హర్షిత్‌ బదులు అతడిని పంపాల్సింది: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌ | We Played With 12 People: Aakash Chopra on Harshit Rana As concussion Sub | Sakshi
Sakshi News home page

హర్షిత్‌ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Published Sat, Feb 1 2025 4:02 PM | Last Updated on Sat, Feb 1 2025 4:32 PM

We Played With 12 People: Aakash Chopra on Harshit Rana As concussion Sub

ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)లో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరును భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తప్పుబట్టాడు. శివం దూబే(Shivam Dube)కు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా.. హర్షిత్‌ రాణా(Harshit Rana)ను పంపడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం ద్వారా పుణె మ్యాచ్‌లో భారత జట్టు పన్నెండు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్లు అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కాగా టీమిండియా స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్‌ సేన.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పుణెలో శుక్రవారం నాలుగో టీ20 జరిగింది.

ఆదిలోనే ఎదురుదెబ్బ
ఇందులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ విషయంలో కెప్టెన్‌ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్‌ పేసర్‌ సకీబ్‌ మహమూద్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్‌ సంజూ శాంసన్‌(1), వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ(0), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(0)లను అవుట్‌ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు.

దూబే, హార్దిక్‌ అదరగొట్టారు
ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ(29) కాసేపు క్రీజులో నిలబడగా.. రింకూ సింగ్‌(30) ఫర్వాలేదనిపించాడు. అయితే, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు శివం దూబే, హార్దిక్‌ పాండ్యా రాకతో సీన్‌ మారింది. దూబే 34 బంతుల్లో 53 పరుగులతో దంచికొట్టగా.. పాండ్యా 30 బంతుల్లోనే 53 పరుగులతో దుమ్ములేపాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

హర్షిత్‌ రాణా రాకతో..
అయితే, ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్‌ బౌలింగ్లో దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తాకగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు. తాను బాగానే ఉన్నానని చెప్పిన దూబే.. బ్యాటింగ్‌ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత అతడు ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైన రెండు ఓవర్ల తర్వాత హర్షిత్‌ రాణాను మేనేజ్‌మెంట్‌ మైదానంలోకి పంపింది.

ఈ క్రమంలో తన టీ20 అరంగేట్రం చేసిన హర్షిత్‌ రాణా అద్భుత బౌలింగ్‌(3/33)తో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆల్‌రౌండర్‌ దూబే స్థానంలో స్పెషలిస్టు ఫాస్ట్‌బౌలర్‌ను కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా పంపడం విమర్శలకు దారితీసింది.

నిబంధనలకు విరుద్ధం
ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. ‘‘ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్‌ స్థానంలో బౌలర్‌.. బ్యాటర్‌ స్థానంలో బ్యాటర్‌.. ఆల్‌రౌండర్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌(like-for-like replacement) కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావాలి. రూల్‌ బుక్‌లో ఇది స్పష్టంగా రాసి ఉంది.

ఉదాహరణకు.. బెక్‌ డకెట్‌ తలకు గాయమైతే.. ఫీల్డింగ్‌ సమయంలో అతడి స్థానంలోమరో బ్యాటర్‌నే పంపాలి. కానీ బౌలర్‌ను పంపకూడదు. ఎందుకంటే.. అతడు బౌలింగ్‌ చేయలేడు .

ఒకవేళ బౌలర్‌ గాయపడితే అతడి స్థానంలో మరో బౌలర్‌నే పంపాలి. కానీ.. ఇక్కడ శివం దూబేకు 20 ఓవర్లో తలకు గాయమైనప్పుడు..  కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్‌ రాణాను రప్పించారు. హర్షిత్‌కు బదులు మహ్మద్‌ షమీని రప్పించవచ్చు కదా.

12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాం
ఎందుకంటే.. హర్షిత్‌ రాణా నైపుణ్యాలకు.. శివం దూబే స్కిల్స్‌కు పోలికే లేదు. దూబే ఎక్కువగా బ్యాటింగ్‌ చేస్తాడు. అప్పుడప్పుడు గంటకు 115- 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్‌ చేస్తాడు. కానీ.. హర్షిత్‌ రాణా పూర్తిస్థాయి ఫాస్ట్‌ బౌలర్‌. గంటకు 140 -145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తాడు. ఎవరు ఏమన్నా ఇదే వాస్తవం.

ఈరోజు శివం దూబే 53 పరుగులు చేశాడు. హర్షిత్‌ రాణా నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి.. కీలక వికెట్లు తీశాడు. ఇండియా గెలిచింది. నిజానికి ఈరోజు మనం 12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాం. 

రమణ్‌దీప్‌ సింగ్‌ను పంపాల్సింది
దూబే బ్యాటింగ్‌ చేశాడు.. హర్షిత్‌ బౌలింగ్‌ చేశాడు’’ అని ఆకాశ్‌ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దూబేకు కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రమణ్‌దీప్‌ సింగ్‌ను పంపాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పదిహేను పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement