Cashew industry
-
జీడిపై చీడ రాతలు! ఎందుకో రామోజీ గుండెలు బాదుకుంటున్నాడు!!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జీడి తోటల విస్తీర్ణాన్ని చూసినా.. దిగుబడులైనా.. ఎగుమతులైనా గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపయ్యాయి. సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు ఏకంగా 17 వేల ఎకరాలకుపైగా జీడి తోటలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇక తితిలీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతుల నోట్లో మట్టిగొట్టిన చంద్రబాబు నిర్వాకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆ అన్నదాతలను ఆదుకుంటూ గత సర్కారు ఎగ్గొట్టిన రూ.87.29 కోట్ల పరిహారాన్ని చెల్లించిందీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. ప్రపంచాన్ని ముంచెత్తుతున్న వియత్నాం జీడి గింజల దిగుమతులను అరికట్టడం సాధ్యం కాకున్నా ప్రాసెసింగ్‌లో 50 శాతం మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో 80 శాతం దిగుమతి చేసుకున్న గింజలను వినియోగిస్తే కిమ్మనని ఈనాడు రామోజీ ఇప్పుడు మాత్రం అన్యాయం జరిగిపోతోంది..! బాబోయ్ దిగుమతులు పెరిగాయ్..! ప్రాసెసింగ్ యూనిట్లు మూతబడ్డాయని గుండెలు బాదుకుంటూ తప్పుడు కథనాలకు తెగబడ్డారు!! ‘ఈనాడు’ ఆరోపణ: దిగుబడులు లేక నష్టాల బారిన రైతులు.. వాస్తవం: 2018 –19లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో జీడితోటలు ఉండగా ఈ విస్తీర్ణం ప్రస్తుతం 3.35 లక్షల ఎకరాలకు పెరిగింది. నాలుగేళ్లలో 35 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. టీడీపీ హయాంలో రూ.6.92 కోట్లతో 8,648 ఎకరాల్లో తోటలను పునరుద్ధరిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.13.64 కోట్లతో 17,125 ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించడమే కాకుండా రూ.8.30 కోట్లతో 35 వేల ఎకరాల్లో కొత్త తోటలను విస్తరించింది. ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తోటబడుల వల్ల ఉత్పత్తి సగటున 800 కిలోల నుంచి 1,150 కిలోలకు పెరిగింది. ఫలితంగా దిగుబడులు 1.23 లక్షల టన్నుల నుంచి 1.67 లక్షల టన్నులకు పెరిగాయి. చంద్రబాబు జమానాలో రూ.701.69 కోట్ల విలువైన 12,356 టన్నుల జీడిపప్పు ఎగుమతి కాగా ఇప్పుడు నాలుగేళ్లలో రూ.1,718.85 కోట్ల విలువైన 29,399 టన్నులు ఎగుమతి అయ్యాయి. నాలుగేళ్లలో ఎగుమతులు ఏకంగా 17 వేల టన్నులకు పైగా పెరిగాయి. సాధారణంగా జీడి పిక్కల కోత మే నెల కల్లా పూర్తయిపోతుంది. ప్రస్తుతం రైతుల వద్ద పది శాతం కూడా పంట లేదు. అలాంటప్పుడు రైతుకు నష్టం ఏ విధంగా జరుగుతుందో రామోజీకే తెలియాలి. ఆరోపణ: జీడి రైతుల సంక్షేమాన్ని విస్మరించారు వాస్తవం: 2018–19లో తితిలీ తుపాన్ కారణంగా జీడి తోటలు పెద్ద ఎత్తున దెబ్బతింటే చంద్రబాబు కేవలం 70 వేల మంది రైతులకు రూ.68.18 కోట్ల పరిహారం విదిల్చారు. 1,38,458 మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.87.29 కోట్ల పరిహారాన్ని సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అందజేసి రైతులను ఆదుకున్నారు. తుపాన్‌తో నష్టపోయిన ప్రాంతాల్లో 21,250 ఎకరాల్లో తోటల పునరుద్ధరణ, విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు. ఆరోపణ: జీడిపప్పు ధరల పతనంతో నష్టాలు వాస్తవం: రాష్ట్రంలో ఉత్పతయ్యే జీడిపప్పు మొదటి రకంæ కిలో రూ.800, రెండో రకం కిలో రూ.600 ఉంటుంది. అయితే మన జీడిపప్పు ధర వెనుక అసలు కారణాలకు ‘ఈనాడు’ ముసుగేసింది. ప్రపంచంలో అత్యధికంగా జీడిపప్పు ఉత్పత్తి చేసే వియత్నాం నుంచి యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతులు జరుగుతాయి. అయితే ఆ దేశాల్లో నిల్వలు ఎక్కువ కావడంతో వియత్నాం నుంచి దిగుమతులను నిలిపివేశాయి. దీంతో ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీగా దిగుమతి అవుతున్న వియత్నాం జీడిపప్పు స్థానిక మార్కెట్లో మొదటి రకం కిలో రూ.600, రెండో రకం రూ.450లకే లభిస్తోంది. గత పదేళ్లుగా ముడి గింజలు కిలో రూ.80 నుంచి రూ.120 మ«ధ్య ఉండగా ఈనాడు మాత్రం రూ.140 – రూ.150 మధ్య ఉండేవంటూ మరో అబద్ధాన్ని అచ్చేసింది. ఆరోపణ: జీడి పరిశ్రమకు చేయూత ఏదీ? వాస్తవం: జీడిమామిడి రైతుల సంక్షేమం, నాణ్యమైన జీడి ఉత్పత్తి కోసం నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా నాణ్యమైన మొక్కలతో జీడి విస్తీర్ణ పథకం, జీడి తోటలకు బిందు సేద్యం, పాత జీడితోటల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. సాగు మెళకువలను నేర్పించడం ద్వారా జీడి పంట నాణ్యత పెంచేలా తోటబడి కార్యక్రమం ద్వారా 418 ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించారు. పలాసను జీడిపప్పు ప్రాసెసింగ్ క్లస్టర్‌గా అభివృద్ధి చేశారు. బొబ్బిలి, అనకాపల్లిలోని ప్రభుత్వ ఉద్యానవన క్షేత్రాలతో పాటు బాపట్లలోని జీడిపప్పు పరిశోధనా కేంద్రంలో 4.5 లక్షలకు పైగా అంటుకట్టిన జీడి మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. ఆరోపణ: కొత్త యూనిట్లకు ప్రోత్సాహమేది? వాస్తవం: ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేలా ఆధునికీకరణకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం సబ్సిడీపై రూ.4 లక్షల అంచనాతో ప్యాక్ హౌస్‌లు, కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రూ.25 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఇందులో రూ.10 లక్షలు సబ్సిడీగా అందిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6 లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. తొలిసారిగా జీడిపిక్కల నిల్వ కోసం రూ.1.69 కోట్లు వెచ్చించి 15 కలెక్షన్ సెంటర్లను నెలకొల్పారు. రూ.2.79 కోట్లతో రైతులకు బిందు సేద్యం పరికరాలను సమకూర్చారు. జీడిపప్పు కెర్నల్ ఆయిల్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మెరుగైన విలువ జోడింపు, అధిక ఆదాయం కోసం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలలో పీపీపీ ప్రాజెక్టుల కింద జీడిపప్పులో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆరోపణ: నష్టాలు భరించలేక 500 పరిశ్రమలు మూసివేత వాస్తవం: ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. రాష్ట్రంలో 402 ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. ఇవి సంవత్సరానికి 79,140 టన్నుల సామర్థ్యంతో 1.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో మెజార్టీ యూనిట్లు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలుపుదల చేస్తాయి. కొన్ని యూనిట్లు ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంతేకానీ రాష్ట్రంలో శాశ్వతంగా మూతపడిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. పైగా రాష్ట్రంలో ఉన్నవే 402 పరిశ్రమలైతే 500 పరిశ్రమలు ఎలా మూతపడ్డాయో ఈనాడుకే తెలియాలి. -
Cashew: ‘పశ్చిమ’ జీడిపప్పుకు విశేష ఆదరణ
జిల్లాలో జీడిపప్పు పరిశ్రమ విస్తరిస్తోంది. ఇసుక నేలలు, మెట్ట భూముల్లో సాగవుతున్న జీడితోటల నుంచి వచ్చే పంట నాణ్యంగా ఉండటంతో ఇక్కడి జీడిపప్పు రుచిగా ఉంటోంది. జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు జీడి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ‘పశ్చిమ’ జీడిపప్పుకు మంచి గిరాకీ ఉంది. దేవరపల్లి: జీడిపప్పు తయారీలో పశ్చిమగోదావరి జిల్లా గుర్తింపు పొందింది. మెట్ట ప్రాంతంలో జీడిపప్పు తయారీ ఎక్కువగా ఉంది. దేవరపల్లి, దూబచర్ల, తాడిమళ్ల ప్రాంతాల్లో జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 15 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి జీడిపప్పు ఎగుమతులు జరుగుతున్నాయి. రోజుకు 40 టన్నుల వరకు జీడిపప్పు ఎగుమతి అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జీడిపప్పు తయారీ కుటీర పరిశ్రమగా ఉంది. పరిశ్రమల ద్వారా ఎందరో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఎక్కువగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇళ్ల వద్ద మహిళలు జీడిపప్పు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమలో తయారు చేసిన జీడిపప్పును మహిళలు ఇళ్లకు తెచ్చుకుని పప్పుపై ఉన్న పొట్టును తొలగించి, శుభ్రం చేసి తిరిగి పరిశ్రమకు అప్పగిస్తారు. ఇలా రోజుకు ఒక్కో మహిళ 20 నుంచి 25 కిలోల పప్పును శుభ్రం చేస్తారు. దీని ద్వారా రూ.250 వరకు సంపాదిస్తున్నారు. జిల్లాలోని జీడి పరిశ్రమల్లో సుమారు 3 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఒక్కో పరిశ్రమలో స్థాయిని బట్టి 70 మంది వరకు పనిచేస్తున్నారు. 100 వరకు పరిశ్రమలు ► జిల్లాలో జీడిపప్పు పరిశ్రమలు 100 వరకు ఉన్నాయి. ► వీటిలో 50 పరిశ్రమలు పెద్దవి కాగా మిగిలినవి చిన్నవి. ► దేవరపల్లిలో 10, దూబచర్లలో 8, తాడిమళ్లలో 25 వరకు పరిశ్రమలు ఉన్నాయి. ► జీడిగింజ నుంచి ఐదు రకాల పప్పును ఉత్పత్తి చేస్తున్నారు. ► గుండు, బద్దతో పాటు మూడు రకాల ముక్కను తీస్తున్నారు. ► గుండు, బద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ► కె.ముక్క (బద్దలో సగం)కు ఎక్కువ డిమాండ్ ఉంది. ► పప్పుతో పాటు పొట్టు, తొక్కలకు కూడా గిరాకీ ఉంది. ► జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 25 వేల ఎకరాల్లో జీడిమామిడి పంట సాగు ఉంది. ముక్కకు డిమాండ్ గుండు, బద్ద కంటే ముక్కకు డిమాండ్ బాగా ఉంది. కోవిడ్ నిబంధనలు సడలింపులతో ముక్క గిరాకీ పెరిగింది. హోటల్స్‌లో ముక్క ఎక్కువగా వినియోగిస్తారు. బస్తా గింజలకు సుమారు 3 కిలోల ముక్క వస్తుంది. రెండేళ్లుగా కోవిడ్‌తో పరిశ్రమల ఒడుదుడుకులతో సాగుతోంది. జిల్లాలో పండుతున్న జీడిమామిడికి నాణ్యత ఎక్కువ. దీంతో పప్పు రుచిగా, నాణ్యంగా ఉండటంతో మార్కెట్లో ఆదరణ బాగుంది. –పెంజర్ల గణేష్‌కుమార్, కార్యదర్శి, కాజూనట్ మర్చంట్స్ అసోసియేషన్, దేవరపల్లి తయారీ ఇలా.. చెట్టు నుంచి జీడి గింజలను సేకరించిన రైతులు వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారులు గింజలను పరిశ్రమలకు తరలిస్తారు. అక్కడ గింజలను బాయిలర్‌లో కాల్చి యంత్రాల ద్వారా బద్దలు చేసి గుండును తీస్తారు. గుండుపై ఉన్న పొర (పొట్టు)ను కూలీల ద్వారా తొలగించి బద్ద, గుండు, ముక్క తయారు చేస్తారు. ఐదు రకాలుగా పప్పును తయారు చేసి కిలో చొప్పున ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. బస్తా (80 కిలోలు) గింజల నుంచి 22 నుంచి 24 కిలోల వరకు పప్పు వస్తుంది. బస్తా జీడిగింజల ధర రూ.10,400 ఉంది. -
రూ.10 కోట్లకు టోకరా
సాక్షి, రాజానగరం: జీడిపిక్కల వ్యాపారం కోసం అప్పు ఇచ్చిన బ్యాంకు అధికారులు కొన్ని రోజుల తరువాత తనిఖీ కోసం గోడౌన్‌కు వెళ్తే జీడిపిక్కల నిల్వలు లేకుండా ఖాళీ గోడౌన్ దర్శనమిచ్చింది. దీంతో నివ్వెరపోయిన ఆ బ్యాంకు అధికారులు తరువాత తేరుకొని సంబంధిత వ్యాపారులతోపాటు తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై శివనాగబాబు తెలిపిన వివరాలిలావున్నాయి. అనపర్తి మండలం, పేరారామచంద్రపురానికి చెందిన నలుగురు వ్యాపారులు గోడౌన్లో నిల్వ ఉంచిన జీడిపిక్కలను చూపించి, వాటిపై రాజమహేంద్రవరంలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.10 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి వారి నుంచి చెల్లించాల్సిన వాయిదాలు సక్రమంగా జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు తనిఖీకి గోడౌన్‌కి రావడంతో జీడిపిక్కల బస్తాలు లేవు. ఖాళీ గోడౌన్ కనపడింది. దీంతో అప్పు తీసుకున్న నలుగురు వ్యాపారులు నల్లమిల్లి అరుణ, వరలక్ష్మి, రాధ, కర్రి వెంకటబులిరెడ్డితోపాటు వారికి అప్పు ఇప్పించిన ఏజెన్సీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కేతల భద్రావతి, కేతల సూర్రెడ్డి, ఎస్వీ వెంకట్రావు, గోడౌన్ యజమానులకు సంబంధించి ఇద్దరిపై బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
పేలిన బాయిలర్
కాశీబుగ్గ: దివాన్ జీడి పరిశ్రమలో బాయిలర్ పేలి ప్రమాదం చోటుచేసుకుంది. ఆపరేటర్‌కు తీవ్రగాయాలయ్యాయి. పలాస–కాశీబుగ్గ మున్సిపాల్టీ అనంతపురం రెవెన్యూ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిశ్రమ యజమాని తాళాసు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల సమయంలో ఆపరేటర్ పల్లెటి ఢిల్లేశ్వరరావు బాయిలర్‌ను ఆన్ చేశారు. నాలుగు బస్తాల (320 కేజీల) జీడి పిక్కలను బాయిలర్‌లో వేశారు. వెంటనే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆపరేటర్ చిక్కుకున్నాడు. కళ్లల్లోకి కెమికల్‌తో కూడిన ఉష్ణం తగలడంతో చూపుపోయే పరిస్థితి నెలకొంది. చెతులు కాలిపోయాయి. కాలుకు తీవ్రగాయమైంది. ఢిల్లేశ్వరరావు కేకలు వేయడం స్థానికంగా ఉన్న మహిళలు బయటకు తీసుకువచ్చారు. వెంటనే పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కళ్లు, ఎముకల డాక్టర్లు వైద్యం అందించారు. పదిహేను రోజులు దాటితే కాని పరిస్థితి చెప్పలేమన్నారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు, జిల్లా పరిశ్రమల తనిఖీ అధికారి చిన్నారావు పరిశీలించారు. ప్రమాద తీరును స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. 100 మీటర్ల దూరంలో ఎగిరిపడిన పైపు.. బాయిలర్ పేలుడు ధాటికి గొడలతోపాటు యంత్రం విడిభాగాలు పగిలిపోయాయి. పరిశ్రమ కాలుష్యాన్ని బయటకు పంపే పైపు సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న మరో జీడి పరిశ్రమ రక్షణ గొడపై పడింది. ప్రతి రోజు 30 మందికి పైగా కూలీలు పనిచేయనున్నారు. ఉదయం సమయంలో ప్రమాద జరగడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ.. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, వైఎస్సార్సీపీ నాయకులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడు ఢిల్లీశ్వరరావును కలిసి పరామర్శించారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ఇండస్ట్రీయల్ ప్రాంతం అధ్యక్షుడు మల్లా రామేశ్వరం తదితరులున్నారు. పేద కుటుంబానికి పెద్ద కష్టం.. దివాన్ కాష్యూ ఇండస్ట్రీలో 13 ఏళ్లుగా ఢిల్లేశ్వరరావు కుటుంబం పనిచేస్తుంది. స్వగ్రామం మొగిలిపాడు నుంచి పొట్టకూటి కోసం వచ్చారు. పరిశ్రమలోని చిన్న గదిలో ఉంటున్నారు. ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు క్యాన్సర్ బారినపడి ఐదేల్ల కిత్రం మృతి చెందాడు. పెద్ద కుమారుడు అనీల్‌కుమార్ ఇంటర్ చదువుతున్నాడు. భార్య పార్వతీ ఇదే పరిశ్రమలో పిక్కలు వలిచే పని చేస్తోంది. పరిశ్రమకు నైట్ వాచ్‌మేన్, గేట్‌మేన్‌గా కూడా ఈ కుటుంబ సభ్యులే ఉంటున్నారు. -
సిండి‘కేటుగాళ్లు’
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : జీడి పప్పు ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పలాస జీడి పరిశ్రమలు ప్రస్తుతం దళారుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఇక్కడ దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా ధరలు ఉంటున్నాయి. జీడి పిక్కలు, జీడి పప్పు ధరలను వారు నిర్ణయించే స్థితికి నేడు దిగజారాయి. పలాస ప్రాంతం నుంచి గతంలో పరిశ్రమదారులు నేరుగా దేశంలోని కోల్‌కతా, ముంబయి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుజరాత్ వంటి వివిధ ప్రాంతాలకు జీడి పప్పును డిమాండ్ ఉన్న మేరకు స్వేచ్ఛగా విక్రయించుకునే వారు. జీడి పప్పు ధర ఆధారంగా పిక్కల ధరలు కూడా నిర్ణయించేవారు. కాలక్రమేణా జీడి పప్పు ఎగుమతి కొద్ది మంది దళారుల చేతిల్లోకి వెళ్లిపోయింది. గతేడాది ఈ సీజన్లో జీడి పిక్కలు కొనుగోళ్లు ఉద్దానంలో ముమ్మరంగా చేపట్టారు. అప్పట్లో ఒక్కో బస్తా(80కిలోలు) జీడి పిక్కల ధర రూ.13వేలు ఉండేది. ఈ ఏడాది ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో వ్యాపారులు ఒక బస్తాను రూ. 9వేలకు కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో జీడి పప్పు దిగుబడులు బాగా లేవనే నెపంతో రూ.8,600లకు కొంటున్నారు. తప్పని పరిస్థితిలో విక్రయించాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. \ ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు గతేడాది అక్టోబర్‌లో వచ్చిన తిత్లీ తుపానుకు జీడి తోటలు సర్వనాశనం అయ్యాయి. అక్కడక్కడ మిగిలిన చెట్లుకు చిగుర్లు వచ్చి జీడి పిక్కలు కాపునకు వచ్చాయంటే ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఉద్దానంలో పరిస్థితి ఇలా ఉంటే పలాస జీడి పరిశ్రమలకు విదేశాల నుంచి పిక్కలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఘనా, టాంజినియా, బిసావో తదితర దేశాల నుంచి పలాస పట్టణానికి చెందిన కొద్ది మంది దళారులు జీడి పిక్కలను దిగుమితి చేస్తున్నారు. వారు విశాఖపట్నం పోర్టు నుంచి ఈ పిక్కలను తీసుకొచ్చి గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు. అవసరం కొద్ది కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి పిక్కలను స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గత నెలలో ఈ జీడి పిక్కల బస్తా ధర రూ.6వేలు ఉండగా నేడు వాటిని పప్పు దిగుబడి పేరుతో రూ.6వేల నుంచి రూ.8వేలకు విక్రయిస్తున్నారు. జీడి పప్పు, పిక్కల ధర మొదటిలో డిమాండ్‌ను బట్టి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, దళారుల చేతిలోకి వెళ్లి పోయిందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీటీలపై ఆర్థిక లావాదేవీలు.. దళారులు, స్థానిక వ్యాపారులకు మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలు కూడా అకౌంట్ ఫర్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. చిన్న చీటీలపై ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు ఏ ధర ఇచ్చి కొంటున్నారు. అమ్ముతున్నారు అనే దానికి ఆధారాలు ఉండవు. ఈ విధంగా దళారుల చేతిలో పడి జీడి వ్యాపారులు నలిగిపోతుండగా జీడి రైతులు కూడా గిట్టు బాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలాస నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నప్పటికీ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు ఎప్పటికప్పుడు జీడి పిక్కల ధరలు ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. -
ఫలించిన ఎమ్మెల్యే మధ్యవర్తిత్వం
సాక్షి, కాశీబుగ్గ (శ్రీకాకుళం): వారంరోజులుగా మూతవేసిన జీడి పరిశ్రమలను తెరవాలని, తక్షణమే పనులకు హాజరుకావాలని పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచించారు. 12 శాతం కార్మికులకు పెంచాల్సిన వేతన ఒప్పందం అమలు చేయకుండా పరిశ్రమ యజమానులు కాలయాపన చేస్తుండడంతో పరిశ్రమలు మూతబడిన విషయం తెలిసిందే. మంగళవారం పరిశ్రమల యజమానులకు, కార్మికులతో ఎమ్మెల్యే సీదిరి తన స్వగృహామంలో మాట్లాడారు. రెండేళ్లకు ఒక్కసారి కుదుర్చుకునే వేతన ఒప్పందం ప్రకారం యజమానులు అమలు చేయకపోవడంతో మూకుమ్మడిగా బంద్ పాటించామని కార్మికులు ఎమ్మెల్యేకు వివరించారు. యాజమాన్యం మొండి వైఖిరి తగదని ఒప్పందం ప్రకారం 12 శాతం వేతనాలు పెంచాలని విన్నవించారు. పరిశ్రమల యజమానులు మాట్లాడుతూ తిత్లీ తుపాను సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఆర్థికంగా చితికిపోవడంతో తగిన గడువు కావాలని కోరారు. కార్మికులకు, పరిశ్రమ యజమానులకు ఎమ్మెల్యే నచ్చజెప్పి ప్రస్తుతం పరిశ్రమలు తెరవాలని, ప్రొససింగ్‌కు ఆటంకం కలగకుండా కార్మికులు సైతం పనులకు హాజరుకావాలని ఆదేశించారు. వారం రోజులపాటు ఆలోచించి కార్మికుల డిమాండ్ ప్రకారం యాజమాన్యంతో ఆ ఒప్పందానికి సంతకాలు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, శాశనాపురి శ్రీనివాస్, యరుకోలు సుధాకర్, కాష్యూ లేబర్ ఆసోసియేషన్(కార్మికులు) అధ్యక్షుడు బొంపల్లి సింహాచలం, కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, సభ్యులు కోనారి రాము, పెంట అసిరినాయుడు, గోరుశెట్టి అమ్మన్న, వంకల రామయ్య, బొమ్మాళి తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు పాటించిన యజమానులు, కార్మికులు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో, పరిసర ప్రాంత పల్లెల్లో ఉన్న 300లకు పైగా జీడి పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల యజమానులు, కార్మికులతో ఎమ్మెల్యే సీదిరి ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చల అనంతరం పరిశ్రమలు తెరుచుకున్నాయి. వేతన ఒప్పందానికి వారం రోజులు గడువు ఇచ్చినప్పటికీ.. ముందుగానే పరిశ్రమలు తెరవాలని యజమానులకు, పనుల్లోకి హాజరుకావాలని కార్మికులకు ఎమ్మెల్యే చెప్పడంతో అందరూ వారి పనుల్లోకి హాజరయ్యారు. బుధవారం ఉదయం నుంచి కటింగ్ మిషన్ కార్మికులు హాజరుకానున్నారు. -
పీడిస్తున్న జీడి కాలుష్యం
జీడి పరిశ్రమ.. పలాస–కాశీబుగ్గ పట్టణంలో ప్రధాన ఆదాయ వనరు. ఈ పరిశ్రమలపైనే వేలాది మంది జీవనాధారం ఆధారపడి ఉంది. అదే సమయంలో కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల్లో రోస్టింగ్ విధానం అమలు చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న విపరీతమైన పొగతో పలాస పట్టణ, పరిసర ప్రజలు శ్వాసకోస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు పలు హోటళ్లలో సైతం యథేచ్ఛగా జీడితొక్కను వంటచెరకుగా వినియోగిస్తూ కాలుష్యానికి కారకులవుతున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు గానీ, మున్సిపల్ సిబ్బంది గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాశీబుగ్గ: పలాస పట్టణంలోని పలు జీడి పరిశ్రమలు, జీడి తొక్కను వంట చెరకుగా వినియోగించే హోటళ్లు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. రోస్టింగ్ విధానాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. చాపకింద నీరులా విజృంభిస్తున్న జీడి కాలుష్యం కారణంగా పలాస పట్టణంలోని మొగిలిపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయించారు. పట్టణంలో గతంలో జనావాసాల్లో ఉన్న జీడి పరిశ్రమలు మూసివేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అండదండలతో కొన్ని జీడి పరిశ్రమలను తిరిగి తెరిచి గుట్టుచప్పుడు కాకుండా జీడి పిక్కల రోస్టింగ్ చేయిస్తున్నారు. ముఖ్యంగా బాయిలింగ్ కాకుండా రోస్టింగ్‌కు వ్యాపారులు ప్రాధాన్యమిస్తుండటంతో కాలుష్యంగా రోజురోజుకూ పెరిగిపోతోంది. పలాస మండల పరిధిలోని బ్రాహ్మణతర్లా, పూర్ణభద్ర, కేదారిపురం, దానగోర, సిరిపురం, హిమగిరి, లొత్తూరు, మహదేవుపురం, మర్రిపాడు, తాళభద్ర తదితర గ్రామాల్లో రోస్టింగ్ విధానాన్ని తిరిగి ప్రారంభించారు. దీనికి సంబంధించి కాలుష్య నివారణ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించడం, కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులు వీరికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్లలో జీడితొక్క వినియోగం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ షాపులు, దాబాలు ఉన్నాయి. వీటిలో చాలాచోట్ల జీడి తొక్కనే వంటచెరకుగా వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి విడుదలయ్యే పొగతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు పట్టదా..? పలాస–కాశీబుగ్గ పట్టణంలో సుమారు 75 వేల మంది నివాసముంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది పట్టణానికి తరలివస్తుంటారు. వీరందరిపైనా కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినా కాలుష్య నివారణ కమిటీ గానీ, ఇటు మున్సిపల్ అధికారులు గానీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలాస, కాశీబుగ్గ, శాసనాం, పారిశ్రామికవాడ, సూదికొండ, తిలక్‌నగర్, రోటరీనగర్, శివాజీనగర్, ఎంపీడీఓ కార్యాలయం రోడ్డు, లేబరుకాలనీ, కేటీ రోడ్డు తదితర ప్రాంతాల్లో చాలా పరిశ్రమలు అనుమతి లేకుండా నడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలుష్యాన్ని అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
జీడి పరిశ్రమల బంద్
పలాస: ప్రభుత్వ విధానాలపై జీడి పరిశ్రమల యాజమాన్యాలు భగ్గుమన్నాయి. విదేశీ జీడిపిక్కల దిగుమతిపై పన్ను విధింపులకు నిరసనగా పరిశ్రమలను మంగళవారం మూసివేశాయి. పారిశ్రామిక వాడలో మొత్తం 40 పరిశ్రమలు బంద్ పాటించాయి. దీంతో వందలాది మంది కార్మికులకు పని కరువైంది. విదేశీ జీడి పిక్కలపై దిగుమంతి సుంకం 9.35 శాతం విధించడం వల్ల ఏడాదికి సుమారు రూ. 100కోట్లు పన్ను భారం పడుతుందని జీడి పప్పు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు తెలిపారు. దీనిని తక్షణమే తగ్గించాలని కోరారు. పలాస పరిసర ప్రాంతాల్లోని సుమారు 300 జీడి పరిశ్రమలకు స్వదేశీ పిక్కలు సరపోవడం లేదన్నారు. విదేశీ పిక్కలు పప్పును స్వదేశీ మార్కెట్లోనే విక్రయిస్తున్నందున పన్ను పోటు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. పన్నులు తగ్గించకుంటే చాలా పరిశ్రమలు మూతపడడం ఖాయమని అభిప్రాయపడ్డారు. జీడి పప్పు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి తూములు శ్రీనివాసరావు, కోశాధికారి శాసనపురి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పన్ను రాయితీ ఇవ్వాలి పలాస జీడి పరిశ్రమలకు 75 శాతం విదేశీ జీడిపిక్కలు దిగుమతి అవుతున్నాయి. 9.35 శాతం దిగుమతి సుంకం విధించడం వల్ల ఏడాదికి రూ.100 కోట్ల పన్ను భారం పడుతుంది. ఇప్పటికే పరిశ్రమలు ముడిసరుకు లేక మూతపడుతున్నాయి. పన్నురాయితీ ఇవ్వకపోతే మొత్తం పరిశ్రమలు మూతపడే దుస్థితి ఏర్పడుతుంది. -పి.చంటి, వేదమాత కాష్యూ ఇండస్ట్రీ యజమాని, పలాస పారిశ్రామికవాడ జీవనోపాధికి ఇబ్బంది మా కుటుంబంతో సహా జీడి పరిశ్రమల్లో పనిచేయడానికి వలస వచ్చాం. జీడి పరిశ్రమలు తప్ప మరో ఉపాధి మార్గంలేదు. పరిశ్రమలు మూతపడడంతో జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోంది. -గసియా గౌరంగో, సరియాపల్లి, జీడి కార్మికుడు -
జీడిపప్పు పరిశ్రమలో యాంత్రీకరణ
వేటపాలెం,న్యూస్‌లైన్ : జీడిపప్పు పరిశ్రమల్లో కూలీల కొరతను అధిగమించేందుకు వ్యాపారులు యంత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. జీడిపప్పు పరిశ్రమకు రాష్ట్రంలోనే పేరుగాంచిన ప్రదేశం వేటపాలెం. అయితే ఈ పరిశ్రమను ప్రస్తుతం కూలీల కొరత పట్టిపీడిస్తోంది. జీడిపప్పు పరిశ్రమలో పనిచేయడానికి వేటపాలెం చుట్టు పక్కల గ్రామాల మహిళలు వచ్చి వెళ్తుంటారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో చాలా మంది కూలీలు జీడిపప్పు పరిశ్రమల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో జీడిపప్పు వ్యాపారులు యంత్రాలను ఉపయోగించడం ప్రారంభించారు. వేటపాలెంలో దాదాపు 20 జీడిపప్పు పరిశ్రమలున్నాయి. వీటిలో ఐదు వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. వేటపాలెం ప్రాంతంలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యాపారులు తమ పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశపెట్టారు. మిగిలిన వ్యాపారులు కూడా యంత్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జీడిపప్పు పరిశ్రమలో యంత్రాలు పనిచేసేది ఇలా.. జీడిపప్పు ఫ్యాక్టరీల్లో జీడి గింజలను కాల్చిన తర్వాత కార్మికులతో జీడిపప్పును వేరుచేయిస్తారు. అనంతరం జీడిపప్పు పైన ఉండే పలుచటి పొరను తొలగింపజేస్తారు. అలా వచ్చిన జీడిపప్పు నాణ్యతను బట్టి గ్రేడ్లుగా విభజించి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇదంతా పాత విధానం. ప్రస్తుతం కూలీల స్థానంలో యంత్రాలొచ్చాయి. కాలుష్యం పెరుగుతోందనే కారణంతో జీడి గింజలు కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది. కొత్త పరిశ్రమలకు లెసైన్సులు కూడా నిలిపేసింది. దీంతో వ్యాపారులు యంత్రాలు ఉపయోగించి బాయిల్డ్ పద్ధతి ద్వారా జీడి గింజల నుంచి పప్పును వేరు చేయడం ప్రారంభించారు. పరిశ్రమలో జీడి గింజలను ఉడక బెట్టిన తర్వాత వాటిని కత్తిరించి పప్పును వేరు చేసి యంత్రాల వద్దకు చేరుస్తారు. అక్కడ ఉన్న హాట్ బాక్సుల్లో పప్పును వేడి చేసి యంత్రాల్లో వేస్తారు. పప్పు పైన ఉన్న పల్చటి పొరను యంత్రాలు తొలగించడమే కాకుండా నాణ్యతను బట్టి గ్రేడ్లుగా విభజిస్తాయి. ‘యంత్రాల ద్వారా త్వరగా పనిజరుగుతోంది. ఒక్కో కూలీ రోజుకు పది కిలోల జీడిపప్పు గ్రేడింగ్ చేస్తారు. అదే యంత్రంతో అయితే గంట వ్యవధిలో 50 కిలోల జీడిపప్పు గ్రేడ్ చేస్తున్నాం. వంద మంది కూలీలు చేసే పని కేవలం ఒక యంత్రంతో పూర్తవుతోంది. కూలీల కొరత తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంద’ని వ్యాపారులు పేర్కొంటున్నారు.