వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా? | Special Article On Chandrababus Comments Support To Yellow Media | Sakshi
Sakshi News home page

వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?

Jun 30 2025 8:43 PM | Updated on Jul 1 2025 9:20 AM

Special Article On Chandrababus Comments Support To Yellow Media

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు.  కూటమి పెద్దల భావజాలంలో మార్పు  వచ్చి ఉంటే  సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. 

చంద్రబాబు చేసిన  ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక  టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు  పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 

👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు  ఇస్తే  ఒక రకంగాను, లేకుంటే మరో  రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే  తెలిసిపోతుంది.

👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి  గురించి కూడా  కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. 

సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? 

అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?

ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే  ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో   అదే సూత్రం  వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. 

నిత్యం సాక్షిపై లేనిపోని  ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే  స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.

👉సాక్షి డిబేట్‌లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే  అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్‌లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు  వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై  కేసులు పెట్టరా?దీనిపై  ప్రభుత్వంకాని,  పోలీసు  కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. 

హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన   తంబ్  నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్  మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు.  ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై   దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న  విమర్శలు ఉన్నాయి. 

ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు..  చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న  ప్రశ్నకు సమాధానం దొరకదు!!.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే  అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్‌ కల్యాణ్‌ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర  ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు  దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. 

కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై  దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే  కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న  ఉద్దేశంతో  ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు  ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే  ఎవరైనా నమ్ముతారా?..  

చంద్రబాబు కు  ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్‌లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై   కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో  అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు  విధించారని చెబుతున్నారు. 

ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై  ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న  సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు  భావిస్తున్నారన్నమాట.ఏపీలో  జర్నలిస్టులను   అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు  గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు  మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement