ఫైల్ ఫోటో
సాక్షి, రాజానగరం: జీడిపిక్కల వ్యాపారం కోసం అప్పు ఇచ్చిన బ్యాంకు అధికారులు కొన్ని రోజుల తరువాత తనిఖీ కోసం గోడౌన్‌కు వెళ్తే జీడిపిక్కల నిల్వలు లేకుండా ఖాళీ గోడౌన్ దర్శనమిచ్చింది. దీంతో నివ్వెరపోయిన ఆ బ్యాంకు అధికారులు తరువాత తేరుకొని సంబంధిత వ్యాపారులతోపాటు తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై శివనాగబాబు తెలిపిన వివరాలిలావున్నాయి. అనపర్తి మండలం, పేరారామచంద్రపురానికి చెందిన నలుగురు వ్యాపారులు గోడౌన్‌లో నిల్వ ఉంచిన జీడిపిక్కలను చూపించి, వాటిపై రాజమహేంద్రవరంలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.10 కోట్లు అప్పు తీసుకున్నారు.
ఆ తరువాత కొంత కాలానికి వారి నుంచి చెల్లించాల్సిన వాయిదాలు సక్రమంగా జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు తనిఖీకి గోడౌన్‌కి రావడంతో జీడిపిక్కల బస్తాలు లేవు. ఖాళీ గోడౌన్ కనపడింది. దీంతో అప్పు తీసుకున్న నలుగురు వ్యాపారులు నల్లమిల్లి అరుణ, వరలక్ష్మి, రాధ, కర్రి వెంకటబులిరెడ్డితోపాటు వారికి అప్పు ఇప్పించిన ఏజెన్సీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కేతల భద్రావతి, కేతల సూర్రెడ్డి, ఎస్వీ వెంకట్రావు, గోడౌన్ యజమానులకు సంబంధించి ఇద్దరిపై బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment