ఎంపీగా మధుసూదన్‌రెడ్డి ఎన్నిక
అప్పటికే ఆయన భార్య కోమాలో..
మూడేళ్ల తర్వాత అదే పరిస్థితిలో మృతి
సాక్షి, ఆదిలాబాద్: జీవితంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధిస్తే మొదట కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.. అయితే మాజీ ఎంపీ మధుసూదన్‌రెడ్డికి మాత్రం ఈ సంతోషం పంచుకునేందుకు ఆ అవకాశం లేకుండా పోయింది.. ఆయన భార్య అప్పటికే విగత జీవి.. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత కొద్ది రోజులకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుప్రాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మార్చిలో ఈ ప్రమాదం జరగగా ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే ఆమె అదే పరిస్థితిలో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.
న్యాయవాద వృత్తి నుంచి..
ఆదిలాబాద్‌లో టి.మధుసూదన్‌రెడ్డి అప్పటికే దశాబ్దాలుగా ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. అప్పుడు 58 ఏళ్ల మధ్య వయస్సు.. భార్య భూలక్ష్మి, అప్పటికే పెళ్లిళ్లు జరిగిన కుమారుడు ప్రకాష్‌రెడ్డి, కూతురు సంగీత, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. 2004లో ఆయనకు బీఆర్‌ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఖరారైంది. మార్చి 1న ఆయన ఆదిలాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది కూతురి వివాహం హైదరాబాద్‌లో ఉండడంతో మధుసూదన్‌రెడ్డి భార్య భూలక్షి్మతో కలిసి కారులో డ్రైవర్‌తో సహా బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యలో మధుసూదన్‌రెడ్డి కారు నడుపుతుండగా భార్య ముందర కూర్చుంది.
డ్రైవర్ వెనుక సీటులో ఉన్నాడు. తుప్రాన్ వద్ద అనుకోని పరిస్థితిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూలక్షి్మకి తీవ్ర గాయాలు కాగా మధుసూదన్‌రెడ్డికి మెడ వద్ద స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఇద్దరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే భూలక్ష్మి కోమాలోకి వెళ్లిపోయింది. మధుసూదన్‌రెడ్డి చికిత్స అనంతరం తేరుకున్నారు. ఏప్రిల్ 20న 14వ లోక్‌సభ మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి 4,15,429 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్‌చారి 3,74,455 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్‌రెడ్డి గెలిచారు. ప్రముఖ న్యాయవాదిగా తన విజయాన్ని చూసిన భాగస్వామి భూలక్ష్మి ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియకుండానే కోమాలోనే 2007లో ఆమె కన్ను మూశారు.
మొదటిసారి ఎన్నికల్లో..
బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో పోటీ చేసింది. కొత్త పార్టీగా ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్‌రెడ్డి గెలిచారు. ఆ ఐదుగురు ఎంపీల్లో పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలుపొందగా మెదక్ నుంచి ఆలె నరేంద్ర, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్, వరంగల్ నుంచి దరావత్ రవీందర్ నాయక్ ఉన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీకి ఉండగా, ఆ దిశగా యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో 2006లో బీఆర్‌ఎస్ యూపీఏ నుంచి వైదొలిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మధుసూదన్‌రెడ్డి కూడా ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూదన్‌రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో కృంగిపోకుండా ఆయన తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టడం గమనార్హం. 2015లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment