
రాజమండ్రిలో వరుసగా దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని.. కూటమి సర్కార్ ఏం చేస్తోందంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ నిలదీశారు.
సాక్షి, తూర్పుగోదావరి: ఆత్మహత్యా యత్నం చేసిన ఫార్మసిస్ట్‌కి న్యాయం జరిగేదాకా పోరాడుతామని, ఆమె కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైనా వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫార్మసిస్ట్ కేసులో నిందితుడు దీపక్ టీడీపీ క్రియాశీల కార్యకర్త అని, ఆయన మామ రాజమహేంద్రవరం టీడీపీలో ముఖ్య నేత అని మాజీ ఎంపీ గుర్తు చేశారు. దీపక్ పని చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ కోరారు.
మార్గాని భరత్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో ఏజీఎంగా పని చేస్తున్న దీపక్ అనే వ్యక్తి కారణంగానే తాను ఆత్మహత్యా యత్నం చేస్తున్నట్లు ఫార్మసిస్ట్ సుదీర్ఘ లేఖలో రాసుకొచ్చారు. ఆమెను దీపక్ శారీరకంగా, మానసికంగా హింసించాడు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంజలి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలి. లేకపోతే అవన్నీ బయట పెడతాం. దీపక్ వ్యక్తిత్వం మంచిది కాదని అందరూ చెబుతున్నారు. గత మూడు నాలుగు రోజులుగా బాధితురాలి తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ వర్ణణాతీతం. ప్రభుత్వం మీద నమ్మకం లేక న్యాయం చేయమని వారు నన్ను ఆశ్రయించారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఉంటే వారు నా దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంటుంది?
పక్కదారి పట్టించే ప్రయత్నం:
ఆస్పత్రి యాజమాన్యం కూడా మొదటిరోజు ఈ ఘటనను పక్కదారి పట్టించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఫార్మసిస్ట్ సహచర విద్యార్థులు రోడ్డుమీదకొచ్చి ధర్నా చేస్తే కానీ ప్రభుత్వం, ఆస్పత్రి యాజమాన్యం దిగి రాలేదు. మూడు రోజుల తర్వాత కానీ ఆమె ఆత్మహత్యకు యత్నించిన ఇంజెక్షన్ గురించి ఆస్పత్రి యాజమాన్యం నోరు విప్పలేదు. ఫార్మసిస్ట్ సూసైడ్ నోట్ దొరకనంత వరకు ఈ కేసును నీరు గార్చడానికి దీపక్ చేయని ప్రయత్నం లేదు. మా నాయకుడికి ఈ విషయం తెలియజేయడంతో ఫార్మసిస్ట్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా అండగా ఉండాలని ఆదేశించారు. బాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది.
నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త:
నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త అని తెలిసింది. ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా రాజమండ్రిలో టీడీపీ నాయకుడని సమాచారం. కాబట్టే ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 10 నెలల్లో మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. కానీ ఎక్కడా నిందితులకు శిక్ష పడిన దాఖలాలు లేవు.
సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి:
సీసీ టీవీ ఫుటేజ్‌ను ఆస్పత్రి యాజమాన్యం వెంటనే బయట పెట్టాలి. రూమ్ నెం.801లో ఆమే స్వయంగా ఇంజక్షన్ చేసుకుందా? లేక ఎవరైనా బలవంతంగా ఎక్కించారా అనేది నిర్ధారణ కావాలి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు దీపక్ నుంచి సేకరించిన వివరాలు ఫార్మసిస్ట్ తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఈనెల 23న దీపక్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కానీ ఎఫ్‌ఐఆర్ కాపీ చూస్తే మాత్రం 24వ తేదీ కనిపిస్తోంది. అలాగే ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారా? లేదా? అన్నది కూడా పోలీసులు చెప్పాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివరాలు వెల్లడించాలి:
పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయి ఐదు రోజులు గడిచినా ఆయనది హత్యా? లేక రోడ్డు ప్రమాదమా? అనేది ఇంతవరకు పోలీసులు నిర్ధారించలేకపోవడం దారుణం. ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నారా లోకేష్ ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే హత్యా? యాక్సిడెంటా? అనేది నిర్ధారణ కాకుండానే ప్రమాదవశాత్తు చనిపోయారని ఆయన ఎలా ప్రకటిస్తారు?. అందుకే పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి వివరాలు చెప్పాలని మార్గాని భరత్ కోరారు.
కాగా, ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ..
సరైన సమాచారం ఇవ్వలేదు:
మా పాప వికాస్ కాలేజీలో చదువుతూ బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మా పాప కళ్లు తిరిగిపడిపోయిందని ఈనెల 23న సా. 4 గం.కు ఆస్పత్రి నుంచి మాకు ఫొనొచ్చింది. మేము అక్కడికి వెళ్లేసరికి రాత్రి 8 గం. అయింది. అప్పటికే ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారు. మేం వెళ్లాక ఐసీయూకు మార్చారు. వైద్యం చేస్తున్నామని చెబుతున్నారే కానీ దేనికి అనేది చెప్పలేదు. స్లో పాయిజన్ అయి ఉంటుందని మర్నాడు ఒక డాక్టర్ చెప్పారు. మా పాపకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. ఈ పరిస్థితి మరే ఇతర అమ్మాయికి రాకూడదు. మా పాప ఆస్పత్రికి ఎలా వచ్చిందో అలాగే తిరిగి ఇంటికి రావాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.
ఆస్పత్రికి కనీసం బాధ్యత ఉండదా?:
డ్యూటీలో ఉన్న అమ్మాయి పడిపోతే ఆస్పత్రికి బాధ్యత తీసుకోదా? అందుకే ఈ ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం పాత్ర కూడా ఉందనే అనుమానం వస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు మాతో మాట్లాడలేదు. మాజీ ఎంపీ భరత్ జోక్యం చేసుకున్నాకే వారిలో మార్పు కనిపిస్తోందని ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు వెల్లడించారు.