బెల్లంపల్లి: దేశంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ విజయసంకల్ప యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బజార్‌ఏరియా కాంటా చౌరస్తాలో శుక్ర వారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో నెలకొన్న సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు.
75ఏళ్లపాటు పాలించి రూ.12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని స్వయంగా ఆ పార్టీ నాయకులే వద్దనుకుంటున్నారనీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాహుల్ విదేశాలకు వెళ్లిపోవడం తథ్యమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లకే పరిమితం అవుతుందని, బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.
పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు..
తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పదేళ్లపాటు పాలన సాగించిన కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుని, అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందన్నారు. సభలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు అమురాజుల శ్రీదేవి, బోడిగ శోభ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment