tariffs
-
‘బ్రిక్స్’ దేశాలపై ట్రంప్ సెటైర్లు
వాషింగ్టన్:‘బ్రిక్స్’ కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 150 శాతం సుంకాల దెబ్బకు ‘బ్రిక్స్’ ముక్కలయ్యాయని సెటైర్లు వేశారు. డాలర్‌ను ఆధిక్యతను దెబ్బతీయాలని ప్రయత్నించినందుకు ఆ దేశాలకు ఇది జరగాల్సిందేనన్నారు.‘డాలర్‌ను నాశనం చేయాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నించాయి. ఆ దేశాలన్నీ కలిసి కొత్త కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచన చేశాయి. నేను గెలవగానే ఆ దేశాలకు ఒకటే స్పష్టం చేశాను. డాలర్ ఆధిక్యతను దెబ్బతీయాలని చూస్తే మీ వస్తువులపై 150 శాతం సుంకం విధిస్తానని చెప్పాను.మీ వస్తువులు మాకు అవసరం లేదు. నా దెబ్బకు బ్రిక్స్ దేశాలు ముక్కలయ్యాయి’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో భారత్‌కు కూడా మినహాయింపు ఇవ్వలేదు.బ్రిక్స్ కూటమిలో భారత్,రష్యా,చైనా సహా మొత్తం పది దేశాలున్నాయి. -
బంగారం.. అందుకే ఆల్‌టైమ్ హై!
ప్రపంచవ్యాప్తంగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold prices) రోజుకో కొత్త గరిష్టాన్ని చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్త సుంకాల భయం నేపథ్యంలో పసిడిని సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ డబ్బును అందులో పెట్టుబడి పెట్టడానికి తొందరపడటంతో బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. ప్రపంచ మార్కెట్లలో బులియన్ ఔన్సు ధర 2,935 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అంతకుముందు ఇది 2,947.01 డాలర్ల తాజా రికార్డు స్థాయిని తాకింది. ఇక భారతదేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 2025 ఏప్రిల్ ఫ్యూచర్స్‌కు బంగారం 10 గ్రాములకు రూ.85,879 వద్ద ట్రేడైంది. గరిష్ట ధర రూ. 86,592.అమెరికాలోకి వచ్చే ఆటోమొబైల్, సెమీకండక్టర్, ఔషధ దిగుమతులపై 25% సుంకాలను విధిస్తామని గత మంగళవారం ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, రష్యా సీనియర్ అధికారులు మొదటి రౌండ్ చర్చల కోసం సమావేశమైన తర్వాత పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు దోహదపడే మరో అంశం.ఇది చదివారా? బంగారం, వెండి దిగుమతి ధరలు పెంపు2024లోనే బంగారం పావు వంతుకు పైగా పెరిగింది. 2025లో, ట్రంప్ వాణిజ్య విధానాల వల్ల బంగారం అనేక రికార్డు గరిష్టాలను తాకింది. ఈ వారం ప్రారంభంలో గోల్డ్‌మన్ సాచ్స్ కూడా బంగారం కోసం సంవత్సరాంతపు లక్ష్యాన్ని ఔన్సుకు 3,100 డాలర్లకు పెంచింది. సెంట్రల్-బ్యాంక్ కొనుగోలు ఊహించిన దానికంటే బలంగా ఉండటం కీలకమైన చోదక శక్తిగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఆర్థిక విధానంపై విస్తృత అనిశ్చితి కొనసాగితే (ముఖ్యంగా సుంకాలపై) బులియన్ ధర 3,300 డాలర్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడింది. -
మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత టెస్లా ఇండియాలో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగించేందుకు టెస్లా చర్యలకు పూనుకుంది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) నిర్ణయం ‘చాలా అన్యాయం’ అని తెలిపారు. మస్క్ సమక్షంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారీగా టారిఫ్లుప్రతి దేశం అమెరికా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ యూఎస్‌ను బాగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. భారత్ అందుకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉందని, దేశంలో కార్లను విక్రయించడం టెస్లాకు దాదాపు అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కానీ, అమెరికా పరంగా అది చాలా అన్యాయమన్నారు. భారత్‌లోని సుంకాలను ఉద్దేశించి సమన్యాయం, న్యాయమైన వాణిజ్య పద్ధతుల ఆవశ్యకతను ట్రంప్ నొక్కిచెప్పారు. ఇదీ చదవండి: యాక్టివ్‌గా ఉన్న కంపెనీలు 65 శాతమేసుంకాలు తగ్గింపుమోదీ అమెరికా పర్యటన సందర్భంగా మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకాలపై విమర్శలు ఉన్నప్పటికీ భారతదేశం ఇటీవల హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. ఇది భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంది. టెస్లా ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైల్లో షోరూమ్‌ల కోసం స్థలాలను గుర్తించినట్లు ప్రకటించింది. భారతదేశంలో పని చేసేందుకు మిడ్ లెవల్ పొజిషన్లను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది. అధిక టారిఫ్‌లు ఉన్నప్పటికీ భారత మార్కెట్లో టెస్లా తన ఉనికిని చాటేందుకు చర్యలు చేపట్టింది. -
ఎవరినీ వదిలేది లేదు: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా వాణిజ్య విధానం ఇచ్చిపుచ్చుకునే విధంగా న్యాయంగా ఉంటుందని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్ విధానంపై సోమవారం(ఫిబ్రవరి 17) ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. తమ వాణిజ్య విధానంలో ఎక్కువ, తక్కువలకు చోటుండదన్నారు. అందరూ సమానమేనన్నారు.ఆయా దేశాలు తమ వస్తువులపై ఎంత సుంకాలు విధిస్తాయో తామూ అంతే విధిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఏ దేశమైనా భావిస్తే ముందు ఆ దేశం అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించుకోవాలి లేదా పూర్తిగా తీసేయాలని ట్రంప్ సూచించారు. అమెరికాలో ఉత్పత్తి, వస్తువుల తయారీ చేపడితే సుంకాలు ఉండవని తెలిపారు.సుంకాల విషయంలో అమెరికా మిత్ర,శత్రు దేశాలు చాలా కాలంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యకక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాతో వాణిజ్యం నిర్వహించే దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. -
డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన.. ఏప్రిల్ 2 నుంచి అమలు!?
జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కీలక నిర్ణయాలను తీసుకుంటూ.. మిత్ర దేశాలను, శత్రుదేశాలను భయానికి గురిచేస్తున్నారు. పన్నుల విషయంలో తగ్గేదే లే అన్నట్లు.. సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.కార్ల మీద మాత్రమేనా.. ఆటోమొబైల్ ఉత్పత్తుల మీద కూడా సుంకాలను విధిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆదాయాన్ని పెంచడానికి, వాణిజ్య అసమానతలను పరిష్కరించడానికి సుంకాలు విధించడం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికాలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 50 శాతం ఆ దేశంలోనే తయారవుతున్నాయి. దిగుమతులలో సగం మెక్సికో.. కెనడా నుంచి వస్తున్నాయి. మిగిలిన సగం జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్వీడన్ దేశాలు దిగుమతి చేస్తున్నాయి.ఉక్కు, అల్యూమినియం దిగుమతి మీద 25 శాతం సుంకం ప్రకటించినప్పుడు.. ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ విమర్శించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కార్ల ధరలను విపరీతంగా పెంచుతుందని, మా సరఫరా గొలుసులకు కూడా అంతరాయం కలిగిస్తుందని అన్నారు. ట్రంప్ పరిపాలనలోనే చర్చలు జరిపిన యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందానికి (USMCA) కూడా ప్రతికూలత కలుగుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేనో ఇడియట్‌లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే అన్ని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలకు సంబంధించిన ప్రణాళికలను అధ్యక్షుడు ఇటీవల నిర్ధారించారు. అయితే డెట్రాయిట్ ఆటోమేకర్లు జనరల్ మోటార్స్, ఫోర్డ్, స్టెల్లాంటిస్ వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ ఆటోమోటివ్ పాలసీ కౌన్సిల్.. మెక్సికో & కెనడాపై ప్రతిపాదిత సుంకాలను తగ్గించాలని ట్రంప్‌కు పిలుపునిచ్చింది. -
మనపై అమెరికా సుంకాల ప్రభావం అంతంతే..
అమెరికా ప్రతిపాదిత ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరు దేశాలు ఎగుమతుల తీరుతెన్నులు భిన్నంగా ఉండటమే కారణమని ఆయన చెప్పారు. ఉదాహరణకు అమెరికా నుంచి దిగుమతయ్యే పిస్తాలపై భారత్ 50 శాతం సుంకాలు విధిస్తోందనుకుంటే, మన దగ్గర్నుంచి దిగుమతయ్యే వాటి మీద కూడా అమెరికా అదే స్థాయిలో టారిఫ్‌లు వడ్డిస్తానంటే ఉపయోగం ఉండకపోవచ్చన్నారు. ఎందుకంటే భారత్ అసలు పిస్తాలే ఎగుమతి చేయదు కాబట్టి నష్టపోయేదేమీ ఉండదని శ్రీవాస్తవ చెప్పారు.అమెరికా నుంచి దిగుమతుల విలువకు సంబంధించి 75 శాతం భాగానికి టారిఫ్‌లు సగటున 5 శాతం లోపే ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఇక జౌళి, దుస్తులు, పాదరక్షలులాంటి కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో అమెరికా అత్యధికంగా 15–35 శాతం సుంకాలు విధిస్తోందని వివరించారు. ‘రెండు దేశాల ఎగుమతుల ప్రొఫైల్స్ భిన్నంగా ఉంటాయి కాబట్టి ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా తుది నిర్ణయం కోసం ఏప్రిల్ వరకు ఎదురు చూసి, అప్పుడు అవసరమైతే 2019 జూన్లోలాగే మనం కూడా తగిన చర్యలు తీసుకోవచ్చు‘ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. వ్యాపార భాగస్వామ్య దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. స్పష్టత రావాలిపరిశ్రమపై విధిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. ఉదాహరణకు అత్యంత ప్రాధాన్య దేశాలకు (ఎంఎఫ్ఎన్) వ్యవసాయోత్పత్తుల మీద తాము 5 శాతం సుంకాలు విధిస్తుంటే.. భారత్ సగటు ఎంఎఫ్ఎన్ టారిఫ్ 39 శాతంగా ఉంటోందని అమెరికా వైట్‌హౌస్ ఫ్యాక్ట్ షీట్ వెల్లడించింది. అలాగే తమ మోటర్‌సైకిళ్లపై భారత్ 100 శాతం టారిఫ్‌లు విధిస్తుంటే, భారత మోటర్‌సైకిళ్లపై తాము 2.4 శాతం మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. దీనిపై స్పందిస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునేందుకు అమెరికా ఏదో ఒక అంశాన్ని, అంటే, ఉత్పత్తి లేదా రంగాన్ని ప్రామాణికంగా పరిగణించాలని శ్రీవాస్తవ చెప్పారు. లేకపోతే అత్యధికంగా పారిశ్రామికోత్పత్తులను సరఫరా చేసే చైనాకు ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని పేర్కొన్నారు.వాణిజ్యంలో కీలక భాగస్వామి...అమెరికాకు భారత్ గణనీయంగా ఎగుమతి చేస్తుండగా, అక్కడి నుంచి దిగుమతులు తక్కువగానే ఉంటూ.. వాణిజ్య మిగులు భారత్ పక్షాన సానుకూలంగా ఉంటోంది. 2023–24లో 119.71 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. అప్పట్లో భారత్ 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 42.19 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు సాధించింది. మరోవైపు, 2024–25 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 82.52 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అమెరికా రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. భారత్ 52.89 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 29.63 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. భారత్ పక్షాన 23.26 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. -
సమానంగా వడ్డిస్తాం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. దిగుమతి సుంకాలకు సంబంధించి.. ఆయా దేశాలపై వారితో సమానంగా టారిఫ్‌లు విధించే ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై వివిధ దేశాలు ఎంతమొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తున్నాయో.. అంతే మొత్తంలో ఆయా దేశాల ఎగుమతులపై తాము దిగుమతి సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం.. అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. భారత్‌పైనా దీని ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ‘ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. వారితో సమానంగా వడ్డించే సమయం వచ్చింది’ అని ట్రంప్ అంతకుముందు తన సొంత సోషల్‌మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’లో గురువారం పేర్కొన్నారు. అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు ట్రంప్ తాజా నిర్ణయం మింగుడుపడనిదే. భారీగా సుంకాలు విధిస్తే.. మార్కెట్లో ధరలు పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీపడే విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. -
ట్రంప్ నిర్ణయం.. ఈ దేశాలపై ప్రభావం!
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. అనేక కీలక ప్రకటనలు చేశారు. ఇప్పుడు తాజాగా దిగుమతి వస్తువులపై.. దిగుమతి సుంకాలను 25 శాతం పెంచనున్నట్లు సమాచారం. అమెరికాలోకి ప్రవేశించే ఉక్కు, అల్యూమినియంపై ట్యాక్స్ పెంపు జరిగితే.. కెనడా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.ఆదివారం న్యూ ఓర్లీన్స్‌లోని ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియా ముందు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపుకు సంబంధించిన ప్రకటన చేశారు. ఇది ఇంకా అమల్లోకి రాలేదు.. బహుశా ఒకటి లేదా రెండు రోజుల్లో అమలయ్యే అవకాశం ఉంది. ట్రంప్ విధించనున్న పన్ను ఏ దేశాలను లక్ష్యంగా చేసుకుని విధిస్తున్నారు?.. ఏ దేశాలకు మినహాయింపులు ఉంటాయనే విషయం వెల్లడించలేదు.ట్రంప్ చేసిన ప్రకటన అన్ని దేశాలకు వర్తిస్తే.. ఇండియాపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికాకు ఇనుము & ఉక్కు వస్తువులను ఎగుమతి చేసే అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి కాకపోయినా.. సంవత్సరానికి కేవలం మూడు బిలియన్ల డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే. అయినప్పటికీ కొంత ప్రభావం ఉంటుందని స్పష్టమవుతోంది.అమెరికా విధానాలను సహరించని.. దేశాల దిగుమతులపై సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. చెప్పినట్లుగానే కొన్ని రోజులకు ముందు చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాల దిగుమతులపై సుంకాలను పెంచేశారు. ఎన్నికల సమయంలో కూడా ట్రంప్ ట్యాక్స్ మీద పదేపదే వ్యాఖ్యానించారు. అమెరికా పరిశ్రమలను రక్షించడానికి, వాణిజ్య సమతుల్యతలను మెరుగుపరచడమే తన ఉద్దేశ్యమని, ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు.డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలు ప్రపంచంలోని చాలా దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇతర ప్రధాన దేశాలు తప్పకుండా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ దూకుడు ప్రపంచ వ్యాపార నాయకుల ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియాల్సి ఉంది. -
అనుకున్నదొకటి.. అయినదొకటి!
ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించింది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి అమెరికా బొగ్గు, ద్రవరూపంలో ఉన్న సహజ వాయువు (ఎల్ఎన్జీ), ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, కొన్ని కంపెనీలకు చెందిన ప్రీమియం కార్లు.. వంటివాటిని బారీగానే దిగుమతి చేసుకుంటోంది. దాంతో భవిష్యత్తులో వీటిపై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇటీవల అమెరికా విధించిన సుంకాల పెంపునకు ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అమెరికా అనుసరించిన సుంకాల పెంపు విధానం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘిస్తుందని, రెండు దేశాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారానికి విఘాతం కలిగిస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వచ్చే సోమవారం నుంచి ఈ సుంకాల పెంపు అమల్లోకి వస్తుందని చైనా స్పష్టం చేసింది. కొత్త టారిఫ్‌ల్లో బొగ్గు, ఎల్ఎన్జీ ఉత్పత్తులపై 15 శాతం సుంకం, ముడిచమురు, వ్యవసాయ యంత్రాలు, ప్రీమియం కార్లపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా తెలిపింది. అమెరికాలోకి అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని నిరోధించడంలో విఫలమైన దేశాలను శిక్షించడమే లక్ష్యంగా ట్రంప్ ఇటీవల చైనా వస్తువులపై 10% సుంకం విధిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..చైనా అమెరికాకు వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా కౌంటర్ టారిఫ్‌లతో పాటు, యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ గూగుల్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తును అమెరికా వాణిజ్య చర్యలకు ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. చైనా మార్కెట్లో గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పోటీదారులకు అన్యాయం చేసే ఏదైనా వ్యాపార పద్ధతులను ఉపయోగించిందా అనే దానిపై దర్యాప్తు దృష్టి సాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాపై సుంకాలు విధిస్తే వాణిజ్యం పరంగా కొంత వెనక్కి తగ్గుతుందని భావించిన అమెరికాకు.. చైనా ఇలా తిరికి టారిఫ్‌లు విధించడం కొంత ఎదురుదెబ్బే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల కోసం యూఎస్ భారత్‌వైపు చూసేలా ప్రయత్నాలు జరగాలని సూచిస్తున్నారు. -
మార్కెట్‌కు ట్రంప్ సుంకాల పోటు
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ అరశాతం నష్టపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి భారీ కోత, అధిక వెయిటేజీ రిలయన్స్ (–1.50%), ఎల్అండ్టీ (–4.50%) క్షీణతలూ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద నిలిచింది. దీంతో ఈ సూచీ 5 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 23,361 వద్ద నిలిచింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి 76,756 వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు కుప్పకూలి 23,222 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి కన్జూమర్ డ్యూరబుల్, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. → క్యాపిటల్ గూడ్స్, ఇండ్రస్టియల్స్, విద్యుత్, యుటిలిటీస్, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 2%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. → మార్కెట్ పతనంతో రూ.4.29 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.419 లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్లూ డీలా ట్రంప్ టారిఫ్ దాడికి ప్రతిగా తాము కూడా టారిఫ్‌లు పెంచుతామని కెనడా, మెక్సికో ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మరింత తీవ్రమయ్యాయి. ఆసియాలో జపాన్, తైవాన్, కొరియా సూచీలు 3.50% క్షీణించాయి. ఇండోనేషియా, సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాలు 2–0.5% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. అమెరికా సూచీలు నాస్డాక్ 1%, ఎస్అండ్పీ అరశాతం, డోజోన్ పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
ఐరోపా సమాఖ్యపైనా టారిఫ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై అదనపు టారిఫ్‌లు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)పై సుంకాలు విధిస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ సుంకాలు విధిస్తే తాము దీటుగా బదులిస్తామని ఐరోపా సమాఖ్య సైతం కుండబద్దలు కొట్టింది. చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను నివారించవచ్చని వ్యాఖ్యానించింది. 27 దేశాల కూటమిపై సుంకాల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నారా? అని వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది.‘‘ దీనికి నిజమైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?. ఖచ్చితంగా విధిస్తా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ అమెరికా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈయూకు వ్యతిరేకంగా ట్రంప్ గళమెత్తడం ఇది మొదటిసారి కాదు. వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని గతంలోనూ ఆయన ఆరోపించారు. ట్రంప్ తొలిసారిగా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పుడూ స్టీల్, అల్యూమినియం ఎగుమతులకు సంబంధించి ఈయూపై సుంకాలు విధించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఈయూ కూటమి వెంటనే తగిన రీతిలో స్పందించింది. విస్కీ, మోటార్ సైకిళ్లతో సహా పలు అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధించి ప్రతీకారం తీర్చుకుంది.ప్రతీకారం తప్పదన్న ఈయూకెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా టారిఫ్‌లు విధించడాన్ని ఈయూ వ్యతిరేకించింది. ‘‘సుంకాలు అనవసరమైన ఆర్థిక అంతరాయాలను సృష్టిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. అవి రెండు వైపులా ఇబ్బందులను కలగచేస్తాయి. అలాంటిది ఈయూ వస్తువులపైనే అన్యాయంగా లేదా ఏకపక్షంగా సుంకాలు విధించే ఏ వాణిజ్య భాగస్వామికైనా మేం గట్టిగా బదులిస్తాం’’ అని ఈయూ వ్యాఖ్యానించింది.మెక్సికోపై టారిఫ్ అమలుకు బ్రేక్మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వస్తూత్ప త్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఆఖరి నిమిషంలో తన ఆదేశాల అమలును నిలుపుదల చేశారు. నేటి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా తన ఉత్తర్వుల అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు సోమ వారం ట్రంప్ ప్రక టించారు. టారిఫ్‌ల అమలు నిలుపుదలపై అమె రికా సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ వెల్ల డించారు. సోమవారం ఆమె ట్రంప్‌తో దాదాపు 45 నిమిషాలు ఫోన్లో మంతనాలు జరిపారు. -
యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా దేశాల దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఓ మీడియా సమావేశంలో టారిఫ్‌లకు సంబంధించి అడిగిన అంశాలపై ఆమె సమాధానమిచ్చారు. అమెరికా ఇటీవల తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయం వల్ల నేరుగా భారత్‌పై పరిణామాలను అంచనా వేయడం ప్రస్తుతం తొందరపాటు అవుతుందన్నారు. అయితే భారత్ అప్రమత్తంగా ఉందని, టారిఫ్‌ల అంశాలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు.అమెరికా తాజాగా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్‌కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా విధించిన సుంకాలు ప్రభావం భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి నిర్మతా సీతారామన్ మాట్లాడుతూ..‘అమెరికా కెనడా, మెక్సికో, చైనాలపై విధించిన సుంకాల ప్రభావం కచ్చితంగా భారత్‌పై ఎలా ఉంటుందో ప్రస్తుతం అంచనా వేయలేం. కానీ తప్పకుండా భారత్‌పై కొంత పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి భారత్ అన్నింటినీ గమనిస్తోంది. అప్రమత్తంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. బడ్జెట్ అనంతర జరిగిన మీడియా సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ భారత్‌పై ఈ సుంకాల పరోక్ష ప్రభావాలను అంగీకరించారు.పరిశ్రమలకు ప్రోత్సాహంవాణిజ్య పరిధిని విస్తరించడం, ఆత్మనిర్భరత (స్వావలంబన-దేశీయ తయారీని ప్రోత్సహించడం)పై దృష్టి సారించడం వల్ల అమెరికా సుంకాల నుంచి ఎదురయ్యే ఊహించని సవాళ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషించడానికి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ), ఎగ్జిమ్ బ్యాంక్ వంటి వాణిజ్య సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. నిత్యావసర సరుకులకు సంబంధించి దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలని భారత్ లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడే అంతరాయాలను నిర్వహించడానికి స్థానిక పరిశ్రమలు బాగా సన్నద్ధమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్‌పై ప్రభావంటారిఫ్లు ఎందుకంటే..అక్రమ వలసలు, అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవాహానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించాలని నిర్ణయించారు. ఈ టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్యంపై గణనీయమైన ప్రభావాలను చూపుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం వంటి పరిశ్రమలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్‌పై ప్రభావం
అమెరికా ‘కంట్రీఫస్ట్’ విధానంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విధించిన సుంకాలను భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్‌కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అమెరికా, భారతదేశం చాలా సంవత్సరాలుగా సంక్లిష్టమైన వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య కొన్ని అంశాలపై సహకారం ఉన్నా, కొన్నింటిపై వివాదాలున్నాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఇరు దేశాలు ఆరు దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకున్నాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సానుకూల చర్యగా ఇరు వర్గాలు అభివర్ణించాయి. ఏదేమైనా, కొత్త సుంకాల భయం ప్రస్తుతం కీలకంగా మారుతుంది.టారిఫ్ భయాలకు కారణాలుముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో భారత్‌తో వాణిజ్య లోటుపై అమెరికా గళమెత్తింది. ఈ అసమతుల్యతలను పరిష్కరించడానికి, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలను ఒక మార్గంగా చూస్తుంది. సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంలో ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. విదేశీ పోటీ నుంచి దేశీయ పరిశ్రమలను రక్షించడానికి సుంకాలు అనుకూలమైన సాధనంగా అమెరికా పరిగణిస్తుంది. యూఎస్ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని భావిస్తే టారిఫ్‌ల విధానం భారత్‌కు విస్తరించే అవకాశం ఉంది.యూఎస్ సుంకాల వల్ల భారత్‌పై ప్రభావంఎగుమతుల క్షీణత: భారత ఎగుమతిదారులు, ముఖ్యంగా సుంకాల ద్వారా లక్ష్యంగా చేసుకున్న రంగాల్లో మార్కెట్ అవకాశాలు తగ్గడం, ఆదాయాలు క్షీణించడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇది ఆ రంగాల్లో ఉపాధి, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది.ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు: దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక సుంకాలు భారతీయ వినియోగదారులకు ఖర్చులు పెరగడానికి దారితీస్తాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదం చేస్తుంది.వాణిజ్య సంబంధాలు: టారిఫ్‌ల విధింపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రతీకార చర్యలకు దారితీస్తుంది. రెండు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణఇప్పుడేం చేయాలంటే..సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి, దానివల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకరమైన విధానాలు అన్వేషించాలి. అందుకు ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచడం కూడా అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. -
బంగారు కొండే!..10 గ్రా. @ రూ. 83,750
సాక్షి, బిజినెస్ డెస్క్: బంగారం వెలుగులు విరజిమ్ముతోంది. తగ్గేదేలే అంటూ రోజురోజుకు కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఢిల్లీలో తులం మేలిమి బంగారం ధర రూ.83,750కు ఎగబాకింది. ఇది ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తుంటే.. కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.ఎందుకీ ర్యాలీ..:అంతర్జాతీయంగా చూస్తే బంగారం ఔన్స్ (31.1 గ్రాములు) ధర ఈ నెల 24న సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 2,822 డాలర్లను తాకింది. గత ఏడాది నవంబర్ 5న నమోదైన 2,541 డాలర్ల కనిష్టం నుంచి ఏకంగా 281 డాలర్లు ఎగబాకింది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు మళ్లీ తెర తీస్తారనే భయాలు పెరిగిపోయాయి. అనుకున్నట్లే ముందుగా కెనడా, మెక్సికోలపై దిగుమతి సుంకాల మోత మోగించారు. చైనా, భారత్‌తోపాటు మరిన్ని దేశాలపైనా సుంకాలు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఇది అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితికి ఆజ్యం పోసింది. ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ఏడాదికాలంగా ఎగబాకుతూనే వస్తోంది. అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారంలోకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత మొదలుపెట్టడం కూడా పసిడి ధరలకు దన్నుగా నిలుస్తోంది. 2024లో వరుసగా మూడుసార్లు పావు శాతం చొప్పున ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు తగ్గించింది. ఈ ఏడాది రేట్ల కోత జోరు తగ్గినా, అక్కడే కొనసాగినా కూడా పసిడికి సానుకూలాంశమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు తగ్గాలని పదేపదే చెబుతున్నారు. అంటే రానున్న కాలంలో అమెరికాలో వడ్డీరేట్లు మరింత దిగొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కనకానికి మరింత కిక్కిచ్చే అంశం!సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల జోరు...అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్నే నమ్ముకుంటున్నాయి. 2024 నవంబర్‌లో అవి 53 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, ఇందులో భారత్ వాటా 8 టన్నులు. నవంబర్‌లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసి రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. పోలాండ్ నేషనల్ బ్యాంక్ 90 టన్నులు కొని టాప్‌లేపింది. ఇలా సెంట్రల్ బ్యాంకులు ఎడాపెడా పసిడి కొనుగోళ్లకు దిగడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది.మన దగ్గర అంతకు మించి..అంతర్జాతీయంగా పసిడి ధరలకు మించి భారత్‌లో పుత్తడి జిగేల్‌మంటోంది. గతేడాది చివర్లో పండుగల సీజన్‌కు తోడు, పెళ్లిళ్లు కూడా బాగా ఉండటంతో ఆభరణాలు, రిటైల్ కొనుగోళ్లు దూసుకెళ్లాయి. నవంబర్‌లో భారత్ 10 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం దీనికి నిదర్శనం. అంతర్జాతీయంగా గోల్డ్ రష్కు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు, డాలర్‌తో రూపాయి మారకం విలువ అంతకంతకూ దిగజారుతుండటం పసిడి ధరలు జోరందుకోవడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ చెబుతోంది.రూపాయి ఎఫెక్ట్..దేశీయంగా బంగారం ధర జనవరి నెలలోనే 5.5 శాతం (రూ.4,360) ఎగబాకగా.. గత వారం రోజుల్లోనే 2 శాతం (రూ.1,700) జంప్ చేసింది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రూపాయి నేలచూపులే. రోజురోజుకూ బక్కచిక్కతున్న రూపాయి విలువ తాజాగా 86.85 ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది. ఇందులో ట్రంప్ గెలిచిన రోజు నుంచి చూస్తే రూపాయి విలువ 250 పైసల మేర ఆవిరి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర ఈ నెల 24న ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకి ప్రస్తుతం 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయినా భారత్‌లో గత వారం రోజుల్లో పసిడి రేటు పెరుగుతూపోతోంది. డాలరు పుంజుకుని, రూపాయి పడిపోవడం వల్ల బంగారం దిగుమతుల కోసం ఎక్కువ రూపాయలు చెల్లించుకోవాల్సి రావడమే దీనికి కారణం.రేటు పైపైకే...!బంగారం గడిచిన ఏడాది నిజంగా కనకవర్షమే కురిపించింది. అంతర్జాతీయంగా, దేశీయంగా దాదాపు 25–30 శాతం మేర రాబడులు అందించి అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా నిలిచింది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి దూకుడు ఈ ఏడాది కూడా ఖాయమేనని బులియన్ నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. కాయిన్ ప్రైస్ బులియన్ విశ్లేషకుల తాజా అంచనా ప్రకారం.. ఈ ఏడాది బంగారం 3,150 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఏడాది చివరికల్లా 3,150–3,356 డాలర్ల రేంజ్లో స్థిరపడొచ్చని లెక్కగట్టారు. ఇక మన రూపాయి ఇలాగే పడిపోతూ.. దేశీయంగా ఆభరణాల డిమాండ్ కూడా పెరిగితే తులం బంగారం అక్షరాలా లక్ష రూపాయలను తాకడం ఖాయమనేది మెజారిటీ నిపుణుల అభిప్రాయం!!‘ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, ట్రంప్ సుంకాల మోత భయాలతో ఇన్వెస్టర్లు పసిడి జై కొడుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు పాజ్ ఇచ్చినా సరే పుత్తడికి సానుకూలమే’– దేవేయ గగ్లానీ, యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ఒక్కరోజే రూ.910 పెరుగుదలకొనుగోళ్ల డిమాండ్‌తో బుధవారం (29న) ఒక్కరోజే 99.9 స్వచ్ఛత బంగారం ధర ఢిల్లీలో 10 గ్రాములకు రూ.910 పెరిగి రూ.83,750కి చేరింది. ఈ నెల 1న బంగారం ధర రూ.79,390 వద్ద ఉండగా.. నెల రోజుల్లో 5.5 శాతం మేర (రూ.4,360) ర్యాలీ చేసింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.910 పెరిగి జీవిత కాల గరిష్టం రూ.83,350కి చేరింది. వెండి ధర కిలోకి రూ.1,000 పెరిగి రూ.93,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ రేటు 2,795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్‌లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్‌కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్‌కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్‌కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్‌లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్‌కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్‌రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్‌కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
సుంకాల బెదిరింపు
పదవీ బాధ్యతలు పూర్తిగా చేపట్టక ముందే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు పెంచారు. ‘అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం’ (అమెరికా ఫస్ట్) మంత్రాన్ని పదే పదే వల్లె వేస్తున్న ఆయన పదవీ బాధ్యతలు చేపడుతూనే చైనా పైనే కాక ఇతర దేశాలపైనా సుంకాలు విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలూ ఆంక్షల పాలయ్యే జాబితాలో ఉన్నాయి. అమెరికా వాణిజ్య, విదేశాంగ విధానంలో రానున్న పెనుమార్పుకు ఇది ఓ సూచన అనీ, రానున్న ట్రంప్ పదవీకాలంలో ఈ జాబితా మరింత పెరగడం ఖాయమనీ విశ్లేషణ. దానిపై చర్చోపచర్చలతో వారమైనా గడవక ముందే కాబోయే అగ్రరాజ్యాధినేత మరో బాంబు పేల్చారు. ‘బ్రిక్స్’ దేశాలు గనక అమెరికా డాలర్‌కు ప్రత్యర్థిగా మరో కరెన్సీని సృష్టించే ప్రయత్నం చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకాలు వేస్తామంటూ హెచ్చరించారు. ఆయన తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’పై చేసిన ఈ తాజా ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకూ, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకూ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణానికి ఇది ప్రతీక. అంతేకాదు... ఈ హెచ్చరికే గనక అమలు అయితే, ప్రపంచ వాణిజ్యం రూపురేఖలనే మార్చివేసే అనూహ్య పరిణామం అవుతుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికాలతో కూడిన కూటమిగా ముందు బ్రిక్స్ ఏర్పాటైంది. ఆపైన ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇరాన్‌లు సైతం ఆ బృందంలో చేరాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా డాలర్ సాగిస్తున్న గుత్తాధిపత్యానికి ముకుతాడు వేయాలనేది కొంతకాలంగా బ్రిక్స్ దేశాల్లో కొన్నిటి అభిప్రాయం. డాలర్‌ను రాజకీయ అస్త్రంగా వాడకుండా నిరోధించగల ప్రత్యామ్నాయ అంతర్జాతీయ చెల్లింపుల విధానం అవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అక్టోబర్‌లో ప్రస్తావించడం గమనార్హం. బ్రిక్స్ దేశాలు డాలర్ స్థానంలో మరో కరెన్సీకి గనక మద్దతునిస్తే మొత్తం కథ మారిపోతుంది. అయితే, డాలర్ నుంచి పక్కకు జరగడం వల్ల అమెరికాతో, ఇతర పాశ్చాత్య దేశాలతో సంబంధాలు దెబ్బతిని దారుణ పర్యవసానాలుంటాయని మరికొన్ని బ్రిక్స్ దేశాల భయం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరిక వెలువడింది. ప్రతీకారంగా అమెరికా 100 శాతం సుంకం వేస్తే, సరుకుల ధరలు పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్య ప్రవాహాలు అతలాకుతలమవుతాయి. నిజానికి, విదేశీ దిగుమతులపై కఠినంగా సుంకాలు విధించి, అమెరికా ఉత్పత్తులకు కాపు కాస్తానని వాగ్దానం చేయడం కూడా తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి దోహదపడిందని విస్మరించలేం. ‘అమెరికా ఫస్ట్’ ఆర్థిక విధానానికి అనుగుణంగానే ట్రంప్ తాజా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రపంచ వాణిజ్యంలో మార్పులతో అమెరికా ఆర్థిక సార్వభౌమాధికారం పునఃప్రతిష్ఠితమవుతుందనేది ఆయన వ్యూహం. ఇప్పుడీ సుంకాల పర్వం మొదలైతే, అది చివరకు ప్రపంచ వాణిజ్య యుద్ధంగా పరిణమిస్తుంది. ఈ సుంకాలన్నీ అమెరికా ప్రయోజనాల్ని కాపాడేందుకు సాహసోపేత నిర్ణయంగా కనిపించవచ్చు కానీ, వాటి తక్షణ ప్రభావం పడేది అమెరికా వినియోగదారులు, వ్యాపారాల మీదనే. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యావసాయిక ఉత్పత్తులు సహా రోజు వారీ అవసరాలైన అనేక సరుకుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల విడిభాగాలపై ఆధారపడినందు వల్ల అమెరికా వ్యాపార సంస్థలు చేసుకొనే దిగుమతులపై భారం పడుతుంది. ఆ సంస్థల లాభాలు తగ్గుతాయి. అమెరికా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో పోటీపడలేకపోతాయి. అమెరికాను అప్పుల నుంచి బయటపడేసేందుకు ట్రంప్ మాత్రం మిత్రదేశాలతోనూ కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడకపోవచ్చు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు తమ ఆదాయానికి అమెరికాపై అతిగా ఆధారపడుతుంటాయి. ఇక, ఎగుమతులపై ఎక్కువగా నడిచే బ్రెజిల్, సౌతాఫ్రికా ఆర్థిక వ్యవస్థలూ మందగిస్తాయి. కొత్త సుంకాల బాధిత దేశాలు గనక ప్రతిచర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి దిగజారుతుంది. గతంలో ఈ తరహా వాణిజ్య వివాదాలు తెలిసినవే. వాటిని నివారించడానికే అమెరికా సైతం అనేక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించింది. ఇప్పుడీ సుంకాలతో వాటికి అర్థం లేకుండా పోతుంది. దౌత్య పర్యవసానాలూ తప్పవు. అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటివి అరికట్టడానికి పొరుగు దేశాలపై సుంకాలు పనికొస్తాయని ట్రంప్ టీమ్ చెబుతున్నా, ఆశించిన ఫలితాలు దేవుడెరుగు... ఉద్రిక్తతలు పెరిగి, దేశాలతో సంబంధాలు, దీర్ఘకాలిక సహకారం దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత అనిశ్చితిలో పడుతుంది. ఈ ప్రతిపాదిత సుంకాలను బూచిగా చూపి, బ్రిక్స్ సహా ఇతర దేశాలనూ చర్చలకు రప్పించడమే అమెరికా ధ్యేయమైతే ఫరవా లేదు. అలా కాని పక్షంలో అనేక దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ అన్వేషణను ముమ్మరం చేయవచ్చు. ట్రంప్ కఠిన వైఖరితో వర్ధమాన దేశాలు, అలాగే బ్రిక్ సభ్యదేశాలు మరింత దగ్గరవుతాయి. అది చివరకు అగ్రరాజ్యానికే నష్టం. అయితే, ప్రపంచమంతా వ్యతిరేకించినా సరే తాను అనుకున్నదే చేయడం ట్రంప్ నైజం. పర్యావరణం, వాణిజ్యం, సైనిక దండయాత్రలపై గతంలో ఆయన చేసిందదే. తాత్కాలికంగా ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం పెద్ద పెద్ద మాటలు చెప్పడం బాగుంటుంది. వాటిని ఆచరణలో పెట్టాలన్నప్పుడు దీర్ఘకాలిక పర్యవసానాల్ని ఆలోచించకపోతే కష్టమే. అమెరికా కొత్త ప్రెసిడెంట్ అది గ్రహించి, ఆచితూచి వ్యవహరించాలి. కానీ, ఆకస్మిక, అనూహ్య నిర్ణయాలకే పేరుబడ్డ ట్రంప్ నుంచి అంతటి ఆలోచన ఆశించగలమా అన్నది ప్రశ్న. అనాలోచితంగా వ్యవహరిస్తే, అది అమెరికాకే కాదు... యావత్ ప్రపంచానికీ తంటా! -
తైవాన్ విషయంలో చైనాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇరుపార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా.. తైవాన్ జోలికి వెళ్లితే ఆ దేశంపై అదనపు సుంకాలను విధిస్తానన్నారు.‘‘నేను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే చైనా.. తైవాన్ జోలికి వెళితే. నేను మీకు 150 శాతం నుంచి 200 శాతం వరకు పన్ను విధిస్తాను’’ అని అన్నారు. తైవాన్‌పై చైనా చేసే.. ఆక్రమణకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ఉపయోగిస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇప్పటివరకు అయితే.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తనను గౌరవిస్తున్నారని, అటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.Republican presidential candidate Donald Trump said he would impose additional tariffs on #China if China were to "go into #Taiwan," the Wall Street Journal reported. https://t.co/muSDebjnxH— William Yang (@WilliamYang120) October 19, 2024ఇటీవల ట్రంప్ దిగుమతి సుంకాల విషయంపై స్పందిస్తూ.. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని అన్నారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని అన్నారు.చదవండి: తైవాన్ను దిగ్బంధించిన డ్రాగన్ -
ఇదే జరిగితే.. భారత్‌కు భలే ఛాన్స్!
చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై 45 శాతం వరకు సుంకాలను విధించేందుకు ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, పోలాండ్ వంటి యూరప్ దేశాలు ఓటు వేయగా.. జర్మనీతో పాటు మరో నాలుగు దేశాలు వ్యతిరేకంగా ఓటువేశాయి. యూరోపియన్ యూనియన్ ట్యాక్స్ పెరుగుదల వాణిజ్యం మీద గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై 45 శాతం అమలు చేయడం ప్రారంభమైతే.. ఐదేళ్లపాటు కొనసాగుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ ఉత్పత్తులు మరిన్ని దేశాలకు ఎగుమతవుతాయి. తద్వారా ఉత్పత్తి శాతం కూడా భారీగా పెరుగుతుంది.అమెరికా కూడా ఇప్పటికే చైనా ఉత్పత్తుల మీద సుంకాలను భారీగా పెంచింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే యూఎస్ ప్రకటించింది. ఇప్పటికే యూరప్ దేశాల్లో చైనీస్ దిగుమతుల మీద టారిఫ్ రేట్లు 35 శాతం వరకు ఉంటాయి. కొత్త విధానంలో మరో 10 శాతం పెరుగుతుంది.ఇదీ చదవండి: 'ఐఫోన్ 16 ప్రో'పై అసంతృప్తి: సెట్ చేసుకోవడానికి 24గంటలుచైనా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారులు ఈ టారిఫ్‌లను స్వీకరిస్తారా? స్వీకరిస్తే.. వాహనాల ధరలను పెంచుతారా? అనేది తెలియాల్సి ఉంది. అదనపు సుంకాల కారణంగా ఐరోపాలో ఇప్పటికే చైనీస్ కార్ల అమ్మకాలను గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు 45 శాతం సుంకం అమలులోకి వస్తే.. అమ్మకాల పరిస్థితి ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. -
రోజుకు ఎన్ని కాల్స్ చేస్తున్నారు? ట్రాయ్ కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్‌ను అరికట్టడానికి.. కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం గ్రేడ్స్ వారీ అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా పరిశ్రమను కోరింది. రోజుకు 50కి పైగా కాల్స్, లేదా 50 ఎస్ఎంఎస్లు పంపిన టెలికం సబ్స్క్రైబర్లను ఇబ్బందికర కాలర్లుగా పరిశీలించాలని టెలికం కంపెనీలకు సూచించింది.దేశంలో 110 కోట్ల మందికిపైగా టెలికం సబ్స్క్రైబర్లు ఉండగా వీరిలో 0.03 శాతం మంది రోజుకు ఒక సిమ్ నుంచి 51 నుంచి 100 ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారని ట్రాయ్ పేర్కొంది. అలాగే 0.12% మంది ఒక సిమ్ నుంచి రోజుకు 51 నుండి 100 వాయిస్ కాల్స్ చేస్తున్నారని ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో వివరించింది.‘టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018’ నిబంధనల పరిధిలో నమోదైన ఒక సంస్థ కాకుండా ఇతర వ్యక్తులకు ఒక సిమ్‌కు రోజుకు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్ కోసం గ్రేడ్స్ వారీ టారిఫ్ ఉండాలని స్పష్టం చేసింది. -
వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లు పెంపు
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా మూడేళ్లలో మొదటిసారి టారిఫ్‌లను పెంచింది. గత రెండేళ్లలో 5జీ టెక్నాలజీలో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు సిద్ధమైంది.మొదటగా జియో టారిఫ్‌లను 13 నుంచి 27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ మరుసటి రోజే ఎయిర్టెల్ కూడా 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు. జూలై 4 నుంచి ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్‌లను 10 నుంచి 23 శాతం పెంచనున్నట్లు తెలిపింది.ప్లాన్ల కొత్త ధరలు ఎంట్రీ లెవల్ ప్లాన్, 28 రోజుల మొబైల్ సర్వీస్‌కు కనీస రీఛార్జ్ ధరను 11 శాతం రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను రూ .719 నుంచి రూ .859 చేసింది. కంపెనీ తన వార్షిక అన్లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచి ప్రస్తుతం రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. -
వన్‌వెబ్ సేవలు చౌకగా ఉండవు..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ వన్‌వెబ్ సేవల టారిఫ్‌లు పాశ్చాత్య దేశాల్లోని మొబైల్ సర్వీసుల రేట్ల స్థాయిలో ఉంటాయని కంపెనీ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు. ఇవి భారత్‌లో ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్న టారిఫ్‌లకు సమానంగా మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. ఒక ఊళ్లో 30–40 ఇళ్లు ఒక కమ్యూనిటీగా సర్వీసులను వినియోగించుకుంటే కాస్త చౌకగా ఉండవచ్చని కానీ వ్యక్తిగతంగా ఒక్కరు వాడుకోవాలంటే మాత్రం ఖరీదైనవిగానే ఉండవచ్చని మిట్టల్ చెప్పారు. ‘మొబైల్ టారిఫ్‌ల స్థాయిలో శాటిలైట్ కమ్యూనికేషన్ ధర ఉంటుందా అని ప్రశ్నిస్తే .. ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న వాటి స్థాయిలో ఉండవచ్చు. భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు నెలకు 2 – 2.5 డాలర్ల స్థాయిలో (సుమారు రూ. 164– రూ. 205) ఉన్నాయి. ఆ రేట్లకు మాత్రం శాటిలైట్ కమ్యూనికేషన్ టారిఫ్‌లు ఉండవు. ఎందుకంటే అవి అత్యంత కనిష్ట రేట్లు‘ అని ఆయన పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించే వన్‌వెబ్‌కు సంబంధించిన 36 ఉపగ్రహాలను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ప్రయోగించిన సందర్భంగా మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఎల్వీఎం–3 (లాంచ్ వెహికల్ మార్క్–3) వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనితో వన్‌వెబ్‌కి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 618కి చేరింది. తమకు ఉపగ్రహ సర్వీసులను ఆవిష్కరించేందుకు పర్మిట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పేస్‌కామ్ పాలసీని ప్రవేశపెట్టి, స్పెక్ట్రం కేటాయించే వరకు వేచి ఉండాల్సి ఉంటుందని మిట్టల్ తెలిపారు. భారత్‌లో యూజర్ శాటిలైట్ టెర్మినల్స్ తయారీ కోసం కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. -
యూజర్లకు భారీ షాక్, మోత మొదలైంది..మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్!
మొన్నటివరకు తక్కువ టారిఫ్‌లు ఎంజాయ్ చేసిన కస్టమర్లు.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చార్జీల మోతతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు. బిజినెస్ ఇన్ సైడర్ విశ్లేషకుల అంచనా ప్రకారం..ఎయిర్టెల్,రిలయన్స్ జియో టారిఫ్ ధరల్ని 10 శాతం పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీల ఆదాయం,మార్జిన్లపై పెరుగుతున్న ఒత్తిళ్లు ధరల పెరుగుదలకు కారణం కావచ్చు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో అన్నీ ఒక వినియోగదారుడికి సగటు ఆదాయం (ఎఆర్ పియు) లో మితమైన లాభాలను చూశాయి. ఈ నేపథ్యంలో టెలికం కంపెనీలు టారిఫ్ ధరల్ని పెంచడం, కొన్ని ప్లాన్లను నిలిపివేయడం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ ఇప్పటికే చౌకైన ప్లాన్ లను రద్దు చేయడం ప్రారంభించింది. కంపెనీ గ్రామీణ ప్రాంతాల యూజర్లను టార్గెట్ చేస్తూ ప్రారంభించిన రూ .99 ప్లాన్‌ను రద్దుచేసింది. క్యూ 2 లో ఎయిర్టెల్ ఇబిటా (ebitda) మార్జిన్ 43.7 శాతం నుండి 36.9 శాతానికి పడిపోయింది.ఇప్పటికే నంబర్ పోర్టబిలిటీ కోసం డిమాండ్,మొత్తం చందాదారుల సంఖ్య స్తబ్దుగా ఉందని నివేదిక తెలిపింది. 5జీ అప్డేట్స్ టెలికం కంపెనీలు దేశంలో 5జి నెట్ వర్క్ కోసం టారిఫ్ ధరల్ని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలను అందిస్తున్నాయి. 2023 చివరి నాటికి భారతదేశంలోని అన్ని నగరాలను కవర్ చేయాలని రిలయన్స్ జియో యోచిస్తోంది.జియో ట్రూ 5జి ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై,కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాథ్‌ద్వారా, గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాల్లో జియో వెల్కమ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి అన్ని ప్రధాన మెట్రోలలో ఈ సేవను ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 5 జి కవరేజీ ఉంటుందని ఎయిర్ టెల్ పేర్కొంది. -
పండుగ తర్వాత షాకిచ్చిన కేంద్రం.. పెరగనున్న వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. పామాయిల్ దిగుమతి సుంకాలను 6-11 శాతం పెంచనుంది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయిల్‌పై (Oil) దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం వల్ల వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కందుల గింజల ధరల కారణంగా అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ముడి పామాయిల్ (CPO) దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952డాలర్లకి పెరిగింది. అలాగే ఆర్బీడీ (RBD) పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 905డాలర్ల నుంచి 962డాలర్లకు ఎగసింది. ఇతర పామ్ ఆయిల్ టారిఫ్ కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి పన్నును రద్దు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎడిబుల్ ఆయిల్స్, బంగారం, వెండి దిగుమతి ధరలను ప్రభుత్వం సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు అధిక భాగం రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి సరఫరా జరుగుతోంది. చదవండి: 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే! -
ఎయిర్టెల్ 5జీ టారిఫ్ ధరలు, 4జీ తో పోలిస్తే
దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ టారిఫ్ ధరల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ మరికొన్ని రోజుల్లో 5జీ ప్లాన్స్ ధరల్ని ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎయిర్టెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..5జీ వినియోగదారులు తక్కువగా ఉండి, టారిఫ్ ధరలు ఎక్కువగా ఉంటే..ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పెరగదని తెలిపారు. అదే సమయంలో థాయిల్యాండ్‌లో 5జీ నెట్ వర్క్‌ను వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉందని, అందుకు కారణం ఈ ఫాస్టెస్ట్ నెట్ వర్క్ టారిఫ్ ధరలు ఎక్కువగా ఉండడమేనని అన్నారు. కాబట్టే భారత్‌లో 4జీ తో పోలిస్తే 5జీ ధరలు ఎక్కువగా ఉండవని చెప్పారు. ‘టెలికం రంగంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్ఓఐ) కేవలం 7శాతం మాత్రమే ఉంది. ఆర్ఓఐ పెరిగలంటే అది ఏఆర్పీయూతోనే సాధ్యమని పేర్కొన్నారు. చదవండి👉ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
మరో రౌండ్ టెలికాం చార్జీల బాదుడు తప్పదు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో మూడు ప్రైవేట్ టెలికం దిగ్గజాలు (జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) మరో విడత టారిఫ్‌లు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2022–23లో టెల్కోల ఆదాయాలు 20–25 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. టెలికం సంస్థలు తమ నెట్వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్‌పై వచ్చే ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మరింత పెంచుకోవాల్సి ఉంటుందని, అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ కేవలం 5 శాతం పెరిగిందని, అయితే ఇప్పటివరకూ పెంచినది.. ద్వితీయార్ధంలో పెంచబోయేది కూడా కలిపితే యూజరుపై ఆదాయం 15-20 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో టెలికం సంస్థలు నెట్వర్క్, స్పెక్ట్రంపై భారీగా వెచ్చించనున్నాయని.. ఏఆర్పీయూ వృద్ధి, టారిఫ్‌ల పెంపుతో వాటిపై ఆర్థిక భారం కొంత తగ్గగలదని పేర్కొంది. ‘టాప్ 3 సంస్థల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 20-25% పెరిగే అవకాశం ఉంది. అలాగే నిర్వహణ లాభాల మార్జిన్ 1.80-2.20% పెరగవచ్చు‘ అని క్రిసిల్ వివరించింది. తగ్గిన యూజర్లు..: గత ఆర్థిక సంవత్సరంలో 3.70 కోట్ల ఇనాక్టివ్ యూజర్ల (పెద్దగా వినియోగంలో లేని కనెక్షన్లు) సంఖ్య తగ్గింది. యాక్టివ్ యూజర్లు (వినియోగంలో ఉన్న కనెక్షన్లు) 3 శాతం పెరిగారు. రిలయన్స్ జియో మొత్తం యూజర్ల సంఖ్య 2021 ఆగస్టు-2022 ఫిబ్రవరి మధ్య భారీగా పడిపోయినప్పటికీ యాక్టివ్ యూజర్ల వాటా 94%కి పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్టెల్ కనెక్షన్లు 1.10 కోట్ల మేర పెరగ్గా యాక్టివ్ యూజర్ల వాటా 99%కి చేరింది. -
ఇలా చేస్తే భారత్‌లో 5జీ సేవలు జోరందుకుంటాయ్
న్యూఢిల్లీ: దేశీయంగా టెల్కోలు కొత్త టెక్నాలజీలు ఆవిష్కరించాలన్నా, నాణ్యమైన 5జీ సేవలు అందించాలన్నా భారత టెలికం మార్కెట్లో టారిఫ్‌లు లాభసాటిగా ఉండాలని సాఫ్ట్‌బ్యాంక్ ఇండియా కంట్రీ హెడ్ మనోజ్ కొహ్లి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీ టెలికం రంగానికి ఎంతో ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా 5జీ విప్లవానికి సిద్ధమయ్యేందుకు పరిశ్రమకు ఇది సహాయపడగలదని కొహ్లి తెలిపారు. ఐవీసీఏ మ్యాగ్జిమం ఇండియా సదస్సు (ఎంఐసీ)లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ‘టారిఫ్‌లు మరింత మెరుగ్గా ఉండాలని నేను భావిస్తున్నాను. అయితే, ఎంత స్థాయిలో ఉండాలన్నది నేను చెప్పలేను. అది టెలికం సంస్థల ఇష్టం. స్థూలంగా చెప్పాలంటే టెల్కోలు.. కొత్త టెక్నాలజీలతో పాటు 5జీ సేవలను నాణ్యంగా అందించగలిగేంత స్థాయిలో ఉండాలన్నది నా అభిప్రాయం‘ అని కొహ్లి పేర్కొన్నారు. భారత్‌లో 5జీ సేవల విస్తరణ వేగంగా జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ‘విద్యుత్ రంగంలాగానే టెలికం కూడా కీలకమైన మౌలిక సదుపాయం. స్థూల దేశీయోత్పత్తి మరింత అధికంగా వృద్ధి చెందడానికి ఇది కూడా ఎంతో ముఖ్యం‘ అని తెలిపారు. వాయిస్ సర్వీసులపై వినియోగదారులకు ఆసక్తి తగ్గిందని.. భవిష్యత్తంతా డేటా, కంటెంట్‌దేనని కొహ్లి చెప్పారు. టెల్కోలు ఇందుకు అనుగుణంగా తమ వ్యాపార విధానాలను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. -
మిత్రభేదానికి బైడెన్ విరుగుడేమిటి?
అమెరికా జాతీయ భద్రత సాకుతో గతంలో ట్రంప్ విదేశాల నుంచి వచ్చే విదేశీ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. దాంట్లో కూడా ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలకు సుంకాల పెంపు నుంచి మినహాయించి, ఈయూ, జపాన్‌తో సహా ఇతర దేశాలను పన్నులపెంపు జాబితాలో చేర్చారు. ఇప్పుడు వాణిజ్య ప్రతిష్టంభనను సడలించాలంటే ఆ దేశాలకు కూడా మినహాయింపునివ్వడం లేదా సుంకాల పెంపు చట్టాన్ని రద్దుచేయడం తప్ప జో బైడెన్ ముందు మరో మార్గం లేదు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వాణిజ్య ఉద్రిక్తతలను సడలించడంలో అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పనిచేసేలా విధానాలు రూపొంది స్తానని, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడేలా చైనాపై ఒత్తిడి పెంచుతానని ఎన్నికల ప్రచార సమయంలో నొక్కి చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో అనేక దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన నేపధ్యంలో నాయకత్వ వివాదాన్ని పరిష్కరించేందుకు తగిన అవకాశం బైడెన్ ముందుంది. తన వాణిజ్య భాగస్వాములపై అధికభారం మోపుతూ ట్రంప్ పాలనాయంత్రాంగం ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై పెంచిన భారీ సుంకాలను కూడా బైడెన్ ఎత్తివేసే అవకాశముంది. వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రూప్–20 దేశాల అత్యవసర సమావేశానికి పిలుపునివ్వడం ద్వారా ప్రపంచ ఆర్థిక రంగాన్ని బైడెన్ నియంత్రించవచ్చు. వాతావరణ మార్పు ప్రత్యేక ప్రతినిధిగా మాజీ విదేశీమంత్రి జాన్ కెర్రీని నియమించడం ద్వారా, గతంలో ట్రంప్ కుదుర్చుకున్న కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేయగలనన్న ఉద్దేశాన్ని ఈ వారం జో బైడెన్ ప్రకటించారు. ఇకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థ కొత్త నేత ఎన్నికపై నెలకొన్న ప్రతి ష్టంభనను తొలగించడం బైడెన్ తీసుకునే చర్చల్లో ఒకటి. అనేక దేశాలు సమర్థించిన నైజీరియా మాజీ ఆర్థికమంత్రి, ప్రపంచ బ్యాంక్ మాజీ ఉన్నతాధికారి ఎంగోజి ఒకాన్జో లెవెలా అభ్యర్థిత్వాన్ని ట్రంప్ పాలనాయంత్రాంగం గతంలో వ్యతిరేకించింది. ఒకాం జోకు ప్రపంచ వాణిజ్యంలో తగినంత అనుభవం లేదని ఆరోపిస్తూ ట్రంప్ యంత్రాంగం దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యో మ్యున్గీని బలపర్చింది. వీరిద్దరిలో ఎవరు ఎన్నికైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు తొలిసారిగా ఒక మహిళ నాయకత్వం వహించినట్లు అవుతుంది. ఒకాంజో గెలిస్తే ఆఫ్రికా నుంచి డబ్ల్యూటీవోకు ఎంపికైన తొలి నేతగా కూడా చరిత్రకెక్కుతారు. నైజీరియా అభ్యర్థిని ఆమోదించడం ద్వారా బైడెన్ యంత్రాంగం ఈ అంశంపై ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు పలకవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మధ్యవర్తిగా డబ్ల్యూటీవో పాత్రను పునరుద్ధరించే దశగా బైడెన్ తగు చర్యలను తీసుకోవడం ప్రారంభించాలని ఆయన సన్నిహిత బృందం సూచిస్తోంది. డబ్ల్యూటీవోలో న్యాయం లేదని ఆరోపించిన ట్రంప్ ఈ సంస్థ అప్పిలేట్ బాడీకి కొత్త న్యాయమూర్తుల నియామకాన్ని కూడా నిషేధించారు. కాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ప్రధానమైనది సుంకాల పెంపు. జాతీయ భద్రత పరిరక్షణ పేరుతో ట్రంప్ ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలు విధించారు. జాతీయ రక్షణకు అత్యవసరమైన దేశీయ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ చర్యలు తప్పవని ట్రంప్ చెప్పారు. ట్రంప్ పెంచిన సుంకాలు అమెరికా ఉక్కు తయారీ సంస్థలకు మిశ్రమ ప్రయోజనాలు కల్పిచాయి. అయితే అమెరికా ఉత్పత్తిదారులను ఇవి మరోవిధంగా దెబ్బతీశాయి. ఇతర దేశాలు కూడా అమెరికానుంచి దిగుమతి చేసుకునే ఉక్కు ఉత్పత్తులపై ప్రతీకార చర్యలతో అధిక పన్నులు విధించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలకు సుంకాల పెంపునుంచి మినహాయించిన ట్రంప్ ఈయూ, జపాన్‌తో సహా ఇతర దేశాలను పన్నులపెంపు జాబితాలో చేర్చారు. జో బైడెన్ ప్రస్తుతం చేయవలసింది ఏమిటంటే విదేశీ ఉక్కు దిగుమతులపై సుంకాల పెంపును రద్దు చేయడమేనని రాక్ గ్రీక్ గ్లోబల్ అడ్వైజర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ స్మార్ట్ స్పష్టం చేశారు. అదేసమయంలో కొత్త పాలనా యంత్రాంగం వ్యాపారాన్ని ప్రోత్సహించే అధికార యంత్రాంగంతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని మొదటగా నిర్ణయించుకోవాల్సి ఉంది. ఏ వ్యాపార ఒప్పందాన్నైనా ఆమోదించడానికి ముందు దాన్ని కాంగ్రెస్‌కు సమర్పించే అధికారాన్ని వాణిజ్య అధికారులకు కల్పిస్తూ కొత్త చట్టం అవకాశం కల్పించింది. రిపబ్లికన్లు సెనేట్‌పై నియంత్రణను కలిగి ఉన్నందున, భవిష్యత్ వాణిజ్య ఒప్పం దాలలో కార్మికుల, పర్యావరణ రక్షణపై విభేదాలు కొనసాగనున్నాయి. కాబట్టి కొత్త వాణిజ్య అదికార యంత్రాంగాన్ని పునరుద్ధరించడంలో కచ్చితంగా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఈ వాణిజ్య అధికారుల నియంత్రణ ప్రాతిపదికన ట్రంప్ యంత్రాంగం ప్రారంభించిన యునైటెడ్ కింగ్డమ్తో వాణిజ్య ఒప్పందంపై కూడా బైడెన్ చర్చలు కొనసాగించాల్సి ఉంది. పైగా కరోనా వైరస్ రికవరీపై అంతర్జాతీయ అజెండాను ఏర్పర్చడానికి వచ్చే సంవత్సరం ప్రారంభంలో జీ–20 దేశాల అత్యవసర సదస్సుకు పిలుపునివ్వాల్సిందిగా డెమాక్రాటిక్ పార్టీకి చెందిన పలువురు మాజీ అధికారులు బైడెన్‌ను కోరుతున్నారు. -నికోలస్, సీనియర్ పాత్రికేయులు -
టెల్కోల ఆదాయానికి బూస్ట్
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు యూజర్లపై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్రమంగా పెరగనుంది. కరోనా వైరస్ కాలంలో పెరిగిన డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు (మార్కెట్ ఆధారితమైనది కావొచ్చు లేదా నియంత్రణ సంస్థపరమైన చర్యల ఆధారితమైనదైనా కావొచ్చు) తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. జేఎం ఫైనాన్షియల్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిన నేపథ్యంలో ఏఆర్పీయూల పెరుగుదల తప్పనిసరిగా ఉండవచ్చని, ఫలితంగా 2024–25 నాటికి పరిశ్రమ ఆదాయం రెట్టింపై సుమారు రూ. 2,60,000 కోట్లకు చేరవచ్చని పేర్కొంది. భవిష్యత్ పెట్టుబడుల అవసరాలను బట్టి చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి టెల్కోల ఏఆర్పీయూ రూ. 230–250 స్థాయికి చేరాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.ఇక ఆధిపత్యమంతా రెండు కంపెనీలదే కాకుండా చూసేందుకు వొడాఫోన్ ఐడియా మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సంస్థ ఏఆర్పీయూ రూ. 190–200 దాకా ఉండాల్సి వస్తుందని పేర్కొంది. కొత్త చోదకాలు..: ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్న ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్టీటీహెచ్), ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ వంటి వ్యాపార విభాగాలు భవిష్యత్‌లో వృద్ధికి కొత్త చోదకాలుగా మారగలవని జేఎం ఫైనాన్షియల్ నివేదిక తెలిపింది. ఈ రెండు విభాగాల్లో జియో వాటా 5–10 శాతం స్థాయిలోనే ఉండటంతో అది చౌక పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో జియో యూజర్ల సంఖ్య పెరగడం కొనసాగుతుందని వివరించింది. వొడాఫోన్ ఐడియా యూజర్లను కొల్లగొట్టడం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి జియో 50% మార్కెట్ వాటా లక్ష్యాన్ని సాధించవచ్చని, ఎయిర్టెల్ మాత్రం తన 30% వాటాను రక్షించుకోగలదని నివేదిక అభిప్రాయపడింది. -
టెలికం టారిఫ్‌ల పెంపు తప్పదు: ఈవై అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత స్వరూపంలో ఆపరేటర్లకు సముచిత స్థాయిలో రాబడులు వచ్చే అవకాశాలు లేనందున టెలికం టారిఫ్‌లు తప్పకుండా మరింత పెరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. టెల్కోలు వచ్చే 12–18 నెలల వ్యవధిలో మరో రెండు విడతలు పెంచవచ్చని పేర్కొంది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లోనే ఒక విడత పెంచే అవకాశం ఉందని ఈవై లీడర్ (వర్ధమాన దేశాల టెక్నాలజీ, మీడియా, టెలికం విభాగం) ప్రశాంత్ సింఘాల్ తెలిపారు. అయితే, ఇదంతా కరోనా వైరస్‌పరమైన పరిణామాలు, యూజర్ల చెల్లింపు సామర్థ్యాలపై పడిన ప్రతికూల ప్రభావాలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. -
ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు
వాష్టింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దాడిని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మళ్లీ రాజుకోనుంది. కోవిడ్-19 కారణంగా చైనాపై వాణిజ్య సుంకాలను పెంచనున్నట్లు ట్రంప్ బెదిరించారని గురువారం స్థానిక మీడియా నివేదించింది. చైనా నుంచే కరోనా మహమ్మారి వ్యాపించిందని పదే పదే దాడి చేస్తున్న ట్రంప్ చైనాతో వాణిజ్య ఒప్పందం తమకు ద్వితీయ ప్రాముఖ్యత అంటూ వాణిజ్య యుద్దానికి తెరలేపారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసాం. నిజానికి చాలా వాణిజ్యం జరుగుతోంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ తో తమకు జరిగి నష్టం కారణంగా ఈ నిర్ణయం తీసుకోన్నామని ట్రంప్ విలేకరులతో అన్నారు. వైరస్, లాక్డౌన్, ఆర్థిక నష్టాలు ఈ పరిస్థితి ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పారదర్శకత పాటించని చైనాకు అమెరికా రుణాన్ని రద్దు చేయాలనే ఆలోచనపై అధికారులు చర్చించినట్లు వాషింగ్టన్ పోస్ట్ గురువారం నివేదించింది. అయితే దీన్ని ట్రంప్ అత్యున్నత ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో ఖండించారు. మరోవైపు రుణాల రద్దు, చైనాపై అమెరికా ప్రతీకారంపై ప్రశ్నించినపుడు ట్రంప్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ దీన్ని భిన్నంగా చేయనున్నామని వ్యాఖ్యానించారు. చైనా అమెరికా మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై జనవరిలో ట్రంప్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏటా 370 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువుల దిగుమతులపై 25 శాతం వరకు సుంకం అమలవుతోంది. చైనా ఎగుమతి చేసే కొన్ని రకాల వస్తువులపై సుంకాలను తగ్గింపు ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి టారీఫ్‌లను ట్రంప్ పెంచనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. (అమెరికాపై చైనా విమర్శలు: నెటిజన్ల ఫైర్!) కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని, దీనికి తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై లోతైన విచారణ జరుగుతోందని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. కరోనావైరస్ మూలం, వ్యాప్తిలో చైనా పాత్ర గురించి తన ఆందోళనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు, కోవిడ్-19 మనుషులు సృష్టించింది కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడం గమనార్హం. కాగా కరోనా విజృంభణతో అమెరికాలో 60 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మిలియన్ కేసులను దాటిన మొదటి దేశంగా అమెరికా నిలిచింది. దీనికి తోడు రెండోసారి అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో దేశంలోని తీవ్ర ఆర్థిక సంక్షోభం అమెరికా అధ్యక్షుడిని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో తన గెలుపును అడ్డుకునేందుకు చైనా కుట్రచేసిందని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవిడ్-19 చైనానే తయారు చేసిందని ఆరోపిస్తున్నారని అధికార, ప్రతిపక్షాల నుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. -
భారీ టారిఫ్‌లతో దెబ్బతీస్తోంది
వాషింగ్టన్: భారీ టారిఫ్‌లతో వాణిజ్యపరంగా తమ దేశాన్ని భారత్ చాన్నాళ్లుగా గట్టిగా దెబ్బతీస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. భారత మార్కెట్లో అమెరికా ఉత్పత్తుల విక్రయాలకు మరింతగా అవకాశాలు కల్పించేలా ప్రధాని నరేంద్ర మోదీతో వ్యాపారాంశాలు చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడోలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24, 25న ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను వచ్చే వారం భారత్ సందర్శిస్తున్నాను. అక్కడ వాణిజ్యం గురించి చర్చలు జరుపుతాను. వ్యాపారపరంగా అనేకానేక సంవత్సరాలుగా భారత్ మనను దెబ్బతీస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో అది కూడా ఒకటి. వీటన్నింటిపై కాస్త మాట్లాడాలి‘ అని ట్రంప్ చెప్పారు. ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్యంలో భారత్ వాటా సుమారు 3%గా ఉంటుంది. అమెరికాకు ప్రయోజనకరమైతేనే డీల్.. భారత పర్యటన సందర్భంగా భారీ డీల్ కుదరవచ్చన్న అంచనాలు తగ్గించే ప్రయత్నం చేశారు ట్రంప్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత్‌తో ఏదైనా భారీ డీల్ కుదుర్చుకోవచ్చని, అప్పటిదాకా చర్చల ప్రక్రియ నెమ్మదిగా సాగవచ్చని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ప్రయోజనకరంగా ఉంటేనే ఏ ఒప్పందమైనా కుదుర్చుకుంటామన్నారు. ఆతిథ్యంపై భారీ అంచనాలు.. భారత్‌లో స్వాగత సత్కారాలు భారీ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంకు వెళ్లే దారిలో దాదాపు కోటి మంది దాకా స్వాగతం పలుకుతారని ప్రధాని మోదీ నాకు చెప్పారు. అయితే, దీంతో ఓ చిన్న సమస్య రావొచ్చు. ఇప్పుడు సమావేశమైన ఈ ప్రాంగణం సుమారు 60వేల మందితో కిక్కిరిసిపోయింది. వేల మంది లోపలికి రాలేక బైటే ఉండిపోయారు. అయినప్పటికీ.. భారత్‌లో కోటి మంది ప్రజల స్వాగతం చూశాక.. ఇక్కడ వేల సంఖ్యలో వచ్చే వారు కంటికి ఆనకపోవచ్చు‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
విదేశీ సైట్లలో కొంటే బాదుడే..!
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ సైట్లలో జరిపే కొనుగోళ్లు ఇకపై భారం కానున్నాయి. ఈ షాపింగ్ పోర్టల్స్‌లో లావాదేవీల్లో సుంకాలు, పన్నుల ఎగవేత ఉదంతాలు చోటు చేసుకుంటుండటంపై కేంద్రం మరింతగా దృష్టి సారించడమే ఇందుకు కారణం. సీమాంతర లావాదేవీలపై ప్రీ–పెయిడ్ విధానంలో కస్టమ్స్ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన పక్షంలో విదేశీ ఆన్లైన్ షాపింగ్ సైట్ల ద్వారా జరిపే కొనుగోళ్లు దాదాపు 50% మేర భారం కాగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే... భారతీయులకు విదేశాల నుంచి వచ్చే గిఫ్టుల విలువ రూ. 5,000 దాకా ఉన్న పక్షంలో పన్నుల భారం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని పలు చైనీస్ ఈ–కామర్స్ వెబ్సైట్లు .. ఇక్కడివారు కొనుగోలు చేసిన ఉత్పత్తులను బహుమతుల పేరిట ఎగుమతి చేస్తున్నాయి. తద్వారా సుంకాలు, పన్నుల ఎగవేత జరుగుతోంది. పలు ఉత్పత్తులపై భారీగా ఉండే సుంకాల భారం తగ్గడం వల్ల దేశీ ఈ–కామర్స్ పోర్టల్స్‌తో పోలిస్తే విదేశీ షాపింగ్ పోర్టల్స్‌లో కొనే ఉత్పత్తులు దాదాపు 40 శాతం చౌకగా లభిస్తున్నాయి. ఇలా విదేశీ ఈ–కామర్స్ సంస్థలు వ్యాపార లావాదేవీల కోసం గిఫ్ట్ విధానాన్ని దుర్వినియోగం చేస్తుండటం వల్ల దేశీ ఈ–కామర్స్ సంస్థలకు నష్టం జరుగుతోందని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ చైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. కస్టమ్స్ సుంకాలు, వస్తు–సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత జరుగుతున్న ఇలాంటి లావాదేవీలను గతేడాది.. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మరింత లోతుగా పరిశీలించింది. గిఫ్టుల రూపంలో వచ్చే దిగుమతులపై ముంబై కస్టమ్స్ విభాగం నిషేధం విధించింది. దీంతో ఈ తరహా కొనుగోళ్లు సుమారు 60 శాతం దాకా పడిపోయాయి. కీలకమైన ఔషధాలు, రాఖీలు మినహా గిఫ్ట్ మార్గంలో విదేశీ ఈ–కామర్స్ సైట్ల నుంచి వచ్చే ప్యాకేజీలన్నింటిపైనా నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. కొత్త విధానం ఇలా.. తాజాగా విదేశీ షాపింగ్ పోర్టల్స్ ద్వారా జరిగే కొనుగోళ్లపై సుంకాలు, పన్నులు విధించే అంశంపై కేంద్రం .. లోకల్‌సర్కిల్స్ వంటి సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విధానం ప్రకారం కస్టమ్స్ విభాగం సొంత పేమెంట్ ఇంటర్ఫేస్ను వినియోగంలోకి తెస్తుంది. చైనా తదితర విదేశీ ఈ–కామర్స్ సంస్థలు.. భారత కస్టమర్ల నుంచి సుంకాలు, పన్నులు వసూలు చేసి ఈ ఐటీ సిస్టమ్ ద్వారా భారత ప్రభుత్వానికి చెల్లిస్తాయి. లావాదేవీ వివరాలు సమర్పించి, ప్రీపెయిడ్ సుంకాలను చెల్లించిన తర్వాత.. ఆయా ఈ–కామర్స్ సంస్థలకు రసీదు, లావా దేవీ రిఫరెన్స్ నంబరు లభిస్తుంది. ఈ ప్రక్రి య పూర్తయిన తర్వాతే ఉత్పత్తుల డెలివరీకి వీలవుతుంది. ప్రత్యామ్నాయంగా సదరు విదేశీ ఈ–కామర్స్ సంస్థకు భారత్‌లో ఉన్న భాగస్వామ్య సంస్థ అయినా సంబంధిత పన్నులు చెల్లిస్తే లావాదేవీకి ఆమోదముద్ర లభిస్తుంది. ఇలాంటి ప్రీ–పెయిడ్ మోడల్‌తో కస్టమర్లు, విదేశీ సరఫరాదారుల మధ్య లావాదేవీలపై పారదర్శకత పెరుగుతుందని లోకల్‌సర్కిల్స్ చైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. -
పసిడిపై దిగుమతి సుంకాలు తగ్గించాలి..
భారత్ ఏటా 800–900 టన్నుల పసిడి దిగుమతి చేసుకుంటోంది. 2018–19లో పసిడి దిగుమతులు 22.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసే దిశగా పసిడిపై విధించిన సుంకాలతో.. దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 7 శాతం క్షీణించి 20.57 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయంలో వజ్రాభరణాల దిగుమతులు కూడా 1.5 శాతం క్షీణించి 20.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో పసిడి, వజ్రాభరణాల వ్యాపార సంస్థలు కేంద్ర ప్రభుత్వం ముందు పలు విజ్ఞప్తులు ఉంచాయి. ►బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకాల (జీఎస్టీ అదనం)తో ఆభరణాల కొనుగోలు భారీ వ్యయాలతో కూడుకున్నదిగా మారిపోయింది. దీన్ని 6 శాతానికి తగ్గించాలి. కట్, పాలిష్డ్ డైమండ్స్‌పై సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలి. ►కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వినియోగించిన పక్షంలో బ్యాంక్ కమీషన్లు తొలగించాలి. లేదా ప్రస్తుతమున్న 1–1.5 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గించాలి. ►ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల్లో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలి. ►పసిడి పరిశ్రమ మరింత పారదర్శకంగా పనిచేసే విధంగా తగిన ఇన్ఫ్రా, ప్రమాణాలను నెలకొల్పాలి. భారీ స్థాయి గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజ్, బులియన్ బ్యాంకింగ్ మొదలైనవి పటిష్టం చేయాలి. -
ట్రాయ్ షాక్; ఆ షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: కేబుల్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా ట్రాయ్ తీసుకొచ్చిన టారిఫ్ నిబంధనల సవరణలు కేబుల్ టీవీ ఆపరేటర్లకు షాక్ ఇచ్చాయి. స్టాక్మార్కెట్లో టీవీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కేబుల్ , ప్రసార సేవల కోసం కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో ట్రాయ్ సవరణలు చేసిన తరువాత గురువారం ఆపరేటర్ల షేర్లు 6 శాతానికి పైగా క్షీణించాయి. సన్ టీవీ నెట్వర్క్ 6.37 శాతం, డెన్ నెట్వర్క్స్ 3.90 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ 2.99 శాతం, డిష్ టీవీ ఇండియా 0.85 శాతం కుప్పకూలాయి. మరోవైపు సెన్సెక్స్ 232 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో 2017 టారిఫ్ నిబంధనలను సవరించిన మరీ తీసుకొచ్చిన ట్రాయ్ కొత్త నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎంఎస్‌వోలకు షాక్, వినియోగదారులకు ఊరట -
మొబైల్ చార్జీలకు రెక్కలు!
న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు రాగాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్టెల్ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా విభాగం) గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ‘ఈ టారిఫ్‌లతో నిలదొక్కుకోవడం కష్టమని మా నమ్మకం. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. మేం ఎప్పుడూ ఇదే మాట మీద ఉన్నాం‘ అని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (ఐఎంసీ) పాల్గొన్న సందర్భంగా చెప్పారు. మరోవైపు, ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జీలంటూ (ఐయూసీ) యూజర్లపై జియో నిమిషానికి 6 పైసల చార్జీలు వసూలు చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. ‘టారిఫ్‌కి ఐయూసీకి సంబంధం లేదు. టెలికం కంపెనీల స్థాయిలో జరిగే లావాదేవీ అది‘ అని విఠల్ పేర్కొన్నారు. మరోవైపు, తదుపరి 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికమని, దీనివల్ల 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారతాయని చెప్పారు. టెలికం రంగంలోకి పెట్టుబడులు వస్తేనే డిజిటల్ ఇండియా కల సాకారం కాగలదని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంటేనే ఇన్వెస్టర్లు ముందుకొస్తారని విఠల్ చెప్పారు. ట్రాయ్‌పై జియో విమర్శలు.. ఐయూసీ చార్జీల విధింపు గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌పై రిలయన్స్ జియో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇది తిరోగమన చర్యగా అభివర్ణించింది. ఎయిర్టెల్ లాంటి పాత ఆపరేటర్లకు ఇది అనూహ్య లాభాలు తెచ్చిపెడుతుందని పేర్కొంది. ఐయూసీని పూర్తిగా ఎత్తేయడానికి బదులు.. గడువును పొడిగించడం వల్ల సమర్ధంగా వ్యవహరిస్తున్న టెలికం ఆపరేటర్లను శిక్షించినట్లవుతుందని, వినియోగదారుల ప్రయోజనాలనూ దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ఇతర నెట్‌వర్క్‌ల యూజర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను.. టెల్కోలు పరస్పరం విధించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఐయూసీని 2020 జనవరి 1 నుంచి పూర్తిగా ఎత్తివేయాలని గతంలో ప్రతిపాదించినప్పటికీ.. దీన్ని పొడిగించే అవకాశాలపై ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీలను జియో విధించింది. ఇతర టెల్కోలు దాచిపెడుతున్నాయ్.. ఇతర టెల్కోలు కూడా ఐయూసీ చార్జీలను విధిస్తున్నప్పటికీ.. యూజర్లకు ఆ విషయం చెప్పకుండా దాచిపెడుతున్నాయని ఆరోపించింది. పోటీ సంస్థలు పారదర్శకత పాటించడం లేదని జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ ఆరోపించారు. -
భారత టారిఫ్‌ల పెంపుపై డబ్ల్యూటీవోకు అమెరికా
న్యూఢిల్లీ: భారత దిగుమతులపై టారిఫ్‌లు పెంచేసిన అగ్రరాజ్యం... అదే పని భారత్ చేసేసరికి ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీవో) ఆశ్రయించింది. గతేడాది భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచేయడమే కాకుండా, జీఎస్పీ కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని కూడా ఈ ఏడాది మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్నట్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్‌లను ఈ నెల నుంచి పెంచింది. భారత్ చర్య అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమెరికా ఆరోపించింది. భారత్ విధించిన అదనపు సుంకాలు 1994 నాటి ట్రేడ్, టారిఫ్‌ల సాధారణ ఒప్పందం (గాట్) కింద అమెరికాకు అందుతున్న ప్రయోజనాలను రద్దు చేయడం లేదా బలహీనపరచడం చేస్తున్నట్లు డబ్ల్యూటీవోకు రాసిన లేఖలో అమెరికా ఆరోపించింది. గాట్ ఒప్పందం అన్నది డబ్ల్యూటీవో పరిధిలోని సభ్య దేశాల మధ్య కస్టమ్స్ సుంకాల వంటి వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఉద్దేశించినది. డబ్ల్యూటీవో పరిధిలోని మరే ఇతర సభ్య దేశం నుంచి సహజంగా ఉత్పత్తి అయి వచ్చే ఈ తరహా దిగుమతులపై భారత్ సుంకాలు విధించజాలదని అమెరికా పేర్కొంది. అలాగే, భారత్ రాయితీల షెడ్యూల్లో పేర్కొన్న దాని కంటే కూడా విధించిన సుంకాల రేట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వివాద పరిష్కార యంత్రాంగం కింద భారత్‌తో చర్చలకు వీలు కల్పించాలని, ఇరువురికీ ఆమోదయోగ్యమైన రోజు చర్చలు జరిగేలా చూడాలని అమెరికా కోరింది. -
ట్రంప్ వల్ల బాదంపప్పు రైతులకు నష్టాలు..
వాషింగ్టన్: భారత ఎగుమతులపై సుంకాల వడ్డింపుతో వాణిజ్య పోరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలు దువ్వడాన్ని అమెరికన్ నేతలు తప్పు పడుతున్నారు. ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే బాదంపప్పు తదితర ఉత్పత్తులపై సుంకాలను విధించడంతో స్థానిక రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను ట్రంప్ నాశనం చేశారని కాలిఫోర్నియా సెనేటర్ డయానె ఫెయిన్ స్టెయిన్ విమర్శించారు. ప్రతీకారంగా భారత్ సుంకాలు పెంచడంతో కాలిఫోర్నియా బాదం, వాల్నట్ రైతులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. దీనితో భారత్‌కు 217 మిలియన్ డాలర్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. అమెరికా నుంచి ఏటా 650 మిలియన్ డాలర్ల విలువైన పప్పులు భారత్‌కు దిగుమతవుతున్నాయి. -
అమెరికా వస్తువులపై సుంకాల పెంపు
న్యూఢిల్లీ : అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై భారత్ భారీగా సుంకాలు పెంచింది. భారత్ నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇటీవల అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా భారత్ అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్నట్ తదితర 28 వస్తువులపై పన్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆదివారం నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో తయారయ్యే, అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వాల్‌నట్‌పై 30 శాతం నుంచి 120 శాతానికి, పప్పులపై 30 నుంచి 70 శాతానికి పన్ను పెరగనుంది. ఫలితంగా ఈ 28 వస్తువులపై పన్ను భారం పెరిగి, దేశీయ మార్కెట్లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ పెంపుతో భారత్‌కు 217 మిలియన్ డాలర్ల ఆదాయం అధికంగా సమకూరనుంది. కాగా, అమెరికా ప్రభుత్వం చర్యతో భారత్‌కు 2.4కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది. -
అమెరికా దిగుమతులపై భారత్ సుంకాలు
న్యూఢిల్లీ: భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం తదితర ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రతిగా అమెరికన్ దిగుమతులపై కూడా టారిఫ్‌ల వడ్డనకు రంగం సిద్ధమైంది. జూన్ 16 నుంచి అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై అదనంగా కస్టమ్స్ సుంకాలు విధించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటిదాకా దీన్ని వాయిదా వేస్తూ వచ్చినప్పటికీ.. తాజాగా అమల్లోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టారిఫ్‌లు విధించబోయే ఉత్పత్తుల్లో బాదం, వాల్నట్, పప్పు ధాన్యాలు మొదలైనవి ఉన్నాయి. ఈ 29 ఉత్పత్తులను ఎగుమతి చేసే అమెరికా సంస్థలకు అదనపు సుంకాల వడ్డన ప్రతికూలం కానుండగా.. భారత్‌కు అదనంగా 217 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనుంది. గతేడాది మార్చిలో భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10% మేర అమెరికా సుంకాలు విధించింది. దీనికి ప్రతీకారంగా అమెరికన్ దిగుమతులపై టారిఫ్‌లు విధించాలని 2018 జూన్ 21న ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాగలదన్న ఆశతో వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, జీఎస్పీ పథకం కింద భారత ఎగుమతిదారులకు ఇస్తున్న మినహాయింపులను ఎత్తివేయాలని అమెరికా నిర్ణయించడంతో చర్చల ప్రక్రియ స్తంభించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలకు ఉపక్రమించింది. ప్రతిపాదన ప్రకారం.. ఆక్రోట్(వాల్నట్) పై ఇప్పటిదాకా 30 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలను 120 శాతానికి, శనగపప్పు మొదలైన వాటిపై 30 శాతం నుంచి 70%కి టారిఫ్‌లు పెంచుతారు. 2017–18లో అమెరికాకు భారత్ ఎగుమతుల విలువ 47.9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, దిగుమతుల విలువ 26.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అమెరికాకు భారత్ ఏటా 1.5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. -
అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకం
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. చైనా ఉత్పత్తులపై సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనకు చైనా దీటుగా స్పందించింది. తాము కూడా అమెరికా ఉత్పత్తులపై 10 నుంచి 25 శాతం వరకు పన్ను విధిస్తామని పేర్కొంది. ట్రంప్ ఒత్తిడులకు తలొగ్గేది లేదంటూ స్పష్టం చేసింది. గత వారం రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ వెంటనే అమెరికా ప్రభుత్వం దాదాపు రూ.14 లక్షల కోట్ల విలువైన చైనా ఉత్పత్తులపై పన్ను శాతాన్ని ప్రస్తుతమున్న 10 నుంచి 25కు పెంచుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, మరో రూ.21 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులపైనా ఇలాగే పన్ను భారం మోపుతామని హెచ్చరించింది. అమెరికా చర్యకు బదులు తీర్చుకునేలా చైనా దాదాపు రూ.4.2 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై 10% మొదలు కొని 25% వరకు పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో స్పం దించారు. ‘మాపై ప్రతీకారం తీర్చుకుంటే చైనా భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఆ దేశంతో ఎవరూ వ్యాపారం చేయరు. చాలా కంపెనీలు ఆ దేశం వీడి మరో దేశానికి వెళ్తాయి. మాతో వెంటనే ఒప్పందానికి రావడం మంచిదని జిన్‌పింగ్‌తోపాటు చైనాలోని మిత్రులకు చెబుతున్నా’ అంటూ పేర్కొన్నారు. -
చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై తన ప్రతాపం చూపించారు. టారిఫ్‌ల పెంపుతో మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంలో మరింత దూకుడు ప్రదర్శించారు. చైనా నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే 200 బిలియన్ డాలర్ల (రూ.14.4లక్షల కోట్లు) విలువైన ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్ (సుంకం)లు విధించారు. ఈ ఏడాది చివరికి ఈ మొత్తాన్ని 25 శాతానికి పెంచనున్నారు. చైనాకు చెందిన 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా గతంలోనే టారిఫ్‌లు విధించగా, తాజా పెంపు నిర్ణయం దీనికి అదనం. 200 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 టారిఫ్‌ల విధింపు ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది 25%గా అమల్లోకి వస్తుంది. అనుచిత విధానాలు... చైనా తన అనుచిత వాణిజ్య విధానాలను మార్చుకునేందుకు సుముఖంగా లేదని ట్రంప్ పేర్కొన్నారు. అదనపు టారిఫ్‌లు అమెరికా కంపెనీలకు పారదర్శకమైన చికిత్స ఇచ్చినట్టు అవుతుందన్నారు. ‘‘మా రైతులు, పరిశ్రమలకు వ్యతిరేకంగా చైనా ప్రతీకార చర్యకు దిగితే, వెంటనే మూడో విడత కింద 267 బిలియన్ డాలర్ల దిగుమతులపై టారిఫ్‌ల విధింపును అమలు చేస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా టెక్నాలజీ, మేథోపరమైన హక్కులకు సంబంధించి చైనా అనుచిత విధానాలను అనుసరిస్తోందన్నారు. తద్వారా చైనా కంపెనీలకు టెక్నాలజీ బదిలీ చేసే విధంగా అమెరికా కంపెనీలను బలవంతం చేస్తోందని అమెరికా వాణిజ్య ప్రాతినిధ్య విభాగం నిర్ధారించినట్టు ట్రంప్ చెప్పారు. ఇది అమెరికా ఆర్థిక రంగ ఆరోగ్యం, శ్రేయస్సుకు దీర్ఘకాలంలో పెద్ద ముప్పు కాగలదన్నారు. ‘‘కొన్ని నెలలుగా ఈ విధమైన అనుచిత విధానాలను మార్చుకోవాలని చైనాను కోరుతున్నాం. మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు చైనాకు ప్రతీ అవకాశాన్ని ఇచ్చాం. కానీ, చైనా ఇంత వరకు తన విధానాలను మార్చుకునేందుకు సిద్ధపడలేదు. అమెరికా ఆందోళనలను పరిష్కరించేందుకు చైనాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తమ దేశ అనుచిత వాణిజ్య విధానాలకు ముగింపు పలికేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని చైనా నేతలను కోరుతున్నాను’’ అని ట్రంప్ చెప్పారు. అమెరికా ఇప్పటికే చైనాకు చెందిన 50 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై టారిఫ్‌లు అమలు చేయగా, చైనా సైతం ఇదే స్థాయిలో అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధించింది. ఇరు దేశాల మధ్య త్వరలోనే చర్చలు జరగనున్నాయనే అంచనాల మధ్య ట్రంప్ మరో విడత చర్యలకు దిగడం గమనార్హం. చైనాతో చర్చల అవసరాన్ని అమెరికా అధికారులు ప్రస్తావిస్తుండగా, ఓ అంగీకారానికి రావాలన్న ఒత్తిడి అమెరికాపై లేదని ట్రంప్ గతవారమే వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా సుంకాల విధింపునకు దిగితే ప్రతిచర్యతో స్పందిస్తామని చైనా వాణిజ్య, విదేశాంగ మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా సైతం ఇదే విధంగా ప్రతిస్పందించే అవకాశం కనిపిస్తోంది. చైనా ప్రతీకారం... అమెరికా తాజా సుంకాల చర్యకు చైనా వెంటనే స్పందించింది. 60 బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై టారిఫ్‌లను విధిస్తున్నట్టు ప్రకటించింది. టారిఫ్‌లు మరింత పెంచుతామని అమెరికా పేర్కొంటే, అందుకు అనుగుణంగా స్పందిస్తామని చైనా ఆర్థిక శాఖ ప్రకటన జారీ చేసింది. ‘‘మా చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు, ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య ఉత్తర్వుల మేరకు చైనా తగిన ప్రతిస్పందన చర్యలు తీసుకుంటుంది’’ అని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. గతేడాది చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు 522.9 బిలియన్ డాలర్ల మేర ఉండగా, చైనాకు అమెరికా ఎగుమతులు 187 బిలియన్ డాలర్లు మేర ఉండడం గమనార్హం. -
ప్రపంచ మార్కెట్ల పతనం
టర్కీ కరెన్సీ లిరా కోలుకుంటున్నప్పటికీ, అమెరికా వస్తువులపై టర్కీ సుంకాల పెంపు, ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1% వరకూ నష్టపోగా, యూరప్ మార్కెట్లు 1.6–2% రేంజ్లో క్షీణించాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు నష్టపోగా, అమెరికా సూచీలు 1.5–2% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చమురు, పుత్తడి ధరలు నేల చూపులు చూస్తుండగా, డాలర్ దుసుకుపోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ నష్టాలు తప్పాయని నిపుణులంటున్నారు. అయితే నేడు(గురువారం) భారీ గ్యాప్‌డౌన్‌తో మన స్టాక్ మార్కెట్ ఆరంభమవుతుందని వారు అంచనా వేస్తున్నారు. టర్కీ ‘ప్రతి’ సుంకాలు... టర్కీ కరెన్సీ లిరా పతనం ఒకింత తగ్గినప్పటికీ, టర్కీ ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే అవకాశాల్లేవని నిపుణులంటున్నారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్‌పై టర్కీ ప్రభావం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిగా తాము కూడా అమెరికా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. అంతేగాకుండా అమెరికా నుంచి దిగుమతయ్యే ఆల్కహాల్, కార్లు, పొగాకు ఉత్పత్తులపై సుంకాలను రెట్టింపు చేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు అమెరికా సుంకాలు, సబ్సిడీ విధానాలను సవాల్ చేస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు చైనా ఫిర్యాదు చేసింది. ఇవన్నీ ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ వార్త రాసే సమయానికి(బుధవారం రాత్రి 10 గంటలకు)నాస్డాక్ సూచీ 116 పాయింట్లు, డోజోన్స్ 245 పాయింట్లు మేర పతనమయ్యాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 65 పాయింట్లు క్షీణించి 11,369 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. 13 నెలల గరిష్టానికి డాలర్.. అమెరికా డాలర్ 13 నెలల గరిష్ట స్థాయిలో, 96.82 వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలపడుతుండటంతో ముడి చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. అంచనాలకు భిన్నంగా అమెరికాలో చమురు నిల్వలు భారీగా ఉన్నాయని గణాంకాలు వెల్లడికావడంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.8% క్షీణించి 70.66 వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ 2.1% పతనమై 64.85 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్ బలపడటంతో పుత్తడి, వెండి లోహాల ధరలు పతనమవుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 18 నెలల కనిష్ట స్థాయి.. 1,184 డాలర్లకు పడిపోయింది. -
టెక్స్టైల్స్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు!
న్యూఢిల్లీ: దేశీయ టెక్స్టైల్స్ పరిశ్రమకు మరింత జీవం పోసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుంది. 300 రకాల వస్త్రోత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ తయారీకి ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నాయి. అలాగే, ఈ రంగానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సైతం సరళీకరించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఇలా దిగుమతి సుంకాలు పెంచే వాటిలో కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్, గార్మెంట్స్, మానవ తయారీ ఫైబర్స్ ఉన్నట్టు చెప్పాయి. ప్రస్తుతం వీటిపై సుంకాలు 5–10 శాతం స్థాయిలో ఉండగా, 20 శాతానికి పెంచనున్నట్టు తెలిపాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించాయి. ఈ వారంలోనే సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. సుంకాలు పెంచడం వల్ల విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయ తయారీ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. -
చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్ : ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ఉధృతమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై ట్రేడ్ వార్ బాంబు వేశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే మరో 200 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. దీంతో ఆ దిగుమతులు అదనంగా 10 శాతం సుంకాలను ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన పలు ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాటికి ప్రతీకారంగా ఇటీవలే చైనా కూడా 34 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీనికి కౌంటర్‌గా అదనంగా 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై ఈ సుంకాలను అమెరికా విధించింది. ఇలా అమెరికా, చైనాలు సుంకాల మీద సుంకాలు విధించుకుంటూ.. వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అమెరికా చర్యలకు దీటుగా చైనా స్పందిస్తోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై కూడా అధిక సుంకాలు విధిస్తోంది. అయితే ప్రస్తుతం తాము చేపట్టిన టారిఫ్ యుద్ధం, చైనా అమెరికా మేథోసంపత్తి హక్కులను దొంగలించకుండా నిరోధిస్తుందని అమెరికా కార్యాలయ అధికారులు చెబుతున్నారు. చైనీస్ మార్కెట్లో యాక్సస్ పొందడానికి ట్రేడ్ సీక్రెట్లు చెప్పాలని అమెరికా కంపెనీలపై డ్రాగన్ ఒత్తిడి తెస్తుందని ఆరోపిస్తున్నారు. చైనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని వందల బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది తమ ఆర్థికవ్యవస్థకు భవిష్యత్తులో ముప్పు కలిగిస్తుందని అమెరికా అధ్యక్ష ప్రధాన వాణిజ్య సందానకర్త రాబర్ట్ అన్నారు. ట్రంప్ ప్రస్తుతం చైనాపై తీసుకున్న ఈ చర్య వల్ల టెలివిజన్లు, వస్త్రాలు, బెడ్షీట్లు, ఎయిర్‌కండీషనర్లు ప్రభావితం కానున్నాయి. అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలకు ఇతర మార్గాల్లో కూడా ప్రతీకారం తీసుకోవాలని చైనా అధికారులు భావిస్తున్నారు. చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా కంపెనీల్లో చెప్పాపెట్టకుండా తనిఖీలు, ఆర్థిక లావాదేవీల ఆమోదంలో జాప్యం, ఇతర కార్యాలయ తలనొప్పులను అమెరికా కంపెనీలకు విధించాలని డ్రాగన్ చూస్తోంది. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం విధిస్తున్నాయని, అమెరికాలో మాత్రం ఆయా దేశాల ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తున్నామని, ఇలా కాకుండా పరస్పరం ఒకే విధమైన సుంకాలు విధించే విధానం ఉండాలని డొనాల్డ్ ట్రంప్ అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతూ వస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. తొలుత స్టీట్, ఉక్కులపై సుంకాలు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. -
చైనా మనసు మార్చిన సినిమా..!
బీజింగ్ : ఓ సినిమా చైనా అధికారుల మనసు మార్చినట్టు కనబడుతోంది. చైనాలో ఇటీవల విడుదలైన డైయింగ్ టు సర్వైవ్ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాకుండా ఫార్మా దిగుమతుల్లో చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులకు కారణమైంది. చైనా ప్రభుత్వ తాజా ప్రకటనే ఇందుకు నిదర్శనం. భారత్‌లో తయారుచేసే మెడిసిన్‌ను దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. ముఖ్యంగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే క్యాన్సర్ నిరోధక మందులకు విస్తృత మార్కెట్ కల్పించనున్నట్టు తెలిపింది. కాగా, డైయింగ్ టు సర్వైవ్ చిత్రంలో లూకేమియాతో బాధపడుతున్న ఓ పేషెంట్ భారత్ నుంచి తక్కువ ధరకు దొరికే జౌషధాలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునింగ్ మాట్లాడుతూ.. మెడిసిన్ దిగుమతులపై పన్నులను తగ్గించడానికి చైనా, భారత్‌ల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఫార్మా దిగుమతులను పెంచుకోవడం, వాటిపై పన్నుల భారాన్ని తగ్గించడం ద్వారా తమ మార్కెట్లో భారత్‌తో పాటు ఇతర దేశాలకు మంచి ఆవకాశం కల్పించినట్టు అవుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా చైనీస్ మూవీ డైయింగ్ టు సర్వైవ్ మూవీని ఆమె ప్రస్తావించారు. కాగా తమ మార్కెట్లో మెడిసిన్‌ను విక్రయించడానికి భారత కంపెనీలకు చైనా అనుమతిస్తుందనే విషయంలో మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా సెంట్రల్ టెలివిజన్ లెక్కల ప్రకారం చైనాలో ఏడాదికి 43 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. చైనా మిత్ర దేశాలు సరఫరా చేస్తున్న క్యాన్సర్ నిరోధక మందులతో పొల్చినప్పుడు తక్కువ ధరకు లభ్యమయ్యే భారత మెడిసిన్‌కు చైనాలో అధిక డిమాండ్ ఉంది. -
ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్‌వార్
బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన ట్రేడ్‌వార్ బుల్లెట్‌పై చైనా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్వార్గా అభివర్ణించింది. 34 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లను ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో చైనా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అంతే స్థాయిలో తాము చర్యలు తీసుకోనున్నామని బీజింగ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ఎగుమతులపై అంతేమొత్తంలో టారిఫ్‌లను విధించనున్నామని అంతకముందే బీజింగ్ హెచ్చరించింది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ ఉధృతమవడంతో, ప్రపంచవ్యాప్తంగా కన్జ్యూమర్లు, కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన జోన్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 16 బిలియన్ చైనీస్ ఉత్పత్తులపై కూడా 25 శాతం టారిఫ్‌లు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికాకు కౌంటర్ కచ్చితంగా ఇస్తామంటూ చైనా ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేస్తోంది. ఒకవేళ బీజింగ్ నుంచి ఏమైనా ప్రతీకార చర్యలు వస్తే, తమ అడ్మినిస్ట్రేషన్ ఏమీ చూస్తూ ఊరుకోదని మరోవైపు నుంచి ట్రంప్ చెబుతున్నారు. దీనికి ఓ ముగింపు వచ్చేంత వరకు ట్రేడ్ వార్ ఆగదని కూడా చైనా చెబుతోంది. ఈ హెచ్చరికలను చూస్తే దెబ్బకు దెబ్బ అనే రీతిలో పెద్ద ఎత్తునే ట్రేడ్ వార్‌ను విజృంభించేలా ఉందని సీఎన్ఎన్ రిపోర్టు చేసింది. కేవలం చైనాతో మాత్రమే కాకుండా... అమెరికా దేశం యూరోపియన్ యూనియన్, కెనడా దేశాలతో కూడా ట్రేడ్ వార్ కొనసాగిస్తోంది. ఆయా దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించింది. వీటికి ప్రతీకారంగా కెనడా, ఈయూలు కూడా సుంకాలు విధించాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మధ్య ట్రేడ్ వార్ మరింత ఉధృతమవుతుంది. -
ట్రంప్ ‘ట్రేడ్‌వార్’ బుల్లెట్ పేలింది, ఇక రణరంగమే..
వాషింగ్టన్ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికాకు, చైనాకు మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై ‘ట్రేడ్ వార్’ బుల్లెట్ ప్రయోగించారు. 34 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై టారిఫ్‌లను ధృవీకరిస్తూ.. ఈ అర్థరాత్రి నుంచి వీటిని అమల్లోకి తేనున్నట్టు వెల్లడించారు. ట్రంప్ ఆదేశాల మేరకు సెమికండక్టర్ల నుంచి ఎయిర్‌ప్లేన్ పార్ట్‌ల వరకు పలు చైనీస్ దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను అమెరికా కస్టమ్స్ అధికారులు సేకరించబోతున్నారు. అమెరికా మేథోసంపత్తి హక్కులను బీజింగ్ దొంగలిస్తుందని, అమెరికా వాణిజ్య అకౌంట్‌కు తీవ్రంగా తూట్లు పొడుస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించిన అనంతరం డైరెక్ట్‌గా చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం ఇదే మొదటిసారి. మరో 16 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై మరో రెండు వారాల్లో టారిఫ్ మోత మోగనుందని కూడా హెచ్చరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగుతున్న క్రమంలో, ప్రపంచవ్యాప్తంగా కన్జ్యూమర్లు, కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన జోన్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా సైతం అమెరికాకు కౌంటర్‌గా అంతేమొత్తంలో పలు అమెరికన్ ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించనున్నట్టు ప్రకటించింది. వీటిలో సోయాబీన్స్ నుంచి పందిమాంసం వరకూ ఉన్నాయి. ఇటీవల స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్, ప్రపంచదేశాలన్నీ ఆగ్రహంతో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, కెనడా దేశాలు అమెరికాపై ప్రతీకార పన్నులు విధించేశాయి. అమెరికా ఐకానిక్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ సైతం ఈయూ విధించే టారిఫ్‌లను తప్పించుకోవడానికి అమెరికా నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ చైనీస్ వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు పెద్ద మొత్తంలో ట్రంప్ ఏమైనా సుంకాలను విధిస్తే, చైనా కూడా అమెరికా కంపెనీలపై కస్టమ్స్ ఆలస్యం, పన్ను ఆడిట్లు, రెగ్యులేటరీ తనిఖీలను భారీగా పెంచి, జరిమానాలు విధిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరించారు. అమెరికా కంపెనీలు ఆపిల్ ఇంక్, వాల్‌మార్ట్ ఇంక్ నుంచి జనరల్ మోటార్స్ వరకు అమెరికా కంపెనీలు చైనాలో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ ఈ ట్రేడ్ వార్ అతిపెద్ద ముప్పుగా అవతరించిందని ఆర్థిక వేత్తలంటున్నారు. -
హార్లీ-డేవిడ్సన్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికాకు, యూరోపియన్ యూనియన్‌కు మధ్య నెలకొన్న టారిఫ్ వార్ దెబ్బకు దిగ్గజ మోటార్‌సైకిల్ కంపెనీ హార్లీ-డేవిడ్సన్.. అమెరికా బయట ఉత్పత్తి చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో మోటార్‌సైకిల్ ఉత్పత్తిని చేపట్టడానికి హార్లీ డేవిడ్సన్ తరలి వెళ్తే, అది తీవ్ర ప్రభావానికి గురి కానుందని ట్రంప్ హెచ్చరించారు. ఐకానిక్ మోటార్‌సైకిల్స్‌పై భారత్ దిగుమతి సుంకాలు తగ్గించినప్పటికీ, ఈ కంపెనీ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ఒకవేళ ఉత్పత్తిని విదేశాలకు తరలిస్తే, అమెరికా కస్టమర్లను కోల్పోయే ప్రమాదముందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ’హార్లీ భారీగా దెబ్బతింటుందని నాకు అనిపిస్తుంది. ఇది గ్రేట్ అమెరికన్ ఉత్పత్తి అనుకుంటున్నా. అమెరికన్ ప్రజలు చాలా గర్వంగా ఫీలై, దీన్ని వాడుతూ ఉంటారు. హార్లీ గట్టి దెబ్బనే ఎదుర్కోబోతుందని నేను నమ్ముతున్నా. హార్లీ డేవిడ్సన్ బైక్ కొనుక్కునే వారు, దాన్ని మరో దేశంలో ఉత్పత్తి చేయాలని కోరుకోరు’ అని ట్రంప్ అన్నారు. అమెరికా బైక్ ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ విధిస్తున్న టారిఫ్‌లను తగ్గించుకునేందుకు, హార్లీ డేవిడ్సన్ తన బైక్ ఉత్పత్తిని అమెరికా వెలుపల విదేశాల్లో చేపట్టాలని నిర్ణయించింది. స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ టారిఫ్‌లు విధించడంతోనే, ఇతర దేశాలు కూడా ట్రంప్‌కు కౌంటర్‌గా భారీగా ఈ టారిఫ్‌లు విధించడం ప్రారంభం చేశాయి. హార్లీ డేవిడ్సన్ అనేది అమెరికన్ మోటార్‌సైకిల్ కంపెనీ. కానీ ఇటీవల టారిఫ్‌ల యుద్ధం బారీగా పెరగడంతో, ఇది విదేశాలకు తరలిపోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. అమెరికా వెలుపల దీని ఉత్పత్తిని ప్రారంభించడానికి కనీసం 9 నుంచి 18 నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. -
ట్రంప్‌పై ప్రతీకారం : బిలియన్ డాలర్ల టారిఫ్‌లు
అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసన వ్యక్తం చేయడమే కాకుండా.. ట్రంప్‌పై ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నాయి. చైనా, భారత్, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు.. తాజాగా కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లను విధించింది. కెనడియన్ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ కార్యాలయం విధించిన డ్యూటీలకు దెబ్బకు దెబ్బగా బిలియన్ డాలర్ల ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్టు కెనడా ప్రకటించింది. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం శుక్రవారం సుంకాల విధించే ఉత్పత్తుల తుది జాబితాను విడుదదల చేసింది. జూలై 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొన్ని ఉత్పతుల పన్నులు 10 శాతం నుంచి 25 శాతమున్నాయి. ఇది తీవ్రతరం కాదు, అలా అని వెనక్కి తీసుకోలేం అని కెనడియన్ విదేశీ మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ అన్నారు. పన్నులు విధించిన ఉత్పత్తుల్లో కెచప్, గట్టి కోసే యంత్రాలు, మోటర్ బోట్స్ ఉన్నాయి. మొత్తంగా 12.6 బిలియన్ డాలర్లు సుంకాలను కెనడా అమెరికాపై విధించింది. ఇది డాలర్‌కు డాలర్ స్పందన అని ఫ్రీల్యాండ్ చెప్పారు. తమకు మరో దారి లేదన్నారు. చాలా అమెరికా ఉత్పత్తుల్లో ఆర్థిక సంబంధనమైన వాటితో పోలిస్తే రాజకీయపరమైనవే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ తమతో వాణిజ్య యుద్ధానికి తెరలేపితే, దానికి కూడా సిద్దమయ్యే ఉన్నామని హెచ్చరించారు. అయితే అల్యూమినియం, స్టీల్‌పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ట్రంప్, దిగుమతి చేసుకునే మెటల్స్ వల్ల అమెరికా దేశ రక్షణకు ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు. దిగుమతి చేసుకునే కార్లు, ట్రక్కులు, ఆటో పార్ట్‌లపై విధించిన టారిఫ్‌లు కూడా దేశ రక్షణకు చెందిన టారిఫ్‌లని పేర్కొన్నారు. ఆటో పార్ట్‌లపై టారిఫ్‌లు విధించడంపై కెనడా ఎక్కువగా ఆందోళన చెందుతోంది. కెనడా ఆర్థిక వ్యవస్థకు ఇవి ముఖ్యమైనవి. అమెరికాలో తయారయ్యే కార్ల విభాగాలను కెనడాలోనే తయారు చేస్తారు. వీటి ఫలితంగానే అమెరికా ఉత్పత్తులపై కెనడా బిలియన్ డాలర్ల టారిఫ్‌లను విధించింది. -
మొట్టమొదటిసారి పెరుగుతున్న వాణిజ్య అడ్డంకులు
గత దశాబ్దకాలంలో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓ వైపు బ్రెగ్జిట్ చర్చలు, మరోవైపు అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, దాని ప్రతీకారంగా ఇతర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బకొడుతున్నాయి. బ్రెగ్జిట్ చర్చలతో వ్యాపార మార్కెట్లో అస్థిరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ అస్థిరత ఇంకా కొనసాగుతూ ఉండగానే... అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై టారిఫ్‌లు విధించింది. ఈ టారిఫ్‌లను తీవ్రంగా నిరసిస్తూ.. ఇతర దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం సన్నగిల్లుతోందని ప్రపంచ నేతలు అంటున్నారు. తాజాగా కెనడాలో జరిగిన జీ7 సమావేశంలో కూడా అంతర్జాతీయ ప్రతినిధులు ఇదే విషయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల అధినేతలందరూ తమ తమ ఆందోళనను వెల్లబుచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుల జాబితా కూడా మారిపోయిందని తెలిసింది. అసలు 2017లో టాప్ ఎగుమతిదారులుగా ఉన్న దేశాలేమిటో ఓ సారి చూద్దాం.. ఏడాదికి 2.26 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులతో 2017లో చైనా ఆధిపత్య స్థానంలో ఉంది. ఆ అనంతరం జర్మనీ భారీ మొత్తంలో ఆటోమొబైల్స్‌ను ఎగుమతి చేసి.. ప్రతేడాది 1.45 ట్రిలియన్ డాలర్లను ఆర్జించింది. అంటే ఒక్కో వ్యక్తికి 18వేల డాలర్లు వచ్చాయన్న మాట. అయితే అమెరికా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతిదారిగా ఉన్నప్పటికీ, తలసరి ఆదాయం పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం ఎగుమతుల్లో జర్మనీ కంటే తక్కువ స్థాయిల్లోనే ఉన్నట్టు వెల్లడైంది. 2017లో అమెరికా 1.55 ట్రిలియన్ డాలర్ల ఎగుమతలు చేపట్టింది. అంటే ఒక్కో వ్యక్తికి 4,800 డాలర్లు మాత్రమే ఆర్జించింది. -
ట్రేడ్ వార్: అమెరికాకు మరో గట్టి షాక్
లండన్: ఏకపక్ష నిర్ణయాలతో ట్రేడ్‌వార్ అందోళన రేపుతున్న అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా ఒక్కోదేశం అమెరికా టాక్స్ విధింపులను తిప్పికొట్టే చర్యలకు దిగుతున్నాయి. ఇప్పటికే భారతదేశం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికా ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సుంకాలను పెంచుతామని ట్రంప్ తొలుత ప్రతిపాదించినప్పుడే తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించిన యూరోపియన్ యూనియన్ ఇపుడు అన్నంత పనీ చేసింది. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 3.2 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై టారిఫ్‌లను శుక్రవారం నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. విస్కీ, పొగాకు, హార్లీ డేవిడ్ సన్ బైక్స్, కాన్‌బెర్రీ, పీనట్ బటర్‌లాంటి అమెరికా ఉత్పత్తులపై 25శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతోపాటు పాదరక్షలు, కొన్నిరకాల దుస్తులు, వాషింగ్ మెషీన్లు తదితర ఎంపిక చేసిన కొన్ని అంశాలపై 50శాతంకాదా టాక్స్‌ను పెంచింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జంకర్ గురువారం రాత్రి ఐరిష్ పార్లమెంటులో మాట్లాడుతూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు. సుంకం విధింపులతో అమెరికా చట్టవిరుద్ధంగా, చరిత్రకువిరుద్ధగా పోతోందని వాఖ్యానించారు. అమెరికా యుఎస్ సుంకాల నేపథ్యంలో తమ ప్రతిస్పందన స్పష్టంగా ఉంటుందున్నారు. అటు భారత్ అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయించింది. ఆగస్టు నుంచి ఈ పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. కాగా ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలను భారీగా పెంచి వాణిజ్య యుద్ధానికి తెర లేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఇతర దేశాలను కూడా బెదిరిస్తున్నారు. ఈ సుంకాలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతీకార చర్యలకు దిగితే యూరప్ దేశాలకు చెందిన కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతామని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
అమెరికాకు భారత్ షాక్..!
న్యూఢిల్లీ: వాణిజ్యం విషయంలో అమెరికా తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి భారత్ తగు విధంగా బదులిచ్చింది. తమదేశంలోకి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ సర్కారు టారిఫ్‌లను విధించిన విషయం తెలిసిందే. ఇది 241 మిలియన్ డాలర్ల విలువ మేర (రూ.1,600 కోట్లు) మనదేశ ఎగుమతులపైనా ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పులు, స్టీల్, ఐరన్ ఉత్పత్తులు ఇలా మొత్తం 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెంచిన సుంకాలు ఆగస్ట్ 4 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. అమెరికా రక్షణాత్మక వాణిజ్య విధానాల్లో భాగంగా దిగుమతులపై టారిఫ్‌ల నిర్ణయం తీసుకోవడంతో ఇతర దేశాలు ఆ విధంగా ప్రతిస్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య ఇది తీవ్రరూపం దాల్చింది. తాను కస్టమ్స్ డ్యూటీని పెంచాలనుకుంటున్న 30 ఉత్పత్తుల జాబితాను గత వారమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు భారత్ సమర్పించింది. వాటిపై 50 శాతం వరకు సుంకాలు పెంచాలనుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఈ జాబితాలో కొన్ని రకాల మోటారు సైకిళ్లు 800సీసీ, ఆపైన సామర్థ్యం ఉన్న వాటిని (ముఖ్యంగా హార్లే డేవిడ్సన్, ట్రింఫ్) కూడా పేర్కొనగా... తాజా నోటిఫికేషన్లో మాత్రం పెంపు ప్రస్తావన లేదు. తాజాగా సుంకాల పెంపు ప్రభావం, అమెరికా పెంపు వల్ల మన ఎగుమతులపై పడే స్థాయిలోనే ఉండటం గమనార్హం. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్‌లు వేస్తూ ట్రంప్ సర్కారు ఈ ఏడాది మార్చి 9న నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విషయమై మన దేశం ఇప్పటికే డబ్ల్యూటీవోలో సవాలు చేసింది. -
చైనాకు మరోసారి ట్రంప్ షాక్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో అసలు తగ్గేలా కనిపించడం లేదు. ఎలాగైనా వాణిజ్య యుద్ధాన్ని తారస్థాయికి తీసుకెళ్లేలా చైనాను రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించిన ట్రంప్, తాజాగా మరోసారి 50 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులతో 25 శాతం టారిఫ్‌లను విధించనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. తమ మేథోసంపత్తి ఆస్తులను, టెక్నాలజీని చైనా దొంగలిస్తుందని ఆరోపిస్తూ.. ట్రంప్ ఈ టారిఫ్‌లను విధించారు. అన్యాయపరమైన వాణిజ్య విధానాలను చైనా అనుసరిస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఒకవేళ అమెరికా ఉత్పత్తులు, సర్వీసు ఎగుమతులపై కనుక చైనా ప్రతీకారం తీర్చుకుంటే, అదనపు సుంకాలు కూడా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అన్యాయపరమైన ఆర్థిక విధానాల ద్వారా తమ టెక్నాలజీ, మేథోసంపత్తి ఆస్తులను కోల్పోవాల్సి వస్తే, అమెరికా అసలు సహించదని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. ట్రంప్ వార్నింగ్‌లను ఏ మాత్రం లెక్కచేయకుండా.. తాము కూడా ఇదే స్థాయిలో పన్ను చర్యలను వెంటనే ప్రవేశపెడతామని బీజింగ్ ప్రకటించింది. ఇరు పార్టీలు అంతకముందు సాధించిన అన్ని ఆర్థిక, వాణిజ్య విజయాలు ఇక వాలిడ్‌లో ఉండవని పేర్కొంది. 34 బిలియన్ డాలర్ల విలువైన 818 ఉత్పత్తులపై జూలై 6ను టారిఫ్‌లను విధిస్తామని, మిగతా 16 బిలియన్ డాలర్ల విలువైన 284 ఉత్పత్తులపై ప్రజాభిప్రాయాలు, సమీక్షల అనంతరం ఇదే మాదిరి చర్యలు తీసుకుంటామని అమెరికా వాణిజ్య అధికార ప్రతినిధి చెప్పారు. చైనాను కవ్విస్తూ అమెరికా టారిఫ్‌లు విధించడం, అమెరికాకు ప్రతిగా చైనా చర్యలు తీసుకోవడం మరింత వాణిజ్య యుద్ధానికి పురిగొల్పుతోంది. -
వాహన దిగుమతులపైనా టారిఫ్‌లు!
వాషింగ్టన్: అమెరికాలోకి దిగుమతి అవుతున్న వాహనాలు, ట్రక్కులు, ఆటో ఉపకరణాల వల్ల జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందా? అన్న కోణంలో విచారణ జరపాలని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. తాజా చర్యతో అమెరికా భద్రత, ప్రయోజనాల కోణంలో దిగుమతి అయ్యే వాహనాలు, వాహనోత్పత్తులపై పెద్ద ఎత్తున టారిఫ్‌లు విధించే అవకాశం కనిపిస్తోంది. 1962 వాణిజ్య విస్తరణ చట్టంలోని (టీఈఏ) సెక్షన్ 232 కింద విచారణ ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని తనను కలసిన వాణిజ్య మంత్రి విల్బర్ రాస్కు ట్రంప్ సూచించారు. దిగుమతి అయ్యే కార్లపై టారిఫ్‌లు లేదా నియంత్రణలు విధించాల్సిన అవసరం ఉందా? అన్నది పరిశీలించాలని కోరారు. ప్రధాన పరిశ్రమ అయిన ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ పార్ట్లు తమ దేశ బలమని ట్రంప్ అభివర్ణించారు. అమెరికా ఈ ఏడాది మార్చిలో ఇదే విధంగా... దిగుమతి అయ్యే స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లు విధించిన విషయం గమనార్హం. 22 శాతం ఉద్యోగాలకు గండి‘‘గడిచిన 20 ఏళ్లలో అమెరికా కార్ల విక్రయాల్లో దిగుమతి అయ్యే ప్రయాణికుల వాహనాల వాటా 32 శాతం నుంచి 48 శాతానికి పెరిగింది. అమెరికన్లు రికార్డు స్థాయిలో కార్లను కొనుగోలు చేస్తున్నాగానీ 1990 నుంచి 2017 వరకు వాహనోత్పత్తి రంగంలో ఉద్యోగాలు 22 శాతం తగ్గాయి’’ అని అమెరికా వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గట్టిగా ఎదుర్కొంటాం: చైనా తమ హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని చైనా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయాలు బహుపాక్షిక వాణిజ్య విధానాన్ని బలహీనపరచడమేనని, అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగించే చర్యలను అమెరికా తీసుకుంటోందని చైనా వాణిజ్య శాఖా ప్రతినిధి గావో ఫెంగ్ బీజింగ్‌లో మీడియాతో పేర్కొన్నారు. -
చైనా షాక్ : తీవ్రమవుతున్న ట్రేడ్‌వార్
బీజింగ్ : చైనీస్ ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్‌లపై వెంటనే చైనా గట్టి కౌంటర్ ఇచ్చింది. 106 అమెరికన్ గూడ్స్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను విధించనున్నట్టు ప్రకటించింది. వీటిలో సోయాబీన్స్, ఆటోలు, కెమికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, కార్న్ ప్రొడక్ట్‌లు, అగ్రికల్చర్ గూడ్స్ ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. వీటితో పాటు విస్కి, సిగరెట్లు, పోగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల ఎద్దు మాంసం, అమెరికా ఆరెంజ్ జ్యూస్, కొన్ని రకాల ల్యూబ్రికెంట్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కొన్ని రకాల గోధుమలు, కాటన్, ట్రక్కులు, ఎస్‌యూవీలు, కొన్ని రకాల జొన్న ఉత్పత్తులను కూడా త్వరలోనే ఈ నూతన టారిఫ్‌లు పరిధిలోకి తీసుకురానున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2017 వరకూ ఈ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌ల మొత్తం 50 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉన్నట్లు కామర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రంప్ నేడు విధించిన చైనీస్ ఉత్పత్తులపై టారిఫ్‌లకు కౌంటర్‌గా చైనా ఈ టారిఫ్‌లను ప్రకటించింది. అమెరికాకు వెంటనే చైనా కౌంటర్ ఇవ్వడంతో, ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్‌వార్ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ ఆందోళనలు భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా విధించిన టారిఫ్ ఉత్పత్తుల విలువ, చైనా విధించిన టారిఫ్ ఉత్పత్తుల విలువ 50 బిలియన్ డాలర్లుగానే ఉంది. తాము ఎవరితోనూ ట్రేడ్వార్కు సిద్ధంగా లేమని, కానీ ఇదంతా ప్రారంభించిన వారు అర్థం చేసుకోవాలని చైనీస్ అంబాసిడర్ కుయ్ టియాన్కాయ్ అన్నారు. ఉదయం నుంచి మిక్స్‌డ్‌గా ట్రేడవుతూ వచ్చిన ఆసియన్ మార్కెట్లు.. చైనా విధించిన టారిఫ్‌ల ప్రభావంతో ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. దాంతో పాటు యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైన పడింది. వెంటనే బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 1 శాతం కిందకి దిగజారింది. -
ట్రంప్ మరో ఎటాక్ : చైనా సీరియస్
ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ ఆందోళనలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. మరోసారి ట్రంప్, చైనాపై ఎటాక్ చేశారు. 50 బిలియన్ డాలర్ల(రూ.3,24,825 కోట్ల) విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లను విధించింది. వీటిలో హై-టెక్నాలజీ ఉత్పత్తుల నుంచి సెమీ కండక్టర్లు, లిథియం బ్యాటరీల వరకు ఉన్నాయి. మొత్తం 1300 రకాల ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు విధించింది. అమెరికా ఈ చర్యపై చైనా మండిపడింది. అమెరికా ఉత్పత్తులపై కూడా తాము ఇదే రకంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇటీవలే అమెరికా విధించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా, చైనా అమెరికా గూడ్స్‌పై అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. చైనాకి కౌంటర్‌గా ట్రంప్ మరోసారి మరికొన్ని ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు విధించారు. చైనా హానికరమైన చర్యలను, విధాలను తొలగిస్తున్నామని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఆఫీసు పేర్కొంది. తమ మేథోసంపత్తి హక్కువ విధానాలను మారుస్తున్న 1300 ఉత్పత్తులను టార్గెట్ చేసి, ఈ టారిఫ్‌లను విధించామని ఆఫీసు తెలిపింది. అమెరికా ఆర్థికవ్యవస్థపై, వినియోగదారులపై ప్రభావం తగ్గించే పాలసీ ఆధారంగా అమెరికా ఈ ఉత్పత్తులను ఎంచుకుందని చెప్పింది. ఈ ప్రొడక్ట్‌లలో స్టీల్, టెలివిజన్ కాంపోనెంట్లు, మెడికల్ డివైజ్‌లు, డిష్వాషర్లు, స్నో బ్లోవర్స్ ఉన్నాయి. హెల్త్ కేర్ నుంచి ఏవియేషన్, ఆటో పార్ట్‌ల వరకు అన్ని రంగాల ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు పడ్డాయి. అయితే తాజాగా అమెరికా విధించిన టారిఫ్‌లపై, చైనా ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉంటోదనని ఆసియన్ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ప్రస్తుతం విధించిన టారిఫ్‌లను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇంతే భారీ మొత్తంలో అమెరికా ఉత్పత్తులకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాక ఈ విషయాన్ని డబ్ల్యూటీఓ వద్దకు తీసుకెళ్లనున్నట్టు పేర్కొంది. -
కౌంటర్ : ట్రంప్‌కు చైనా దెబ్బ పడింది
బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా గట్టి షాకిచ్చింది. అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై అమెరికా విధించిన డ్యూటీలకు కౌంటర్‌గా, అమెరికా ఉత్పత్తులపై చైనా అదనపు టారిఫ్‌లు విధించింది. 128 అమెరికా ఉత్పత్తులపై అదనంగా 25 శాతం వరకు టారిఫ్ విధిస్తున్నట్టు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీనిలో పంది మాంసం, వైన్, కొన్ని పండ్లు, నట్స్ ఉన్నాయి. టారిఫ్‌లు విధించిన 3 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తుల జాబితాను విడుదల చేస్తున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. 120 అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గించే బాధ్యతలను పక్కనపెట్టిన చైనా, ఒకేసారి వాటిపై మరో 15 శాతం టారిఫ్ అదనంగా విధిస్తున్నట్టు పేర్కొంది. పంది మాంసం వంటి మరో ఎనిమిది ఉత్పత్తులపై అదనంగా 25 శాతం వరకు టారిఫ్‌లను విధిస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానున్నట్టు కూడా తెలిపింది. అమెరికా దిగుమతులపై టారిఫ్ మినహాయింపును రద్దు చేయడం, డబ్ల్యూటీవో నిబంధనలు వాడుకుని చైనా ప్రయోజనాలను కాపాడుకోవడమేనని బీజింగ్ సమర్థించుకుంటోంది. చైనా విధించిన ఈ అదనపు టారిఫ్‌లు బీజింగ్‌కు, వాషింగ్టన్కు మధ్య ట్రేడ్‌వార్ ఆందోళనలను మరింత రేకెత్తిస్తున్నాయి. ఆర్థికంగా బలమైన రెండు పెద్ద దేశాల మధ్య ఈ యుద్ధం ఏ మలుపు తిప్పుతుందో అని ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు విధించిన తర్వాత కూడా.. మరో 50 బిలియన్ డాలర్లకు పైగా టారిఫ్‌లను చైనీస్ వస్తువులపై విధించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. అమెరికా మేథోసంపత్తి హక్కులను చైనా దుర్వినియోగ పరుస్తుందని, ఈ మేరకు బీజింగ్‌ను శిక్షించాల్సి ఉందని ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆరోపణలు బీజింగ్ ఖండిస్తోంది. -
వాణిజ్య యుద్ధ మేఘాలు!!
(సాక్షి, బిజినెస్ విభాగం):భారత్‌కు ఎగుమతి అవుతున్న హార్లీ డేవిడ్సన్ బైక్‌ల గురించి... సరిగ్గా నెల రోజుల కిందట వైట్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈ మధ్యే ఒక దేశ ప్రధాన మంత్రి నాకు ఫోన్ చేసి.. మీ దేశం నుంచి దిగుమతి అవుతున్న హార్లీ డేవిడ్సన్ బైక్‌లపై సుంకాన్ని 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తున్నామని చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. కాకపోతే, ఇక్కడ అమెరికాకు చేసిన మేలు ఏంటో నాకు అర్ధం కాలేదు. సుంకం తగ్గిస్తే మాకేంటి లాభం? ఇంకా మా కంపెనీల నుంచి 50 శాతం సుంకాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కదా!!. దీనికి ప్రతీకారం తప్పదు’’ అంటూ ట్రంప్ కుండ బద్దలు కొట్టారు. చాలా దేశాలు అమెరికా ఎగుమతులపై భారీ సుంకాలు రాబడుతున్నాయని, తాము మాత్రం విదేశీ దిగుమతులకు ప్రోత్సాహకాల పేరుతో చాలా కోల్పోయామని నిప్పులు చెరిగారు. చైనా, భారత్‌లే కాదు... ఇక తమపై సుంకాలు విధిస్తున్న ఏ దేశాన్నీ వదలబోమంటూ వాణిజ్య యుద్ధానికి సంకేతాలిచ్చారు. ముందుగా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీచేసి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. దీనితర్వాత ఇప్పుడు నేరుగా చైనా నుంచి దిగుమతి అయ్యే 60 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించడంతో పోరు తీవ్రమయింది. చైనా కూడా తక్షణం ప్రతీకార సుంకాలతో దూకింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రేగిన ఈ చిచ్చు... ఇతర దేశాలను వణికిస్తోంది. చినికిచినికి గాలివానగా మారి తమనెక్కడ ముంచేస్తుందోనన్నది ఇతర దేశాల భయం. వాణిజ్య యుద్ధం అంటే..? ఒక దేశ వాణిజ్య ప్రయోజనాలను మరో దేశం దెబ్బతీయడాన్నే వాణిజ్య యుద్ధంగా చెప్పొచ్చు. యుద్ధాల్లో క్షిపణుల మాదిరే ఈ వాణిజ్య యుద్ధంలో ‘సుంకాల్ని’ ప్రయోగిస్తారు. ఇక్కడ అమెరికానే తీసుకుంటే... ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకం విధించడం వల్ల ఇప్పటివరకూ ఆ దేశానికి ఎగుమతులు చేస్తున్న చైనా, జపాన్, జర్మనీ, భారత్ ఇతరత్రా దేశాలపై భారం పడుతుంది. ఆయా దేశాల కంపెనీల లాభాలు హరించుకుపోతాయి. ఇతర మార్కెట్లను వెతుక్కోవాల్సి వస్తుంది. దీనికి ప్రతిగా ఇతర దేశాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధిస్తాయి. వాణిజ్యం తీవ్రంగా దెబ్బతిని.. ఉద్యోగాల కోతలు... ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యే పరిస్థితికి దారితీస్తుంది. చైనాపై ఎందుకీ మంట...! ప్రపంచ వాణిజ్య మండలిలో (డబ్ల్యూటీఓ) సభ్యత్వం ఉన్న దేశాలు ఇష్టానుసారం మరో దేశంపై సుంకాలు వేయటానికి వీల్లేదు. అయితే, తయారీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా... చౌక ఉత్పత్తులతో ఇతర దేశాల్ని ముంచేస్తోంది. దీంతో పలు దేశాలు యాంటీ డంపింగ్ సుంకాన్ని విధిస్తున్నాయి. దీనిపై చైనా డబ్ల్యూటీఓలో రచ్చ చేయడం వల్ల కొన్ని దేశాలు వెనక్కితగ్గాయి. ఇప్పుడు ట్రంప్ తమ వ్యాపార అవకాశాలు, ఉద్యోగాలను ఇతర దేశాలు తన్నుకుపోతున్నాయంటూ డబ్ల్యూటీఓ నుంచి వైదొలగుతామని కూడా హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. చైనాతో తమ వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్లకు పెరిగిపోయిందని.. దీనివల్ల ఏకంగా అమెరికాలో కల్పించాల్సిన 20 లక్షలకుపైగా ఉద్యోగాలను చైనా తన్నుకుపోయిందని ట్రంప్ సర్కారు దుమ్మెత్తిపోస్తోంది. వాణిజ్య బంధాల వల్ల అమెరికాకంటే చైనాయే అత్యధికంగా లబ్ధి పొందిందని లెక్కలతో సహా వివరించింది. డబ్ల్యూటీఓలో 2001లో చైనా చేరినప్పుడు ఆ దేశ జీడీపీ 1 ట్రిలియన్ డాలర్లు కాగా... ఇపుడది 12 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరోపక్క, తమ ఆర్థిక వ్యవస్థ (ప్రస్తుతం 18 ట్రిలియన్ డాలర్లు) బలహీన పడిందని అమెరికా చెబుతోంది. కొన్నేళ్ల క్రితం 3.5 శాతం వృద్ధి రేటుండగా.. ఇపుడది 2 శాతానికి దిగజారిందని చైనాపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన భారీ ఉద్యోగాల హామీ కూడా ఈ వాణిజ్య యుద్ధానికి ట్రంప్‌ను తెరతీసేలా చేసింది. సుంకాలు ఒక్కటే కాదు.. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా, చైనాలదే అత్యధిక వాటా. కానీ ట్రంప్ చైనాతో పాటు అమెరికాకు అత్యధికంగా ఎగుమతులు చేసే యూరప్ దేశాలనూ లక్ష్యంగా చేసుకున్నారు. తమ సుంకాలకు ప్రతిగా యూరప్ దేశాలు గనుక సుంకాలు విధిస్తే... అక్కడి ఆటోమొబైల్ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తామని బెదిరించారు కూడా. ఎందుకంటే ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ ఇతరత్రా అనేక దిగ్గజ వాహన కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. సుంకాలు విధిస్తే వాటి వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీనివల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాలకు ముప్పు ఖాయం. సుంకాలతో పాటు ఇతర దేశాల వ్యాపార సంస్థలపైనా ట్రంప్ నేరుగా గురిపెట్టారు. ఇటీవలే అమెరికన్ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ను సింగపూర్‌కు చెందిన బ్రాడ్‌కామ్ కొనుగోలు చేసేందుకు సంబంధించిన ఒప్పందాన్ని ట్రంప్ అడ్డుకున్నారు. ఇదీ వాణిజ్య యుద్ధమే. దీనికి భద్రతపరమైన కారణాలను ట్రంప్ తెరపైకి తెచ్చారు. ఈ డీల్ విలువ 117 బిలియన్ డాలర్లు. ట్రంప్ దెబ్బతో ఒప్పందాన్ని ఇరు సంస్థలూ విరమించుకోవాల్సి వచ్చింది. ఈ డీల్ కుదిరితే చైనా టెలికం దిగ్గజంహువావేకు భారీగా లబ్ధి చేకూరుతుందనేది అమెరికా భయం. ఇకపై ఏం జరగొచ్చు? వాణిజ్య యుద్ధంలో విజేతలెవరూ ఉండరని.. క్షతగాత్రులే మిగులుతారనేది ప్రపంచ ఆర్థిక వేత్తల మాట. డబ్ల్యూటీఓలో ప్రధాన సభ్యులు యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్‌లు తామూ అమెరికా సుంకాలపై ప్రతిదాడి చేస్తామని చెప్పాయి. ట్రంప్ మొండి వైఖరికి ప్రతిగా ఇతర దేశాలూ ప్రతీకారానికి దిగితే మున్ముందు ఈ సమస్య తీవ్రమవుతుందని డబ్ల్యూటీఓ చీఫ్ రాబర్ట్ అజెవెడో హెచ్చరించారు. కాగా, వాణిజ్య యుద్ధానికి వెనుకాడబోమన్న చైనా కూడా 3 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై తాజాగా సుంకాన్ని విధించింది. మరోవంక ట్రంప్ ఇప్పుడు చేస్తున్నది ఆరంభమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలోకి దిగుమతయ్యే యురేనియంపైనా సుంకాల పోటు ఉండొచ్చని భావిస్తున్నారు. చైనా కూడా అమెరికాపై మున్ముందు మరిన్ని ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. 2015లో అమెరికా కంపెనీ బోయింగ్‌తో చైనా ఎయిర్‌లైన్స్ కుదుర్చుకున్న 38 బిలియన్ డాలర్ల విమానాల కొనుగోలు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా, వ్యవసాయం, టెక్నాలజీ ఇతరత్రా కీలక రంగాలకు చెందిన అమెరికా దిగుమతులపైనా చైనా సుంకాల మోత మోగిస్తుందనేది పరిశీలకుల అభిప్రాయం. భారత్‌పై ప్రభావం ఏంటి? అమెరికా సుంకాల ప్రభావం భారత్‌పై తక్కువే కానీ... అన్ని దేశాలూ అమెరికా పాటే పాడితే కచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థకు దెబ్బే. ఇప్పుడు భారత్ స్టీల్ ఎగుమతుల్లో అమెరికాకు వెళ్తున్నవి 2 శాతమే. అల్యూమినియం ఎగుమతులూ నామమాత్రమే. అయితే, ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత భారత్ లోహ కంపెనీల షేర్లు తీవ్ర కుదుపులకు గురవుతున్నాయి. ఇక ఎగుమతిదారులకు భారత్ అనేక సబ్సిడీ పథకాలను ఇస్తోందని.. ఇది పోటీతత్వాన్ని దెబ్బతీయడమేనని డబ్ల్యూటీఓకు కూడా అమెరికా ఫిర్యాదు చేసింది. ఐటీ ఇతరత్రా సేవల్లో అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలాంటి అగ్రరాజ్యంతో తలపడితే భారత్‌కు తలనొప్పులు ఖాయం. అందుకే ఈ సుంకాలపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక చైనాపై అమెరికా సుంకాల వల్ల మన కంపెనీలకు కొంత మేలు జరగొచ్చనేది నిపుణుల మాట. అయితే, భవిష్యత్తులో భారత్‌కూ ఇలాంటి చిక్కులొస్తే పరిస్థితి ఏంటన్నది మన వ్యాపార సంస్థలకు గుబులు పుట్టిస్తోంది. -
లక్షల కోట్ల ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్
వాషింగ్టన్ : అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై 25%, 10% చొప్పున సుంకాలను ప్రకటించి, ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసిన డొనాల్డ్ ట్రంప్, అక్కడితో ఆగేలా కనిపించడం లేదు. దాదాపు 4 లక్షల కోట్ల చైనా ఉత్పత్తులపై కూడా భారీగా పన్ను పోటు విధించేందుకు సిద్ధమవుతున్నారు. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాలను టార్గెట్‌గా చేసుకుని, 60 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై టారిఫ్‌లు విధించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సంబంధిత వ్యక్తులు చెప్పారు. అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974 కింద మేథో సంపత్తి విచారణ సెక్షన్ 301తో ఈ టారిఫ్‌లు అసోసియేట్ అవుతాయని మరో సంబంధిత వ్యక్తి తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగాలను టార్గెట్‌గా చేసుకుని, ఈ టారిఫ్‌లను విధించబోతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి వైట్‌హౌజ్ నిరాకరించింది. సినో-యూఎస్ వాణిజ్య సంబంధాలు జీరో-సమ్ గేమ్ లాంటివి కావని, ఆందోళనలను సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్మాణాత్మక మార్గాలను రెండు దేశాలు అనుకరించాలని చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ తెలిపారు. చైనా ప్రయోజనాలకు హాని కలిగేలా అమెరికా చర్యలు తీసుకుంటే, చైనా కూడా తమ చట్టబద్ధమైన హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకుంటుందన్నారు. చైనాను శిక్షించడానికి తన పెట్టుబడుల పాలసీలతో ట్రంప్ చైనీస్ హై టెక్నాలజీ కంపెనీలను ఎక్కువగా టార్గెట్ చేసినట్టు తెలిసింది. జాతీయ భద్రతా ఆంక్షల కింద చైనీస్ కంపెనీలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుబడుల నిబంధనలను విధించాలని కూడా చూస్తోంది. అయితే వీటి వివరాలు ఇంకా తెలియరాలేదు. అమెరికా ట్రెజరీ అధికార ప్రతినిధి కూడా వెంటనే స్పందించలేదు. ట్రంప్ టారిఫ్ ప్లాన్‌లో కార్మికులతో ముడిపడి ఉన్న కన్జ్యూమర్ రంగం ఉంది. దీనిపై వాషింగ్టన్ లాబియిస్ట్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్ విధించబోతున్న ఎక్కువ టారిఫ్‌లు, అమెరికా కుటుంబాలను మాత్రమే దెబ్బతీస్తాయని రిటైల్ ఇండస్ట్రి లీడర్స్ అసోసియేషన్ ట్రేడ్ లాబియిస్ట్ హన్ క్వాచ్ చెప్పారు. కేవలం ఫ్యాన్సీ స్వెటర్ల గురించే తాము మాట్లాడటం లేదని, టీ-షర్ట్లు, జీన్స్, షూలు, స్కూలకు వేసుకెళ్లే పిల్లల వస్త్రాలు అన్నింటి గురించి తాము మాట్లాడుతున్నామని చెప్పారు. గత వారం స్టీల్, అల్యూమినియంపై టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్, చైనాను ప్రత్యక్షంగానే టార్గెట్ చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. బీజింగ్ నుంచి కూడా దీనిపై గట్టి స్పందనే వచ్చింది. -
మనపై ప్రభావం తక్కువే!!
న్యూఢిల్లీ: ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించాలన్న అమెరికా ప్రతిపాదన... భారత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని దేశీ ఉక్కు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా మొత్తం ఉక్కు దిగుమతుల్లో భారత్ వాటా కేవలం రెండు శాతమేనని ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ రూర్కెలా ప్లాంటు మాజీ ఎండీ సనక్ మిశ్రా తెలిపారు. అమెరికాకు ఎగుమతి చేసే పరిమాణం తక్కువగా ఉండటం, దేశీయంగా డిమాండ్ పెరుగుతుండటం తదితర అంశాల వల్ల సుంకాల పెంపు ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని ఆయన చెప్పారు. ‘అమెరికా మొత్తం ఉక్కు దిగుమతుల్లో భారత వాటా రెండు శాతమే ఉంటుంది. దేశీయంగా ఉక్కు మార్కెట్, వినియోగం భారీగా పెరుగుతోంది‘ అని మిశ్రా తెలిపారు. మరోవైపు, ఉక్కు ఉత్పత్తులపై సుంకాలు పెంచాలన్న అమెరికా ప్రతిపాదన.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు విరుద్ధమని ఎస్సార్ స్టీల్ డైరెక్టర్ (కమర్షియల్) హెచ్.శివరామ కృష్ణన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన పక్షంలో... అంతర్జాతీయంగా ఉక్కు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. అయితే, భారత్‌పై పరోక్షంగా కొంత ప్రభావం పడొచ్చన్నారు. ‘అమెరికాకు యూరోపియన్ దేశాల నుంచి జరిగే ఎగుమతులపై ప్రధానంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా యూరప్‌తో పాటు ఇతర ప్రాంతాలకు భారత్ చేసే ఎగుమతులపైనా ఇది ప్రభావం చూపుతుంది’’ అని ఆయన చెప్పారు. అమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులపై స్వల్ప ప్రభావమే ఉంటుందని సెయిల్ మాజీ చైర్మన్ సుశీల్ కుమార్ రుంగ్టా చెప్పారు. అయితే అమెరికా నిర్ణయంతో మిగతా దేశాలు కూడా ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. ఇది అంతర్జాతీయంగా ఉక్కు వ్యాపారంలో పెను మార్పులు తీసుకురావచ్చని.. లేదా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్కు దిగుమతులపై 25%, అల్యూమినియంపై 10% సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించడం తెలిసిందే. దీనికి అధికారిక ముద్ర వేస్తూ.. వచ్చేవారం ఈ ప్రతిపాదనపై ఆయన సంతకాలు చేసే అవకాశముంది. ఇతర దేశాలపైనే ఎక్కువ ప్రభావం: కొటక్ సుంకాల పెంపు అమలైతే... ఇతర దేశాల నుంచి అమెరికాకు ఉక్కు ఎగుమతులు సుమారు 9–14 మిలియన్ టన్నుల మేర తగ్గొచ్చని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ‘దిగుమతి సుంకాలను పెంచడంతో పాటు దేశీయంగా ఉక్కు మిల్లుల సామర్థ్యాలను ప్రస్తుతమున్న 72 శాతం స్థాయి నుంచి 80– 85 శాతం స్థాయికి పెంచాలన్న అమెరికా నిర్ణయాలతో ఆ దేశానికి ఇతర దేశాల నుంచి ఉక్కు ఎగుమతులు 9– 14 మిలియన్ టన్నుల మేర తగ్గొచ్చు’’ అని అంచనా వేసింది. 2017లో అమెరికా 82 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగా 36 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంది. ఒకవేళ ప్లాంట్ల సామర్థ్యం మెరుగుపడి ఉక్కు ఉత్పత్తి 91–96 మిలియన్ టన్నులకు పెరిగిన పక్షంలో దిగుమతులు 22– 25 ఎంటీకి తగ్గిపోవచ్చని అంచనా. అమెరికాకు ఉక్కు ఎగుమతుల్లో కెనడా, బ్రెజిల్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా దేశాల వాటా దాదాపు 60 శాతం. గతేడాది భారత్ 0.9 ఎంటీ ఉక్కు మాత్రమే ఎగుమతి చేసింది. అయితే అమెరికా తీసుకునే రక్షణాత్మక చర్యల ప్రభావం ప్రపంచ ఉక్కు మార్కెట్లపై ప్రత్యక్షంగా మాత్రం తక్కువ స్థాయిలోనే ఉండవచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. మరోవైపు, సుంకాల పెంపు ప్రపంచ వాణిజ్యంతో పాటు అమెరికా ఎకానమీపైనా, అక్కడి తయారీ.. నిర్మాణ రంగాలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రతినిధి గెర్రీ రైస్ పేర్కొన్నారు. ఇంకా మినహాయింపులెందుకు?: విల్బర్ రాస్ ఉక్కు, అల్యూమినియంపై దిగుమతుల సుంకాల పెంపు ప్రతిపాదనను అమెరికా సమర్థించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక దశాబ్దాలుగా చైనా, జర్మనీ వంటి దేశాలకు అన్ని రకాల మినహాయింపులిస్తూ వస్తున్న తప్పుడు విధానాలను సరిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ వ్యాఖ్యానించారు. ప్రతీకార చర్యగా యూరోపియన్ దేశాలు కూడా అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచవచ్చన్న ఆందోళనలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు. ‘రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆ ప్రభావాల నుంచి యూరప్, ఆసియా దేశాలకు తోడ్పాటునివ్వాలన్న సదుద్దేశంతో అప్పట్లో అన్ని రకాల మినహాయింపులు ఇచ్చేశాం. కానీ ఆయా దేశాలు ప్రస్తుతం పటిష్టంగా ఎదిగాక కూడా వాటిని కొనసాగించడం అర్ధరహితం. గతంలో చేసిన అనేక తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది’ అని రాస్ పేర్కొన్నారు. అటు యూరోపియన్ యూనియన్ కొంత ప్రతీకార చర్యలకూ దిగే అవకాశమూ ఉందన్నారు. అయితే, ఇది కేవలం 3 బిలియన్ డాలర్ల మేర అమెరికన్ ఉత్పత్తులకే పరిమితం కాగలదని రాస్ వ్యాఖ్యానించారు. ‘నాఫ్టా’ని సరిచేస్తే పునరాలోచిస్తా: ట్రంప్ సుంకాల విధింపు అంశం అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమలో ప్రకంపలను సృష్టిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో (నాఫ్టా) లోపాలను సరిదిద్ది ‘సముచితమైన, కొత్త’ ఒప్పందం రూపొందిన పక్షంలో ఉక్కు, అల్యూమినియంపై ప్రతిపాదిత సుంకాల విధింపు అంశాన్ని పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. ‘కెనడా, మెక్సికోతో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది. ప్రస్తుతం పునఃసమీక్ష జరుగుతున్నప్పటికీ.. నాఫ్తా ఒప్పందం అమెరికాకు కంపెనీలు, ఉద్యోగాలపరంగా ప్రతికూలంగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సముచితమైన రీతిలో కొత్తగా నాఫ్తా ఒప్పందం కుదిరిన పక్షంలో మాత్రమే సుంకాల అంశం పక్కన పెట్టే అవకాశం ఉంది‘ అని వివరించారు. -
జియో టారిఫ్‌లు పెరిగాయ్!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో కొన్ని టారిఫ్‌లను సవరించింది. 84 రోజుల ప్లాన్‌ను రూ.459కు పెంచుతున్నట్లు కంపెనీ తన వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ టారిఫ్ రూ.399గా ఉంది. ఈ టారిఫ్‌ల సవరింపు నేటి(గురువారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 84 రోజుల ప్లాన్‌లో వినియోగదారులు 1 జీబీ 4జీ డేటాను ప్రతిరోజూ పొందవచ్చని వివరించింది. దివాళీ ధమాకా పేరుతో అందిస్తున్న స్కీమ్‌లో రూ.149 ప్లాన్‌లో ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న డేటాను 2జీబీ నుంచి 4జీబీకు పెంచుతున్నామని పేర్కొంది. షార్ట్ టర్మ్ ప్లాన్లు, తక్కువ డినామినేషన్ రీచార్జ్ టారిఫ్‌లను రిలయన్స్ జియో తగ్గించింది. వారం వ్యాలిడిటీ ఉండే ప్లాన్ రూ.52, రెండు వారాల వ్యాలిడిటీ ఉండే రూ.98 ప్లాన్‌లో ఉచిత వాయిస్, ఎస్ఎంఎస్, అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చని పేర్కొంది. రోమింగ్‌లో ఉన్నప్పటికీ, జియో... పరిమితి లేని వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేస్తోందని పేర్కొంది. రూ.509 స్కీమ్ ప్రయోజనాలను తగ్గించింది. అంతే కాకుండా బిల్లింగ్ సైకిల్‌ను 56 రోజుల నుంచి 49కు కు తగ్గించామని పేర్కొంది. ఇక రూ.999 ప్లాన్‌లో గతంలో ఆఫర్ చేసిన 90 జీబీ 4 జీ డేటాను 30 జీబీకి తగ్గించామని తెలిపింది. -
థాంక్యూ జియో: ఫోన్ బిల్లులు తగ్గాయ్
-
థాంక్యూ జియో: ఫోన్ బిల్లులు తగ్గాయ్
సాక్షి, ముంబై : రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ... సంచలనాలనే సృష్టించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జియో దెబ్బకు... టారిఫ్‌లతో మోత మోగిస్తున్న దిగ్గజ టెల్కోలన్నీ కిందకి దిగొచ్చాయి. దీంతో గత ఏడాదిగా వినియోగదారుల మొబైల్ బిల్లులు భారీగానే తగ్గినట్టు తెలిసింది. అంతేకాక టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న ధరల యుద్ధంతో మరింత స్థాయిలో ధరలు కిందకి పడిపోనున్నాయని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సగటున 25-30 శాతం టారిఫ్‌లు కిందకి పడిపోవచ్చని విశ్లేషకులు, ఇండస్ట్రి ఇన్సైడర్స్ అంచనావేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కువ డేటా వాడే వారైతే, మరింత లబ్ది పొందవచ్చంటూ పేర్కొంటున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి ప్రవేశించిన అనంతరం గతేడాదిగా టారిఫ్ ధరలు కనీసం 25-32 శాతం కిందకి పడిపోయాయి. ఎక్కువ డేటా వాడేవారికి ధరల నుంచి 60-70 శాతం ఉపశమనం లభించిందని తెలిసింది. జియో మార్కెట్లోకి ప్రవేశిస్తూనే.. ఉచిత లాంచ్ ఆఫర్లు, ఆల్ట్రా చీఫ్ టారిఫ్‌లతో ఇండస్ట్రిని అదరగొట్టింది. ఈ కొత్త టెల్కోకు కౌంటర్ ఇవ్వడానికి, తమ కస్టమర్లు, జియోకు తరలిపోకుండా ఆపేందుకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు తమ ధరలను తగ్గించాయి. ప్రస్తుతం జియో, ఇతర టెల్కోలకు మధ్య నెలకొన్న ధరల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో ముగుస్తుందని అనుకోవడం లేదని ఇండస్ట్రి బాడీ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజన్ మ్యాథ్యూస్ చెప్పారు. మరో ఏడాది పాటు ఈ వార్ కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది టెలికాం ఇండస్ట్రిలో నెలకొన్న ఒత్తిడి మరింత పెంచుతుందని తెలిపారు. సగటున ఈ ఏడాది మొబైల్ బిల్లులు 25-18 శాతం తగ్గుతాయని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ పార్టనర్ హేమంత్ జోషి అన్నారు. వచ్చే ఏడాది 30 శాతం పడిపోయే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. రెండంకెల స్థాయిలో కూడా ధరలు పడిపోవచ్చని కేపీఎంజీ చెబుతోంది. పాపులర్ ప్యాకేజీ ధరల ట్యాగ్లు రూ.250 నుంచి రూ.500 మధ్యలో ఉండగా...వీటి వాలిడిటీ 28 రోజుల నుంచి 84 రోజుల మధ్యలో ఉంది. రోజుకు 8జీబీ డేటా వాడేవారు అత్యధికంగా లబ్ధి పొందనున్నారు. 2016లో రూ.250గా ఉన్న సగటు జీబీ డేటా, ప్రస్తుతం రూ.50కు పడిపోయింది. -
అలా చేస్తే.. ట్రేడ్ వార్ తప్పదంటున్న చైనా
బీజింగ్ : మరోసారి అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. డబ్ల్యూటీవో నిబంధనలను పక్కకుపెట్టి, ఏకపక్షంగా తమ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే అమెరికాతో ట్రేడ్ వార్ కు దిగుతామని హెచ్చరించింది. స్వంత ప్రయోజనాల కోసం డబ్ల్యూటీవో నిబంధనలను పక్కన పెట్టాలని ఎవరైనా చూస్తే, 1930 లో తలెత్తిన ట్రేడ్ వార్ మరోసారి చవిచూడాల్సి వస్తుందని వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి చెప్పారు. బహుపాక్షిక వాణిజ్య విధానాలు ఎంతమేరకు అర్థవంతం కావని పేర్కొంది. డబ్ల్యూటీవో నిర్ణయించిన నిబంధనలు పక్కనపెట్టాలని అమెరికా చూస్తున్న తరుణంలో చైనా ఈ మేర స్పందించింది. డబ్ల్యూటీవో నిర్ణయాలకు తలొగ్గని అమెరికా కొత్తప్రభుత్వం తమ కొత్త వార్షిక ట్రేడ్ పాలసీ ఎజెండాలను కాంగ్రెస్ కు పంపింది. ''అమెరికా కొత్త ట్రేడ్ చట్టాలను కచ్చితంగా అమలుచేయాలని చూస్తోంది. ఏకపక్షంగా మాపై వాషింగ్టన్ సుంకాలు విధించేందుకు సిద్దమైంది. ఒకవేళ దిగుమతులు పెరిగితే తమ దేశీయ పరిశ్రమకు తీరని అన్యాయం జరుగుతుంది'' అని స్టేట్ రన్ గ్లోబల్ టైమ్స్ ఆందోళన వ్యక్తంచేసింది. ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడిన చైనాకు వ్యతిరేకంగా అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చైనా ఉత్పత్తులపై 45 శాతం సుంకాలు విధించాలని భావిస్తున్నారు. చైనా, అమెరికాలు ఒకదానిపై ఒకటి ఆధారపడిన దేశాలు, ద్వైపాక్షిక సంబంధాల ప్రభావం రెండు దేశాల మధ్యే కాకుండా ప్రపంచమంతా ప్రభావం చూపుతాయని చైనా వాణిజ్య శాఖామంత్రి జాంగ్ షా అన్నారు. -
జియో బంపర్ టారిఫ్‌లు ఇవే!!
-
జియో బంపర్ టారిఫ్‌లు ఇవే!!
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సర్వీసులపై యూజర్లకు ముకేశ్ అంబానీ బంపర్ టారిఫ్‌లను ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ టెలికాం పరిశ్రమ అందించలేని టారిఫ్‌లను వినియోగదారులు ముందుకు తీసుకొచ్చారు. ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాలింగ్, అపరిమిత మెసేజింగ్ సదుపాయం, పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఎలాంటి ప్రత్యేక చార్జీలుండవని ప్రకటించిన ముకేశ్, విద్యార్థులకు స్టూడెంట్ ఐడీ కార్డుపై 25 శాతం అదనపు డేటాను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్ లాంచ్ అనంతరం వెల్కమ్ ఆఫర్ కింద అందరికీ ఒక నెల ఉచిత సర్వీసులను అందించనున్నట్టు వరాల జల్లులు కురిపించారు. వచ్చే ఏడాది కల్లా కోటి వై-ఫై కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్న ముకేశ్, ప్రధానంగా స్కూళ్లు, కాలేజీలపైనే ఎక్కువగా దృష్టిసారించారు. టెలికా పరిశ్రమలో విప్లవం సృష్టించే జియో డేటా టారిఫ్‌లు.... 1 ఎంబీ డేటా 5 పైసలు 1జీబీ డేటా 50 రూపాయలు 28 రోజులకు 300 ఎంబీ 4జీ డేటా టారిఫ్ రూ.149 రూ.499కు 4 జీబీ 4 జీ డేటాతో పాటు నైట్ అన్లిమిటెడ్ డేటా యూసేజ్ వై-ఫై హాట్స్పాట్లతో రిలయన్స్ జియోపై 8 జీబీ డేటాను పొందవచ్చు. రూ.999లకు 10 జీబీ 4 జీ డేటా, 20 జీబీ వై-ఫై యూసేజ్, నైట్ అన్లిమిటెడ్ యూసేజ్ రూ.1,499లకు 20 జీబీ 4 జీ డేటా రూ.2,499కు 35 జీబీ 4 జీ డేటా రూ.3,999కు 60 జబీ 4 జీ డేటా రూ.4,999కు 75 జీబీ 4జీ యూసేజ్, నైట్ అన్లిమిటెడ్, 150 జీబీ వై-ఫై డేటా