న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే అధ్యక్షతన సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అయ్యింది. సుప్రీంకోర్టులో త్వరలో ఖాళీ అయ్యే న్యాయమూర్తుల స్థానంలో ఎంపిక చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పరిశీలించింది. ఇందులో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు ఇద్దరు హైకోర్టు జడ్జీల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ పేర్లను కేంద్రం పరిశీలన నిమిత్తం పంపాల్సి ఉంది.
అయితే, ఈ భేటీలో పేర్ల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్‌లో జరిగే తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 నవంబర్ 18వ తేదీన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వచ్చే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు తన స్థానంలోకి ఎవరినీ ప్రతిపాదించలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment