రాయ్‌పూర్: రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తదితరాలపై పౌరులందరికీ అవగాహన ఉన్నప్పుడే దేశం నిజమైన ప్రగతి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘తేలిక భాషలో వాటిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో న్యాయ శాస్త్ర పట్టభద్రులు చురుకైన పాత్ర పోషించాలి. వారిని సోషల్ ఇంజనీర్లుగా రూపొందించే బాధ్యతను లా స్కూల్స్ తలకెత్తుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.
ఆదివారం రాయ్‌పూర్‌లోని హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎన్‌ఎల్‌యూ) ఐదో స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ‘‘ఆధునిక భారత ఆకాంక్షలకు అక్షర రూపమైన మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ చెందినది. కానీ వాస్తవంలో అది కేవలం లా స్టూడెంట్లు, లాయర్ల వంటి అతి కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఓ పుస్తకంగా మారిపోవడం బాధాకరం’’ అన్నారు. న్యాయ రంగంలో కెరీర్ ఎంతటి సవాళ్లతో కూడినదో అంతటి సంతృప్తినీ ఇస్తుందని సీజేఐ అన్నారు.
‘‘లాయరంటే కేవలం కోర్టులో వాదించే వ్యక్తి కాదు. అన్ని రంగాలపైనా ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ సాగాలి. మార్పుకు శ్రీకారం చుట్టే నాయకునిగా ఎదగాలి. విమర్శలెదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీదే’’ అని లా గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు బలయ్యే అణగారిన వర్గాలకు చట్టపరంగా చేయూతనివ్వాలని సూచించారు. మెరుగైన సామాజిక మార్పుకు చట్టాలు కూడా తోడ్పడతాయని సీజేఐ అన్నారు.
‘‘యువతరం ప్రపంచంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుడుతోంది. వాతావరణ సంక్షోభం మొదలుకుని మావన హక్కుల ఉల్లంఘన దాకా పెను సమస్యలెన్నింటినో ఎదుర్కోవడంలో సంఘటిత శక్తిగా తెరపైకి వస్తోంది. ఇక సాంకేతిక విప్లవం మనందరినీ ప్రపంచ పౌరులుగా మార్చేసింది. కనుక సామాజిక బాధ్యతలను నెరవేర్చేందుకు మనమంతా ముందుకు రావాలి’’ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపులు తదితరాల్లో సీఎం భూపేశ్ భగెల్ పనితీరును ఈ సందర్భంగా ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment