ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్‌ | Ysrcp Ex Mp Margani Bharat Ram Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్‌

Published Wed, Jan 8 2025 3:12 PM | Last Updated on Wed, Jan 8 2025 5:11 PM

Ysrcp Ex Mp Margani Bharat Ram Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌(YS Jagan) పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని.. గణాంకాలతో సహా వైఎస్సార్‌సీపీ(YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌(Margani Bharat) వివరించారు. బుధవారం ఆయన ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీతో శంకుస్థాపనలు చేయిస్తోందన్నారు.

ఈ ప్రభుత్వంలో ఆరున్నర నెలల్లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని.. ప్రధాని పర్యటనతో సీఎం చంద్రబాబు షో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారని మార్గాని భరత్‌ దుయ్యబట్టారు. అంతకు ముందు చంద్రబాబు పాలన కన్నా, గత ప్రభుత్వంలో జగన్‌ పాలనలోనే పారిశ్రామిక రంగం గణనీయంగా పురోగతి సాధించినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. మరోవైపు కమీషన్ల కోసం టీడీపీ నాయకుల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు హడలెత్తిపోతున్నారని మార్గాని భరత్‌ చెప్పారు.

‘‘రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్టుల శంకుస్ధాపనల కోసం రావడం మంచి పరిణామం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ ఆయన ఆ దిశలో ఏం సాధించలేదు. ఈ రోజు ప్రధాని శంకుస్ధాపనలు చేయబోయే గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు, రైల్వే జోన్, బల్క్‌ డ్రగ్‌ పార్కు.. ఇవన్నీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు. అయితే సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టు వీటిని ఈరోజు తామే సాధించి తెచ్చినట్టు చంద్రబాబు కలరింగ్‌ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. 

..నిజంగా వారికి దమ్ము, ధైర్యం ఉంటే, రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలి. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించడంతో పాటు, కర్నాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్‌ ప్లాంట్‌కు ఇస్తున్నట్లు రూ.15వేల కోట్ల కేటాయింపు జరిగేలా చూడాలి. ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను 17 రాష్ట్రాలతో పోటీపడి, నాడు మన రాష్ట్రం సాధించింది. దక్షిణాదిలో మరే రాష్ట్రానికి అప్పుడు అది సాధ్యపడలేదు.

..పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారంటూ, టీడీపీ పిచ్చి విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు ఎక్కువగా ఎవరి హయాంలో నమోదైంది అన్నది చూస్తే, పారిశ్రామికవేత్తలు అసలు ఎవరిని చూసి భయపడుతున్నారో అందరికీ తెలుస్తుంది. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి పారిశ్రామిక వృద్ధి రేటు 11.92 శాతంగా ఉంటే, 2024లో జగన్‌ దిగిపోయే నాటికి ఆ వృద్ధి రేటు 12.61 శాతంగా నమోదైంది. ఇంకా చంద్రబాబు హయాంలో రాష్ట్ర రుణంలో 19.54 శాతం పెరుగుదల కనిపిస్తే, అది జగన్‌ హయాంలో 15 శాతం మాత్రమే.

చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు మార్గాని భరత్

ఇదీ చదవండి: జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా: వైఎస్‌ జగన్‌
 

..అలాగే తలసరి ఆదాయం (పీసీఐ) 2018–19 నాటికి రూ.1.54 లక్షలు కాగా, 2023–24 నాటికి అది రూ.2.19 లక్షలకు పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తుల విలువలో చంద్రబాబు హయాంలో దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, జగన్‌గారి పాలనలో 2022–23 నాటికే 8వ స్థానానికి ఎగబాకింది. దేశ జీడీపీలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్ర జీడీపీ వాటా 4.47 శాతం కాగా, జగన్‌ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది.

..నిజానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను దారుణంగా వేధిస్తున్నారు. వారిని బెదిరిస్తున్నారంటూ.. రాజమండ్రిలోని ఇంటర్నేషనల్‌ పేపర్‌ మిల్లు నిర్వాహకులను రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో వినిపించారు. ఆ పేపర్‌ మిల్లు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ చౌదరి తాత గారు చిట్టూరి ప్రభాకర్‌ చౌదురి గతంలో రాజమండ్రి ఎమ్మెల్యేగా పని చేశారు. 

..వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న పేపర్‌ మిల్లు మూతపడితే అందులో పని చేసే వేలాది కార్మికుల జీవితాలు రోడ్డున పడిపోవా? అలా టీడీపీ నేతలు డబ్బుల కోసం బెదిరిస్తుంటే, వారు కంపెనీలు ఎలా నడుపుతారు?. నిజానికి పేపర్‌ మిల్లు లాకౌట్‌ సమయంలో ప్రభుత్వం కలుగజేసుకుని, అది కొనసాగించేలా చూడటమో లేదా కార్మికులను ఆదుకోవాలన్న కనీస  ప్రయత్నం కూడా చేయలేదు’’ అని మార్గాని భరత్‌ ఆక్షేపించారు.

కార్మికుల వేతన ఒప్పందంలో టీడీపీ పాత్ర లేదు
తాము అధికారంలో ఉన్నప్పుడు 2019 జనవరిలో వేతన ఒప్పందం చేశామని టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ అది  అవాస్తమని పేపర్‌ మిల్లు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ చౌదరి అన్నారు. ‘‘పేపర్‌ మిల్లు కార్మిక సంఘం తరఫున వేతన ఒప్పందం చేసింది నేను. తమ హయాంలో ఒప్పందం జరిగింది కాబట్టే అది తామే చేశామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. వేతన ఒప్పందంలో ఏ ఎమ్మెల్యే, లేదా మంత్రి సంతకం కూడా లేదు. టీడీపీ నాయకుల పాత్ర లేదని చెప్పడానికి ఈ ఒప్పందమే సాక్ష్యం’

‘‘నాటి ఎంపీ మార్గాని భరత్‌ నేతృత్వంలో కార్మికులకు రూ.6 వేలు చెల్లించేలా పేపర్‌ మిల్లు యాజమాన్యాన్ని ఒప్పిస్తే.. తండ్రీ కొడుకులు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌.. గత ఎన్నికల్లో లబ్ధి కోసం రూ.10 వేలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఎన్నికల్లో గెల్చిన తర్వాత నెల రోజుల్లో రూ.10 వేలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పేపర్‌ మిల్లు కార్మికులు నమ్మి ఓటేస్తే పట్టించుకోకుండా నట్టేట ముంచారు.’’ అని  ప్రవీణ్‌ చౌదరి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement