East Godavari Disrtict
-
‘నన్నయ్య’ విద్యార్థినుల ఆకలి కేకలు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థినులు ఆకలి కేకలు జాతీయ రహదారిపై ప్రతిధ్వనించాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సుమారు 650 మంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో గంటన్నరపాటు యూనివర్సిటీలోకి రాకపోకలు స్తంభించిపోయాయి.– రాజానగరం జీతాల కోసం ‘108’ ఆందోళనప్రభుత్వం 108 ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని చిత్తూరు జిల్లా పుంగనూరులో బుధవారం నిరసన తెలిపారు. పుంగనూరులోని ఏరియా ఆస్పత్రి వద్ద 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని కోరారు. – పుంగనూరు -
‘కాపుల కష్టాలను పట్టించుకోనివాళ్లు హీరోలు అయిపోయారు: జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి: కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా చేసుకునేందుకు అనువైన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ, పురుగుమందులు, గోడౌన్లు, యంత్ర పరికరాలు అన్నీ అందించాం. రూ. 25 కోట్లతో తొర్రిగడ్డ పంపిణీ స్కీం మోడరనైజ్ చేశాం. ప్రతి చిన్న ఫిర్యాదుకు స్పందించి జవాబుదారీ తనంతో పని చేశాం. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలు ఉంటే 80 వేల కుటుంబాలకు వద్దకు నేనే వెళ్ళాను. నా కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించాం. ఇవాల్టి పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుంది.... మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఈ దమ్ముందా?. గెలిచినా ఓడినా రియల్ హీరో జగన్ మాత్రమే. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. గత ప్రభుత్వంలో పది లక్షలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగని రాజానగరం మండల కేంద్రంలో రూ. 20 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. .. ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకుడు అనేక మాటలు పడ్డారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారు’’ అని అన్నారు. -
‘బాబు నన్ను మోసం చేశారు..’ ఏడ్చేసిన నల్లమిల్లి
సాక్షి, తూర్పు గోదావరి: కూటమిలో చిచ్చుతో అనపర్తి రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను కుప్పలుగా తగలబోసి అందులో ఓ సైకిల్‌ను వేసి కాల్చేశారు. అధిష్టాన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన నల్లమిల్లి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ‘‘నాకు టికెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారు. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తా’’ అంటూ గురువారం ఉదయం అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన.. ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘నేను టీడీపీకి మద్దతివ్వను. బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పను. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశారు. నా నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారు?.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు’’ అంటూ స్పష్టం చేశారాయన. టీడీపీ తరఫున అనపర్తి టికెట్‌ను ఈ మాజీ ఎమ్మెల్యే ఆశించారు. అయితే తనతో సంప్రదింపులేం జరపకుండా అధినేత చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ సీటును చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివకృష్ణంరాజు పేరును బీజేపీ బుధవారం సాయంత్రం నాటి జాబితాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతకు ముందు.. అనపర్తిలో నల్లమిల్లి అనుచరుల ఆగ్రహావేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. మంట్లలో సైకిల్‌ను టీడీపీ కరపత్రాలను తగలబెట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం తన నివాసంలో అనుచరులతో భేటీ అయిన రామకృష్ణారెడ్డి.. చివరకు రెబల్‌గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. -
సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు పర్యటన ఫొటోలు
-
రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దశ దిశ చూపిస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్‌గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్‌వార్ జరుగుతోంది’ అని అన్నారు. -
సంక్రాంతి సంబరాల్లో విషాదం.. కోడి కత్తి గుచ్చుకొని ఇద్దరు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: ఉత్సాహంగా సాగుతున్న సంక్రాంతి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి పెందేలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఊర్లో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు పద్మారావు అనే యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి. ఇందులో ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆలోపే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆనందంగా జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాల్లో పద్మారావు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో చోట అదే విధంగా కిర్లంపూడి మండలం వేలంకలో గండే సురేష్ అనే మరో వ్యక్తి మరణించాడు. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. అసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు -
గుమ్మళ్లదొడ్డిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.35కు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ బయలుదేరి 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభా వేదిక నుంచి 11.45 బయలుదేరి రోడ్డు మార్గంలో 11.50 గుమ్మళ్లదొడ్డి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు. చదవండి: (టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్) -
యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..
రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల భౌతిక స్వరూపాన్ని మార్చడమే కాకుండా తరగతి గదిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయిలో ఇంగ్లీషు విద్యకు బాటలు వేసిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే సాంకేతిక విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నూతనంగా తొమ్మిదో విద్యార్థులకు పారిశ్రామిక మనస్తత్వ పెంపుదలకు శిక్షణ ఇవ్వనున్నారు. వారిని యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన లక్షణాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలను వారికి అందివ్వనున్నారు. ఈ శిక్షణలో ఐదు స్వచ్ఛంధ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. 450 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తొమ్మిదో తరగతి బోధించే తరగతి ఉపాధ్యాయులకు తొలుతగా శిక్షణ అందజేస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన 63 మంది రీసోర్స్ పర్సన్లు, మండల స్థాయిలో 9వ తరగతి క్లాస్ టీచర్లకు ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 10, 11 తేదీల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయులకు, 12, 13 తేదీల్లో కాకినాడ జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. జీఏఎంఈ, అస్లాటోన్, ఉధ్యం, మేకర్గాట్, రీపీ బెనిఫిట్ స్వచ్ఛంద సంస్థలు జిల్లా రీసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు బోధనకు అవసరమైన మెటీరియల్ అందజేశారు. 25వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ‘పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదల’(ఈఎండీపీ)పై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 25 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వారంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణనిస్తారు. ఈ నెల 14 నుంచి విద్యార్థులకు శిక్షణ ప్రారంభమవుతోంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పారిశ్రామిక రంగాల వైపు మళ్లేలా, వారిలో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాల అభివృద్ధిని పెంచుతారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు వారి కాళ్లపై వారు నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. అలాగే వారిలో భవిష్యత్తుపై భయం పోయి, ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యావేత్తలంటున్నారు. (క్లిక్: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..) లక్ష్యాలు చేరుకునేందుకు విద్యార్థి దశ నుంచే వారి భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహద పడుతుంది. చదువుకున్న అనంతరం ఉద్యోగం కోసం చూడకుండా, విద్యార్థులే పదిమందికి ఉద్యోగాలు కల్పించేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ శిక్షణ ద్వారా కచ్చితంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. – సీహెచ్ ఉదయ్‌కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈఎండీపీ సద్వినియోగం చేసుకోవాలి నేటి నుంచి ఇస్తున్న రెండు రోజుల శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని, తిరిగి విద్యార్థులకు అందించాలి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణను అందించాలి. ప్రభుత్వ ముందుచూపుకు ఇది ఒక్క చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. మండల స్థాయి శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, కోనసీమ జిల్లా మంచి ఆలోచన విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదలపై శిక్షణ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్ఏ అబ్రహం, డీఈవో, తూర్పు గోదావరి జిల్లా -
అల ఖడ్గం.. మానవ తప్పిదాలే కారణం!
సముద్ర కెరటాల మధ్య ఓఎన్జీసీ క్యాపింగ్ వేసిన ఈ రెండు బావులు రెండున్నర దశాబ్దాల కిందట ఓడలరేవు తీరాన్ని ఆనుకుని (ఆన్‌షోర్) డ్రిల్లింగ్ చేసిన ప్రాంతంలో ఉన్నాయి. 2004 సునామీ నాటికి ఈ బావులు గట్టు మీద ఉన్నాయి. తరువాత ఇవి సముద్రంలో కలిసిపోయాయి. ఈ బావులను దాటుకుని సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చేసింది. ఏటా సముద్రం ఎంత ముందుకు వస్తోందని చెప్పేందుకు ఈ నిదర్శనం చాలు. కడలి ముట్టడిలో: ఓడలరేవు వద్ద చమురు బావుల పరిస్థితి ఈ ఫొటోలు అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ గోడ వద్ద తీసినవి. తొలి ఫొటో 2018లో తీసినది. టెర్మినల్ గోడను ఆనుకుని పచ్చని సరుగుడు తోటలున్నాయి. రెండో ఫొటో ఈ నెల 2న తీసినది. తరచూ సముద్రం చొచ్చుకు రావడం.. అలలు ఎగసిపడుతుండడంతో ఇక్కడి సరుగుడు తోటలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు వచ్చి కెరటాలు గోడను తాకుతున్నాయి. నాడు హరితం: 2018లో ఓఎన్జీసీ టెర్మినల్ గోడకు సమీపాన ఉన్న సరుగుడు తోటలు (ఫైల్) నేడు మాయం: కెరటాలు చొచ్చుకు రావడంతో సముద్రంలో కలిసిపోయిన సరుగుడు తోట సాక్షి అమలాపురం: కోనసీమ తీరంలో ‘అల’జడి కొనసాగుతూనే ఉంది. గడచిన వారం రోజులుగా సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. తీరం పొడవునా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో అంతర్వేది నుంచి బలుసుతిప్ప వరకూ జిల్లాలో పలుచోట్ల సముద్రతీరం కోతకు గురవుతోంది. తీరం కోతకు ప్రకృతి ప్రకోపం సగం కారణం కాగా.. నిలువెత్తు స్వార్థంతో మనిషి ప్రకృతికి చేస్తున్న హాని సగం కారణమవుతోంది. జిల్లాలో అంతర్వేది నుంచి భైరవపాలెం వరకూ సుమారు 95 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. వారం రోజులుగా కెరటాలు చొచ్చుకు వస్తూండటంతో తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో ప్రభుత్వంతో పాటు, రైతుల భూములు కూడా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, మలికిపురం మండలం కేశనపల్లి, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, కాట్రేనికోన మండలం నీళ్లరేవు, చిర్రయానాం గ్రామాల్లో ఒడ్డు కోతకు గురవుతోంది. గత ఏడాది ఆగస్టులో ఒక రోజు అంతర్వేది వద్ద సముద్రం 45 మీటర్లు ముందుకు వస్తే, మరునాడు కిలోమీటరు వెనక్కి వెళ్లిపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయా ప్రాంతాల్లో అర కిలోమీటరు నుంచి కిలో మీటరు మేర సముద్రం ముందుకు వచ్చిందని అంచనా. మన పాపాలే... శాపాలు అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే దేశంలోని నదులు ఎక్కువగా కలుస్తాయి. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వంశధార, నాగవళి వంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి చాలా కాలుష్యాన్ని మోసుకు వస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతంలో ఏడాదికి ఒకటో రెండో తుపాన్లు వస్తే.. ఇప్పుడు ఏడాదికి ఎనిమిది వరకూ వస్తున్నాయి. ఫలితంగా ఎగసిపడుతున్న అలలతో సముద్రం తీరాన్ని కోసివేస్తోంది. చెలియలి కట్ట దాటుతూ.. : అల్లవరం మండలం ఓడలరేవు వద్ద తీరంపై విరుచుకుపడుతున్న అలలు కోస్తా తీరానికి ప్రకృతి కల్పించిన రక్షణ కవచం ‘మడ అడవులు’. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 8 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి అక్రమార్కుల వల్ల ఇవి ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే మిగిలాయని అంచనా. తీరంపై కెరటాలు విరుచుకు పడినా.. సముద్రం చొచ్చుకు వచ్చినా ఈ మడ అడవులు ‘స్ప్రింగ్‌ల’ మాదిరిగా అడ్డుకుని, వెనక్కు గెంటేస్తాయి. సునామీలను సైతం అడ్డుకుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మడ అడవులను ఆక్వా సాగు, కలప సేకరణ కోసం అడ్డగోలుగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక దోపిడీ కూడా కోత పెరగడానికి కారణమవుతోంది. తీరంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా తీరంలో ఆక్వా చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. ఇవన్నీ సముద్ర ఉగ్రరూపానికి.. తీరం కోతకు కారణమవుతున్నాయి. వెల్లువెత్తుతూ.. విరుచుకుపడుతూ.. : అంతర్వేది వద్ద ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం (ఫైల్) అంతర్వేది వద్ద సముద్రం ఒక్కసారిగా చొచ్చుకు వస్తుంది. తీరంలోని కట్టడాలను ముంచెత్తుతుంది. ఒక్కోసారి కిలోమీటర్ల మేర వెనుకకు పోతుంది. ముందుకు వచ్చిన సమయంలో ఇలా తీరాన్ని ఆనుకుని ఉన్న అతిథి గృహాలు, రైతులు వేసుకున్న పాకలను ముంచెత్తుతోంది. ఉప్పాడ తరహాలో కోత తప్పదు కోనసీమ తీరం భౌగోళికంగా బంగాళాఖాతంలోకి అర్ధవృత్తాకారంలో చొచ్చుకు వెళ్లినట్టుగా ఉంటుంది. దక్షిణాయన కాలం జూలై 16 నుంచి జవవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపు వస్తాయి. ఫలితంగా అలల్లో అపకేంద్ర బలాలు ఏర్పడి ఈ భూభాగాన్ని సముద్రంలో కలిపేస్తున్నాయి. కాకినాడ డీప్ వాటర్ పోర్టు కోసం మిలియన్ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వేయడంతో ఉప్పాడ తీరం తీవ్రమైన కోతకు గురవుతోంది. కోనసీమ జిల్లాలో మడ అడవులను నిర్మూలిస్తుండటం, ఇసుక తవ్వకాలు, సీఆర్‌జెడ్‌లో ఆక్వా సాగు వలన కోనసీమ తీరం కూడా ఉప్పాడ తరహాలోనే కనుమరుగయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి. – డాక్టర్ పెచ్చెట్టి కృష్ణకిషోర్, ఏయూ సాగర అధ్యయన పరిశోధకుడు, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అమలాపురం -
విజయ గీతిక.. ప్రగతి వీచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్ చరిత్రను ఓటర్లు తిరగరాసి ఆదివారంతో ఏడాది పూర్తవుతోంది. ప్రజాకంటక తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడిన ప్రజలు.. జెడ్పీలో ఆ పార్టీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసి ఇంటికి సాగనంపారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్న క్రమంలో.. గత ఏడాది జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల్లో 99 శాతం వైఎస్సార్సీపీనే వరించాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు 58 స్థానాల్లో విజయదుంధుభి మోగించారు. అంతకుముందు వరకూ అధికారాన్ని అనుభవించిన టీడీపీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమైన 1995 నుంచి ఇప్పటి వరకూ జిల్లా చరిత్రలో గతంలో ఏ పాలకవర్గంలోనూ ప్రతిపక్ష పార్టీకి ఈ రకమైన పరాభవం ఎదురైన దాఖలాలు లేవు. గత ఏడాది జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఎస్సీలకు రిజర్వు అయిన జెడ్పీ చైర్మన్ పదవి.. వివాదరహితుడు, విద్యావంతుడు, ఆవిర్భావం నుంచీ పార్టీలో అంకిత భావంతో పని చేస్తున్న నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ విప్పర్తి వేణుగోపాలరావును వరించింది. జెడ్పీ పాలకవర్గం పగ్గాలు చేపట్టాక.. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త నిర్ణయంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరిని మూడు జిల్లాలుగా పునర్విభజించారు. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్ పాలకవర్గ అస్థిత్వానికి భంగం కలగకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌గానే కొనసాగించారు. అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు గత ఏడాది నూతన పాలక వర్గం చేపట్టాక జెడ్పీ ద్వారా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్’ను తొలి ఏడాదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ దివస్ అయిన గత ఏప్రిల్ 24న 2021–22 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రధాని వర్చువల్ విధానంలో అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన’ అమలులో మన జిల్లా పరిషత్ దేశంలోనే తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. 14వ ఆర్థిక సంఘం నుంచి 21 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.8.73 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సీపీడబ్ల్యూఎస్ పథకంలో రూ.16.62 కోట్లు కేటాయించారు. సాధారణ పనుల విభాగంలో 260 పనులకు రూ.4.93 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ సంక్షేమానికి రూ.2.14 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.3 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.1.88 కోట్లు, తాగునీటికి రూ.3.32 కోట్లు, సెక్టోరియల్ పనులకు రూ.1.43 కోట్లు వెచ్చించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజనలో 32 గ్రామాలను గుర్తించారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా రూ.20 లక్షల చొప్పున 161 పనులకు రూ.10.65 కోట్లు కేటాయించారు. ఇందులో 49 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ఐసీడీఎస్ తదితర నిధుల సమన్వయంతో పనులు చేపట్టడంలో దేశంలోనే జిల్లా పరిషత్ తృతీయ స్థానంలో నిలిచింది. డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్‌లో రూ.15 కోట్ల అంచనాతో రంపచోడవరం మన్యంలో 73 పనులు చేపట్టారు. వీటిలో 38 ఇప్పటికే పూర్తి చేశారు. దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 18 మంది ఎంపీడీఓల కల ఈ పాలకవర్గం హయాంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సాకారమైంది. ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జెడ్పీలో 10,090 మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.7 కోట్లు జెడ్పీ జమ చేస్తోంది. దీంతో వారందరూ సంతోషంగా ఉన్నారు. గత చంద్రబాబు పాలనలో మూడు ఆర్థిక సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టేసిన జెడ్పీ పీఎఫ్‌ను ఒకేసారి పరిష్కరించి రికార్డు సృష్టించారు. రిటైరైన 308 మందికి, సర్వీసులో ఉన్న 1,717 మందికి ఒకేసారి రూ.101.69 కోట్లు చెల్లించారు. అందరి సమన్వయంతో ఏడాది పాలన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల సమన్వయంతో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కడా ఒక్క వివాదానికి కూడా తావు లేకుండా పని చేయడం చాలా సంతృప్తినిచ్చింది. గత పాలకుల హయాంలో ఉద్యోగులు, రిటైరైన వారికి పెండింగ్‌లో ఉన్న అంశాలను ఒకేసారి క్లియర్ చేశాం. జిల్లాపరిషత్ అధికారులు, ఉద్యోగులు సమష్టి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకోగలిగాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా -
నన్నయ వర్సిటీ విద్యార్థులకు టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్
రాజమహేంద్రవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశమిచ్చి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టీసీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు షీనా మేథ్యూ, ఎల్. రవి, సాయిసుస్మిత, శరణ్యలు మంగళవారం వీసీ ఆచార్య ఎం. జగన్నాథరావుతో సమావేశమయ్యారు. రెండు నెలలపాటు సాప్ట్వేర్ టూల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇప్పటికే తమ విద్యార్థులకు వికాస సహకారంతో కొన్ని ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. టీసీఎస్ సంస్థ కూడా ముందుకు రావడం హర్షణీయమన్నారు. జిల్లాలోని ప్రైవేట్ సంస్థలలో కూడా ఇంటెర్న్షిప్ అందించేందుకు తోడ్పడాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య టి. అశోక్, ఓఎస్డి ఆచార్య ఎస్. టేకి, డీన్ ఆచార్య పి. సురేష్‌వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. పెర్సిస్, వికాస్ పీడీ కె. లచ్చారావు, మేనేజర్ శ్రీకాంత్, శర్మ, తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా రెండు నెలల శిక్షణ తూర్పు గోదావరి జిల్లాలో 3500 మంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా సెప్టెంబర్ చివరి వారం నుంచి రెండు నెలల శిక్షణ నిర్వహిస్తున్నామని కలెక్టర్ కే.మాధవీలత తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో టీసీఎస్ ప్రతినిధులు ఎన్.రవి, సుస్మిత, శరణ్య, వికాస్ పీడీ కే.లచ్చారావుతో కలిసి శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంస్థ తరఫున 15 నుంచి 20 మంది శిక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
తపాలా నిద్ర.. అక్రమాల ముద్ర
సాక్షిప్రతినిధి, కాకినాడ: పోస్టాఫీసు అంటే నమ్మకానికి చిరునామా. పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి విశ్వసనీయత చాటుకునే వ్యవస్థగా మంచి పేరు. ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాల పాత్ర లేకపోవటంతో పోస్టాఫీసులు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)పేరుతో పల్లెల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకుల మాదిరి అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారాపై పర్యవేక్షణ, జవాబుదారీతనం కొరవడిందనే విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ అంతంతమాత్రంగా ఉంటోందని తెలుస్తోంది. ఫలితంగా కొన్ని బ్రాంచిల్లో పోస్టుమాస్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖాతాదారుల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు బ్రాంచిల్లో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టుమాస్టర్ ఏకంగా నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి కోటిన్నర లూటీ చేయడం పోస్టల్శాఖనే ఒక్క కుదుపు కుదిపేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తోన్న బ్రాంచిల్లో ఎక్కడోచోట ఈ బాగోతాలు బయటపడి ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. బయటపడిన కొన్ని బాగోతాలు ఈ ఏడాది మేలో అమలాపురం పోస్టల్ డివిజన్ పరి«ధిలోని అయినవిల్లి మండలం విలస సబ్ పోస్టాఫీసు ఐపీపీబీలో రూ.1.18 కోట్లు దుర్వినియోగమయ్యాయి. హెడ్ పోస్టాఫీసులో సిస్టమ్ అడ్మిని్రస్టేటర్ ఖాతాదారుల సొమ్ములను సన్నిహితులు, బంధువుల ఖాతాలకు బదిలీచేసి అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లు సస్పెండయ్యారు. ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సూత్రధారి సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఇప్పటికీ పరారీలో ఉండటం విస్మయాన్ని కలిగిస్తోంది. డిజిటల్ సంతకాల పాస్ వర్డ్‌లను తెలుసుకుని సిస్టమ్ అడ్మి్రస్టేటర్ అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో 70 మంది ఖాతాదారులు మోసపోయిన వైనం ఆరు నెలల క్రితం బయటపడింది. డిపాజిట్ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లేసరికి అసలు ఖాతాల్లో సొమ్ములు లేవని తేలడంతో వీరంతా నివ్వెరపోయారు. బాధితులు తాడేపల్లిగూడెం హెడ్‌పోస్టాఫీసుకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో ఖాతాదారు ల డిపాజిట్లను పాస్‌బుక్‌లో నమోదు చేసినా ఐపీపీబీ ఖాతాల్లో జమ చేయలేదు .కల్లూరు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ చిగురుపల్లి గోవర్థన్ తన ఖాతాలో డిపాజిట్ సొమ్ము లేదని గుర్తించడంతో బ్రాంచి పోస్టుమాస్టర్ ఇందిర అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. విచారణ జరుగుతోంది. గోకవరం సబ్ పోస్టాఫీసులో తపాలా ఉద్యోగి (జీడీఎస్–పేకర్) ఐపీపీబీ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన వైనాన్ని గతేడాది డిసెంబర్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. డమ్మీ డిపాజిట్లతో లక్షల్లో విత్‌డ్రా చేసి తపాలా శాఖకు షాక్ ఇచ్చాడు. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టు మాస్టర్ ఖాతాదారులకు కుచ్చుటోపీ వేశారు. పోస్టు మాస్టర్ ఎస్కే మీరావలి నిర్వాకంతో సుమారు 750 మంది డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. పెదవేగి ఆనందరావు ధర్మవరం బ్రాంచిలో డిపాజిట్ చేసిన రూ.5లక్షలు కొవ్వూరు ప్రధాన కార్యాలయంలో పరిశీలిస్తే జమ కాలేదని తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు కోటి రూపాయలు దాటి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ విచారిస్తున్నారు. 2002లో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ఇందిరా వికాస్ పత్రాలు(ఐకేపీ) పేరుతో రూ.1.50 కోట్లు దురి్వనియోగమయ్యాయి. గడువుతీరిన ఐకేపీ పత్రాలను అడ్డం పెట్టుకుని సొమ్ము కాజేయడం అప్పట్లో సంచలనమైంది. ఇద్దరు పోస్టల్ ఉద్యోగులను తొలగించారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు. 31 మందిని బాధ్యులుగా నిర్ధారించి జీతాల నుంచి రికవరీ చేశారు. 81 మంది బాధితుల్లో నలుగురు ఇప్పటికే చనిపోయారు. నిరంతర పర్యవేక్షణ బ్రాంచిల్లో ఐపీపీబీల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. ప్రతి నెలా నాలుగైదు బ్రాంచిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు నలుగురు ఇనస్పెక్టర్లు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఐపీపీబీ ఖాతాదారుల పాస్‌పుస్తకాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. బ్రాంచి పోస్టాఫీసులకు వెళ్లి పరిశీలన జరిపే వరకు కూడా బృందం తనిఖీలకు వెళుతున్న సమాచారం గోప్యంగా ఉంచుతాం. కాకినాడ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం చేస్తుండబట్టే అవకతవకలకు ఆస్కారం ఉండటం లేదు. నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్, కాకినాడ ఇలా చేస్తే అడ్డుకట్ట ఐపీపీబీ డివిజన్‌కు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా పర్యవేక్షణకు ఆస్కారం ఉండటం లేదు. ఇక్కడ ఉద్యోగులను కూడా అవుట్ సోర్సింగ్‌లో తీసుకుంటున్నారు. ఐపీపీబీ కార్యాలయాల్లో సిబ్బందిని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసులకు అనుసంధానం చేయటంలో లోపాలున్నాయి. తరచూ పోస్టల్ డిపాజిట్లు, అకౌంట్లపై అధికారుల తనిఖీలు ఉండాలి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పోస్టల్ కార్యాలయాల్లో రికార్డులనే కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి ఖాతాదారుల పాసుపుస్తకాలను కూడా తనిఖీ చేయాలి. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరిగానే పోస్టల్ ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్ అలర్టు ఉన్నప్పటికీ నిధులు కాజేసే కొందరు ఉద్యోగులు ఈ మెసెజ్ రాకుండా సర్వర్‌ను నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంది.పాస్‌వర్డు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకిలా మోసం జరుగుతోంది... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐపీపీబీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడమే ప్రధాన కారణం. సబ్ పోస్టాఫీసును సూపరింటిండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోసాఫీసెస్ వంటి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వీరు సబ్ పోస్టాఫీసు, పోస్టాఫీసులను ప్రతి మూడు, అరు నెలలకు తనిఖీ చేస్తున్నా ఐపీపీబీ ఖాతాల ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టడం లేదు. ఈ విధానమే బ్రాంచి స్థాయిలో అవకతవకలకు ఆజ్యం పోస్తోందని తెలుస్తోంది. తపాలా ఉద్యోగులు, ఐపీపీబీ పర్యవేక్షకుల మధ్య సమన్వయం లేకపోవడం కొంప ముంచుతోంది. ఐపీపీబీ రాక ముందు (పోస్టల్ లావాదేవీలు ఆన్లైన్ కాక ముందు) తపాల కార్యాలయాల ద్వారా సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాలను తెరిచేవారు. ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరిగేటప్పుడు ఈ తరహా అవకతవకలు చోటుచేసుకోలేదు. ఆన్లైన్, ఐపీపీబీ వ్యవస్థ వచ్చాక ఖాతాల నుంచి సొమ్ము మాయవుతుండటం ఉన్నత స్థాయి వైఫల్యంగానే కనిపిస్తోంది. -
ఆస్ట్రానమీలో అదరగొట్టింది
నిడదవోలు: జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీల్లో ఏపీలలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని కుంచాల కైవల్యరెడ్డి సత్తా చాటింది. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అంశాల్లో ఆన్లైన్లో మూడు రౌండ్లలో జరిగిన ప్రతిభా పరీక్షల్లో 82 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పరీక్షల్లో 14 పాయింట్లతో కైవల్యరెడ్డి ద్వితీయ స్థానం సాధించి, సిల్వర్ ఆనర్ సర్టిఫికెట్ పొందింది. -
బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్ ఊహించలేదు: గ్రూప్–1 టాపర్ సుష్మిత
సాక్షి, హైదరాబాద్(చిక్కడపల్లి): బాగా కష్టపడ్డా కానీ.. మొదటి ర్యాంక్ వస్తుందని ఊహించలేదంటూ ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫస్ట్ ర్యాంకర్ రాణి సుష్మిత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురానికి చెందిన ఆమె ఏపీ గ్రూప్స్ ఫలితాల్లో టాప్ ర్యాంక్ సాధించారు. బుధవారం హైదరాబాద్ అశోక్ నగర్‌లోని ఏకేఎస్–ఐఏఎస్ అకాడమీలో సుష్మిత మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. ఆమె తండ్రి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తల్లి పద్మప్రియ ఇంటి వద్దే ఉంటారు. హిందీ పండిట్ అయిన తన తాత పి.ఎల్.ఎన్.శర్మ ప్రోత్సాహంతో గ్రూప్స్ చదవి ర్యాంక్ సాధించానని సుష్మిత చెప్పారు. తన లక్ష్య సాధనలో తల్లిదండ్రుల పాత్ర ఆమోఘమైందని వెల్లడించారు. బాగా శ్రమిస్తేనే ర్యాంక్ సాధించడం సాధ్యమని గ్రూప్స్ రాసేవారికి సూచించారు. 10వ తరగతి వరకు పిఠాపురంలో చదువుకున్న సుష్మిత కాకినాడలో బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశారు. హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. అదే హెల్త్‌కేర్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. బెంగళూరులో నివసిస్తున్న ఈమె భర్త రవికాంత్ సివిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరికి సురవ్ కశ్యప్ అనే అబ్బాయి ఉన్నాడు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) ఏపీపీఎస్సీ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు తమ సత్తా చాటారు. నాన్ లోకల్ కేడర్ కింద తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు తమ ప్రతిభను చాటుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన పవన్ డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్లు యూపీఎస్సీ కోసం కష్టం పడ్డా. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు నాన్ లోకల్ కేడర్ కింద ఏపీలో డీఎస్పీగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది’అని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో సీడీపీవోగా పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సింధూ ప్రియ కూడా నాన్ లోకల్ కేడర్ కింద డీఎస్పీగా ఎంపికయ్యారు. ఎంపికపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: (మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..) -
రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే..
కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ స్వయానా పెదనాన్న కొడుకు. చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం.. తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు. వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే సాగింది. అనంతరం ఏలూరులో చదివారు. 1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు. బాహుబలి..ఆర్ఆర్ఆర్ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. -
చింత గింజలోయ్.. మంచి కాసులోయ్..
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ.. చింత కాయలతో పాటు వాటి గింజలకూ కాసులు రాలుతున్నాయి. చింత పిక్కలాట.. వామన గుంటలు.. వైకుంఠపాళీ.. అష్టా–చెమ్మా వంటి ఆటలకు మాత్రమే వినియోగించే చింత గింజలు వ్యాపారులకు, కూలీలకు సిరులు కురిపిస్తున్నాయి. వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా మారిన చింత పిక్కలు ఇప్పుడు అమెజాన్ లాంటి ఈ–కామర్స్ ఆన్లైన్ సైట్లలోనూ అమ్ముడుపోతున్నాయి. ఏటా వేలాది టన్నుల చింత గింజలు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి. పిఠాపురం: చింత గింజలూ వ్యాపార వస్తువుగా మారాయి. వ్యాపారులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. దీంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుతో పాటు పలు ప్రాంతాల్లో చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు వెలిసాయి. చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి.. గింజలకు పైన ఉండే తోలు తొలగించి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోలు తీసిన చింత గింజల టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతుండగా 20 టన్నుల వరకు ప్రాసెసింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న అన్ని అటవీ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో చింత గింజలు లభ్యమవుతున్నాయి. కాకినాడ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఏటా 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతుండగా.. వాటి విలువ రూ.36 కోట్ల పైమాటే. వీటి కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఏడాదంతా వ్యాపారం చింత పిక్కలను ప్రాసెసింగ్ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా పని చేస్తున్నాయి. చింతపండు సీజనల్‌గా మాత్రమే లభిస్తున్నప్పటికీ.. కోల్డ్ స్టోరేజిలలో నిల్వ ఉంచి ఏడాదంతా గింజలు తొలగించి అమ్ముతుంటారు. దీనివల్ల ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉంటున్నాయి. చింతగింజలను కేజీ రూ.5 నుంచి రూ.8కి కొంటున్నారు. తోలు తీసిన తరువాత కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారాలు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మిక కుటుంబాలు వెయ్యి వరకు ఉన్నాయి. చింతపండు వ్యాపారులే గింజలను సేకరిస్తారు. ఐదు కేజీల చింతపండులోంచి కేజీ చింత గింజలు వస్తాయి. ప్రాసెసింగ్ ఇలా.. చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. వాటిని ప్రాసెసింగ్ యూనిట్లలోని బాయిలర్‌లో (240 డిగ్రీల వేడి వద్ద) నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తొలగించి బస్తాల్లో నింపుతారు. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళతారు. రాష్ట్రంలోని హిందూపురంలో చింత గింజల పౌడర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్ పౌడర్‌గా మార్చి.. ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్లుగా విభజించి జర్మనీ, జపాన్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్ ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఉపయోగాలివీ రంగులు చిక్కగా.. పటిష్టంగా ఉండడానికి ఆయా కంపెనీలు చింతగింజల పౌడర్‌ను ఉపయోగిస్తాయి. పట్టు వస్త్రాలకు తళతళలాడే మెరుపుతో పాటు పెళుసుగా ఉండేందుకు, గంజి పట్టించేందుకు వస్త్ర పరిశ్రమలూ ఈ పౌడర్‌ను వినియోగిస్తున్నాయి. మస్కిటో కాయిల్స్ తయారీలోనూ (యూరప్‌లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు) దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల మందుల తయారీలోనూ వాడుతుండటం వల్ల ఫార్మా కంపెనీలు ఈ పౌడర్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ప్లైవుడ్ షీట్స్, పేపర్ తయారీతోపాటు జూట్ పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. పాలిస్టర్ గమ్, ప్లాస్టిక్ తయారీలోనూ దీనిని వాడతారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతుండటంతో పలువురు వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. ఆన్లైన్లో విక్రయిస్తున్నాం చింత గింజలను శుభ్రం చేసి గ్రేడ్ల వారీగా విభజిస్తున్నాం. మా వద్ద ఉన్న సరుకు వివరాలను ఆన్లైన్లో పెడితే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మా గ్రామంలో చాలాకాలంగా చింతపండు నుంచి గింజలను వేరుచేసే పనిని మహిళలు చేస్తుంటారు. అందువల్ల మా గ్రామంలో ఎక్కువగా చింత గింజలు లభ్యమవుతాయి. దీంతో నేను చింత గింజల ఫ్యాక్టరీ నడుపుతున్నాను. –ఓరుగంటి రాంబాబు, చింత గింజల ఫ్యాక్టరీ యజమాని, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే ఉంది చింత గింజల ప్రాసెసింగ్ యూనిట్లు పెద్దగా ఎక్కడో గాని ఉండవు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చింతపిక్కల ఫ్యాక్టరీ ఒకటి మాత్రమే రిజిస్టర్ అయ్యింది. జిల్లాలో చింత గింజల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సేకరించి ఇక్కడే తొక్క తీసి ఎగుమతి చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చింత గింజల్ని పౌడర్‌గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహకారం అందిస్తాం. –తామాడి మురళి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ, కాకినాడ -
నాకు దిక్కేది.. ఎలా బతకాలి
తూర్పు గోదావరి (రావులపాలెం) : నాన్న కోసం వెళ్లిన అమ్మ, అన్నయ్య, నాన్నమ్మ లేకుండా పోయారు. ఇక ఎలా బతకాలి.. నాకు దిక్కేది అంటూ ఆ కుటుంబంలో చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ గుండెలు అవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. కొత్తపేట మండలం మందపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి పాలవ్యాన్, మోటారు బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోస్టుమార్టం అనంతరం అప్పన సత్యవతి, వెంకటలక్ష్మి, మహేష్ మృతదేహాలను సమీప బంధువులు, స్థానికులు రెండు అంబులెన్సుల్లో ఇంటికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు, బంధువులు చివరి చూపుకోసం రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన దుర్గాప్రసాద్ నాన్నమ్మ సత్యవతి భర్త రెండేళ్ల క్రితం కాలం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారందరికీ వివాహం అయ్యింది. సత్యవతి భర్త పోయిన నాటి నుంచి పెద్ద కుమారుడు పుల్లేశ్వరరావు, చిన్న కుమారుడు నాగేశ్వరరావుల వద్ద ఉంటుంది. అయితే చిన్న కుమారుడు నాగేశ్వరరావు కొబ్బరి లోడింగ్ కూలీ పని చేసుకుంటూ భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు మహేష్, దుర్గాప్రసాద్‌ను చదివిస్తున్నాడు. మహేష్ డిగ్రీ చదువుతుండగా దుర్గాప్రసాద్ ఇంటర్ పూర్తి చేశాడు. కొంతకాలంగా వేరే మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆ కుటుబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం ఉదయం కొబ్బరి లోడింగ్ పనికి వెళ్లిన నాగేశ్వరరావు సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. ఎంతకీ స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు నాగేశ్వరరావు కొత్తపేటలో ఉన్నట్టు తెలుసుకుని అతని తల్లి సత్యవతి, భార్య వెంకటలక్ష్మి, పెద్ద కుమారుడు మహేష్ అతని వద్దకు వెళ్ళి మాట్లాడారు. అనంతరం తిరిగి వస్తుంటే ప్రమాదానికి గురయ్యారు. డిగ్రీ చదువుతున్న మహేష్ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్నామని సమీప బంధువులు అప్పన రామకృష్ణ, సత్యకిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తొలకరి సాగులో సరికొత్త ఒరవడి
మండపేట: పొద్దస్తమానూ పొలంలో పనిచేసే రైతు తన కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తాడు. అందుకోసం వీరిపక్షాన చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. నవంబరులో వచ్చే తుఫానుల బెడదను తప్పించడంతో పాటు మూడవ పంటకు మార్గం సుగమం చేసేందుకు ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలలో తొలకరి సాగుకు రైతులు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మార్కెట్లో మంచి రాబడి తెచ్చే వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. తూర్పున 93,204 ఎకరాలు, మధ్య డెల్టాలోని 98,258 ఎకరాల్లోను తొలకరి సాగు ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత కాలువలకు నీటిని విడుదల చేసేవారు. ఆగస్టు నెలాఖరు వరకూ నాట్లు వేసేవారు. ఏటా నవంబరులో వచ్చే తుపానులు పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు సాగు చేపట్టేలా రైతును ప్రోత్సహిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో జూన్ 1వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేసింది. జూలై రెండవ వారం నాటికి నాట్లు వేసుకోవడం ద్వారా అక్టోబరు నెలాఖరు నాటికి కోతలు పూర్తవుతాయని భావిస్తున్నారు. దీనివలన నవంబరులో వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చునని వ్యవసాయశాఖ విశ్వసిస్తోంది. డిసెంబరు చివరి నాటికి రబీ నాట్లు వేసుకుని మార్చి నెలాఖరవుకు కోతలు కోయడం ద్వారా మూడవ పంటగా అపరాల సాగుకు మార్గం సుగమమవుతుంది. భూసారం పెరగడంతో పాటు రైతులకు మూడు నుంచి నాలుగు బస్తాల అదనపు దిగుబడి వస్తుందంటున్నారు. తొలకరిని లాభసాటి చేసేందుకు మార్కెట్లో రాబడినిచ్చే వంగడాల సాగు చేసేలా రైతులను చైతన్యవంతం చేస్తోంది. సాగుకు అనుకూల రకాలు, మెళకువలపై వ్యవసాయ సిబ్బంది పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుడెల్టాలోని మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే నారుమడులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇవి సాగు చేయాలి ఎంటీయూ 7029 (స్వర్ణ), ఎంటీయూ 1121 (శ్రీధతి), ఎంటీయూ 1064 (అమర), ఎంటీయూ 1061 (ఇంద్ర), బీపీటీ – 5204 (సాంబ మసూరి) ఇన్ని విత్తనాలు అవసరం ∙దుక్కిదున్ని వెదజల్లే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలోల విత్తనం అవసరం ∙దమ్ముచేసి వెదజల్లే విధానం కింద 12–15 కిలోల విత్తనం ∙నారుమడికి ఎకరానికి 20 కిలోల విత్తనం మాత్రమే వాడాలి ఈ జాగ్రత్తలు పాటించాలి ∙పడిపోయే స్వభావం ఉన్న ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, బీపీటీ 5204 వరి రకాలను ముంపు ప్రాంతాల్లో వెదజల్లే పద్దతిలో సాగుచేయవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ∙అవసరానికి మించి ఎరువులు వాడటం వలన ఎంటీయూ 1121, బీపీటీ 5204 రకాలను ఎండాకు తెగులు ఆశించి నష్టం కలుగచేస్తుంది. విత్తనశుద్ధి చేసుకోవాలి సాగుకు విత్తన ఎంపిక ఎంత కీలకమో పంట తెగుళ్ల బారిన పడకుండా, ఆరోగ్యవంతమైన, ధృడమైన నారుకు విత్తనశుద్ది అంతే అవసరం. విత్తన దశలో మొలక రావడాన్ని అడ్డుకునే శిలీంద్రాల నివారణకు విత్తన శుద్ధి దోహదం చేస్తుంది. లేనిపక్షంలో మొలక సక్రమంగా రాకపోవడంతో పాటు పంటపై అగ్గి తెగులు, పొడ తెగులు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. విత్తన శుద్ధి రెండు రకాలుగా చేయవచ్చు. పొడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు మూడు గ్రాముల కార్భండైజం మందును కలపాలి. తడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు ఒక గ్రాము కార్భండైజం ఒక లీటరు నీటిలో కలిపి ఆ మందు ద్రావణంలో విత్తనాలు శుద్ధి చేయాలని ఆయన సూచించారు. – సీహెచ్‌కేవీ చౌదరి, ఆలమూరు ఏడీఏ -
‘రెండో అతిపెద్ద రిటైల్‌చైన్‌గా భారత్ మారింది’
రాజమండ్రి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశంలో అవినీతి రహిత పాలనను మోదీ అందిస్తున్నారని, 2014 తర్వాత దేశంలో సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘చారిత్రాత్మక రాజమండ్రి నగరానికి రావడం సంతోషంగా ఉంది.చరిత్రలో రాజమండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చారు. మోదీ హయాంలోనే దేశంలో పేదరిక తగ్గింది. అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఆయుష్మాన్ భారత్‌తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.భారత నుంచి 500 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. రెండో అతిపెద్ద రిటైల్ చైన్‌గా భారత్ మారింది. దేశంలో 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు. భారత్ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది’ అని తెలిపారు. -
తుని.. మూడు తరాలుగా మామిడికి ప్రసిద్ధి
సాక్షి, తుని: తింటే గారెలే తినాలి అంటారు కానీ.. ఆ కోవలో తుని మామిడి పండ్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రుచి తుని ప్రాంతంలో పండే మామిడి పండ్లకు ఉంది. 1947కు ముందు నుంచీ మామిడికి తుని ప్రసిద్ధి. తుని పట్టణానికి ఏకంగా “మ్యాంగో సిటీ’ అనే పేరు కూడా ఉంది. తుని డిపో ఆర్టీసీ బస్సులపై ఈ డిపో పేరు రాసినప్పుడు పక్కనే మామిడికాయల బొమ్మలు కూడా ఉండేవంటే.. ఇక్కడి మామిడి ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తునిలో ప్రారంభమైన ఓ జ్యూయలరీ సంస్థ సైతం “మ్యాంగో సిటీ’గా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక్కడి రైతులు మూడు తరాలుగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రెండేళ్లుగా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. తుని సబ్ డివిజన్లో మామిడి విస్తీర్ణం 1,700 హెక్టార్లుగా ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లకు ఎంతో డిమాండ్. ఏటా తుని ప్రాంతం నుంచి 60 వేల టన్నుల పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం తుని కేంద్రంగా ఏటా రూ.20 కోట్ల మేర మామిడి వ్యాపారం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని సమయంలో ఇక్కడి రైతులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రైళ్ల ద్వారా మామిడి ఎగుమతులు చేసేవారు. క్రమేపీ లారీ రవాణా అందుబాటులోకి రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ ఇక్కడి వ్యాపారులు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక ఉద్యాన శాఖ విదేశాలకు ఎగుమతి చేయడానికి 3,500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది. మూడు తరాలుగా ఎగుమతులు మా తాత, నాన్న పప్పు సూర్యారావు నుంచి 80 ఏళ్లుగా మామిడి ఎగుమతులు చేస్తున్నాం. రైతుల నుంచి తోటలు కొని పక్వానికి వచ్చిన పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. తొలి రోజుల్లో వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తుని మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. వేసవి సీజన్లో ఎన్ని పనులున్నా మామిడి ఎగుమతులు ఆపలేదు. ఉద్యాన అధికారులు సహకరించడంతో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది. – పప్పు వెంకట రమణ, వ్యాపారి, వెంకటాపురం నేల స్వభావంతో మంచి రుచి తుని ప్రాంతంలో ఇసుక, గరప (గ్రావెల్) నేలలు కావడంతో ఇక్కడి మామిడి పండు రంగు ఎంతో బాగుంటుంది. రుచి కూడా చాలా మధురంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు తుని మామిడి పండ్లు రుచి చూడాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మంచి రంగు ఉంటుంది. ప్రస్తుతం మేలు రకం పండ్ల ధర టన్నుకు రూ.75 వేలు పలుకుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. – విజయలక్ష్మి, ఉద్యాన అధికారి, తుని -
‘చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని సీఎం చెప్పారు’
-
ఏపీ: ఈ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19 వరద సహాయక బృందాలతో పాటు 6 డైవింగ్ బృందాలు సిద్ధమయ్యాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ బాపట్ల జిల్లా సముద్ర తీరం ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. నిజాంపట్నం హార్బర్లో8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం కృష్ణా, కాకినాడ, తూ.గో, ప.గో జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రాలో 75-95 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో భాగంగా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సఖినేటిపల్లి - ఐ. పోలవరం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోందని కలెక్టర్ తెలిపారు. మరొకవైపు కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, కడప జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. రేపు(బుధవారం) సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు వాయిదా బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. తుపాను కారణంగా పరీక్షను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. వాయిదా వేసిన ఇంటర్ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 99086 64635, 08672 25257 మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08672252486 కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 0884-2368100 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18002331077 -
తేనెలూరుతున్న ఉపాధి
రాజానగరం: ఉద్యోగాల కోసం పరుగు తీయకుండా కొందరు ఉన్నచోట స్వయం ఉపాధిని ఎంచుకుని లబ్ధి పొందుతున్నారు. ‘తేనెపట్టు’ను స్వయం ఉపాధిగా ఎంచుకుని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి పరిసరాల్లో ఇటువంటి ఔత్సాహికులు కనిపిస్తున్నారు. పండ్ల తోటల్లో వీటిని ఏర్పాటు చేయడం వలన పరపరాగ సంపర్కం జరిగి, దిగుబడులు పెరగడానికి దోహపడుతున్నాయని రైతులు కూడా సహకరిస్తున్నారు. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ (ఎన్బీహెచ్ఎం) పథకం ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజు బీఎస్సీ (కంప్యూటర్స్) చదివాడు. స్వతహాగా ఫొటోగ్రాఫర్. అప్పుడప్పుడూ రంపచోడవరం, అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అరకొరగా జరిగే తేనెటీగల పెంపకంపై కాస్తోకూస్తో తెలుసుకున్నాడు. యూట్యూబ్ చానళ్లలో చూసి స్వయం ఉపాధికి అదే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. గుంటూరులో కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడు. వివిధ రకాల పండ్ల తోటలకు నిలయంగా పేరొందిన రాజానగరం మండలం తేనెటీగల పెంపకానికి అనుకూలమని భావించాడు. శ్రీకృష్ణపట్నంలో ఏడాది క్రితం ఐదు పెట్టెలతో తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. ఎంఏ చదివిన స్నేహితుడు నల్లమిల్లి వెంకటేష్(వాసు)ను కూడా కలుపుకొన్నాడు. ఏడాది తిరక్కుండానే వంద పెట్టెల్లో తేనెటీగలను పెంచుతూ తేనె తీసే ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ‘విశిష్ట’ బ్రాండ్ పేరుతో వ్యాపారం శ్రీకృష్ణపట్నంలో మామిడి, జీడిమామిడి, నిమ్మ, నారింజ, పనస, సపోటా, జామ, నేరేడు, సీతాఫలం, తదితర పండ్ల చెట్లు విస్తారంగా ఉంటాయి. తేనె ఉత్పత్తికి అవసరమైన పుప్పొడికి ఇక్కడ కొదవుండదు. తేనెటీగలు ఆయా పూవులపై వాలి, పుప్పొడి నుంచి తేనె సంగ్రహించి, తోటల్లో అమర్చిన పెట్టెల్లో నిక్షిప్తం చేస్తుంటాయి. ఈ ప్రక్రియ ఏడాది పొడవునా జరిగేందుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. దీంతో ఇక్కడి నుంచే తేనె సేకరించి విక్రయించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సహకారంతో తేనెను ప్రత్యేక యంత్రం (హనీ ఎక్స్ట్రాక్టర్) ద్వారా శుద్ధి చేసి, సీసాల్లో ప్యాక్ చేస్తున్నారు. దానికి ‘విశిష్ట’ పేరు పెట్టి ఉన్నచోటనే అమ్మకాలు సాగిస్తున్నారు. 40 రోజులు పడుతుంది పెట్టెల ద్వారా తేనె సేకరణకు 40 రోజులు పడుతుంది. స్వచ్ఛత, చిక్కదనం కలిగి ఉండటంతో దీని కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకృష్ణపట్నంతో పాటు గుంటూరు జిల్లా జాగర్లమూడిలో కూడా మరో తేనెటీగల పెంపకం యూనిట్‌ను వీరు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో జనం రోగ నిరోధక శక్తి పెంపుపై దృష్టి పెట్టారు. దీంతో తేనె వాడకంకూడా పెరిగింది. ఇద్దరే కాదు.. ఇంకా ఉన్నారు తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న వారు రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అనపర్తికి చెందిన శ్రీరామరాజు ఎంబీఏ చదివి, నాలుగేళ్ల క్రితమే తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పీరా రామచంద్రపురం ప్రధాన కేంద్రంగా చేసుకుని గుంటూరు, రాజవొమ్మంగిల్లో కూడా ఈ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ‘గోల్డెన్ బీస్’ పేరుతో సొంతంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఐటీడీఏ, ఉద్యాన శాఖ, డీఆర్డీఏలద్వారా ప్రత్యేక ప్రాజెక్టులు చేస్తూ, ఔత్సాహికులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. రాజానగరం మండలం రఘుదేవపురంలో నక్కిన కృష్ణ అనే రైతు సుమారు 20 సంవత్సరాల నుంచి తేనెటీగల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదివిన ఆయన కుమారుడు శ్రీను ఈ యూనిట్‌ను కొనసాగిస్తున్నారు. దివాన్‌చెరువులో మార్ని గంగరాజు, కానవరంలో నాగేశ్వరరావు, చక్రద్వారబంధంలో కన్నబాబు కూడా దీనిని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు. రాయితీతో ప్రోత్సహిస్తున్నాం నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్(ఎన్బీహెచ్ఎం)లో తేనెటీగల పెంపకం యూనిట్లపై ప్రభుత్వం 50 నుంచి 75 శాతం రాయితీ అందజేస్తుంది. ఒక యూనిట్(8 పెట్టెలు)కు ఒక తేనెటీగల పెట్టె, అవసరమైన తేనెటీగలు, రక్షణ దుస్తులు కూడా సమకూర్చి, రంపచోడవరంలో అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. అనంతరం యూనిట్లు పెట్టి, మంచి ప్రగతి చూపించిన వారి వివరాలను ‘మధుక్రాంతి’ యాప్‌లో అప్లోడ్ చేసి, మరింత ప్రోత్సాహం అందించేలా కృషి చేస్తున్నాం. – టి.రిని, ఉద్యాన శాఖాధికారి, రాజానగరం -
విదేశీ విద్యకు వెళ్లే వేళ.. కడలి అలలకు బలి
తొండంగి: ఉజ్వల భవిష్యత్తు కోసం మరో నాలుగు రోజుల్లో జర్మనీ వెళ్లాల్సిన ఆ యువకుడు కడలి కెరటాలకు బలైన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పైడికొండ పంచాయతీ ఆనూరుకు చెందిన త్రిపరాన కాసులు, నూకరత్నం దంపతులు ఒక్కగానొక్క కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు సుబ్రహ్మణ్యం (26) విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఉన్నత చదువులకు జర్మనీ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. సముద్రంలో స్నానం చేద్దామని శుక్రవారం ఉదయం ఐదు గంటలకు స్వగ్రామం నుంచి ఒక్కడే బైక్‌పై దగ్గరలోని వేమవరం పంపాదిపేట తీరానికి వెళ్లాడు. స్నానం చేస్తున్న క్రమంలో కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. స్నానానికి వెళ్లిన సుబ్రహ్మణ్యం ఎంతకూ రాకపోవడంతో బంధువులు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ అతడి సెల్‌ఫోన్, దుస్తులను గమనించారు. సుబ్రహ్మణ్యం కనిపించకపోవడంతో గల్లంతయ్యాడని భావించి, మత్స్యకారుల సాయంతో వెతకడం ప్రారంభించారు. నాలుగు గంటల అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహం అద్దరిపేట తీరానికి చేరింది. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సమాయత్తం చేసే దిశగా అగ్రనేతలు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రాంతీయ సమన్వయకర్తలను, కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించి, కొత్త ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులైన ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోష్, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తూర్పు సెంటిమెంట్‌గా శుక్రవారం తొలి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శనివారం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్యకర్తల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ పార్టీలో వారికి గుర్తింపు ఉంటుందనే సంకేతాలను రీజినల్ కో ఆర్డినేటర్లు పంపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు చిన్నచిన్న లోపాలుంటే చక్కదిద్దేందుకు కూడా ముందుండాలని సూచించారు. ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారుంటే సచివాలయంలో ఆరు నెలలకోసారి పరిశీలించి తిరిగి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 11న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలియజేశారు. మూడేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రజల సంక్షేమానికి రూ.లక్షా 43 వేల కోట్లు వినియోగించలేదన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సీఎం జగన్ అమలు చేశారని వివరించారు. మిధున్‌రెడ్డికి ఘన స్వాగతం వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులై తొలిసారి జిల్లాకు వచ్చిన లోక్‌సభలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మిధున్‌రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన నేతలతో రాజమహేంద్రవరం కోలాహలంగా మారింది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మిధున్‌రెడ్డికి పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు సమీపాన ఉన్న తోటలో రాజానగరం నియోజకవర్గ ముఖ్య నేతలను మిధున్‌రెడ్డికి రాజా పరిచయం చేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహానికి వచ్చిన మిధున్‌రెడ్డిని పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలకుల, గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, కర్రి పాపారాయుడు, గుబ్బల తులíసీకుమార్, వట్టికూటి రాజశేఖర్, వాసిరెడ్డి జమీలు, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అడపా వెంకటరమణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకూ ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన విధంగా ఈ నెల 11 నుంచి గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మిధున్‌రెడ్డి, బోస్ దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్ని అంశాలనూ ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ సాధన, పార్టీ శ్రేణుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రక్రియను తాము చేపడతామని ప్రాంతీయ సమన్వయకర్తలు చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో కూడా ముందుంటామని ప్రాంతీయ సమన్వకర్తలు భరోసా ఇచ్చారు. పథకాలపై ఫోకస్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్గత సమావేశంలో అధిష్టానం నిర్దేశించిన విధివిధానాలపై మిధున్‌రెడ్డి, బోస్ ప్రజాప్రతిని«ధులకు వివరించారు. ఈ వివరాలను మిధున్‌రెడ్డి, బోస్, మంత్రి వేణు మీడియాకు వివరించారు. మూడేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల కింద నేరుగా రూ.లక్షా 43 వేల కోట్లు అందజేసిన విషయాన్ని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని ప్రాంతీయ సమన్వయకర్తలు సూచించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో పథకాల నిధులు జమయ్యేలా సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ వివరించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ విషయాలపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలు సుదీర్ఘంగా చర్చించారు.