రాజ్యాంగ విధులకు ‘పాతర’ | constitution is also used in wrong manner | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ విధులకు ‘పాతర’

Published Tue, Dec 22 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

రాజ్యాంగ విధులకు ‘పాతర’

రాజ్యాంగ విధులకు ‘పాతర’

పాలకులు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతోనో, వ్యక్తిగత ప్రాబల్యపు తీట తీర్చుకోవడానికో కాకుండా, పేదసాదల అవసరాలు తీర్చే వస్తూత్పత్తి ప్రయోజనాలకు ప్రజాధనాన్ని వెచ్చించాలి.

రెండోమాట
పాలకులు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతోనో, వ్యక్తిగత ప్రాబల్యపు తీట తీర్చుకోవడానికో కాకుండా, పేదసాదల అవసరాలు తీర్చే వస్తూత్పత్తి ప్రయోజనాలకు ప్రజాధనాన్ని వెచ్చించాలి. సొంత హౌస్‌లనూ, ఫామ్ హౌస్‌లనూ తీర్చిదిద్దుకోవడానికి ప్రజాధనం వెచ్చిస్తే ఎవరూ హర్షించరు. అయినా, ఒక సందేహం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఇంతకూ ఓటుకు నోటు కేసు పర్యవసానం ఏమిటి? రాజ్యాంగ విధులను పాతర వేసినట్టు, ఈ పాలకుల మధ్య పరస్పరారోపణలతో కూడిన ఈ కేసు ఏ కంచికి చేరింది? ఇది శేషప్రశ్న.
 
‘ప్రవక్తలు వేరు; మతాచార్యులు/పురోహిత వర్గం లేదా మత ప్రచారకులు వేరు. మూఢ విశ్వాసాలను వ్యతిరేకించడం ప్రవక్తల పని కాగా, మూఢ నమ్మకాలను పెంచేందుకు నడుం కట్టినది పురోహితవర్గం. ఈ ప్రత్యేక వర్గానికి ప్రపంచంలో మరేదీ పట్టదు. నిజానికి ఈ ప్రపంచం ప్రకృతి ప్రసాదం. దార్శనికులైన ప్రవక్తలు మూఢ విశ్వాసాలను సవాలు చేసినవాళ్లు. కాగా, మతాచార్యులు లేదా పురోహిత వర్గమే 2000 రకాల ఆచారాలనూ, కర్మకాండలనూ సృష్టించారు.’
     -స్వామి వివేకానంద
 
ప్రజాబాహుళ్యంలో శాస్త్రీయమైన ఆలోచనాశక్తినీ, మానవతావాదాన్నీ, కార్యకారణ సంబంధాన్నీ తెలుసుకోగలిగిన జిజ్ఞాసనూ సంస్కరణాభిలాషనూ పెంచి పోషించాలి.’
     - భారత రాజ్యాంగం (ప్రాథమిక బాధ్యతలు-అధ్యాయం: జీఠి అ లో 51వ అధికరణ ‘ఎ’ (హెచ్) ఆదేశం)
 
ప్రజలను విడదీసే మతాలన్నీ అంతిమంగా రద్దయి, మానవత్వం చిరంజీవిగా వెలుగొందుతుందని షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామీ వివేకానందుడు ప్రవచించారు. భారతీయులు గర్వించదగిన ఆ దేశభక్తుడు, మహా తాత్వికుడు 130 ఏళ్ల కిందటే ఆ విధంగా ఎలా చాటగలిగాడని ఇటీవల ఒక మిత్రుడు ప్రశ్నవేశాడు. అయితే, వివేకానందుడి భావాలకు విరుద్ధంగా, ‘భారత ప్రజలమైన మేము...’ అంటూ తమకు తాముగా ఇక్కడి ప్రజాబాహుళ్యం ఆమోదించిన రాజ్యాంగం నిర్దేశించిన పౌర బాధ్యతల నుంచి, విధుల నుంచి తప్పుకుని పాలకులు ఎందుకు పక్కదారులు పడుతున్నారు? అన్నది కూడా ఆ మిత్రుడి సందేహమే.
 
