పిఠాపురం: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. మరొకరిని ప్రాణాపాయస్థితికి తీసుకెళ్లింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాసు (45), పెండ్యాల లోవమ్మ (35)లను అదే గ్రామానికి చెందిన లోకా నాగబాబు కత్తితో నరికి చంపాడు. లోవమ్మ తల్లి రామలక్షి్మపైనా దాడి చేయడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
వివరాల్లోకి వెళితే.. పెండ్యాల లోవమ్మ భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. గ్రామానికి చెందిన లోకా నాగబాబుతో సహజీవనం చేస్తోంది. ఇటీవల పోసిన శ్రీనివాసుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో ఆమెను నాగబాబు పలుమార్లు హెచ్చరించాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె వినకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో 20 రోజులుగా శ్రీనివాసు, లోవమ్మలను వెంబడిస్తున్నాడు. ప్రతి రోజూ శ్రీను తన మోటారు సైకిల్‌పై లోవమ్మను తన పొలంలోకి పనులకు తీసుకెళ్లడం గమనించాడు. ఎలాగైనా వారిద్దరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు.
మాటు వేసి దాడి
లోకా నాగబాబు మంగళవారం అర్థరాత్రి చేబ్రోలు శివారు లక్ష్మీపురం పొలిమేరలో ఉన్న శ్రీనివాసు పొలానికి కత్తి తీసుకుని వెళ్లాడు. తన మోటారుసైకిల్‌ను దూరంగా పొదల్లో దాచాడు. అక్కడ బెండ తోట పక్కనే ఉన్న నువ్వుల చేనులో దాకున్నాడు. కాగా.. శ్రీనివాసు తన పొలంలో బెండకోత కోసం నలుగురు కూలీలను మాట్లాడుకుని బుధవారం ఉదయం 4.30 గంటలకు వారిని రమ్మని చెప్పాడు. ముందుగానే లోవమ్మను తీసుకుని పొలానికి వెళ్లిపోయాడు. అక్కడే నువ్వుల చేలో దాక్కున్న నాగబాబు వారిద్దరిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తల్లి రామలక్షి్మపై కత్తితో దాడి చేశాడు.
ఆమె కేకలు విని స్థానికులు అక్కడకు వచ్చేసరికీ నాగబాబు పరారయ్యాడు. కాగా.. బెండకాయల కోతకు వచ్చిన కూలీలు పొలంలో లోవమ్మ, శ్రీనివాసు మృతదేహాలను చూశారు. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోసిన శ్రీనివాసుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగబాబు గత 20 రోజులుగా కత్తి తీసుకుని శ్రీనివాసు పొలంలో తిరగడాన్ని సమీపంలోని రైతులు గమనించారు. ఈ విషయాన్ని శ్రీనివాసుకు చెప్పినా అతడు పట్టించుకోలేదు. నాగబాబు గతంలో లోవమ్మ వెంటబడిన ఒక వ్యక్తి చెయ్యి నరికాడని, ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని స్థానికులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment