అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: కవిత | Kavitha Slams Congress Govt For Singareni Workers | Sakshi
Sakshi News home page

అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: కవిత

Sep 23 2025 3:05 PM | Updated on Sep 23 2025 3:16 PM

Kavitha Slams Congress Govt For Singareni Workers

శ్రీరాంపూర్,(మంచిర్యాల జిల్లా):  సింగరేణి గ్రాస్‌ లాభాలపై కార్మికులకు బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలతో ఒక్కో కార్మికుడు లక్ష రూపాయల చొప్పున నష్టపోయారన్నారు. ఈరోజ(మంగళవారం, సెప్టెంబర్‌ 23వ తేదీ)శ్రీరాంపూర్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు కవిత.  సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు. దీనిలో భాగంగా మాట్లాడిన కవిత..  సింగరేణిని నష్టాల బాట పట్టించి మహిళ తీయించే కుట్ర జరుగుతోందన్నారు. 

 ‘సంస్థకు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 42 వేల కోట్లు వెంటనే చెల్లించాలి. సింగరేణి అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు. తెలంగాణ రాకముందు నుంచి సింగరేణి కార్మికుల కోసం పోరాడుతున్నా. మనకు కరువులో అన్నం పెట్టింది సింగరేణి. 

ఆంధ్ర పాలనలో మనకు ఉద్యోగాలంటే సింగరేణి ద్వారా వచ్చినవే. తెలంగాణ వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలను మళ్లీ సాధించుకున్నాం. సింగరేణి సంస్థకు ఈ ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల బకాయిలు పెట్టింది. సింగరేణిలో గనులను తెరవాల్సి ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవటం లేదు. కానీ కర్ణాటక లో ఒక గని, మరోచోట రాగి గనిని తీసుకున్నారు. వాటిని తవ్వేందుకు డబ్బులు లేవంటూ ఎల్ఐసీని రూ. 3 వేల కోట్లు అప్పు అడుగుతున్నారు. అంటే పద్దతి ప్రకారం సంస్థను దివాళా తీయించే కుట్ర చేస్తున్నారు. 

సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి తగ్గించుకోవాలి. అప్పుడు అన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. కార్మికులకు లాభాల్లో వాటా అంటూ సీఎం బిచ్చం వేశారా?, లాభాల్లో అభివృద్ది పనుల వాటా తీసేసి మిగిలిన దానిలో వాటా ఇవ్వటమేమిటీ?, మొత్తం గ్రాస్ లాభాల మీద కార్మికులకు బోనస్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి చర్య కారణంగా ఒక్కో కార్మికుడికి లక్ష రూపాయల నష్టం జరుగుతోంది. సింగరేణిలో చాలా గనులను తెరవాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏటా 5 గనులు తెరవాలని నిర్ణయించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి ఉన్న గనులను తెరవాల్సి ఉంది.  సింగరేణి విషయంలో రాజకీయం జోక్యం ఉండొద్దని కార్మికులు కోరుతున్నారు. సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ నాయకులే గెలిచారు. కార్మికులకు మంచి చేయకపోగా...రౌడీయిజం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇలాగే చేస్తే కాంగ్రెస్ మళ్లీ గెలవదు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు కచ్చితంగా బుద్ది చెబుతారు. జాగృతి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది సింగరేణి కార్మికులు నిర్ణయించాలి. నా ఒక్కరి కోసం ఏ నిర్ణయం తీసుకోను. అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement