Road Accident
-
వెంటాడిన మృత్యువు!
సాక్షి, సిటీబ్యూరో/లంగర్‌హౌస్: మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి శనివారం రాత్రి లంగర్‌హౌస్‌లోని మిలటరీ వాటర్ ట్యాంక్ వద్ద చేసిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యాభర్తలు మోన ఠాకూర్, దినేష్ గిరిలను యాక్సిడెంట్స్ వెంటాడాయి. మోన కుటుంబంలో ఇద్దరు ప్రమాదాల బారినేపడి మృతి చెందగా..దినేష్‌ను రెండేళ్ల క్రితం ఓ ‘నిషా’చరుడు ఢీ కొట్టాడు. అప్పట్లో తీవ్రగాయాలతో బయటపడినా..ఇప్పుడు మరో మందుబాబు డ్రైవింగ్‌కు భార్యతో సహా అశువులుబాశారు. మోన ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, తల్లిని కోల్పోవడంతో ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు బతికిపోయినా ఇప్పుడు... బంజారాహిల్స్‌కు చెందిన దినేష్ గిరికి, ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త నుంచి విడిపోయిన లంగర్‌హౌస్‌కు చెందిన మోన ఠాకూర్‌కు 2022లో వివాహం నిశ్చయమైంది. ఆ ఏడాది అక్టోబర్ 6న దినేష్ తన ద్విచక్ర వాహనంపై ట్యాంక్‌బండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లక్డీకాపూల్ ప్రాంతంలో మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన పవన్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. వాటిలో ఓ వాహనంపై ఉన్న దినేష్ కు ముఖం, తల, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది బయటపడ్డారు. అప్పటికీ వివిధ సర్జరీల కారణంగా పూర్తిగా కోలుకోవడానికి ఏడు నెలలు పట్టింది. దీంతో మోనతో జరగాల్సిన పెళ్లి ఆలస్యమై... 2023 మే 25న ఒక్కటయ్యారు.ఆమె కుటుంబంలోనూ విషాదాలెన్నో... లంగర్‌హౌస్ పెన్షన్‌పురకు చెందిన మోన ఠాకూర్ కుటుంబంలోనూ విషాదాలు ఎన్నో ఉన్నాయి. ఈమె తండ్రి భగవాన్ సింగ్ మొదటి భార్య ఇందిర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రెండో భార్య రత్నభాయికి పుట్టిన సంతానమే మోన. మొదటి భార్య కుమారుడు బచ్చన్ (మోన సవతి సోదరుడు) వెల్డింగ్ పనులు చేస్తూ జీవించే వారు. 2007 మేలో తన సమీప బంధువుతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శనివారం రాత్రి లంగర్‌హౌస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్తతో సహా మోన కన్నుమూసింది. ఆ సమయానికి ఆమె నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, బంధువులు తీవ్ర విషాదంలో ముగినిపోయారు. సొంత తండ్రి వద్ద దొరకని ప్రేమ దినేష్ వద్ద... మోనకు మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమార్తెలు కలిగారు. ప్రేరణ శ్రీ (12) తొమ్మిదో తరగతి, ధ్రితి శ్రీ (9) ఐదో తరగతి చదువుతున్నారు. ఒకేసారి రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో వీళ్లు అనాథలుగా మారారు. తమ సొంత తండ్రి నిత్యం గొడవలు పడేవాడని, తమను వేధించేవాడని ఈ చిన్నారులు చెబుతున్నారు. దినేష్ గిరి సవతి తండ్రి అయినప్పటికీ..సొంత బిడ్డల్లా ప్రేమగా చూసుకునేవాడని చెప్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. తాము తల్లిదండ్రులతో కలిసి గడిచిన 18 నెలల్లో ఎన్నో సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లి సరదాగా గడిపి వచ్చామని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కడకు వెళ్లినా తమను తీసుకునే వెళ్లేవారని, అయితే పరీక్షల కారణంగా ఇటీవల గోవా వెళ్లలేకపోయామని చెప్తున్నారు. దీంతో గోవా నుంచి వచ్చిన రోజే తాము కోరడంతో ఆహారం తేవడానికి వెళ్లి కన్నుమూశారని బాధగా చెప్తున్నారు. ప్రణయ్‌ను పోలీసు కస్టడీకి కోరాంలంగర్హౌస్ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు ప్రణయ్‌ను అరెస్టు చేశాం. ఆదివారం రాత్రి కోర్టులో ప్రవేశపెట్టే సమయానికి మత్తు నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం కూడా తనకు తెలియదని, మద్యం మత్తులో ఏమి చేశానో తెలియదని చెబుతున్నాడు. స్నేహితులతో కాకుండా తాను ఒక్కడినే మద్యం తాగానని చెబుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరాం. – కె.రఘుకుమార్, లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
అలప్పుజ: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజలో కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు అతివేగంగా వచ్చి, కారును ఢీకొన్నదని స్థానికులు చెబుతున్నారు. బాధితులను వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్, ఇబ్రహీం, దేవన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక నివేదికల ప్రకారం మృతులు కోజికోడ్, కన్నూర్, చేర్యాల, లక్షద్వీప్‌కు చెందినవారు. ఈ ప్రమాదంలో కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
పావుగంటలో ఇంటికి చేరతామనగా..
అబ్దుల్లాపూర్‌మెట్: మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న అక్కా తమ్ముడిని మృత్యువు కబళించింది. ఓఆర్ఆర్పై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లె గ్రామానికి చెందిన ఎరగదిండ్ల మనోజ్ (25) అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్‌కు చెందిన తన అక్క చల్లా పద్మ (31), బావ వెంకటేశ్, మేన కోడళ్లు గంగ, యమున, మేనల్లుడు చల్లా అర్జున్ను తీసుకుని సోమవారం ఉదయం వనపర్తి నుంచి కారులో కుంట్లూర్‌కు బయలుదేరాడు. మార్గమధ్యలో ఔటర్ రింగ్‌రోడ్డుపై కోహెడ –పెద్దఅంబర్‌పేట మార్గంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారుకు.. ముందు అతి వేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో కారు లారీని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టాడు. లారీలో కారు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో మనోజ్‌తో పాటు పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వానిరి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
రంగారెడ్డి: చేవెళ్లలో లారీ బీభత్సం.. పలువురు మృతి!
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన లారీ.. కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. దీంతో, పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. ఇక, డ్రైవర్.. క్యాబిన్లో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘగనా స్థలంలో కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం రేవంత్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఆసరా అవుతాడనుకుంటే ఆగం చేసిండు!
లింగాలఘణపురం: చేతికందిన కొడుకు ఆసరా అవుతాడని అనుకుంటే ఆగం చేసిండంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మండల కేంద్రానికి చెందిన గండి అంజయ్య, రేణుక దంపతుల కుమారుడు కల్యాణ్ (22) గత నెలలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన తన స్నేహితుడు దేవరాయ కరుణాకర్‌తో కలిసి గత నెల 25న భువనగిరి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వంగపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కల్యాణ్‌కు తీవ్ర, కరుణాకర్‌కు స్వల్ప గాయాలు కాగా పోలీసులు హై దరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కల్యాణ్ కోమాలోకి వెళ్లాడు. ఐదు రోజులు చికిత్స పొందినా ఫలితం లేదు. శనివారం రాత్రి మృతి చెందాడు. ఫ్యాషన్ షోలపై మక్కువకల్యాణ్కు ఫ్యాషన్ షోలపై మక్కువ. 2023లో సడఫ్ ప్యాషన్ షో అడిషన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కల్యాణ్ భువనగిరికి ఎందుకు వెళ్లాడో ఏమో తెలియదు. ప్రమాదంలో గాయపడ్డాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో కోమాలో ఉన్న కొడుకును చూసి తల్లడిల్లారు. ఏదైనా పని చేసి తమకు అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలు నిరాశలయ్యాయి. తాము ఇష్టంగా కొనిచి్చన బైక్‌తో ప్రమాదం జరిగి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
ఎంత విషాదం.. తొలి పోస్టింగ్‌కు వెళుతూ యువ ఐపీఎస్ దుర్మరణం
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్‌రూట్, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఐపీఎస్ అధికారి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ట్రైనింగ్ పూర్తి చేస్తుకున్న అతడు..తన తొలి పోస్టింగ్‌ను చేపట్టేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం మరింత దురదృష్టకరం. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల హర్ష్ బర్దన్ క్ణాటక కేడర్‌కు చెందిన 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. సోమవారం తన తొలి పోస్టింగ్ స్వీకరించేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టి అనంతరం చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బర్దన్ తలకు బలమైన గాయం తగలంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువ ఐపీఎస్ మరణించాడు. డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి.మరోవైపు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటన స్థలంలో పోలీస్ వాహనం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఐపీఎస్ మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించిన సమయంలో ఇలా జరగడం దురదృష్ణకరమని అన్నారు.‘హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ మృతి చెందడం బాధాకరం. ఆయన ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతుండగా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్ణకరం. ఎన్నో ఏళ్లు శ్రమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుఉ ఇలా జరగకూడదు.హర్ష్ బర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని కన్నడలో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. -
ప్రాణాలు తీసిన ప్రమాదం
అందరూ 30 ఏళ్ల వయస్సు లోపువారే. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నవారు. ఆమెరికా నుంచి వస్తున్న మేనమామను తీసుకొచ్చేందుకు వెళ్తూ ఒకరు.. పరీక్ష రాసేందుకు వెళ్తున్న భార్య, తోడుగా వెళ్తున్న భర్త.. పొట్టకూటికోసం పనిచేసే డ్రైవర్.. అందరి ప్రాణాలను రోడ్డు ప్రమాదం గాలిలో కలిపేసింది. వారి కుటుంబాలకు కన్నీటిశోకాన్ని మిగిల్చింది. భోగాపురం/శ్రీకాకుళం క్రైమ్: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారి వద్ద శనివారం ఉదయం 8:12 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం నగరానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఫార్చూనర్ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపు ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో శ్రీకాకుళం నగరానికి చెందిన గవిడి కౌశిక్ (27), వడ్డి అభినవ్ (27), అతని భార్య మణిమాల (24)తో పాటు కారు డ్రైవర్ ఎం.జయే‹Ù(20) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం నాలుగంటే నాలుగే క్షణాల్లో జరిగిపోయింది. ఫ్రంట్ బోనెట్ పై నుండే గ్లాస్, ఇంజిన్లే కాక స్పీడోమీటర్ రీడింగ్ ముక్కముక్కలైందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మేనమామ కోసం.. మృతుల్లో ఒకరైన గవిడి కౌశిక్ శ్రీకాకుళంలోని ఇందిరా జ్యుయలర్స్ యజమాని గవిడి వాసుదేవ్ కుమారుడు. బంగారు వ్యాపారి లంక బావాజీ నాయుడుకి మనుమడు. నాయుడు జ్యుయలర్స్ యజమాని లంక గాంధీ పెద్దకుమార్తె నిహారికతో కౌశిక్‌కు 2023లో వివాహమైంది. ఈ జంటకు ఇంకా పిల్లలు లేరు. కౌశిక్ పిన్ని కుమారుడికి ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. ఈ శుభ కార్యానికి హాజరు కావడానికి కౌశిక్ మేనమామ బాలాజీ అమెరికా నుంచి శనివారం రానున్నారు. ఆయనను రిసీవ్ చేసుకోవడం కోసమే కౌశిక్ తన మామ గాంధీ కారులో విశాఖ బయలుదేరారు. పరీక్ష రాసేందుకు.. శ్రీకాకుళంలోనే లియో మెడికల్ ల్యాబ్ సెంటర్ నడుపుతున్న మన్మథరావు పెద్ద కుమారుడు వడ్డి అభినవ్ కౌశిక్‌కు మంచి స్నేహితుడు. అభినవ్‌కు నాలుగేళ్ల కిందట హిరమండలానికి చెందిన మణిమాలతో వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు మమకార్ ఉన్నాడు. మణిమాల బ్యాంక్ ఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నారు. ఆమెకు శనివారం విశాఖలో పరీక్ష ఉంది. దీంతో భార్యాభర్తలు కౌశిక్‌తో కలిసి కారులో విశాఖ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గురువారమే అభినవ్ పుట్టిన రోజు కూడా జరిగింది. జయేష్ డ్రైవర్‌గా.. ఏడాది కిందటే లంక గాంధీ ఫార్చూనర్ కారు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎం.జయేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో కలిసే కౌశిక్, అభినవ్, మణిమాల విశాఖ బయల్దేరారు. జయేష్ తండ్రి మరణించడంతో తల్లి, చెల్లితో కలిసి శ్రీకాకుళానికి అనుసరించి ఉన్న కుశాలపురంలో ఉంటున్నారు. వీరి స్థిర నివాసం కృష్ణాపార్కు వద్ద సున్నపువీధి. తల్లి టీకొట్టు నడుపుతుండగా జయేష్‌కు డ్రైవింగ్ రావడంతో స్థానిక ట్రావెల్స్‌లో కొన్నాళ్లు పనిచేసి ఇటీవలే గాంధీ వద్ద డ్రైవర్‌గా చేరారు. జయేష్ చనిపోవడంతో ఇప్పుడు వారి కుటుంబానికి ఆధారం పోయింది. ప్రమాదం జరిగిందిలా..? శనివారం ఉదయం వీరు కారులో విశాఖ బయల్దేరారు. అప్పటికే చినుకులు పడుతుండడంతో రోడ్డు తడిగా ఉంది. నాతవలస టోల్గేట్ దాటిన తర్వాత సుందరపేట వద్ద కారు నిలిపి టీ తాగారు. టీ తాగి బయల్దేరిన నిమిషాల వ్యవధిలోనే భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే రహదారిపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీ కారును బలంగా ఢీకొట్టడంతో రెప్పపాటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రదేశమంతా హాహాకారాలతో నిండిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్నుక్రమబద్ధీకరించారు. కౌశిక్ బాబాయ్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎన్.వి.ప్రభాకర్ తెలిపారు. మూడేళ్ల కిందట... పోలిపల్లి వద్ద జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మూడేళ్ల కిందట ఇదే ప్రాంతం వద్ద తీర్థయాత్ర బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనకాలే వచ్చిన మరో వాహనం బస్సును ఢీకొట్టడంతో 39 మంది యాత్రికుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. ఆ ఘటన మరచిపోకముందే మళ్లీ రోడ్డు ప్రమాదంలో అదే స్థలంలో నలుగురు మృతిచెందారంటూ స్థానికులు విచారం వ్యక్తంచేస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, కృష్ణాజిల్లా: కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల వ్యాన్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను మచిలీపట్నం బలరాంపేటకు చెందిన చీలి ప్రభు(30) ,భానుప్రకాశ్ (26), చింత బాబీ(36)గా గుర్తించారు.కారు మచిలీపట్నం వైపు వెళ్తుండగా, చేపల లోడుతో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు బొలేరో వ్యాన్ వెళ్తుంది. టైరు పేలడంతో డివైడర్ దాటుకుని వెళ్లి చేపల వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. చేపల వ్యాన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,విజయనగరంజిల్లా: భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం(నవంబర్30) ఘోర ప్రమాదం జరిగింది.శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు అదుపుతప్పింది.దీంతో కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్కరోడ్డుపైకి దూసుకెళ్లింది.అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ప్రయాణికుడి మృతి
హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి అమీర్‌పేట మెట్రోరైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో ఓ వ్యక్తి ఉన్న ఫలంగా కుప్పకూలడాన్ని గుర్తించిన సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో హార్ట్ స్ట్రోక్ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో అతను ఏపీలోని ఫిరంగిపురకు చెందిన బాలస్వామి సుదీర్ (39) గుర్తించారు. నగరంలోని కొత్తపేటలో ఉంటూ సింపోర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీ కొట్టిన కారుశామీర్పేట్: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఫర్హాన్ అహ్మద్ అన్సారి(23), షకీర్, రిజ్వాన్, అబ్దుల్లా స్నేహితులు. వీరు నలుగురు కలిసి కారు అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున కొండపోచమ్మ డ్యామ్‌కు బయలుదేరారు. అతివేగం కారణంగా మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీటులో ఉన్న ఫర్హాన్ అహ్మద్ అన్సారీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న షకీర్‌తో పాటు వెనక సీటులో కూర్చున్న రిజ్వాన్, అబ్దుల్లాకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లయిన నెల రోజులకే అనంత లోకాలకు..
ఉక్కునగరం: పెళ్లయిన నెల రోజులకే ఒక యువకుడికి నిండు నూరేళ్లు నిండి పోయాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఘటన.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతులిద్దరూ మేనమామ, మేనల్లుడు కావడం గమనార్హం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ దరి ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన డబ్బీరు పవన్‌కుమార్(31) పరవాడ ఫార్మాసిటీలో పనిచేస్తూ కూర్మన్నపాలెం దరి శాతావాహన నగర్లో నివాసముంటున్నాడు. అతని మేనల్లుడు కొండవలస రూపేష్‌కుమార్(21) హైదరాబాద్‌లో సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి 7.50 గంటల సమయంలో ఇద్దరూ కలిసి బైక్‌పై స్టీల్‌ప్లాంట్ ప్రధాన మార్గంలో కణితి జంక్షన్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో కూర్మన్నపాలెం నుంచి కణితి జంక్షన్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు బైక్‌ను సుమారు 30 మీటర్లు ఈడ్చుకుపోయింది. ఇద్దరిపై ఆర్టీసీ బస్సు టైర్లు ఎక్కడంతో.. వీరు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పవన్ కుమార్ బంధువులు అక్కడకు చేరుకుని రోదించిన తీరు అందరినీ కలచివేసింది. పవన్‌కుమార్‌కు గత నెల 26న వివాహమైంది. మరికొన్ని రోజుల్లో భార్యను తీసుకువచ్చేందుకు చూస్తున్న ఈ సమయంలో ఇలా జరిగిందంటూ అతని అక్క కన్నీటి పర్యంతమైంది. రూపేష్‌కుమార్ ఇక్కడకు ఎందుకు వచ్చాడో తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు లొంగిపోయాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం వారి మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సన్ ఆఫ్ సర్దార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు. -
ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ..
లంగర్‌హౌస్: ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ.. చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొన్న డ్రైవర్ ఆగిఉన్న ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు అతడికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన కార్తీక్, సంగారెడ్డికి చెందిన తరుణ్ రెడ్డి, సాతి్వక్, ఖమ్మంలో నివాసం ఉండే స్వరాజ్, ఆసిఫాబాద్‌కు చెందిన హరికృష్ణ ప్రాణ స్నేహితులు. వీరు ఇబ్రహీంబాగ్‌లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన వివేక్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది చేరాడు. వీరు లంగర్‌హౌస్ బాపునగర్‌లోని పీఎస్ఆర్ హాస్టల్లో.. వివేక్ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటలకు పరీక్షలు రాయాల్సి ఉండటంతో లంగర్‌హౌస్ బాపుఘాట్ వద్ద ఆటోలో బయల్దేరారు. రాందేవ్‌గూడ సమీపంలోకి రాగానే రోడ్డు మధ్యలో డివైడర్ పక్కనే ఓ ఆటో ట్రాలీ నిలిచి ఉంది. విద్యార్థులున్న ఆటో వేగంగా వచ్చి వెనక నుంచి ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వివేక్, కార్తీక్, ఆటో డ్రైవర్ మల్లే‹Ùలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం: క్షతగాత్రులు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న విద్యార్థులు తెలిపారు. ప్రమాదానికి ముందు ఆటో డ్రైవర్ స్టీరింగ్‌పై సెల్ఫోన్లో రీల్స్ చూస్తున్నాడని, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని క్షతగాత్రులు తెలిపారు. రోడ్డుపై ఆటో ట్రాలీ ఆగిఉన్న విషయం తాము గమనించి అరిచినా.. డ్రైవర్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో వినిపించలేదని.. అతని కళ్లు రీల్స్‌పై ఉండటంతో అంతే వేగంగా దూసుకెళ్లి ఆటో ట్రాలీని ఢీకొన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆటో డ్రైవర్ మల్లే‹Ùను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
ఒకరి వెంట ఒకరు.. మృత్యుఒడికి
వెల్గటూర్(ధర్మపురి): ఆ ముగ్గురూ స్నేహితులు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. కలిసే చదువుకున్నారు, ఆడుకున్నారు.. చివరికి మృత్యువులోనూ ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయారు.. వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి అనుబంధ గ్రామం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ముగ్గురి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం రోజే ఒకరు, ఆ తర్వాత రోజు విడిచి రోజు మరో ఇద్దరు చనిపోవడంతో స్వగ్రామం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. కుక్కలగూడూర్‌కు చెందిన నల్లపు అవినాశ్(19), బడుగు సాగర్(19), కుదిరె సాగర్(18) మంచి స్నేహితులు. గత శుక్రవారం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బైక్‌పై ధర్మపురి మండలంలోని రాయపట్నం వైపు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెల్గటూర్ మండలంలోని కొత్తపల్లి స్టేజి వద్ద 7వ నంబర్ రాష్ట్ర రహదారిపై ఎదురుగా ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురికీ తల పగిలి, తీవ్ర గాయాలయ్యాయి. అవినాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మిగతా ఇద్దరిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బడుగు సాగర్ ఆదివారం, కదిరె సాగర్ మంగళవారం చనిపోయారు.అందరివీ పేద కుటుంబాలే..బడుగు రవికి ఒక కూతురు, కొడుకు సాగర్ సంతానం. సాగర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కదిరె గట్టయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సాగర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. వీరిద్దరివి వ్యవసాయ కుటుంబాలు. నల్లపు తిరుపతికి ఒక కూతురు, కుమారుడు అవినాశ్ ఉన్నారు. అవినాశ్ ఇంటర్ పూర్తి చేశాడు. తిరుపతి మద్యానికి బానిసై, కుటుంబాన్ని పట్టించుకోడు. అవినాశ్ తొలుత పెట్రోల్ బంకులో పని చేశాడు. ప్రస్తుతం టెంట్‌హౌస్‌లో పనిచేస్తూ తల్లి, అక్కను పోషిస్తున్నాడు. చేతికందిన కుమారులు తమకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకుంటే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరివీ పేద కుటుంబాలేనని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు..ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి నుంచి రాయపట్నం వరకు ఉన్న రోడ్డు(15 కి.మీ.)పై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. గడిచిన రెండేళ్లలో 20 మందికి పైగా మృతిచెందారు. ఈ రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉన్నాయి. మరమ్మతు చేయకపోగా కనీసం ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేదు. గ్రామ కూడళ్లలో వీధి దీపాలు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికా రులు స్పందించి, రోడ్డుకు మరమ్మతు చేయించా లని ప్రజలు కోరుతున్నారు. -
Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్‌లో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి, అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న వైద్య విద్యార్థులు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం లక్నోలో ఓ వివాహ వేడుకకు హాజరైన వైద్య విద్యార్థులు కారులో సైఫాయికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.మృతుల్లో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నార్దేవ్, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. మొరాదాబాద్‌లోని బుద్ధ విహార్‌కు చెందిన కరణ్ సింగ్ కుమారుడు జైవీర్ సింగ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు.ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
అత్తారింటికి వెళ్తూ అనంతలోకాలకు..
మంచిర్యాలక్రైం: అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు అత్తారింటికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి భరతపు తిరుపతి (31) భార్య సోనియాకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారంరోజుల క్రితం కాలేజిరోడ్లోని పుట్టింటికి వెళ్లింది. భార్యను చూసేందుకు తిరుపతి సోమవారం రాత్రి బైక్‌పై అత్తారింటికి బయలుదేరాడు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని సోదరుడు రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.హెల్మెట్ ఉంటే ప్రాణాలు దక్కేవి..తిరుపతి బైక్ అదుపుతప్పి కిందపడిపోయిన తీరును పరిశీలిస్తే హెల్మెట్ పెట్టుకొని ఉంటే ప్రాణాలతో బయటపడేవాడని స్థానికులు పేర్కొంటున్నా రు. ఘటనలో అతని తలకు మాత్రమే బలమైన దె బ్బతగలండంతో మృతి చెందినట్లు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భర్త కళ్ల ముందే భార్య దుర్మరణం
జీడిమెట్ల: భార్యాభర్తలు షాపింగ్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన మినీ లారీ వారు ప్రయాణిస్తున్న భైక్‌ను ఢీ కొట్టడంతో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజీవ్‌గాంధీ నగర్, మోడీ ఎలిగెన్స్‌లో నివాసంఉంటున్న నాగరాజు, సిప్రారాణి త్రిపాఠి(28) దంపతులు శనివారం రాత్రి షాపింగ్ నిమిత్తం రంగా భుజంగా పైప్‌లైన్ రోడ్డు మీతుగా సుచిత్ర వైపు వెళ్తున్నారు. రంగా భుజంగా సినిమా థియేటర్ సమీపంలో వెనుకనుంచి వచ్చిన మినీ లారీ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నాగరాజు ఎడమవైపునకు పడిపోగా అతడి భార్య సిప్రారాణి(28) కుడివైపు కింద పడింది. సిప్రారాణి తలపై నుంచి లారీ వెనుక టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన అము అక్కడికక్కడే మృతిచెందింది. ఎస్సై నాయుడు ఘటనస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేశారు. -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
అనంతపురం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: అనంతపురం జిల్లాలో శనివారం(నవంబర్ 23) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని,వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం
విజయనగరం ఫోర్ట్: పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోతుందని తెలిసి అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి (11)తో కలిసి ద్విచక్రవాహనంపై మండలంలోని ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడిపోయారు. తుప్పల్లో ఉన్న రాళ్లపై పడడంతో పల్లవి తలకు తీవ్ర గాయమైంది. వెంకటరమణ కాలుకు, భార్య దేవి చేతికి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను వెంటనే గ్రామస్తులు ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పల్లవికి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. పాప అవయవాలు దానం చేస్తే మరికొందరికి పునర్జన్మనిచ్చినట్లు అవుతుందని మెడికవర్ వైద్యులు పల్లవి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో పల్లవి శరీరం నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు, కళ్లలోని కార్నియాలను సేకరించారు. కిడ్నీలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్సులో విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి ఒకటి, కిమ్స్ ఐకాన్‌కు మరొకటి తరలించారు. నేత్రాలను విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ ఐ ఆస్పత్రికి తరలించారు. అవయవదానానికి ముందుకొచి్చన పల్లవి తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. అయిదుగురు మృత్యువాత
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయపూర్ జిల్లాలో ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అయిదుగురు వ్యక్తులు కారులో అంబేరి నుంచి దేవరీ వైపు వెళుతుండగా వారి వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను అదుపులోకి తీసుకొని, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఉదయపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి హిమాన్షు సింగ్ రాజావత్ తెలిపారు. -
Jharkhand: పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్‌లో బోల్తా.. ఏడుగురు మృతి
హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌లో పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్ జిల్లాలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కోల్‌కతా నుంచి పాట్నా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బర్కతాలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
UP Accident: ఘోర బస్సు ప్రమాదం
లక్నో: యూపీలో అర్ధరాత్రి యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించారు. 15 మందికి గాయాలు కాగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.ఢిల్లీ నుంచి అజాంఘడ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు.. తప్పల్ వద్ద ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీ కొట్టింది. ఘటనలో ఐదుగురు చనిపోగా.. ఇందులో ఓ పసికందు, మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తుక్కుతుక్కు అయ్యింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రుల్ని జెవార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. यमुना एक्सप्रेस वे पर हुआ बड़ा हादसा, कांच से भरे ट्रक और वोल्वो बस में हुई टक्करअलीगढ़ : यमुना एक्सप्रेसवे पर वोल्वो बस और काँच से भरे ट्रक की हुई भिड़ंत, टप्पल के समीप हुआ हादसा। एक दर्जन से अधिक यात्रियों के घायल होने की सूचना। यात्रियों के बीच मची चीख पुकार। PS TAPPAL… pic.twitter.com/NlsQHitlJp— Praveen Vikram Singh (@praveen_singh5) November 20, 2024 -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాది మృతి
కుత్బుల్లాపూర్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్‌ఆశిష్‌సింగ్ కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్–2లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సందీప్ కుమార్ యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహియా వెళ్లాడు.అయితే.. తాజాగా అక్కడ రోడ్డు ప్రమాదంలో సందీప్ మృతి చెందాడు. ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో బయల్దేరారు. మౌంట్ గిలిడ్ వద్ద మరో కారు వేగంగా ఎదురు వచ్చి ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్‌ఆశిష్ సింగ్ వేడుకుంటున్నారు. -
తప్పిన పెను ప్రమాదం
కీసర: ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొడుతూ వెళ్లి ముందున్న చెట్టు కు ఢీకొని నిలిచిపోయింది. విప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చీర్యాల చౌరస్తాలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు రోజు మాదిరిగానే కీసర, కీసరదాయర, రాంపల్లి దాయర, గోధుమకుంట, కుందన్పల్లిల నుంచిద్యార్థులను తీసుకుని వస్తోంది. ఈక్రమంలో కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచి్చన కారును తప్పించడానికి డ్రైవర్ బస్సును పక్కకు తిప్పాడు. వేగంతో బస్సు అదుపు తప్పి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని కొట్టింది. స్తంభం విరిగి కింద పడిపోయింది. ఆ ధాటికి మరో రెండు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. కరెంటు తీగలు బస్సుపై పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సు అదే వేగంతో చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కాగా.. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బస్సు ఢీకొని ఉంటే పెను ప్రమాదమే సంభవించేది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ రాజు బస్సును అక్కడే వదిలేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానికంగా ఉన్న ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు విద్యార్థులను బస్సులోంచి బయటకు దింపారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను వాహనాల్లో ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.