
మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి రాకపోతే సహించేదే లేదని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తమకిచ్చే గౌరవం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి, పార్టీలో ఉండి పార్టీని కాపాడుకున్న తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని ఆయన చెప్పుకొచ్చారు.
వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లంటే..!
వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకి మంత్రి పదవులు ఇస్తారా అని ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే చేసినవే అంటూ విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒకానిక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ చుక్కెదురు కావడంతో తిరికి సొంత గూటికే చేరిన రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ప్రేమ్ సాగర్ వ్యాఖ్యానించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్ లో మరింత అలజడి రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ప్రతిపక్షాల పార్టీలు కౌంటర్లు వేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయ్యింది.
మంత్రి పదవుల పంచాయితీ మొదటికొచ్చిందా?
తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు పూర్తయినప్పటికీ తమకు పదవి కావాలంటే తమకు కావాలంటూ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాస్త సస్సెన్స్ నెలకింది. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు.

తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకని జానారెడ్డి అన్నట్లు వార్తలు రావడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎందుకు పదవులు ఉండకూడదని ప్రశ్నించారు.
తమ శక్తి సామర్థ్యాలను బట్టే మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గిచూపుతోందని, ఇక్కడ కొంతమంది తమ పలుకుబడితో ఆ పదవిని రాకుండా అడ్డుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా పదవి ఇవ్వకపోతే అమీతుమీ తేల్చుకుంటాననే సంకేతాలు పంపడంతో అధిష్టానానికి మళ్లీ పదవుల పంచాయితీ తలనొప్పి షురూ అయ్యింది. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పంచాయితీ మళ్లీ మొదటికి రావడంతో అధిష్టానం మరోసారి చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు.