
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కల్యాణ్‌పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
‘‘కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు. పిఠాపురంలో మనువాదం అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం’’ అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు.
దళితుడన్న కారణంగా కరెంటు షాక్‌తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిచలేదు. పవన్‌కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై కేసు పెట్టాం.
..మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందిక పోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ బాబు తెలిపారు.