కాకినాడ రూరల్: కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆ యువతి తోడుగా నిలిచేది.. వలంటీర్‌గా తన పరిధిలోని ప్రజలతో ఆప్యాయంగా మసలుకునేది.. తన పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేది.. ఇటీవలే పెళ్లి కూడా కుదిరింది.. ఇంతలోనే ఏమైందో ఏమో.. బలవన్మరణానికి పాల్పడింది.. కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిల్చింది. తమ సేవా సారథి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించిందని తెలిసి.. ఆమె పరిధిలోని ప్రజలు విచారంలో మునిగిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం తారకరామ కాలనీకి చెందిన కొక్కరి మహిమ (26) సచివాలయం–3లో వలంటీరుగా పని చేస్తోంది.
తండ్రి విజయ్‌కుమార్ ఆటో డ్రైవర్. తల్లి రత్నకుమారి గృహిణి. తమ్ముడు కాకినాడ మెయిన్ రోడ్డులోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. కాకినాడకు చెందిన యువకుడితో పెద్దల సమక్షంలో మహిమకు గత నెల 11న వివాహ నిశి్చతార్థం జరిగింది. త్వరలో వివాహం జరగాల్సి ఉంది. నిశి్చతార్ధం తరువాత ఆమె చాలా సంతోషంగా కనిపించేది. తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి ప్రేయర్ కోసం చర్చికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏమైందో.. ఏమో కానీ.. రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో మహిమ తమ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ప్రేయర్ అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమార్తెను చూసి గొల్లుమన్నారు.
స్థానికులు సహాయంతో కిందకు దించి, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో నిండిపోయారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇంద్రపాలెం ఎస్సై దేవ సుధ శనివారం కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో లభించిన మహిమ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారికి భారం కాకూడదనే ఉద్దేశంతోనే మహిమ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.
జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మహిమ మృతదేహానికి మధ్యాహ్నం ఇంద్రపాలెంలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వలంటీర్ మహిమ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులను ఆదుకుంటామని తెలిపారు.
నా చావుకు ఎవ్వరూ బాధ్యులు కారు
నా చావుకు ఎవ్వరూ బాధ్యులు కారు. మానసిక స్థితి బాగో లేదు. మానసిక ఒత్తిడి భరించలేకపోతున్నాను. అమ్మా నాన్నా.. ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ.. బతకాలని ఉంది. కానీ భరించలేకపోతున్నాను. (కాబోయే భర్త రాజేష్ ను ఉద్దేశించి) నా కంటే మంచి అమ్మాయి దొరుకుతుంది.
– సూసైట్ నోట్‌లో మహిమ
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment