Constitution
-
రాజ్యాంగమే సాక్షి.. ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ వివాహం చేసుకున్న జంట
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు,ఆచారాలు పక్కనపెట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు. ఏడడుగులు నడవడం, తాళి కట్టడం, సింధూరం పెట్టడం లాంటి అన్ని ఆచారాలను దూరంగా పెట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడమే కాకుండా దండలు మార్చుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇంతటితో ఆగకుండా పెళ్లికి అనవసర ఖర్చు కూడా చేయకుండా సింపుల్‌గా కానిచ్చేశారు. పెళ్లికయ్యే ఖర్చులతో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చనే ఆలోచనతోనే ఇలాచేసినట్లు పెళ్లికొడుకు ఇమాన్ లాహ్రె చెప్పారు. తమకు ఆచారాలు,సంప్రదాయాల మీద కన్నా రాజ్యాంగం మీదనే తమకు నమ్మకం ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్ జిల్లాలోని కాపు గ్రామంలో డిసెంబర్ 18న ఈ పెళ్లి జరిగింది. ఈ జంట చేసుకున్న ఆదర్శ వివాహంపై వారి బంధువులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. -
బదులివ్వలేకే దుష్ప్రచారం
న్యూఢిల్లీ: అంబేడ్కర్‌పై రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పూర్తిగా వక్రీకరించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఫక్తు అంబేడ్కర్ వ్యతిరేకి. రాజ్యాంగ వ్యతిరేకి. రిజర్వేషన్ల వ్యతిరేకి. ఈ వాస్తవాలను రాజ్యాంగంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా నిరూపించాం. మేం లేవనెత్తిన అంశాలకు కాంగ్రెస్ వద్ద ఏ సమాధానమూ లేకపోయింది. అందుకే తీవ్ర అసహనంతో ఇలా తప్పుడు దారి ఎంచుకుంది.ప్రధాని వ్యాఖ్యలను కూడా ఇలాగే వక్రీకరిస్తోంది. వాటిపై ఆందోళనలకు దిగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాజ్యసభలో అంబేడ్కర్ గురించి తాను మాట్లాడినదాంట్లో ఎలాంటి సందిగ్ధతా లేదని స్పష్టం చేశారు. ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కలలో సైతం అవమానపరచని పార్టీ నుంచి, సిద్ధాంతం నుంచి వచ్చాను. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా అంబేడ్కర్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసింది.రిజర్వేషన్లను బలోపేతం చేసేందుకు కృషి చేసింది’’ అన్నారు. ‘‘కాంగ్రెస్ చర్యలు ఆక్షేపణీయం. నాపై ఆ పార్టీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా అన్ని అవకాశాలూ పరిశీలిస్తామన్నారు. అంబేడ్కర్‌పై తాను చేసిన పూర్తి వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. నెహ్రూ కుటుంబం అంబేడ్కర్ వ్యతిరేకికాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రసంగంలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తోందని అమిత్ షా ఆక్షేపించారు. తద్వారా అయోమయం సృష్టించడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా కృత్రిమ మేధ సాయంతో తన వ్యాఖ్యలను, మోదీ వ్యాఖ్యలను వక్రీకరించేందుకు ప్రయతి్నంచిందని ఆరోపించారు.‘అంబేడ్కర్‌ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన చరిత్ర తొలి ప్రధానినెహ్రూది. నెహ్రూ కుటుంబంలో నాలుగు తరాల నేతలూ అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఆయనకు భారతరత్నను వీలైనంతగా ఆలస్యం చేసింది కాంగ్రెసే. కనీసం ఇప్పుడైనా ఆ పార్టీ అంబేడ్కర్ గురించి మాట్లాడుతుండడం ఆనందం కలిగిస్తోంది. అయితే అంబేడ్కర్‌కు ఇన్నాళ్లూ వాళ్లు ఏమాత్రం గౌరవం ఇవ్వని విషయం కూడా చెబితే బాగుంటుంది’’ అన్నారు. చీలిక దిశగా పయనిస్తున్న విపక్ష ఇండియా కూటమికి తిరిగి ఒక్కటయ్యే అవకాశాన్ని మీ వ్యాఖ్యలు కల్పించాయా అని ప్రశ్నించగా తప్పుడు పునాదులపై ఒక్కతాటిపైకి రావడం వారికి అలవాటేనని అమిత్ షా అన్నారు. ‘‘ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. విపక్షాలకు వ్యతిరేకంగా వారు వరుసగా తీర్పులిస్తున్నారు. అందుకే ఓసారి ఈవీఎంలపై, మరోసారి ఇంకో అంశంపై ఆరోపణలు తదితరాలతో ప్రజలను అయోమయపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఆరోపించారు. బాక్సు ఖర్గే సంతోషిస్తానంటే తప్పుకుంటా తాను రాజీనామా చేయాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ హాస్యాస్పదమని అమిత్ షా అన్నారు. ‘‘నా రాజీనామా ఖర్గేకు సంతోషం కలిగిస్తుందంటే అలాగే చేస్తా. కానీ నేను పదవి నుంచి తప్పుకున్నా ఖర్గే సమస్యలు తీరవు. ఆయన కనీసం మరో 15 ఏళ్లపాటు అక్కడే (ప్రతిపక్షంలోనే) ఉంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘అంబేడ్కర్ మాదిరిగానే ఖర్గే కూడా దళితుడే. కనీసం ఆయనైనా ఈ బురదజల్లుడు కార్యక్రమంలో భాగస్వామి కాకుండా ఉంటే బాగుండేది. రాహుల్‌గాంధీ ఒత్తిళ్లకు తలొగ్గి నాపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు’’ అని అమిత్ షా అన్నారు. -
రాజ్యాంగం వాళ్లకు ప్రైవేట్ జాగీరు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై, నెహ్రూ– గాంధీ కుటుంబంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యసభలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యాంగాన్ని కూడా తమ వ్యక్తిగత జాగీరుగా ఆ కుటుంబం పరిగణించింది. అందుకే కనీసం పార్లమెంటు అనుమతి కూడా లేకుండానే రాజ్యాంగంలోకి ఆర్టీకల్ 35ఏను చొప్పించే దుస్సాహసానికి తెగబడింది. చివరికి పార్లమెంటును కూడా మోసగించిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగం పేరిట 75 ఏళ్లుగా లెక్కలేనన్ని ద్రోహాలకు పాల్పడుతూ వస్తోంది’’ అంటూ మండిపడ్డారు. స్వీయ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఇష్టానికి సవరించిందంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గండికొట్టే తొలి రాజ్యాంగ సవరణతో దేశ మొదటి ప్రధాని నెహ్రూయే ఇందుకు తెర తీశారని ఆరోపించారు. ‘‘సంతుష్టికరణ రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామా. తన ఓటు బ్యాంకుకు భంగం కలుగుతుందని ముస్లిం మహిళలకు ఏళ్ల తరబడి హక్కులను నిరాకరించిన చరిత్ర ఆ పార్టీది. ముస్లింలకు రిజర్వేషన్లు కలి్పచేందుకు 50 శాతం పరిమితిని అతిక్రమించేందుకు కూడా వెనకాడలేదు! తన పాలనలోని రెండు రాష్ట్రాల్లో రాజ్యాంగ విరుద్ధంగా మతాధారిత రిజర్వేషన్లు తెచి్చంది’’ అంటూ ఆరోపించారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాజ్యసభలో జరిగిన రెండు రోజుల చర్చకు మంత్రి బదులిచ్చారు. బీజేపీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నంత కాలం మతాధారిత రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రకటించారు. వెనకబడ్డ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ఏనాడూ ప్రయతి్నంచలేదని షా ఆరోపించారు. ఎన్నికల ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపడం ఇప్పటికైనా కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.జమిలి బిల్లు కాంగ్రెస్ పుణ్యమే: నడ్డా కేంద్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉండగా కాంగ్రెస్ చేసిన నిర్వాకాల వల్లే మోదీ సర్కారు జమిలి ఎన్నికల బిల్లు తేవాల్సిన అవసరం ఏర్పడిందని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అన్నారు. మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకూ తొలుత ఒకేసారి ఎన్నికలు జరిగేవి. అప్పట్లో కాంగ్రెస్ పాలకులు తమకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలను యథేచ్ఛగా కూలదోయడంతో జమిలికి బ్రేక్ పడింది’’ అని చెప్పారు. ‘‘ఎమర్జెన్సీ కాంగ్రెస్ చరిత్రపై చెరగని మచ్చ. అందుకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పిందనడం పచ్చి అబద్ధం. మైనారిటీల సంతుïÙ్టకరణ రాజకీయాల్లో భాగంగా మతాధారిత రిజర్వేషన్లకు కాంగ్రెస్ తెర తీయజూస్తోంది. ఆ ప్రయత్నాలను పలుమార్లు కోర్టులు అడ్డుకున్నా దాని తీరు మారడం లేదు. ట్రిపుల్ తలాక్, ఆర్టీకల్ 370పై కాంగ్రెస్ వైఖరి మొదలుకుని షాబానో తీర్పును నిర్వీర్యం చేసేందుకు రాజ్యాంగ సవరణ దాకా ఇందుకు ఉదాహరణలెన్నో’’ అని నడ్డా ఆరోపించారు. వాటిపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల మాటేమిటని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి కేవలం ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన కలి్పంచినవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలి్పంచుకున్నారు. సభను జైరాం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా సామాజిక, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించింది తప్ప మతాధారితంగా కాదంటూ జైరాం బదులిచ్చారు. వారిద్దరి మధ్య వాడివేడి చర్చ సాగింది. -
ప్రతిపక్షాలకు రాజ్యాంగంపై విశ్వాసం లేదు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నాగ్‌పూర్: ప్రతిపక్ష పార్టీలకు రాజ్యాంగంపై నమ్మకం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ, డిసెంబర్ 16న జరగనున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల కోసం ఫడ్నవీస్ నాగ్‌పూర్‌లో అడుగుపెట్టారు.ఈ సందర్భంగా విలేకరులతో ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా నా జన్మభూమి, కర్మభూమికి (స్వస్థలం, పార్టీ కార్యాలయం) రావడం చాలా సంతోషకరమైన క్షణం. నాగ్‌పూర్ నా కుటుంబం, నా కుటుంబం నేడు నాకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని మహాయుతి (కూటమి) పేదలు, గిరిజనులు, రైతులు, దళితులు, ఓబీసీలు ఇతరుల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా మహిళలు, లడ్కా, షెత్కారీ (రైతులు), లడ్కే , ధంగార్లు, మరాఠాలు, ఇతరులు ఇలా అన్ని వర్గాలు ప్రభుత్వంపై నమ్మకముంచినందువల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. మహాయుతిని ఆశీర్వదించి, నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు 14 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలు తమకు సేవ చేసేందుకు, వారి జీవితాలను, మహారాష్ట్రను మార్చేందుకు మహాయుతిని ఎంచుకున్నారు. ప్రజల కలను నెరవేర్చేందుకు నేను, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కలిసి పనిచేస్తాం. ‘ఈ ప్రభుత్వం ప్రజల కోసం 24 గంటలూ నిబద్ధతతో పనిచేస్తుంది’అన్నారు. నిరాశతోనే ప్రేలాపనలు.. ఈవీఎంల వ్యవహారంపై ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించడం పట్ల ఫడ్నవీస్‌ను ప్రశి్నంచగా, ‘‘ఈ వ్యక్తులు (ప్రత్యర్థులు) నిరాశ చెందారు, వారికి ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల సంఘంపై నమ్మకం లేదు. సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్‌పై విశ్వాసం లేదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌పై నమ్మకం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విశ్వసించరు. ’అని మండిపడ్డారు. నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో విజయం సాధించి మహాయుతి కూటమి విజయం సాధించడంతో డిసెంబర్ 5న ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎం) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: ఏ–332 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు మళ్లీ మొదలు ‘భూమిపుత్రుడికి’ స్వాగతం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన తరువాత సీఎంగా నాగ్‌పూర్‌కు చేరుకున్న ఫడ్నవీస్‌కు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ధరంపేట్‌లోని ఫడ్నవీస్ నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫడ్నవీస్ తన భార్య అమృతా ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఇతరులతో కలిసి అలంకరించబడిన ఓపెన్–టాప్ వాహనంలో ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగే దారి పొడవునా ‘మట్టి కుమారుడికి స్వాగతం’ పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. ఈసందర్భంగా ఫడ్నవీస్ తన మద్దతుదారులను ఉద్దేశించి ’ఏక్ హై తో సేఫ్ హై’, ’మోడీ హై తో ముమ్కిన్ హై’ నినాదాలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ -
రాజ్యాంగాన్ని ద్వేషించినవాళ్లా పాఠాలు నేర్పేది?: ఖర్గే
రాజ్యాంగంపై చర్చ.. రాజ్యసభలోనూ నిప్పులు రాజేస్తోంది. సోమవారం పెద్దల సభలో రాజ్యాంగం చర్చ మొదలైంది. అయితే.. నెహ్రూ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.‘‘లోక్‌సభలో రాజ్యాంగ చర్చ ద్వారా ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారు. ఎలా మాట్లాడాలో ఈరోజు నేను వాళ్లకు(బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ..) చెప్పదల్చుకున్నా. నేను చదువుకుంది మున్సిపాలిటీ బడిలో. ఆమె(నిర్మలా సీతారామన్) జేఎన్‌యూ(జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లోనే కదా చదివింది. ఆమె హిందీగానీ, ఇంగ్లీష్గానీ మాట్లాడడం బాగుంది. ఆమె ఆర్థిక నిపుణురాలే కావొచ్చు. కానీ, ఆమె మాట్లాడే విధానమే అస్సలు బాగోలేదు... జాతీయ పతకాన్ని, అందులో అశోక చక్రాన్ని.. రాజ్యాంగాన్నే ద్వేషించినవాళ్లు.. ఇవాళ మాకు పాఠాలు చెబుతున్నారు. రాజ్యాంగం వచ్చిన కొత్తలో వాళ్లే దానిని తగలబెట్టారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన టైంలో.. రామ్‌లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ దిష్టిబొమ్మలను తగలబెట్టిన విషయాన్ని వాళ్లు మరిచిపోయారేమో!’’ అని ఆయన మండిపడ్డారు. అలాగే.. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా.. ఆ పోరాటం ఎలా ఉంటుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఖర్గే సెటైర్లు వేశారు. 1949లో ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని, అది మనుస్మృతికి తగ్గట్లుగా లేదని ఆనాడు విమర్శించారని, రాజ్యాంగాన్నే కాకుండా మువ్వన్నెల జెండాను కూడా అంగీకరించలేదని, ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై 2002 రిపబ్లిక్ డేన తొలిసారి జాతీయ జెండా ఎగరేశారని, అదీ కోర్టు ఆదేశాల తర్వాతేనని ఖర్గే రాజ్యసభకు గుర్తు చేశారు. #WATCH | Constitution Debate | Rajya Sabha LoP #mallikarjunkharge says, “In 1949, #RSS leaders opposed the Constitution of #India because it was not based on #manusmriti. Neither did they accept the #Constitution nor the tricolour. On 26 January 2002, for the first time, the… pic.twitter.com/yLScuHkY3o— TheNews21 (@the_news_21) December 16, 2024 -
మోదీ ప్రసంగం... యమా బోరు: ప్రియాంక
న్యూఢిల్లీ: లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం విసుగు తెప్పించిందని కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని ప్రసంగంలో కొత్త విషయం ఒక్కటీ లేదు. అన్నీ దశాబ్ధాల నాటి పాత విషయాలు. రెండు గణితం క్లాసులు ఒకేసారి విన్నంత బోర్‌గా ఫీలయ్యా’’ అన్నారు. ‘‘మోదీ ప్రసంగం చూసి జేపీ నడ్డా చేతులు నలుపుకున్నారు. అమిత్ షా తలపట్టుకున్నారు. పీయూష్ గోయెల్ నిద్రమత్తులోకి వెళ్లారు. ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. మోదీ కొత్త అంశాలను ఆసక్తికరంగా చెప్పి ఉండాల్సింది’’ అన్నారు. ‘‘విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సభలో ఎందుకు లేరు? అవినీతిని ఉపేక్షించమంటూ చెప్పే ప్రభుత్వం అదానీ అంశంపై చర్చకు ఎందుకు అంగీకరించడం లేదు’’ అని ఆమె ప్రశ్నించారు. -
నెహ్రూ, గాంధీ కుటుంబ పాలనలో... రాజ్యాంగానికి గాయం
కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘అవి దేశ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు వంటి విషపు విత్తనాలు నాటాయి. దేశ ఐక్యతనే దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన నెహ్రూ–కుటుంబాన్ని ఓడించి ఇంటిబాట పట్టించాం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని అన్నారు. ‘‘2014 నుంచి మా నిర్ణయాలు, విధానాలన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన బాటలో నడుస్తున్నాం. దేశ శక్తి సామర్థ్యాలను, ఐక్యతను పెంపొందించాలన్నదే మా ఆశయం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు రాజ్యాంగాన్ని దెబ్బకొట్టడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం ఎన్నో కుట్రలు చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ ప్రధానులుగా రాజ్యాంగాన్ని దెబ్బ తీయాలని చూశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా రాజ్యాంగాన్ని నెహ్రూ సవరించారు. ఇక ఆయన కుమార్తె ఇందిర ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. పదవులు కాపాడుకోవడానికి రాజ్యాంగంలో సవరణ చేశారు. న్యాయ వ్యవస్థ గొంతు కోశారు. దేశాన్నే జైలుగా మార్చేశారు. ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ చెరిగేది కాదు. ఆమె కుమారుడు రాజీవ్ కూడా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టానికి సవరణలు తెచ్చారు. నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన తర్వాతి తరమూ రాజ్యాంగంపై అదే ఆట ఆడుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఓ అహంకారి (రాహుల్) ఏకంగా చించిపారేశారు. యూపీఏ హయాంలో సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించింది. ప్రధాని మన్మోహన్‌ను మించిన అధికారులు చలాయించింది. దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని మతం, విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనను రాజ్యాంగ రూపకర్తలు పరిగణనలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాత్రం అధికార యావతో, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది’’ అంటూ తూర్పారబట్టారు. ఆ నినాదం.. అతిపెద్ద మోసం కాంగ్రెస్ ఇచి్చన గరీబీ హఠావో నినాదాన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఆ నినాదం లేకుండా కాంగ్రెస్ బతకలేదు. నాలుగు తరాలుగా దాన్నే నిత్యం వినిపిస్తున్నారు. కానీ ఆ నినాదంతో కాంగ్రెస్ రాజకీయంగా లాభ పడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. మా ప్రభుత్వం వచ్చాక మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాం. కాంగ్రెస్ నాయకులు పేదలను, పేదరికాన్ని కేవలం టీవీల్లో, పేపర్లలో చూసుంటారంతే. అసలైన పేదలు, అసలైన పేదరికం అంటే ఏమిటో వారికి తెలియదు’’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగమే ఐక్యతా సాధనం సాధారణ కుటుంబాల్లో జని్మంచిన తనవంటి ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరారంటే రాజ్యాంగ బలమే కారణమని మోదీ అన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక దేశం ముక్కలవుతుందన్న భయాలుండేవి. వాటిని అధిగమించి ఐక్యంగా ఈ స్థాయికి చేరామంటే ఆ ఘనత రాజ్యాంగానిదే. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాక దేశ ప్రయాణం అద్భుతంగా, అసాధారణంగా సాగింది. మన ప్రాచీన ప్రజాస్వామ్య మూలాలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మన అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే తల్లి వంటిది. మన ఐక్యతకు నిస్సందేహంగా రాజ్యాంగమే ఆధారం. మహిళలకు ఓటు హక్కు రాజ్యాంగం వల్లే వచ్చింది. మహిళల ఆధ్వర్యంలోనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది’’ అని ఉద్ఘాటించారు. ‘‘నేను గుజరాత్ సీఎంగా ఉండగా రాజ్యాంగ 60 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాం. రాజ్యాంగ ప్రతిని ఏనుగుపై ఊరేగించాం. రాజ్యాంగ ఔన్నత్యాన్ని గౌరవిస్తూ చెప్పుల్లేకుండా ఏనుగు వెంట నడిచా’’ అని గుర్తు చేసుకున్నారు. 11 తీర్మానాలు ప్రధాని మోదీ లోక్‌సభలో 11 తీర్మానాలు ప్రతిపాదించారు. 1. ప్రతి ఒక్కరూ సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలి. అధికార యంత్రాంగం విధులకు కట్టుబడి ఉండాలి. 2. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకృతాభివృద్ధికి కృషి చేయాలి. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. 3. అవినీతిని తిరస్కరించాలి. దానిపై యుద్ధం చేయాలి. అవినీతిపరులకు సమాజంలో స్థానం లేదు. 4. మన చట్టాలను, నియమ నిబంధనలను గర్వకారణంగా భావించాలి. దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న చట్టాలను అంతా గౌరవించాలి. 5. వలసవాదానికి తలవంచే మనస్తత్వం నుంచి బయటకు పడాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం మనకు గర్వకారణం. 6. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. పాలనలో బంధుప్రీతిని పక్కనపెట్టి ప్రతిభావంతులకే అవకాశం కలి్పంచాలి. 7. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదు. 8. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు. మతాధారిత రిజర్వేషన్లకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలి. 9. లింగ సమనత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. 10. ప్రాంతీయాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇదే మన మంత్రం. 11. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్. దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండాలి. ప్రజలంతా కలిసుంటేనే భారత్ గొప్పదేశంగా మారుతుంది. -
మనుస్మృతి మద్దతుదారులు!
న్యూఢిల్లీ: ‘‘బీజేపీకి, ఆరెస్సెస్‌కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. అవి కేవలం మనుస్మృతినే చట్టంగా భావిస్తున్నాయి. దానికే మద్దతిస్తున్నాయి’’ అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది తప్ప మనుస్మృతి ప్రకారం కాదని తేలి్చచెప్పారు. ‘‘పాలక పక్షానికి సుప్రీం నేత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు. అందులో భారతీయతే లేదన్నారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా వారి సుప్రీం లీడర్‌ను నవ్వులపాలు చేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో రెండో రోజు శనివారం రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పేదలను కాపాడుతున్న రాజ్యాంగంపై బీజేపీ నిత్యం దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. బ్రిటిషర్లతో రాజీపడ్డ సావర్కర్ బీజేపీ సుప్రీం లీడర్ సావర్కర్ మాటలతోనే ప్రసంగం ప్రారంభిస్తానని రాహుల్ అన్నారు. ‘‘వేదాల తర్వాత అత్యంత ఆరాధనీయ గ్రంథం మనుస్మృతి అని సావర్కర్ చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలకు మనుస్మృతే ఆధారమన్నారు. మన ఆధ్యాతి్మక, దైవిక మార్గాన్ని అది నిర్దేశించిందని చెప్పారు. మను స్మృతి ఆధారంగానే దేశం నడుచుకోవాలంటూ రచనలు, పోరాటం చేశారు. ఇప్పుడు మీరేమో (బీజేపీ) రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడు తున్నారు. అంటే మీ నాయకుని బోధలకు మద్దతిస్తున్నట్టా, లేదా? మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటమంటే సావర్కర్‌ను మీరు అవమానిస్తున్నట్లే. హేళన చేస్తున్నట్టే. కించపరుస్తున్నట్టే. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సావర్కర్‌ను ప్రశంసించారంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి సావర్కర్ బ్రిటిషర్లతో రాజీపడ్డారని ఇందిర ఆరోపించారు. గాం«దీజీ, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ లేఖ రాసి మరీ జైలు నుంచి బయటపడ్డారని అప్పట్లో ఇందిర విమర్శించారు’’ అని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా నేడు దేశంలో రెండు పక్షాలు ఇరువైపులా మోహరించాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే పక్షం. మరొకటి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న పక్షం. మేం ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే, అంబేడ్కర్, గుజరాత్లో గాంధీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ను సందర్శించా. సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించా. బాధిత కుటుంబం అవమానంతో ఇంటికి పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? అది కేవలం మీ (బీజేపీ) పుస్తకంలోనే రాసుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సురక్షితమైన చోటికి మార్చకపోతే మేమే ఆ పని చేస్తాం. సంభాల్ హింసాకాండలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. కులం, మతం, వర్గం పేరిట ప్రజలను విడగొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.బలహీన వర్గాల బొటనవేళ్లు నరికేస్తున్నారు ‘‘ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమరి్పంచాడు. నేడు మోదీ ప్రభుత్వం యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదల బొటన వేళ్లను నిస్సిగ్గుగా నరికేస్తోంది. వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘‘అగి్నపథ్ తెచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తెచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ఆరోపించారు. మోదీ దన్నుతో అదానీ సామ్రాజ్యం దేశంలో కీలక రంగాల్లోకి విస్తరించిందన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణన నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
ఏపీలో రెడ్ బుక్ పాలన.. రాజ్యాంగంపై చర్చలో ఎంపీ గురుమూర్తి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోందని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున ఆయన పాల్గొన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతోందని.. కూటమి ప్రభుత్వం కేవలం వట్టి మాటలకే పరిమితమైందన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి, పారదర్శకతకు అద్దం పట్టిందన్న గురుమూర్తి.. జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత లాంటి పథకాలు అణగారిన వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.ఈ పథకాలు ఆయా వర్గాలను పైకి తీసుకొచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, వారి అభివృద్ధికి పాటుపడ్డారు. రాజ్యాంగం ఒక జీవన పత్రం. అసమానతలను తగ్గించే ఒక సాధనం రాజ్యాంగం. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సోదర భావనకు రాజ్యాంగం పెద్దపీట వేసింది. కేశవానంద భారతి కేసు రాజ్యాంగం పునాదులను మరోసారి నిర్వచించింది. 75 ఏళ్ల ఈ రాజ్యాంగ ప్రయాణంలో ఎంతో ప్రగతి సాధించాం.’’ అని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించింది. అనేక కోట్ల మంది ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మన రాజ్యాంగ సంస్థలపై విశ్వాసాన్ని ప్రకటించారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ ఎకానమీ నుంచి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది.ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట..అక్షరాస్యతలో 74 శాతం సాధించాం. జీవన స్థాయి 70 ఏళ్లకు పెరిగింది. వాతావరణం మార్పులు జీ-20 విషయాల్లో భారత ప్రపంచం నాయకత్వం వహిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక సమానతలు ఇంకా సవాలుగానే పరిణమిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, లింగ అసమానత్వాన్ని రూపుమాపితేనే నిజమైన సమానత్వం వస్తుంది’’ అని ఎంపీ గురుమూర్తి చెప్పారు. -
రాజ్యాంగం కన్నా... అధికారమే మీకు మిన్న
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్‌సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది. జేబులో పెట్టుకోవడమే నైజం రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్‌నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి. వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో! భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్‌కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్‌గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు. -
ఇటు ఎమర్జెన్సీ.. అటు రాజ్యాంగ పరిరక్షణ!
న్యూఢిల్లీ, సాక్షి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. ప్రత్యేక సమావేశాలతో అధికార-ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను వేడెక్కించబోతున్నాయి. ఎన్డీయే సర్కార్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలంటూ విపక్ష కూటమి.. అలాగే ఎమర్జెన్సీ అంశంతో బీజేపీ.. ఒకరినొకరు కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది.రాజ్యాంగంపై చర్చ కోసం శుక్రవారం మధ్యాహ్నాం లోక్‌సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ, రేపు రాజ్యాంగంపై ప్రజాప్రతినిధుల సభ చర్చించనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే కూటమి తరఫున 12 నుంచి 15 మంది ఈ చర్చలో భాగమవుతారని తెలుస్తోంది. ఇందులో జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జతిన్ మాంజీ, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే (ఏక్నాథ్ షిండే) పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చివరిరోజు.. అంటే రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో(సమాధానంతో) ఈ చర్చ ముగియనుంది.స్వతంత్ర భారతావనిలో నూతనంగా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించగా.. 1950 నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగ పరిణామం, ప్రాముఖ్యతతో మొదలయ్యే చర్చ.. రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరనివ్వకుండా ప్రతిపక్షాలు అవాంతరం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఎన్డీయే.. అలాగే వివిధ అంశాలతో కేంద్రంపై ఇండియా కూటమి పరస్పరం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.కాంగ్రెస్సే లక్ష్యంగా..లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన ఫలితం రాలేదు. ఇండియా కూటమి.. ప్రత్యేకించి కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు దక్కాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మిశ్రమ ఫలితాలే దక్కుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ సహించలేకపోతోంది. వీటన్నింటికి తోడు.. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చ ద్వారానే కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం భావిస్తోంది.ఆర్నెల్ల కిందట.. ఎమర్జెన్సీకి 49 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ప్రస్తావించి మరీ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనని(కాంగ్రెస్‌ను ఉద్దేశించి.. ).. నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి అంటూ విసుర్లు విసిరిరాయన. దీంతో మరోసారి ఎమర్జెన్సీ అంశం రాజ్యాంగ చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశమూ లేకపోలేదు.కౌంటర్‌కి ఇండియా కూటమి రెడీ..రాజ్యాంగంపై చర్చలో భాగంగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. విపక్షాల తరఫున.. డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి మహువా మెయిత్రా-కల్యాణి బెనర్జీ పేర్లు ఖరారు కాగా.. మిగతావాళ్ల పేర్లు వెలువడాల్సి ఉంది. అలాగే రాహుల్ ఇవాళ మాట్లాడతారా? రేపా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎన్డీయే కూటమి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అదానీ అంశం ప్రధానంగా పార్లమెంట్‌ను దద్దరిల్లిపోయేలా చేసింది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ చర్చను కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంభల్ హింసతో పాటు రైతుల నిరనల, మణిపూర్ హింస తదితర అంశాలను కూడా ప్రస్తావించి రాజ్యంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్లో గట్టిగా నినదించాలని భావిస్తున్నయి.అటు పెద్దల సభలోనూ.. ఇవాళ, రేపు దిగువ సభలో మాత్రమే రాజ్యంగంపై చర్చ జరుగుతుంది. ఆదివారం పార్లమెంట్‌కు సెలవు. రాజ్యసభలో సోమ, మంగళవారం ఇదే తరహాలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మూడు లైన్ల విప్‌ను ఆయా ఎంపీలకు సదరు పార్టీలు జారీ చేశాయి. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు. -
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వీడని ప్రతిష్టంభన
-
లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. సమాధానమివ్వనున్న మోదీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై లోక్‌సభలో డిసెంబర్ 14న జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్‌సభలో శుక్రవారం, శనివారం (డిసెంబర్ 13, 14) రెండు రోజులపాటు రాజ్యాంగంపై చర్చలు జరగనున్నాయి. అటు రాజ్యసభలోనూ డిసెంబర్ 16, 17వ తేదీల్లో చర్చ జరగనుంది. డిసెంబరు 16న ఎగువ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో చర్చ జరగనుంది.కాగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉభయసభల్లో రాజ్యాంగంపై చర్చించాలని ప్రతపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రాథమిక స్థాయిలో మార్చేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో గతవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో రాజ్యాంగంపై చర్చలకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించాయి -
పార్లమెంట్లో వాయిదాల పర్వం.. అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా లోక్‌సభలో సంభాల్ అంశంపై మాట్లాడేందుకు సమాజ్‌వాదీ పార్టీకి, బంగ్లాదేశ్ పరిస్థితులపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే వారం రాజ్యాంగంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో,16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంట్ వెలుపల విలేకరులతో చెప్పారు. ‘పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. రేపటి నుంచి పార్లమెంట్ సజావుగా జరిగేలా మనమందరం చేసుకున్న ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్ష నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని రిజిజు పేర్కొన్నారు.అయితే అన్ని అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి. నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంబాల్ హింస, పెరుగుతున్న ధరలు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాని అంశంపై బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరాయి.కాగా గతవారం (నవంబర్25) ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. విపక్షాల డిమాండ్లతో రోజూ సభ ప్రారంభం కావడం, వాయిదా పడటం పరిపాటిగా మారింది. అదానీ అవినీతి వ్యవహారం, సంభాల్ హింస, మణిపూర్ అంశం వంటి విషయాలపై చర్చించాలని విపక్షాలు నిరసనలు చేస్తుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. -
‘ఎమర్జెన్సీ’ నిర్ణయాలన్నీ... చెల్లవని చెప్పలేం
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత మాత్రాన ఆ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లబోవని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ పదాలను జోడిస్తూ ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆ పదాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు న్యాయ సమీక్ష జరిపిందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ ధర్మాసనం గుర్తు చేసింది. తామిప్పుడు ఆ నిర్ణయంలో తాలూకు మంచిచెడుల్లోకి వెళ్లదలచు కోలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణను ముగించింది. నవంబర్ 25న తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 1976లో ఎమర్జెన్సీ అమల్లో ఉండగా నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సార్వభౌత, ప్రజాస్వామిక గణతంత్రం’ అన్నచోట ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం’ అని చేర్చారు. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. 42వ రాజ్యాంగ సవరణ ఇప్పటికే ఎన్నోసార్లు సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు గురైందని, పార్లమెంటు కూడా దీనిపై జోక్యం చేసుకుందని సీజేఐ గుర్తు చేశారు. మన దేశంలో సామ్యవాద అనే పదానికి సంక్షేమ రాజ్యమనే అర్థమే వాడుకలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయంలో ఇతర దేశాలకు, మనకు చాలా తేడా ఉంది. ప్రైవేట్ రంగ వికాసాన్ని మనమెప్పుడూ నిరోధించలేదు. మనమంతా ఆ రంగ వృద్ధి వల్ల లాభపడ్డవాళ్లమే’’ అని చెప్పుకొచ్చారు. లౌకికవాదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సామ్యవాదం, లౌకికవాదం పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మరో అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం ప్రవేశికకూ వర్తిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
‘‘సెక్యులర్‌ను రాజ్యాంగం నుంచి తొలగించాల్సిందే’’
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తున్నారు. దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు ఉన్నందున.. సెక్యులర్ పదాన్ని తొలగించడంతో సహా రాజ్యాంగంలో గణనీయమైన మార్పుల తీసుకురాలని అన్నారాయన. ఈ మేరకు రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీం కోర్టులో జరగుతున్న విచారణ సందర్భంగా ఏజీ హోదాలో తన వాదనలను వినిపించారు. న్యాయమూర్తులు ఫరా మహబూబ్, దేబాశిష్ రాయ్ చౌదరిలు 15వ సవరణ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తూ.. ‘‘సవరణలు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలి. కానీ నిరంకుశత్వానికి కాదు. ఆర్టికల్ 2Aలో దేశంలో అన్ని మతాల ఆచరణలో సమాన హక్కులు, సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 9 ‘బెంగాలీ జాతీయవాదం’ గురించి చెబుతుంది. ఇది విరుద్ధమైంది. షేక్ ముజిబుర్ రెహమాన్‌ను ‘జాతి పిత’గా పేర్కొనడంతోపాటు అనేక రాజ్యాంగ సవరణలు జాతీయ విభజనకు దోహదపడతాయని , వాక్ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేస్తాయి. దేశ విభజనలో షేక్ ముజిబుర్ రెహమాన్ సహకారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. అయితే.. సెక్యులర్ అనే పదాన్ని చట్టం ద్వారా అమలు చేయడం విభజనను సృష్టిస్తుంది. లిబరేషన్ వార్, జాతీయ ఐక్యత విలువలను ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలి. 15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించాలి’ అని వాదనలు వినిపించారు. మరోవైపు.. తాత్కాలిక ప్రభుత్వం దాడులు, వేధింపుల నుంచి తమను రక్షించాలని, హిందూ నాయకులపై దేశద్రోహ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెలలో పదివేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 30,000 మంది నిరసనకారులు చటోగ్రామ్‌లో తమ హక్కులను డిమాండ్ చేశారు. విపక్ష విద్యార్థుల నేతృత్వంలోని నిరసనల నడుమ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌కు వెళ్లిపోయిన అనంతరం.. హిందూవులు టార్గెట్‌గా దాడులు జరిగిన పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని దాదాపు 170 మిలియన్ల జనాభాలో కేవలం 8 శాతం మంది మాత్రమే ఉన్న హిందువులపై ఆగష్టు 4 నుంచి సుమారు 2,000 కంటే ఎక్కువ దాడులను జరిగినట్లు వార్తలు వచ్చాయి. -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం: రాహుల్
వయనాడ్: దేశంలో నేడు ప్రధానమైన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆగ్రహం, విద్వేషంతో కాకుండా ప్రేమ, ఆప్యాయత, వినయంతో రాశారు. అంతటి విశిష్టమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పౌరులుగా మనం పొందుతున్న రక్షణ, దేశ ఔన్నత్యం తదితరాలకు రాజ్యాంగమే కారణభూతం’’ అన్నారు. కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మనాంథావాడీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంకా గాంధీ కోసం ప్రచారం చేశారు. ‘‘ప్రేమకు, విద్వేషానికి ఆత్మవిశ్వాసానికి, అభద్రతకు మధ్య నేడు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో నెగ్గాలంటే విద్వేషాన్ని, ఆగ్రహావేశాలను హృదయం నుంచి తొలగించుకోవాలి. ప్రేమ, అనురాగం, వినయాలను నింపుకోవాలి’’ అని సూచించారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రియాంక కోసం తాను ఓట్లు అభ్యరి్థంచడం ఇదే తొలిసారని రాహుల్ గుర్తు చేశారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోదోషి అయిన నళినిని ఆప్యాయంగా హత్తుకున్న మంచి మనస్సు తన చెల్లిదన్నారు. ప్రేమ, సానుభూతి, మానవత్వంతో కూడిన ఇలాంటి రాజకీయాలే మనకు కావాలని ఉద్ఘాటించారు. రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. ‘‘మోదీ గురించి చెప్పీ చెప్పీ బోరు కొట్టేసింది. అందుకే ఆయన ప్రస్తావన తేవడం లేదు’’ అన్నారు. అనంతరం రాహుల్ అరీకోడు పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.సంపన్న మిత్రుల కోసమే ఆరాటంప్రధాని మోదీపై ప్రియాంక మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. సంపన్న మిత్రుల సేవలో ప్రధాని తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనాంథావాడీలో సభలో ఆమె ప్రసంగించారు. ‘‘పేదలకు మంచి చేయాలన్న ఆలోచన మోదీకి అస్సలు లేదు. ప్రజలకు మంచి విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం లేదు. దేశ ప్రజల మధ్య మోదీ సర్కారు చిచ్చుపెడుతోంది. వారిని విభజిస్తోంది. హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తోంది’’ అని ధ్వజమెత్తారు. -
వినాయక మండపంలో రాజ్యాంగ పఠనం
జాల్నా: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు అంత్యంత వైభవంగా జరుగున్నాయి. అయితే మహారాష్ట్రలోని జాల్నాలో గణేశ మండపం ఒక ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ ప్రతిరోజా సాయంత్రం వేళ వినాయకుని హారతి ఇచ్చిన అనంతరం భక్తులంతా సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తున్నారు.ఈ సందర్భంగా వినాయక ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, ప్రాథమిక హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమనే లక్ష్యంతో రోజూ రాజ్యాంగ పఠంనం చేస్తున్నామన్నారు. ఈ మండపాన్ని గణేష్ మహాసంఘ్ అధ్యక్షుడు అశోక్ పంగార్కర్ సారధ్యంలో ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాయ్‌సాహెబ్ దానే, ఎమ్మెల్యే కైలాష్ గోరంట్యాల తదితరులు మండపాన్ని దర్శించుకున్నారు. -
ఎస్పీ ఆఫీసు ఎదుట రాజ్యాంగ స్తూపం
లక్నో: లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రధాన కార్యాలయం ఎదుట రాజ్యాంగ స్తూపం(సంవిధాన్ మాన్స్తంభ్) ఏర్పాటైంది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్పీ నేతల సమక్షంలో ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒక స్తూపంపై రాజ్యాంగ ప్రతిని ఉంచడం ద్వారా రాజ్యాంగ స్తూపాన్ని ఆవిష్కరించారు. ‘ఒకప్పటి కొల్హాపూర్ మహారాజు చత్రపతి సాహూ తన సంస్థానంలో మహాత్మా జ్యోతిబా ఫూలే కలలుగన్న రిజర్వేషన్ల అమలును సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అందుకే జూలై 26వ తేదీన రాజ్యాంగ స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు అనంతరం అఖిలేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
సంకెళ్ల సంస్కృతి మళ్లీ మొదలా?
మన దేశంలో నిందితులకు బేడీలు వేయడం అతి మామూలు విషయం. ఈ విధంగా బేడీలు వేయడం చట్టబద్ధమేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బేడీలు వేయడానికి చట్టబద్ధత లేదా? నిందితులు తప్పించుకుంటే ఎలా అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 49 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి తప్పించుకోకుండా కావలసిన నిర్బంధాన్ని పోలీసులు ఉపయోగించవచ్చు. అంతేకాని నిందితులకి సాధారణంగా బేడీలు వేయకూడదు. ఈ విషయాన్ని చాలా కేసులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ చేసినప్పుడు సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అరెస్ట్ అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను నిలుపుదల చేయడం. అది కోర్టు ఉత్తర్వుల వల్ల కావచ్చు లేక అతని మీద ఆరోపించబడిన నేరానికి జవాబు చెప్పటం కోసం కావచ్చు. అరెస్ట్ ఉద్దేశ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు అతను కోర్టులో జవాబు చెప్పటానికి, రెండవది అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించటానికి. అరెస్ట్ చేసే క్రమంలో అవసరమైన బలప్రయోగాన్ని పోలీసులు ఉపయోగించవచ్చు. అయితే ఆ వ్యక్తి అరెస్ట్‌ని నిరోధించినప్పుడు మాత్రమే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది. జీవిత ఖైదు కానీ మరణ శిక్ష కానీ విధించే నేరం చేసిన వ్యక్తులను అవసరమైతే చంపటానికి కూడా అవకాశం ఉంది. అంతే కానీ సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. సంకెళ్ళు వేయడాన్ని చట్టం ఆమోదించదు. సంకెళ్ళు వేయడం లాంటి చర్యలు అమానుషమనీ, ముద్దాయి గౌరవానికి భంగం కలిగించడమనీ చాలా కేసుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 లకు సంకెళ్ళు వేయడం అనేది విరుద్ధం. సంకెళ్ళు, బంధనాలు శిక్షపడిన ఖైదీలకు కానీ విచారణలో ఉన్న ఖైదీలకు కానీ వేయడానికి వీలులేదు. కోర్టు ముందు హాజరు పరిచిన ముద్దాయిలకు సంకెళ్ళు వేయాలంటే మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. ఆ వ్యక్తి పారిపోడానికి ప్రయత్నం చేస్తాడని ఆధారాలు ఉన్నపుడు, పోలీసుల కస్టడీ నుంచి పారిపోతాడని కచ్చితంగా భావించినప్పుడు, అరుదైన కేసుల్లో, హింసాత్మకమైన ప్రవృత్తి ఉన్నప్పుడు, వాళ్ళు అపాయకరమైన వ్యక్తులు అయినప్పుడు మేజిస్ట్రేట్ ఈ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నిర్ణయానికి రావడానికి మేజిస్ట్రేట్ కారణాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో స్పష్టం చేసింది. అందులో ప్రముఖమైన కేసు ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ (ఏఐఆర్ 1980 సుప్రీం కోర్టు 1535). ఒకవేళ పోలీసులు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి సంకెళ్ళు వేసినట్లైతే వారు కోర్టు ధిక్కార నేరం కింద శిక్షింపబడతారని సుప్రీంకోర్టు సిటిజెన్స్ డెమొక్రసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం 1996 సుప్రీంకోర్టు కేసెస్ (క్రిమినల్) 612 లో స్పష్టం చేసింది. సంకెళ్ళు వేయకుండా ముద్దాయి తప్పించుకోకుండా ఉండడానికి సుప్రీంకోర్టు ప్రేమ్ శంకర్ శుక్లా కేసులో కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది. అవి ఎస్కార్ట్‌లో ఉన్న పోలీసుల సంఖ్య పెంచాలి. వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి. వారికి సరైన శిక్షణ కూడా ఇవ్వాలి. అయితే కొత్తగా వచ్చిన ‘భారతీయ నాగరిక సురక్ష సంహిత’ సంకెళ్ళు వేయడం విషయంలో అనుమతి ఇచ్చింది. ఈ కొత్త చట్టం లోని సెక్షన్ 43లో అరెస్ట్ ఎలా చేయాలో చెప్పారు. అదే విధంగా సబ్ సెక్షన్ 3లో అరెస్ట్ చేసినప్పుడు సంకెళ్ళు వేయడం గురించి కూడా చెప్పారు. నేర స్వభావాన్ని నేర తీవ్రతను బట్టి అరెస్ట్ చేసిన వ్యక్తులకు సంకెళ్ళు వేయవచ్చు. అలవాటుపడిన నేరస్థులకు, మళ్ళీ మళ్ళీ నేరం చేసిన వ్యక్తులకు, కస్టడీ నుంచి తప్పించుకున్న వ్యక్తులకు, వ్యవస్థీకృత నేరం చేసిన వ్యక్తులకు, తీవ్రవాద చర్యలు పాల్పడిన వ్యక్తులకు, మాదక ద్రవ్యాల నేరాలు చేసిన వ్యక్తులకు, ఆయుధాలు, మందుగుండు సామాను అక్రమంగా కలిగిన వ్యక్తులకు; హత్య, రేప్, యాసిడ్ దాడి, నకిలీ నాణాలు, నోట్లు కలిగి ఉన్న వ్యక్తులకు, మనుషుల అక్రమ రవాణా చేసే వ్యక్తులకు, పిల్లలపై సెక్స్ నేరాలు చేసిన వ్యక్తులకు, రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తులకు పోలీసులు సంకెళ్ళు వేయవచ్చని ఈ నిబంధన చెప్తుంది. రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు ఏమిటి అనే విషయంలో స్పష్టత లేదు. అందుకని అందరికీ సంకెళ్ళు వేసే అవకాశం ఉంది. మళ్ళీ నేరం చేసిన వ్యక్తులకు సంకెళ్ళు వేయవచ్చు. దీన్ని చట్టంలో నిర్వచించలేదు. అందుకని ఇది కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు భార్యా భర్తల మధ్య తగువు ఏర్పడి కట్నం కోసం వేధిస్తున్నారన్న దరఖాస్తుతో బాటు మరెన్నో కేసులను పెట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం. ఆ కేసులు నిజమైనవా అబద్ధమైనవా అన్న విషయం అప్పుడు తెలియదు. ఈ కేసులు భర్త మీదే కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా పెడుతున్నారు. అలాంటప్పుడు వారందరికీ సంకెళ్ళు వేసే పరిస్థితి చట్టం కల్పిస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంతటి అసౌకర్యానికి గురవుతారో, ఎంతటి అవమానానికి గురవుతారో ఊహించవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇట్లా ఎన్నో కేసులను ఉదాహరించవచ్చు. చట్టం అనుమతి ఇవ్వనప్పుడే సంకెళ్ల సంస్కృతి మన దేశంలో ఉంది. సంకెళ్ళు వేయడమే కాదు నేరారోపణలకు గురి అయిన వ్యక్తులను ఊరేగించడం మనం చూస్తున్నాం. ప్రజలు ఆవిధంగా కోరుకుంటున్నారు కాబట్టి మేము ఊరేగిస్తున్నామని పోలీసులు అంటారు. చట్టం అనుమతి ఇవ్వనప్పుడు ఆ విధంగా ఊరేగించటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కొన్ని సందర్భాలలో సంకెళ్ళు వేయడాన్ని చట్టం అనుమతి ఇస్తుంది. ఇలాంటప్పుడు సంకెళ్ళు వేసి దుర్వినియోగం చేసే పరిస్థితి ఎక్కువ అవుతుంది. సంకెళ్ళు వేయడం రాజ్యాంగ విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీం కోర్టు చాలా కేసుల్లో చెప్పింది. ఆ తీర్పులన్నింటినీ ప్రక్కన పెట్టి కొత్త చట్టంలో సంకెళ్ళు వేసే వెసులుబాటును పార్లమెంటు కల్పించింది. ఈ వెసులుబాటు మరెంత దుర్వినియోగం అవుతుందో వేచి చూడాలి.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ ‘ 9440483001 -
రాజ్యాంగ రక్షణే అత్యవసరం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు. ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి. ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్‌గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన. అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్‌లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్‌కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి. ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను. భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు. కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్‌కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్‌వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్‌పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రాజ్యాంగం చేతబూని ఎంపీగా ప్రమాణం
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు మంగళవారం పలు పార్టీల సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాం«దీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, బీజేపీ సభ్యుడు ఓం బిర్లా, బీజేపీ సభ్యురాలు హేమామాలిని, డీఎంకే నేత కనిమొళి, కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే, శివసేన(ఉద్ధవ్) సభ్యుడు అరవింద్ సావంత్ తదితరులు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.రాహుల్ గాం«దీ, అఖిలేశ్ యాదవ్ సహా పలువు ప్రతిపక్ష సభ్యులు రాజ్యాంగ ప్రతిని చేతబూని ప్రమాణం చేయడం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం రాహుల్ గాంధీ ‘జైహింద్, జై సంవిధాన్’ అంటూ నినదించారు. స్వతంత్ర సభ్యుడు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ‘నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి’ అని రాసి ఉన్న టి–షర్టును ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరామ్) ఎంపీ చంద్రశేఖర్ ప్రమాణం చేసిన తర్వాత ‘జైభీమ్, జైభారత్, జై సంవిధాన్, జైమండల్, జైజోహార్, జైజవాన్, జైకిసాన్’ అని నినాదాలు చేశారు. -
అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలవడం లేదని, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఆయన శనివారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుంచి ఈరోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి దమనకాండ చూస్తూనే ఉన్నామన్నారు.హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూలి్చవేయడం కూటమి నేతల విధ్వంసకాండకు పరాకాష్టగా చెప్పారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల వైఎస్సార్సీపీ కార్యాలయాలకు అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అధికారులతో నోటీసులు జారీ చేయించారన్నారు. వీటిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, తమ పార్టీ దేవాలయాలను రక్షించుకుంటామని అన్నారు. అనుమతులున్నా.. లేవంటూ నోటీసులు విశాఖ, అనకాపల్లి పార్టీ కార్యాలయాలకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అనుమతుల్లేవంటూ నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 33 ఏళ్లకు డబ్బు చెల్లించి పార్టీ కార్యాలయానికి స్థలాలు లీజుకు తీసుకున్నామన్నారు. విశాఖ కార్యాలయానికి రూ.15 లక్షలు, అనకాపల్లి కార్యాలయానికి రూ.38 లక్షలు వీఏంఆర్డీఏకి చెల్లించి గతేడాది ఫిబ్రవరి నెలలోనే అనుమతి కోరామన్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఏదైనా పార్టీ కార్యాలయాలకు లీజు పద్ధతిలో ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవచ్చనేది ఉందని, దాని ప్రకారమే 33 ఏళ్లకు లీజుకు తీసుకొని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయాలు నిరి్మస్తున్నామని తెలిపారు. గజాల్లో స్థలం ఉంటే జీవిఎంసీ అనుమతి కావాలని, కానీ 2 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలంటే వీఎంఆర్డీఏ అనుమతి తీసుకోవాలన్నారు.దాని ప్రకారమే డబ్బులు చెల్లించి వీఎంఆర్డీఏ అనుమతి కోరామన్నారు. సెప్టెంబర్‌లో మార్టగేజ్ కూడా చేశామని తెలిపారు. ఈ నిర్మాణాలు తమ పరిధిలోకి రావని వీఎంఆర్డీఏ చెప్పి ఉంటే అప్పుడే జీవిఎంసీ అనుమతి కోరేవాళ్లమని అన్నారు. రూల్ ప్రకారం వీఎంఆర్డీఏ ద్వారానే జీవీఎంసీకి కూడా అనుమతికి పంపిస్తారని తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయాన్ని అక్రమ పద్ధతుల్లో నిర్మించారు విశాఖలో టీడీపీ కార్యాలయానికి నిర్మాణం చేపట్టిన 16 ఏళ్ల వరకు అనుమతే తీసుకోలేదని, అనుమతుల్లేకుండా అక్రమ పద్ధతిలో దాన్ని నిర్మించారని చెప్పారు. తాము అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా నిరి్మంచిన టీడీపీ కార్యాలయాలను కూల్చడం క్షణాల్లో పని అని, కానీ తాము ఆ పని చేయలేదని అన్నారు. 2015–19 మధ్య ఏపీలో 10 టీడీపీ కార్యాలయాల కోసం లీజు పద్ధతిలో స్థలం తీసుకుని నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.ఇది బుల్డోజర్ల ప్రభుత్వమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం అక్రమాలతో పాలన సాగిస్తోందని శుక్రవారం తమ పారీ్టకి చెందిన 4వ వార్డు కార్పొరేటర్ కొండబాబు ఇంటిపై రాళ్లతో టీడీపీ మూకలు దాడి చేశాయన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు.ఇది ప్రజాస్వామ్యమేనా? హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ అధికార బలంతో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేయడం కక్ష సాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూలి్చవేశారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని, నారా డిస్ట్రక్టివ్ అలయన్స్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట బిల్డింగ్ కూడా అక్రమ నిర్మాణమేనన్నారు. టీడీపీ కార్యాలయాలు చాలావరకు అనుమతుల్లేకుండా నిరి్మంచినవేనని తెలుసుకుని, అప్పుడు తమ పార్టీ ఆఫీస్‌కి నోటీసులిస్తే బెటర్ అని సూచించారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగం చెల్లదు!
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్‌బుక్‌లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్‌బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్‌ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్‌ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్‌ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్‌బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్‌బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్‌రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్‌బుక్‌ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్ స్టేషన్లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్‌వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్‌బుక్‌తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్‌బుక్ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నవ భారత నిర్మాణం కోసం...
రాజ్యాంగమే మనకు దిక్సూచి. రాజ్యాంగమే మనకు ప్రమాణం. రాజ్యాంగం హామీ ఇచ్చిన వ్యక్తిస్వేచ్ఛ, జీవించే హక్కులను కాపాడుకోవాల్సి ఉంది. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు కలిగి ఉన్నాం. దోపిడీ నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాం. బౌద్ధం ప్రవచించిన సామాజిక సమానత్వం తిరిగి సాకారం కావాలి. ప్రజలు సిరిసంపదలతో తులతూగే, సుఖ సంతోషాలతో శాంతమయమైన జీవితాన్ని గడిపే రోజులు మళ్లీ రావాలి. ప్రేమతత్వాన్ని పెంపొందించాలి, ద్వేషాన్ని విడనాడాలి.అంబేడ్కర్ భారతదేశాన్ని బౌద్ధ భారతంగా గుర్తించారు. బీజేపీ పార్టీ రాముడు అని నినాదం చేస్తే, ఆవ్‌ు ఆద్మీ పార్టీ వాళ్ళు ఆంజనేయుడు అన్నారు. కొందరు రామరాజ్యం కావాలి అంటే, ఇంకొందరు కృష్ణరాజ్యం కావాలి అన్నారు. కానీ ఈరోజు కావాల్సింది బౌద్ధ రాజ్యం. బౌద్ధంలో సామాజిక సమానత్వం ఉంది. బౌద్ధ సూత్రాలతోనే అంబేడ్కర్ రాజ్యాంగం రచించారు. ‘మన ఉద్యమాలు హిందువుల మనసులను మార్చలేకపోయాయి. మనం ఆశించిన సమానత్వాన్ని అందుకోలేకపోయాం. వర్ణ వ్యవస్థకు, అస్పృశ్యతకు మూలమైన హిందూమతంలో కొనసాగేకంటే ఆ మతానికి స్వస్తి చెప్పి మరో మతాన్ని స్వీకరించడం మేలు. దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. అది నా చేతిలో లేదు. కానీ నేను హిందువుగా మరణించను’ అని అంబేడ్కర్ ప్రకటించారు. ఈ ప్రకటన హిందువుల గుండెల్లో ఆందోళన రగిలించింది. అంబేడ్కర్ హిందూ మతాన్ని విడనాడేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసిన హైందవేతర మతాధిపతులు అంబేడ్కర్‌ను తమ తమ మతాలను స్వీకరించాల్సిందని రాయబారాలు సాగించారు. ఆ సమయంలో ఇటలీ బౌద్ధ భిక్షువు లోక్‌నాథ్ శ్రీలంక వెళ్తూ బొంబాయిలోని రాజగృహ గ్రంథాలయంలో అంబేడ్కర్‌ను కలుసుకొని బౌద్ధ మత విశిష్టత గూర్చి సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత దేశంలో అస్పృశులకు స్వాతంత్య్రాన్నీ, సమానత్వాన్నీ అందివ్వగలిగేది బౌద్ధమేననీ, అందుకు బౌద్ధాన్ని ప్రచారం చేయమనీ కోరారు. శ్రీలంక చేరుకున్న తర్వాత కూడా ఒక ఉత్తరాన్ని రాశారు. ‘‘...ఈ ఉత్తరాన్ని ముగించే ముందు నేను మీతో మీ గ్రంథాలయంలో మాట్లాడిన విషయాన్ని మరొక్క మారు గుర్తుకు తేనివ్వండి. డాక్టర్ అంబేడ్కర్! మీ భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. పీడిత ప్రజానీకానికి ఆనందమైన జీవితాన్ని అందించినా లేక వారిని దుఃఖంలో ముంచినా అంతా మీపై ఆధారపడి ఉంది. వారి భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది. మీరు మరో సామాన్యమైన మతాన్ని స్వీకరించినట్లయితే మీరే కాకుండా కోట్లాది ప్రజలు నష్టపోతారు. వారిని బౌద్ధమతం వైపు నడిపించండి. బౌద్ధమతం గురించి మీరు ప్రశంసించిన మాటలు నాకింకా బాగా గుర్తున్నాయి. మీ గ్రంథాలయ గోడపై ధ్యాన నిమగ్నంలో ఉన్న అత్యంత సౌందర్యవంతమైన బుద్ధుని చిత్రపటం నాకళ్ళ ఎదుటే వున్నట్లు కనిపిస్తుంది’ అంటూ భిక్కు లోక్‌నాథ్ రాశారు. అంబేడ్కర్ బౌద్ధమతం తీసుకోవటం వెనుక లోక్‌నాథ్ ప్రభావం కూడా ఉంది.నిజానికి బౌద్ధం గొప్ప చారిత్రక, రాజకీయ ధర్మం. శాతవాహన, ఇక్ష్వాకు రాజకుటుంబాల్లోని స్త్రీలు బౌద్ధం పట్ల మక్కువజూపి లెక్కలేనన్ని బౌద్ధచైత్యాల్ని, మండపాల్ని, విహారాల్ని నిర్మించారు. నాగార్జున కొండలో బయల్పడిన ప్రాకృత శాసనాలను పరిశీలిస్తే, ఆ కాలపు ప్రజలు సిరిసంపదలతో తులతూగి, సుఖ సంతోషాలతో, శాంతమయమైన జీవితాన్ని గడిపారని తెలుస్తుంది. వర్తకులు, కళాకారులు, భూస్వాములు, సైనికులు, ఉన్నతోద్యోగులు, ఒకరేమిటి వివిధ వృత్తులవారు ఒక్కటై బౌద్ధారాధనలో అంకిత భావంతో అమితోత్సాహంగా పాలు పంచుకొన్నారు. దీనికి అప్పటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించి తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల్లో బౌద్ధం విస్తరించటానికి తోడ్పడినాయి. అంబేడ్కర్‌కు ఈ చరిత్రంతా తెలుసు. అందుకే ఆయన బౌద్ధాన్ని ఒక జీవన విధానంగానే కాక, ఒక దేశీయ విధానంగానూ భావించారు. నిజానికి మనది బౌద్ధ భారతం. మన రాజముద్ర ఏది? బౌద్ధ చక్రవర్తి అశోకుడు చెక్కించిన సారనాథ్‌లోని నాలుగు తలల సింహస్తూపం, 24 ఆకులు గల ధర్మ చక్రాలతో కూడిన ముద్రే కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్ర ఏదీ? విదికుడనే చర్మకారుడు క్రీస్తు శకం 12 శతాబ్దంలో అమరావతి స్తూపంపై చెక్కిన పూర్ణ ఘట శిలాఫలకమే కదా! మనం వాడే ధర్మం అనే పదం ఎక్కడిది? బుద్ధుడు నైతిక విలువలకు చిహ్నంగా బోధించిన ‘ధమ్మ’ పదం నుంచి వచ్చిందే కదా! దక్షిణ భారతంలో ప్రసిద్ధులైన అనేకమంది మేధావులు బౌద్ధం నుండి వచ్చినవారే. నాగార్జునుడు, ఆర్యదేవ, భవ్య, దిఙ్నాగ, ధర్మకీర్తి, వసుబంధు, బుద్ధపాలిత, భావవివేక, అసంగ తదితర తత్వవేత్తలు అందరూ బౌద్ధులే. బౌద్ధం ప్రేమ తత్వాన్ని బోధించింది. ద్వేషాన్ని తొలగించింది. బౌద్ధ భారత నిర్మాణంలోనే ‘కుల నిర్మూలన’ జరుగుతుందని అంబేడ్కర్ బోధించారు. నిజానికి భారత రాజ్యాంగం అంతా బౌద్ధ సాంస్కృతిక జ్ఞాన వికాసంతో నిండి ఉంది. నిజానికి మత భావకులు ప్రేమను, నైతికతను, జ్ఞాన సంపదను చెప్పవలసిందిపోయి పరలోక రాజ్యాల గురించి బోధిస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులను కాపాడుకోవాల్సి ఉంది. భారత రాజ్యాంగం అంతా అహింసా సూత్రాలతో నడుస్తుంది. అంటరానితనం నిషేధించబడింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత భూభాగంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు కలిగి ఉన్నాం. దోపిడీ నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాం. రాజ్యాంగాన్ని పరిశీలిస్తే అంబేడ్కర్ బౌద్ధ ధమ్మపథ సారాన్ని అంతా ఎలా అందులోకి ఇమిడ్చారో మనకు అర్థమౌతుంది. అంబేడ్కర్ భారతదేశ చరిత్రను, సంస్కృతిని, నీతిశాస్త్రాన్ని, అహింసా ధర్మాన్ని, ప్రేమతత్వాన్ని, కరుణ భావాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి బౌద్ధ భారత నిర్మాణానికి పునాదులు వేశారు. ఈనాడు ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులు, లౌకిక వాదులు, సాంస్కృతిక వాదులు అందరం అంబేడ్కర్ స్ఫూర్తితో బౌద్ధ భారత నిర్మాణానికి తిరిగి పూనుకుందాం. అప్పుడే భారతదేశంలో క్రాంతి, శాంతి, అహింస, నైతికత, ఉత్పత్తి, ప్రేమ సమతుల్యం అవుతాయి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695