
దేశంలో రాజ్యాంగం తరచూ అపహాస్యం పాలవుతోంది అనేందుకు ఇదో తాజా ఉదాహరణ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పదిమంది తాము అదే పార్టీలో ఉన్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఇచ్చిన తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. బీఆర్‌ఎస్ జెండాతో 2023 శాసనసభ ఎన్నికలలో గెలిచిన తరువాత వీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం బహిరంగ రహస్యం. వీరి అనర్హత కోరుతూ బీఆర్‌ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించడం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశం త్వరగా తేల్చాలని కోరడం అందరికీ తెలుసు. అయితే... చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తాము అసలు పార్టీ మారనేలేదని బుకాయిస్తూండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు కాస్తా దగ్గరపడటంతో పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ తీరున సమాధానమిచ్చారు. వీరు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి.ఆ ఉప ఎన్నికలలో గెలుస్తామో, లేదో అన్న అనుమానం కావచ్చు.. లేక ఎందుకు ఖర్చు అన్న భావన కావచ్చు. వీరు ఇలా కధ నడుపుతున్నారని అనుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణకు ప్రతిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ సూచన మేరకు మళ్లీ కొత్త సాక్ష్యాధారాలు ఆయన ఆఫీస్‌లో సమర్పించారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేలు ఫిరాయించారా? లేదా అన్నదానిపై స్పీకర్‌కు, అన్ని పార్టీలకు క్లారిటీ ఉంటుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇందులో ఉన్న వాస్తవాలనండి, మతలబు అనండి తెలియకుండా ఉండదు. అయినా ఈ డ్రామా అంతా నడవాల్సిందే. అదే మన రాజ్యాంగ బలహీనతేమో! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ పక్షాన గెలిచినా, తదుపరి జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో దానం పరిస్థితి కాస్త అగమ్యగోచరమే అని చెప్పాలి. అయితే అనర్హత వేటుకు గురి కావాలి. లేదా రాజీనామా చేయాల్సి రావచ్చు. కాకపోతే స్పీకర్ ఎటూ అధికార పార్టీ వారే కాబట్టి కొంతకాలం జాప్యం చేయడానికి యత్నించవచ్చు. స్పీకర్ మరీ ఎక్కువకాలం పెండింగులో పెట్టడం కూడా సాధ్యపడకపోవచ్చు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్య తరపున లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేశారు. వీరిద్దరూ నేరుగా ఆధార సహితంగా ఫిరాయించినట్లు కనిపిస్తుండడంతో ఏమి చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గతంలో పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో నేరుగా చేరకపోయినా, పలు విచారణల తర్వాత ఆలస్యంగా అయినా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి వారిపై అనర్హత వేటు వేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ స్పీకర్ ఎంతకాలం తీసుకుంటారో, ఏమి చేస్తారో చూడాల్సి ఉంది.
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ అయి మంతనాలు సాగించారు.న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఎనిమిది మందితో స్పీకర్ నోటీసులకు బదులు ఇప్పించారు. ఆ జవాబులు చూస్తే మన ఎమ్మెల్యేలు ఇలా తమను తాము ఆత్మవంచన చేసుకుంటున్నారా? లేక ప్రజలను మోసం చేస్తున్నారా? లేక న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వస్తాయి. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కేవలం అభివృద్ది కోసమే సీఎంను కలిశామని, ఆ సందర్భంలో సీఎం మర్యాదపూర్వకంగా కండువా కప్పుతుంటే తిరస్కరించడం సంస్కారం కాదని నిరాకరించ లేదని, పైగా అది కాంగ్రెస్ కండువా కాదని బుకాయించారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తన ఇంటిలో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉందని చెప్పారట. అంతేకాక తాను కేటీఆర్‌ను కలిసిన ఫోటోలు కూడా తన సమాధానంతోపాటు జతపరిచారట. కొంతమంది తాను కాంగ్రెస్ లో చేరినట్లు ఫ్లెక్సీలు కట్టారని, వాటితో తనకు సంబంధం లేదని, దాని ఆధారంగా తనపై ఫిరాయింపు ఆరోపణ చేశారని ఆయన వివరణ ఇచ్చారట. ఇవన్ని చూస్తుంటే తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకని అన్నట్లుగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్‌గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరు కావడం విశేషం. స్పీకర్‌గా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, ఇతర పార్టీల వారిని కూడా బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు స్వయంగా పోచారమే పార్టీ ఫిరాయించి, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతుండడం విశేషం.
గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం టీఆర్ఎస్‌లో చేరడానికి ముందు పదవికి రాజీనామా చేశారు. కాని ఇప్పుడు మాత్రం వెనుకాడుతున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తప్ప మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ సీనియర్లే. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గతంలో కాంగ్రెస్ పక్షాన గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరితే, ఈసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి అనధికారికంగా మారారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొద్ది రోజుల క్రితం గండిపేట వద్ద జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ వివిధ పత్రికలలో ఫుల్ పేజీ ప్రచార ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ లోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. వీరు తమంతట తాముగా రాజీనామా చేసినా, లేదా కాంగ్రెస్ నాయకత్వం రాజీనామా చేయించినా బాగుండేది.
కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఒకపక్క విమర్శలు చేస్తూ, మరో పక్క తెలంగాణలో అదే రకంగా వ్యవహరించడం ఏపాటి విలువలతో కూడినదన్న ప్రశ్న వస్తుంది. మరో సంగతి ఏమిటంటే ఒక ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పది మంది తమ పార్టీలోకి వచ్చారని చెప్పారట. దానిని సాక్ష్యంగా తీసుకోవాలని, అప్రూవర్ గా ఆయనను పరిగణించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని టూర్ చేస్తున్నారని, తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీని ఎలా సమర్థిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతున్నాయని కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ కింద బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అప్పుడు కూడా కొందరికి ఆయన బీఆర్‌ఎస్ కండువా కప్పారు.అయినా వారిలో ఎవరిపైన అనర్హత వేటు పడలేదు.అప్పట్లో బీఆర్‌ఎస్ విలీనం డ్రామా నడిపితే, దానికి ఆనాటి స్పీకర్ పోచారం ఆమోద ముద్రవేశారు. బీజేపీ కేంద్రంలో కాని, కొన్ని రాష్ట్రాలలో కాని పిరాయింపులను ప్రోత్సహించడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. 2014 టర్మ్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు.
దానిపై న్యాయపోరాటం జరిగినా అది ఒక కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వైఎస్ జగన్ ఆనాటి రాజకీయ పరిణామాలలో పార్టీని వీడినప్పుడు రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేసి ఎంపీగా తిరిగి గెలిచారు. అలాగే ఆయన పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. వారిలో 15 మంది విజయం కూడా సాధించారు. ముగ్గురు ఓటమి చెందారు.అయినా విలువలకు కట్టుబడి ఉన్నట్లు గుర్తింపు పొందారు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చివరికి ఏ రూపు దాల్చుతుందో, అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేకపోయినప్పటికి, సుప్రీం కోర్టు ఆదేశాల వల్ల ఈ నోటీసుల తతంగం అయినా సాగుతోందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఫిరాయింపు రాజకీయాలపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, వారెవ్వరూ గట్టిగా నిరసన చెప్పలేని స్థితి ఉంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.