
తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాగాంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దీపక్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో విషయం బయటకు చెప్పకుండా బాధితురాలిని కట్టడి చేశాడు. దీపక్ మాటలను అమాయకంగా నమ్మిన బాధితురాలు.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను దీపక్ రెండు,మూడు సార్లు కొట్టాడు. దీపక్ అకృత్యాలను తండ్రికి, రూమ్మేట్లకు సైతం నాగాంజలి తెలియనివ్వలేదు.
ఈ నెల 23న దీపక్‌కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. చనిపోవాలంటే చనిపోవచ్చని.. తనకు ఇబ్బందిగా ఉందంటూ దీపక్ కర్కశంగా వ్యవహరించాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన నాగాంజలి.. తీవ్ర మానసిక వేదన అనుభవించింది.కాగా, దీపక్‌కు పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో దీపక్ చేరాడు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడు.
రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం.