గాయపడినవారిని పరామర్శిస్తున్న మంత్రి కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ రూరల్/ఏలూరు టౌన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్ వద్ద బల్క్‌డ్రగ్స్ తయారుచేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలో బల్క్‌డ్రగ్స్ తయారీకి పైపులద్వారా గ్యాస్‌లైన్ రియాక్టర్‌కు నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ ఎన్‌హైడ్రేడ్ రసాయనాలను పంపుతున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. దీన్ని నియంత్రించేందుకు ఇద్దరు సూపర్‌వైజర్లు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భారీశబ్దంతో అది పేలిపోయింది. దీంతో సూపర్‌వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం(31), తోటకూర వెంకటరమణ(37) అక్కడికక్కడే మృతిచెందారు. వారి దేహాలు ఛిద్రమైపోయాయి. అక్కడికి సమీపంలో విధుల్లో ఉన్న ఆపరేటర్లు కుడుపూడి శ్రీనివాసరావు, నమ్మి సింహాద్రిరావు, కలగ సత్యసాయిబాబు, రేగిల్లి రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సత్యసాయిబాబు పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం, భారీగా పొగలు రావడంతో ఏం జరిగిందో తెలియక సర్పవరం గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం తెలియగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, ఇతర శాఖల అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అప్పటివరకు మూసివేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఇదే పరిశ్రమలో గతంలో గ్యాస్ లీకేజీ కలవరం రేపింది. అప్పట్లో అధికారులు విచారణ జరిపి లీకేజీ జరగలేదని ప్రకటించారు. కాగా, ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డితో డిప్యూటీ సీఎం ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అత్యాధునిక వైద్యం అందించేలా వైద్యాధికారులను ఆదేశించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సర్పవరం టైకీ పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో నలుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. తక్షణం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్య తప్పిదాల వల్ల కార్మికులకు, స్థానికులకు నష్టం జరిగితే సహించబోమని, యాజమాన్య లోపం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. వచ్చేది వేసవి కాలం కావడంతో పెరిగే ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఫార్మా, కెమికల్స్ వంటి ప్రమాదాలు జరిగే పరిశ్రమలను గుర్తించి, ముందస్తుగా రక్షణ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులను మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment