
అనాథ యువతికి వివాహం జరిపించనున్న కోయ శ్రీహర్ష
సాక్షి,పెద్దపల్లి: బాజాభజంత్రీలు.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. తరలివచ్చే అతిథుల సమక్షంలో ఓ అనాథ యువతి వివాహం జరిపించేందుకు పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పో యి రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో మానస, తన చెల్లితో కలిసి 16 ఏళ్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘనాథపల్లికి చెందిన రాజేశ్‌తో ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది.
ఆ యువతికి పెళ్లిపెద్దగా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావు, అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈనెల 21న యువతి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.