కుప్పం: వివాహితుడి ప్రేమతో మోసపోయి.. | kuppam Constable Prashanti Passed Away | Sakshi
Sakshi News home page

కుప్పం: వివాహితుడి ప్రేమతో మోసపోయి..

Jul 26 2025 6:43 AM | Updated on Jul 26 2025 6:43 AM

kuppam Constable Prashanti Passed Away

కుప్పం: ప్రియుడు మోసం చేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్‌ అతని ఇంటి ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. 

పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం, మార్వాడకు చెందిన వెంకటేష్‌ కుమారుడు వాసు ఓ ఫైనాన్స్‌ కంపెనీలో కలెక్షన్‌ మెన్‌గా పనిచేస్తున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కడప పట్టణం, వూటుకూరు ప్రాంతానికి చెందిన ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈమె వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా సెక్యూరిటీ కానిస్టేబుల్‌. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే.. 

అప్పటికే వాసుకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని అతను ప్రశాంతికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాసు పనిచేస్తున్న ఫైనాన్స్‌లో గొడవలు రావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరు వదిలి వాసు స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతితో మాట్లాడడం తగ్గించేశాడు. అతనిపై అనుమానంతో గురువారం ఆమె మార్వాడ గ్రామానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న వాసును చూసి తట్టుకోలేకపోయింది. 

ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంతిని కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలొదిలింది. ప్రేమ ముసుగులో మోసం చేసిన ప్రియుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement