సాక్షి, బరంపురం(ఒడిశా): ఇద్దరూ భయంకరమైన రోగంతో పీడించబడుతున్నారు. ఏ క్షణాన మృత్యువు కబలిస్తుందో తెలియని విషమ పరిస్థితి. చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసేంతలా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎదిగినా.. సాటి మనుషులుగా వారిని ఆమోదించని సమాజం. వీటన్నిటినీ ఎదుర్కొని ఒక్కటయ్యింది ఓ కొత్త జంట. భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి గురైన ఇద్దరు యువతీ, యువకులు వివాహ బంధంతో తమ పవిత్ర బంధానికి శ్రీకారం చుట్టారు. గోపాల్‌పూర్‌లోని శ్రాద్ధ సంజీవని హెచ్‌ఐవీ సేవాశ్రమం దీనికి వేదికైంది.
స్వయంగా బరంపురం కలెక్టర్ విజయ్ అమృత కులంగా పెళ్లి పెద్దగా వ్యవహరించి, వివాహ తంతు నిర్వహించడం విశేషం. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆశీర్వదించారు. ఇలాగే 5–టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి విభాగం ప్రాజెక్ట్ చైర్మన్ సింధ్ దత్తాత్రేయ బహుసాహిబ్, బరంపురం మున్సిపాల్ కమిషనర్ శిద్ధేశ్వర్ బలిరామ్ బందరా, సబ్ కలెక్టర్ కీర్తి హాసన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment