
ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్‌లు టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ టాప్ టెక్ కంపెనీ యాపిల్‌పై ఈ సుంకాల ప్రభావం భారీగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఎలాగైనా కంపెనీ ఐఫోన్ ధరలు పెంచుందనే ఉద్దేశంతో వినియోగదారులు ముందుగానే కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఐఫోన్లు అధికంగా తయారవుతున్న చైనాపై యూఎస్ ఏకంగా 54 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కంపెనీ షేర్లు ఇటీవల కాలంలో భారీగా తగ్గిపోయాయి. అదేసమయంలో త్వరలో ధరలు పెరుగుతాయని ఊహాగానాలతో ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు బారులు తీరుతున్నారు.
టారిఫ్‌ల అమలు తర్వాత అనూహ్యంగా వ్యయ పెరుగుదల ఉంటుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు అమల్లోకి రాకముందే ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడడంతో అమెరికా వ్యాప్తంగా యాపిల్ రిటైల్ స్టోర్ల వద్ద రద్దీ కనిపించింది. చైనా తయారీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ సుంకాలు యాపిల్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
భారత్‌పైనా ప్రభావం..
విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
ఐఫోన్ రూ.రెండు లక్షలు!
చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.