
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సుంకాలు విధించడం ప్రపంచవ్యాప్తంగా కొన్ని రంగాలకు ప్రతికూలంగా మారితే, ఇంకొన్ని విభాగాలకు అవకాశంగా పరిణమించింది. భారత్‌లోని జీడిపప్పు వ్యాపారులకు ఈ సుంకాలు అమెరికాలో తమ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు మార్గాన్ని చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూఎస్‌కు పెద్దమొత్తంలో జీడీపప్పు ఎగుమతి చేస్తున్న వియత్నాంపై 46 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 26 శాతం సుంకానికి లోబడి భారతీయ జీడిపప్పు అక్కడి మార్కెట్‌లో పోటీపడే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
చాలా ఏళ్లుగా వియత్నాం యూఎస్ జీడిపప్పు మార్కెట్‌లో ఆధిపత్యం సాగిస్తోంది. అమెరికా దిగుమతుల్లో సుమారు 90 శాతం వాటా వియాత్నాందే కావడం విశేషం. భారత్ వాటా ఈ విభాగంలో చాలా తక్కువగా ఉంది. ఇది సంవత్సరానికి 7,000-8,000 టన్నుల ఎగుమతులకు పరిమితమైంది. కొత్త టారిఫ్ విధానాలు అమెరికాలో భారతీయ జీడిపప్పు మార్కెట్‌ను విస్తరించుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. వియత్నాం కంటే భారత్‌పై విధించిన సుంకాలు 20 శాతం తక్కువగా ఉండడం ఇందుకు కారణం. దాంతో యూఎస్ మార్కెట్లో ఇండియా క్యాష్యూ చౌకగా అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది అక్కడి మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి: సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలు
ప్రాసెసింగ్ సామర్థ్యాలు పెంచుకోవాలి..
ఆల్ ఇండియా క్యాష్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా రాహుల్ కామత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారతీయ ఎగుమతిదారులకు ఈ టారిఫ్ విధానాలు స్వల్పకాలిక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే ఇండియాపై తక్కువ టారిఫ్ ఉండడం ఇందుకు కారణం. అమెరికా జీడిపప్పు మార్కెట్‌లో వాటాను పెంచుకునేందుకు ఇండియాతో పాటు తక్కువ సుంకాలను ఎదుర్కొంటున్న ఆఫ్రికా దేశాలు కూడా పోటీపడే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం తన ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించాలి’ అని చెప్పారు.