
కరీంనగర్‌లో మాట్లాడుతున్న సీఎం రేవంత్. పక్కన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధులు నిజామాబాద్/కరీంనగర్/మంచిర్యాల: ‘లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టలేని బీఆర్‌ఎస్ రాష్ట్రంలో ఉప ఎన్నికలొస్తే గెలుస్తుందట. అధికారంలో ఉన్న పదేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితకు, టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌కు మంత్రి పదవులిచ్చినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? బీఆర్‌ఎస్‌ది గతమే.. భవిష్యత్తు లేదు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీని బొంద పెడితేనే.. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు వస్తాయి.
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించండంటున్న పట్టభద్రులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత తాము ఎవరికి ఓటేస్తరో పట్టభద్రులకు సమాధానం చెప్పాలి..’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల నస్పూర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం, సంకల్ప సభల్లో ఆయన మాట్లాడారు.
కేటీఆర్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు..
‘బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నిధుల కోసం ఢిల్లీ వెళ్లకుండా.. కేటీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి చీకట్లో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న మాతో కలిసి రావాలి. కానీ చీకటి బేరాలు కుదుర్చుకునేందుకు ఢిల్లీ వెళుతున్నారు. బీఆర్‌ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్ధిని పెట్టలేదు. బండి సంజయ్ ద్వారా బేరాలు కుదుర్చుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌కు అభ్యర్థి లేకున్నా ఓడించాలంటున్నారంటే, దాని వెనుక మతలబు ఏంటో చెప్పాలి. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగా.. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికే బీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పకుందని ప్రజలు గమనించాలి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను అమెరికాలో దాచిపెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలి. ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్ కాగితాలను ఈడీ పట్టుకుపోయింది. కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకోగానే బండి సంజయ్ కేసులు నీరు గారుస్తున్నారు..’ అని సీఎం మండిపడ్డారు.
కుల గణన సర్వే మోదీ ఎందుకు చేయలేదు?
‘కులగణనపై బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వీధినాటకాలు అడుతున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఉపకులాలకు రిజర్వేషన్లు అమలవుతున్న మాట వాస్తవం కాదా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేని బీజేపీవి చావు తెలివితేటలు. మతం పేరుతో ప్రతిసారీ విద్వేషాలు రెచ్చగొడితే ఎవరూ నమ్మరు. కులగణన సర్వేను మోదీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? చేయకపోగా ఇప్పుడు వండిన అన్నంలో ఉప్పు వేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది.
బలహీనవర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోంది. మేము వందేళ్ల సమస్యను పరిష్కరించాం. మంద కృష్ణమాదిగను కౌగిలించుకున్న మోదీ సమస్య పరిష్కరించలేదు. మా ప్రభుత్వమే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది. 100 ఏళ్ల కింద తెల్లోళ్లు చేసిన తరువాత నేను కులగణన చేసి లెక్క తేల్చిన ఘనత నాది. నా లెక్కలు తప్పయితే మేమంతా ముక్కు భూమికి రాస్తాం. బీజేపీకి దమ్ముంటే..జనగణనలో కులగణనలో చేయాలి..’ అని రేవంత్ సవాల్ విసిరారు.
తెలంగాణకు శకునిలా కిషన్‌రెడ్డి
‘కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు శకునిలా మారాడు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు ఇతర ప్రాజెక్టులకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నాడు. కాశీలో గంగ, ఢిల్లీలో యమున, గుజరాత్‌లో సబర్మతి నదులను ప్రక్షాళన చేస్తున్న బీజేపీ హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళనకు మాత్రం అడ్డుపడుతోంది..’ అని ముఖ్యమంత్రి విమర్శించారు.
మేము చేసిన మంచిని చూసి ఓటేయండి
‘పదేళ్లు కేసీఆర్, 12 ఏళ్లు మోదీ చేయలేని పనిని మేం చేశాం. ఏడాదిలో 56 వేల కొలువులు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలతో బాధలు దూరం చేశాం. యువతలో నైపుణ్యం పెంచాలన్న సంకల్పంతో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసి వేలాది మందికి శిక్షణ ఇస్తున్నాం. స్కిల్స్ వర్సిటీ ప్రారంభించాం. వరికి రూ.500 బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత సిలిండర్ ఇస్తున్నాం.
మేము చెప్పేవి అబద్ధాలైతే మాకు ఓటేయొద్దు. భావోద్వేగాలకు, అబద్ధాలకు ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు. మేము చేసిన మంచిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించండి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, వెడ్మ బొజ్జు, శ్రీగణేశ్, గండ్ర సత్యనారాయణరావు, అభ్యర్థి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment