
సాక్షి, తూర్పుగోదావరి: విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా? అంటూ చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. ‘‘విద్యుత్ ఒప్పందాల్లో రూ.11 వేల కోట్ల స్కాం జరిగింది. ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు?. చంద్రబాబు బినామీలకు వాటాలు వెళ్లాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.
మంగళవారం.. మార్గాని భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ రెండు రూపాయల 49 పైసలకు ఏడు వేల మెగా వాట్లు రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు. మార్కెట్లో విద్యుత్ తక్కువగా దొరుకుతున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయటం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమేనన్నారు. చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
‘‘ఈ ఒప్పందంతో సంవత్సరానికి రూ. 400 కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది. కనీసం ప్రజలు ఏమన్నా అనుకుంటారేమోనన్న ఆలోచన కూడా చంద్రబాబు లేకపోవడం దారుణం. ఇప్పటివరకు బషీర్ బాగ్ ఘటన ఎవరు మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది. ఓ వైపు సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడ కూలిపోయింది. పేక మేడలాంటి నిర్మాణాలతో ప్రభుత్వం అమాయకులను బలి చేస్తుంది. టీటీడీలో గోవులు చనిపోతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్లు కోసం భక్తులు ప్రాణం కోల్పోయారు. ప్రభుత్వ తప్పులు మీద తప్పులు చేస్తుంది’’ అని మార్గాని భరత్ మండిపడ్డారు.
విద్యులు తగ్గించకపోతే వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తారు. సింహాచలం ఘటనలో మంత్రులకు బాధ్యత లేదా?. పర్యవేక్షణ అంటే ఏసీ రూములో కూర్చుని కాఫీలు తాగడమా?’’ అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు.
