సిద్దిపేటలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, దయాకర్
అక్రమ కేసులకు భయపడబోం.. బీజేపీ ఆటలిక సాగవు
ఆసిఫాబాద్ ‘జన జాతర’ సభ, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ రోడ్ షోలలో సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు
అందుకే 400 సీట్లు.. 15 రాష్ట్రాల్లో అధికారం కోసం యత్నాలు
కులగణన చేయాలని అడిగితే.. జనగణననే పక్కనపెట్టారు
బలహీన వర్గాలకు న్యాయం చేసినదీ, చేయబోయేదీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని వ్యాఖ్య
పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు
పంద్రాగస్టులోపు రుణమాఫీ.. రాజీనామా లేఖ రాసిపెట్టుకో హరీశ్!.. 45 ఏళ్లుగా సిద్దిపేటలో పాపాల భైరవుల్లా మామ, అల్లుళ్ల పాలన..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి, సిద్దిపేట/ కుత్బుల్లాపూర్: దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలసి కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మరోసారి ఆరోపించారు. తాను పది రోజులుగా ఈ విషయంపై మాట్లాడుతున్నందుకు ఢిల్లీ పోలీసులతో కేసు పెట్టించారని మండిపడ్డారు. ఇలాంటి అక్రమ కేసులకు తాను భయపడబోనన్నారు. ఢిల్లీ సుల్తానులను సైతం ఎదిరించే శక్తి తనకు ఉందని, ఇకపై బీజేపీ ఆటలు సాగబోవని వ్యాఖ్యానించారు. తెలంగాణను అభివృద్ధి చేయకుండా ప్రధాని మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. గురువారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జనజాతర సభ’, సిద్దిపేటలో రోడ్ షో, కార్నర్ మీటింగ్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో రోడ్ షోలలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘తెల్లదొరల కాలం 1881 నుంచీ ప్రతీ పదేళ్లకో సారి దేశ జనాభాను లెక్కించారు. 2021 వరకు కొనసాగింది. కానీ బీజేపీ జనాభా లెక్కలను పక్కనపెట్టింది. రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు రిజ ర్వేషన్లు పెంచుతామని చెబుతోంటే.. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనాభా గణన చేపట్టలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నారు. ఆ మార్పును దేశంలోని 15 రాష్ట్రాలు ఆమోదించాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారు. బీజేపీకి ఓటు వేస్తే, అది రిజర్వేషన్లపై పోటు పొడవబోతోంది.
తిరగబడి కొట్లాడుతా..
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలసి రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్న విషయంపై పది రోజులుగా నేను మాట్లాడుతుంటే.. ఢిల్లీ పోలీసులతో నాపై కేసు పెట్టించారు. నాపై గత పదేళ్లలో 200 కేసులు పెట్టారు. చంచల్‌గూడ జైలుకు పంపారు. అలాంటి అక్రమ కేసులకు భయపడబోం. ఢిల్లీ సుల్తానులను సైతం ఎదిరించే శక్తి మాకు ఉంది. ఇకపై బీజేపీ ఆటలు సాగవు. తిరగబడి కొట్లాడుతా. తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.
బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, ఐఐటీ, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కేంద్రాన్ని కోరితే గాడిద గుడ్డు ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని చెప్పి.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేశారు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. గత డిసెంబర్‌లో కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు బాయ్ బాయ్ చెప్పారు. మేలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి బాయ్ బాయ్ చెప్పాలి.
ఆదిలాబాద్‌ను ఎవరూ పట్టించుకోలేదు
గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ను పట్టించుకోలేదు. 1.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాణహిత, కుమురంభీం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. సోయం బాపురావును ఎంపీగా గెలిపిస్తే.. ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు. కాంగ్రెస్‌ది పేదల ప్రభుత్వం. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేశాం. పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కేసీఆర్ పాలనను ప్రజలు బండకేసి కొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.
గతంలో కేసీఆర్ పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చెప్పి వ్యాపారం చేశారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని దివాళా తీయించిన కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇంటిని సిద్ధం చేస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్, మెదక్, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థులు ఆత్రం సుగుణ, నీలం మధు, సునీతా మహేందర్‌రెడ్డిలను లక్ష ఓట్లకుపైగా మెజారీ్టతో గెలిపించాలని కోరారు.
ఆసిఫాబాద్ సభలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్.. సిద్దిపేట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. కుత్బుల్లాపూర్ రోడ్ షోలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మామా అల్లుళ్ల నుంచి సిద్దిపేటకు విముక్తి
‘‘మెదక్‌లో దొరల గడీలను బద్దలుకొడతాం. మామ కేసీఆర్, అల్లుడు హరీశ్‌రావు సిద్దిపేటను 45 ఏళ్లుగా పాపాల భైరవుల్లా పట్టిపీడిస్తున్నారు. వారి నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకే వచ్చా. హరీశ్‌రావు రాజీనామా లేఖ రాసిపెట్టుకో.. ఆగస్టు 15లోగా పక్కాగా రుణమాఫీ చేస్తాం.. సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను తెస్తా. ఇక్కడ లక్ష మంది రైతులతో సభ ఏర్పాటు చేస్తా. ఆగస్టు 15న సిద్దిపేటకు స్వాతంత్య్రం రాబోతోంది. ఈసారి ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి.
రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుని అక్రమంగా ఫాంహౌస్‌లు కట్టుకున్నోళ్లు కావాలా? మంచి చేసేవాళ్లు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈసారి కాంగ్రెస్ గెలవకపోతే ఉమ్మడి మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుంది. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసులతో కేసులు పెట్టించే పరిస్థితి వస్తుంది. కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారు. నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎలాగో, కేసీఆర్ హయాంలో వెంకట్రామిరెడ్డి అలాగే. కరీంనగర్‌కు చెందిన వెంకట్రామిరెడ్డిని మెదక్ అభ్యర్ధిగా నిలబెట్టారు.’’
Comments
Please login to add a commentAdd a comment