ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. బెడిసికొట్టిన ప్లాన్‌! | Canada, China And Mexico Strong Counter To USA Donald Trump Over Imposition Of Tariffs, More Details Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. బెడిసికొట్టిన ప్లాన్‌!

Published Sun, Feb 2 2025 11:56 AM | Last Updated on Sun, Feb 2 2025 1:01 PM

Canada China And Mexico Strong Counter To USA Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. ట్రంప్‌ తప్పుడు పద్దతుల్లో వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో, అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో దేశాలు సిద్ధమయ్యాయి. అలాగే, ట్రంప్‌ నిర్ణయాన్ని డబ్ల్యూటీవో సవాల్‌ చేస్తానని చైనా హెచ్చరించింది.

డొనాల్డ్‌ ట్రంప్‌.. కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఆ దేశాలు కౌంటరిస్తున్నారు. ఈ  క్రమంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ.. ‘155 బిలియన్ కెనడియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాం. వాషింగ్టన్‌ చర్యలకు ఇది కెనడా ప్రతిస్పందన. ఇందులో 30 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయి. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్‌ అనుకుంటే.. మాతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలి. అదే వారికే మంచింది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

మరోవైపు.. మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. తాజాగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌  మాట్లాడుతూ.. ‘మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది. మేము ఎప్పుడూ ఘర్షణలు కోరుకోము. డ్రగ్స్‌ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం నాలుగు నెలల్లో 20 మిలియన్‌ డోస్‌ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. పదివేల మందిని అరెస్టు చేశాం.  మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే.. అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. టారిఫ్‌లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావు. మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్లాన్ బీని అమలు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ట్రంప్‌ చర్యలపై చైనా కూడా మండిపడింది. తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. చైనా ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోంది. ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తాం. చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా.. సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా.. తన దేశంలో ఫెంటనిల్‌ వంటి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవాలి. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం అంటూ హితవు పలికింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement