
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు,ఆచారాలు పక్కనపెట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు. ఏడడుగులు నడవడం, తాళి కట్టడం, సింధూరం పెట్టడం లాంటి అన్ని ఆచారాలను దూరంగా పెట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడమే కాకుండా దండలు మార్చుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
ఇంతటితో ఆగకుండా పెళ్లికి అనవసర ఖర్చు కూడా చేయకుండా సింపుల్‌గా కానిచ్చేశారు. పెళ్లికయ్యే ఖర్చులతో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చనే ఆలోచనతోనే ఇలాచేసినట్లు పెళ్లికొడుకు ఇమాన్ లాహ్రె చెప్పారు. తమకు ఆచారాలు,సంప్రదాయాల మీద కన్నా రాజ్యాంగం మీదనే తమకు నమ్మకం ఉందన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలోని కాపు గ్రామంలో డిసెంబర్ 18న ఈ పెళ్లి జరిగింది. ఈ జంట చేసుకున్న ఆదర్శ వివాహంపై వారి బంధువులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.