Revanth Reddy
-
పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారికి ఇంటి పెద్దగా, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హితవు
-
హైదరాబాద్‌కు ఢిల్లీ దుస్థితి రానివ్వం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు ఢిల్లీ తరహా దుస్థితి రాకుండా వాహన కాలుష్యానికి కళ్లెం వేసే చర్యలు చేపడుతు న్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో విపరీతంగా కాలు ష్యం పెరిగి ఆ నగరం చివరకు నివాసయోగ్యం కాని నగరాల జాబితాలో చేరేలా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరా బాద్‌కు భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా ఎలక్ట్రిక్ వాహనా లను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరా బాద్‌లోని ఆర్టీసీ డీజీల్ బస్సులను ఓఆర్ఆర్ ఆవలకు తరలించి వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతా మని అన్నారు.డీజిల్ ఆటోల విషయంలో కూడా ఇదే పద్ధతి అవ లంబించే ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రజాపాలన ఏడాది విజయో త్సవాల్లో భాగంగా ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో రవాణా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏడాది కాలంలో రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన విజయాలతో కూడిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఫొటో ఎగ్జిబిషన్, ట్రాఫిక్ నియమాలపై చిన్నారులు ఏర్పాటు చేసిన నమూనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఆర్టీసీ పునరుజ్జీవంలో ‘మహాలక్ష్మి’ కీలకం‘మూసీ పునరుజ్జీవం కూడా కాలుష్య నివారణ చర్యల్లో భాగ మే. దీనికి అందరూ సహకరించాలి. నష్టాల ఆర్టీసీ పునరుజ్జీ వంలో మహాలక్ష్మి పథకం కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి కే ఆ పథకంతో 115 కోట్లమంది ఉచితంగా ప్రయాణించటంద్వారా రూ.4 వేల కోట్ల వరకు ఆదా చేసుకున్నారు. ఒక్కో మహిళ సగటున ప్రతినెలా రూ.7 వేల వరకు ఆదా చేసుకుంటూ ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులది కీలక భూమిక. వారి సంక్షేమం, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఒకే ఏడాదిలో 55,143 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం.ఏ రాష్ట్రంలో కూడా ఈ ఘనత సాధించలేదు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు వచ్చి కావాలంటే లెక్కపెట్టుకోవచ్చు. ఒక్క తల తగ్గినా క్షమాపణ కోరేందుకు సిద్ధం..’ అని సీఎం సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్థంగా మారిన ఆర్టీసీని తమ ప్రభుత్వం గాడిలో పెడు తూ లాభాల బాట పట్టిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాగా తొలిసారి రవాణా శాఖ కోసం ఏర్పాటు చేసిన లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహాలక్ష్మీ పథకంతో మహిళలకు రూ.3,902.31 కోట్ల మేర ఆదా అయినదానికి గుర్తుగా అంత విలువతో ముద్రించిన భారీ నమూనా చెక్కును మహిళా ప్రయాణికులకు సీఎం అందించారు.మహిళలు ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి⇒ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ⇒ సీఎంతో కలిసి ఇందిరా మహిళాశక్తి బజార్ల ప్రారంభంమాదాపూర్ (హైదరాబాద్): మహిళలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మాదాపూర్‌లోని శిల్పారామంలో ఇందిరా మహిళాశక్తి బజార్లను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు సాధికారత కల్పిస్తేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత పెంచడం అభినందనీయమని, క్యాంటీన్ల ఏర్పాటు వినూత్న ఆలోచన అని పేర్కొన్నారు. ఎస్‌హెచ్‌జీల మహిళలతో మాట్లాడితే.. వారు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించినట్లు తెలుస్తోందని, వారిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. అదానీ, అంబానీలతో ఆడబిడ్డల పోటీ: సీఎంకొత్త సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల్లో లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 9వ తేదీన సచివాలయంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల్లో (ఎస్‌హెచ్‌జీలు) 65 లక్షల మంది ఉన్నారని, వీరిని కోటి మందిని చేయాలని మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారికి సూచించారు. మీరంతా కలిసి కోటి మంది సభ్యులను చేస్తే ఆ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.ఇందిరా మహళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ, రాబోయే రోజుల్లో సోలార్ పవర్ నిర్వహణ తదితర కార్యక్రమాలతో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామని రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గవర్నర్ సతీమణి సుధా జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
ఇంటి పెద్ద, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ‘రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే, పదేళ్ల తర్వాత ఆయన రూ.7 లక్షల కోట్ల అప్పుతో అస్తవ్యస్త పరిస్థితుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. మేం క్రమంగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటే ఆ పార్టీ నేతలు అడ్డు తగులుతున్నారు. పిల్ల చేష్టలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారికి ఇంటి పెద్దగా, పార్టీ పెద్దగా కేసీఆరే బుద్ధి చెప్పాలి. అలాగే వదిలేస్తే ఎవరికీ మంచిది కాదు.లేనిపక్షంలో వారిని నియంత్రించేందుకు చివరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరోక్షంగా కేటీఆర్, హరీశ్‌రావులను హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ అప్లికేషన్‌ను పలువురు మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. హోమ్ వర్క్ చేయని విద్యార్థుల్లా..‘కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగించి తీర్చిదిద్దిన రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే.. అప్పుల కుప్పగా మార్చి అప్పుల మిత్తి కట్టేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితికి దిగజార్చిన రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను ఏడాదిలో మేము చేసి చూపుతున్నాం. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు.. హోమ్ వర్క్ చేయని విద్యార్థులు, హోమ్ వర్క్ చేసిన వారి పుస్తకాల్లోని కాగితాలను చింపేసిన తరహాలో వ్యవహరిస్తున్నారు. మేము చేసే మంచి పనుల లబ్ధి ప్రజలకు చేరకుండా వారు మారీచ సుబాహుల తరహాలో అడ్డుపడుతున్నారు. మా పాలన కూడా వారి తరహాలోనే ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ పంథాను కేసీఆర్ మార్చేశారు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చొరవ చూపేందుకు వీలు కలి్పంచారు. ఆ పంథాను కేసీఆర్ మార్చేశారు. భారత్, పాకిస్థాన్ సైనికులు ఎదురుపడితే కాల్పులు జరుపుకొంటున్న చందంగా పాలక, ప్రతిపక్షాల మధ్య శత్రుత్వాన్ని పెంచారు.ప్రజాతీర్పును గుర్తించి ఇప్పటికైనా కేసీఆర్ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ప్రజా వ్యతిరేకతకు నిజామే తలవంచారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్ ఇంకా గుర్తిస్తున్నట్టు లేదు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. శాసనసభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలి. తన సీనియారిటీకి అనుగుణంగా విలువైన సూచనలు ఇవ్వాలి. మేమంతా ఎదుగుతున్న నేతలమే.. మా మంత్రులు తుమ్మల, జూపల్లి లాంటి వారు తప్ప మిగతా వారమంతా ఎదుగుతున్న నేతలమే. సభలో ప్రతిపక్ష నేత కుర్చీని ఖాళీగా ఉంచటం సరికాదు. కేసీఆర్ పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ సూచనలతో మార్గదర్శనం చేయాలి. మా ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మంచి పనులను గుర్తించాలి. ఏడాది పూర్తయిన సందర్భంగా చేస్తున్న విజయోత్సవాల్లో పాల్గొనాలి. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి మంత్రి పొన్నం ద్వారా ఆహ్వానాలు పంపుతాం. కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ హాజరుకావాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. పేదల ఇళ్లకు రూ.5 లక్షలిస్తున్నది తెలంగాణ ఒక్కటే.. ‘పేదల ఇళ్ల నిర్మాణ పథకానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. పేదలు పక్కా ఇంటిని కలిగి ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరాగాంధీ చేశారు. దేశంలో గుడి లేని ఊరుంటుందేమో గానీ ఇందిరమ్మ కాలనీ లేని పల్లె ఉండదనటంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయ భూముల సీలింగ్ యాక్టు ద్వారా భూములు సేకరించి పేదలకు పంచిన ఆమె, వారి సొంతింటి కలను నిజం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. నిరుపేదల జాడ తేల్చే యాప్ పేదల్లో అతి పేదలకు ఇళ్లు దక్కేలా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధునికతను వినియోగించుకుంటున్నాం. ఆ దిశలోనే ఇప్పుడు నిరుపేదల జాడ తేల్చేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. అర్హులకే లబ్ధి కలిగేలా, అక్రమాలు లేకుండా దీన్ని వినియోగిస్తాం. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారికి సొంతింటి లబ్ధి కలిగేలా ప్రత్యేకంగా ఇళ్లను కేటాయిస్తాం. ప్రస్తుతం ప్రకటించిన కోటాతో ప్రమేయం లేకుండా వారికి ఇళ్లను ఇస్తాం. లబ్ధిదారులకు స్తోమత ఉంటే ఇంటిని విస్తరించుకోవచ్చు..’ అని రేవంత్ తెలిపారు. ఎంత భారం అయినా నిధులిస్తాం: భట్టి నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా సొంత పక్కా ఇంటిని సమకూర్చాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టామని, ఎంత భారమైనా దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనతో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నా.. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన రూ.22,500 కోట్ల నిధులను మాత్రం సమకూర్చి తీరతామన్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం సమకూర్చటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు. అతిపేదలకు సొంతిల్లే లక్ష్యం: పొంగులేటి పేదల్లో అతి పేదలకు సొంతింటిని సమకూర్చటమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు అందిన లక్షల దరఖాస్తుల్లో అతిపేదలు, నిరుపేద వితంతువులు, వికలాంగులను గుర్తించి ఇళ్లను అందిస్తామని చెప్పారు. ఈ పథకంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. యాప్‌ను ఆవిష్కరించిన తర్వాత.. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నమూనాలను, డిజైన్లను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ పనులు పరిశీలించిన సీఎం ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని సూచన సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం లోపల ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం తన చాంబర్ నుంచి నడుచుకుంటూ నేరుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలానికి వచి్చన సీఎం.. విగ్రహం ముందు గ్రీనరీ పనులు, భారీ ఫౌంటైన్, ఆకట్టుకునేలా ఏర్పాటు చేస్తున్న లైటింగ్ సిస్టం పనితీరు గురించి ఆరా తీశారు. గేటు–2, గేటు 4లను అనుసంధానిస్తూ వేస్తున్న రోడ్లను చూశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం పంచేలా రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు.గేటు–4 పక్కన ప్రధాన గేటు ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులన్నీ విగ్రహావిష్కరణకు ముందురోజే పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. విగ్రహం ఏర్పాటులో ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటూ జరగకూడదని, విగ్రహాన్ని తెచ్చేటప్పుడు, వేదికపై ఏర్పాటు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్కడ పని చేస్తున్న కూలీలతో కూడా రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ , టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ పగ పట్టారు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పగ, ప్రతీకారాలతో పనిచేస్తోదంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. గురువారం రాత్రి గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్లు పోలీస్‌స్టేషన్ నుంచి కాదు.. గాంధీభవన్ నుంచి వస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు.రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనపైనే ఆయన దృష్టి. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై సంతకాలు చేసి. ప్రజల కాళ్లా వేళ్లా పడి ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు అమలు చేయాలని మేం అడుగుతున్నాం.. తప్పా?. రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అవ్వాతాతలకు 4వేల పెన్షన్ ఇస్తానన్నావ్ ఎప్పుడిస్తావ్?. మూసీలో పేదల ఇళ్లు కూలగొట్టొద్దన్నారు. ఇది సూచన కాదా?. సూచనలు తీసుకునే సోయి నీకు లేదు. గల్లీ నాయకుడిలా, ముఠా నాయకుడిలా కక్షతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, అంతకు ముందు మాజీ మంత్రి హరీష్‌రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని గంటల పాటు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న హరీశ్‌రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్ఎస్నేతలు కలిశారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగిన తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: హైకోర్టులో హరీష్ రావుకు ఊరట -
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర
-
Revanth Reddy: కాలుష్యం వెదజల్లే వాహనాలను నియంత్రించాలి
-
ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు. ..‘తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రావాలనే సంకల్పంతో ఆరుగ్యారెంటీలను అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ ఉద్యోగులు ఆరుగ్యారెంటీల నుంచి ప్రయాణికుల్లో అవగాహన కల్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలకు బ్రాండ్ అంబాసీడర్లుగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయబట్టే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది...అలాంటి బ్రాండ్ అంబాసీడర్లయిన ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తూనే ఉంటుంది. గత ప్రభుత్వంలో నష్టాల్లో ఉన్న సంస్థను కాంగ్రెస్ మహాలక్ష్మీ పథకం ప్రవేశపెట్టడంతో గతేడాది నవంబర్ నెల నుంచి ఈ ఏడాది నవంబర్ నెల వరకు సుమారు 113కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు...ఆర్టీసీ అభివృద్ది దిశగా నడిపిస్తున్నాం. రూ.4వేల కోట్లను ఆర్టీసీకి బదిలీ చేశాం. కేసీఆర్ పాలన లో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ఇప్పుడు అదే ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది. ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్బంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆరు గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశాం. ఇది ఆర్టీసీని పునరుజ్జీవింప చేసింది...ఇది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగును నింపే కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ అయినా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న నేనైనా బాధ్యతాయుతంగా రవాణా కార్మికుల ఆకాంక్షలను గౌరవించాల్సిందే.కానీ ఆనాడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పరామర్శించని పరిస్థితి. ఈనాడు కీలకమైన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా 5 నుంచి 7 వేలు ఆదా చేయగలుగుతున్నారు.పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. ప్రతీ నెలా ఒక కుటుంబానికి 10వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోంది. రాష్ట్రంలో 25లక్షల 35 వేల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21కోట్లతో రైతు రుణమాఫీ చేశాం.వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నాం. 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది. దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు.. అందుకే రైతులు సన్నాలు పండించండి. తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో, రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనాలకూ సన్నబియ్యం అందిస్తాం. ఈ నేలలో పండిన పంటనే మన బిడ్డలకు అందిస్తాం. బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పేకలిద్దాం.నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా. ఏ లక్ష్యం కోసం అమరుల ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. ఇందులో ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.నగరంలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖది కీలక పాత్ర. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు పంపాల్సిన బాధ్యత మీపై ఉంది..ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉంది.. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది.రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతాం.హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించండి..నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చాల్సిన బాధ్యత మనపై ఉంది.మూసీకి గోదావరిని అనుసంధానం చేసి మూసీని అభివృద్ధి చేస్తాం.అవసరమైతే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పారదోలుతాం.హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తాం’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.తెలంగాణ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఇళ్లకు సంబంధించి విధి విధానాలు సరళీకృతం చేస్తూ యాప్ రూపొందించాం. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఐటీడీఏ ప్రాంతాల్లో కోటాతో సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికన ఇళ్ల ప్రక్రియ జరుగుతుంది.ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న లోన్స్ తీర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా 7 వేల మందికి రుణ విముక్తి కలుగుతుంది. అర్హుల జాబితాను తయారు చేసి కేంద్రానికి పంపుతాం. మొదటి ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను పంపిణీ చేయబోతున్నాం. 3500 ఇండ్లతో సంబంధం లేకుండా ఆదివాసులకు ప్రత్యేక కోటా ఉంటుంది. 2004 నుంచి 14 వరకు వైఎస్సార్ హయంలో 25లక్షల 4వేల ఇండ్లను పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరిగింది. ప్రతీ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కట్టబోతున్నాం ప్రజలు వచ్చి చూడవచ్చు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభానికి ఆహ్వానం పంపుతున్నాం. పొన్నం ప్రభాకర్ వెళ్లి వారిని పిలుస్తారు. కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపిస్తున్నాం. 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్ ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుంది. పేదలకు భూములపై హక్కు కల్పించింది ఇందిరమ్మే. ఏ ఊరికి వెళ్లినా ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. రుణ విముక్తి చేయడం ద్వారా పేదలకు ఇళ్లపై హక్కు కల్పించాం. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తాం. కేసీఆర్ రద్దు చేసిన హౌసింగ్ బోర్డును పునరుద్దరిస్తాం. బీఆర్ఎస్ ప్రాధాన్యత వారి సొంత భవనాలు, పార్టీ కార్యాలయాలే. బీఆర్ఎస్ పాలనలో బస్తీ బస్తీలో బెల్టు షాపులు ఉండేవి. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడితే ఇప్పుడు పరిస్థితేంటి?. బీఆర్ఎస్ పాలనలో వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు. అద్బుతంగా ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప ఇళ్లను ఇవ్వలేదు. ప్రతిపక్షాలు మాకు సహకరించాలి.. సూచనలు చేయాలి. కేసీఆర్ మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి.. మాకు సూచనలు ఇవ్వండి. తెలంగాణ రైజింగ్ అని మనం అనకూడదా?. మీ చతురత చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
పదేళ్లలో కోటి మంది మహిళలు 'కోటీశ్వరులు': రేవంత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాబోయే పదేళ్లలో ఆర్టీసీ, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలు తదితర అన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా కోటిమందిని కోటీశ్వరు లుగా మార్చేవరకు తాము విశ్రమించబోమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే విజయం సాధిస్తామన్నారు. గత పదేళ్లకాలంలో ఒక్క విమానాశ్రయం కట్టలేదని, కానీ తాము రామగుండం, వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కడతామని తెలిపారు. గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలివ్వలేదు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. తమ ఇందిరమ్మ పాలనలో ఏడాదిలోనే 55,143 మందికి ఉద్యోగాలిచ్చామని, ఇదే వేదికపై 8,084 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్ 10 వరకు తాము చేసిన పనులన్నీ చెప్పుకుంటామన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపించామని, దీనిపై ప్రధాన మోదీ, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. కేటీఆర్, హరీశ్‌లను అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలోకి కేసీఆర్ వదిలిండని, తెల్లారిలేస్తే సోషల్ మీడియాలో తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లిలో యువవికాసం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.బలమైన కుర్రాడు ఒక్క రోజులో పిల్లాడిని కనలేడుగా..‘రూ.లక్ష కోట్లు వెచ్చించి కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలింది. మేం 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులేవీ చెక్కు చెదరలేదు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అందులో పెద్దపల్లి అగ్రగామిగా నిలిచింది. గతంలో వర్సిటీలు నిరాదరణకు గురయ్యాయి. మేం 10 వర్సిటీలకు వీసీలను నియమించాం. శాతవాహన వర్సిటీకి లా, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేస్తున్నాం. డీఎస్సీ పిలిచి 11 వేల టీచర్ కొలువులిచ్చాం. చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇందిరా పార్కు వద్ద మూసేసిన ధర్నా చౌక్ తెరిపించాం. మా ప్రమాణ స్వీకారం రోజునే ప్రగతిభవన్ ముళ్ల కంచెను తొలగించాం. ప్రగతిభవన్‌లో ప్రతివారం చిన్నారెడ్డి ప్రజల ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తున్నారు. పేద పిల్లలకు 40% కాస్మెటిక్, డైట్ చార్జీలు పెంచాం. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించుకుంటాం. ప్రతిదానికీ ఒక విధానం ఉంటుంది. బలమైన కుర్రాడికి పెళ్లి చేసినంత మాత్రాన.. ఒక్కరోజులో పిల్లాడిని కనలేడుగా..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.పదేళ్లలో ఉద్యాగాలెందుకు ఇవ్వలేదు? ‘కవితమ్మ ఎంపీగా ఓడిపోతే 3 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. సంతోష్‌కు రాజ్యసభ, ఎంపీ ఎ్ననికల్లో ఓడిన వినోద్‌కు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఇచ్చారు. అదే పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలివ్వలేదు. ఇందుకోసమేనా తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసింది? కొలువుల్లేక దాదాపు 35 లక్షల మంది ఉపాధి కూలీలుగా, అడ్డా కూలీలుగా మారారు. వందలాది బలిదానాలు, లక్షలాదిమంది కేసులు ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజల కోసమా? 80 వేల పుస్తకాలు చదివిన మీకు నిరుద్యోగుల కష్టం అర్థం కాలేదా? అందుకే మేం ఆలోచన చేసి 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దని యువ వికాసం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం..’ అని సీఎం పేర్కొన్నారు. కొందరు విష ప్రచారం చేస్తున్నారు..‘పెద్దపల్లి జిల్లా ప్రజల వెన్నుదన్నుల వల్లే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. కేసీఆర్ పదేళ్ల కాలంలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. కనీసం తనలా ఎకరానికి రూ.కోటి ఆదాయం ఎలా తీయాలో నేర్పలేదు. నాడు ఎస్సారెస్పీ నీటి కోసం అరెస్టయిన విజయరమణారావు కల నేడు ఫలించింది. ఇవాళ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. పెద్దపల్లి జిల్లాకు రూ.1,030 కోట్లతో ఆర్అండ్బీ, పీఆర్ పనులు, ఆర్టీసీ డిపో వచ్చాయంటే అందుకు కారణం మీ అభిమాన విజ్జన్న, శ్రీధర్‌బాబులే. వాస్తవానికి ఈ పనులు కావాలని మంత్రి శ్రీధర్‌బాబు మమ్మల్ని అడగలేదు..బెదిరించారు (నవ్వులు). తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి కరీంనగర్, ఆదిలాబాద్‌కు నీరిస్తాం. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. కొందరు తమకు భవిష్యత్తు లేదన్న భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారు చేసే విష ప్రచారాన్ని డిసెంబరు 10 వరకు తిప్పికొట్టి చరిత్ర తిరగరాస్తాం. నరేంద్ర మోదీ 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి పీఎంగా ఉన్నారు. గుజరాత్లో తొలి ఏడాదిలో 55వేల ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు సిద్ధమా? మోదీకి ప్రత్యేక విమానం పెడతాం. సచివాలయంలో చర్చ పెడతాం..’ అని సీఎం సవాల్ చేశారు. మద్దతు ధర, బోనస్ ఇస్తున్నాం..‘రైతులకు ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. 66 లక్షల ఎకర్లాలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి మేం కట్టిన ప్రాజెక్టులతోనే సాధ్యమైంది. ఆనాడు ఐకేపీ కేంద్రాలు తెరవమంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ చెప్పారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నాం. రైతుబంధు రూ.7,625 కోట్లు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీతో ఈ ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది. గుజరాత్లో రైతు రుణమాఫీ చేశారా? చర్చకు సిద్ధమేనా?..’ అని రేవంత్ ప్రశ్నించారు.కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు?‘రాహుల్‌గాంధీ పిలుపుతో కులగుణన చేపట్టాం. 95 శాతం పూర్తి చేశాం. కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు? బీసీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే.. కేసీఆర్ కుటుంబం ఎందుకు దూరంగా ఉంది. మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలేదా? బీసీ సంఘాలు ఆలోచించాలి. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజికంగా బహిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)’ హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. ఈ మేరకు గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఈ ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్’మొత్తంగా ఐదోదికాగా.. ఆసియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఇదే రెండో సెంటర్ కావడం గమనార్హం. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు.అమెరికా పర్యటనలో సంప్రదింపుల నేపథ్యంలో..ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్.. సంస్థ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో జీఎస్ఈసీ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం కార్యాలయం వెల్లడించింది. అక్టోబర్ 3న జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా–2024’ సదస్సులో జీఎస్ఈసీ ఏర్పాటుపై గూగుల్ కీలక ప్రకటన చేసిందని... పలు రాష్ట్రాలు పోటీపడినా హైదరాబాద్‌లో ఏర్పాటుకే గూగుల్ సంస్థ మొగ్గు చూపిందని తెలిపింది. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా పనిచేసే జీఎస్ఈసీ.. అధునాతన ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది.ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్: సీఎం రేవంత్గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హాన్సెన్ వ్యాఖ్యానించారు. జీఎస్ఈసీ ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సెంటర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. -
ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొడతాం: సీఎం రేవంత్
సాక్షి, పెద్దపల్లి జిల్లా: ఉద్యోగాల కోసం మొదలైన పోరాటం.. ఉద్యమంగా మారి తెలంగాణ తెచ్చుకునేలా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పెద్దపల్లిలో యువ వికాస సభలో మాట్లాడుతూ.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి నినాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు 56 వేల మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. మీ అందరి అభిమానంతోనే ముఖ్యమంత్రి అయ్యానని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అంటూ రేవంత్ పేర్కొన్నారు.పదేళ్లు మోసం చేసినోళ్లే ఇప్పుడు..‘‘పదేళ్లు మోసం చేసినోళ్లే ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. పదినెలల పాలనపై వాళ్లు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం?. ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా?. కేసీఆర్ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. కవిత ఓడిపోతే మూడు నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు...ఉదయం లేస్తే ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. శాసనసభకు వచ్చి కేసీఆర్ సలహాలు ఇవ్వొచ్చుకదా?. పదేళ్లలో నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు? పరీక్షలు వాయిదా వేయాలంటూఐ కృత్రిమ ఉద్యమం సృష్టించారు. ధర్నా చౌక్ ఎత్తేసి నిర్బంధం విధించారు. గతంలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి ఉండేదా?’’ అంటూ రేవంత్‌ప ప్రశ్నించారు.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు రేవంత్ సవాల్‘‘కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు సవాల్ విసురుతున్నా.. 25 ఏళ్లలో మోదీ గుజరాత్లో మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా... ? చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. 25లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది. గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా ఎవరు చర్చకు వస్తారో రండి. ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరు.. ప్రజలు మాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు...పది నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారు.. వాళ్ల దుఃఖం దేనికో అర్థం కావడంలేదు. పదేళ్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎందుకు పాల్గొనడంలేదు?. మీరు బీసీ వ్యతిరేకులా.. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? బీసీ సంఘాలు ఆలోచన చేయండి. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండి’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్: ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్జెండర్లు
హైదరాబాద్, సాక్షి: ట్రాన్స్జెండర్లు.. ఇక నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కోరు!. కానీ, అవే సిగ్నల్స్ దగ్గర అతిత్వరలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ కనిపించబోతున్నారు. ఈ మేరకు.. సెలక్షన్లో భాగంగా గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో తాజాగా వాళ్లకు ఈవెంట్స్ నిర్వహించారు అధికారులు.ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్లను గుర్తించి.. వాళ్ల సేవలను ఉపయోగించుకోవాలని ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ఈవెంట్స్‌కు వచ్చిన వాళ్లకు రన్నింగ్, జంపింగ్ ఇతర పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు.ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెల నిర్దేశిత స్టైపెండ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణవ్యాప్తంగా 3 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లుంటే.. వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్టు ఒక అంచనా అంచనా. -
‘రాహుల్ గాంధీకి ఉత్తరం రాస్తా.. నీ బండారం బయటపెడతా’
సాక్షి, తెలంగాణ భవన్ : ‘రాహుల్ గాంధీకి ఉత్తరం రాస్తా.. నీ బండారం బయటపెడతా’ అంటూ సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌తో తలపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు,కేసులకు వెరవకుండా సింహాల్లా పోరాడుతున్న నాయకులు వారి పోరాటాన్ని మరో నాలుగేళ్లు కొనసాగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం, ‘‘కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏమున్నది గర్వ కారణం అంటే..రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పులు కొత్తగా చేశారు. రేవంత్ బ్రదర్సేమో కోట్లకు పడగలెత్తారు. రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రజలు తిప్పల పాలైన మాట వాస్తవం. ఏడాది రేవంత్ పాలన, కాంగ్రెస్ పాలన అంటే గుర్తుకొచ్చేది లక్ష కోట్ల అప్పులు, దారుణ ఘాతుకాలు, తప్పులు. ఏడాది పాలనలో ఏం సాధించారని అడిగితే..చెప్పడానికి ఏమీలేవు. అందుకే ముఖ్యమంత్రి తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు...తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పదవికే కళంకం తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా బాగుపడ్డారా? అంటే అనుముల బ్రదర్సే. వాళ్లకే లాభం జరిగింది. రాష్ట్రానికి వెయ్యి కోట్ల పెట్టుబడులు ఇచ్చే స్థాయికి అనుముల బ్రదర్స్ ఎదిగారని ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరంటే అనుముల బ్రదర్స్ వస్తారేమో..అదానీని కూడా దాటేస్తారేమో అని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు...ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి చేసింది ఏందంటే.. పొద్దున్నే లేస్తే కేసీఆర్ మీద తిట్లు.. దేవుళ్ల మీద ఒట్లు. రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సింది పోయి.. దివ్యంగా ఉన్న రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపణలు చేసిన దివాళా కోరు సీఎం ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. కొత్త పరిశ్రమలు కాదు.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టుకున్నాడు.. తెలంగాణ రైజింగ్ అని అంటున్నారు. తెలంగాణ రైజింగ్ కాదు.. అనుముల బ్రదర్స్ రైజింగ్. అదానీతో పోటీ పడుతూ ఆస్తులు పోగేసుకుంటున్నారంటే వాళ్లు అనుముల బ్రదర్స్. అందుకే అనుముల బ్రదర్స్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్ ఇది పక్కా. ..పన్నెండు నెలల పాలన మొత్తం అసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీంలు తప్ప ఏం చేశారు. అప్పులు.. అప్పులు అంటూ మీ అసమర్థతను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం. వదిలి పెట్టం. ఏడాది పాలన పూర్తయితే సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి. ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగొద్దని.. అప్పులు అంటూ కారుకూతలు కూస్తున్నావు. అప్పుల మీద కాదు.. మీరిచ్చిన హామీల మీద చర్చలు జరగాలి’’ అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. -
రోశయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా మారింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా ఆవిష్కృతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించారు కాబట్టే రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిందన్నారు. మాజీ సీఎం రోశయ్య మూడో వర్ధంతి సందర్భంగా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.. రోశయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఏ రోజు కూడా తనకు ఈ పదవి కావాలని రోశయ్య అడగలేదని.. పార్టీ పట్ల నిబద్దత, క్రమశిక్షణ వల్లనే పదవులు వచ్చాయని తెలిపారురోశయ్య ఉన్నప్పుడు నెంబర్-2 ఆయనే.. నెంబర్ 1 మాత్రమే మారేవారని సీఎం పేర్కొన్నారు. నెంబర్ 2లో ఉన్నా.. ఆయన ఎప్పుడూ తన పైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి అని రోశయ్య చెప్పారని గుర్తు చేశారు. ‘చుక్క రామయ్య,ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడేందుకు నేను భయపడ్డాను. నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్‌కు పిలిపించుకొని ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది.ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు. సీఎంగా, గవర్నర్ గా,వివిధ హోదా ల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు. తమిళనాడు గవర్నర్‌గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు. కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. అ నాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు.ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారు. నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి. సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుంది.రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం. నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లైవుతుంది.’ అని తెలిపారు. -
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి : సీఎం రేవంత్ రెడ్డి
-
తుది దశకు ‘అమృత్’ పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మౌలిక సదుపాయా లు కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ (ది అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) కింద రాష్ట్రంలోని 12 పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశంలోని ఎంపిక చేసిన పట్టణాల్లో తాగునీటి సరఫరాతోపాటు సీవరేజీ పైప్లైన్ల వ్యవస్థ, పట్టణ రవాణా, పచ్చదనం పెంపు, వరదనీటి కాలువల అభివృద్ధి ప్రధాన అంశాలుగా 2015 జూన్ 25న ‘అమృత్’ పథకం ప్రారంభమైంది. తొలి దశలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 500 నగరాలను కేంద్రం ఎంపిక చేయగా అందులో రాష్ట్రం నుంచి హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), వరంగల్ (జీడబ్ల్యూఎంసీ), కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాలతోపాటు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట పట్టణాలను ఎంపిక చేశారు. ఈ 12 పురపాలికల్లో తాగునీరు, సీవరేజీ, పార్కుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనులు ప్రారంభించింది. కేంద్రం, రాష్ట్రం 50:50 ప్రాతిపదికన చేపట్టే ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 1,663.08 కోట్లు కాగా.. అందులో కేంద్ర సాయం రూ. 832.6 కోట్లు. 66 ప్రాజెక్టులు... తాగునీటికి అధిక మొత్తం...అమృత్ పథకం కింద 12 పురపాలికల్లో 66 ప్రా జెక్టులు ప్రారంభమయ్యాయి. రూ. 1,663.08 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పనులకు కేంద్రం తన వాటాగా రూ. 832.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో రూ. 831.52 కోట్లను కేంద్రం విడుదల చేయగా రాష్ట్రం తన వాటాతోపాటు కేంద్రం వాటా లో రూ.806.21 కోట్లు వినియోగించుకుంది. తాగు నీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ పట్టణాల్లో 27 నీటి సరఫరాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందుకోసం 4,336.54 కిలోమీటర్ల పొడవైన నీటి సరఫరా పైప్లైన్లను నిర్మించారు. వాటి విలువ రూ. 1,424.09 కోట్లు. అందులో అత్యధికంగా వరంగల్‌కు రూ. 341.3 కోట్లు వెచ్చించడం విశేషం. ఈ పథకం కింద నిజామాబాద్, సిద్దిపేటల్లో రూ. 203.3 కోట్ల విలువగల నాలుగు మురుగునీటి శుద్ధి, సెప్టిక్ ట్యాంకు వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు లను చేపట్టారు. ఈ రెండు పురపాలికల్లో 278.53 కి.మీ. పొడవైన మురికినీటి పారుదల పైప్లైన్లను ఏర్పాటు చేశారు. 5.54 లక్షల నల్లా నీటి కనెక్షన్లు, 0.87 లక్షల మురుగునీటి పారుదల కనెక్షన్లను అ మృత్, కన్వర్జెన్సెస్లో భాగంగా సమకూర్చారు. రాష్ట్రంలోని 12 పురపాలికల్లో రూ. 35.69 కోట్లతో 35 హరిత స్థలాలు, పార్కులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్రంలో 18.25 ఎంఎల్డీ సామర్థ్యంగల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ)ను, 442.45 ఎకరాల విస్తీర్ణంలో హరిత క్షేత్రాలను ‘అమృత్’ కింద అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమృత్ 2.0 కింద కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయి.సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని కోరిన సీఎం రేవంత్2021లో మొదలైన అమృత్–2.0 (పథకం రెండో దశ)లో భాగంగా హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ప్రతిపాదించిన సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ (సీఎస్ఎంపీ)ని చేర్చాలని కోరారు. అమృత్ తొలి విడత ప్రాజెక్టులో జీహెచ్ఎంసీలో పచ్చదనం కోసం కేవలం రూ. 3.3 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో సీఎస్ఎంపీని అమృత్లోకి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌తోపాటు సమీప పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కి.మీ. మేర రూ. 17,212.69 కోట్లతో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు ఖట్టర్‌కు సీఎం తెలిపారు. సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. -
న్యూయార్క్‌తో పోటీ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాలు కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌లతో నివాసయోగ్యం కాకుండా పోతున్నాయని.. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా ఉండాలంటే నగర అభివృద్ధితోపాటు మూసీ ప్రక్షాళన జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాలుష్యాన్ని తొలగించలేని పరిస్థితితో అడవుల్లోకి వెళ్లి మళ్లీ ఆది మానవుల్లా బతకాలా? ఆధునిక నగరంలో అధునాతనంగా జీవించాలా? అన్నది ఆలోచించుకోవాలని కోరారు. నాలుగున్నరేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తే... ప్రపంచ పెట్టుబడులకు వేదికగా అద్భుత నగరం రూపుదిద్దుకుంటుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీపడతామని ప్రకటించారు. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ రైజింగ్’పేరిట హెచ్ఎండీఏ మైదానంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన పనులకు సీఎం రేవంత్ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మూసీలో పారిశ్రామిక వ్యర్థాలు, మనుషులు, పశువుల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. అలాంటి మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీలకు కనీస అవగాహన లేదా? హైదరాబాద్ ప్రపంచంతో పోటీపడాలంటే రీజనల్, రేడియల్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎస్టీపీలు, కృష్ణా, గోదావరి జలాలు, మెట్రో విస్తరణ అవసరం. వాటికి రూ. లక్షన్నర కోట్లు కావాలి. ఆ నిధులు నాలుగున్నరేళ్లలో ఖర్చు చేస్తే అద్భుత నగరంగా, ప్రపంచ పెట్టుబడులకు వేదికగా అవుతుంది. ఇందుకు కేంద్రం సహకరించాలి. నగర అభివృద్ధి అంతా కాంగ్రెస్‌తోనే.. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్‌సిటీకి శిలాఫలకం వేస్తే... టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నిర్మాణం పూర్తిచేసి ఐటీ కంపెనీలు తెచ్చారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ కంపెనీలను కొనసాగించడమేకాక ఔటర్ రింగ్ రోడ్‌ను, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌ను, ఫార్మా కంపెనీలను తెచ్చారు. దీనితో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు పెరిగాయి. పి.జనార్దనరెడ్డి కృషితో నగరానికి తాగునీళ్లు వచ్చాయి. రాష్ట్ర ఖజానాకు 65శాతం ఆదాయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే.. నాటి సీఎంల ముందుచూపుతోనే వస్తోంది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. ఇందుకు అవసరమైన దాదాపు 40–50 వేల ఎకరాల భూమికిగాను దాదాపు 15 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సహకరించాలి. ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వెజిటబుల్, ఫ్రూట్ మార్కెట్లు, డెయిరీ, పౌల్ట్రీ, మీట్.. ఇలా అన్ని ఉత్పత్తులు ఒకేచోటికి తెస్తాం. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. గప్పాలతోనే పదేళ్లు గడిపారు గత ప్రభుత్వంలో సీఎం గప్పాలతోనే పదేళ్లు గడిపారు. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధిచేస్తామని మురికికూపంగా మార్చారు. ఆ పార్టీ వాళ్లు సెల్ఫీలు తీసుకునే, ట్విట్టర్లో పెట్టుకునే శిల్పారామం, ట్యాంక్‌బండ్ కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేసినవే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని విష ప్రచారం చేశారు. గత ప్రభుత్వం ఉన్న 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంటే.. తమ ప్రభుత్వం వచ్చాక అదే సమయంలో 29శాతం అభివృద్ధిని రియల్ ఎస్టేట్ రంగం సాధించింది. మంచి చెబితే అమలు చేస్తాం బీఆర్ఎస్ గతంలో చేసింది అంతా అప్పులు, తప్పులే. అధికారం పోయాక జ్ఞానోదయమై ఏవైనా సూచనలు చేస్తామంటే అభ్యంతరం లేదు. మేం చేసేది నచ్చకపోతే... వారి విధానాలేమిటో, ఎన్ని నిధులు అవసరమో చెప్పాలి. అవి సహేతుకమైతే, ప్రజలకు ఉపయోగపడేవే అయితే భేషజాలు లేకుండా అమలుచేస్తాం. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉప సంఘం వేస్తున్నాం. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. బీఆర్ఎస్, బీజేపీ వారి ప్రతిపాదనలు పంపాలి. అడ్డుకుంటామంటే కుదరదు మేం ఏది చేస్తామన్నా ప్రతిపక్షాలు అడ్డుకుంటామంటే కుదరదు. మా మీద కోపంతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను శిక్షించవద్దు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం, జీవన విధానం, ఆత్మగౌరవం. దీన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. అందుకే ఏ రకంగానైనా కాపాడుకుంటాం. అందుకోసం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తాం. టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీపడతాం..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మీకురాలితో సీఎం కరచాలనం.. ‘హైదరాబాద్ రైజింగ్’కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్.. వేదికపైకి వెళ్లే ముందు అక్కడున్న పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, భద్రత కిట్స్‌ను పంపిణీ చేశారు. ఒక కార్మికురాలితో కరచాలనం చేసి, స్థితిగతులను తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన దివ్యాంగులను పలకరించారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కిషన్రెడ్డీ... ‘‘గుజరాత్లో సబర్మతి ఫ్రంట్‌కు చప్పట్లు కొట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇక్కడ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మూసీలో మునిగినా, అందులో ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోబోం. ప్రక్షాళన చేసి తీరుతాం. ప్రధాని మోదీ దగ్గర ఏటా రూ.40 వేల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అందులోనుంచే సబర్మతి ఫ్రంట్తోపాటు గుజరాత్‌కు గిఫ్ట్ సిటీ, బుల్లెట్ రైలు తీసుకెళ్లారు. మరి నువ్వు తెలంగాణకు ఏం తెచ్చావు? మోదీ గుజరాత్‌కు నిధులు తీసుకెళ్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారా? మెట్రో విస్తరణకు రూ.35 వేల కోట్లు కావాలి. రీజనల్‌రింగ్ రోడ్డుకు మరో రూ.35 వేల కోట్లు కావాలి. మోదీ గుజరాత్, బెంగళూరు, చెన్నైలకు ఇస్తారుగానీ.. హైదరాబాద్‌కు ఎందుకివ్వరు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కిషన్రెడ్డీ... మీరు నిధులు తెస్తారా లేక గుజరాత్‌కు వలసపోతారా? సికింద్రాబాద్ ఎంపీగా ట్రాఫిక్ చిక్కులు తీర్చేందుకు, మెట్రో విస్తరణకు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి నీ యాక్షన్ ప్లాన్ ఏంటి? కేంద్ర మంత్రిగా, ఎంపీగా నీ ప్రతిపాదనలేవో ప్రజలకు జవాబు చెప్పు. ఎన్ని నిధులు తెస్తావో చెప్పు. రాష్ట్రానికి రూ.లక్షన్నర కోట్లు తీసుకురా. 10 లక్షల మంది ప్రజలతో మోదీని, నిన్ను సన్మానించే జిమ్మేదారి నాది’’ మూసీ వెంట గుడిసె వేసుకుని ఉండి చూడు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి సవాల్ ‘‘మూసీ పరీవాహక ప్రాంతంలో ఒకరోజు నిద్రపోవడం కాదు.. అక్కడే గుడిసె వేసుకుని కుటుంబంతో సహా నివసించి చూపించు..’’అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఒకరోజు మూసీ వద్ద నిద్రపోయి తర్వాతి నుంచి విలాసవంతమైన ప్యాలెస్‌లో ఉండటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ‘హైదరాబాద్ రైజింగ్’కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మూసీని జీవనదిగా మార్చాలని ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ మూసీ ప్రాజెక్టుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ, కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ తరహా కాలుష్యం ముప్పు హైదరాబాద్‌కు రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీఎం చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలివే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3,446 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. జల మండలి ఆధ్వర్యంలో రూ.669 కోట్లతో నిర్మించిన మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీల)ను, తాగునీటి సరఫరా కోసం రూ.45 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల సుందరీకరణ పనులను కూడా ప్రారంభించారు. ఇక హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో రూ.1,500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. కృత్రిమ మేధ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. -
లక్ష కేసులు పెట్టినా నన్ను ఆపలేరు..
-
మిస్టర్ రేవంత్.. అంత వరకు నేను ఆగను: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం అంటూ విమర్శించారు. ఇదే సమయంలో తనపై లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, తాను మాత్రం ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అంటూ వార్నింగ్ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు.నీ రెండు నాలుకల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. #CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. మిస్టర్ @revanth_anumula అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం,…— Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2024 -
కేసీఆర్ మొక్క కాదు.. వేగు చుక్క
సాక్షి, హైదరాబాద్: ‘పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు, వేగు చుక్క. రేవంత్‌రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో నిధులు పారితే రేవంత్ పాల నలో తిట్లు పారుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పోటీపడి తిట్ల దండకం చదువు తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం తన నివా సంలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కవిత భేటీ అయ్యారు.‘బీఆర్ఎస్ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఉ ద్యమ కాలంనుంచి అనేక కష్టాలను తట్టుకుని కార్యకర్తల బలంతో బీఆర్ఎస్ నిలబడింది. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసే వారే నిజమైన కా ర్యకర్తలు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు అమ లు చేయని తీరును ప్రజల్లో ఎండగట్టాలి’ అని కవిత దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ విధించడం దుర్మార్గమని అన్నారు. అఖిల భార త పద్మశాలి సంఘం నాయకులు కవితను కలిసి కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి జాగృతి సమీక్షలు...ఉమ్మడి జిల్లాల వారీగా ఈనెల 4 నుంచి తెలంగాణ జాగృతి సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు. 4న వరంగల్, నిజామాబాద్, 5న కరీంనగర్, నల్లగొండ, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు ఉంటాయి. 7న హైదరాబాద్, ఖమ్మం, 8న మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ జాగృతి ముఖ్య నేతలతో కవిత సమావేశమవుతారు. -
టీజీపీఎస్సీని భ్రష్టుపట్టించారు
సాక్షి, హైదరాబాద్: గత పాలకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను రాజ కీయ పునరావాస కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అదే తాము ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారిని టీజీపీఎస్సీలో నియమించామని చెప్పారు. ఏడాది ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా సోమవారం ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ మైదానంలో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో... సీఎం చేతుల మీదుగా 422 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు.16 నర్సింగ్ కళాశాలలను, 32 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గతంలో ఆర్ఎంపీ డాక్టర్‌ను, డిప్యూటీ తహసీల్దార్‌ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఒక కలెక్టర్‌ను సెక్షన్ ఆఫీసర్, అటెండర్ నిర్ణయించలేరు కదా. అందుకే ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని టీజీపీఎస్సీలో నియమించాం.టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలతో 563 మంది గ్రూప్–1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. టీజీపీఎస్సీ పనితీరుకు ఇది గీటురాయి. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేస్తుంటే మూడున్నరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ సర్వేల్లో చదివిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను కమిషన్ చైర్మన్‌గా నియమించాం.రికార్డు స్థాయిలో నియామకాలు చేశాంఏడాదిలోనే 14 వేల మందిని వైద్యారోగ్య శాఖలో నియమించడం దేశంలోనే రికార్డు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చి ఎలాంటి వసతులూ కల్పించలేదు. కానీ మేం దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కొత్తగా 6,500 మందిని వైద్యారోగ్యశాఖలో నియమించాలని నిర్ణయించాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒకే ఏడాది 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు.ఈ విషయంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తేనే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునేవాళ్లు. డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు అపోలో, యశోదా వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించి ఆదుకున్నారు. అలాంటి ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. గత ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.835 కోట్లను ప్రజలకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఇప్పటివరకు కోటీ 15 లక్షల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారు. మేం 50లక్షల కుటంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కచ్చితంగా ఇచ్చి తీరుతాం. మేం రుణమాఫీ పూర్తి చేయడంతో కొందరి గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. కొందరు ఫాంహౌజ్‌లలో పడుకుని బాధపడుతున్నారు. మేం సన్నవడ్లకు ఇస్తున్న బోనస్‌తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. బోనస్ కొనసాగిస్తుంది. సన్నాలు పండించండి. బోనస్ తీసుకోండి.ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోండిసంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దులు, బసవన్నల్లా కొందరు ఇప్పుడే వస్తున్నారు. వాళ్లు ఎన్ని సన్నాయిలు ఊదినా.. అది సర్పంచి ఎన్నికల కోసమే. ఢిల్లీలో 11 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాపై విమర్శలు చేస్తున్నాయి. ఈ 10 నెలల్లో అద్భుతాలు జరుగుతాయా? ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. ప్రభుత్వంపై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి..’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజారోగ్యంపై మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది: భట్టిరాష్ట్రంలో పేదల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆరోగ్య ఉత్సవంలో ఆయన మాట్లాడారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని.. ఆరోగ్యశ్రీని, ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో పేదల వైద్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇక మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని.. అదనంగా రూ.487.29 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. ట్రాన్స్జెండర్ల కోసం దేశంలోనే తొలిసారిగా మైత్రి క్లినిక్‌లను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై 7న చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి రెండు నాలుకల మనిషి అని, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ప్రజలను నిలువునా ముంచేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. పూటకో రకంగా మాట్లాడే విద్యలో రేవంత్ పీహెచ్డీ చేశాడని ఎద్దేవా చేశారు. రేవంత్ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టాలన్నదే తన ప్రయత్నమని చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సవివర చార్జిషీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, చిరుమర్తి లింగయ్య తదితరులతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘గత ఏడాది పాలనలో సీఎం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పట్టే ఆణిముత్యాలు’ అంటూ వివిధ అంశాలపై రేవంత్ చేసిన ప్రకటనల వీడియో క్లిప్పింగులను హరీశ్‌రావు విడుదల చేశారు.ఏడాది పాలనలో ఎడతెగని వంచనతెలంగాణ ప్రజలను మోసగించడం, వంచించడం రేవంత్ నైజమని హరీశ్ విమర్శించారు. ఏడాది నుంచి ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగుతోందని.. సీఎం అపరిచితుడిలా పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడో పంటకు రైతు బంధు ఇవ్వాలని... కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని ప్రకటించిన రేవంత్ ప్రస్తుతం మాట మార్చారని ఆరోపించారు.‘బతుకమ్మ చీరల పథకం, ఎల్ఆర్ఎస్, పోటీ పరీక్షల వాయిదా, కుల సర్వే, ఆక్రమణల కూల్చివేతలు వంటి అంశాలపై రేవంత్ మాటలు మారుస్తున్నారు. ఏక్ పోలీసు విధానం, మద్యం, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై రేవంత్ మాటలు మార్చారు. పచ్చ పార్టీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత అన్నారు.. ఇప్పుడు అమ్మ అంటున్నారు. రేవంత్ అవసరమొస్తే కాళ్లు పట్టగలడు, అవసరం తీరిన తర్వాత కాళ్లు లాగగలడు..’’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.నిర్బంధాలు, అణచివేతలే..కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పిందని... గత ఏడాది పాలనలో నిర్బంధాలు, అణచివేతలు, లాఠీచార్జీలు, కంచెలు, ఆంక్షలు నిత్యకృత్యం అయ్యాయని హరీశ్ ఆరోపించారు. న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై కేసులు, లగచర్ల గిరిజనులపై దాడులు ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారని.. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాలరాసి, రాక్షస పాలన కొనసాగిస్తురని మండిపడ్డారు. విపక్ష నేతగా నక్సలైట్లపై మొసలి కన్నీరు కార్చిన రేవంత్.. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. -
పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ సోమవారం ప్రారంభించారు. పరిశ్రమలో కలియతిరిగి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. పరిశ్రమ ద్వారా వచ్చే ఉద్యోగాలతోపాటు పరోక్ష ఉపాధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పారిశ్రామిక వృద్ధి దిశగా చర్యలుహెచ్సీసీబీ పెట్టుబడులు ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసి సాగుతాయనే దానికి ఉదాహరణ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి కల్పన ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల సమ్మిళిత వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి ఈ గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ ఉదాహరణ అని చెప్పారు. కగా.. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సీఈవో జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నీటి పైప్‌లైన్‌ను త్వరగా పూర్తి చేసిందని, తెలంగాణ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటామని చెప్పారు. హెచ్‌సీసీబీ తెలంగాణలో రూ.3,798 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికిపైగా ఉపాధి అవకాశాలను కల్పించిందని పేర్కొన్నారు. -
ప్రకృతిని కాపాడితే అదే మనల్ని ఆదుకుంటుంది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఇది రైతు విజ్ఞత. గత కొన్ని నెలలుగా మన నీటి వనరులు, మన పర్యావరణ సంపదను మన భవిష్యత్తు కోసం మన వారసత్వం కోసం రక్షిస్తున్నాం. ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుంది. హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన అమీన్పూర్ సరస్సులో కనిపించిన 12-సెంటీమీటర్ల రెడ్ బ్రెస్ట్ ఫ్లైక్యాచర్ చూస్తే మనం చేసేది సరైనదే అని తెలుస్తుంది.. ఇది దేవుడి ఆశీస్సులాంటిది’ అంటూ కామెంట్స్ చేశారు. I always believed that if we take care of nature, nature will take care of us. It is farmer’s wisdom.We stopped lake encroachments after years of constant depletion and destruction of our water bodies, our ecological wealth, our legacy for our future in the last few months.… pic.twitter.com/GgFCj64wYG— Revanth Reddy (@revanth_anumula) December 2, 2024