 ఈ కుహనా సంస్కృతి ఇంకానా?
 రాచరికాలలో తమ మనుగడ కోసం రాజులు అమాయక ప్రజలను విద్యావికాసాలకు దూరంగా ఉంచి, యాజ్ఞయాగాదుల పేరిట కర్మకాండల ముసుగులో తమ ఆధిపత్యాన్ని సాగించుకున్నారు. ప్రజలకు దూరం చేసిన విద్య ఆసరాగానే ప్రభువర్గాలకు సన్నిహితమైన మరొక వర్గంలోని స్వార్ధపరులు వేదాల పేరిట, సంహితల ముసుగులో యజ్ఞయాగాదులకూ, నానారకాల కర్మకాండలకూ ప్రాణం పోసి పబ్బం గడుపుకున్నారు. సమాజంలో అవిద్యను పెంచి పోషించారు. ఇప్పటికీ అదేపనిలో ఉన్నారు. పాత యుగాల నాటి ఈ కుహనా సంస్కృతి ఇప్పటికీ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో కొందరు పాలకులను పట్టి పీడిస్తున్నది. పాలకులూ, ప్రభుత్వాలే యజ్ఞయాగాదులకూ, కర్మకాండల తంతుకూ విస్తృత స్థాయిలో శ్రీకారం చుడుతున్నారు.
 
 తమపై జరిగే దోపిడీ, పీడనలు ఏమిటో గుర్తించకుండా ప్రజలను మద్యానికి మించిన మత్తులోకి నెడుతున్నారు. నిజానికి కొందరు స్వార్ధపరులు పూర్వ వైదికంలో లేని తంతును అనంతర వైదికం పేరుతో ఇలాంటివి చొప్పించారని కొందరు పరిశోధకుల భావన. దీని ఫలితంగానే ‘ఉదర నిమిత్తం బహుకృత వేషం’ వంటి వ్యక్తీకరణలు జనజీవనంలో స్థిరపడినాయి. యజ్ఞం అన్న సంస్కృత పదం ఆదిలో పూజించడానికీ, ప్రార్థించడానికీ పరిమితం కాగా, వైదికానంతర సాహిత్యంలో ఏరకమైన కర్మకాండలకైనా, పండుగలూ పబ్బాలకైనా వర్తింపచేయడం వల్లనే అలాంటి వ్యక్తీకరణ వచ్చిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, సమష్టి శ్రమ స్థానాన్నీ, కష్టించే తత్వాన్నీ గౌరవించకుండా చేసేందుకు ‘యజ్ఞ’మన్న పదాన్ని వాడుకలోకి తెచ్చారు. కొన్నాళ్లు అసలు యజ్ఞవాటికలతో సంబంధం లేకుండా కర్మకాండలనూ, యాగాలనూ నిర్వహించారు.
 
 ఎటు తిరిగీ ఉపనిషత్తులూ, బ్రాహ్మణాలు క్రీస్తుపూర్వం 500 సంవత్సరం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాతనే కర్మకాండలకు ఊతం లభించిందని పండితులు గుర్తించారు. ఆ తరువాతే యజ్ఞవాటికలు వచ్చాయి. చివరికి యోగాన్ని కూడా ఆరోగ్యసూత్రంగా కాకుండా యజ్ఞచట్రంలోకి తెచ్చి, బ్రహ్మ పదార్థంగా చిత్రించారు. బ్రాహ్మణ్యం తప్ప ఇతరులు వీటిని నిర్వర్తించరాదన్న శాసనం అప్పటి నుంచే. కాబట్టే, జీవితాన్ని ఎవరికి వారు ఒక ఉపాధ్యాయునిగా, బోధకునిగా భావించాలనీ, మూఢ విశ్వాసాలు మన అభివృద్ధికి ఆటంకమనీ  వివేకానందుడు బోధించవలసి వచ్చింది. అంతేకాదు. హేతువాదాన్ని విశ్వసించి, దాని మీద ఆధారపడిన వృత్తి సమాజాన్ని నిర్మించి; కులమతాలకు, వర్గాలకు అతీతంగా ఉండే సమాజావిష్కరణకు పునాదులు వేసిన గౌతమ బుద్ధుడిని భారతదేశానికి ఏకైక ప్రతినిధిగా భావించినవాడు వివేకానందుడే.
 
 వినలేదా ‘వివేక’ వాణి?
 ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాల నేతలూ గాడి తప్పారు. ఆది బౌద్ధమూ, బుద్ధుడూ ఏ యజ్ఞయాగాదులను, విగ్రహారాధనను ప్రగతి నిరోధకమని చెప్పారో, సరిగ్గా ఆ బోధనలకు విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పాలనా విధులకు వ్యతిరేకంగా మన పాలకులు వ్యవహరిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే, ‘ఇది సొంత వ్యవహారమ’ని చెబుతున్నారు. తెరచాటున ప్రజోపయోగ, సంక్షేమ పథకాలకు, వయోజన విద్యావ్యాప్తికి వెచ్చించాల్సిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నల్లధనాన్నీ, దొంగడబ్బు చలామణీని నిరోధించాలని ఒకవైపున గావుకేకలు పెడుతూనే యాగాల మాటున చీకటి పనులు చేస్తున్నారు. బహుశా ఇందుకే వివేకానందుడు అన్నాడేమో: ‘ప్రపంచంలో మతధర్మాల పేరుతో వ్యవహరించే వారిలో చాలామంది వాస్తవ జీవితంలో రాజకీయులే. వాస్తవ జీవితంలో రాజీ పడకుండా జీవించడంలో వీరంతా విఫలమైనవారే. వీరంతా మూఢ విశ్వాసాలనే అంటకాగుతుంటారు’ (నిజానికి ఇలాంటి ప్రవచనాలు వివేకానందుల రచనలలో, ముఖ్యంగా ఎనిమిదో సంపుటంలో ఎన్నో!). ఇంకా వివేకానందుడు, దేశం బాగుపడాలంటే తప్పుడు ధర్మాలను, దారి తప్పిన తాత్విక ధోరణులను; వాటిని ప్రచారం చేసే మతాచార్యులనీ, పురోహితులనీ ‘దేశ సరిహద్దులు దాటించవలసిన అవసరం ఉంది’ అని ప్రస్తావించేవరకూ వెళ్లాడు.
 
 తన భవిష్యత్తును తాను దిద్దుకునే నిర్ణేత మానవుడేనని కూడా ఆయన అన్నారు. జబ్బు చేస్తే వెళ్లవలసింది వైద్యుడి దగ్గరకే తప్ప, జ్యోతిష్కుడి వద్దకు కాదని చెప్పాడాయన. ఇలాంటి భావాలతోనే ‘నేను బుద్ధుడిని ఆవాహనం చేసి మరోసారి దేశంలో అడుగుపెట్టమని ఆహ్వానిస్తున్నాను’ అని కూడా వివేకానందుడు వెల్లడించాడు. ఖగోళశాస్త్రాన్ని పక్కనపెట్టి జ్యోతిష్యాన్ని అంటకాగినందుకు నిరసనగా, ‘జ్యోతిష్యం, అలాంటి మార్మిక పద్ధతులు, వాటి ప్రచారం బలహీన మనసులకు ప్రతిబింబాలు’ అని అన్నాడు. క్రీస్తుశకం 4,5 శతాబ్దాల నాటికే ఖగోళ, గణితశాస్త్రాలకు పెద్ద పీట వేసిన ఆర్యభట్టు, భాస్కర, వరాహమిహిర వంటి వారి కృషి ఫలితంగా ఆవిర్భవించిన జ్ఞానాన్ని మనం గ్రీకులకు అప్పగించి, వారి నుంచి జ్యోతిష్యాన్ని తెచ్చి, ప్రజలలో శాశ్వత గందరగోళానికి దోహదం చేశామని వందేళ్లనాడే విశ్లేషించారాయన.
 
బౌద్ధాన్ని విస్మరించారు
చారిత్రకంగాను, తాత్వికంగాను ప్రపంచం మున్నెన్నడూ ఎరుగనంతటి మహత్తర ధార్మికశక్తిగా బౌద్ధం దూసుకుపోయి, మానవ సమాజాన్ని ప్రభావితం చేసిందని వివేకానందుడు విశ్వసించాడు. అయితే ఆయన వ్యాఖ్య వజ్రయాన శాఖ ప్రవేశంతో చెడిన అనంతర కాల బౌద్ధానికి వర్తించదని గుర్తించాలి. హరప్పా, మొహెంజొదారో నాగరికతకు (సింధు నాగరికతకు) సమాంతరంగానే బౌద్ధం విస్తరిల్లిందనీ, అది క్రీస్తుపూర్వం 2500 ఏళ్ల నాటిదనీ ఆ తవ్వకాలను చూసిన తరువాత మార్షల్ ప్రకటించాడు. ‘ఎవరైనా సరే, మొదటిసారిగా ఈ ప్రాచీన నాగరికతకు చెందిన తవ్వకాల మధ్య నడిచి వెళుతుంటే అభివృద్ధి చెందిన నేటి ఆధునిక లాంక్‌షైరీ పట్టణ శిథిలాల మధ్య నుంచి ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. ... ఆ హరప్పా తవ్వకాలలో ఆ శిథిల నగర నిర్మాణ ంలో వేల ఏళ్ల క్రితం వాడిని ఎర్ర ఇటుకలు,  ఈనాటి ఆధునిక ఇంగ్లిష్ ఇటుకల పరిమాణంలో ఉండడం ఆశ్చర్యకరం.
 
 హరప్పా, మొహెంజొదారో ప్రాచీన నగర నిర్మాణాలు వేదాలు అవతరించక ముందే కనీసం వెయ్యేళ్ల నాటివి, వైదిక యుగానికి చెందిన యజ్ఞవేదికల కంటే ముందుటివి’ అని మార్షల్ రాశాడు. పట్టణ-నగర నిర్మాణ పథకాల విశిష్ట సంస్కృతి వేదాలకు ముందే సింధు నాగరికతగా పరిఢవిల్లింది. ఈ సంస్కృతి మొహెంజొదారోతో పాటు కలిబాంగన్, లోథాల్ తదితర ప్రాంతాలలో కూడా శతాబ్దాల తరబడి కొనసాగిందని ఎన్‌పి గుప్తా, శశి ఆస్తానా వంటి పురావస్తు శాస్త్రవేత్తలు కూడా నమోదు చేసిన సంగతిని విస్మరించరాదు. ఇంతటి వైభవోపేత భారతీయ సంస్కృతికి మూఢ విశ్వాసాలకు తోడు, విదేశీ వ్యామోహం కూడా పట్టుకుంది. మానసిక బానిసత్వానికి అర్రులు చాచవలసి వస్తోంది.
 
 శేషప్రశ్న
పాలకులు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతోనో, వ్యక్తిగత ప్రాబల్యపు తీట తీర్చుకోవడానికో కాకుండా, పేదసాదల అవసరాలు తీర్చే వస్తూత్పత్తి ప్రయోజనాలకు ప్రజాధనాన్ని వెచ్చించాలి. సొంత హౌస్‌లనూ, ఫామ్ హౌస్‌లనూ తీర్చిదిద్దుకోవడానికి ప్రజాధనం వెచ్చిస్తే ఎవరూ హర్షించరు. అయినా, ఒక సందేహం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఇంతకూ ఓటుకు నోటు కేసు పర్యవసానం ఏమిటి? రాజ్యాంగ విధులను పాతర వేసినట్టు, ఈ పాలకుల మధ్య పరస్పరారోపణలతో కూడిన ఈ కేసు ఏ కంచికి చేరింది? ఉభయులూ ఏ మార్గాలలో ఇళ్లకు చేరారు. ఇది శేషప్రశ్న. యజ్ఞయాగాదులు అధికారాన్ని నిలబెట్టలేవు. ప్రభుత్వాలను నిలబెట్టినా, పడగొట్టినా ఆ శక్తి ప్రజాశక్తికే ఉంది. ఇంతకూ పాలకుల చేతిలో ప్రజలే పిచ్చివాళ్లవుతున్నారు. ధనస్వామ్య వ్యవస్థలో మరొకలా జరగదు మరి!

 ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
 abkprasad2006@yahoo.com.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement