Justice nv ramana
-
కొలీజియంపై ఫిర్యాదులను విస్మరించలేం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ పనితీరుపై ప్రభుత్వం సహా పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని విస్మరించలేమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొలీజియం విషయంలో పౌర సమాజం, న్యాయవాద సంఘాల ఆందోళనలను కొట్టిపారేయలేమని అన్నారు. న్యాయ వ్యవస్థలో వైవిధ్యం కోసం ఒక సంస్థాగత యంత్రాంగం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆసియన్ ఆస్ట్రేలియన్ లాయర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘కల్చరల్ డైవర్సిటీ, లీగల్ ప్రొఫెషన్’ అంశంపై సదస్సులో జస్టిస్ రమణ ప్రసంగించారు. కోర్టు ధర్మాసనాల్లో వైవిధ్యం ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. విభిన్న అనుభవాలు కలిగిన న్యాయమూర్తులు ధర్మాసనంలో సభ్యులుగా ఉండాలని చెప్పారు. న్యాయ వ్యవస్థలో తాము కూడా భాగస్వాములమేనన్న నమ్మకం ప్రజలకు కలిగేలా జడ్జీలు వ్యవహరించాలన్నారు. భిన్నమైన నేపథ్యాలు కలిగినవారిని నియమించేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. దాదాపు తాను చేసిన అన్ని సిఫార్సులను కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు. -
యు.యు.లలిత్ అనే నేను..
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం జస్టిస్ లలిత్‌కు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన తర్వాత జస్టిస్ లలిత్ తన తండ్రి, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేశ్ రంగనాథ్ లలిత్(90)తోపాటు కుటుంబ పెద్దల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం పొందారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ లలిత్. 1964లో జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ లలిత్ పదవీ విరమణ అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశముంది. 100 రోజుల్లోపే పదవిలో ఉండే ఆరో సీజేఐ దేశంలో ఇప్పటిదాకా 100 రోజుల్లోపే పదవిలో ఉన్న ఆరో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ రికార్డుకెక్కనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేస్తారు. అంటే కేవలం 74 రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ 18 రోజులు, జస్టిస్ రాజేంద్రబాబు 30 రోజులు, జస్టిస్ జె.సి.షా 36 రోజులు, జస్టిస్ జి.బి.పట్నాయక్ 41 రోజులు, జస్టిస్ ఎల్.ఎం.శర్మ 86 రోజులపాటు పదవిలో కొనసాగారు. -
న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సమ వాటాదారులైన కేంద్ర ప్రభుత్వం, బార్, బెంచ్‌లు ఈ మేరకు చొరవ తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో పోరాటాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆ క్రమంలో అనేక కుట్రపూరిత పరిశీలనలకు గురయ్యాయని చెప్పారు. తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. బాల్యం నుంచి సీజేఐ వరకూ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను స్మరించుకున్నారు. తన అనుభవాల్లో తీపి కంటే చేదు ఎక్కువగా ఉందన్నారు. అనేక ఆందోళనలు, పోరాటాల్లో భాగస్వామి అయిన తాను ఎమర్జెన్సీ సమయంలో బాధలు పడ్డానని తెలిపారు. ఆయా అనుభవాలే ప్రజలకు సేవ చేయాలన్న అభిరుచిని తనలో పెంపొందించాయని వ్యాఖ్యానించారు. మొదటి తరం న్యాయవాదిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, విజయాలకు షార్ట్‌కట్ ఉండదని తెలుసుకున్నానని వెల్లడించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ ఉద్దేశం అదే.. గొప్ప న్యాయమూర్తినని తాను ఎప్పుడూ చెప్పుకోలేదని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే న్యాయ వ్యవస్థ అంతిమ ఉద్దేశమని నమ్ముతానన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బార్ కృషి చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజల్లో అవగాహన, విశ్వాసం పెంపొందించాలని అన్నారు. న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 16 నెలల తన పదవీ కాలంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 15 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 224 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తమేనని వివరించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను భీష్మ పితామహుడిగా జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఛైర్మన్ వికాస్ సింగ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీజేఐ (నియమిత ) జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. హైకోర్టుల్లో నియామకాలు, మౌలిక సదుపాయాల కోసం జస్టిస్ ఎన్వీ రమణ సాగించిన కృషిని అభినందించారు. నూతన సీజేఐగా తన పదవీ కాలంలో కేసుల జాబితా, అత్యవసర విషయాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలపై దృష్టి సారిస్తానన్నారు. పెండింగ్ కేసులే అతిపెద్ద సవాల్ విచారించాల్సిన కేసుల జాబితా సమస్యలను పరిష్కరించడంపై తగిన శ్రద్ధ చూపలేకపోయినందుకు జస్టిస్ ఎన్వీ రమణ క్షమాపణలు కోరారు. దేశంలోని కోర్టులు పెండింగ్ కేసుల రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థను ఒక ఉత్తర్వు, ఒక తీర్పుతో నిర్వచించలేమని, అదేవిధంగా ఒక తీర్పుతో మార్చలేమని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టుల పనితీరును సంస్కరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. శాశ్వత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మే«ధను వాడుకోవాలన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సందర్భంగా సీనియర్ లాయర్ దుష్యంత్ దవే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణను ప్రజాన్యాయమూర్తి అంటూ కొనియాడారు.. జస్టిస్ రమణ సేవలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలతో సాయంతో పూర్తిస్థాయిలో పనిచేశారని జస్టిస్ రమణను అభినందించారు. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం సుప్రీంకోర్టు శుక్రవారం చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశగా జస్టిస్ ఎన్వీ రమణ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు జరగాలని సీజేఐ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. నేడు జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో జస్టిస్ లలిత్‌తో ప్రమాణం చేయించనున్నారు. వీడ్కోలు సమావేశంలో అభివాదం చేస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్ -
విజయానికి షార్ట్ కట్లు ఉండవు: జస్టిస్ ఎన్వీ రమణ
-
గొప్ప జడ్జిని కాకపోవచ్చు.. సామాన్యుడికీ న్యాయం అందించా: జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: జీవితంలో తనకు విద్య నేర్పిన గురవులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐ ఎన్వీరమణకు శుక్రవారం సుప్రీం కోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ ప్రసంగిస్తూ.. తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్ యూనియన్‌కు నేతృత్వం వహించానని తెలిపారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు.. తాను గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ, సామాన్యూడికి న్యాయం అందించడానికి కృషి చేశానని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. చదవండి: (బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆజాద్) ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. చదవండి: (జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు) -
దేశ చర్రితలోనే ఫస్ట్.. సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోలుకు స్పెషల్ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. నేడు(శుక్రవారం) పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ప్రత్యక్ష ప్రసారంలో విచారణలు జరిపింది. కాగా, విచారణలో భాగంగా ఉచిత పథకాలపై దాఖలైన పిటిషిన్లపై సీజేఐ ఎన్వీ రమణ తీర్పు వెల్లడించారు. ఉచిత హామీలపై పిటిషన్లను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. -
‘ఉచితాల’తో ఆర్థిక వ్యవస్థకు చేటు..అఖిలపక్షాన్ని పిలవలేదేం?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో నెగ్గడానికి రాజకీయ పార్టీలు ప్రజలకు ‘ఉచిత’ హామీలు ఇస్తుండడం తీవ్రమైన అంశమేనని, దీనిపై కచ్చితంగా చర్చ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. చర్చించడానికి అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలుపునివ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే ఉచితాల వ్యవహారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉచితాలపై పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇవి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్æ రవికుమార్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున‡ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఉచితాలపై అధ్యయనం చేయడానికి నియమించే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లోధాను చైర్మన్‌గా నియమించాలని కోరారు. ‘‘పదవీ విరమణ చేసిన, చేయబోతున్న వ్యక్తికి ఈ దేశంలో విలువ లేదు’’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిస్పందించారు. కమిటీకి ఒక రాజ్యాంగ సంస్థ నేతృత్వం వహించాలని భావిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఈ సమస్యను అధ్యయనం చేయడానికి కేంద్రమే కమిటీని ఎందుకు నియమించకూడదని సీజేఐ ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంతో మేలు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఉచితాలు ప్రకటించడమే ప్రధానమైన సమస్య అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఆయన ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్’ తరఫున వాదనలు వినిపించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, పబ్లిక్ పాలసీని అపహాస్యం చేస్తూ ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులైన కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడం, ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు చేయడం.. ఈ మూడూ అక్రమమేనని చెప్పారు. పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు నిధుల మూలాలను సైతం వెల్లడించాలనే ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన రికార్డులు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండవని గుర్తుచేశారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తే పరిష్కారం లభిస్తుందని, ఆర్థిక లోటు మూడు శాతానికి మించితే తదుపరి సంవత్సరం నుంచి కేటాయింపులు తగ్గించే అధికారం ఆర్థిక కమిషన్‌కు ఉందని తెలిపారు. పార్టీలు ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాయి ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారంలో లేని పార్టీలు హామీలు ఇస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఉండవని ఒకరు ప్రజల్ని మభ్యపెట్టొచ్చు. కానీ, అధికారంలోకి వస్తే చంద్రుడిని తీసుకొస్తానని హామీ ఇవ్వగలమా?’’ అని ప్రశ్నించారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ఉచితాల అంశంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకని అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వలేదని అన్నారు. ఉచితాలపై నియంత్రణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంతో ఫలితం ఉండదని మెహతా బదులిచ్చారు. ఉచితాలు అందించడం తమ ప్రాథమిక హక్కుగా కొన్ని పార్టీలు భావిస్తున్నాయని, కేవలం ఉచితాల హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీలూ ఉన్నాయని ఉద్ఘాటించారు. నేను పోటీ చేస్తే.. ‘‘కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేది పెద్ద సమస్య. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తాయి. వ్యక్తులు కాదు. ఒకవేళ నేను పోటీ చేస్తే 10 ఓట్లు కూడా రావు. ఎందుకంటే వ్యక్తులకు అంత ప్రాధాన్యం ఉండదు. ఇదే మన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారు తర్వాత అధికారంలోకి రావచ్చు’ అని జస్టిస్ రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... తుషార్ మెహతా వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కేవలం ఉచితాల ద్వారా ఓటర్లను ఆకర్శిస్తారనడం సరైంది కాదన్నారు. బంగారు చైన్లు ఇస్తామంటూ హామీలు ఇవ్వడాన్ని సంక్షేమంగా ఎలా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ ప్రశ్నించారు. ఉచితాల వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి తగిన సమాచారం అందుబాటులో ఉందని వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఉచిత హామీల విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై ఇకపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుందని తెలిపారు. సుబ్రహ్మణ్యం వర్సెస్ తమిళనాడు కేసును పునఃపరిశీలించడానికి ధర్మాసనం ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు. -
రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే
న్యూఢిల్లీ: బీజేపీతో సహా రాజకీయ పార్టీలన్నీ ఉచిత హామీల పక్షమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అందుకే ఏవి ఉచితాలో, ఏవి సంక్షేమ పథకాలో తేల్చేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘ఉచితాలు అందరికీ కావాల్సిందే. పార్టీలు ఈ విషయంలో ఒక్కతాటిపై ఉన్నాయి. అందుకే దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే మేం జోక్యం చేసుకున్నాం’’ అని జస్టిస్ రమణ ఈ సందర్భంగా అన్నారు. ఉచితాలపై డీఎంకే చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘వాళ్ల తీరు నిజంగా దురదృష్టకరం. ఇంకా చాలా అనాలనుకున్నా నేను సీజేఐగా ఉన్న కారణంగా ఇక్కడితో సరిపెడుతున్నా. అయితే తెలివితేటలు కేవలం ఒక్క వ్యక్తికో, పార్టీకో పరిమితం కాదని గుర్తుంచుకోండి’’ అంటూ డీఎంకే తరఫు న్యాయవాది పి.విల్సన్‌ను ఉద్దేశించి ఆగ్రహం వెలిబుచ్చారు. ప్యానల్ కావాలి: సిబల్ ఉచితాల అంశాన్ని ఒక నిర్దిష్ట వ్యవస్థ ద్వారా పరిష్కరించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ‘వీటి కట్టడికి కేంద్ర ఆర్థిక సంఘం పర్యవేక్షణలో చట్టబద్ధ అధికారాలతో ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేయాలి. ఉచితాలు బడ్జెట్లో 3 శాతం మించకుండా చూడాలి. ఒకవేళ మించితే ఆ తర్వాత ఏడాదిలో సదరు రాష్ట్రానికి ఆర్థిక సంఘం ఆ మేరకు కేటాయింపులను తగ్గించాలి’’ అని సూచించారు. దీనిపై ఇంకా చర్చ జరిగి ఇలాంటి సూచనలు చాలా రావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పేదలకు సైకిళ్లు ఇస్తున్నాయి. వాటివల్ల వారి జీవన విధానం మెరుగైందని పలు నివేదికలు చెబుతున్నాయి. మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద జీవనోపాధికి సైకిళ్లు, చిన్న పడవలపై ఆధారపడవచ్చు. దీనిపై మనమిక్కడ కూర్చుని వాదించి నిర్ణయించలేం’’ అన్నారు. సంక్షేమ పథకాలను ఎవరూ వద్దనరని, టీవీల వంటివాటిని ఉచితంగా పంచడంపైనే అభ్యంతరమని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఉచిత పథకాలను నిధులెలా సమీకరిస్తారన్నది ఎన్నికల మేనిఫెస్టోలోనే పార్టీలు స్పష్టంగా చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు అన్నారు. -
కేంద్రం–ఢిల్లీ రగడపై సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సంబంధించిన పలు శాఖలపై శాసన, పాలనాపరమైన పెత్తనం విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇందుకోసం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం లేవనెత్తారు. ఈ అంశంపై 2019 ఫిబ్రవరి 14న ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పు వెలువరించారు. విచారణకు స్వీకరిస్తాం మనీ లాండరింగ్ చట్టంపై తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిల్ విచారణ స్వీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దాన్ని విచారణ కేసుల జాబితాలో చేరుస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది. -
పార్లమెంటులో లాయర్లు తగ్గుతున్నారు
న్యూఢిల్లీ: ‘‘పార్లమెంటులో గతంలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్తులోనూ, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొలువుదీరిన పలు పార్లమెంటుల్లోనూ చాలామంది వాళ్లే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగాన్ని, తిరుగులేని చట్టాలను మనకందించారు. కానీ కొంతకాలంగా పార్లమెంటులో న్యాయ కోవిదుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఆ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడబోను’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగ్దీప్ ధన్‌ఖడ్ గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అపార అనుభవం ధన్‌ఖడ్ సొంతమన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఎలాంటి రాజకీయ గాడ్‌ఫాదర్లూ లేకుండానే దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొలువుదీరే స్థాయికి ఎదిగారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పదనానికి, ఉన్నత రాజ్యాంగ విలువలకు తార్కాణం’’ అన్నారు. ‘‘ప్రతి సభ్యుడినీ సంతృప్తి పరచడం తేలిక కాదు. కానీ ధన్‌ఖడ్ తన అపార అనుభవం సాయంతో రాజ్యసభ చైర్మన్‌గా రాణిస్తారని, అందరినీ కలుపుకునిపోతారని నాకు నమ్మకముంది. న్యాయవాదిగా అపార అనుభవం, గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహించి ఉండటం ఆయనకెంతో ఉపయోగపడతాయి. అతి త్వరలో రిటైరవుతున్న నేను ధన్‌ఖడ్ పర్యవేక్షణలో రాజ్యసభలో జరిగే నాణ్యమైన చర్చలను టీవీలో చూస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. ధన్‌ఖడ్‌ను ఆయన సన్మానించారు. న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంబార్ అసోసియేసన్ అధ్యక్షుడు వికాస్‌సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతకాలంగా పార్లమెంటులో చర్చల కంటే అంతరాయాలే ఎక్కువయ్యాయని రిజిజు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చర్చల నాణ్యత బాగా పడిపోయింది. ఇటీవలి దాకా లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ కాస్త ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్య అక్కడా గలాభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సభను అదుపు చేసేందుకు ధన్‌ఖడ్ అనుభవం పనికొస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఓ లాయర్ ఉపరాష్ట్రపతి కావడం ఇదే తొలిసారని తుషార్ మెహతా అన్నారు. ధన్‌ఖడ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ -
బయటి ప్రపంచాన్ని చూడండి
సాక్షి, అమరావతి: విద్యార్థులు కేవలం తరగతులకే పరిమితం కాకుండా, బయటి ప్రపంచాన్ని చూడాలని.. సామాజిక ఉద్యమాల్లో సైతం పాలుపంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పిలుపునిచ్చారు. తామంతా కూడా సామాజిక ఉద్యమాల్లో పాల్గొనే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు అలాంటి ఉద్యమాల్లో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. గతంలో విశ్వ విద్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి, సమాజ సమస్యలపై చర్చలు జరిపే వారని, ఇప్పుడు అలాంటి సమావేశాలేవీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే అసలైన సవాళ్లను ఎదుర్కొనేలా విద్యా బోధన ఉండాలని ఆకాంక్షించారు. శనివారం ఆయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఉన్నత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పి.రాజశేఖర్ తదితరుల సమక్షంలో జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ చేతుల మీద గౌరవ డాక్టరేట్ ప్రదానం జరిగింది. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు భిన్నత్వానికి చిరునామాలని, తాను చదివిన విశ్వవిద్యాలయం నుంచే ఇప్పుడు తాను గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలు తమ సామాజిక ప్రాముఖ్యతను కోల్పోతుండటం భయం కలిగిస్తోందని చెప్పారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యా సంస్థలు పాఠాలు నేర్పే ఫ్యాక్టరీలు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఎవరిని, ఎందుకు నిందించాలో అర్థం కావడం లేదని, విద్యార్థులు సామాజిక సంబంధాలపై దృష్టి సారించేలా చూడాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని సూచించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన అనేక సమస్యలకు విద్య ద్వారానే పరిష్కారం చూపగలమని తెలిపారు. విద్య ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చని స్పష్టం చేశారు. సీజేఐ ఇంకా ఏమన్నారంటే.. పాఠాలొక్కటే ప్రధానం కాదు ► విద్యాలయాలు కేవలం విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల ఆలోచనలకు, ఆశయాలకు పరిచయ వేదికలుగా ఉంటాయి. ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి గత నాలుగు దశాబ్దాల్లో వివిధ కోర్సులు అందించే 450 అనుబంధ కాలేజీలు ఏర్పడ్డాయి. ► మన దేశంలో వృత్తి విద్య విషయానికొస్తే.. ఎక్కువ జీతాలు, లాభదాయకమైన ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు వచ్చే కోర్సులనే బోధిస్తున్నారు. హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, చరిత్ర, అర్థశాస్త్రం, భాషలు తదితర కోర్సులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రొఫెషనల్ యూనివర్సిటీల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా విద్యార్థులు తరగతి గదిలో పాఠాలపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప, బయట ప్రపంచాన్ని చూడటం లేదు. ► అసలు విద్య ప్రాథమిక ఉద్దేశం ఏంటి? వ్యక్తి కోసమా? సమాజం కోసమా? వాస్తవానికి ఈ రెండూ ముఖ్యమైనవే. విద్య ద్వారా వ్యక్తులు దార్శనికులుగా, నాయకులుగా మారుతారు. ఇదే సమయంలో విద్య మనల్ని సమాజ అవసరాల పట్ల బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది. నా మూలాలు మర్చిపోలేదు.. ► నాలుగు దశాబ్దాల క్రితం ఈ విశ్వవిద్యాలయంలో చెట్ల కింద, క్యాంటీన్, డైనింగ్ హాల్లో మా ఆలోచనలు, సిద్ధాంతాలు, రాజకీయాలు, సమాజ సమస్యలపై చర్చించే వాళ్లం. ఆ చర్చలు, మా క్రియాశీలత ప్రపంచం పట్ల మా అభిప్రాయాలను మార్చాయి. ► అప్పట్లో ఈ యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉండేవి. వాటిపై వర్సిటీ ఉద్యోగ సంఘం పోరాడేది. వారి వల్లే నేను అప్పట్లో ఈ వర్సిటీలో చేరాను. ఓ వ్యక్తి గొంతుక, అభిప్రాయాల తాలుక విలువ అప్పుడు మాకు తెలిసింది. ఈ రోజుకీ నేను నా మూలాలను మర్చిపోలేదు. ► మన విద్యా వ్యవస్థ రూపాంతరీకరణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. సామాజిక సంబంధాలు, పౌర హక్కుల విలువలను నేర్పించేలా విద్యా వ్యవస్థ ఉండాలి. ఆర్థిక పురోగతి లక్ష్య సాధనలో మన సాంస్కృతిక, పర్యావరణ బాధ్యతలను విస్మరించకూడదు. మమ్మల్ని దాటి ఆలోచించండి. సామాజిక అవసరాల పట్ల స్పృహ కలిగి ఉండండి. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, విద్యా శాఖ అధికారులు, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలలను సాకారం చేసుకోండి విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకునేంత వరకు వాటిని వెంటాడాలి. ప్రయత్నించడాన్ని ఎన్నడూ ఆపొద్దు. విశ్వవిద్యాలయాలు ఇప్పుడు జ్ఞాన కేంద్రాలుగా భాసిలుతున్నాయి. మన జీవితంలో చూస్తున్న చాలా ఆవిష్కరణలు యూనివర్సిటీల్లోనే పుట్టాయి. పరిశోధన, బోధన సమాంతరంగా సాగినప్పుడే విశ్వవిద్యాలయాలు విజయం సాధించగలుగుతాయి. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ పోటీని తట్టుకునేలా విద్యా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు స్థానంలో ఉంది. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా కార్యాచరణ మొదలు పెట్టాం. జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం ఈ రాష్ట్రానికి గర్వకారణం. కార్యదీక్షతో ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చునని ఆయన నిరూపించారు. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి -
20న ఏఎన్‌యూ స్నాతకోత్సవాలు
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 37, 38వ స్నాతకోత్సవాలు కలిపి ఈనెల 20న నిర్వహించనున్నామని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారని తెలిపారు. స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, బంగారు పతకాలు అందజేయనున్నామని వివరించారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై మంగళవారం వీసీ పలు కమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. (క్లిక్: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం) -
మీ వారసున్ని సిఫార్సు చేయండి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం జస్టిస్ రమణకు లేఖ రాసింది. ఆయన పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుంది. పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా ఎంపికైతే రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. -
ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంటులో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలివ్వాలి. విపక్షాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి’’ అని సూచించింది. ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మానసం బుధవారం విచారణ జరిపింది. ఈ విషయంలో ఏమీ చేయలేమని మాత్రం కేంద్రం, ఎన్నికల సంఘం చెప్పొద్దని, కూలంకషంగా పరిశీలించి సలహాలివ్వాలని స్పష్టం చేసింది. పిల్లో లేవనెత్తిన అంశాలకు కేంద్రం కూడా మద్దతిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ‘‘ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివిడితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతుంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశం ఈసీ పరిధిలోనిదని ఇప్పటిదాకా కేంద్రం చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశమై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దీనిపై గురువారం కూడా విచారణ కొనసాగనుంది. -
రాజ్యాంగ అవగాహన తప్పనిసరి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
రాయ్‌పూర్: రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తదితరాలపై పౌరులందరికీ అవగాహన ఉన్నప్పుడే దేశం నిజమైన ప్రగతి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘తేలిక భాషలో వాటిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో న్యాయ శాస్త్ర పట్టభద్రులు చురుకైన పాత్ర పోషించాలి. వారిని సోషల్ ఇంజనీర్లుగా రూపొందించే బాధ్యతను లా స్కూల్స్ తలకెత్తుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం రాయ్‌పూర్‌లోని హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎన్‌ఎల్‌యూ) ఐదో స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ‘‘ఆధునిక భారత ఆకాంక్షలకు అక్షర రూపమైన మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ చెందినది. కానీ వాస్తవంలో అది కేవలం లా స్టూడెంట్లు, లాయర్ల వంటి అతి కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఓ పుస్తకంగా మారిపోవడం బాధాకరం’’ అన్నారు. న్యాయ రంగంలో కెరీర్ ఎంతటి సవాళ్లతో కూడినదో అంతటి సంతృప్తినీ ఇస్తుందని సీజేఐ అన్నారు. ‘‘లాయరంటే కేవలం కోర్టులో వాదించే వ్యక్తి కాదు. అన్ని రంగాలపైనా ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ సాగాలి. మార్పుకు శ్రీకారం చుట్టే నాయకునిగా ఎదగాలి. విమర్శలెదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీదే’’ అని లా గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు బలయ్యే అణగారిన వర్గాలకు చట్టపరంగా చేయూతనివ్వాలని సూచించారు. మెరుగైన సామాజిక మార్పుకు చట్టాలు కూడా తోడ్పడతాయని సీజేఐ అన్నారు. ‘‘యువతరం ప్రపంచంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుడుతోంది. వాతావరణ సంక్షోభం మొదలుకుని మావన హక్కుల ఉల్లంఘన దాకా పెను సమస్యలెన్నింటినో ఎదుర్కోవడంలో సంఘటిత శక్తిగా తెరపైకి వస్తోంది. ఇక సాంకేతిక విప్లవం మనందరినీ ప్రపంచ పౌరులుగా మార్చేసింది. కనుక సామాజిక బాధ్యతలను నెరవేర్చేందుకు మనమంతా ముందుకు రావాలి’’ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపులు తదితరాల్లో సీఎం భూపేశ్ భగెల్ పనితీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. -
జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత
న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు. నల్సా సేవలు అమోఘం విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు. న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి. సులువుగా న్యాయం: మోదీ సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు. ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. -
ఉచిత పథకాలు తీవ్రమైన అంశమే
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలపై హామీలు ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ అంశంపై ఒక దృఢ వైఖరిని అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. హేతుబద్ధత లేని ఉచితాలను కఠినంగా నియంత్రించాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పార్టీలు ప్రకటించే ఉచితాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత ఇలాంటి వాటిని కొనసాగించాలో లేదో తాము నిర్ణయిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఉచిత పథకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు. ఉచితాలను రాష్ట్రాల స్థాయిలోనే నియంత్రించాలని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఉచిత పథకాల అమలు వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయని పిటిషనర్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.70 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. ఉచితాలను ప్రకటించే పార్టీల ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని, పార్టీల రిజిస్ట్రేషన్‌ను సైతం క్యాన్సల్ చేయాలని కోరారు. మీడియా నిజాయితీ పాటించాలి మీడియా సంస్థలు వ్యాపార ధోరణి వదులుకోవాలని, నిజాయితీగా వ్యవహరించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు. వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, పలుకుబడి పెంచుకోవడానికి మీడియాను ఒక సాధనంగా వాడుకోవద్దని సూచించారు. మంగళవారం ఢిల్లీలో గులాబ్‌చంద్ కొఠారీ రచించిన ‘ద గీతా విజ్ఞాన ఉపనిషత్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. మన దేశంలో మీడియా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తింపు పొందలేకపోతున్నాయో ఆలోచించుకోవాలన్నారు. -
Maharashtra political crisis: రాజ్యాంగపరమైన ప్రశ్నలెన్నో!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన, రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు పార్టీల్లో చీలిక, విలీనం, ఫిరాయింపులు, అనర్హత తదితరాలకు సంబంధించి పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వీటన్నింటినీ విస్తృత ధర్మాసనం లోతుగా మదింపు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలేందుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి ఉద్ధవ్, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదనలు సాగాయి. సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఉద్ధవ్ వర్గం తరఫున, హరీశ్ సాల్వే తదితరులు షిండే వర్గం తరఫున వాదనలు వినిపించారు. ప్రజా తీర్పుకు విలువేముంది: సిబల్ మహారాష్ట్రలో జరిగినట్టు అధికార పార్టీని ఇష్టానుసారం చీలుస్తూ పోతే ప్రజా తీర్పుకు విలువేముందని సిబల్ ప్రశ్నించారు. ‘‘ఫిరాయింపులను నిరోధించే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు కూడా విలువ లేకుండా పోతుంది. వేరే పార్టీలో విలీనానికే తప్ప ఇలాంటి చీలికలకు ఫిరాయింపుల నుంచి రక్షణ వర్తించబోదు. అలా కాదని మెజారిటీ సూత్రాన్నే అంగీకరించాల్సి వస్తే దేశంలో ఎన్నికైన ప్రతి ప్రభుత్వాన్నీ సులువుగా కూలదోయవచ్చు. పార్టీల్లో చీలికలను నిషేధిస్తున్న రాజ్యాంగ రక్షణకు అర్థమే ఉండదు. ఇదో ప్రమాదకరమైన పోకడకు దారితీస్తుంది’’ అన్నారు. బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి ఓటేసినందుకు షిండే వర్గానికి చెందిన 40 మంది సేన ఎమ్మెల్యేలపై పదో షెడ్యూల్లోని రెండో పేరా ప్రకారం అనర్హత వేటు పడ్డట్టేనని వాదించారు. అంతేగాక వివాదం సుప్రీంకోర్టులో ఉండగా గవర్నర్ కొత్త ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయించడమూ సరికాదన్నారు. సీఎంను మారిస్తే కొంపలేమీ మునగవు: సాల్వే సిబల్ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కొంపలు మునగవన్నారు. నాయకున్ని మార్చాలని పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఒక్కటై ప్రధానిని కూడా వద్దు పొమ్మని చెప్పవచ్చు. కాబట్టి మహారాష్ట్ర ఉదంతానికి సంబంధించినంత వరకు ప్రజాస్వామ్య సంక్షోభం తదితరాల్లోకి పోకుండా స్పీకర్ ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్నదానికే వాదనలు పరిమితం కావాలి’’ అని సూచించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ రమణ స్పందిస్తూ మహారాష్ట్ర ఉదంతం పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. ‘‘10వ షెడ్యూల్లో మూడో పేరా తొలగింపు తర్వాత పార్టీలో చీలికకు గుర్తింపు లేకుండా పోయింది. దీని తాలూకు పరిణామాలెలా ఉంటాయో ఆలోచించాల్సి ఉంది. పార్టీ చీలికను గుర్తించే విధానం లేకపోవడం, పార్టీలో మైనారిటీలో పడ్డ నాయకునికి చట్టసభల్లోని తమ పార్టీ నేతను తొలగించే అధికారముందా వంటివన్నీ లోతుగా చర్చించాల్సన అంశాలు. ఇరుపక్షాల వాదనలూ విన్నాక, వీటిలో పలు అంశాలను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తాం. అందుకే ఏయే అంశాలపై విచారణ జరపాలో ఇరు వర్గాలూ ఆలోచించుకుని జూలై 27కల్లా మా ముందుంచాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకు ఉద్ధవ్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న షిండే వర్గం విజ్ఞప్తిపై అప్పటిదాకా ఏ చర్యలూ చేపట్టొద్దని స్పీకర్‌ను ఆదేశించారు. -
జైళ్లలోని 80% మంది విచారణ ఖైదీలే
జైపూర్: దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉండటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు వ్యక్తుల నిర్బంధానికి దారితీస్తున్న విధానాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో సుమారు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనన్నారు. శనివారం సీజేఐ జైపూర్‌లో ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ 18వ వార్షిక సదస్సులో పసంగించారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పాల్గొన్నారు. కారాగారాలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్న సీజేఐ.. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ఖైదీల్లో జైలు జీవితం ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. విచారణ ఖైదీలను ముందుగా విడుదల చేయడమనే లక్ష్యానికి పరిమితం కారాదని పేర్కొన్నారు. ‘‘నేర న్యాయ వ్యవస్థలో, ప్రక్రియే ఒక శిక్షగా మారింది. అడ్డుగోలు అరెస్టులు మొదలు బెయిల్ పొందడం వరకు ఎదురయ్యే అవరోధాలు, విచారణ ఖైదీలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే ప్రక్రియపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం’’అని ఆయన అన్నారు. దీంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, పోలీసులకు శిక్షణ, సున్నితత్వం పెంచడం వంటి వాటి ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మెరుగుపరచవచ్చని అన్నారు. రాజకీయ వైరుధ్యం శత్రుత్వంగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయి’’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లాయర్లకే ఎక్కువ గౌరవం: రిజిజు హైకోర్టులు, దిగువ కోర్టుల్లో కార్యకలాపాలు ప్రాంతీయ భాషల్లోనే జరిపేలా ప్రోత్సహించాలని కిరణ్ రిజిజు చెప్పారు. ఏ ప్రాంతీయ భాష కంటే ఇంగ్లిష్ ఎక్కువ కాదన్నారు. ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలిగినంత మాత్రాన లాయర్లు ఎక్కువ గౌరవం, ఎక్కువ ఫీజు పొందాలన్న విధానం సరికాదని చెప్పారు. కొందరు లాయర్లు ఒక్కో కేసుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇంత ఫీజును సామాన్యులు భరించలేరని చెప్పారు. సామాన్యుడిని కోర్టుల నుంచి దూరం చేసే కారణం ఎలాంటిదైనా ఆందోళన కలిగించే అంశమేనన్నారు. -
తెలుగుదనాన్ని మర్చిపోకండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు, మట్టి వాసనలు, వంటలు వాటి గుభాళింపులు, పలకరింపులు, చదువు నేర్పిన గురువులను, పరిసరాలను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న సీజేఐకి అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నార్త్ అమెరికా తెలుగు ప్రతినిధులు శుక్రవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. అమెరికా వంటి దేశాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలను మరవకుండా, ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడపటం అందరూ గర్వించాల్సిన విషయమని ఆయన కొనియాడారు. “అమెరికాలో 2010–17 మధ్య కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే తెలుగు భాష ప్రథమ స్థానంలో ఉంది’అని ఆయన తెలిపారు. తెలుగు భాషను ఎంతగా గౌరవిస్తామో, ఇతర భాషలను సైతం అదే విధంగా గౌరవించుకోవాలన్నారు. ఉద్యోగరీత్యా అవసరమైన విషయాలకు మాత్రమే భాష, సంస్కృతులను త్యాగం చేయాల్సి ఉంటుందే తప్ప, దైనందిన జీవితంలో, కుటుంబంలో రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను వాడటం మరవొద్దని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తెలుగులో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకొని న్యాయశాస్త్రంలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. దేశంలో న్యాయం ఆకాంక్షించే ప్రతీ ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన సంఖ్యలో కోర్టులు, జడ్జీలనూ నియమించాల్సిన అవసరం ఉందన్నారు. -
దేశద్రోహ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తారా?
న్యూఢిల్లీ: ‘‘బ్రిటిష్ వలస కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ (సెక్షన్ 124ఏ) చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?’’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది. వీటిపై కేంద్రం వైఖరేమిటో బుధవారంలోగా తమకు చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. దాన్నిబట్టి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ చట్టం తరచూ దుర్వినియోగానికి గురవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఇందుకు తక్షణం అడ్డుకట్ట పడాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అందుకోసం అవసరమైతే పునఃసమీక్ష పూర్తయేదాకా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేయాలని సూచించింది. చట్టాన్ని సమీక్షించేలోగా పెండింగ్‌లో ఉన్న, ఇకపై నమోదయ్యే కేసుల విచారణను నిలిపివేయాలంటూ వస్తున్న సూచనలపై స్పందించాలని కేంద్రానికి సూచించింది. కేంద్రంతో చర్చించి బుధవారం కోర్టుకు తెలియజేస్తానని తుషార్ మెహతా చెప్పారు. ‘‘దేశద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని కేంద్రమే ఆందోళన చెందుతుంటే ఇక పౌరుల హక్కులను ఎలా కాపాడతారు? ఈ చట్టం కింద ఇప్పటికే పలువురు జైళ్లలో ఉన్నారు. ఇంకా ఎందరి మీదనో ఈ చట్టం కింద అభియోగాలు మోపనున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పునఃసమీక్షకు ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించింది. ఇంతకాలమని ఇదమిత్థంగా చెప్పలేమని తుషార్ మెహతా బదులిచ్చారు. అలాంటప్పుడు సమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహ చట్టం అమలును పక్కన పెట్టాల్సిందిగా రాష్ట్రాలకు సూచించలేరా అని ధర్మాసనం ప్రశ్నించింది. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న దేశద్రోహం చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లెక్కకు మించి పిటిషన్లు దాఖలయ్యాయి. దీన్ని పునఃసమీక్షిస్తామని, అంతవరకు పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని కేంద్రం సోమవారం సుప్రీంను కోరింది. దేశద్రోహ చట్టం కింద 2015–20 మధ్య దేశవ్యాప్తంగా 356 కేసులు నమోదయ్యాయి. మైనార్టీలను గుర్తించే అధికారం ఎవరిది? మైనార్టీలను గుర్తించడంలో పలు రాష్ట్రాల్లో కేంద్రం అనుసరిస్తున్న భిన్న వైఖరులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందువులు సహా మైనార్టీలుగా ఉన్నవారిని గుర్తించడంపై రాష్ట్ర ప్రభుత్వాలతో మూడు నెలల్లోగా సంప్రదింపులు జరపాలని జస్టిస్ కౌల్, జస్టిస్ సుందరేశ్‌లతో కూడిన∙బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. అల్ప సంఖ్యాకులైన హిందువులు, ఇతర వర్గాలకు మైనార్టీ హోదాను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని కేంద్రం మార్చిలో పేర్కొంది. కానీ మైనార్టీ హోదా ఇవ్వడంపై కేంద్రానికే సర్వాధికారాలు న్నాయని సోమవారం కోర్టుకు నివేదించింది. -
దేశంలో వైద్య ‘అవ్యవస్థ’
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్ మ్యాప్ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్ కల్నల్ సీఎస్‌పంత్; డాక్టర్ వనితా కపూర్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు. వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు. -
న్యాయమూర్తులుగా 15 మంది
న్యూఢిల్లీ: ఏపీ, ఢిల్లీ, పాట్నా హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ 15 మంది జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదుల పేర్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అడ్వొకేట్ మహబూబ్ సుభానీ షేక్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ్జడ్జిగా నియమించాలని సూచించింది. ఢిల్లీ, పట్నా హైకోర్టులకు ఏడుగురు చొప్పున న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ నెల 4న కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. -
రాష్ట్రపతి, సీజేఐతో ఏపీ గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించారని సమాచారం. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షాలను గవర్నర్ విడివిడిగా కలిశారు. సీజేఐను కలిసిన గవర్నర్.. అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కూడా గవర్నర్ హరిచందన్ కలిశారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీ వచ్చిన గవర్నర్ 23వ తేదీన ప్రధాని మోదీని కలవగా, 24న నేషనల్ వార్ మెమోరియల్‌ను తన సతీమణితో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. గవర్నర్ దంపతులు మంగళవారం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారని సమాచారం. -
న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. కొత్త ట్రెండ్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వాలే దుష్ప్రచారం సాగిస్తుండడం దురదృష్టకరం, ఇదొక కొత్త ట్రెండ్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇష్టంలేని తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆక్షేపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి అమన్‌కుమార్ సింగ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ చత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు సవాలు చేస్తూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం, ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘మీ పోరాటం మీరు చేసుకోండి. కానీ కోర్టులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటివి చూస్తున్నా. జడ్జీలపై ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇదొక కొత్త ట్రెంట్‌గా మారింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.