
రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు సాధారణంగా తాము సాధించిన విజయాల గురించి లేదా.. చేయబోయే పనుల గురించి కార్యకర్తలకు, అభిమానులకూ వివరించే వేదికలుగా ఉపయోగించుకోవడం కద్దు. అయితే ఇటీవలే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భవ సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా ఏం చెప్పదలచుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్.. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చెప్పిందేమిటి? పది నెలలుగా అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఒకరకంగా చూస్తే పవన్ మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు.
జనసేన వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బోలెడన్ని అబద్ధాలు చెప్పుకొచ్చారు. స్వోత్కర్ష, ఇతరులు పొగడం బాగానే ఉన్నా.. తన సినిమా గబ్బర్‌సింగ్‌లోని డైలాగ్ మాదిరి ఎవరి డబ్బు వారే కొట్టుకున్నట్లుగా ఈ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను దూషించడం కోసం కూడా ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. అన్నిటిలోకి కీలకమైన పాయింట్ ఒకటి మాత్రం ఉంది. నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్ ప్రకటించడం. ఇందులో కొంత వాస్తవం, మరికొంత అవాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్‌ను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సపోర్టు పొందగలిగింది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో(Pithapuram Public meeting) చేసిన వ్యాఖ్య టీడీపీ శ్రేణులలో మంట పుట్టించింది. కొందరు టీడీపీ, అభిమానులు పవన్‌ను ఎద్దేవా చేస్తూ, దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా.. ‘‘క్వింటాల్ వడ్లు తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి. కాని ఆ కొన్ని వడ్లవల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా.. సేనాధిపతి?’’ అని ఎద్దేవా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ లేదా ఆయన సోదరుడు నాగబాబు సమాధానం చెబుతారా?
👉.. అదే సమయంలో టీడీపీ(TDP) లేకుండా అసలు పవన్‌కు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ విజయం సాధించారంటే అది టీడీపీ పుణ్యమే అనే సంగతి గుర్తుంచుకోవాలని వారు చెబుతున్నారు. పవన్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదని జనసేన వారి వాదన. ఈ రకంగా ఒకరినొకరు దుయ్యబట్టుకుంటున్నా, ఇద్దరూ కలిసి సాగడానికి పెద్ద ఇబ్బంది పడడం లేదు. పవన్ కేవలం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కే కాకుండా ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌కు కూడా విధేయత కనబరుస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు వైపులా ఆత్మాభిమానం అన్నది పెద్ద సమస్య కాకపోవడం కూడా వీరికి కలసి వచ్చే పాయింట్.
👉పవన్ కళ్యాణ్ ఈ సభలో సూపర్ సిక్స్ గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని అంశాల గురించి కాని ప్రస్తావించకుండా తన గొప్ప గురించి, తన కుటుంబం గొప్ప గురించి చెబితే ఆయన అభిమానులు అమాయకంగా చప్పట్లు కొట్టవచ్చు. ప్రజలకు ఒరిగేదీ ఉండదు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎక్కాలు చదివి మరీ ప్రచారం చేశారే! వలంటీర్ల కడుపు కొట్టనంటూ, రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని కథలు చెప్పారే. నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ఇస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని అన్నారే. పవన్ కళ్యాణ్ అయితే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ.పది లక్షల చొప్పున ఇచ్చి వారందరిని అభివృద్ది చేసేస్తామని గప్పాలు కొట్టారే. వీటి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తాను గెలవడమే గొప్ప అనుకోండని అంటున్నారు.
జనసేనకు సిద్దాంత బలం ఉందని చెబుతుంటే నవ్వు వస్తుంది. ఏ సిద్దాంతం ఉందో ఎవరికి అర్థం కాదు. చెగువేరా నుంచి సనాతని వరకు రకరకాల వేషాలు మార్చి నట జీవితంలోనే కాదు.. రాజకీయ జీవితంలో కూడా బహురూపి అన్న విధంగా వ్యవహరించిన పవన్ సిద్దాంతం ఎలాగైనా అధికారంలోకి రావడమే అన్నది అర్థమవుతూనే ఉంది. పిఠాపురంలో వర్మే తనను గెలిపించాలని చేతులు పట్టుకుని అర్థించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వర్మను ఎంతలా అవమానిస్తున్నారు? నాగబాబు సభలో అంతగా వర్మను అవమానించవలసిన అవసరం ఉందా? దానిని పవన్ కూడా సమర్థిస్తున్నట్లే కదా! ఈ ఒక్కటి చాలదా! పవన్ నైజం ఏమిటో తెలుసుకోవడానికి.
సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని చెప్పి ప్రజలను మాయ చేసే యత్నం చేస్తున్నారు. అంత సనాతని అయితే తన ఇంటిలోనే అన్య మతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్నది హిందూ ధర్మవాదుల ప్రశ్న. ఒకసారి కులం లేదు.. మతం లేదు.. అంటూ గంభీర ప్రసంగాలు చేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సనాతని అంటూ కల్లబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మాలన్నమాట. నిజంగానే ధర్మం, సత్యం ఆచరించేవారైతే ఇప్పుడు కూడా నిత్యం అసత్యాలే చెబుతున్నారే? అదేనా ధర్మం చెప్పేది. తిరుమల లడ్డూ పట్ల అపచారం చేసిన పవన్ దానిని బుకాయించి నిందితులు అరెస్టు అయ్యారని అంటున్నారే. పవన్ ఆనాడు చెప్పిందేమిటి? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన పిచ్చి ఆరోపణను భుజాన వేసుకుని హడావుడి చేశారే. దానికి తోడు అయోధ్యకు కల్తీ నెయ్యి వాడిన లడ్డూలు పంపారని నింద మోపారే! లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదే! కల్తీ నెయ్యి ఉండడం వేరు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం వేరు. తగు ప్రమాణాలు లేని నెయ్యిని టీటీడీ వెనక్కి పంపించింది కదా! అయినా పవన్ అబద్దం ఆడుతున్నారంటే ఆయనకు సనాతన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు.
👉రాజకీయం కోసం ఏ వేషం అయినా కట్టవచ్చన్నది ఆయన నమ్మిన ధర్మం అన్న భావన కలగదా! దీపారాధన చేసే దీపంతో తన తండ్రి సిగెరెట్ వెలిగించుకునేవారని గతంలో చెప్పి.. ఇప్పుడు తమ ఇంటిలో అంతా రామ జపమే చేస్తారని చెబితే వినేవాళ్లను వెర్రివాళ్లను చేయడం కాదా! అసలు ఆయన తండ్రి గురించి ఎవరు అడిగారు. ఆ విషయాలతో జనానికి ఏమి సంబంధం. ఇన్నేళ్ల రాజకీయంలో తాను ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదవింది అన్న విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడారో వీడియో సహితంగా కనిపిస్తుంటాయి.
👉వైఎస్ జగన్(YS Jagan) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పనులు చేసింది, ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన మనసుకు తెలియదా! గతంలో ఉత్తరాది, దక్షిణాది అంటూ గొంతు చించుకుని అరచి మరీ మాట్లాడిన పవన్ కు సడన్ గా జ్ఞానోదయం అయిందని అనుకోవాలా? హిందీ గురించి కూడా మాట్లాడారు. దానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బదులు ఇస్తూ ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please అని కామెంట్ చేశారు. ఏపీలో ఆంగ్ల మీడియం ను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ బీజేపీ వారి మెప్పుకోసం హిందీ గాత్రం అందుకున్నారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని ఆయన ప్రశ్నించారు. నిజమే..
అసలు సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా, సినీ నటుడుగా ప్రజలను ఆకర్షించి, ఈ పదేళ్లలో అనేక మార్లు మాట మార్చి, రంగులు మార్చి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి కాగలిగిన పవన్ కళ్యాణ్ నిలిచి గెలిచారన్నంత వరకు ఓకే గాని, మిగిలినవాటిలో అసత్యాలు, అసంబద్ధ విషయాలే ఉన్నాయని చెప్పాలి. ప్రజలను ఏమార్చడం వరకు సఫలం అయ్యారని ఒప్పుకోవచ్చు. దానికి ఆయన సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి మనసు ఉప్పొంగిపోవచ్చు. చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన బాసలు మర్చిపోవడమే కాకుండా నిత్యం కలుషిత రాజకీయాలు చేస్తున్న తీరు మాత్రం మాత్రం ప్రజల మనసులను కకావికలం చేస్తుంది.
కొసమెరుపు ఏమిటంటే.. ఏ దేశమేగినా..అన్న గేయం రాసింది గురజాడ అప్పారావు అని చెప్పడం. అది రాసింది రాయప్రోలు సుబ్బారావు అన్న సంగతి వేల పుస్తకాలు చదివిన విజ్ఞాని పవన్‌కు తెలియదా? లేక ఆయన ఉపన్యాసం రాసిన వ్యక్తికి తెలియదా! శ్రీ శ్రీ నవ సమాజం కోసం రాసిన గేయాన్ని సనాతన ధర్మానికి వాడుకోవడం కూడా హైలైటే!

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment