హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య మొదలైన ఆర్థిక వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తుంది. దీంతో ప్రశాంత్ వర్మ తర్వాతి సినిమాల పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం ఆయన చేతిలో జై హనుమాన్, మహాకాళి, అధీరా ప్రాజెక్ట్లతో పాటు ప్రభాస్, నందమూరి మోక్షజ్ఞ సినిమాలు ఉన్నాయి. అయితే, ప్రశాంత్ వర్మ చాలామంది నిర్మాతల వద్ద భారీగా అడ్వాన్స్లు తీసుకుని మోసం చేస్తున్నారని ఇండస్ట్రీలో వైరల్ అయింది. దీంతో ప్రభాస్ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నట్లు సమాచారం.
సలార్ సినిమా తర్వాత కన్నడ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ (Hombale Films)తో ప్రభాస్ ఇప్పటికే మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, దర్శకులను ఎంచుకోవడానికి ప్రభాస్‌కు ఆ సంస్థ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా, ప్రభాస్ మొదట ప్రశాంత్ నీల్తో కలిసి సలార్- 2 సినిమా చేయనున్నారు. మిగిలిన రెండు ప్రాజెక్ట్లలో ఒకటి ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేయాలని ఆయన మొదట భావించారట. అయితే, ప్రశాంత్ వర్మ చుట్టూ ఇటీవలి ఏర్పడిన వివాదాల దృష్ట్యా, ప్రభాస్ తన ఎంపికలను పునరాలోచించుకుని, బదులుగా ఇతర దర్శకులతో పనిచేయడం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి పేరుగాంచిన ప్రభాస్.. వివాదాల్లో చిక్కుకున్న చిత్రనిర్మాతలకు దూరంగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. దీంతో ప్రశాంత్ వర్మతో సినిమా చేయడం కష్టమనే చెప్పవచ్చు.
‘హను-మాన్’తో జాతీయ స్థాయిలో ప్రశాంత్ వర్మకు గుర్తింపు దక్కింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో ‘బ్రహ్మరాక్షస్’ (Brahma Rakshas) అనే సినిమాను తెరకెక్కించాలని ప్రశాంత్ చర్చలు జరిపారని గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇదే మైథాలాజికల్ స్టోరీని ప్రభాస్ ఇమేజ్కు అనుగుణంగా మార్చినట్లు వార్తలు వచ్చాయి. ఈమేరకు చర్చలు కూడా జరిగినట్లు టాక్.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఆర్థిక చిక్కుల్లో పడటంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడినట్లే అని తెలుస్తోంది. అయితే, తనకు, నిరంజన్ రెడ్డి నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య వచ్చిన వార్తలన్నీ చాలా నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. తనను కొందరు కావాలని లక్ష్యం చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని షోషల్మీడియాలో లేఖ విడుదల చేశారు.


