kommineni Srinivasa Rao
-
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!
దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్‌కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు.. పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు. మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?. జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?. ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?. బిల్ గేట్స్‌ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాలయ్య, జూనియర్, లోకేష్.. అంతా చంద్రబాబు మిథ్య!
‘‘అందరినీ అన్నిసార్లూ నమ్మించ లేం’’ అంటుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు అదే రుజువు అవుతోంది. దావోస్‌లో వారసత్వం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కుమారుడు, మంత్రి లోకేష్‌కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘వారసత్వం అనేది ఒక మిథ్య’’ అని, ‘‘వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను సొంతంగా దావోస్ తీసుకెళ్లిన మీడియాతో ఆయన ఈ మాట అంటున్నారంటే.. ఆ వ్యాఖ్యల మర్మం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘‘ఎవరికైనా మెరుగైన అవకాశాలు రావచ్చు. వారు వాటిని ఎలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. వ్యాపారంలో ఉండి ఉంటే లోకేష్‌కు సులభంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. ఇందులో వారసత్వం లేదు’’ అని ఆయన చెబుతున్నారు. బాగానే ఉంది కానీ దీన్ని నమ్మేదెవరు? రెండు దశాబ్దాలుగా కుమారుడిని వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబేనాయె! ఏదో మాట వరసకు వారసత్వం అన్నీ ఇవ్వదని అంటున్నా... అనేక ఇతర నేతల మాదిరిగానే లోకేష్‌కూ అదే పునాది అన్నది అందరికీ తెలిసిన విషయమే. లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొస్తారా?.. అనే ప్రశ్నకు ఆయన గతంలో చాలా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు లోకేష్‌కు ప్రజాసేవ చేయాలనుంది అని ఆయనే అంటున్నారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని ఆయన్ను పక్కకు తప్పించిన విషయం మరీ పాత విషయమైతే కాదు. ఆ తరువాతి ఏడాది జరిగిన మహానాడులో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని బట్టే లోకేష్ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైందని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు.. నగదు బదిలీ పథకాలను తన కొడుకే ఆవిష్కరించినట్లు బిల్డప్‌లు ఇవ్వడమూ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎందుకో మరి పోటీ మాత్రం చేయలేదు. అయితే టీడీపీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో లోకేష్‌కు ప్రాధాన్యత వచ్చింది. మంత్రిని చేయాలని కుటుంబం నుంచే ఒత్తిడి రావడం మొదలైంది. కాదనలేక చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రిపదవి కట్టబెట్టారు. ఇదంతా వారసత్వ రాజకీయం కాదంటే ఎవరైనా నమ్ముతారా? ఎలాంటి కష్టం, ఎదురుచూపు, నిరాశల్లేకుండా అనాయసంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవులు రావడం ఆషామాషీ ఏమీ కాదన్నది ఎవరిని అడిగినా చెబుతారు. లోకేష్‌కు ఈ పదవులు మాత్రమే కాదు... తండ్రి పేరుతో లేదంటే ఆయన తరఫున పెత్తనాలు చేసే స్థాయి కూడా వచ్చిందన్నది బహిరంగ రహస్యం. లోకేష్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు క్యూ కడితే.. బాబును కలిసి వచ్చారా? అంటూ అప్పుడప్పుడూ చంద్రబాబు కూడా వాకబు చేసేవారని చెబుతారు. 2019 శాసనసభ ఎన్నికలలో లోకేష్ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు రాజకీయాలు సరిపడవని, వ్యాపారం చేసుకోవాలని లోకేష్‌కు సూచించలేదు. బదులుగా పార్టీలో ప్రాధాన్యం మరింత పెరిగింది. పాదయాత్ర చేసి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేసి లోకేష్ సొంత గుర్తింపు కోసం ప్రయత్నించి ఉండవచ్చు. అది వేరే విషయం.2024 ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీలో కీలకంగా ఉండడం, తండ్రికి సంబంధం లేకుండా పలు హామీలు ఇచ్చారు కూడా. వారసత్వ అధికారం లేకుండానే అవన్ని చేయగలుగుతారా? రెడ్ బుక్ అంటూ కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా, అన్ని శాఖలలో జోక్యం చేసుకుంటున్నా, చంద్రబాబు కన్నా లోకేషే పవర్ పుల్ అన్న భావన ఏర్పడినా అదంతా వారసత్వం ఇచ్చిన బలమే. దానిని అడ్డుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. నిజానికి చంద్రబాబు ధైర్యంగా లోకేష్ తన వారసుడని చెప్పి ఉండవచ్చు. కానీ అలా అంటే ప్రజలలో ఏమైనా నెగిటివ్ వస్తుందేమోనని అనుమానంతో ఇలా ఫీలర్లు వదులుతూంటారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో తదుపరి టీడీపీ అధినేత లోకేష్ అన్న భావన బలపడేలా చేస్తారన్నమాట. ఎల్లో మీడియా ఈ మాటలకు రకరకాల కలరింగ్ ఇస్తూంటుంది. పని తీరు, ప్రతిభ ఆధారంగానే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న ఒక్క కారణంతో వారసుడు కాలేడని చెప్పడం చంద్రబాబు అభిప్రాయమని జాకీ మీడియా విశ్లేషణ చేసింది. అలాగైతే ఎవరు కాదంటారు. ఇంకెవరైనా ఇలాగే రాజకీయాలలోకి వస్తే ఇదే జాకీ మీడియా అడ్డమైన నీచపు రాతలు రాస్తుంటుంది. లోకేష్ సొంత ప్రతిభతో రాజకీయాలలోకి వచ్చారా? లేక వారసత్వంతో వచ్చారా అన్నది అందరికి తెలిసిన సత్యం. దీనికి ఇంత నాటకీయత పులమడం అవసరమా? అన్నదే ప్రశ్న. ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడని ప్రకటించినప్పుడు.. దాని వల్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరూ వారసులు కాకుండా తానే చక్రం తిప్పేలా ఆయన వ్యూహ రచన చేసుకున్నారని చెబుతారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరాక కొంతకాలానికి కర్షక్ పరిషత్ ఛైర్మన్‌గా ,ఇతరత్రా అధికారం చెలాయించడం ఆరంభించగలిగారు. దానికి కారణం మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే కదా! కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ నాయకుడిని, ఈ నాయకుడిని ప్రసన్నం చేసుకుని మంత్రి పొందిన చంద్రబాబుకు టీడీపీలో చేరాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారన్న విమర్శలు కూడా వచ్చేవి. 1994లో టీడీపీ మళ్లీ గెలిచిన తర్వాత రెండు కీలకమైన శాఖలు రెవెన్యూ, ఫైనాన్స్ పొందగలిగారంటే మామ అండ ఉండబట్టే కదా.. దీనిని వారసత్వం అని నేరుగా అనకపోవచ్చు. కానీ అల్లుడు గిల్లుడు అని చమత్కరిస్తుంటారు. ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి కూడా బంధుత్వమే ఉపయోగపడింది కదా! అల్లుడు తన పదవి ఎందుకు లాక్కొంటారని ఎన్టీఆర్ అమాయకంగా ఉండిపోయారు. దానిని అడ్వాంటేజ్ చేసుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తనవైపు లాక్కొని సీఎం సీటు ఎక్కుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా అదంతా కుటుంబ వ్యవహారం అనుకున్నారు. ఇందులో చంద్రబాబు కుట్ర రాజకీయాలు కూడా ఉండవచ్చు. అది వేరే విషయం. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎవరూ తనకు పోటీకి రాకుండా జాగ్రత్తపడ్డారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఈనాడు రామోజీరావు సాయంతో బయటకు గెంటేశారు. ఇది వారసత్వ గొడవ కాదా? లక్ష్మీపార్వతిని సాకుగా చూపించడంలో ఉన్న మతలబు తెలియదా! హరికృష్ణ పరిస్థితి అంతే. టీడీపీ అధ్యక్షుడిని చేస్తానని వాగ్దానం చేసి, ఆ తర్వాత తాత్కాలికంగా మంత్రిని చేసి, ఆ పదవి కూడా పోయేలా చేశారు. దాంతో హరికృష్ణ పార్టీ వీడిపోయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బాలకృష్ణతో సత్సంధాలు ఉండేలా చేసుకుని వియ్యంకుడిగా మార్చుకుని ఆయనను పూర్తిగా వారసత్వ పోటీ నుంచి తప్పించగలిగారు. ఇవన్ని రాజకీయంగా చంద్రబాబు తెలివిగానే చేశారు. తద్వారా ఎన్టీఆర్ వారసులు కాకుండా, ఇప్పుడు తన వారసుడు లోకేష్ సీఎం అయ్యేందుకు బాట వేసుకున్నారు. అందులో బాగంగానే ప్రభుత్వ ప్రచారం ప్రకటనలలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. లోకేష్ డిప్యూటి సీఎంగా ను చేయాలని తన సమక్షంలోనే టీడీపీ నేతలు డిమాండ్ చేసినా ఆయన ఏమీ మాట్లాడలేదు. మరెవరికైనా ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎదుట అనగలరా? అంటే ఆయన ఊరుకుంటారా? ఇదంతా వారసత్వం కాకపోతే ఏమిటి? చేసేది చేస్తూనే ఏమి తెలియనట్లు నటించడమే చంద్రబాబు రాజకీయం. దానికి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు. పవన్ కల్యాణ్ వైపు నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. పవన్ ఒకరకంగా ఇప్పటికే మానసికంగా సిద్దపడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాలలోకి వచ్చారు. సీఎంలు అయ్యారు. అదేదో జరగకూడని సంగతేమీ కాదు.లోకేష్ ను సీఎం పదవి ఇవ్వాలని కుటుంబపరంగా డిమాండ్ వస్తున్నదంటే అది వారసత్వం వల్ల కాక మరేమిటి? ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నది నిజం కాదా? అంతెందుకు! తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి కాబోడని, పార్టీ అధినేత కాజాలరని ఇంటకానీ, బయటకానీ చెప్పగలరా? ఉప ముఖ్యమంత్రిని చేయబోవడం లేదని ఇంతవరకు చెప్పలేదు. పైగా కూటమిలో చర్చించుకుంటామని చెప్పి పరోక్షంగా ధృవీకరించారు. అవన్ని కప్పిపుచ్చి, వారసత్వం మిథ్య అని, మరొకటని కబుర్లు చెప్పి, ఆయనేదో వారసత్వానికి వ్యతిరేకమైనట్లు, లోకేష్ ప్రజాసేవకుడు అయిపోయినట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నమే బాగోలేదు. దానినే హిపోక్రసీ అని అంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్!. దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్‌లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఇంకో హైలైట్. అయితే దావోస్ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్‌లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి. మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్‌లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. వీటిల్లో అధికమొత్తం బోగస్ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. ఇదీ చదవండి: దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్యమూడేళ్ల క్రితం జగన్ దావోస్ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్‌ను అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. జిందాల్‌ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్‌లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్‌లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. ఇదీ చదవండి: దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారుదావోస్లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Vijaysai Reddy: అందుకే గుడ్‌బై చెప్పారా?
వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి. మొత్తం 11 సీట్లు వైఎస్సార్సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు. బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది. మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి. చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు, రేవంత్‌ల స్ఫూర్తితో అలా ముందుకు..!
కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శించే భారతీయ జనతా పార్టీ హామీల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ బాటనే పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఇచ్చిన కొన్ని హామీలు కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో చేసినవి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక అవస్థలు పడుతుంటే.. బీజేపీ కూడా అదే తరహా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ప్రజలను ఆకరర్షించడానికి నానా పాట్లు పడుతోంది. కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేస్తూ చెప్పిన సంగతులు కూడా చిత్రంగానే ఉన్నాయి!. వరుస విజయాలతో ఢిల్లీలో బలంగా నాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు జాతీయ పార్టీలకు సవాల్‌గా మారింది. ఆశ్చర్యకరంగా.. పొరుగున ఉన్న పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ఈసారి గెలిస్తే అది తమ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని బీజేపీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయినప్పటికీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా బెయిల్‌పై విడుదలై పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళుతున్నారు. విద్య, వైద్యం వంటివాటిలో, సంక్షేమ స్కీముల అమలులో కేజ్రీవాల్ బలమైన ముద్ర వేసుకున్నారు. దానిని నిలబెట్టుకోవడానికి ఆప్ కృషి చేస్తుంటే, ఆ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ పలు ఆకర్షణీయమైన స్కీములతో మానిఫెస్టోని విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనది.. మహిళా సమృద్ధి యోజన. దీని ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తారట. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఒక్క ఢిల్లీకే ఈ హామీని పరిమితం చేయడమేమిటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశమంతటా అలాగే చేస్తామని చెబుతారేమో తెలియదు. ఈ హామీ కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే అనిపిస్తుంది. బీజేపీ గతంలో ఇలాంటి హామీలకు విరుద్దమని చెబుతుండేది. మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉచితాలు, రుణమాఫీల వంటి హామీలను బీజేపీ ఒప్పుకోదని పలు సభలలో బహిరంగంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల బృందం దేశ రాజకీయాలను శాసించడం ఆరంభమయ్యాక, ప్రతి రాష్ట్రంలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో పని చేయడం ఆరంభించారు. అందులోనూ దేశ రాజధాని కావడంతో ఢిల్లీకి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్కీమును అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఏడాది గడిచినా అమలు చేయలేకపోయింది. అలాగే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కాని ఆ ఊసే ఎత్తడం లేదు. బీజేపీ నేరుగా టీడీపీ, జనసేనల మానిఫెస్టోలో భాగస్వామి కాకపోయినా, ఆ ప్రణాళిక విడుదలలో భాగస్వామి అయింది. ఏపీలో ఈ హామీ అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.36 వేల కోట్లు అవసరమవుతాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయో ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇక.. ఢిల్లీలో గర్భిణులకు రూ.21 వేలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, హోళీ, దీపావళి పండగలకు ఉచితంగా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ స్కీములను కొనసాగిస్తామని కూడా ఆయన అన్నారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీలు ఇచ్చారు. రెండో విడత మరికొన్ని హామీలు ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని అందులో తెలిపారు. ఎన్నికలు జరిగే లోపు మరికొన్ని ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తారట. సిద్దాంతంతో సంబంధం లేకుండా బీజేపీ ఇలా దిగజారి పోయిందా? అనే ప్రశ్నకు జవాబు దొరకదు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు పరస్పరం దారుణమైన విమర్శలు చేసుకున్న తర్వాత, తిరిగి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే బీజేపీ విలువలు ఏమిటో అర్ధమైపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఆ పార్టీ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేశారు. ఆయనకు జాతీయ స్థాయి ఎలివేషన్ రావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఆయన పేర్కొన్న హామీలు ఎంతవరకు అమలు అవుతాయో గ్యారంటీ లేదు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసేస్తున్నామని చెప్పడం చిత్రంగానే ఉంటుంది. మహిళలకు రూ.1500 రూపాయల చొప్పున ఇచ్చే హామీని ఎందుకు అమలు చేయలేకపోయారు?. రైతు భరోసా స్కీమ్ పరిస్థితి ఏమిటి? పూర్తిగా అయినట్లు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు రూ.22 వేల కోట్ల మేర మాఫీ చేశామని చెప్పారు. కాగా ఢిల్లీలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని ప్రకటించారు. అలాగే రూ.500లకే గ్యాస్ సరఫరా చేస్తామని డిల్లీ కాంగ్రెస్ పక్షాన ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించి ఆ స్కాం అసలు పార్టనర్ ను ఓడిస్తే ఢిల్లీలో మంచిరోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ నేత కవిత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరికొందరు ఆప్ నేతలు ఈ కేసులో జైలుకు వెళ్లారు. కవిత అరెస్టును స్వాగతించిన కాంగ్రెస్, కేజ్రీవాల్ అరెస్టు అయినప్పుడు మాత్రం బీజేపీని విమర్శిస్తూ ధర్నాలు చేసింది. ఈ ద్వంద్వ వైఖరిపై ఇంతవరకు వివరణ ఇచ్చినట్లు కనిపించదు. పొత్తు కుదరలేదు కనుక లిక్కర్ స్కామ్ పార్టనర్ అని రేవంత్ చెబుతున్నారు. కేసీఆర్ టైమ్ లో ఉన్న అవినీతి నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. దీనిలో ఎంత నిజం ఉందన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కొన్ని హామీలు అమలు చేశామని చెబితే ఫర్వాలేదు కాని, అన్నింటిని చేసేసినట్లు ప్రచారం చేస్తే విమర్శలు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన హామీలలో కొత్తగా విద్యార్ధులందరికి ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే విద్యార్దినులకు ఉచిత బస్ అమలు చేస్తుండగా.. ఇకపై బాలురకు కూడా ఫ్రీ బస్ సదుపాయం అని హామీ ఇచ్చారు. విద్యార్ధులకు మెట్రో చార్జీలలో ఏభై శాతం భరిస్తామని మరో హామీ ఇచ్చారు. యువతను ఆకర్షించడానికి ఆప్ వేసిన గాలం ఇది. ఢిల్లీలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు తదితర హామీలను ఆప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్‌ను, ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక వ్యూహాలను అమలు చేసింది. అందులో భాగంగా ఈడీని కూడా ప్రయోగించిందన్న రాజకీయ విమర్శలు వచ్చాయి. మొత్తంగా.. బీజేపీ ఇన్ని వ్యూహాలు పన్నుతూ డిల్లీలో ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందన్నది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలు తేల్చుతాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారా లోకేష్ రెడ్‌బుక్ అమలులో ముఖ్య పాత్ర ఆయనదే?
ఏబీ వెంకటేశ్వరరావు.. ఐపీఎస్! పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లోకి ఎక్కిన వివాదాస్పద అధికారి. రిటైర్ అయిన తరువాత కూడా తన వ్యాఖ్యలు, వైఖరితో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్న వ్యక్తి కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ల అండతో ఆయన ఈ మధ్య కాలంలో మరింత చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఆయన తన ‘కమ్మ’ కులం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేమన్నట్టుగా ఆయన మాట్లాడటం.. తన మాటల వల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో ఆలోచించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కులం వారు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోగలరా?. కులమతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎన్నికవుతుంది కదా?. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా కమ్మ కులం వాళ్లు అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు! ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని, అహర్నిశలు కష్టపడాలని కూడా ఆయన తన కులం వారిని కోరుకున్నారు. కమ్మ వారికి ఏదో పెద్ద సందేశం ఇచ్చానని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల కమ్మ వారిపై మిగిలిన వారికి మరింత వ్యతిరేకత వస్తుంది. అసహ్యం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన లాంటి వ్యక్తులు కమ్మ కులం వారిని భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఉంది.ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్‌పై పరుష పదాలతో విమర్శించారు కూడా. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని విమర్శలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రెడ్డి, ఇతర కులాల వారిని ఏకం చేస్తున్నారని, వైఎస్ జగన్‌ను అభిమానించే బలహీన వర్గాల వారందరూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరుకు ఏబీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఆయన ఐపీఎస్ అధికారేనా? అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు వెనుక కీలక పాత్రధారి ఈయనే అన్న అనుమానమూ వస్తోంది.వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒకప్పుడు ఇంత వివాదాస్పదుడు కానేకాదు. ఇంత చెడ్డ పేరూ లేదు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాతే ఇలా తయారయ్యారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నలలో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మ వర్గం వారు ఇతర సామాజికవర్గాల దృష్టిలో విలన్ల మాదిరి కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా ఉంది.వీరి రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్డి లేదా షెడ్యూల్ కులాల వారే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంగా ఈ వర్గాల అధికారులు కొందరికి ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగల అవకాశం ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను బయటకు తీశారన్న కోపంతో ఏదో ఒక నెపం పెట్టి కొంతమంది ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, కేసు పెట్టి అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని ఏబీ వెంకటేశ్వరరావు ఫీల్ అవుతుండవచ్చు.కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషీ, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే, వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధపడాలన్న ఏబీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. హింసకు కూడా వెనుకాడవద్దని పరోక్షంగా పిలుపునిస్తున్నారా? అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్ధతి అవలంబించాలన్నది ఆయన చేస్తున్న సూచనా?. సమాజంలో కులాల కొట్లాటలు ఉంటే ఉండవచ్చు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో పనిచేసే వాళ్లు కూడా ఇంత తక్కువ స్థాయి ఆలోచనలు చేయడం, చెత్త ప్రకటనలు చేయడం ఎంత వరకూ సబబు?. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ శాంతి భద్రతల విషయాన్ని పక్కనబెట్టి రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎలా దెబ్బ తీయడమన్న విషయంపైనే దృష్టిపెట్టేవారని చాలా మంది టీడీపీ నేతలు చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవిని పొందడానికి ఏబీ వెంకటేశ్వర రావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది.వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రలోభాలు పెట్టడంలో ఏబీతో పాటు ఒక మీడియా అధినేత విశేష పాత్ర పోషించారని చెబుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయిల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ, ఆ కేసులో తాను సచ్ఛీలుడినని రుజువు చేసుకోవచ్చు. ఎటూ ప్రభుత్వం వారిదే కనుక తమకు కావల్సిన జీవోలను తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ తన వ్యాఖ్యల్లో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించారు.అయితే, వైఎస్సార్ హాయంలో ఈయనకు వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టులేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన వివరాలను బట్టి అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు కర్నూలు రేంజి డీఐజీ పోస్టు ఇచ్చింది. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడప కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా? కాదా? హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను కూడా అప్పట్లో అప్పగించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఈయనను అంతగా ప్రాధాన్యం లేని ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అయినా వైఎస్సార్‌పై ఈయన విమర్శలు చేయడం ధర్మమా? అన్నది కొందరి ప్రశ్న.ఇక్కడ మరో మాట చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి అవమానించినప్పుడు కమ్మవారికి అవమానం జరిగినట్లు కాదా?. చంద్రబాబుకో, ఏబీ వంటివారికో ఏదైనా ఇబ్బంది వస్తే, వారిపై ఆరోపణలు వస్తే కమ్మ వారందరికీ వచ్చినట్లా? ఏ కులంలో అయినా లాభం కొందరికే లభిస్తూంటుంది. సంపాదన, పెత్తనం కూడా కొందరికే దక్కుతుంది. అలాంటివారు ఆ కులంలోని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. ఏబీ కూడా సరిగ్గా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటివారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన పలు కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎంగా ఉంటే, ఆయనకు పోటీగా లోకేష్‌ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు కాపులలో కాక రేపుతోంది.జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి సమాజంలో మరింత అశాంతికి దోహదపడడం ఐపీఎస్ హోదాకే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చిన ఈయన రిటైరయ్యాక వ్యవహరిస్తున్న తీరు చూశాక, పదవి బాధ్యతలలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నారని ఎవరైనా అనుకోగలరా?. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దటీజ్ జగన్..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల మధ్య ఓ తేడా ఉంది. ఇద్దరూ పోటాపోటీగా రాష్ట్రం చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేస్తూంటారు. జరిగిన ప్రతి మంచిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూంటారు. కారణమేమిటో తెలియదు కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచిని అనివార్యంగానైనా గుర్తిస్తున్నారు. ఏదో మాటవరసకు బాబుగారిని పొగుడుతూన్నట్టు కనిపిస్తాడేగానీ పవన్ ఆంతర్యం మొత్తం గత ప్రభుత్వం తాలూకేనని తేలికగానే అర్థమైపోతుంది.పవన్ ఈ మధ్యే కర్నూలు జిల్లా పెన్నాపురం వద్ద ‘గ్రీన్ కో’ సంస్థ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్తు ప్లాంట్లను పరిశీలించారు. వెళ్లకముందు ఆ కంపెనీ అటవీ భూములను ఆక్రమించిందని, విచారించాలని అధికారులకు సూచించారు. కానీ.. ఆ తరువాత మాత్రం ప్రాజెక్టు ఒక అద్భుతమని కొనియాడారు. బహుశా వ్యతిరేక వ్యాఖ్యలు ఎల్లో మీడియా ఈ ప్రాజెక్టుపై రాసిన తప్పుడు కథనాల ఫలితం కావొచ్చు. సుమారు రూ.28 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసింది అందరికీ తెలిసిందే. అంతెందుకు అప్పట్లో టీడీపీ నేతలు కొందరు ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విమర్శలు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న కృత నిశ్చయంతో కంపెనీకి అవసరమైన వనరులను సమకూర్చారు. ఈ గ్రీన్ కో కంపెనీలో ముఖ్యుడు చలమలశెట్టి సునీల్ 2024లో వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. ఈ కారణంగా ఆ కంపెనీపై టీడీపీ, జనసేన ముఖ్యనేతలకు గుర్రుగా ఉండేది. ఆ క్రమంలోనే గ్రీన్ కో రిజర్వు ఫారెస్ట్ పరిధిలో అటవీభూముల ఆక్రమణకు పాల్పడిందని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని, అటవీశాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఆరా కూడా తీశారని ఎల్లో మీడియా ఈనాడు ఒక వార్తను రాసింది. గతంలో సునీల్‌కు ప్రజారాజ్యం, టీడీపీ పక్షాలతో కూడా అనుబంధం ఉంది. అయినా గతసారి వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేశారు కాబట్టి ఎలాగోలా ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా ప్రయత్నించింది. అందులో భాగంగానే గత మార్చిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు పత్రిక ఎంత ఘోరంగా రాసిందో చూడండి..'అస్మదీయుడికి అదిరేటి ఆఫర్" అంటూ సునీల్ కుటుంబ కంపెనీకి భారీ భూ సంతర్పణ చేశారని, అది కూడా ఎకరా రూ.ఐదు లక్షలకే అని ప్రచారం చేసింది. సుమారు 1500 ఎకరాల భూమిని పరిశ్రమకు ఇవ్వడంపై విషం కక్కింది. అక్కడ విలువ రూ.కోటి ఉంటే తక్కువ ధరకు ఇచ్చారని ఏడ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో కొంతకాలం గ్రీన్ కో పై తప్పుడు రాతలు రాసిందని చెప్పవచ్చు. ఉదాహరణకు 2024 జూలై 18 న ఒక కథనాన్ని వారి టీవీలో ప్రసారం చేస్తూ ‘అడవి తల్లికి గాయం’ అని కంపెనీని ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అదే నెలలో అంతకుముందు వారి పత్రికలో కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని దుర్మార్గంగా రాసింది. ఆ తర్వాత ఏమైందో కాని మొత్తం ప్లేట్ మార్చేసింది. వారి పత్రికలో 'జల కిరణాలు" అనే శీర్షికన ఈ ప్రాజెక్టును ఆకాశానికి ఎత్తేసింది. ఎత్తైన కొండలు, కశ్మీర్ అందాలు తలపించే లోయలు, జల హోయలు, సౌర ఫలకలు, గాలిమరలు, అబ్బుర పరుస్తున్నాయని ఇదే పత్రిక తెలిపింది. ఎండ, నీరు, గాలి ఆధారంగా చేసే విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్నారని పేర్కొంది.ఆ కంపెనీతో ఈనాడుకు లాలూచీ అయిందా? లేక బుద్ది తెచ్చుకుని వాస్తవాలు రాసే యత్నం చేసిందా? అన్న ప్రశ్నకు ఎవరు జవాబు ఇస్తారు? ఈ ప్రక్రియలో ఎక్కడా జగన్‌కు క్రెడిట్ ఇవ్వకుండా మాత్రం జాగ్రత్తపడింది. పవన్‌కు ఆ కంపెనీ వారితో ఉన్న పరిచయాలు లేదా సంబంధ బాంధవ్యాల రీత్యా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లారు. దానిని పూర్తిగా తిలకించిన తర్వాత ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమని మెచ్చుకున్నారు.ఇది పూర్తి అయితే విదేశాలకు కూడా కరెంటు అమ్మవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగాను, మరో 40 వేల మందికి పరోక్షంగాను ఉపాధి వస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ మాట విన్న తర్వాత ‘‘హమ్మయ్యా.. ఇప్పటికే ఏపీలో పలు విధ్వంసాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదలి వేసిందిలే!’’ అనే భావన ఏర్పడింది. ఇది జగన్ ప్రభుత్వ కృషి అని పవన్ ప్రశంసించకపోయినా, ప్రజలందరికి అర్థమైపోయింది. జగన్ ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు ఈ రూపు సంతరించుకుందని.. ఆ రకంగా సోషల్ మీడియాలో విస్తారంగా వీడియోలు వచ్చాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లి ఇది ప్రైవేటు స్కూలేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు, డిజిటల్ బోర్డులు అన్నిటిని గమనించిన ఆయన స్కూల్ ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అంతకుముందు లోకేష్ కూడా ఒక స్కూల్ కు వెళ్లినప్పుడు అదే అనుభవం ఎదురైంది. అంటే ప్రతిపకక్షంలో ఉన్నప్పుడు ఎంత విష ప్రచారం చేసినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తరువాతైనా జగన్ చేసిన మంచిని, అభివృద్దిని ఏదో రకంగా ఒప్పుకోక తప్పలేదు. జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలు, గ్రామ, గ్రామాన నిర్మించిన సచివాలయ భవనాలు, పోర్టులు మొదలైన వాటిని అప్పుడు ప్రజలు గుర్తించారో లేదో కాని, ఇప్పుడు కూటమి నేతలు పర్యటించినప్పుడు జనానికి అర్థమవుతున్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తన శైలిలోనే ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తన గొప్పతనమని, వైఎస్సార్సీపీ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శలు చేస్తుంటారు. దావోస్ పర్యటనలో కూడా ఏపీలో నిర్మాణం చేస్తున్న పది ఓడరేవుల గురించి చంద్రబాబు చెప్పక తప్పలేదు. అవన్నీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నారన్నది తెలిసిన సంగతే. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ హరిత ఇంధన హబ్ గా అవుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకుంటే చెప్పుకున్నారు కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. జగన్ తన హయాంలో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలోకి తీసుకు వచ్చారు. అప్పుడేమో ఎల్లో మీడియా ‘అదానీ వంటి కంపెనీలకు ఏపీని రాసిచ్చేస్తున్నారు’ అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేసింది. భూములను లీజుకు ఇప్పించడాన్ని కూడా తప్పు పట్టింది. ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తోంది. మరి దీనిని ఏమనాలి?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుతోందా? టీడీపీ వర్గాల్లో కొందరు మంత్రి లోకేష్ భావి సీఎం అంటుంటే.. డిప్యూటీ సీఎం అని మరికొందరు వ్యాఖ్యలు చేయడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా.. ఇప్పటివరకూ కూటమి భాగస్వామి, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోదాకు భంగం కలిగినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీతో కొనసాగితే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నేతను అడ్డుకునేందుకే టీడీపీ లోకేష్‌ను తెరపైకి తెచ్చిందన్న ఆలోచన కూడా జనసేనలో ఉన్నట్లు చెబుతున్నారు.తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పదోన్నతిపై దావోస్ పర్యటన సందర్భంగా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే చాలని టీడీపీ నేతలు పలువురు బహిరంగంగా కోరుతూంటే.. వీలైనంత తొందరగా సీఎంను చేయాలని చంద్రబాబు నాయుడిపై ఆయన కుటుంబం నుంచే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ చాలా స్పష్టంగా భావి ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రకటించగా టీడీపీ నేతలు మాత్రం ఏదైనా ఉంటే కూటమి పక్షాలతో కలిసి మాట్లాడుకుంటామని అంటున్నారు. భరత్ ప్రకటన ఏదో మొక్కుబడి వ్యవహారమని అంటున్నారే కానీ.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రతిపాదన ఏదీ లేదని మాత్రం వారు ఖండించకపోవడం గమనార్హం.కొద్దికాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ మరో పదేళ్లపాటు చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. లోకేష్‌కు చెక్ పెట్టేందుకు ఆయన ఆ మాట మాట్లాడారా? లేక చంద్రబాబే కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పవన్ చేత అలా మాట్లాడించారా? అన్నది చెప్పలేము. ఎందుకంటే.. సీఎం పదవిని ఇప్పుడిప్పుడే వదులుకునే ఆలోచన బాబు చేయరు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే జనసేన నుంచి సమస్యలు రావచ్చునని కూడా బాబుకు తెలుసు. అందుకే ఆయన మధ్యే మార్గంగా ప్రస్తుతానికి లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఈ ప్రతిపాదనకు లోకేష్ మద్దతుదారులు, బాబుగారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.నారా లోకేష్‌కు పదోన్నతిపై ప్రచారం మొదలుపెట్టడం ఒక రకంగా రాజకీయ వ్యూహం. ఇతరుల ద్వారా కొన్ని అంశాలను ప్రచారంలో పెట్టడం.. వ్యతిరేకించే వారిని మానసికంగా సిద్ధం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. అంగీకరించేవారు ఉండవచ్చు లేనివారు వారి దోవన వారు వెళ్లవచ్చునని సంకేతం ఇవ్వడం కూడా. ఇలాంటి విషయాలలో చంద్రబాబుది ఘనాపాటే. గతంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేయడానికి ముందు కూడా ఇలాంటి వ్యూహాన్నే ఆయన అమలు చేశారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై దుష్ప్రచారం చేయించడం, ఆమె పెత్తనం పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టమంటూ వంత మీడియా ఈనాడులో కథనాలు రాయించడం చేసేవారు. ఆ టైమ్‌లోనే అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్మీపార్వతిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.దీంతో, చంద్రబాబు వర్గం ఈ పాయింట్‌ను అడ్డం పెట్టుకుని కథ నడిపింది. అదే జరిగితే మీ పరిస్థితి ఏమిటన్న ఆందోళనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కల్పించడంతోపాటు వారిని తనవైపు తిప్పుకునేందుకు వరాల జల్లు కురిపించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ చూపారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణకు ఎరవేశారు. మొత్తమ్మీద ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేశారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే వర్గపోరు వస్తుందని, కుటుంబ పెత్తనం అంటారని ప్రచారం చేయించారు. దగ్గుబాటికి డిప్యూటీ సీఎం, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి రెండూ దక్కకుండా చూశారు. హరికృష్ణకు మంత్రి పదవి మాత్రమే విదిల్చారు.అయితే మంత్రి పదవి వచ్చేటప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆరునెలల్లోపు ఎన్నికై ఉంటే పదవి దక్కేది కానీ.. కాలేకపోయారు. దీంతో మంత్రి పదవి కూడా పోయింది. తరువాతి కాలంలో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాబు మార్కు రాజకీయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గాన్ని నడిపిన చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వర్గాలను సహించనంటూ హెచ్చరికలు చేస్తుండే వారు. ఇప్పటికీ అదే తరహా రాజకీయం చేస్తున్నారు. నిజంగానే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే, ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలను వారించే వారు. కానీ, పార్టీ నేత శ్రీనివాసరెడ్డి ఆయన సమక్షంలోనే లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, ఎన్నికలలో చాలా కష్టపడ్డారని, అందువల్ల ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబు దీన్ని వారించలేదు.ఇదే సమయంలో మరికొందరు టీడీపీ నేతలు దాన్ని ఒక డిమాండ్‌గా మార్చారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ లోకేష్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం కూడా గమనించాలి. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవని తేలుతుంది. లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్లవుతుందని తెలిసినా కూడా వీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే అందులో మతలబు అర్థమవుతూనే ఉంది.మరోవైపు లోకేష్ కూడా తన పార్టీ నేతల ప్రకటనలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అతిగా వ్యవహరిస్తున్నారన్న భావనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండవచ్చు. లోకేష్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ప్రచ్ఛన్న పోటీకి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ ఇరువురి మధ్య సంబంధాలు గొప్పగా ఏమీ లేవని స్పష్టం చేశాయి. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ చెబితే లోకేష్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తోసిపుచ్చడం.. ఎన్నికలకు ముందు కూడా సీఎం పదవిని జనసేన అధినేతతో పంచుకోవాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చడం మచ్చుకు రెండు ఉదాహరణలు.ఎన్నికల్లో పొత్తు కావాలని టీడీపీ కోరుకుంటూంటే జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలని తమకు పాతికి సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ మాట అనేందుకు కూడా జంకారు. ఇలాంటి షరతులే పెట్టి ఉంటే రాజకీయం ఇంకోలా ఉండేది. పవన్ కళ్యాణ్, బీజేపీలకు కూటమిలో ఎంతో కొంత పట్టు దొరికేది. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు సమానం అనుకుని పవన్ మాట్లాడేవారు. కొంతకాలం అలాగే నడిచింది. చంద్రబాబు కూడా పవన్‌ను అదే భ్రమలో ఉంచుతూ వచ్చారు. కానీ, కాలం మారుతుంది కదా.. ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో సమానంగా పవన్ ఎలా ఉంటారన్న ప్రశ్న టీడీపీలో వచ్చింది.ఇక, సీఎం పదవి లోకేష్‌కు ఇవ్వాలన్న వాదన కూడా వస్తుండడంతో లాభం లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయనను తీసుకురావడానికి వ్యూహరచన మొదలైంది. అందులో భాగంగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చెరో వైపు పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బొమ్మలు కూడా ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ముద్రించారు. నిబంధనలకు విరుద్ధమైనా లోకేష్ ఫోటో వేయడం చంద్రబాబు మనసులో మాటను చెప్పడమే అవుతుంది. ఆ తర్వాత స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ ప్రకటనలో కూడా పవన్, లోకేష్‌ల ఫోటోలు వేశారు. దీని ద్వారా పవన్‌కు స్పష్టమైన సందేశం పంపించారు. తద్వారా చంద్రబాబుతో సమానం అనుకుంటున్న పవన్ స్థాయిని సక్సెస్ ఫుల్‌గా తగ్గించారు. ఇక లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే, పూర్తి ఆధిపత్యం వచ్చేసినట్లే అవుతుంది. తనకు సీఎం పదవి రాకుండా అడ్డుకుంటున్న పవన్‌కు చెక్ పెట్టినట్లు కూడా ఉంటుంది.ఈ వ్యవహారంలో బీజేపీ నేరుగా వేలు పెట్టకుండా వేచి చూస్తోంది. తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగా లేవనెత్తడం గమనార్హం. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, నేతలు పవన్‌ను ముఖ్యమంత్రిని చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల వారు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎవరి వల్ల ఎవరు పవర్లోకి వచ్చారన్నదానిపై చర్చిస్తున్నారు. అది శ్రుతి మించి బూతులు తిట్టుకునే దశకు వెళ్లారు. అయినా పవన్, లోకేష్‌లు నోరు విప్పలేదు. ఇది పవన్, లోకేష్‌ల మధ్య రాజకీయ వార్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం కాపులు ఎక్కువ మంది ఉన్నచోట పోటీచేసి గెలిచారని, లోకేష్ మాత్రం ఇటీవలి కాలంలో ఎన్నడూ గెలవని మంగళగిరి నుంచి విజయం సాధించారని, పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే ఎక్కువ అని టీడీపీ అభిమాని ఒకరు పోస్టు పెట్టారు. పవన్ లేకపోతే టీడీపీకి అధికారం ఎక్కడ వచ్చేది.. ఇలాగే చేయండి. మళ్లీ జగన్ సీఎం అవుతారు.. అప్పుడు మీ సంగతి చూస్తారు.. అంటూ కొన్ని అభ్యంతర పదాలతో జనసేన కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు.ఇలా ఇరువైపులా పలువురు విమర్శలు, తిట్ల పురాణం సాగిస్తున్నారు. చంద్రబాబుకు వయసు పెద్దదైందని, అందువల్ల పవన్‌ను సీఎంగా చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని జనసేన వారు కోరుతున్నారు. విశేషం ఏమిటంటే చంద్రబాబుకు వయసు మళ్లిందని జనసేన అంటుంటే, దానిని టీడీపీ వారు కూడా ధృవీకరిస్తున్నట్లుగా మాట్లాడుతూ లోకేష్‌ను సీఎం చేయాలని చెబుతున్నారు. మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అన్నారంటే అర్ధం అదే అన్న భావన కలుగుతుంది. లోకేష్, పవన్‌ల మధ్య సాగుతున్న ఈ గొడవతో చంద్రబాబు నిస్సహాయంగా మిగిలిపోతున్నట్లుగా ఉంది. అటు కొడుకు ఇటు పవన్ కళ్యాణ్ అయిపోయారు మరి. దానికితోడు ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వివిధ వ్యాఖ్యలలో అసంబద్ధత ఎక్కువగా ఉంటుండటంతో అంతా వయసును గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఒప్పందం అని, దానిని ఎలా కాదంటారన్నది జనసేన బాధగా ఉంది. కానీ అధికారం రుచి చూసిన పవన్ కళ్యాణ్ అవమానాలనైనా భరిస్తారు కానీ ఇప్పటికైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతారన్నది ఎక్కువమంది భావన. నిజంగానే లోకేష్ ఈ టర్మ్‌లోనే ముఖ్యమంత్రి అయితే పవన్ తగ్గి ఉంటారా? లేక ఎదిరిస్తారా? అన్నది అప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవడానికి రంగం సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం వంటి డైలాగుల జోలికి వెళ్లకుండా సర్దుకుపోక తప్పదేమో!. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా?
‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్టుమార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్ మార్టమ్ తప్పదు. ఒకరిని చంపితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ వ్యక్తిని కూడా చంపుతారు. సూపర్ సిక్స్ హామీలను ప్రచారం చేసింది కార్యకర్తలే. బ్యూరోక్రసి కాదు. కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ప్రకటన ఇది. చాలా ప్రమాదకరమైన, బాబు వయసు, హోదాలు రెండింటికీ తగని ప్రకటన ఇది.రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదని, శాంతి భద్రతల పరిరక్షణ ఏకపక్షంగానే కొనసాగనుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్లు ఉంది. ఒకప్పుడు మాజీ మంత్రి పరిటాల రవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఇలాంటి ప్రకటనే ఒకటి చేశారు. కొంతకాలం తీవ్రవాదిగా ఉండి ఆ తరువాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన పరిటాల రవి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీయార్ కేబినెట్లో మంత్రి అయిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతలకు, ప్రత్యర్థి వర్గాలకు రవి అంటే హడల్! తాడిపత్రి కేంద్రంగా రాజకీయం నడుపుతున్న జేసీ సోదరులకు, రవికి అస్సలు పడేది కూడా కాదు. పెనుకొండ ప్రాంతంలో పరిటాల రవి, ఆయన ప్రత్యర్ది మద్దెలచెరువు సూరి వర్గానికి మధ్య పెద్ద ఎత్తున వర్గపోరు నడుస్తూండేది.ఇందులో ఇరుపక్షాల్లోనూ చాలామంది హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చివరకు రవి కూడా అనంతపురంలో టీడీపీ ఆఫీసు వద్ద జరిగిన కాల్పుల్లో హతమైన వైనమూ తెలిసిందే. ఫ్యాక్షన్ గొడవలపై ఒకసారి ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది.. ‘‘నాకు తెలుసన్నా.. ఎప్పటికైనా బల్ల ఎక్కాల్సిందే’’ అన్నారాయన. బల్ల ఎక్కడమేమిటి? అంటే.. ‘‘పోస్టమార్టమ్ టేబుల్’ అని సమాధానమిచ్చారు ఆయన. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. జేసీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తాడిపత్రి మున్సిపాలిటీ కాస్తా టీడీపీ తేలికగా స్వాధీనం చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాజాగా ‘పోస్ట్ మార్టమ్’ మాట ఎత్తడానికి ప్రాముఖ్యత ఏర్పడుతోంది. రాయలసీమలోనే కాకుండా.. రాష్ట్రమంతా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని చెబుతున్నట్లుగా ఉందీ మాటలు వింటే. మంత్రి లోకేశ్ ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో బాబు ఇలా మాట్లాడటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ను లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో అదంత తేలిక కాదు కానీ.. 74 ఏళ్ల వయసులో, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి కేవలం తన కుమారుడికి అధికారం కట్టబెట్టేందుకు ఇంత దారుణంగా మాట్లాడతారా? అన్న విమర్శలు వస్తున్నాయి.2014లో కూడా చంద్రబాబు అధికారంలోకి రాగానే, తమ పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పారు. కానీ 2019లో జగన్ అధికారం చేపట్టిన తరువాత పార్టీలకు, కులమతాలకు అతీతంగా పాలన సాగించాలని అధికారులకు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎలాగైతేనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించారు. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లను దగ్దం చేయడం, హత్యలకు పాల్పడడం, వేధింపులు మొదలైన చర్యలతో రాజకీయ పాలన దుర్మార్గం మొత్తాన్ని ప్రదర్శించారు.ఇదీ చదవండి: బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?అయినా చంద్రబాబుకు తృప్తి కలిగినట్లు లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టుమార్టమ్ పాలన అంటున్నారు. ఎంత దారుణం! చంద్రబాబు తన పార్టీవారికి అక్రమాలకు లైసెన్స్ ఇచ్చేశారు. అందువల్లే ఇలాంటి ఘోర కృత్యాలు జరుగుతున్నట్లు ఇప్పుడు తేటతెల్లమవుతోంది. చంద్రబాబు గతంలోనూ రాయలసీమలో ఒకపక్క ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఇంకోపక్క వాటిని అదుపు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూండేవారు. ఈ సారి మాత్రం నేరుగానే సూచనలిస్తున్నారు. అందుకే టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పాలన పడకేసింది. అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని అనేక మంది చెబుతున్నారు.ఈ మద్య ఏపీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికర పరిశీలన చేశారు. 'చంద్రబాబు పాలన ఇంత వీక్ గా ఉంటుందని ఊహించలేదు. ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరింది" అని ఆయన అన్నారు. అది నిజమేనని పలు ఉదంతాలు తెలియచేస్తున్నాయి. అధికారంలోకి రాగానే వైసీపీ వారిపై దాడులు చేయడమే కాదు.. యూనివర్భిటీలపై టీడీపీ చెందిన అసాంఘిక శక్తులు దాడులు చేసి వైస్ చాన్సలర్ లను దూషించి వారితో రాజీనామాలు చేయించి కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆ తర్వాత ప్రభుత్వపరంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక దోపిడీకి గేట్లు ఎత్తివేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను ఊదేశారు.తదుపరి రాష్ట్రవ్యాప్తంగా మద్యం కొత్త పాలసీని తెచ్చి పార్టీవారే షాపులన్నీ పొందేలా చేశారు.వేరే ఎవరైనా షాపులు ఒందితే అందులో బలవంతంగా 30 శాతం వాటాను, టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు లాక్కున్నారు. యథేచ్ఛగా బెల్ట్ షాపులు పెట్టుకునేందుకు గ్రామాల్లో వేలంపాటలు జరిగే స్థాయికి పరిస్థితి వెళ్లింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన కోడిపందాలు, గుండాట, జూదం ,బెట్టింగ్ వంటివాటిని కూడా టీడీపీ నేతలే నిర్వహించుకున్నారు. ఈ వ్యవహారంలో కొన్నిచోట్ల జనసేన, టీడీపీ బాహాబాహీకి దిగడం, కొన్ని చోట్ల ఘర్షణలు జరగడం ఇటీవలి పరిణామాలే.మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటివి విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల టీడీపీ వారే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, అరాచకాలపై టీడీపీ జాకీ మీడియాలోనే కథనాలు వచ్చాయి. వీటన్నింటిని అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి ఒకటి అర మాటలతో వదిలిపెట్టడమే కాకుండా.. ఇప్పుడు నేరుగా ఆయనే పోస్ట్‌మార్టమ్ మాటలు మాట్లాడుతున్నారు.ఇలా మాట్లాడితే టీడీపీ వాళ్లు పెట్రేగిపోరా? ఈ రాజకీయ పాలన ద్వారా ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహం కావచ్చు కానీ.. చరిత్ర అలా ఉండదు. ఆయన చెప్పిన సిద్ధాంతాన్నే ఎదుటి పార్టీలు, ప్రత్యర్ధులు కూడా పాటించే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్నా, లేకపోయినా ఇలాంటివాటిని ప్రోత్సహించకూడదు. వచ్చేసారి ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే అప్పుడు ఆ పార్టీ వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవాలి. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొట్టారు కదా అని టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతే వారికే నష్టం. ఎల్లకాలం తమకు విధేయులుగా ఉంచుకోవాలనే ఫ్యూడల్ ధోరణిలో చంద్రబాబు మాట్లాడారనిపిస్తుంది. ఇది రాజకీయపాలనగా ఉండదు. రాక్షస పాలన మాత్రమే అవుతుందన్న సంగతి గుర్తిస్తే మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాట్సాప్ పాలన.. అలాంటి విజన్ కాదుగా!
ఎప్పటికి ఎయ్యేది ప్రస్తుతమో అప్పటికి.. ప్రజలను మాయ చేయడమనేది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిత్యకృత్యంలా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు తయారు చేసి ప్రజలపైకి వదులుతూంటారు ఈయన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆత్మ పరిశీలనను ఏమాత్రం చేసుకోరు. సరికదా.. తాను చేసిందే రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తూంటారు. ఏ రోజుకు ఆ రోజు మీడియాలో కనిపించామా లేదా? అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుంది. ఇలా బాబు గారి బుర్రకు తట్టిన సరికొత్త నినాదం ‘వాట్సప్ పాలన’!!!. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మాల చెంతకు చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిది నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచి మరీ ఈ వ్యవస్థకు మంగళం పాడేశారు. ఇప్పుడు కొత్తగా వాట్సప్ పాలన రాగం అందుకున్నారు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు గారు గతంలోనూ ఇలాంటి గిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటారు ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటారు. జన్మభూమి కమిటీలతో పాలన అని రకరకాల పేర్లతో ప్రజల్లో ఏదో ఒక భ్రమ నిత్యం ఉండేలా చూస్తారన్నది తెలిసిందే. వాట్సప్ పాలన కూడా ఇదే కోవకు చెందిందా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? లేక బాబుగారి ప్రచార ఆర్భాటాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందా?.... వాట్సప్ పాలన ఆలోచన నిజాయితీతో కూడినదైతే తప్పు లేకపోవచ్చు. అయితే కొంచెం తరచి చూస్తే దీని లక్ష్యం ఇంకోటి ఏదో అని అనిపించకమానదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, గౌరవ వేతనాన్ని రూ.ఐదు నుంచి రూ.పది వేలకు పెంచుతామని చంద్రబాబు గత ఏడాది ఉగాది పర్వదినం రోజున దైవసాక్షిగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనికి ‘ఊ’ కొట్టారు. పెంచిన జీతం పక్కా అని ఊదరగొట్టారు. కానీ పాత లక్షణాలు అంత తొందరగా పోవంటారు. మాట ఇచ్చి తప్పడమనే బాబుగారి పాత లక్షణం కూడా మాసిపోలేదు. ఎన్నికలయ్యాక యథా ప్రకారం క్రమ పద్ధతిలో వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బాబు ఒకడుగు ముందుకేసి ‘‘వలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది?’’ అని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థే లేనప్పుడు జీతాలు ఇస్తామని వీరు అమానవీయ ప్రకటనలు చేశారు. అప్పటికి గాని వలంటీర్లకు చంద్రబాబు, పవన్ అసలు స్వరూపం తెలియరాలేదు. రెండు లక్షల మంది వరకూ ఉన్న వలంటీర్లకు ఉన్న కాస్తా అదరువు కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందాల్సిన సేవలూ నిలిచిపోయాయి. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వ్యాధి నియంత్రణకు ఈ వ్యవస్థ చేసిన కృషిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. గ్రామాల్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా వలంటీర్‌కు చెబితే చాలు అన్నీ జరిగిపోతాయన్న భరోసా ఉండేది. కులం, నివాస, ఆదాయం.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా గంటల వ్వవధిలో ఇంటికి చేర్చేవారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇళ్ల వద్దే వృద్దులకు ఫించన్లు అందచేసేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ప్రజల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్ పాలన ఆలోచన!. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను వాట్పప్ ద్వారా అందివ్వాలన్నది ఈ వాట్సప్ పాలన ప్రాథమిక ఆలోచన. దీంతోపాటే మరో 150 రకాల ప్రభుత్వ సేవలూ అందిస్తామని చెబుతున్నారు. బాగానే ఉంది కానీ.. అంత సులువుగా అంతా జరిగిపోతుందా? ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా? ప్రజలు వాట్సప్ ద్వారా తమ అవసరాలు తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? వాట్సప్‌లో నకిలీ సర్టిఫికెట్లు వస్తే ఏమి చేయాలి? ఎవరైనా వాట్పప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? అనేది చూడాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీనిని ప్లాన్ చేసి ఉండవచ్చు. ఇది డైవర్షన్ టాక్టిస్లలో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి కూడా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంది. గతంలో సుపరిపాలన ,కంప్యూటర్ పాలన అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. కాని అవేవీ ప్రజలకు సంతృప్తి కలిగించలేదు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి ప్రతి పనికి ఏభై శాతం వాటా చెల్లించాలని కండిషన్ పెట్టేవారు. ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆయనను దించేసి ప్రజల వద్దకు ప్రభుత్వం అంటూ కొంతకాలం హడావుడి చేశారు. అవన్ని ఆయన తన పబ్లిసిటీ కోసమే వాడుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయం. తత్ఫలితంగా 2004లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014 టరమ్‌లో జన్మభూమి కమిటీల పాలన చేశారు. అది ప్రజలను మరింతగా వేధించింది. దాంతో 2019లో మళ్లీ పరాజయం చెందారు. ఈసారి వాట్సప్ పాలన. ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందో?. ఇక.. మరోవైపు ప్రతి కుటుంబం నలుగురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లే అని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. నిజంగానే 400 ఎకరాలు ఉన్నట్లే అయితే చంద్రబాబు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే తమ కుటుంబంలో ఎందరు పిల్లలు ఉండాలన్నది డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు ముందుగా తన కుటుంబం, బంధు మిత్రులు, తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ నలుగురు పిల్లల సిద్ధాంతం చెప్పి ఆచరింపచేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల వారు నలుగురు పిల్లలు ఉన్నా బాగానే పోషించుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో వారేమో ఒక్కరు లేదా ఇద్దరికి పరిమితం అవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటే ఎవరు పోషిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే అధిక సంతానం ఉన్న పేద కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో అందరికి తెలుసు. చంద్రబాబును నమ్మి పిల్లలను కంటే కొంప మునుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇంటిలో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎందరు ఉంటే వారందరికి రూ.15 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని టీడీపీ, జనసేన జాయింట్ మేనిఫెస్టోలో ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదికి తల్లికి వందనం స్కీమ్‌కు ఎగనామం పెట్టారు.అలాగే మహిళలు చంద్రబాబును నమ్మెదెలా? అనే మరో చర్చ నడుస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పోనీ యువత అయినా విశ్వసిస్తారా? అంటే అదీ కనబడడం లేదు. నిరుద్యోగులపై యువకులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసి తుస్సుమనిపించారు. ఎప్పుడు ఈ స్కీములు అమలు అవుతాయో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు లేదా అంతకుమించి పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత నిబంధన తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరికైనా పిల్లలు కలగకపోతే వారు స్థానిక ఎన్నికలకు అర్హులు కారని ప్రభుత్వం చెబితే దారుణంగా ఉంటుంది. అది కేవలం స్థానిక ఎన్నికలకే ఎందుకు? ముందుగా శాసనసభ ఎన్నికలలో నిబంధన పెట్టేలా కేంద్రానికి చెప్పి చేయించవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనడం కరెక్టా ? కాదా? అన్నది ప్రశ్న కాదు. నిజంగానే ప్రతి కుటుంబం అలా చేస్తే ప్రత్యేకించి, పేద, మధ్య తరగతి కుటుంబాలు వారందరికి సరైన విద్య చెప్పించగలుగుతాయా? వైద్యం అందించగలుగుతాయా? ప్రభుత్వాలు వారందరికి ఉపాధి అవకాశాలు చూపగలుగుతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ, వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ సిక్స్ వంటివాటిని జనం మర్చిపోతారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతా బాగానే ఉందా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉండి, చివరికి తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణించినా... ప్రభుత్వం, టీటీడీ పెద్దలు అదేదో చాలా చిన్న అంశమైనట్లు వ్యవహరిస్తున్నారా? టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి తమ మధ్య విభేదాలు లేవు.. కలసి పని చేస్తున్నామని చెబితే జనం నమ్మాల్సిందేనా?.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు బీఆర్ నాయుడు ఇతర ఉన్నతాధికారులంతా ఎవరిని మోసం చేస్తున్నారు?. ప్రజలనే కాదు.. తమను తాము మోసం చేసుకుంటూ తిరుమలేశుడిని కూడా మోసం చేయడం కాదా!. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు సూక్తి ముక్తావళి చెబుతున్నారు. తిరుమల లడ్డూ ఉదంతం నుంచి వరసగా జరుగుతున్న అనేక సంఘటనలలో అపచారానికి పాల్పడుతున్నది ఎవరు?. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నది ఎవరు?. కచ్చితంగా చంద్రబాబు, పవన్‌తో పాటు బీఆర్ నాయుడు కూడా బాధ్యత వహించవలసిందే. 👉బీఆర్ నాయుడు(BR Naidu)కు నిజంగా హిందూ సెంటిమెంట్, దైవభక్తి ఉంటే పదవి నుంచి తప్పుకుని దైవ సన్నిధిలో క్షమాపణ కోరి ఉండాల్సింది. ఒకవేళ రాజీనామాకు మొండికేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి నుంచి తొలగించి ఉండాలి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు, టీటీడీ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఉప ముఖ్యమంత్రి పవన్ తిరుపతిలో సనాతన హైందవ ధర్మం సక్రమంగా నడవడం లేదని, తిరుమల పుణ్యక్షేత్రానికి అపచారం జరిగిందని ప్రకటించి కూటమి నుంచి వైదొలగి ఉండాల్సింది. బీజేపీ హిందూ మతానికి తానే ప్రతినిధి అన్నట్లు నటించడం కాకుండా, తాము ఈ పాపానికి బాధ్యత తీసుకోలేమని ప్రకటించి ఉండాలి. వీరెవ్వరూ ఆ పని చేయలేదు. క్షమాపణల డ్రామా నడిపి, ఛైర్మన్, ఇద్దరు ఉన్నతాధికారులను బలవంతంగా కూర్చోబెట్టి అతా బాగున్నట్లు కలరింగ్ ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేశారు. దీంతో మరణించినవారి ప్రాణాలు తిరిగి వచ్చేసినంతగా పిక్చర్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇదంతా చంద్రబాబు స్టైలే. పైకి సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తూ, లోపల మాత్రం తుతు మంత్రంగా కథ నడిపిస్తుంటారు. ఇలాంటి తొక్కిసలాటలు(Stampede) జరిగితే పదవుల నుంచి తప్పుకోవడం అనేది నైతిక బాధ్యత. అలా విలువలు పాటిస్తారనుకోవడం అత్యాశే కావచ్చు!. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట వల్ల 29 మంది మరణిస్తేనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ నాయుడు పదవి ఎందుకు వదలుకుంటారు?. పుష్కరాల తొక్కిసలాట కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే అది తన వరకు వస్తుందని భయపడ్డ చంద్రబాబు ఒక్కరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. తిరుపతి ఘటనలో కూడా ఒక ఐదుగురు చిన్న స్థాయి అధికారులపై చర్య చేపట్టి, తనకు కావల్సిన అధికారి ఒక్కరిని మాత్రం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ డ్రామాలో పవన్ తన వంతు పాత్ర పోషించి రక్తి కట్టించారు. కాకపోతే మధ్యలో బీఆర్ నాయుడు చేతిలో పరువు పోగొట్టుకున్నారు. బీఆర్ నాయుడుతో సహా అధికారులంతా అంతా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని టీటీడీ చైర్మన్ మాత్రం పవన్ ఎవరు తనకు చెప్పడానికి అని తీసిపారేశారు. చివరికి ముఖ్యమంత్రి ఒత్తిడితో క్షమాపణ చెప్పినా పవన్ మాత్రం ఏ మాత్రం ఫీల్ కాకుండా సరిపెట్టుకున్నారు. బీఆర్ నాయుడి దెబ్బకు భయపడి ఆయన ఇతర అధికారుల జోలికి వెళ్లలేదు. ఇక చంద్రబాబు ఎదుటే బీఆర్ నాయుడు, శ్యామలరావులు ఘర్షణ పడ్డారు. దీన్ని తెలుగుదేశం జాకీ మీడియానే ప్రముఖంగా వార్త ఇచ్చింది. ‘నువ్వంటే.. నవ్వు...’ అనుకున్నారని కూడా రాశారు. అసలు తమకు ఏమీ చెప్పడం లేదని చైర్మన్ అంటే.. తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నానని ఈవో అన్నారు. మధ్యలో రెవెన్యూ మంత్రి జోక్యం చేసుకోవడం, చంద్రబాబు వారించడం వంటి సన్నివేశాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ రోజున వీరెవరూ ఖండించలేదు. కానీ.. తదుపరి బి.ఆర్.నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరిలు ఏమీ తెలియనట్లు నటించారు. ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెబితే అది వేరే సంగతి. కాని అసలు గొడవలే లేవన్నట్లుగా మాట్లాడి ఎవరిని ఫూల్స్‌ను చేస్తారు?. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నాయుడు అనడం మరీ విడ్డూరం. కొద్ది నెలలుగా ఈ అపచారానికి పాల్పడుతున్నది కూటమి పెద్దలు కాదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని అబద్దం చెప్పడం అపచారం కాదా? అలాంటిది ఏమీ లేదని శ్యామలరావు తొలుత చెప్పగా, ఆయనతో మాట మార్పించ లేదా? అది అప్రతిష్ట కాదా? ఆ మీదట పవన్ రెచ్చిపోయి సనాతని అంటూ వేషం కట్టి మరింత పరువు తీయలేదా? ఐదేళ్లుగా అసలు తిరుమలనే దర్శించని బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవికి నియమించడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? ఇప్పుడు లోకేష్ మనిషిగా ఉన్నందున బీఆర్ నాయుడును కనీసం పదవి నుంచి తప్పుకో అని చెప్పలేకపోతున్న చంద్రబాబు నిస్సహాయత వల్ల ఇమేజీ దెబ్బతినడం లేదా? జరగని కల్తీకి సంప్రోక్షణ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు మరణిస్తే ఎందుకు అలా ప్రత్యేక పూజలు చేయించలేదు? ఇది అపచారం కాదా? ఈ ఘటన కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని అంకెలతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా అబ్బే అదేమీ లేదని బుకాయించడం అవసరమా?. టీటీడీ బోర్డులో ఛైర్మన్‌తో సహా పలువురు బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావుపై ధ్వజమెత్తడం అసత్యమా? ఆయన గుడికి వెళ్తే ఇతర అధికారులు సైతం పలకరించడానికి భయపడ్డారట!. అది ఎందుకు జరిగింది అంటే ఆయనకంటే వెంకయ్య చౌదరే పవర్ ఫుల్ అనే భావం కాదా? టీటీడీలో టెక్నాలజీని వాడుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా క్రౌడ్, క్యూలైన్ మేనేజ్ మెంట్ గురించి గూగుల్ అధికారితో సలహాలు తీసుకున్నామని వెంకయ్య చెబుతున్నారు. అది నిజమైతే ఆ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారు?. పెద్ద ఘనకార్యం చేయబోతున్నట్లుగా చెప్పేవారు కదా?. ఇక.. అధికారిక సమావేశంలో కూడా కొందరు అనధికారులను ఎలా కూర్చోబెట్టారు.లక్ష్మణ్ అనే వ్యక్తి లోకేష్ సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన, మరికొందరు తిరుమలలో పెత్తనం చేస్తున్న వార్తలను ఎందుకు ఖండించలేకపోయారు? తిరుపతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు చెప్పినట్లుగానే టీటీడీ అధికారులు వ్యవహరించారని, ఒక డీఎస్పీ వల్ల తొక్కిసలాట జరిగిందని శ్యామలరావు అంటున్నారు. అంటే టీటీడీ అధికారుల తప్పు లేకపోయినా ఒక మహిళా జేఈవో పై చంద్రబాబు ఎందుకు చర్య తీసుకున్నారు?. ఎస్పీపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు? ఇవన్ని పక్షపాతంతో చేసిన నిర్ణయాలుగానే కనిపిస్తాయి. ఇదేనా దైవభక్తి ఉన్నవారు చేసేది?. గతంలో జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి సృష్టించి తిరుమలకు అపచారం జరిగిందంటూ చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దారుణ విష ప్రచారం చేసేవి. మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? కేవలం టీటీడీ ఛైర్మన్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మనోభావాలు దెబ్బతింటాయా? తిరుమలకు అప్రతిష్ట వస్తుందా? గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై పదమూడు మంది మరణించిన ఘటనలో విదేశాలలో ఉన్న యాజమాన్యం వారిని కూడా అరెస్టు చేయాలని చంద్రబాబు, పవన్ లు డిమాండ్ చేశారా? లేదా?. ఆ ప్రకారమే జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించిందా? లేదా?. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు దెబ్బతగిలేనా తొక్కిసలాటలో ఆరుగురు మరణిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఎందుకు కనీసం ఎవరిపైన కేసు పెట్టలేదు?. కేవలం పదవులు అంటిపెట్టుకుని హిందూ మతానికి తీరని పాపం చేస్తున్నది వీరే అని వేరే చెప్పనవసరం లేదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!
ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు డ్రామాలో పవన్ బకరా!
తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఏకంగా పవన్ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్ నాయుడు పవన్ కల్యాణ్ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తప్పు ఒప్పుకోకుంటే పాపం తగలదా?
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రంగులు మార్చే బుద్ధి చూపిస్తే... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి కొంత స్వతంత్ర ధోరణి, మరికొంత స్వామి భక్తి చూపే ప్రయత్నం చేశారు. దుర్ఘటన జరిగినందుకు ప్రజలకు, భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా పవన్ ఆ పని చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు. చంద్రబాబు నాయుడు అధికారులుపై చిర్రుబుర్రులాడినట్లు, వేటు వేసినట్లు కనిపించారు. కానీ.. తనకు కావాల్సిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారన్న సంగతి అర్థమైపోతుంది. ..ఇంతటి ఘోరమైన దుర్ఘటన జరిగినా అందులోనూ రాజకీయం చేస్తూ ఎలాగోలా నెపం వైఎస్సార్సీపీ(YSRCP)పైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రుద్దాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపించింది. అదే టైమ్‌లో టీటీడీ పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉందో, ఉన్నతస్థాయిలో ఉన్నవారి మధ్య గొడవలు ఏ రకంగా ఉన్నాయో బట్టబయలయ్యాయి. చంద్రబాబు నాయుడు ఎదుటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), కార్యనిర్వాహణాధికారి శ్యామలరావు తీవ్ర స్థాయిలో ఏకవచనంతో దాడి చేసుకున్న వైనం, ఆరోపణలు గుప్పించుకున్న తీరును టీడీపీ జాకీ పత్రికే బహిర్గతం చేయడం విశేషం. టీటీడీ అధ్యక్ష పదవికి బీఆర్ నాయుడును నియామకాన్ని ఆ జాకీ పత్రిక యజమాని వ్యతిరేకించారు. అయినా మంత్రి లోకేష్ పట్టుబట్టి నియమించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్‌లో భూ దందాలు చేస్తున్నారంటూ ఈ పత్రిక కొద్ది రోజుల క్రితం ఒక కథనాన్ని ఇచ్చింది. అయినా చంద్రబాబు స్పందించకపోగా, తన వెంటే తిప్పుకుంటున్నారు. తిరుపతికి వెళ్లిన సందర్భంలో కూడా చంద్రబాబు వెంటే ఆయన ఉన్నారు. బహుశా ఈ కోపంతోనే గొడవ సమాచారాన్ని ఈ పత్రిక బయట పెట్టి ఉండవచ్చు. ఉద్దేశం ఏమైనా, రాజకీయాలు ఎలా ఉన్నా, ప్రజలకు కొన్ని వాస్తవాలను చెప్పిందని ఒప్పుకోవచ్చు. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఒక ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ లేదా బదిలీ వేటు వేశారు. కానీ వారిలో కీలకమైన అధికారులు లేరు. తిరుపతి ఎస్పీ సుబ్బనాయుడును బదిలీ చేయాల్సి రావడం ఆయనకు ఇబ్బంది కలిగించేదే. సాధారణంగా ఇంతమంది మరణానికి బాధ్యుడుగా ఎస్పీని సస్పెండ్ చేయాల్సి ఉండిందని చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడు కావడం, రెడ బుక్ రాజ్యాంగం అమలుకు ఏరి కోరి తెలంగాణ నుంచి తెచ్చుకోవడం వల్ల బదిలీతో సరి పెట్టారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈవో శ్యామలరావును, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని టచ్ చేయలేదు. కాకపోతే వారిపట్ల ఆగ్రహం ప్రదర్శించినట్లు వీడియో లీక్ అయ్యేలా చూసుకున్నారు. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిపిన నెయ్యి వాడారని పిచ్చి ఆరోపణను చంద్రబాబు చేసిన అంశంలో వాస్తవాలు శ్యామలరావుకు తెలుసు. పొరపాటున ఆయన అప్పుడు జరిగిన విషయాలపై నోరు తెరిస్తే అది చంద్రబాబుకు ఇరకాటం అవుతుంది. వెంకయ్య చౌదరి చాలాకాలం నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు. ఇతర సామాజిక వర్గాల అధికారులపై వేటు వేసి తన సామాజికవర్గం అధికారిని మాత్రం చంద్రబాబు రక్షించుకుంటున్నారని కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల కొండపై ఈవో కన్నా ,వెంకయ్య చౌదరి పెత్తనమే అధికంగా ఉందని చెబుతున్నారు. చంద్రబాబుతో నేరుగా మాట్లాడే చనువు ఉండడమే కారణమట. ఈవో, ఏఈవోల మధ్య సఖ్యత లేదు. వీరిద్దరికి, ఛైర్మన్‌కు సత్సంబంధాలు లేవు. బిఆర్ నాయుడు తనకు పదవి రావడంతో చేయవలసింది ఏమిటో తెలియని పరిస్థితిలో పెత్తనం చేయబోతే అధికారులు సహకరించడం లేదు. లోకేష్‌కు ఆప్తుడనైన తననే అవమానిస్తున్నారని ఆయన మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీలో అధ్వాన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తొక్కిసలాట కారణంగా ఆరు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో జన సమూహాలను సమర్థంగా నిర్వహించగల టీటీడీ అప్రతిష్ట పాలైంది. ఇక్కడ ఇంకో కారణం కూడా చెబుతున్నారు. జనసేనకు నాయకుడు టోకెన్లు ఇచ్చే చోట ఏభై మంది కార్యకర్తలను లోపలికి పంపించడం కూడా తొక్కిసలాటకు ఒక కారణమైందని ఒక పత్రిక రాసింది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణంటూ చంద్రబాబు చెబుతున్నారు. కానీ.. గత అనుభవాలను చూస్తే ఆయన ఫలితం ఏమంత గొప్పగా ఉండదని ముందగానే చెప్పేయవచ్చు. గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మరణించినప్పుడు కూడా ఇలాగే విచారణ కమిషన్ వేశారు. ఉన్నతాధికారుల మాట అటుంచండి.. కనీసం ఒక్క కానిస్టేబుల్‌పై కూడా చర్య తీసుకోలేదు. పైగా ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు చేసిన ఫొటోషూట్ కళ్లెదుటే ఉన్నప్పటికీ ఆయన తప్పేమీ లేదన్నట్టు కమిషన్ నివేదిక ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుపతి తొక్కిసలాట ఘటన కూడా ఇలాగే అవడం గ్యారెంటీ! చంద్రబాబు ఇప్పటివరకూ బి.ఆర్.నాయుడు రాజీనామా కోరలేదు. టీవీ ఛానల్ యజమాని అని ఊరుకున్నారో.. లోకేశ్ మనిషి కాబట్టి చూడనట్లు వ్యవహరిస్తున్నారో తెలియదు మరి! నైతిక బాధ్యత వహించి బీఆర్ నాయుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేది కానీ పదవి, అధికారం రుచి మరగిన తరువాత వదులుకోవడం కష్టమని అనుకుని ఉండాలి.ఇక చంద్రబాబు మాట్లాడిన కొన్ని అంశాలు చూడండి. దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని అన్యాపదేశంగా ఆయన వ్యాఖ్యానించడం ఎంత దుర్మార్గం?. ప్రభుత్వ, టీటీడీ అధికారుల, పోలీసు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటే, ఆయన నెపం వైసీపీపై రుద్దడానిక ప్లాన్ చేశారు. ఎల్లో మీడియా ఇప్పటికే ఈ ప్రయత్నం ఆరంభించింది. ఏటా తిరుపతి వాసుల కోసం ఇలా కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు ఇస్తుంటే, ‘‘అసలు టోకెన్లు ఇవ్వడం ఏమిటి? తనకు తెలియనే తెలియదు’ అని చంద్రబాబు అంటున్నారు. అయితే ఇది బుకాయింపు అవ్వాలి లేదంటే అవగాహన రాహిత్యం కావాలి. ‘‘వైకుంఠ ఏకాదశికి పది రోజుల పాటు టోకెన్లు ఇచ్చి ప్రత్యేక దర్శనం కల్పించడం ఏమిట’’ని ఆయన అంటున్నారు. దాని ద్వారా లక్షలాది మంది భక్తుల కోరిక ను గత ప్రభుత్వం తీర్చిన విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. అసలు తిరుమలకు సంబంధించి తనకు తెలియని విషయం ఉండదని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అంటూ నిస్సిగ్గుగా ఆరోపించారు. అదే కరెక్టు అయితే అధికారంలోకి వచ్చి ఏడు నెలల తర్వాత, కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టిన ఇన్ని నెలల తర్వాత కూడా దానినే ఎందుకు కొనసాగించారు?. మరోవైపు.. పవన్ కల్యాణ్ కొంత సొంత వ్యక్తిత్వంతో మాట్లాడినట్లు అనిపిస్తోంది. నాలుగు లక్షల మంది వచ్చిన ప్పుడు కూడా గతంలో జరగని దుర్గటన ఇప్పుడెలా జరిగిందని ఆయన ప్రశ్నించారట. దీనికి చంద్రబాబు, బిఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరి బదులు ఇవ్వాలి. అంతేకాదు. భక్తులు, ప్రజలు క్షమించాలని కోరారు. ఈ మాట చంద్రబాబు చెప్పలేకపోయారు. గతంలో చంద్రబాబు లడ్డూ కల్తీ అనగానే గుడ్డిగా పవన్ కళ్యాణ్ సనాతని వేషం దాల్చి నానా రచ్చగా మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు. ఈసారి అలా కాకుండా కాస్త జాగ్రత్త పడ్డారన్నమాట. అయితే.. ఆనాడు లడ్డూ విషయంలో అపచారం చేసినందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్షమాపణ చెప్పవలసి వచ్చిందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఈవో,అదనపు ఈవో, ఛైర్మన్లను బాధ్యులను చేస్తే చంద్రబాబు మాత్రం వారిని రక్షించే యత్నం చేశారు. టీటీడీలో ఉన్న విబేధాలను ఆయన అంగీకరించారు. చంద్రబాబు ఆ విభేధాల ఆధారంగా విమర్శలు తనపైకి రాకుండా కథ నడిపించారు. నిజానికి వారందరిని నియమించింది చంద్రబాబే, వారితో శ్రద్దగా పని చేయించకపోగా, రెడ్ బుక్ రాజ్యంగం అంటూ, టీటీడీని ఆసరాగా చేసుకుని వైఎస్సార్సీపీ ఎలాంటి ఆరోపణలు చేయవచ్చో అనేవాటిపైనే పని చేయించారు. ఇప్పుడు వాటి ఫలితం జనం అనుభవించవలసి వచ్చింది. అసలు పనులు మాని చిల్లర వ్యవహారాలకే టిటిడి బాధ్యులంతా పరిమితం అయ్యారని అంటున్నారు. అధికారులపై, ఛైర్మన్ పై చర్య తీసుకోవాలని, వారిపై కేసులు పెట్టాలని మాత్రం పవన్ చెప్పలేదు. హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అర్జున్‌తోపాటు యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దానిని పవన్ సమర్థించారు. మరి ఇప్పుడు టీటీడీ యాజమాన్యంపై కేసు పెట్టాలని పవన్ ఎందుకు కోరలేదు. వారిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదు. పైగా కొత్తగా కుట్ర కోణం ఉండవచ్చని పవన్ అన్నారు. అంటే ఇక్కడే చంద్రబాబు పట్ల స్వామి భక్తి ప్రదర్శించారా? సందేహం వస్తోంది.ఇది చంద్రబాబు, పవన్ కలిసి ఆడిన కొత్త డ్రామా అని, ఇందుకు బాధ్యులపై చర్య తీసుకోకుండా, మొత్తం డైవర్ట్ చేయడానికి జరుగుతున్న యత్నం అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబే తొలి ముద్దాయి అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అన్నారు. దానికి కారణం బీఆర్ నాయుడును ఛైర్మన్‌గా నియమించడంతో పాటు, అంతవరకు సమర్థంగా పనిచేసిన అధికారులను తప్పించి, తనకు కావల్సిన అధికారులను పోస్టు చేసి ఈ తొక్కిసలాటకు కారణం అవడమే అనేది విశ్లేషణ. తన పబ్లిసిటీ పిచ్చి కారణంగా పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణిస్తేనే బాధ్యత తీసుకోని చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనలో బాధ్యత వహిస్తారా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు భయం, భక్తి లేవని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుపతి దేవుడును సైతం తన రాజకీయాలకు వాడుకోవడానికి చంద్రబాబు ఎప్పుడు వెనుకాడలేదు. అలిపిరి వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చితే అదృష్టవశాత్తు ఆయన బయటపడ్డారు. ఆ ఘటన జరిగింది తన ప్రభుత్వ వైఫల్యం వల్ల, పోలీసుల అజాగ్రత్త వల్ల అని చెప్పకుండా చంద్రబాబు తనకు సానుభూతి వస్తుందన్న ఆశతో 2003లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఓటమి పాలయ్యారు. 2024లో తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌ను బద్నాం చేసేందుకు తిరుమల లడ్డూతోసహా అనేక అపచారపు ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఈ ఉదంతంలో దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని దారుణమైన వ్యాఖ్య చేసి మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయడానికి పన్నాగాలు పన్నుతున్నట్లుగా ఉంది. ఇది కూడా తిరుమల పట్ల అపచారంగానే భావించాలి. ఏది ఏమైనా ఒక విశ్లేషకుడు అన్నట్లు పాలకుల పాపాలు ప్రజలకు శాపాలవుతుంటాయట. ఇవన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
తిరుమల... ఎంత ప్రతిష్టాత్మక, పవిత్రమైన దేవాలయం..? ఎంత గొప్ప పేరు ఉన్న పుణ్య క్షేత్రం..? కానీ ఈ రోజు జరుగుతున్నదేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌కే కాదు.. దేశానికే గర్వకారణమైన దేవస్థానంలో వైకుంఠ ద్వార ప్రవేశ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఉదంతం ప్రపంచ వ్యాప్త హిందువులను కలచి వేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఘోరాలు జరగుతున్నాయి. అకృత్యాలు, విధ్వంసాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తిరుమలేశుని కూడా వదలిపెట్టలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడానికి కూడా వెనుకాడని నాయకత్వం ఇప్పుడు ఏపీలో పాలన చేస్తోంది. హిందూ మత ఉద్దారకులుగా పైకి ఫోజు పెట్టడం, లోపల మాత్రం ఎన్ని దందాలు చేయాలో అన్నీ చేయడం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా వారిని అసౌకర్యం లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వారు. అయోధ్య ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదెలాగో నేర్చుకోవడానికీ టీటీడీ అధికారులను ఆయోధ్యకు ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. అది జగన్ జమానా.. మరి ఇప్పుడు...??? అంతటి ఖ్యాతి వహించిన టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమైంది. వేలల్లో వచ్చిన జనాన్నే నియంత్రించలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. యాభై మంది వరకూ గాయపడ్డారు. ఇంతటి విషాదం... దశాబ్దాలలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన తిరుపతి గొప్పదనాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. తిరుమలను పరిరక్షించేందుకు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ పలు సంస్కరణలు తెచ్చింది. ఇప్పుడు ఆ పని మాని గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల కాలంలో ఏమైనా తప్పులు జరిగాయా? అని భూతద్దం పెట్టి అన్వేషించి వైఎస్సార్సీపీ రాజకీయ కక్ష సాధించడానికి, జగన్ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పరువును పణంగా పెడుతోంది. కొత్తగా టీటీడీ ఛైర్మన్ అయిన ఒక టీవీ సంస్థ యజమాని బీఆర్ నాయుడు పూర్తి అసమర్థంగా వ్యవహరించారనిపిస్తుంది. గొడవ జరుగుతుందని ముందుగానే తనకు తెలుసునని ఆయన చెప్పడం గమనార్హం. గొడవ జరుగుతుందని తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక మళ్లీ మాట మార్చారు. ఈ మొత్తం ఘటనను బాధ్యతను అధికారులపైకి నెట్టి తప్పించుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడులు చూస్తున్నారు. మరో ఘట్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. తిరుమల ప్రసాదం లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. అలాంటి లడ్డూపై తీవ్రమైన అనుచిత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోర అపచారానికి పాల్పడ్డారని భక్తులు భావిస్తారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ని వాడారంటూ చంద్రబాబు నీచమైన ఆరోపణ చేసి గత ముఖ్యమంత్రి జగన్ కు రుద్దాలని ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ సడన్ గా సనాతని వేషం కట్టి బాండ్ బాజా వాయించారు. దానికి జగన్ మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి... కాని స్వామి వారికి అపచారం చేస్తున్నారు సుమా! అని హెచ్చరించారు. అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారీతిన దుర్మార్గపు ప్రచారం చేసి తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయి. ఒకవేళ లడ్డూకు సంబంధించి నిజంగానే ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిచేసి బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రే తన రాజకీయ స్వార్థం కోసం ఒక వదంతిని ప్రచారం చేశారు. చివరికి దానిపై సీబీఐ విచారణ వేస్తే ఏమైందో అతీగతీ లేదు. అనంతరం చంద్రబాబే మాట మార్చారు. దీనివల్ల స్వామి వారి ఆలయానికి అపవిత్రత తెచ్చిన అపఖ్యాతిని చంద్రబాబు, పవన్ లు పొందారు. కేవలం జగన్‌పై ద్వేషంతో ఆయన పాలనలో వీరు తిరుమలపై అనేక విమర్శలు చేసేవారు. దానివల్ల తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారు. జగన్ పై మతపరమైన ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్న యావ తప్ప మరొకటి ఉండేది కాదు. చంద్రబాబు ,పవన్ లు నిజాలు చెప్పరులే అని ప్రజలు భావించారు కాబట్టి సరిపోయింది కాని, లేకుంటే కూటమి పెద్దలు తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించడానికి యత్నించారు. తిరుమలలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంక్రాంతి పర్వదినాల నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం జరిగింది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు పరిగణిస్తారు. దానికి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ ఈసారి తిరుపతిలో తొమ్మిది చోట్ల 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఈ తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లోపం తప్ప ఇంకొకటి కాదు. కారణం ఏమైనా బైరాగి పట్టెడ అనే చోట అకస్మాత్తుగా గేటు తెరవడంతో టిక్కెట్లు ఇస్తున్నారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అంటే అక్కడ అలా తోపులాట లేకుండా ముందుగానే అధికారులు చర్య తీసుకోలేదన్నమాట. గురువారం ఉదయం నుంచి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బుధవారం మధ్యాహ్నమే తరలివచ్చారు. అధికారులు ఈ విషయాన్ని గమనించినా వారి నియంత్రణకు తగిన ప్రణాళిక రూపొందించలేదు. అందరిని ఒక పార్కులో పెట్టేశారు. మంచినీటి వసతి కూడా కల్పించలేకపోయారు. మరో రెండు చోట్ల కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇలాంటి వాటిపై కదా.. టీటీడీ ఛైర్మన్ ,పాలక మండలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టవలసింది?. గతంలో సమర్థంగా పనిచేసిన అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి, వారిని తొలగించి తమ అంతేవాసులను నియమించుకున్నారు. తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా పోస్టు చేశారట. వారు ఆ పనిలో ఉంటారు కాని, ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకుంటారు? పైరవీ చేసుకుని టీటీడీ ఛైర్మన్ అయిన బిఆర్ నాయుడుకు అసలు ఇలాంటి విషయాలలో ఏమి అనుభవం ఉంది? లేకపోయినా ఫర్వాలేదు. ఆయన నిబద్ధత ఏమిటి? కేవలం ఒక టీవీ సంస్థ ద్వారా తనకు బాజా వాయిస్తే పదవి ఇచ్చేశారు. పదవి తీసుకున్న తర్వాత అయినా టీటీడీ ఉద్దరణకు కృషి చేశారా? పోసుకోలు ఇంటర్వ్యూలు, ప్రకటనలు చేస్తూ కాలం గడిపి అసలు భక్తులను ఇక్కట్ల పాలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడుతుంటారు. అయినా ఆన్ లైన్ లో కాకుండా ఇన్ని వేల మందిని, అది కూడా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం అంటే ఈ ప్రభుత్వ చేతకాని తనమే కాదా? చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం, సినిమా షూటింగ్ కోసం సామాన్య భక్తుల స్నాన ఘట్టంలో స్నానం చేసి నప్పుడు కూడా ఇలాగే గేట్లు సడన్ గా తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. ఆ విషయంలో ఒక్క కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోలేదు. సీసీటీవీ ఫుటేజీ సైతం మాయమైంది. ఆయన టైమ్ లో కేసును నీరుకార్చేసినా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా దానిపై దృష్టి పెట్టలేదు. తదుపరి కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభలలో పదకుండు మంది మరణించినా, చంద్రబాబుపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా చంద్రబాబు పోలీసులదే వైఫల్యం అని దబాయించి, రోడ్లపై సభలు వద్దన్నందుకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇటీవల హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే, దానికి నటుడు అల్లు అర్జున్ కారణమని ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అలా చేసినందుకు, టీడీపీ, జనసేన శ్రేణులు సమర్థించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాయి. అదే కొలమానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకోవాలి. ఎవరిని అరెస్టు చేయాలి? టీటీడీ ఈవో, జాయింట్ ఈవో, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ మొదలైనవారిని బాధ్యులు చేస్తారా? లేదా? ఎలాంటి చర్య తీసుకుంటారు? అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యతగా బిఆర్ నాయుడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన చేయకపోతే చంద్రబాబు ఆ మేరకు ఆదేశిస్తారా? అంటే అది జరిగే పని కాకపోవచ్చు. ఎందుకంటే బిఆర్ నాయుడుని నియమించిన చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.అలాగే పనికట్టుకుని తనకు కావల్సిన అధికారులను నియమించి ,వారిని తన అడుగులకు మడుగులు ఒత్తేవారిగా మార్చుకున్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి చంద్రబాబు, పవన్ లు రెచ్చిపోయి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. ఎల్లో మీడియా గోల,గోల చేసేది. ఇప్పుడు మాత్రం అంత గప్ చిప్ అయ్యారు. అదేదో అధికారులదే తప్పన్నట్లుగా కథ నడపాలని చూస్తున్నారు. మొత్తం తిరుమలకు అపవిత్రత వచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మోక్షం పొందవచ్చన్న కొండంత ఆశతో వెళ్లిన భక్తులకు చంద్రబాబు ప్రభుత్వం నరకం సృష్టించడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బిల్డప్ బాబు.. తగ్గేదే లే అంటున్న రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు స్టైల్లోనే ప్రవర్తిస్తున్నారా? జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపే ప్రయత్నం చేస్తున్నారా?. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును గమనిస్తే ఈ అనుమానాలు రాకపోవు. ‘‘నేను మారా.. మీరూ మారాలి.. మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు నా వద్ద ఉన్నాయి’’. ‘‘ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించా..నా ప్రొగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించుకున్నా..దానిని అందరికి అందచేస్తా..’’, ‘‘హైదరాబాద్‌లో ఉంటున్న నాకు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. నాకు అన్నీ తెలుసు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వంలో తప్పులు ఏమీ జరగలేదు..పొరపాట్లు జరిగాయని ఎవరైనా భావిస్తే నా దృష్టికి తీసుకు వస్తే సరిదిద్దుకునేందుకు వెనుకాడను. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేశా.. మంత్రులు కూడా అలాగే పని చేశారు.. రేషన్ డీలర్లు, అంగన్వాడీల ఎంపిక జోలికి వెళితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయి.. వచ్చే పంచాయతీ ఎన్నికలలో అన్ని చోట్ల గెలవాలి. అవి కీలకం. పదవుల గురించి తొందరపడవద్దు..అన్నీ జరుగుతాయి.." అని రేవంత్ అన్నట్లు వార్తా పత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అంతేకాక.. ‘‘మొదటి సారి గెలవడం ఓకే .. రెండో సారి గెలవడమే గొప్ప.., సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్ లు వస్తాయి..’’ అని కూడా అన్నారంటూ కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ ప్రసంగం అంతా పరిశీలించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని నడుపుతున్న స్టైల్లోనే, అందులోను చంద్రబాబు నాయుడు సరళిలోనే రేవంత్(Revanth) వ్యవహార శైలి ఉన్నట్లు కనిపిస్తుంది. 1995లో తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసేవరకు తన వర్గ ప్రయోజనాల కోసం, ఆధిపత్యం కోసం పనిచేసిన చంద్రబాబు సీఎం అయ్యాక మొత్తం సీన్ మార్చేశారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి మొదట్లో కొన్ని ట్రిక్స్ అమలు చేసినా, వారిపై పట్టు వచ్చాక స్టైల్ మార్చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలకు ఆయన టైమ్ లోనే ప్రాధాన్యత వచ్చింది. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకుని లీకులు ఇప్పించే వారు. అవసరమైతే ఆయనే ఆయా మీడియా సంస్థలలోని కాస్త కీలకమైన జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు. .. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరు కలిసినా, 'అలా అన్నారు..ఇలా అన్నారు.."అంటూ పూర్తిగా పాజిటివ్ యాంగిల్ లోనే కవరేజీ వచ్చేలా చేసుకునే వారు. కేబినెట్ సమావేశాలలో సైతం అదే ధోరణి. తాను మారానని, మీరూ మారాలని చెబుతుండే వారు. కాకపోతే ఆయన ఏమి మారారో, తాము ఎక్కడ మారాలో అర్థ అయ్యేది కాదు. తాను అవినీతి లేకుండా పనిచేస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. కానీ పార్టీలోని ఇతర నేతలకు వాస్తవాలు తెలుసు. అయినా ఎవరికి వారు తమ అవసరాల రీత్యా ఆయన వద్ద మాత్రం తలూపి వచ్చేవారు. అక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ అక్రమం చేసినా బయట పడకుండా జరగాలన్నది చంద్రబాబు సిద్దాంతం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, మంత్రులు కూడా పనిచేయాలని, అందరి జాతకాలు తనవద్ద ఉన్నాయని చెప్పేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తద్వారా తాను ఒక్కడినే కష్టపడుతున్నానన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించే వారు. అదే ప్రకారం ప్రచారం చేయించుకునేవారు. విశేషం ఏమిటంటే గత టరమ్ లో మొదటి ర్యాంకు వచ్చిందని ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరికి ఆ తర్వాత టిక్కెట్లు ఇవ్వలేదు. అది వేరే సంగతి. రేవంత్ వ్యాఖ్యలు చదివితే అచ్చం తన గురువు దారిలోనే ఉన్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ హై కమాండ్ బలహీనంగా ఉండడం రేవంత్ కు కలిసి వచ్చిన పాయింట్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మంత్రుల, ఎమ్మెల్యేల జాతకాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో మినహాయించి మిగిలిన సీఎంలకు అంత స్వేచ్చ ఉండేది కాదు. పైగా వర్గపోరు ఉండేది. వైఎస్ కు కూడా వర్గాల తలనొప్పి ఉన్నా, అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేసేవారు. రేవంత్ కూడా ఇప్పటికైతే వర్గపోరు లేకుండా పాలన సాగిస్తున్నారు. కాని అవకాశం వస్తే ఆయనపై అధిష్టానంపై ఫిర్యాదు చేయడానికి పలువురు సిద్దంగానే ఉంటారు. ఇంతకీ రేవంత్ ఏమి మారారో ఎవరికి తెలియదు. నిజానికి పీసీసీ(PCC) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న తీరుకు చాలా తేడా ఉందన్నది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. రుణమాఫీ విషయంలో కొంతవరకు సఫలమైనా, బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కొన్ని వాగ్దానాలను నెరవేర్చినప్పటికి ఆరు గ్యారంటీలలో కీలకమైన హామీల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ గురించి ప్రజలు అడిగితే జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలలో ఆశించిన రీతిలో రియల్ ఎస్టేట్ సాగడం లేదు.హైడ్రా కూల్చివేతలు, మూసి హడావుడి వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా, వాటిపై నిర్దిష్ట కార్యాచరణ అంతంతమాత్రంగానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసినా, దాని వల్ల ఎంత ఫలితం వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో.. తన ప్రభుత్వంలో తప్పులే జరగలేదని, ఏవైనా జరిగితే అవి పొరపాట్లేనని రేవంత్ అంటే పైకి అవునవును అని చెప్పవచ్చు. కాని కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విషయాన్ని మరీ తెగేదాక లాగడం చాలామంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. సినిమా పరిశ్రమను నష్టపరిచేలా గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించలేదు. కాని ఇప్పుడు రేవంత్ వారిపైకి దూకుడుగా వెళ్లారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని అంటున్నారు. భాష విషయంలో కూడా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన తీరులోనే ఉండడం కొంతమందికి రుచించడం లేదు. సాధారణ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురవుతోందని, దానిని గుర్తించి సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. చంద్రబాబు మాదిరి 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే నమ్మడం కష్టమే నని ఒక నేత అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సి.ఎమ్.లు ఉదయం పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి విధానపరమైన నిర్ణయాలు చేసి,ఫైళ్లు ఏమైనా ఉంటే చూసి ఇంటికి వెళ్లిపోయేవారు. అక్కడనుంచి ఏవైనా అత్యవసర పనులకు అటెండ్ అయ్యేవారు.ప్రజలను, పార్టీ వారిని కలిసేవారు. చంద్రబాబు వచ్చాక ఈ ధోరణి మార్చుకున్నారు. పని ఉన్నా, లేకపోయినా ఆఫీస్ లో గడపడం అలవాటు చేసుకున్నారు. ఎన్.టి.ఆర్. తెల్లవారు జామున అధికారులతో భేటీ అవుతుండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారు తెల్లవారేసరికల్లా ప్రజలను గడవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేవారు. కేసీఆర్ ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ లోనే ఉండేవారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. నిజానికి ఏ సీఎం అన్ని గంటలు పనిచేయవలసిన అవసరం ఉండదు. అంత పని కూడా ఉండదు. చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా ఇతర పార్టీల నేతలతో అంతరంగికంగా సంబంధాలు పెట్టుకున్నారన్నది కొందరి భావనగా ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు. అందువల్లే ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటివారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడారని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్డీయే, ఐఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని ఒక కాంగ్రెస్ నేత చమత్కరించారు. అంతేకాదు. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పాత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని, చంద్రబాబు, రేవంత్ లు రాజకీయంగా సహకరించుకుంటున్నారని ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఏది ఏమైనా రేవంత్ లో నిజంగా ప్రజలకు ,పార్టీకి ఉపయోగపడేలా మార్పు వస్తే మంచిదే. కాని ఆయన కూడా అధికార దర్పంతో ఉంటే అందరికి నష్టం అనే అభిప్రాయం నెలకొంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘తల్లికి వందనం’.. బాబు సర్కార్‌కు ఎల్లో మీడియా జాకీలు!
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు.వైఎస్ జగన్ విజయవంతంగా అమలు చేసిన ‘అమ్మ ఒడి’కి నకలుగా టీడీపీ ‘తల్లికి వందనం’ పేరుతో ఓ పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ కుటుంబంలో తల్లికి మాత్రమే నగదు ఇచ్చేవాడని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ప్రతీ బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికింది కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతోపాటు నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలు ఈ హామీకి విస్తృతంగా ప్రచారం చేశారు.చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఊదరగొట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నలుగురుంటే రూ.60 వేలు అంటూ పేద కుటుంబాలను ఊరించారు. చివరకు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఎక్కాలు చెప్పుకోవడమే తప్ప, లెక్క (డబ్బు) అందలేదు. ఈ మార్చిలోగా ఇస్తారేమోలే అని పలువురి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇప్పుడు తల్లికి వందనం పెట్టడం లేదని తేల్చేసింది. వచ్చే జూన్‌లో చేస్తామని ప్రకటించింది. అంటే జనం అమాయకులు, పిచ్చోళ్లు, వారికి ఏమీ తెలియదు.. తాము ఏ అబద్దం చెబితే దానిని నమ్ముతారన్నది కూటమి పెద్దల విశ్వాసం. అందుకే ధైర్యంగా ఈ ప్రకటన చేశారనుకోవాలి.తల్లికి వందనం స్కీమ్ దేని కోసం ప్రకటించారు?. పేద పిల్లలు స్కూల్ మానకుండా, విద్యను ఎంకరేజ్ చేయడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి స్కీమ్ తెచ్చారు. దీనికి ప్రజలలో విపరీతమైన ఆదరణ లభించింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను బాగా అభివృద్ది చేయడం, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీర్చి దిద్దడం, డిజిటల్ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. దాంతో ఈ స్కీమ్‌ను కాపీ కొట్టి, తామైతే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ నెలలో ఈ మొత్తాలను తల్లుల ఖాతాలోకి వేయవలసి ఉంది.వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు సుమారు రూ.6000 కోట్ల వ్యయం అయితే.. టీడీపీ, జనసేనలు చెప్పిన వాగ్దానం ప్రకారం సుమారు రూ.13 వేల కోట్ల వరకు వ్యయం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు గడిచినా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయలేదు. ఏదో రకంగా ఈ పథకాన్ని ఎగవేయడమో లేక బాగా కోత పెట్టి అమలు చేయడానికో కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాని అదీ లేదు.. ఇదీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పినట్లు తాము పలావు పెడుతుంటే, బిర్యానీ తినిపిస్తామని చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు పలావు పోయే.. బిర్యానీ రాకపోయే.. అని పిల్లలు, తల్లులు ఉసూరుమంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2024 జూన్‌లోనే అమ్మ ఒడి డబ్బులు అందేవి కదా అన్నది ప్రజల భావన.తల్లికి వందనం మాత్రమే కాదు.. మరి కొన్ని స్కీములను కూడా ఇలాగే నీరు కార్చే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రివర్గ నిర్ణయాలు తెలియచేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20వేల చొప్పున ఇస్తామన్నది ఎన్నికల హామీ అయితే, ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.10 వేలకు మరో రూ.10వేలు జత చేసి ఇస్తామని చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఆ ప్రకారం ఏటా అందించింది. నాలుగేళ్లు ఇస్తామని అన్నా, ఐదేళ్లు చెల్లించింది. అప్పట్లో కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తే ఇదే చంద్రబాబు, పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చే పది వేలతో కలిపి ఇస్తామంటున్నారు. అంటే వారు గతంలో చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకుంటే రైతులకు పది వేల రూపాయలు ఎగవేస్తున్నారన్నమాట. ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారే తప్ప స్పష్టంగా నిర్దిష్ట తేదీని చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఈ పంటల సీజన్లో రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉచిత బీమా సదుపాయాన్ని కూడా ఎగవేసింది.తల్లికి వందనం, రైతు భరోసా తర్వాతే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించనున్నారని కొత్త లింక్ పెడుతున్నారు. అంటే ఆ రెండు స్కీమ్‌లు ఎప్పుడు ఇస్తారో, ఈ బస్ స్కీమ్ ఎప్పటికి అమలు అవుతుందో దేవుడికే ఎరుక. కాకపోతే ఈలోగా ప్రజలను మాయ చేసే పనిలో బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దూసుకెళ్తోంది. జూన్‌లోగా తల్లికి వందనం అని శీర్షికను ఈనాడు పెడితే, తల్లికే తొలి వందనం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇచ్చింది. అంతే తప్ప ఈ ఏడాదికి ఎగనామం పెట్టారని రాయలేదు. పైగా ఈనాడు వారు ఏం బిల్డప్ ఇచ్చారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మరో రెండు పధకాలను అమలు చేయబోతోందని నిస్సిగ్గుగా రాసింది. ఇప్పటికీ ఒక్క పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలినవి ఏవీ అమలు చేయలేదని జనం గగ్గోలు పెడుతుంటే, ఈనాడు మీడియా రాతలు ఇలా ఉన్నాయి.ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెడుతోంది. డీఎస్సీని ఆరు నెలల్లో అమలు చేస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా వచ్చే జూన్‌కు డీఎస్సీ పూర్తి చేస్తామని అంటున్నారు. నిజానికి అప్పటికి కూడా అది జరగకపోవచ్చని టీడీపీ మీడియానే కథనాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. నిరుద్యోగ భృతి అతీగతి లేదు.ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని జాకీ మీడియా ఏయే హామీలు అమలు చేసింది చెప్పగలిగితే విశ్వసనీయత వస్తుంది. అంతే తప్ప కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని జాకీ పెట్టి లేపడం కోసం కథనాలు ఇస్తే ప్రజలకు ప్రయోజనం ఏంటి?. ఇప్పటికే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన ఎల్లో మీడియా రోజురోజుకు అధఃపాతాళానికి పడిపోతోంది. ఆ సంగతి పక్కనబెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తల్లికి వందనం గురించి నోరెత్తకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. దీని ద్వారా తల్లిని వారు గౌరవించినట్లా? మోసం చేసినట్లా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు వైఫల్యాలు.. ఒప్పేసుకున్న ఎల్లో మీడియా!
ఏడంటే ఏడు నెలలు.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది!. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాళానికి చేరిన సంగతి తెలిసిందే. ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదు.. అక్షరాలా టీడీపీ అనుకూల పచ్చ పత్రిక ‘ఈనాడు’ నిగ్గుదేల్చిన వాస్తవం. ఈ కథనంలోనే వైఎస్ జగన్ సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతున్నా.. ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారికి నోరు రాకపోయింది!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. మరో శ్రీలంక అవుతోందని ఈనాడు తన కథనాల ద్వారా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మా బాబు అధికారంలోకి వస్తే జగన్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది. సంక్షేమ పథకాల అమలు సంగతి అలా ఉంచండి.. చేసిన అప్పులే కొండంతయ్యాయి!. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వల్లనే అని కలరింగ్ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి ఉండవచ్చు కానీ.. బాబు నిర్వాకాల పుణ్యమా అని ఏపీ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? అన్న అనుమానాలైతే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా.. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ అంకెలకు మధ్య తేడా కూడా ఎక్కువైంది. అయితే, ఈనాడు తన కథనంలో వైఎస్ జగన్ హయంలోని అంకెలను ప్రస్తావించకుండా బాబుకు జాకీలేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేనలు రెండూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికార భాగస్వామి. ఇన్ని అనుకూలతలున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు జగన్ కాలం కంటే (రూ.22,213 కోట్లు) తక్కువగా (రూ.9703 కోట్లు) ఉండటం గమనార్హం. దీన్ని బట్టే బాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగం ఏపాటిదో అర్థమైపోతుంది.రాష్ట్రంలో భూముల విలువలు తగిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పేవారు. టీడీపీ మీడియా, పార్టీ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. జనం చాలా వరకూ నమ్మారు కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తే.. ఈ ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి రూ.5,438 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.6306 కోట్లుగా ఉంది.చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు. దాంతో కంగారుపడుతున్న చంద్రబాబు అండ్ కో.. హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా రూ.31 వేల కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం అప్పులు కూడా సమీకరిస్తున్నారు. అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు వెయ్యి కోట్లు తగ్గింది. తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే 2023 డిసెంబర్లో 12 శాతం వృద్ధి ఉంటే, 2024 డిసెంబర్లో అంటే కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ మైనస్ ఆరు శాతంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం సమయంలో మూలధన వ్యయం నవంబర్ నాటికి రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, చంద్రబాబు పాలనలో అది కేవలం రూ.8329 కోట్లు ఉంది. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఏం సంపద సృష్టించారో అర్థం కాదు.ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్ జగన్ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు హయంలో ఆర్థిక నిర్వహణ నాసిరకంగా ఉందని అంకెలు చెబుతున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అవే అబద్దాలను వల్లె వేస్తుంటుంది. ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలను పరిశీలిద్దాం.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13,500 కోట్ల రాబడి అంచనా వేస్తే కేవలం రూ.5438 కోట్లే వచ్చాయి. మిగిలిన నాలుగు నెలల్లో రూ.8వేల కోట్ల ఆదాయం రావడం కష్టమే. అమ్మకం పన్ను ద్వారా రూ.24,500 కోట్లు వస్తాయని లెక్కేస్తే ఇప్పటివరకూ వచ్చింది ఇందులో సగం కంటే తక్కువగా రూ.11303 కోట్లే మాత్రమే. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.25,587 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్ అంచనాగా చూపారు. ఇప్పటివరకూ వసూలైంది రూ.13154 కోట్లు!. కేంద్ర పన్నులలో వాటా రూ.35 వేల కోట్లని చెప్పారు. వాస్తవంగా అందింది.. రూ.22వేల కోట్లు. ఇతర పన్నులు, సుంకాలు రూ.8645 కోట్లు అంచనా ఆదాయమైతే, నికరంగా లభించింది రూ.3483 కోట్లు మాత్రమే. భూమి శిస్తు మాత్రం రూ.57 కోట్ల అంచనాలకు రూ.194 కోట్లు వచ్చాయి. ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అప్పట్లో రూ.47 వేల కోట్లు ఉంటే, అది 2024 నవంబర్ నాటికి రూ.56 వేల కోట్లకు చేరుకుంది. ఇదన్నమాట చంద్రబాబు సృష్టించిన సంపద.రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికి రూ.1.12 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లకపోయినా, ఈ ప్రభుత్వం ఎందుకింత అప్పులు చేసిందీ ఇంతవరకు వివరించ లేదు. నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.మరో వైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం రూ.15 వేలు కోట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా, పోర్టులు, మెడికల్ కాలేజీలు, తదితర అభివృద్ది పనులు చేపట్టింది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంది. అలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా, స్కీములు అమలు చేయకపోయినా, అభివృద్ది ప్రాజెక్టులు లేకపోయినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్న కూటమి సర్కార్‌ను ఏమనాలి? ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ, తమది ‘విజన్-2047’ అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అండ్ కో వారికే చెల్లిందని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుకది షరా మామూలే!
బాబుకది షరా మామూలే! ‘‘చంద్రబాబూ..కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో నీకు నీవే సాటి’’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడిని ఉద్దేశించి తరచూ చేసిన వ్యాఖ్య ఇది. 1999-2004 మధ్యకాలంలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ విపక్ష నేత అన్నది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విపక్ష నేతగా బాబు ఉన్నారు. ఈ సమయంలో ఆయా సందర్భాలలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను, బాబు చేసిన ప్రకటనల్లోని అబద్ధాలను వేలెత్తి చూపుతూండేవారు. ‘‘అబద్దాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలవుతుంది అని శాపం ఉంది’’ అని కూడా వైఎస్సార్ ఎద్దేవ చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసత్యమైనా తన అవసరానికి తగ్గట్టు మాట్లాడేవారని చెప్పాలి.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సఫలమయ్యారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆ తరువాత ఇంకో మాట మాట్లాడటం విషయంలో ముప్పై ఏళ్ల క్రితం మాదిరిగానే ఇప్పుడూ బాబు ఉన్నారు. అబద్దాల విషయంలో స్థిరత్వం పాటించిన నేత అన్నమాట! చంద్రబాబు తాజా ప్రసంగం ఒకటి వింటే ఔరా అనిపిస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించిన ఆయన వీటితోపాటు మేనిఫెస్టోలో మరో 175 హామీలు ఇచ్చారు. అధికారంలోకి రావడంతోనే అమలు చేస్తామని, సంపద సృష్టించడం తనకు తెలుసు అంటూ నమ్మబలికారు. లోకేష్, పవన్కళ్యాణలు కూడా బాబు వాగ్ధానాలను ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు అవుతాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు... ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’’ అని ప్రకటించేశారు. అరె... తమకు తెలియకుండా అన్ని హామీలెప్పుడు అమలు చేశారబ్బా అని ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయంటే అర్థం చేసుకోవచ్చు. అవి ఉత్తుతివే అని అందరూ అనుకుంటున్నప్పుడు ఎన్నికల సంగతి ఎవరూ ప్రస్తావించరు. అందుకే హామీలన్నీ అమలు చేసేశామన్న భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారని అనుకోవాలి. అయితే వృద్ధుల ఫించన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం మినహా మరే ఇతర హామీ అమలు కాలేదన్నది వాస్తవం. పైగా... లక్షల మంది ఫించన్లకు కోత పెట్టిన తరువాత కానీ మొత్తం పెంపు జరగలేదు.ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఎంతమందికి నిజంగా అందిందన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారనుకున్నా, మరో నాలుగు నెలల వరకు ఆ ఊసే ఎత్తడానికి వీలు లేదు. అంటే నెలకు రూ. 200ల చొప్పున రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట. ఇతర వాగ్దానాలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని అడిగితే సమాధానం మాత్రం బాబూ అండ్ కో నుంచి ఉండదు. ఇదేం న్యాయమని అడిగితే వారి గొంతు నొక్కేందుకు పోలీసులు కేసులు బనాయించేస్తారు. కేసులు వస్తాయి. జైలుపాలు కావాల్సి ఉంటుంది. మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.1500 చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రచారమైతే చేశారు కానీ.. ఇచ్చింది సున్నా! తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని.. గతంలో జగన్ కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తే తాము ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని ఊదరగొట్టారు. ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు వస్తాయని, ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని కూడా చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చిన విషయం ఎవరూ మరచిపోలేదు కానీ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్ధికి ఈ పథకం అంది ఉంటే ఒట్టు! రైతు భరోసా కింద ప్రతి రైతుకు జగన్ హయాంలో ఇచ్చిన రూ.13500 కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న హామీ గురించి అసలు మాట్లాడటమే లేదిప్పుడు. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ప్రజలు బిత్తరపోవడం తప్ప చేసేది ఏముంటుంది. ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి.ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, అంతవరకు నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతి కూడా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇవి కాకుండా మానిఫెస్టోలో వలంటీర్ల కొనసాగింపు, వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్లకే రూ.4 వేల చొప్పున ఫించన్, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న హామీ కూడా అమలు కాకపోగా.. అసలుకే మోసం వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వలంటీర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు పోగా.. ప్రజలపై రూ.15 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం పడింది. బహుశా చంద్రబాబు సృష్టిస్తానన్న సంపద ఇలా జనాలపై బాదడం ద్వారానే అనుకోవడం ప్రజల వంతైంది. ఒకపక్క ప్రజలకు పైసా విదల్చని ప్రభుత్వం ఇంకోపక్క వారానికి వారం కొత్త కొత్త అప్పులు తెచ్చుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏడు నెలల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల అప్పులు తేవడం ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1996 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే అలివికానీ హామీలు బోలెడన్ని చేసి ఎన్నికల తరువాత అన్నీ తూచ్ అనేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన బాబు తరువాత ఎన్ని పిల్లిమొగ్గలు వేసింది ఇటీవలి అనుభవమే. ప్రత్యేక తెలంగాణ అంశంలో చూసుకున్నా, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్, బీజేపీలతో జత కట్టే అంశంలో గమనించినా, ఎన్నికల పొత్తులలో పలు భిన్నమైన విధానాలు కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, అన్ని అవకాశవాద రాజకీయాలు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశాఖ ఉక్కుకు.. కూటమి సర్కార్ తుప్పు!
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ కూడా అటకెక్కిందా? ఎన్నికల సమయంలో ఈ అంశం ఆధారంగా విశాఖ ప్రజలను అడ్డంగా రెచ్చగొట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. అధికారం చేతికొచ్చాక నాలుక మడతేస్తున్నారా?. కేంద్రం తీసుకున్న నిర్ణయానికీ జగన్ బాధ్యుడిని చేస్తూ అభాండాలు మోపిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూండటం వెనుక కారణం ఏమి?. ఈ అనుమానాలకు, ప్రశ్నలకు కారణం ఒక్కటే.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని కలిసి రాష్ట్ర సమస్యలంటూ వినతిపత్రాలు సమర్పించిన బాబుగారు.. వాటిల్లో మచ్చుకైనా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడం. అదే సమయంలో వస్తుందో రాదో కూడా తెలియని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని ప్రధానిని కోరడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడ తాను కలిసే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర సమస్యలు, కీలకాంశాలను కచ్చితంగా వినతిపత్రం ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చేవారు. కానీ తన కేసుల కోసమే ఢిల్లీ వెళతాడని బాబు అండ్ కో అబద్ధపు ప్రచారానికి దిగేది. మరి.. ప్రస్తుతం కేంద్రంలోనూ కీలకంగా ఉన్న టీడీపీ ప్రజా సమస్యల కోసం ప్రధానిని కలిసిందా? లేక ఇంకేదైనా లోగుట్టు ఉందా?. విశాఖ ప్లాంట్ మూతకు గనులు లేకపోవడమే కారణమంటున్నప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాల కోసం గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కోరడం ఏమిటి? ఈ నెపంతో ఆయన తనపై ఉన్న కేసులు ముందుకు రాకుండా మేనేజ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా, ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు మణిహారం వంటి విశాఖ స్టీల్ విషయంలో కూటమి డ్రామా ఆడుతున్న విషయం తేటతెల్లం అవుతోంది. ఎన్నికలకు ముందు ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)లు చేసిన గంభీర ప్రసంగాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత వీరి వ్యవహారం ఏమిటో గమనించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని, ఆ సెంటిమెంట్ కాపాడతామని చంద్రబాబు అప్పట్లో పదే, పదే ప్రచారం చేశారు. పవన్ అయితే తనకు ఇద్దరు ఎంపీలను ఇచ్చినా ప్రైవేటీకరణపై పార్లమెంటులో బలంగా గొంతెత్తుతానని కూడా చెప్పుకున్నారు. శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నివారించలేని జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన గగ్గోలు పెట్టారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. స్టీల్ ప్లాంట్ ఒక్కో యూనిట్‌ను నిర్వీర్యం చేస్తున్నా వీరు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నందున తమకు సమస్యపై స్పష్టమైన అవగాహన లేకపోయిందని, అఖిలపక్షం వేసినా విమర్శలు తప్ప ప్రయోజం ఏమీ ఉండదని తేల్చేశారు. సెయిల్‌లో విలీనం చేయబోతున్నారంటూ ఎన్నికల సమయంలో వచ్చిన ఎల్లో కథనాలు కూడా వట్టివేనని స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 18 మంది ఎంపీలతో కేంద్రంలో కీలకంగా ఉన్నా ప్రైవెటీకరణను నిలిపివేతకు మోడీ ఒప్పుకోరా అని కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాని చంద్రబాబు అసలు ఆ ఊసే లేకుండా ఢిల్లీ టూర్ చేసి వస్తున్నారు. మరో వైపు కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్స్ పునరుద్ధరణకు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) ఏకంగా రూ.15 వేల కోట్లు మంజూరు చేసుకున్నారు. విశాఖకు కూడా అదేరీతిలో సాయం చేయవచ్చు కదా! అని అడిగే నాథుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం విశాఖ కూటమి నేతలను శిక్షించాలని జన జాగరణ సమితి పేరుతో ప్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలు విశాఖ స్టీల్ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తున్నారని, ఈ ముగ్గురు మోసగాళ్లను శిక్షించాలని సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటున్నట్లు ప్లెక్సీలలో రాశారు. అయినా కూటమి నేతలలో ఉలుకు, పలుకు లేకుండా పోయింది. విశాఖ స్టీల్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పట్లో సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విశాఖ సభలో ప్లాంట్‌ను కాపాడాలని వేలాది మంది సమక్షంలో కోరారు. విశాఖ స్టీల్‌కు ఉన్న వేల ఎకరాల భూమిలో కొంత అమ్మి రక్షించాలని సూచించారు. దీనిపై కూడా టీడీపీతో పాటు ఎల్లో మీడియా నీచమైన కథనాలను ప్రచారం చేసింది. జగన్ విశాఖ స్టీల్ భూములను ఎవరికో కట్టబెడుతున్నారని వక్రీకరించింది. ఇప్పుడేమో భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని కూటమి మంత్రులు అంటుండడం విశేషం. CM YS Jagan wrote a letter to PM Modi on “Vizag Steel Plant Privatisation” CM Jagan requested to refrain the process of Vizag Steel Plant Privatisation and continue to invest on Esteemed organization which is producing profits recently.#VizagSteelPlant #YSJaganCares pic.twitter.com/Qe6ibOahV6— Latha (@LathaReddy704) February 6, 2021ఎన్నికల సమయంలో జగన్ చాలా స్పష్టంగా.. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని హెచ్చరించారు. అయినా కూటమి నేతల మాయ మాటలు నమ్మో, మరే కారణమో తెలియదు కాని ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారి అసలు రంగు బయటపడింది. ప్లాంట్ ను అమ్మివేయడానికి కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి ఒకసారి విశాఖ వచ్చి ప్రైవేటైజ్ చేయబోమని చెప్పినా, అది మాటవరసకే అని అర్థమైపోయింది. శాసనమండలిలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విశాఖ స్టీల్ లో రెండు యూనిట్లను నిలిపివేశారని, రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం జీతాలే ఇస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభ దృష్టికి తెచ్చారు. జగన్ వల్లే ఐదేళ్లపాటు ప్రైవేటీకరణ ఆగిందని వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు, పవన్‌లు విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా విశాఖలో కూటమి తీరుపై నిరసనలు వస్తున్నా, ఇంకా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాలేదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాల్చే అవకాశం లేకపోలేదు. అయితే.. స్టీల్ ప్రైవేటైజైషన్ సమస్యను డైవర్ట్ చేయడానికి విశాఖకు టీసీఎస్ వస్తోందని, అనకాపల్లిలో మిట్టల్ ప్లాంట్ వస్తుందని, ఇలా రకరకాల ప్రచారాలు ఆరంభించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సెంటిమెంట్లు గుర్తుకు వస్తాయి. అధికారంలోకి రాగానే ఇంకేం సెంటిమెంట్ అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు పవన్ కూడా ఆయనకు తోడయ్యారు. అలా మాట మార్చడం వారికి మాత్రమే సాధ్యమైన కళ!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీన్ మారిందని ఎల్లోమీడియాకూ స్పష్టమైనట్లుంది!
అంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల తిరుగుబాటు వేడి బాగానే తగులుతున్నట్లుంది. టీడీపీ జాకీమీడియా ‘ఆంధ్రజ్యోతి’ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పెడుతున్న శోకండాలే దీనికి నిదర్శనం. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు, ర్యాలీలు విజయవంతం కావడంతో టీడీపీ, దాని తోకమీడియాలిప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ప్రభుత్వంపై ఆరునెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అంచనాలను వైఎస్సార్సీపీ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు దాన్ని ధ్రువీకరించింది. తమ కోడి కూయనిదే తెల్లవారదనుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ వార్తలను కప్పిపుచ్చేందుకు, గత ప్రభుత్వం పాలనే ఛార్జీల పెంపునకు కారణమంటూ బుకాయించే యత్నం చేసింది. కాకపోతే ప్రజలు తమకు కలిగిన నొప్పిని కూడా మరచిపోతారని అనుకుందీ ఎల్లో మీడియా! చంద్రబాబు మాకిచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అన్న ఆలోచన, విచక్షణ లేకుండా ప్రజలుంటారా? ప్రజల చెవుల్లో పూలు పెట్టి అధికారమైతే కొట్టేశామని టీడీపీ, జనసేన, బీజేపీలు సంతోషించవచ్చు. తమ వంచన చాతుర్యానికి ఈనాడు, ఆంధ్రజ్యోతులు మురిసి పోతూండవచ్చు. అయితే ఇది ఎంతో కాలం నిలవదన్న విషయం ఈపాటికి వీరికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా స్వర్గంగా మారిందన్న భ్రమ కల్పించడానికి కూటమి, ఎల్లో మీడియా తంటాలు పడుతున్నాయి. తమ ఈ తాజా పాచిక పారడం లేదన్న విషయమూ వారికి స్పష్టమవుతోంది. మనసులోని ఆందోళనను మరింత పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై ఏకంగా రూ. 15 వేల కోట్ల భారం పెట్టింది ప్రభుత్వం. దీంతో సహజంగానే ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పంతా జగన్‌దే అని జాకీ పత్రిక నీచమైన కథనం ఇచ్చింది. ‘‘నాడు షాకులు ..నేడు శోకాలు’’ అంటూ హెడింగ్ పెట్టి, విద్యుత్ చార్జీల బాదుడు జగన్ దే అని నిస్సిగ్గుగా రాసింది. ఇది నిజమే అయితే చంద్రబాబుకు తాను విద్యుత్ చార్జీలు పెంచవలసిన అవసరం ఏమి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, వచ్చే ఏడాది సర్దుపోటు ఉందని ఎల్లో మీడియా చెబుతోంది. దానిని ఎవరైనా నమ్ముతారా? ఇది ఏ రకంగా జరుగుతుందో ఎక్కడైనా చెప్పారా? అంటే ఇప్పటికైతే నోరుమూసుకుని ఈ రూ.15 వేల కోట్లు చెల్లించాలని చెప్పడమే కదా? చంద్రబాబు టైమ్ లో పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.47 వేల కోట్ల బిల్లులను జగన్ పాలనలో చెల్లించారా?లేదా? అప్పుడు జగన్ ఏమైనా చంద్రబాబు నిర్వాకం గురించి ఏనాడైనా శోకించారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ జాకీ మీడియా గుక్కపెట్టి రోదిస్తోంది?విద్యుత్తు సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు కాలం నుంచే సర్దుబాటు ఛార్జీల విధానం ఉందన్న విషయాన్ని మరచిపోయింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలుసు. ఇందుకు తగ్గట్టుగానే.. అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, 30 శాతం మేర తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఆ తరువాత యాభై నుంచి వంద శాతం పెంచేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా ఈ పెంపునూ సమర్థించేందుకు జగన్‌పై నిందలేసే పనిలో పడ్డాయి. ఇచ్చిన హామీ ఎందుకు తప్పుతున్నారని మాత్రం ప్రశ్నించవీ పత్రికలు! ఆర్థిక, రాజకీయ సంబంధాల కారణంగానే ఎల్లో మీడియాకు ప్రజావసరాల కంటే సొంత ప్రయోజనాలే ఇలాంటి కథనాలు రాస్తున్నారని అనుకోవాలి. చంద్రబాబు టైమ్‌లో అధిక రేట్లకు చేసుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రయత్నిస్తే... చంద్రబాబు, ఆయన జాకీ మీడియా కాని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని యాగీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా చౌకగా అంటే యూనిట్‌కు రూ.2.49లకే కొనుగోలు చేసినా దాన్ని ఈ మంద మెచ్చుకోలేదు సరికదా అభాండాలేసింది. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరుందంటూ తప్పుడు కథనాలు రాసింది. కేంద్రం సూచనల మేరకు రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని ఉరితాళ్లుగా అభివర్ణించిన ఎల్లోమీడియా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కొనసాగిస్తూండటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. మీడియా ఇంత దుర్మార్గంగా మారితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి.విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండింది. కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు ఆరు నెలలకే రోడ్లపైకి రావడమేంటని ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు కూడా. టీడీపీ కూటమి కేసులు పెడుతుందన్న భయం దీనికి ఒక కారణమైంది. కానీ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం ఈ సమస్యపై ప్రజల గొంతుకయ్యారు. పార్టీకి కట్టుబడి ఉన్న నేతలు ధైర్యంగా బయటకు రావడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది.ఆరు నెలలుగా వైఎస్సార్సీపీని అణచి వేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీకి ఇది అశనిపాతమే. ఎల్లోమీడియా మాత్రం తనదైన శైలిలో వాస్తవాలను వక్రీకరించేందుకు తన వంతు ప్రయత్నం మానలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వెళ్లి స్వాగతం పలుకుతున్నారు.ఎవరు నిజాయితీగా పాలన చేసింది ప్రజలు అర్దం చేసుకుంటున్నారనిపిస్తుంది. ధర్మవరం మీదుగా బెంగుళూరు వెళుతున్నప్పుడు ఆయా గ్రామాల వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభివాదం పలికి ఆయనతో సెల్పీలు దిగడానికి పోటీపడిన వైనం, జయ జయ ధ్వానాలు చేసిన తీరు ఆయన క్రేజ్ ను తెలియచేస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో పెరిగిన విశ్వాసానికి ఇవన్ని దర్పణం పడుతున్నాయని చెప్పవచ్చు. ‘‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ అన్న చంద్రబాబు నినాదం అసలు అర్థం కాస్తా.. ‘బాబు ష్యూరిటీబాదుడు గ్యారంటీ’గా మారిపోయిందన్నమాట.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పాయె.. ఇంకో హామీకి కూడా బాబు మంగళం!
ఆంధ్రప్రదేశ్‌లో మరో వంచన పర్వానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడులో వచ్చిన ఒక కథనం చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. ఆర్టీసీకి ఎన్నో సమస్యలున్నాయని చెప్పే ఈ కథనాన్ని బట్టి చూస్తే.. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇక అమలు జరగదనే అనిపిస్తుంది. జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని 25 హామీల్లో ఇది ప్రముఖమైంది. తెలంగాణలో ఎన్నికల హామీకి తగ్గట్టుగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏడు నెలలవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం సహా కూటమి పార్టీలన్నీ వాగ్ధానాల అమలుపై నానా రచ్చ చేసేవి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చినా ప్రతిపక్షాలు దాని అనుకూల మీడియా నానా వంకలూ పెట్టేవి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేసేవి. ఇప్పుడు మాత్రం.. ఇచ్చిన ఆరంటే ఆరు హామీలకూ మంగళం పాడుతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతులకు గొంతు పెగలడం లేదు. పైపెచ్చూ జగన్ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలను నెరవేర్చలేకపోతున్నారన్న కలరింగ్ ఒకటి! ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు అనకుండా.. వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీల్లో వృద్ధాప్య ఫించన్ల మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టారు. ఇస్తామన్న మూడూ ఎంతమందికి అందుతోందన్న స్పష్టత లేదు. దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటి సంగతేమిటి? రాష్ట్రం పరిస్థితి చూస్తూంటే భయమేస్తోందని అనడంతోనే చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చమీడియా తన బొంకులతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టమైపోతోంది కదా?ఎన్నికలకు ముందు... జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని బడాయికి పోయారు. మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కూడా. తీరా అధికారం చేతికొచ్చిన తరువాత చేసిందేమిటి? జగన్ చేసిన అప్పులు బాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమైంది. పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ రూ.70 వేల కోట్ల అప్పూ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకో రూ.15 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన రుద్దారు. ఇంతింత అప్పులెందుకు అని అడిగితే మాత్రం విషాద రాగం ఎత్తుకుంటారు బాబుగారు. ఈ క్రమంలోనే తాజాగా మహిళల ఉచిత బస్ ప్రయాణం హామీకి మంగళం పలకడమో, తూతూ మంత్రంగా అమలు చేయడమో చేసేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రివర్గ ఉప సంఘం, ఆ తర్వాత అధికారిక కమిటీలతో నివేదికలు తయారు చేయిస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్ స్కీమ్ అమలుకు 2000 బస్సులు కావాలి. ఇప్పుడున్న వారికి తోడు మరో 11500 మంది సిబ్బంది అవసరం. మహిళా ప్రయాణికుల సంఖ్య పది లక్షలు పైగా పెరుగుతుందని. ఆర్టీసికి నెలకు రూ.ఆరు కోట్ల నష్టం రావచ్చని అధికారులు అంచనా వేశారని రాసుకొచ్చింది ఈనాడు! అన్ని కలిపి ప్రభుత్వానికి నెలకు రూ.200 కోట్లు, ఏటా రూ.2400 కోట్లూ నష్టమని లెక్కకట్టారు.ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసిన తరువాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు. అదనపు సిబ్బంది పేరు చెప్పి.. వీరి నియామకానికి సమయం పడుతుందని.. వీరి జీతభత్యాలు అదనమని చెప్పేందుకు ఈనాడు తన కథనం ద్వారా ప్రయత్నిస్తోందన్నమాట. అయితే.. రాజకీయాల్లో తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికి ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా? అంటే.. గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటోవారు. కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది. కొత్త బస్సులు కొనలేదు.. అదనపు సిబ్బంది నియామకమూ జరగలేదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎగొట్టడానికే అన్నది సామాన్యుడిని అడిగినా వచ్చే సమాధానం. చంద్రబాబు ఎన్నికల హామీల అమలుకు ఏటా రూ.1.5 లక్షల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసినా టీడీపీ తమకు అనుభవముందని చెప్పేవాళ్లు. అచ్చంగా 2014లో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట! అప్పట్లో బాబు తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని కూడా విడిపిస్తానని పదే, పదే ప్రచారం చేశారు. దానిని రైతులు చాలా మంది నమ్మి ఓట్లు వేశారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపెట్టింది. రకరకాల కండిషన్లు పెట్టడం, సర్టిఫికెట్ల పేరుతో ఆఫీస్‌ల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు. అయినా రుణమాఫీ కేవలం రూ.15 వేల కోట్ల మేరే చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసేది. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే పాత రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు. ఈ సారి ఇచ్చిన రైతుల పెట్టుబడి సాయం రూ.20 వేలు హామీ ఎప్పుడు నెరవేర్చేది చెప్పడం లేదు. ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాటవేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయినట్లు అర్ధం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మహిళల ఉచిత బస్ హామీకి గుడ్ బై చెప్పడానికి లేదా, గతంలో రుణమాఫీ మాదిరి అరకొరగా చేయడానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్‌ను కలిసిన సినీ పెద్దలు.. రాజీ కుదిరినట్టేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు జరిపిన భేటీ పెద్దగా ఫలితమిచ్చినట్లు లేదు. బెనిఫిట్ షోలతోపాటు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డి తన వాదనకు కట్టుబడి ఉండటంతో సినీ రంగం పెద్దలకు పాలుపోని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని, టిక్కెట్ ధరలు విచ్చలవిడిగా పెంచుకోవడమూ సాధ్యం కాదని సీఎం కుండబద్ధలు కొట్టారు. పైగా తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గురుకులాల కోసం సినిమా పరిశ్రమ నుంచి ఒక శాతం సెస్ వసూలు చేస్తామని కూడా సీఎం స్పష్టం చేయడంతో వారు నిస్సహాయులై, నిట్టూర్పులతో సమావేశం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం ఒక మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం మాత్రం కొంత ఉపశమనమిచ్చే అంశం. ఈ ఉప సంఘం ద్వారా సినీ నిర్మాతలకు, ప్రభుత్వానికి మధ్య రాజీకి ప్రయత్నమేదైనా జరుగుతుందా? అల్లూ అర్జున్ విషయంలో ఏదైనా రాజీ కుదిరిందా? లేదా? అన్నది వేచి చూడాల్సిన అంశాలు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండగా కూడా సినీ పరిశ్రమతో సత్సంబంధాల కోసం గట్టి ప్రయత్నమే జరిగింది. వైఎస్ జగన్.. సీనీ రంగ ప్రముఖులందరినీ సాదరంగా ఆహ్వానించి, గౌరవించారు. పరిశ్రమను ఆంధ్రకు తరలించాలని, ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఈ విషయంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దుష్ప్రచారం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా అబద్దపు ఆరోపణలు చేశారు. మురళీ మోహన్ వంటి వారు ఎల్లో మీడియాతో మాట్లాడుతూ తమ కార్లను వైఎస్ జగన్ ఇంటి గుమ్మం వరకు రానివ్వలేదని తప్పుడు మాటలు మాట్లాడారు.చిన్న సినిమాలకూ రక్షణ ఉండాలని, ఏపీలో 30 శాతం షూటింగ్ చేయాలని, పెట్టుబడి వంద కోట్లు ఉంటే జీఎస్టీ వివరాలు ఇచ్చి ప్రోత్సాహాలు తీసుకుని, ధరలు కూడా పెంచుకోవచ్చని జగన్ చెబితే ఎల్లో మీడియా నానా రకాల అసత్యాలు ప్రచారం చేసింది. వైఎస్ జగన్‌కు కక్ష అని అన్నారు. టీడీపీ అనుకూల పత్రిక యజమాని జగన్‌కు సినిమా వాళ్లంటే పడదా అన్న ప్రశ్న వేస్తే ఖండించాల్సిన మురళీ మోహన్ సమర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అదే మురళీ మోహన్ తెలంగాణ సీఎంతో సమావేశమైనప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చాలని కనీసం గట్టిగా అడగనైనా అడగలేకపోయారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే గిట్టుబాటు కాదని మాత్రం గొంతు పెగల్చగలిగారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు వంటి వారు కూడా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ తదితర అంశాల గురించి మాట్లాడారే తప్ప అసలు సమస్యను మాత్రం వివరించలేకపోయారు.ఇక, అల్లు అర్జున్‌పై కేసు విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి ఈ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. అయినా సరే.. ఆయన తప్పు లేదని చెప్పే సాహసం సినీ రంగ పెద్దలకు లేకపోయింది. ఆస్తులు, వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉండటంతో వాళ్లు ఏమీ మాట్లాడలేకపోయారని, చివరకు బౌన్సర్లతో సమస్యలేమి వస్తాయని కూడా అడగలేకపోయారని అనిపిస్తోంది. రేవంత్ ఒక విషయం తేల్చి చెప్పారు. అల్లు అర్జున్‌పై తనకు కోపం ఏమీ లేదంటూనే.. ఆయన ఏదో ఫంక్షన్లో తన పేరు మరచిపోయినందుకు కేసు పెట్టానన్న ప్రచారాన్ని సినీ ప్రముఖులు ఖండించకపోవడాన్ని మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈగో ఇక్కడే దెబ్బతిందన్న విషయాన్ని ఆయన కూడా నిర్దారించారన్నమాట.బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలను సినిమా వాళ్లు ఖండించలేదని కూడా ఆయన బాధపడ్డారు. ఒకవేళ అలాంటి రాజకీయ అంశాలలో జోక్యం చేసుకుంటే ఇతర పార్టీలకు ఆగ్రహం రావచ్చు. అయినా ఆ మాట చెప్పలేకపోయారు. సినిమా పరిశ్రమకు కూడా సామాజిక బాధ్యత ఉంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు మద్దతివ్వాలని రేవంత్ కోరడం తప్పు కాదు కానీ అలాంటి సినిమాలు తీస్తే వచ్చే నష్టాన్ని భరించేదెవరు. అలాగే ముఖ్యమంత్రి పిలుపు మేరకు అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీయాలన్నా భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. ప్రేక్షకులకు థియేటర్లకు రావడమే గగనమైన ఈ కాలంలో విడుదలైన వారం రోజుల్లో పెట్టుబడులు రాబట్టుకోలేకపోతే వారి పరిస్థితి ఏమిటి? ఈ విషయాలన్నీ రేవంత్‌కు తెలియనివి కావు. కానీ శాసనసభలో బెనిఫిట్ షోలు, ధరల పెంపు లేవని ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో వాటికే ఆయన కట్టుబడి ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ హయాంలో టిక్కెట్ల పెంపుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే పవన్ ఒంటి కాలుపై లేచిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అప్పట్లో మాదిరిగా సీఎంకు, టిక్కెట్ల ధరలతో సంబంధం ఏమిటని ఇప్పుడు కూడా ప్రశ్నించి ఉండాలి కదా? పది రోజులుగా కిక్కురుమంటే ఒట్టు!. బహుశా ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్ అక్కరకు రాలేదనుకుంటా. లేదా రేవంత్ ఇచ్చిన షాక్‌కు దిమ్మతిరిగి ఉండాలి. జగన్ సినీనటుడు చిరంజీవిని ఇంటికి పిలిచి విందు ఇచ్చి పంపిస్తే.. ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు.. ‘చిరంజీవితో దండం పెట్టించుకుంటారా’ అని ప్రశ్నించారు. అబద్ధమని వారికీ తెలుసు. చిరంజీవి ఈ మధ్యే రేవంత్‌ను కలిసినప్పుడు కూడా రెండు చేతులతో నమస్కారం చేశారు. విశేషం ఏమిటంటే.. చిరంజీవితోపాటు బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు కూడా రేవంత్ భేటీకి రాలేదు. బెనిఫిట్ షోలకు అనుమతించడం లేదు కనుక, వారు హాజరైతే అది అసౌకర్యంగా ఉంటుందని, అందువల్లే రాలేదని కొందరు చెబుతున్నారు.తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది సంస్థ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు సమావేశం తర్వాత అసలు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపులు చిన్న విషయాలని, చర్చించలేదని, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడామని వివరణ ఇచ్చారంటేనే రేవంత్‌ను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమావేశం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్దిష్ట ఎజెండా లేకుండా వీరంతా భేటీ అయ్యారన్నమాట. అయితే, బయట మాత్రం రేవంత్.. సినీ పరిశ్రమను తన దారిలోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేదీ లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, చూడడానికి మాత్రం అది నిజమే అనిపించకమానదు.చెరువును ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై హైడ్రా తన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన తరువాత కూడా ప్రముఖ నటుడు నాగార్జున సైతం రేవంత్‌కు శాలువ కప్పడం ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదన్నది వీరి విశ్లేషణ. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖపై నాగార్జున పరవు నష్టం దావా అయితే వేయగలిగారు కానీ.. కాంగ్రెస్ పార్టీ ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు. మందలించినట్లు కూడా లేదు. అయినా కూడా నాగార్జున సీఎంను కలిసి మాట కలపాల్సిన సందర్భం వచ్చిందన్నమాట.సినీ నటులకు రాజకీయ సంబంధాలు ఎందుకు అని రేవంత్ ప్రశ్నించడం విడ్డూరమే. రేవంత్‌కు నిజంగానే తెలియవని అనుకోవాలా?. సినీ నటుడే స్థాపించిన పార్టీ నుంచే ఆయన వచ్చారు కదా?. పైగా సినీ నటులను అడ్డం పెట్టుకుని రాజకీయం నడిపిన పార్టీలోనే ఆయనా ఉన్నారు. మురళీ మోహన్ లాంటి వారు టీడీపీ తరఫున ప్రచారం చేశారు.. ఎంపీ అయ్యారు. ఇతర పార్టీల విషయానికి వస్తే కృష్ణ.. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. జనసేనతో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం చేస్తున్నారు...నాగబాబు జనసేన నేతగా ఉంటూ చంద్రబాబు కేబినెట్లో చేరడానికి సిద్దం అవుతున్నారు. వీరు రాజకీయాలలో ఎలాంటి పాత్ర అయినా పోషించవచ్చు. కానీ, అల్లు అర్జున్ మాత్రం వైఎస్సార్సీపీ నేత రవిచంద్ర కిషోర్‌ను నంద్యాలలో కలవడం పెద్ద తప్పు అట. ఇలాంటి విషయాలలో సినీ పరిశ్రమ ఒక మాట మీద ఉండదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్న సూత్రం అందరికీ వర్తిస్తుంది. పెద్ద సినీ నిర్మాతలు నిజంగానే భయపడ్డారా? లేక ప్రస్తుతానికి నటిస్తున్నారా? రేవంత్ కోపం తగ్గాక తమ డిమాండ్లను నెరవేర్చుకుంటారా? లేక రేవంత్ ప్రభుత్వంపై పోరుబాటకు దిగుతారా? అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్. రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.