలుగు కిలోమీటర్ల దూరం. పైనుంచి లెక్కేస్తే ఆ ప్రాంతం కిలోమీటరు లోతున ఉంది. అక్కడికి చేరాలంటే ఇరుకైన మార్గం తప్ప వేరే దారి లేదు. ఆ దారి కూడా కంటకప్రాయమైనది. ఎన్నో వంపులతో, ఎత్తుపల్లాలతో... వరద నీటితో, బురదతో నిండి ఉంది. కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టమైన చీకటి. అలాంటి పరిస్థితుల్లో ఎంత చేయి తిరిగినవారైనా ఆ ఇరుకైన దారిలో ఒకవైపు ఈదుకెళ్లడానికి అయిదు గంటల సమయం పడుతుంది. అందుకే ఈ ఆపరేషన్‌ మొత్తం ఓ కంటితుడుపు చర్యే కావొచ్చునని అందరూ భావించారు. పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు.

వారిని వెలుపలికి తీసుకురావడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టొచ్చునని తొలుత నిపుణులు చెప్పినప్పుడు ఆ పిల్లలు చనిపోవడం ఖాయమనుకున్నారు. అన్ని నెలలకు సరిపడా ఆహారం, నీళ్లు అందించినా వెలుతురు కిరణాలు సోకని చోట అంత సుదీర్ఘకాలం మనోధైర్యంతో వారు మనుగడ సాధించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. గబ్బిలాలు మాత్రమే తిరిగేచోట వాటిద్వారా ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదమున్నదని కూడా అనుకున్నారు. నిజానికి భారీ వర్షాలు తమ ప్రతాపం చూపకపోయి ఉంటే వరదనీరు తగ్గేవరకూ వారిని అక్కడే ఉంచడం మంచిదని నిపుణులు అభిప్రాయపడేవారు.

కానీ అవి రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చి వరద నీరు అంతకంతకు పెరుగుతూ పోవడంతో ఏదో ఒకటి చేసి ఆ పిల్లల్ని మృత్యు పరిష్వంగం నుంచి బయటకు తీసుకురావాల్సిందేనన్న కృత నిశ్చయానికొచ్చారు. ఈ ఉదంతంలో ఏ రంగంలోవారైనా నేర్వదగిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. సంక్షోభ సమయాల్లో మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో ఆ పిల్లలు ఆచరించి చూపారు. తాను అర్ధాకలితో ఉన్నా బృందంలోని పిల్లలకు లోటు రానీయకుండా చూసుకున్న పాతికేళ్ల కోచ్‌ ఎకపోల్‌ చాంతన్‌వాంగ్‌ నాయకత్వ స్థానంలో ఉన్నవారు ఎంతటి త్యాగానికి సంసిద్ధులై ఉండాలో నిరూపిం చాడు. తిండికి కొరతగా ఉన్నప్పుడు, ఆక్సిజెన్‌ నానాటికీ తగ్గుముఖం పడుతున్నప్పుడు మానసిక కుంగుబాటు దరి చేరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరిలో వణుకు మొదలైనా అది బృందం మొత్తాన్ని ఆవరిస్తుంది. ఎవరినీ ప్రాణాలతో మిగల్చదు.

మన గురజాడ ‘ఎల్లలోకములొక్క ఇల్లై... వర్ణభేదములెల్ల కల్లై’ ఈ ప్రపంచం ఉండాలని మనసారా కాంక్షించాడు. ప్రపంచంలో ఏమూలనున్నవారు సంక్షోభంలో చిక్కుకున్నా ఆ ఆపద అందరిదీ అనుకుని ముందుకురకడమే మానవీయత అనిపించుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఇటీవలికాలంలో ఆ దృక్పథం కొడిగడుతోంది. దేశాలకుండే భౌగోళిక హద్దులకు మించి మనుషుల మధ్య నిలువెత్తు అడ్డుగోడలు పుట్టుకొస్తున్నాయి. అవి నానాటికీ విస్తరిస్తున్నాయి. ‘మనవాళ్లు’ కాదని, అన్య మతస్తులని, వేరే దేశస్తులని కారణాలు చెప్పుకుని మనుషులు బండ బారిపోతున్నారు.

కళ్లముందు తోటి మనిషిని కొట్టి చంపుతున్నా గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోతున్నారు. అలా ఉండటమే ఔన్నత్య చిహ్నమని నూరిపోసే ధూర్తులు పాపంలా పెరిగి పోతున్నారు. ఇటు వంటి నిరాశామయ క్షణాల్లో థాయ్‌లాండ్‌ బాలురు, గజఈతగాళ్లు ఈ ప్రపం చంలో మనిషితనం ఇంకా బతికే ఉన్నదన్న తీయని కబురందించారు. సంక్షుభిత సమయాల్లో ఏమూలనో మానవీయత మొగ్గ తొడుగుతుందని, దాని పరిమళాలు అన్ని అవధులూ దాటుకుని పరివ్యాప్తమవుతాయని నిరూపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement