
విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.
యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త ఫీచర్లకు ఆదరణ అంతంతమాత్రంగా ఉండటంతో ఇప్పటికే ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అధిక ధరలు డిమాండ్‌ను మరింత తగ్గిస్తాయి. ఇది చైనా వెలుపల ఎక్కువ ఫోన్లను తయారు చేసే, టారిఫ్‌ల వల్ల తక్కువ ప్రభావితమయ్యే శామ్‌సంగ్ వంటి ప్రత్యామ్నాయ కంపెనీ ఉత్పత్తుల వైపు వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రూ.44 కోట్ల విలువైన గోల్డ్ కార్డు ప్రదర్శించిన ట్రంప్
అమెరికా ప్రభుత్వం నుంచి యాపిల్ గతంలో టారిఫ్‌ల నుంచి మినహాయింపులను పొందగలిగినప్పటికీ, ఈసారి అటువంటి సౌలభ్యం లేదని ఇప్పటికే అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. వియత్నాం, ఇండియాలోనూ యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అయితే వియత్నాంపై 46 శాతం సుంకాన్ని, భారతదేశంపై 26 శాతం సుంకాన్ని విధించారు. ఇవి చైనా సుంకాల కంటే తక్కువగానే ఉన్నాయి. అయితే కంపెనీ ఇండియా వంటి దేశాల్లో ఉత్పత్తిని పెంచుతుందా లేదా అనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది.