సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రి వర్గంలో మన ఎమ్మెల్యేల్లో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ వీడడం లేదు. రాష్ట్రంలో తొలి మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి కేబినెట్‌లో బెర్త్ దక్కుతుందనే ఆసక్తి అధికార పార్టీతో పాటు ప్రజల్లోనూ ఉంది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. పార్టీలో సీనియర్ నాయకుడు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు మొదటి కూర్పులోనే కేబినెట్‌లో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగినా అవకాశం రాలేదు. ఇక గడ్డం సోదరులైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది.
అన్నదమ్ముల్లోనే పోటీ
మాజీ మంత్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. 2004నుంచి 2009 మధ్య చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశానని, తనకే మళ్లీ అవకాశం ఇవ్వాలని వినోద్ కోరుతున్నారు. ఇందుకోసం రెండునెలల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసి విన్నవించారు. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డిని తరచూ కలుస్తున్నారు. గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ పదవిపై పోటీ పడుతూ ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.
వంశీ ఎంపీ టికెట్‌తో లింకు?
లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాలని వివేక్ తనయుడు వంశీకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు, ఒకరికి ఎంపీ టికెట్, మళ్లీ అదే కుటుంబం నుంచి మంత్రి పదవి కూడా ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కోణంలో పరిశీలన చేస్తున్నట్లు నాయకులు చెప్పుకొంటున్నారు. ఇక వంశీకి లోక్‌సభ టికెట్ కావాలని అడుగుతున్న క్ర మంలో టికెట్ ఇస్తే, మంత్రి పదవి వదులుకుంటా రా? లేక టికెట్‌తో పాటు కేబినెట్‌లో చోటు కోసం పట్టుబడుతారా? అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలయ్యే దాకా ఈ సమస్య తేల్చ కుడా, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసే అవకాశం ఉందని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఉమ్మ డి జిల్లాలో పాలన పరంగా ఇబ్బంది లేకుండా, స్థా నికంగా మంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ స్థానంలో మంత్రి సీతక్కను ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో ఆమెతోనే పాలన కొనసాగిస్తారా? లేక ఇక్క డి ఎమ్మెల్యేల్లో ఎవరికై నా అవకాశం కల్పిస్తారా?.. అనే విషయం తేలేవరకూ వేచిచూడాల్సిందే.
‘పీఎస్సార్’కు పెద్దల హామీ!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీని బలోపేతం చేశార నే మంచి పేరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఉంది. కష్టకాలంలో పార్టీలో కేడర్‌ను కాపాడినట్లు చెప్పుకొంటారు. ఆ సమయంలో గడ్డం సోదరులు ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. రెండేళ్ల క్రితం బీఎస్పీ నుంచి వినోద్, ఇటీవల అ సెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ కాంగ్రెస్‌లో చేర డం తెలిసిందే. వీళ్లిద్దరి కంటే పార్టీలో సీనియర్‌గా ఉండి, పార్టీ కోసం కష్టపడ్డారని, పీఎస్సార్‌కే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘దళిత గిరిజన దండోరా’ బహిరంగ సభ సక్సెస్ చేసి పార్టీలో ఉత్తేజం నింపారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ను సక్సెస్ చేశారు. మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ వేదికపైనే పీఎస్సార్ వచ్చే ప్రభుత్వంలో మంచిహోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. తర్వాత పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఈ క్రమంలో ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment