అమెరికాపై టారిఫ్‌ యుద్ధం! | China, Canada And Mexico Express Anger Over Donald Trump Decision Over Tariffs | Sakshi
Sakshi News home page

అమెరికాపై టారిఫ్‌ యుద్ధం!

Published Wed, Mar 5 2025 5:42 AM | Last Updated on Wed, Mar 5 2025 9:54 AM

China Canada Mexico express anger over Donald Trump decision

డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై చైనా, కెనడా, మెక్సికో ఆగ్రహం  

ప్రతీకార సుంకాలు విధించక తప్పదని స్పష్టీకరణ  

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు ప్రకటించిన కెనడా  

చర్యలకు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందన్న మెక్సికో  

అమెరికా ఎగుమతులపై అదనంగా 15 శాతం టారిఫ్‌ విధించిన చైనా  

వాషింగ్టన్‌/బీజింగ్‌/మెక్సికో సిటీ/టొరంటో:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం మరింత విస్తరిస్తోంది. ట్రంప్‌ సోమవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు. 

ఫెంటానిల్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి, అక్రమ వలసలను నియంత్రించడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరిగా అవసరమని సమర్థించుకున్నారు. చైనా ఉత్పత్తులపై ట్రంప్‌ ఇప్పటికే 10 శాతం సుంకాలు విధించారు. మరోవైపు చైనా, కెనడా, మెక్సికో సైతం ధీటుగా బదులిస్తున్నాయి. 

ప్రతీకార సుంకాలపై సై అంటున్నాయి. అమెరికాపై టారిఫ్‌ల యుద్ధం మొదలుపెట్టాయి. ఫలితంగా వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడంతోపాటు ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయి అంతిమంగా ప్రజలు కష్టాలపాలయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.   

ట్రంప్‌ నిర్ణయంలో న్యాయం లేదు: కెనడా ప్రధాని  
ట్రంప్‌ ప్రారంభించిన సుంకాలయుద్ధంలో ఎంతమాత్రం న్యాయం లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో అన్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. తమ ఉత్పత్తులపై అన్యాయంగా సుంకాల విధిస్తే, అమెరికాకు తగిన సమాధానం చెప్పక తప్పదని స్పష్టంచేశారు. కౌంటర్‌–టారిఫ్‌ చర్యలను ప్రకటించారు. మొదటి దశలో అమెరికా ఉత్పత్తులపై 25 శాతం సుంకాల విధిస్తామని పేర్కొన్నారు. అమెరికా ఎగుమతిదారులు 20.6 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 

ఒకవేళ ట్రంప్‌ ప్రభుత్వం గనుక వెనక్కి తగ్గకపోతే తాము విధించే సుంకాలు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని తేల్చిచెప్పారు. ఇక రెండో దశలో భాగంగా మరో 25 శాతం టారిఫ్‌లు విధిస్తామన్నారు. మూడు వారాల్లో 125 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు వసూలు చేస్తామని జస్టిన్‌ ట్రూడో వెల్లడించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్, స్టీల్, అల్యూమినియంపై మున్ముందు మరిన్ని సుంకాలు విధిస్తామని తెలియజేశారు. 

అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే దాకా టారిఫ్‌ల విషయంలో తమ నిర్ణయంలో మార్పు ఉండదని సంకేతాలిచ్చారు. అమెరికా మనసు మార్చుకొంటే తాము కూడా అదేబాటలో నడుస్తామని పరోక్షంగా సూచించారు. అనవసరమైన వాణిజ్య యుద్ధం ప్రజలకు మేలు చేయదని అభిప్రాయపడ్డారు.   

చైనా అదనపు సుంకాలు   
ట్రంప్‌ ప్రకటనపై చైనా ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్‌ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది. అదనపు సుంకాలు ఇది ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్‌ టారిఫ్‌ కమిషన్‌ మంగళవారం పేర్కొంది. 

తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్‌ల మోత మోగిస్తున్న అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు(డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. మరోవైపు సుంకాల విషయంలో అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తెలియజేసింది. ఇదిలా ఉండగా, 10 అమెరికా సంస్థలను విశ్వసనీయం కాని సంస్థల జాబితాలో చేర్చాలని చైనా నిర్ణయించింది. ఇందులో రక్షణ, ఏఐ, విమానయానం, ఐటీ రంగాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. 

చైనా ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం రెండో దశలో భాగంగా అదనంగా 10 శాతం సుంకం విధించింది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. చైనా ఎగుమతి చేసే మొత్తం ఉత్పత్తుల్లో 15 శాతం అమెరికాకే వెళ్తుంటాయి. 2023లో ఇరుదేశాల మధ్య 575 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో చైనా నుంచి అమెరికాకు 427.2 బిలియన్‌ డాలర్ల ఎగమతులు, అమెరికా నుంచి చైనాకు 147.8 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. 

ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించారు. తాజాగా మరో 10 శాతం వడ్డించారు. దీంతో ఇప్పటిదాకా సుంకాలు 20 శాతానికి చేరాయి. దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. చైనా ఉత్పత్తులపై 60 శాతం సుంకాలు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ పదేపదే ప్రకటించిన సంగతి తెలిసిందే.   

ప్లాన్‌ బి, సి, డి ఉన్నాయి: మెక్సికో ప్రెసిడెంట్‌  
అమెరికా చర్యలకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ పేర్కొన్నారు. తమ వద్ద ప్లాన్‌ బి, సి, డి ఉన్నాయని ప్రకటించారు. తమ దేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం గనుక టారిఫ్‌లు పెంచితే ఏం చేయాలన్నదానిపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అమెరికా, మెక్సికో మధ్య సహకారం ఇప్పటివరకైతే అద్భుతంగా ఉందని చెప్పారు. 

వాణిజ్యం, భద్రతాపరమైన అంశాలపై ఇటీవల ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అన్నారు. తమ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు విధించే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నామని, ఒకవేళ అదే జరిగితే తాము కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టంచేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement