సాక్షి, తాడేపల్లి: పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటామని ధైర్యానిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.
నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు.కానీ, ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రతీ ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. మనం ఇచ్చిన పథకాలను రద్దుచేశారు, అవి అమలు కావడంలేదున్నారు.
..ప్రతీ ఇంటికీ వెళ్లి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ హామీలు గుప్పించారు. చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిలబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో సందర్భంగా ప్రజంటేషన్ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం.
జగనే కరెక్ట్ అంటున్నారు..
బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెలలో ఏ క్యాలెండర్ అమలు చేస్తామో క్యాలెండర్ విడుదల చేశాం. ప్రజల సంతోషం కోసం నిరంతరం తాపత్రయ పడ్డాం. మనం చేస్తున్న హామీలకు ఇంత ఖర్చు అవుతోంది, చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సూచించాను. పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఈరోజు ఆ వీడియోలు చూస్తే.. జగన్ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి ఉందని తెలిపారు.
ప్రతీనెలా ఏదో పథకం ద్వారా ప్రజలకు మేలు చేశాం. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేది. మరి చంద్రబాబు పాలనలో ఎందుకు ఇలా జరగడంలేదు?. ఎందుకు చంద్రబాబు మనలా చేయలేకపోతున్నాడు?. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతీ ఇంట్లోనూ జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే.. ప్రతీనెలా ఏదో పథకం వచ్చేది. ఐదేళ్ల పాటు షెడ్యూల్ ఇచ్చి పథకాలు అమలు చేసినట్టు చెప్పారు.
బాబు బాదుడు..
కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడం లేదు. మన పార్టీలో ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా వెళ్లగలడు. మనం చెప్పినవి చేసి చూపించాం. అబద్ధాలు చెప్పలేదు, మెసాలు చేయలేదు. అధికారం కోసం ఏ గడ్డైనా మనం తినలేదు. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు, వారికీ ఆ ధైర్యంకూడా లేదు. ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరు నెలల తిరక్కముందే కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. గ్రామీణ రోడ్లలో టోల్‌గేట్లు కూడా పెడుతున్నారు. నేషనల్ హైవేల మీదలానే టోల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. స్థలాల్లోని పాత ఇళ్ల మీద కూడా ఛార్జీలు వేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించడం లేదు. మనం ప్రతీ మూడు నెలలకూ విద్యా దీవెన కింద డబ్బులు చెల్లించాం. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు.
ఆరోగ్యశ్రీ కింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఈ 8 నెలల కాలంలోనే రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. పేదవాడు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం బాధ్యత. కానీ, ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
రెడ్ బుక్ రాజ్యాంగమే..
రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇంటి వద్దకే డోర్ డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తోడుగా ఉన్నవారే నాయకులుగా ఎదుగుతారు. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పార్టీని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ప్రతీ గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉండాలి. కమిటీల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాలి.
నెలఖారు నుంచి ప్రజలతోనే..
నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. ప్రతీ వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిది చేస్తాను. ప్రతీ రోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలి. గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలి. సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి. కేవలం మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్ మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది.
సోషల్ మీడియా వినియోగించుకోవాలి..
గ్రామస్థాయిలో ఉన్న ప్రతీ కమిటీ సభ్యుడు కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి. చంద్రబాబుని నిలదీసే కార్యక్రమం చేయాలి. దాదాపు మూడున్నర లక్షల పెన్షన్లు కట్ అయిపోయాయి. ఇక దివ్యాంగుల మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు.
కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం. ఇకపై మరోలా చూస్తాం. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు భరోసాగా ఉంటాం. అన్యాయానికి గురైన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. మీకు అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment