Collegium
-
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జైమాల్యా బాగ్చీ
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జైమాల్యా బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురు వారం కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. 2013 జూలై 18న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ విరమణ చేసిన చేసిన తర్వాత కలకత్తా హైకోర్టు నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొలీజియం సిఫా ర్సును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ జైమాల్యా బాగ్చీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితు లవుతారు. ఆయన పదవీకాలం ఆరేళ్లకుపైగా ఉన్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారులు (జిల్లా జడ్జిలు) కోటా నుంచి ఇద్దరు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్మానం చేసింది. జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత అవి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తరువాత వీరి నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ నోటిఫై చేస్తుంది.ముగ్గురిని సిఫారసు చేసిన హైకోర్టు కొలీజియంహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని హైకోర్టు కొలీజియం గత ఏడాది మేలో న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుతో పాటు ప్రస్తుతం శ్రీకాకుళం ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సుప్రీంకోర్టుకి సిఫారసు చేసింది. వీరిలో సుప్రీం కోర్టు ఇద్దరి పేర్లకు ఆమోద ముద్ర వేసింది. జునైద్ విషయంలో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ పేర్లకు సుప్రీం కోర్టు కొలీజియం ఇంతకు ముందే ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి అదనపు వివరాలు అవసరం కావడంతో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఇద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంటుంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పోస్టులకు హైకోర్టు కొలీజియం త్వరలోనే కొందరి పేర్లను సిఫారసు చేయనుంది.అవధానం హరిహరనాథ శర్మ..కర్నూలుకి చెందిన అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితులు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ, 1993లో నెల్లూరు వీఆర్ కాలేజీలో బీఎల్ పూర్తిచేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1994 నుంచి 98 వరకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు.డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు..ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. పద్మావతి, వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు. లక్ష్మణరావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యశించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. తొలుత ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడిషియల్)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయన్ని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా నియమించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 2038 వరకు సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. -
జిల్లా జడ్జిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి
సాక్షి,న్యూఢిల్లీ:నలుగురు జిల్లా జడ్జిలకు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. శ్రీమతి రేణుకా యార, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలాదేవి, మధుసూదనరావులను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీంతోపాటు ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీలో జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న అవధానం హరిహరణాధ శర్మ,డాక్టర్ యడవల్లి లక్షణరావులకు ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకాలు అమలులోకి వస్తాయి. ఇదీ చదవండి: కేంద్రమంత్రికి మెటా క్షమాపణలు -
కొలీజియం సభ్యునిగా జస్టిస్ అభయ్ ఓకా
న్యూఢిల్లీ: ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియంలో న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకాకు స్థానం దక్కింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ రిటైర్ కావడంతో ఏర్పడిన ఖాళీలో ఆయన నియమితులయ్యారు. నూతన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే ఐదుగురు సభ్యుల కొలీజియంలో ప్రస్తుతం సీజేఐ ఖన్నాతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషీకేశ్ రాయ్ ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులు. -
కొలీజియం సిఫార్సులను అమలు చేయాల్సిందే
న్యూఢిల్లీ: కొలీజియం అంటే సెర్చ్ కమిటీ కాదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. సుప్రీంకోర్టులో, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి అర్హుల పేర్లను సిఫార్సు చేసే కొలీజియంపై కీలక వ్యాఖ్యలు చేసింది. దానికి సెర్చ్ కమిటీ హోదా మాత్రమే ఉంటుందని వెల్లడించింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను కేంద్రంతప్పనిసరిగా ఆమోదించాల్సిందేనని స్పష్టంచేసింది. కొలీజియం సిఫార్సుల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న పేర్ల జాబితాను విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. వాటి ఆమోదానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని పేర్కొంది. కొలీజియం సిఫార్సులను నోటిఫై చేయడానికి కేంద్రానికి స్పష్టమైన గడువు నిర్దేశించాలంటూ హర్ష సింఘాల్ అనే లాయర్ పిల్ దాఖలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావును నియమించాలన్న కొలీజియం సిఫార్సును కేంద్రం పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. వీటిపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫా ర్సుల ఆమోదంపై కేంద్రానికి కాలావధి నిర్దేశించాలని పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆలోగా స్పందించకపోతే వాటిని ఆమోదించినట్లుగానే భావించేలా నిబంధన తీసుకురావాలని చెప్పారు. «కొలీజియం రెండోసారి సిఫార్సుల్లో పెండింగ్‌లో ఉన్నవాటి వివరాలివ్వాలని అటార్నీ జనరల్‌ను దర్మాసనం ఆదేశించింది. -
హాయ్, నేను సీజేఐని... క్యాబ్‌కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్‌లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్‌గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది. -
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. సీజేఐ జస్టిస్ డీ వై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఉన్నారు. ప్రతిభ, సామర్థ్యం, నిజాయితీ, విశ్వసనీయత, నేపథ్యం తదితరాలను జాగ్రత్తగా మదింపు చేసిన అనంతరం సుప్రీం న్యాయమూర్తులుగా వారి పేర్లను సిఫార్సు చేసినట్లు కొలీజియం తెలిపింది. వారి నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది. న్యాయమూర్తులపై పెరుగుతున్న విపరీతమైన పని భారం దృష్ట్యా సుప్రీంకోర్టులో ఎప్పుడూ ఒక్క ఖాళీ కూడా ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందని కొలీజియం అభిప్రాయపడింది. -
ఏపీ హైకోర్టు జడ్జిలుగా మరో నలుగురు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియ నియమించింది. సీనియర్ న్యాయవాదులు హరినాథ్, కిరణ్మయి, సుమిత్, విజయ్‌లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం గత ఫిబ్రవరిలో న్యాయాధికారుల కోటా నుంచి ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు నియమించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి నియామకంతో న్యాయాధికారుల కోటా పూర్తి కాగా, న్యాయవాదుల కోటాలో నలుగురు కొత్త జడ్జిలను ఏపీ హైకోర్టుకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
వచ్చేసారి ఊరుకోం!.. కేంద్రంపై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్ నుంచి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులు 70 వరకు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిని ఇన్నాళ్లు ఎందుకు పెండింగ్‌లో ఉంచారని కేంద్రాన్ని ప్రశ్నించింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ సమస్య పరిష్కారానికి అటార్నీ జనరల్ కార్యాలయం చొరవ తీసుకోవాలని పేర్కొంది. దీనికి అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఏడు రోజులు సమయం అడిగారు. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ స్పందిస్తూ ’’ నేను ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ నన్ను నేను నియంత్రించుకుంటున్నాను. సమస్య పరిష్కారానికి అటార్నీ జనరల్ ఏడు రోజులు మాత్రమే సమయం అడిగారు. నేను ఇప్పటికి మౌనంగా ఉంటున్నారు. వచ్చేసారి ఇక ఊరుకోను. చదవండి: అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకి జనవరి 22 ముహూర్తం..? అటార్నీ జనరల్ కార్యాలయమే కేంద్రం దగ్గరున్న పెండింగ్ సిఫార్సుల సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే న్యాయమూర్తుల కొరత అన్నది అతి పెద్ద సమస్య’’ అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కుండబద్దలు కొట్టారు. జడ్జీల నియామకం జాప్యం అవుతున్న కొద్దీ చాలా మంది లాయర్లు తమ దరఖాస్తుల్ని వెనక్కి తీసుకుంటున్నారని, అత్యంత ప్రతిభ కలిగిన లాయర్లు న్యాయమూర్తుల పదవుల్లోకి రాకుండా ఉండడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ‘‘కిందటి వారం వరకు 80 సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత 10 మంది నియామకం జరిగింది. ఇప్పుడు పెండింగ్‌లో 70 ఉన్నాయి. వాటిలో 26 న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించినవి. ఒక సమస్మాత్మక హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి నియామకం కూడా ఇంకా పెండింగ్‌లో ఉంది’’ అని జస్టిస్ కౌల్ వివరించారు. న్యాయమూర్తుల నియామకం అంశంలో కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదన్నారు. -
పరువు నష్టం కేసులో రాహుల్ శిక్షపై స్టేకు నిరాకరణ.. జడ్జి బదిలీ
న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జైలు శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు జడ్జిపై బదిలీపై వెళ్లనున్నారు. పై పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లనున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జాబితాలో ఆయన కూడా ఉన్నారు. మెరుగైన న్యాయ నిర్వహణ కోసం జస్టిస్ ప్రచక్ను పాట్నా హైకోర్టుకు పంపుతున్నట్లు కొలీజియం తెలిపింది. గుజరాత్ హైకోర్టు జడ్జి అయిన హేమంత్ ఎమ్ ప్రచక్.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జూలైలో 123 పేజీల తీర్పు వెల్లడించారు.అంతేగాక 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ బీజేపీ మంత్రి మాయా కొద్నానీ తరుపున వాదించిన న్యాయవాదులలో జస్టిస్ ప్రచ్చక్ ఒకరిగా గతంలో ఉన్నారు. జస్టిస్ ప్రచక్తోపాటు 2002 గోద్రా అల్లర్లకు సంబంధించి హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న గుజరాత్ హైకోర్టు జడ్జి మరో జస్టిస్ సమీర్ దవే.. రాహుల్ గాంధీ జైలు శిక్షను రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపి కూడా ఉన్నారు.వీరితోపాటు పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు నుంచి ఒకరు కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తొమ్మిది పేర్ల జాబితాలో ఉన్నారు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం ఈనెల 3న సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మెరుగైన న్యాయం అందించేందుకే బదిలీలు సిఫార్సు చేస్తున్నట్లు కొలీజియం గురువారం పేర్కొంది. చదవండి: మణిపూర్ అంశం.. మోదీపై అమెరికా సింగర్ మిల్ బెన్ కీలక వ్యాఖ్యలు కాగా గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ ప్రచక్.. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఇక 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరోవైపు అత్యాచారానికి గురైన మైనర్ బాలిక గర్బం దాల్చగా.. అబార్షన్‌కు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సమీర్ దవే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మనుస్మృతి ప్రకారం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, 17 ఏళ్లు రాకముందే పిల్లల్ని కనడం ఒకప్పుడు సహజమేనని వ్యాఖ్యానించారు. ‘కావాలంటే మీ అమ్మ.. అమ్మమ్మను అడగండి.. అప్పట్లో వివాహానికి గరిష్ఠ వయసు 14, 15 ఏళ్లే.. 17 ఏళ్లు రాక మునుపే తన తొలి బిడ్డకు జన్మనిచ్చేవారు.. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పెద్దవారు అవుతారు.. మీరు మనుస్మృతి చదవలేదేమో.. ఓసారి చదవండి’ జస్టిస్ దవే అన్నారు. -
దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
ఢిల్లీ : దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో న్యాయమూర్తులను బదిలీ చేయడం బహుశా ఇదే అత్యధికం. ఏపీ, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, అలహాబాద్, పట్నాతో సహా పలు హెకోర్టుల్లో పని చేస్తున్న జడ్జీలను బదిలీలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. న్యాయమూర్తుల బదిలీ అంశం కొన్ని రోజులుగా కొలీజియం ప్రతిపాదిత ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉంది. బదిలీకి సంబంధించిన లేఖలు కూడా ఆయా న్యాయమూర్తులకు ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. బదిలీ అంశాన్ని ఏ న్యాయమూర్తైనా పునపరిశీలించాలని కోరితే.. తుది నిర్ణయం కొలీజియందే ఉంటుంది. సీజేఐ ప్రతిపాదించిన బదిలీ పత్రాలను సంబంధిత కేంద్ర మంత్రి ప్రధానమంత్రికి సమర్పిస్తారు. ప్రధాని ఆయా ప్రతిపాదనలను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇదీ చదవండి: Anti Sikh Riots Case: కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు -
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణహైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో న్యాయాధికారి సుజన కళాసికం, న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి పేర్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వీరి పేర్లకు రాష్ట్ర గవర్నర్, సీఎం గతంలోనే ఆమోదం తెలిపారు. చదవండి: Hyderabad: గూబ గుయ్‌మంటోంది.. నిద్రపోని మహానగరం అలిశెట్టి లక్ష్మీనారాయణ: నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో హెడ్మాస్టర్ గంగాధర్, రాజుబాయ్ దంపతులకు 1968 మే 13న లక్ష్మీనారాయణ జన్మించారు. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించుకున్నారు. రాజ్యాంగ, ‘సివిల్ లా’లో నైపుణ్యం సాధించారు. ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్బీసీసీ, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తోపాటు పలు ఎల్బీసీ, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. కె.సుజన: నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన మధు సూదన్, ప్రమీల దంపతులకు కె.సుజన 1970 మార్చి 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2010లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాసి ఎంపికయ్యారు. కరీంనగర్ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగాను, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. గతేడాది నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా సుజన విధులు నిర్వర్తిస్తున్నారు. -
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషీ!
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషీని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుంచి తనను బదిలీ చేయాలంటూ జస్టిస్ కోషీ చేసిన విజ్ఞప్తిని కొలీజియం పరిగణనలోకి తీసుకుంది. వాస్తవానికి మధ్యప్రదేశ్ హైకోర్టుకు పంపించాలని తొలుత భావించినప్పటికీ ఆయన అంగీకరించలేదు. మధ్యప్రదేశ్ మినహా మరో హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్ కోషీ విన్నవించడంతో తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. -
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మే 19, 2023న జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఏపీ హైకోర్టు సీజే పదవి భర్తీచేయాల్సి వచ్చిందని కొలీజియం పేర్కొంది. అన్ని అంశాలు పరిగణించి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఠాకూర్‌ను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో.. జస్టిస్ ఠాకూర్‌ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న ఫిబ్రవరి 9, 2023 నాటి సిఫార్సును రద్దుచేస్తూ తాజా సిఫార్సు చేస్తున్నట్లు కొలీజియం పేర్కొంది. ఠాకూర్ స్వస్థలం జమ్మూకశ్మీర్.. ఇక జస్టిస్ ఠాకూర్ ప్రస్తుతం బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆయన ఏప్రిల్ 25, 1964న జన్మించారు. జమ్మూ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ పొందిన ఆయన.. 1989 అక్టోబరు 18న ఢిల్లీ బార్ కౌన్సిల్లో చేరి న్యాయవాద వృత్తి చేపట్టారు. 2011లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అనంతరం.. మార్చి 8, 2013న జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆ తర్వాత జూన్ 10, 2022న బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక సుప్రీంకోర్టు తాజా సిఫార్సుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. చదవండి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్టి తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరధే ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధేను నియమించాలంటూ కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు కొల్లీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ నియామకం చేపట్టాల్సి వచ్చినట్లు కొలిజియం పేర్కొంది. ఇక జస్టిస్ అలోక్ అరధే ఏప్రిల్ 13, 1964న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేసిన ఆయన 1988లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. డిసెంబరు 29, 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 15, 2011న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సెప్టెంబరు 20, 2016న జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 11, 2018న జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం.. జస్టిస్ అరధే నవంబరు 17, 2018న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జులై 3, 2022 నుంచి అక్టోబరు 14 వరకూ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సివిల్ కాన్స్టిట్యూషనల్ అంశాల్లో నిష్ణాతుడిగా ఆయన పేరుపొందారు. -
కొలీజియం ప్రమోషన్ లిస్టులో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం ప్రమోషన్ లిస్టులో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రాతో పాటు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. కొలిజియం తీర్మానం ఈ విధంగా ఉంది. "After carefully evaluating the merit, integrity and competence of eligible Chief Justices and senior puisne Judges of the High Courts and also accommodating a plurality of considerations, the Collegium finds Justice Prashant Kumar Mishra, Chief Justice, Andhra Pradesh High Court to be more deserving and suitable in all respects for being appointed as a Judge of the Supreme Court of India, Justice Prashant Kumar Mishra has served as a judge of the High Court for over thirteen years and ranks at serial number 21 in the All-India Seniority List of judges of the High Courts," it said. Supreme Court Collegium recommends Andhra Pradesh High Court Chief Justice Prashant Kumar Mishra and Senior Advocate KV Viswanathan to be elevated as judges of the apex court. — ANI (@ANI) May 16, 2023 వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను న్యాయ శాఖ ఆమోదిస్తూ ఉంటుంది. [BREAKING] Collegium recommends elevation of Andhra Pradesh High Court Chief Justice Prashant Kumar Mishra to Supreme Court#SupremeCourtOfIndia #SupremeCourt https://t.co/ITP3WENyZ7 — Bar & Bench (@barandbench) May 16, 2023 సుప్రీంకోర్టులో మొత్తం ఉండాల్సిన జడ్జీలు 34. ప్రస్తుతం రెండు ఖాళీలుండగా, 32 మంది జడ్జిలున్నారు. రెండు రోజుల కిందటే జస్టిస్ దినేష్ మహేశ్వరీ, జస్టిస్ MR షా పదవీ విరమణ చేశారు. ఇక అతి త్వరలో మరో నలుగురు జడ్జిలు కూడా రిటైర్ కానున్నారు. జస్టిస్ KM జోసెఫ్ జూన్ 16, 2023 జస్టిస్ అజయ్ రస్తోగి జూన్ 17, 2023 జస్టిస్ V రామసుబ్రమణియన్ జూన్ 29, 2023 జస్టిస్ కృష్ణ మురారి జులై 8, 2023 ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే మొత్తం ఆరు ఖాళీలు ఏర్పడతాయి. -
‘పరిపూర్ణత్వానికి దగ్గరగా కొలీజియం’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం పరిపూర్ణత్వానికి(పర్ఫెక్ట్ మోడల్) దగ్గరగా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో నియామకాలు, సంస్కరణలపై సీజేఏఆర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో జడ్జీల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించడం వెనుక కఠినమైన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కొలీజియంను కాపాడుకొనేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొలీజియంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాల మధ్య వివాదం రగులుతున్న నేపథ్యంలో జస్టిస్ యు.యు.లలిత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
...తిప్పి పంపుతున్నార్సార్..!
...తిప్పి పంపుతున్నార్సార్..! -
ఇక్కడ ఎవరూ ఎవరినీ... బెదిరించలేరు
ప్రయాగ్‌రాజ్: కొలీజియం విషయంపై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు మరోసారి స్పందించారు. ప్రయాగ్‌రాజ్‌లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ 150వ వార్షికోత్సవంలో పాల్గొని రిజిజు ప్రసంగించారు. హైకోర్టు జడ్జీల బదిలీలు, నియామకాల్లో ఏదైనా ఆలస్యమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై శనివారం మంత్రి రిజిజు మాట్లాడారు. ‘ భారత్‌లో ప్రజలే అసలైన యజమానులు. మనమంతా సేవకులం. రాజ్యాంగం చూపిన మార్గనిర్దేశకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకే మనం ఇక్కడ ఉన్నాం. ప్రజాభీష్టం మేరకు రాజ్యాంగానికి లోబడే దేశపాలన కొనసాగనుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ బెదిరించలేరు. కొన్ని సార్లు కొన్ని అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. బాధ్యతాయుత పదవుల్లో ఆసీనులైన వారు ఏదైనా చెప్పేముందు ఆలోచించాలి’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలనుద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దేశంలోని వేర్వేరు కోర్టుల్లో 4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘చిన్న చిన్న కేసులు కోర్టుల బయటే పరిష్కారం పొందుతాయి. దీంతో కోర్టులకు కేసుల భారం చాలా తగ్గుతుంది’ అని మంత్రి అన్నారు. -
‘పెద్దలు’ కుమ్మక్కైతే న్యాయం గతేమిటి?
మన రాజ్యాంగం ఎవరో ఒకరు రచించిన పుస్తకం కాదు. అది అంబేడ్కర్ వంటి మహానుభావులు నిర్మించిన ఒక సంవిధానం. రాజ్యాంగ నియమాలతో పాటు కొన్ని సంప్రదాయాలూ అనేక ఏళ్ల నుంచీ కొనసాగుతున్నాయి. అందులో సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకాలనూ, బదిలీలనూ చేపడతారు. అయితే ఈ కొలీజియం వ్యవస్థ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారానో లేదా రాజ్యాంగ నిబంధనలను అనుసరించో ఏర్పడింది కాదు. అది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పరిణామం చెందిన వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకత్వం వహిస్తారు. నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు కొలీజియానికి ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సు చేసినవారిని ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఇటీవల కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలనే ప్రతిపాదన చేస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వివాదాస్పదమయింది. సుప్రీం కోర్టు ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పుల వల్ల... నియమాల కన్నా ఎక్కువగా సంప్రదాయాల ఆధారంగానే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కొలీజియం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ప్రభుత్వ ప్రతి నిధి ఉండాలనే ప్రతిపాదన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే దెబ్బ తీసేవిధంగా ఉందని పలువురు న్యాయనిపుణులు అంటు న్నారు. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధికి స్థానం గురించి మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ... ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుల అభిప్రాయాలను ప్రస్తావించారు. ఆ సందర్భంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే సమాఖ్య, కార్యనిర్వాహకవర్గం, స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ ముఖ్య విభాగాలు అని రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన సంగతిని పేర్కొన్నారు. కొలీజియంలో పార్లమెంట్, ప్రభుత్వ పెద్దలకు స్థానం కల్పించడానికి చేసిన 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్నీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్నీ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ‘పెద్దలు’ (ముగ్గురు) పరోక్షంగా సుప్రీం ఇచ్చిన ఈ తీర్పును ఒప్పుకోవడం లేదనీ, ఆ నిర్ణయాన్ని మరో దారిలో అమలుచేయాలని చూస్తున్నారనీ ట్విట్టర్ వేదికగా ఆయన అన్నారు. ‘1967–77 సంవత్సరాల మధ్య దేశ చరిత్రను ధన్ఖర్, బిర్లా, రిజిజులు చదివే ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు భిన్న విషయాలను ధన్ఖర్ కలగలిపి వేశారు. రాజ్యాంగంలోని ప్రతీ లేదా ఏదైనా ఒక నిబంధనను పార్లమెంటు సవరించ గలదా; ఆ సవరణ న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాదా అన్నది ఒక అంశం. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనా అన్నది రెండో అంశం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీసుకున్న నిర్ణయం సరైనదనీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం కేసులో తప్పుడు నిర్ణయం తీసుకున్నదనీ అభిప్రాయపడేందుకు ఆస్కారమున్నది. నిజానికి న్యాయశాస్త్ర పండితులు అనేక మంది ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు’ అని చిదంబరం అన్నారు. అంతేకాదు ‘‘న్యాయవ్యవస్థ నిర్ణయాల కంటే పార్లమెంటు నిర్ణయాలే సర్వోన్నతమైనవనే వాదనను అంగీకరించామను కోండి. జరిగేదేమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జమ్మూ –కశ్మీర్లో వలే ఒక రాష్ట్రాన్ని విభజించి పలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని మీరు ఆమోదిస్తారా? వాక్ స్వాతంత్య్రాన్నీ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛనూ, ఏ వృత్తినైనా ఆచరించే, ఏ వ్యాపారాన్ని అయినా చేసే స్వేచ్ఛను రద్దుచేయడాన్ని మీరు ఒప్పుకుంటారా? స్త్రీ పురు షులను సమానంగా పరిగణించని, హిందువులు, ముస్లింల పట్ల రాజ్య వ్యవస్థ భిన్న రీతుల్లో వ్యవహరించడాన్ని అనుమతించి... స్వలింగ సంపర్కులకు హక్కులు నిరాకరించే చట్టాలను మీరు ఆమోదిస్తారా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మైనారిటీ వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను రద్దు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా? ఏడవ షెడ్యూలు నుంచి రాష్ట్ర జాబితాను తొలగించి, శాసన నిర్మాణాధికారాలు అన్నిటినీ పార్లమెంటుకు అప్పగించడాన్ని మీరు సమ్మతిస్తారా? ఒక నిర్దిష్ట భాషను యావద్భారతీయులు తప్పనిసరిగా నేర్చుకు తీరాలనే ఆదేశాన్ని మీరు పాటిస్తారా? నేరారోపణకు గురైన ప్రతీ వ్యక్తి అమాయ కుడుగా నిరూపణ కానంతవరకు అతడిని అపరాధిగా భావించాలని నిర్దేశిస్తున్న చట్టాన్ని మీరు అంగీకరిస్తారా? పార్లమెంటు నేడు అటువంటి చట్టాలు చేయదు, చేయలేదు. చేసినా వాటిని సమీక్షించి తిరస్కరించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఇందుకు భిన్నంగా ‘పార్లమెంటరీ పూర్ణాధిపత్యం, న్యాయవ్యవస్థ సంయమనం’ సిద్ధాంతం కింద అటువంటి చట్టాలపై న్యాయ సమీక్ష జరగదు’’ అని చిదంబంరం పేర్కొన్నారు. రాజ్యాంగ సంవిధాన మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలులేదని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినా, దశాబ్దాలుగా స్థాపితమైన సంప్రదాయాలు మార్చడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా... ప్రధానమంత్రీ, ఇతర ముఖ్యమైన మంత్రులూ, నాయకులూ తమ బాధ్యతను మరచి రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని దెబ్బతీయడానికి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొలీజియంలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు కాకుండా చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి, న్యాయమంత్రి కలిసి న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పాల్గొనే విషయాన్ని ఈ ‘ముగ్గురు’ పెద్దలు నిర్ణయిస్తారట. ఇదే జరిగితే న్యాయం బతుకు తుందా? - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)కు చెందిన రహస్య పత్రాల్లో కొన్ని భాగాలను బహిర్గతం చేయాలని కొలీజియం తీర్మానించడం తీవ్ర ఆందోళనకర అంశమని అన్నారు. నిఘా విభాగాల సిబ్బంది దేశ హితం కోసం రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తుంటారని, వారి రిపోర్టులను బయటపెడితే భవిష్యత్తులో కార్యాచరణపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని చెప్పారు. తద్వారా కొన్ని చిక్కులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఐబీ, ‘రా’ ఇచ్చిన నివేదికల్లోని కొన్ని భాగాలను ప్రజా సమూహంలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే తీర్మానించింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తొలిసారిగా మంగళవారం మాట్లాడారు. కొలీజియం వ్యవహారంపై సరైన సమయంలో పూర్తిస్థాయిలో స్పందిస్తానని, ఇది తగిన సమయం కాదని అన్నారు. -
మారువేషంలో కొలీజియంలోకా?
అసలంటూ ప్రస్తుతం ఉనికిలోనే లేని ‘శోధన, మూల్యాంకన కమిటీ’లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారువేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయ మూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాల కోసం ‘శోధన, మూల్యాంకన కమిటీ’ (సెర్చ్ కమ్ ఎవాల్యుయేషన్ కమిటీ)ని నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చర్చించేముందుగా మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ అనేది ఉనికిలో లేదని గమనించాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినంతవరకూ ప్రధాన న్యాయమూర్తి, నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజయం సిఫార్సు చేస్తుంది. శోధన, మూల్యాంకన కమిటీ అవసరం ఇప్పుడు ఉందా? సమాధానం నిశ్చయాత్మకంగా అవును అన్నట్లయితే, అలాంటి కమిటీ పొందిక ఎలా ఉండాలి అనేది మరో ప్రశ్న. హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే తాను పనిచేసే హైకోర్టులో ఆయన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించరు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియ మించే సందర్భంలోనే సుప్రీంకోర్టులో రాష్ట్రాల భౌగోళిక ప్రాతి నిధ్యాన్ని లెక్కిస్తారు. కాబట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రాతి పదిక ఇప్పటికే స్పష్టంగా ఉంది. కాబట్టి, కొత్తగా శోధన, మూల్యాంకన కమిటీ అవసరం లేదని తెలుస్తున్నది. దీనికి బదులుగా సీనియారిటీ నిబంధనను పక్కన పెట్టి చేసే నియామకాలకు ప్రాతిపదిక అవసరం. పరిధి ప్రాతిపదికను పరిగణించే అవకాశం పైన చెప్పినట్టుగా పరిమితం. కాబట్టి కేంద్ర మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ ఈ సంప్రదాయానికి చేసే జోడింపు పెద్దగా లేదనే చెప్పాలి. ఇక జడ్జీల పనితీరు మూల్యాంకనం కూడా సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల విధి. సుప్రీంకోర్టుకు నియమించాల్సిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల బాగోగులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చక్కగా మూల్యాంకన చేయగలరు. దీన్ని పక్కనబెడితే, న్యాయ నిర్ణయాలు చాలా తరచుగా సుప్రసిద్ధ న్యాయ పత్రికల్లో తీవ్రమైన విద్యాత్మక విమర్శలకు గురవుతుంటాయి. న్యాయమూర్తుల మూల్యాంకనకు ఇది సుపరిచితమైన పద్ధతి. ఇలాంటి పరిస్థితుల్లో శోధన, మూల్యాంకన కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారు వేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. స్పష్టంగా చెప్పాలంటే, భారత రాజ్యాంగం నిర్దేశించిన అధికా రాల విభజన సూత్రాన్ని న్యాయమంత్రి తాజా సూచన ధ్వంసం చేస్తుంది. ఈ అధికారాల విభజన రాజ్యాంగ ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల్లో న్యాయవ్యవస్థ మాత్రమే, ప్రభు త్వాన్ని ఎన్నుకున్న మెజారిటీ ప్రజాభిప్రాయానికి ప్రతితులనాత్మకంగా ప్రభుత్వ పనితీరు పట్ల నిరోధ సమతౌల్యాన్ని అందించగలదు. ప్రభుత్వ పనితీరుకు నిరోధ సమతౌల్యంగా ఉండాల్సిన న్యాయ మూర్తుల నియామక కమిటీలో అదే ప్రభుత్వం భాగమైతే, ప్రభుత్వ ఇతర విభాగాలను తనిఖీ చేసే కోర్టు విధిని అది ధ్వంసం చేస్తుంది. ఇది ‘కోళ్ళగూటిలోకి నక్కను స్వయంగా ఆహ్వానించడమే’ అవుతుంది. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం అనేది న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయమూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయ మంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. సుప్రీంకోర్టు ద్వారా ప్రకటితమైన చట్టాన్ని మార్చడానికి రెండు సుపరిచిత మార్గాలు ఉన్నాయి. మొదటిది, సముచితమైన శాసనం ద్వారా న్యాయస్థానం అన్వయించిన తీర్పు ప్రాతిపదికనే మార్చి వేయడం. రెండో మార్గం ఏమిటంటే, విస్తృత ధర్మాసనం ద్వారా ఆ తీర్పును తోసిపుచ్చడానికి ప్రయత్నించడం. ప్రభుత్వం ఈ రెండింటిలో ఏ ఒక్కదానికీ పూనుకోలేదు. బదులుగా, భారత ఉపరాష్ట్రపతి, న్యాయమంత్రి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయ త్నంలో, మొత్తంగా న్యాయవ్యవస్థ చట్టబద్ధతనే రద్దుపరిచే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతూండటం గమనార్హం. న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చాలని ప్రభుత్వం తీవ్రంగా భావిస్తూ ఉన్నట్లయితే, న్యాయమూర్తుల నియామక చట్టాన్ని తోసిపుచ్చిన తర్వాత ఒక కొత్త చట్టాన్ని తీసుకురాకుండా దాన్ని ఏదీ అడ్డుకోలేదు. అయితే ఈ మార్గాన్ని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చేపట్టడం లేదు. అసలు అలాంటి చట్టాన్ని రూపొందించే అవసరాన్నే ప్రభుత్వం పరిగణించలేదు. ఎందుకంటే, ప్రభు త్వంతో సంప్రదింపుల తర్వాతే నియామకాలను చేపడుతున్న పక్షంలో అలాంటి న్యాయమూర్తులతో ప్రభుత్వం ఎంతో సౌకర్యవంతంగా ఉంటూ వస్తోంది. రాష్ట్రపతి ఆదేశంతో నిమిత్తం లేకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గానీ, న్యాయమూర్తులను గానీ కొలీజియం సిఫార్సు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలాగే కొలీజియం చేసిన ఏ సిఫారసు అయినా ప్రభుత్వానికి అసౌకర్యంగా మారి వ్యతిరేకించిన పక్షంలో అలాంటి సూచనలను న్యాయవ్యవస్థ వెనక్కు తీసుకోవడం కూడా జరిగేది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఎన్నికైన జస్టిస్ ఎన్వీ రమణ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎంపికైన చివరి న్యాయమూర్తి కావడం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ప్రధాన న్యాయమూర్తులు ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే నియ మితులవుతూ వచ్చారు. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ఎంపిక ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని ఇక్కడ సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. ముఖ్యంగా, హైకోర్టుల నియామకాల కోసం ప్రాతిపదిక గురించి న్యాయ మంత్రి తాజా లేఖ పేర్కొనడం లేదు. సమస్య ఇక్కడే ఉందని నేను నమ్ముతున్నాను. న్యాయమూర్తులను నియమించే దశలోనే శోధన, మూల్యాంకనకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే న్యాయమూర్తులతో కూడిన కమిటీనే దాన్ని చేపట్టాలి. న్యాయమూర్తుల నియామకాలకు నిర్దిష్ట ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికను ముందుగానే ప్రకటించి ప్రచురించాలి. అందుబాటులో ఉన్న ఉత్తమ అభ్యర్థిని న్యాయమూర్తిగా ఎంపిక చేయడానికి సరైన మార్గం ఏదంటే, ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉంటున్న న్యాయమూర్తుల నియామక వ్యవస్థను అధిగమించడం. దానికిగానూ సంబంధిత అభ్యర్థులు తమ ఆసక్తిని వ్యక్తపర్చడానికీ, స్వయంగా నామినేషన్ దాఖలు చేయడానికీ అనుమతించాలి. అప్పుడు మాత్రమే జడ్జీల నియమాకానికి చెందిన పరిగణన పరిధి విస్తృతం అవుతుంది. ప్రజలకు బహిరంగంగా తెలుస్తుంది కూడా. స్వీయ నామినేషన్ వ్యవస్థ మాత్రమే వర్గం, కులం, జాతి, లైంగిక ధోరణికి సంబంధించిన వైవిధ్యతకు హామీ ఇస్తుంది. ధర్మాసనంలో మనం చూడవలసిన బహుళత్వం, వైవిధ్యం గురించి అర్థం చేసు కోవడానికి అది వీలు కలిగిస్తుంది. ఇందిరా జైసింగ్ వ్యాసకర్త సీనియర్ న్యాయవాది, భారత మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
మా సిఫార్సులను... పదేపదే తిప్పి పంపొద్దు..
న్యూఢిల్లీ: న్యాయమూర్తులుగా తాము చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పదేపదే తిప్పి పంపజాలదని సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి స్పష్టం చేసింది. పలు హైకోర్టులకు న్యాయమూర్తులుగా ఇప్పటికే పలుమార్లు చేసిన ఐదు గత సిఫార్సులను తాజాగా మరోసారి కేంద్రానికి పంపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌తో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం మంగళ, బుధవారాల్లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీరిలో తాను స్వలింగ సంపర్కినని ప్రకటించుకున్న సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కృపాల్ కూడా ఉన్నారు. ఆయనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న 2021 నవంబర్ 11 నాటి సిఫార్సును కొలీజియం తాజాగా పునరుద్ఘాటించింది. న్యాయవాదులు ఆర్.జాన్ సత్యంను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా, సోమశేఖర్ సుందరేశన్‌ను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి సిఫార్సు చేసింది. వీరితో పాటు అమితేశ్ బెనర్జీ, సఖ్య సేన్‌ను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులుగా వెంటనే నియమించాలని కూడా పేర్కొంది. అలాగే కర్నాటక, అలహాబాద్, మద్రాస్ హైకోర్టులకు న్యాయమూర్తులుగా మరో 20 పేర్లను సిఫార్సు చేసింది. వీరిలో 17 మంది న్యాయవాదులు, ముగ్గు్గరు జడ్జిలున్నారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఉద్దేశించి కొలీజియం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ సిఫార్సులను కేంద్రం పదేపదే తిప్పి పంపడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. అమితేశ్, సేన్ పేర్లను కేంద్రం ఇప్పటికే రెండేసిసార్లు తిప్పి పంపింది. అమితేశ్ తండ్రి జస్టిస్ యు.సి.బెనర్జీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. గోధ్రాలో సబర్మతి రైలు ప్రమాదం వెనక కుట్ర కోణమేదీ లేదని తేల్చిన కమిషన్‌కు సారథి. ఇక సత్యం ప్రధాని మోదీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ విధానాలు, పథకాలపై సుందరేశన్ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని వారి పేర్లను కేంద్రం తిప్పి పంపింది. ఈ అభ్యంతరాలను కొలీజియం తాజాగా తోసిపుచ్చింది. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించడం రాజ్యాంగపరమైన పదవులు చేపట్టేందుకు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. -
సుప్రీం,కేంద్రం మధ్య కొలీజియం కాకా
-
కేంద్రం తీరు ఆందోళనకరం
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు జరిగాయి. కొలీజియం సిఫార్సుల ఆమోదంలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్‌ను కేంద్రం పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, ఆర్.ఎల్.ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను కూడా కేంద్రం తిప్పి పంపుతోందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించగా ఇది ఆందోళనకరమని పేర్కొంది. ‘‘ఇటీవల ఇలా పలు సిఫార్సులను రెండోసారీ తిప్పి పంపారు. పెండింగ్‌లో ఉన్న 22 పేర్లను కూడా వెనక్కు పంపారు. ఇంకా చాలా పేర్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సిఫార్సులపై కేంద్రానికి సొంత అభిప్రాయాలేవైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఎటూ తేల్చకుండా అట్టిపెట్టుకోజాలదు. తప్పుగానో, ఒప్పుగానో ఈ అంశాన్ని తేల్చాల్సిందే. కేంద్రం కావాలంటే కొలీజియం సిఫార్సులపై తన అభిప్రాయాలను మాకు పంపొచ్చు. వాటిని మేం పరిశీలిస్తాం. ఆ మీదట వాటిని పక్కన పెట్టడమో, తిరిగి సిఫార్సు చేయడమో చేస్తాం. కానీ ఒక పేరును కొలీజియం రెండోసారి కేంద్రానికి సిఫార్సు చేసిందంటే ప్రస్తుత నిబంధనల మేరకు సదరు నియామకాన్ని ఆపడానికి వీల్లేదు’’ అని గుర్తు చేసింది. కొలీజియం సిఫార్సులను సుదీర్ఘ కాలం పెండింగులో పెడుతుండటం వల్ల ప్రతిభావంతులైన పలువురు తమకు జడ్జి పదవే వద్దంటూ తప్పుకుంటున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను మూడు నాలుగు వారాల్లోపు కేంద్రం ఆమోదించాలని సుప్రీంకోర్టు 2021 ఏప్రిల్ 20న పొందుపరిచిన టైం లైన్లో స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను కూడా కేంద్రం దీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెట్టడం చాలా తప్పుడు సంకేతాలు పంపుతోందంటూ ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘కొంతకాలం క్రితం 10 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ బదిలీల విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితం. అయినా మా సిఫార్సుల్లో రెండింటిని గత సెప్టెంబర్‌లో, మిగతా వాటిని నవంబర్ చివర్లో ఆమోదించింది! ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపుతోంది. న్యాయ వ్యవస్థ, కేంద్రం కాకుండా ఎవరో మూడో శక్తి జోక్యం చేసుకుంటోందన్న అభిప్రాయం కలిగిస్తోంది’’ అని జస్టిస్ కౌల్ అన్నారు. ‘‘ప్రతి వ్యవస్థలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒక న్యాయమూర్తి బదిలీకి సిఫార్సు చేసేముందు కొలీజియం నిర్దిష్ట ప్రక్రియను తూచా తప్పకుండా అనుసరిస్తుంది. అవసరమైన వారినుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది. ఆ తర్వాతే సిఫార్సు చేస్తుంది’’ అని చెప్పారు. కొన్నిసార్లు కేంద్రం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ కొలీజియమే తాను సిఫార్సు చేసిన పలు పేర్లను వెనక్కు తీసుకుందని గుర్తు చేశారు. ముగ్గురిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, ఐదుగురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం చేసిన సిఫార్సుల విషయం ఏమైందని ధర్మాసనం ప్రశ్నించింది. వాటిని కేంద్రం పరిశీలిస్తోందని, స్పందించేందుకు సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి బదులిచ్చారు. ‘‘దీనిపై నిర్ణయానికి సమయమెందుకు? వారిప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. సీనియర్ న్యాయమూర్తులు’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ‘‘పలు హైకోర్టుల్లో సీజే పదవులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మేం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే గానీ వీటిపై మేం నిర్ణయం తీసుకోలేం’’ అంటూ విచారం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సుల పరిశీలనలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్‌కు కట్టుబడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఏజీ పేర్కొన్నారు. హైకోర్టుల కొలీజియం చేసిన 104 సిఫార్సుల్లో 44 పేర్ల పరిశీలన రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందన్నారు. విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో దాఖలై, పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపేసి, విచారణ నిమిత్తం తమకే బదిలీ చేసుకుంది. ఈ పిటిషన్లపై స్పందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఫిబ్రవరి 15లోగా ఉమ్మడి వివరణ ఇవ్వాలని సూచించింది. మార్చి 13న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. -
కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా?
న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ పనితీరుపై ఇప్పుడు తీవ్ర చర్చ కొనసాగుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి చాలాసార్లు ఈ వ్యవస్థ పారదర్శకత గురించి చర్చ లేవదీశారు. మరోవైపు కొలీజియం కార్యాచరణలు అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం, నిష్పాక్షికత లోపించాయని మరో మాజీ జస్టిస్ కురియన్ స్పష్టం చేశారు. కార్యనిర్వాహక వర్గమైన ప్రభుత్వానికి పాత్ర లేకుండా కొలీజియం కొనసాగడంపై దాని ఏర్పాటుకు కారణమైన తీర్పునిచ్చిన మాజీ చీఫ్ జస్టిస్ వర్మ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదేనా అన్న ప్రశ్న తలెత్తక మానదు. న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీ జియం (తెలుగులో సలహా మండలి అనవచ్చు) వ్యవస్థ పరిపూర్ణమైనదేనా? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్ ఇటీవలి ఇంటర్వ్యూలలో అదే చెబుతున్నారు. అదే సమయంలో, రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలో కొలీజియం అనేది అంతర్గతంగానే ఉందని ఆయన సూచించారు కూడా! అయితే ఈ రెండు అంశాల గురించి ఆయన చెప్పింది సరైం దేనా? దీనిపై ఒక సాధారణ పరిశోధన ఏం చెబుతోందో మీతో పంచుకోనివ్వండి. పైన పేర్కొన్న వాటిలో రెండో అంశాన్ని మొదటగా తీసు కుందాం. కొలీజియం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపర్చలేదు. మరీ ముఖ్యంగా, ‘చీఫ్ జస్టిస్ సమ్మతి’(కన్కరెన్స్) అనే పదాన్ని జోడించడానికి జడ్జీల నియామక విధానంలో చేసిన సవరణను కూడా రాజ్యాంగ సభలో ఆనాడే ఓడించారు. అయితే 1993లో మాత్రమే సుప్రీంకోర్టు దీన్ని సాధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2)లో ప్రస్తావించిన ‘సంప్రదింపు’ అనే పదం ‘చీఫ్ జస్టిస్ సమ్మతి’ అని నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు ఇది చేయగలిగింది. ఈ రెండు పదాలకు ప్రతి నిఘంటువులోనూ వేర్వేరు అర్థాలున్నాయనే వాస్త వాన్ని అలా పక్కన పెట్టారు. కాబట్టి రాజ్యాంగంలో కొలీజియం అనే భావన కనీసంగా భాగం కానప్పుడు, దాని ప్రాథమిక స్వరూపంలోనే కొలీజియం వ్యవస్థ అంతర్గతంగా ఉందని చెబితే నమ్మడానికి కూడా కష్టంగానే ఉంటుంది. దీనికి బదులుగా ఇది ‘హంప్టీ డంప్టీ సూత్రం’ మీద ఆధారపడి చేసినది. అంటే, ‘‘నేను ఒక పదం ఉపయోగిస్తున్నప్పుడు, అది నేను ఎంపిక చేసుకున్న విధంగానే దాని అర్థం ఉంటుంది’’ అనే సూత్రంపైనే కొలీజియం వ్యవస్థను గతంలో రూపొందించినట్లు కనిపిస్తుంది. ఇక పరిపూర్ణతకు సంబంధించిన ప్రశ్నకు వద్దాం. 2015 జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ కేసు సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, ‘‘కొలీజియం వ్యవస్థ కార్యాచరణలు నిస్సందేహంగా ప్రజలకూ, చరిత్రకూ కూడా అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయి’’ అని చెప్పారు. కాగా, జస్టిస్ కురియన్ కూడా ‘‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం, నిష్పాక్షికత లోపించాయి’’ అని అంగీకరించారు. కాబట్టి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదని నమ్మలేదన్నమాట. దీనికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. న్యాయమూర్తులను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు, లేదా వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటారు అనే ప్రమాణాల గురించి నిజంగానే మనకు తెలీదు. ఇక రెండో అంశం. కొలీజియం అనే న్యాయమూర్తుల నియామక వ్యవస్థ మూసిన తలుపుల వెనుక నడుస్తున్నందున అక్కడ తప్ప కుండా బంధుప్రీతికి అపార అవకాశం ఉంటుంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమ ఛాంబర్లోని జూనియర్లను, చివరకు తమ బంధువులను సైతం జడ్జీలుగా నియమించారని ఆరోపణలు రావ డంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కొలీజియం ఎంపిక చేసిన న్యాయమూర్తుల నాణ్యత మరో పెద్ద సమస్యగా ఉంటోంది. దీనిగురించి మొదలు పెట్టాలంటే, ఈ దేశం లోని అత్యుత్తమ న్యాయమూర్తులను కొలీజియం నిర్లక్ష్యం చేసింది. దీనికి జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా, జస్టిస్ అఖిల్ ఖురేషీ రెండు ఉదా హరణలుగా నిలుస్తారు. ఖురేషీ కేసు విషయానికి వస్తే, ఆయనను నియమించేంత వరకూ మరే ఇతర న్యాయమూర్తినీ నియమించ డానికి కూడా జస్టిస్ నారిమన్ తిరస్కరించారు. కానీ అది ఎన్నటికీ జరగలేదు. మరింత ఘోరమైన విషయం ఏమిటంటే, అర్హత లేని వ్యక్తులు తరచుగా న్యాయమూర్తులుగా నియమితులు కావడం. దీనికి అద్భుత మైన ఉదాహరణ జస్టిస్ కర్ణన్. చివరకు ఈయన జైలుపాలయ్యేంతగా అధోగతిపాలయ్యారు. అదే సమయంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎమ్ఆర్ షాల విషయానికి వస్తే, సిట్టింగ్ జడ్జిలుగా ఉండికూడా వారు బహిరంగంగానే ప్రధానమంత్రిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఇది సుప్రీంకోర్టును తీవ్ర ఇబ్బందిలోకి నెట్టింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి బలహీనతలతో కూడిన వ్యవస్థ పరిపూర్ణంగా ఉండగలదా? 1993లో కొలీజియం వ్యవస్థను రూపొందించడానికి మూలమైన తీర్పు చెప్పిన నాటి చీఫ్ జస్టిస్ వర్మ సైతం అలా భావించడం లేదు. ‘బీబీసీ హార్డ్ టాక్’ కోసం జస్టిస్ వర్మ 2004లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొలీజియం విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాననీ, కార్యనిర్వాహకవర్గమైన ప్రభుత్వా నికి కూడా పాత్ర కల్పించే జాతీయ న్యాయ కమిషన్‌ను తాను నమ్ము తున్నాననీ ఆయన అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి ఇదే ఉత్తమమార్గంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొలీ జియం రచయితే తన మనసు మార్చుకున్నప్పుడు, ఇక అలాంటి న్యాయ నియామకాల వ్యవస్థ పరిపూర్ణమైనదిగా ఉండగలదా? న్యాయచతురత కలిగిన అభ్యర్థులను ఉన్నత స్థానాల్లో న్యాయ మూర్తులుగా నిలిపినట్లయితే, కార్యనిర్వాహక వర్గం తన వ్యక్తిత్వం, సమగ్రత విషయంలో మరింత ఉత్తమంగా ఉండగలుగుతుందని జస్టిస్ వర్మ వాదించారు. కాబట్టే కొలీజియంలో ప్రభుత్వానికి కూడా తప్పకుండా పాత్ర కల్పించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, వర్మ మరొక అడుగు ముందుకెళ్లారు. 1997లో, ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పడు, కొలీజియం ఒక అభ్యర్థిని సిఫార్సు చేసింది. అయితే నిఘా సంస్థలు ఆయన పట్ల తీవ్ర అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నాయని నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ చెప్పగానే, జస్టిస్ వర్మ ఆ అభ్యర్థి పేరును వెనక్కు తీసుకున్నారు. పైగా తాను ఎందుకలా నిర్ణయం మార్చుకోవలసి వచ్చిందో తన తోటి అయి దుగురు న్యాయమూర్తులకు వివరించారు కూడా! వీరిలో తర్వాత ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు. అయితే ఈ ముగ్గు రిలో ఒకరు జస్టిస్ వర్మ చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి, ఆయన ఉపసంహరించిన వ్యక్తిని తిరిగి నామినేట్ చేశారు. అలా ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యేలా చూశారు. అంటే ఒక తప్పుడు వ్యక్తిని కూడా కొలీజియం నామినేట్ చేయగలదనడానికి ఇదే రుజువు అని వర్మ అన్నారు. ఇదేమీ ఏకైక ఉదాహరణ కాదని కూడా ఆయన కొనసాగించారు. ఈ అంశం వద్దే దీన్ని ముగించనివ్వండి. ఒక సాధారణమైన పరిశోధన బయటపెట్టిన వాస్తవాలను, ఆందోళనలను మీ ముందు ఉంచాను. నిస్సందేహంగానే ఇక్కడ చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే నేను న్యాయవాదిని కానీ, న్యాయమూర్తిని కానీ కాదు కాబట్టి వాటి గురించి నేను జాగరూకతతో ఉండలేను. అయితే నేను ఈ కథనం ప్రారంభంలోనే వేసిన రెండు ప్రశ్నలను సమర్థిం చడానికి ఇది సరిపోతుంది మరి. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణ మైనదేనా? అది మన రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలోనే అంతర్గ తంగా ఉందని భావించవచ్చా? కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘స్థాయి లేని వ్యక్తులు సీఎంను విమర్శించడం ఫ్యాషన్ అయ్యింది’
విజయవాడ: కొలీజియం నిర్ణయాలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొలీజియం నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనన్నారు. న్యాయ వ్యవస్థలో కుల ప్రస్తావన రావడం దురదృష్టకరమన్నారు. న్యాయ వ్యవస్థపై దాడి మంచిది కాదని శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నవోలు తెలిపారు. ‘ స్థాయి లేని వ్యక్తులు సీఎంను విమర్శించడం ఫ్యాషన్ అయ్యింది. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి జడ్జిల బదిలీతో సంబంధమేంటి?,కొలీజియం అనేది స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనివారే ఆందోళన చేశారు’ అని అన్నారు. ఇదిలా ఉంచితే, తాము హైకోర్టు విధుల బహిష్కరణకు పిలుపు ఇవ్వలేదని ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ తెలిపింది. న్యాయవాదులు సమ్మె చేయడం, విధులు బహిష్కరించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. విధులు బహిష్కరిస్తూ కొంతమంది చేసిన తీర్మానంతో అసోసియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. -
న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి చేసిన సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సులపైనా నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. జడ్జీలుగా చేరకుండా నిరుత్సాహపర్చేలా వ్యవహరించవద్దని సూచించింది. పేర్లను చాలాకాలం పెండింగ్‌లో పెట్టడం ద్వారా వారి అంగీకారాన్ని బలవంతంగా వెనక్కి తీసుకొనేలా చేయడం సమంజసం కాదంది. ఉన్నత న్యాయ స్థానాల్లో ఖాళీలను నిర్దేశిత గడువులోగా భర్తీ చేయడానికి టైమ్‌ఫ్రేమ్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన 11 పేర్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులుగా నియమించాలని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర్వు జారీ చేసింది. -
కొలీజియంపై ఫిర్యాదులను విస్మరించలేం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ పనితీరుపై ప్రభుత్వం సహా పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని విస్మరించలేమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొలీజియం విషయంలో పౌర సమాజం, న్యాయవాద సంఘాల ఆందోళనలను కొట్టిపారేయలేమని అన్నారు. న్యాయ వ్యవస్థలో వైవిధ్యం కోసం ఒక సంస్థాగత యంత్రాంగం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆసియన్ ఆస్ట్రేలియన్ లాయర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘కల్చరల్ డైవర్సిటీ, లీగల్ ప్రొఫెషన్’ అంశంపై సదస్సులో జస్టిస్ రమణ ప్రసంగించారు. కోర్టు ధర్మాసనాల్లో వైవిధ్యం ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. విభిన్న అనుభవాలు కలిగిన న్యాయమూర్తులు ధర్మాసనంలో సభ్యులుగా ఉండాలని చెప్పారు. న్యాయ వ్యవస్థలో తాము కూడా భాగస్వాములమేనన్న నమ్మకం ప్రజలకు కలిగేలా జడ్జీలు వ్యవహరించాలన్నారు. భిన్నమైన నేపథ్యాలు కలిగినవారిని నియమించేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. దాదాపు తాను చేసిన అన్ని సిఫార్సులను కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు. -
ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
-
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్లతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. ఏడుగురు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. కొలీజియం సిఫారసు చేసిన వారిలో అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మీనర్సింహచక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. వీరిలో రవీంద్రబాబు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, రాధాకృష్ణ కృపాసాగర్ కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, శ్యాంసుందర్ విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, శ్రీనివాస్ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా, చక్రవర్తి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా, మల్లికార్జునరావు నూజివీడు 15వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా, వెంకటరమణ హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడుగురితోపాటు ఇప్పటికే కేంద్రానికి చేరిన న్యాయవాది ఎస్.ఎం.సుభాని పేరుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుతుంది. హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 24 మంది ఉన్నారు. తాజా నియామకాలు పూర్తయితే ఇంకా ఐదుపోస్టులు ఖాళీగా ఉంటాయి. త్వరలో కొన్ని ఖాళీలను భర్తీచేసేందుకు హైకోర్టు చర్యలు తీసుకోనుంది. ఆశావహులు తమ బయోడేటాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు 1962 జూన్ 20న ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాళెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి రాఘవరావు, తల్లి సీతారావమ్మ. 1988లో న్యాయవాదిగా ఎల్‌రోల్ అయ్యారు. చీరాలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994 మే 5న మునిసిఫ్ మేజిస్ట్రేట్‌గా జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పనిచేశారు. 2021 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా కొనసాగుతున్నారు. బండారు శ్యాంసుందర్ 1962 సెప్టెంబర్ 1న అనంతపురంలో జన్మించారు. తండ్రి బండారు సుబ్రహ్మణ్యం, తల్లి సుబ్బలక్ష్మి. తాత బండారు రంగనాథం ప్రముఖ క్రిమినల్ న్యాయవాది. 1986లో ఎల్ఎల్బీ పూర్తిచేసి అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఐదేళ్లపాటు అనంతపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1991లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. న్యాయాధికారిగా 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఊటుకూరు శ్రీనివాస్ కృష్ణాజిల్లా తిరువూరు గ్రామంలో జన్మించారు. తండ్రి లక్ష్మణరావు, తల్లి లీలావతి. భార్య లక్ష్మీప్రసన్న. మచిలీపట్నం డీఎస్ఆర్ హిందూ న్యాయకళాశాలలో న్యాయవిద్య పూర్తిచేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. బొప్పన వరాహలక్ష్మీనర్సింహచక్రవర్తి 1964 ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా కందులపాళెం గ్రామంలో జన్మించారు. తండ్రి డాక్టర్ బి.పాపారాయచౌదరి, తల్లి విజయలక్ష్మి. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు జడ్జిగా వ్యవహరించారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ సీబీఐ కోర్టు జడ్జిగా వ్యవహరించారు. 2019లో విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా కొనసాగుతున్నారు. తల్లాప్రగడ మల్లికార్జునరావు 1964 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా పుల్లేటికుర్రులో జన్మించారు. తండ్రి శ్రీరామచంద్రమూర్తి. తల్లి రమణ. 10వ తరగతి వరకు నేదునూరులో విద్యాభ్యాసం కొనసాగించారు. అమలాపురంలో బీఎస్సీ పూర్తిచేశారు. రాజమండ్రిలోని జి.ఎస్.కె.ఎం.లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1988–1994 వరకు అమలాపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సీనియర్ న్యాయవాది పారెపు శ్రీరామచంద్రమూర్తి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం నూజివీడు అదనపు జిల్లా, సెషన్స్‌జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డా. వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ 1963లో జన్మించారు. తండ్రి వి.బి.కె.విఠల్, తల్లి పుష్పవతి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి బీకాం, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. అదే యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. ఏడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు. ఐదేళ్ల పాటు లెక్చరర్‌గా వ్యవహరించారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. రాజమండ్రి, పెద్దాపురం, ఒంగోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టు న్యాయసేవాధికార సంస్థగా పనిచేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన సతీమణి వి.ఎ.ఎల్.సత్యవతి కర్నూలు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. దుప్పల వెంకటరమణ 1963 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా చినబోడేపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి అప్పన్న, తల్లి వరహాలమ్మ. తండ్రి రైల్వేశాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తూ విధి నిర్వహణలోనే కన్నుమూశారు. అన్న పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ప్రాథమిక విద్యాభ్యాసం బోడేపల్లి, తోటాడ గ్రామాల్లో పూర్తిచేశారు. విశాఖపట్నం ఎన్.వి.పి.లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది పలు ప్రాంతాల్లో బాధ్యతలు నిర్తరించారు. టీటీడీ లా ఆఫీసర్‌గా వ్యవహరించారు. 2017–19 వరకు న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: ఇవేం రాతలు, ఇవేం కూతలు? -
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎస్.ఎం.సుభాని
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెహబూబ్ సుభాని షేక్ (ఎస్.ఎం.సుభాని)ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈనెల నాలుగోతేదీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుభాని పేరును కేంద్రానికి పంపింది. ఈ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అదే సమావేశంలో ఢిల్లీ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల్ని, పట్నా హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల్ని న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం ఏడాది కాలంలో వేర్వేరు హైకోర్టులకు 195 మందిని న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఎస్.ఎం.సుభాని పేరును న్యాయమూర్తి పోస్టుకు హైకోర్టు కొలీజియం గత ఏడాది సిఫారసు చేసింది. సుభానితో పాటు మరో ఏడుగురు న్యాయవాదుల పేర్లను కూడా సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సుభాని పేరును పక్కనపెట్టి మిగిలిన ఏడుగురు న్యాయవాదుల పేర్లకు ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు ఆయన పేరును న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది. ఇదీ నేపథ్యం.. సుభాని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో జన్మించారు. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఇంటర్, డిగ్రీ ఆంధ్ర లయోలా కాలేజీలో చదివారు. జేఎన్‌యూ న్యూఢిల్లీలో ఎంఏ పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏరాసు అయ్యపరెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రభుత్వసంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రస్తుతం హైకోర్టులో ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు. చదవండి: AP: వెయ్యి గ్రామాల్లో పూర్తయిన రీసర్వే -
న్యాయమూర్తులుగా 15 మంది
న్యూఢిల్లీ: ఏపీ, ఢిల్లీ, పాట్నా హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ 15 మంది జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదుల పేర్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అడ్వొకేట్ మహబూబ్ సుభానీ షేక్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ్జడ్జిగా నియమించాలని సూచించింది. ఢిల్లీ, పట్నా హైకోర్టులకు ఏడుగురు చొప్పున న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ నెల 4న కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. -
హైకోర్టుకు 12 మంది జడ్జీలు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులను నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నెల 1న కొలీజియం సమావేశమై ఈ మేరకు చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. న్యాయవాదులు కాసోజు సురేందర్, చాడ విజయభాస్కరరెడ్డి, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్వీ శ్రావణ్‌కుమార్.. జ్యుడీషియల్ అధికారులు జి.అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్‌రెడ్డి, డి.నాగార్జునలను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. పదికి పెరగనున్న మహిళా జడ్జీల సంఖ్య.. ప్రస్తుతం హైకోర్టులో ఆరుగురు మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తుండగా.. తాజా ఇద్దరు న్యాయవాదులు, మరో ఇద్దరు జిల్లా జడ్జిలకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన నేపథ్యంలో త్వరలో మహిళా జడ్జిల సంఖ్య 10కి చేరుకోనుంది. చాడ విజయభాస్కర్‌రెడ్డి.. 1968, జూన్ 28న ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాకలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1992, డిసెంబర్ 31న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ వీవీఎస్ రావు దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1999లో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ), స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2006–09 మధ్య కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. 2010–15 మధ్య వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. 2014 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. సూరేపల్లి నంద.. 1969, ఏప్రిల్ 4న జన్మించారు. 1993లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. 28 ఏళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందిస్తున్నారు. 1995–2001 వరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానల్ అడ్వొకేట్‌గా, 2001–04 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలందించారు. 2005–2016 హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ మెంబర్‌గా సేవలు అందించారు. న్యాయవాదిని పెట్టుకోలేని కక్షిదారులకు న్యాయ సహాయం అందించడంపై పలు జిల్లాల్లో న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. జువ్వాడి శ్రీదేవి.. 1972, ఆగస్టు 10న జన్మించారు. 1997లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2004–08 వరకు నిర్మల్ జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014–17 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా, 2018 నుంచి ఇప్పటి వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్నారు. ముమ్మినేని సుధీర్‌కుమార్.. 1969, మే 20న ఖమ్మం జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎంఆర్కే చౌదరి దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. కాసోజు సురేందర్... 1968లో మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించారు. 1992లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ క్రిమినల్ లాయర్ పి.సీతాపతి వద్ద జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. 2005–2008 వరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. హైకోర్టులో 2010 నుంచి ఇప్పటివరకు సీబీఐ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలు అందిస్తున్నారు. మిర్జా సఫియుల్లాబేగ్.. మహబూబాబాద్‌లో జన్మించారు. 2002లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది, తాత కేఎఫ్ బాబా దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తర్వాత తండ్రి న్యాయవాది మిర్జా ఇమాముల్లా బేగ్, న్యాయవాది ఈ.ఉమామహేశ్వర్‌రావుల వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. 2014 నుంచి తెలంగాణ వక్ప్‌బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలు అందిస్తున్నారు. ఎన్వీ శ్రవణ్‌కుమార్.. 1967, ఆగస్టు 18న జన్మించారు. 2005లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. రావ్ అండ్ కంపెనీ లాయర్స్ ఆఫీస్‌లో జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. ఈయన దివంగత పీవీ నర్సింహారావు మనమడు. జి.అనుపమ చక్రవర్తి... 1970లో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వ్యాట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మాటూరి గిరిజ ప్రియదర్శిని.. 1964, ఆగస్టు 30న విశాఖపట్నంలో జన్మించారు. 1995లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకొని విశాఖపట్నం జిల్లా కోర్టులో ఏడేళ్లు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో జిల్లా జడ్జి పరీక్షలో ఎంపికై గుంటూరులో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. సాంబశివరావు నాయుడు.. 1962, ఆగస్టు 1న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారు. న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యి 1986లో ప్రముఖ క్రిమినల్ లాయర్ పిల్లా జానకి రామయ్య దగ్గర జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. 1991లో డిస్ట్రిక్ట్ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. తర్వాత సీనియర్ సివిల్ జడ్జిగా, జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. అలుగు సంతోష్‌రెడ్డి... జగిత్యాల జిల్లా జొగన్పల్లిలో జన్మించారు. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో ప్రాక్టీస్ చేశారు. 1991లో డిస్ట్రిక్ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2010లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి.. రాష్ట్ర విభజన తర్వాత 2017 వరకు కొనసాగారు. 2019లో తిరిగి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ డి.నాగార్జున.. వనపర్తి జిల్లాలో 1962, ఆగస్టు 15న జన్మించారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకొని వనపర్తి, మహబూబ్‌నగర్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 1991లో డిస్ట్రిక్ట్ మున్సిఫ్‌గా ఎంపికయ్యారు. 2010లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
‘సీజే బదిలీ ప్రజా ప్రయోజనాల కోసమేనా?’
సాక్షి, న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్య్రం, లౌకికవాదం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, ఆరోగ్య హక్కు, రాష్ట్ర జవాబుదారీతనంపై అనేక ఉత్తర్వులు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీని ఎందుకు బదిలీ చేశారంటూ సుప్రీంకోర్టు కొలీజియంను ఆ కోర్టు లాయర్లు ప్రశ్నించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. జస్టిస్ సంజీబ్ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం సిఫార్సుపై మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోపే బదిలీ చేయడం ప్రజా ప్రయోజనం కోసమా? లేక మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా? అని తమ లేఖలో ప్రశ్నించారు. 75 మంది న్యాయమూర్తులుండే మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ఇద్దరు న్యాయమూర్తులుండే మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడం విస్తుగొలిపే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోం దని పేర్కొన్నారు. ఈ తరహా బదిలీ నిజాయితీ కలిగిన న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను సైతం దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
Telangana: రేపు సీజేగా జస్టిస్ సతీష్‌చంద్రశర్మ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర రానున్నారు. అలాగే ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ పీకే మిశ్రా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీకే మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌చంద్ర శర్మ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. రేపు నూతన సీజే ప్రమాణం హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.05 నిమిషాలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరాజన్ సీజేతో ప్రమాణం చేయిస్తారని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమ చక్రవర్తి శనివారం తెలిపారు. జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ... తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్పూర్లోని సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్ హరిసింగ్‌గౌర్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. మూడు సబ్జెక్ట్‌ల్లో డిస్టింక్షన్ సాధించి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందారు. అదే వర్సిటీలో న్యాయ పట్టా అందుకొని 1984, సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ బార్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఎల్‌ఎల్‌బీలోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్ విషయాల్లో ప్రాక్టీస్ చేశారు. 1993లో అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2004లో సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008, జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గడ్‌లో జన్మించారు. బిలాస్పూర్ లోని గురు ఘాసిదాస్ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987, సెప్టెంబర్ 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకొని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004, జూన్ 26 నుంచి 2007, ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. 2007, సెప్టెంబర్ 1 వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. 2009, డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయన.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. -
సమన్యాయం అందించేందుకు సహకరించండి!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అందరికీ సమన్యాయం అందించడానికి ప్రజా ప్రభుత్వాలు సహకారమందించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. వివిధ కోర్టుల్లో ఖాళీల పూరింపునకు కొలీజయం చేసిన సిఫార్సులను సత్వరమే ఆమోదించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సిఫార్సుల సత్వర అమలుతో పెండింగ్ కేసుల సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చన్నారు. ఇప్పటికే పలు సిఫార్సులను ఆమోదించామని, త్వరలో మిగిలినవాటికి అనుమతినిస్తామన్న కేంద్ర న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌తో న్యాయవ్యవస్థలో నెలకొన్న లోతైన సమస్యలు బయటపడ్డాయన్నారు. బలహీనవర్గాలకు సత్వర సమన్యాయం అందాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నల్సా(జాతీయ న్యాయసేవల అథారిటీ) ఆధ్వర్యంలో ఆరువారాలు సాగే ‘పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్, అవుట్‌రీచ్ క్యాంపెయిన్’ను రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ శనివారం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమంతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని గాంధీ భావించేవారని రమణ గుర్తు చేశారు. సమ్మిళిత వృద్ధి మాత్రమే స్థిరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందనేది కాదనలేని సత్యమని తెలిపారు. సమన్యాయం తక్షణ అవసరం సమన్యాయం అందించకుండా సామాజిక ఆర్థిక సమానత్వం సాధించడం అసాధ్యమన్నారు. దీన్ని గుర్తించి అందరికీ సమన్యాయం అందించేందుకు కార్యనిర్వాహక, చట్టసభలు, న్యాయవ్యవస్థలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య నాణ్యత నాణ్యమైన న్యాయంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజాస్వామ్య దేశంలో సంస్థల్ని నిలబెట్టేది ప్రజల విశ్వాసం, నమ్మకమేనని పునరుద్ఘాటించారు. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన నల్సా కోట్లాదిమందికి సేవలందించిందన్నారు. గాందీజీ జయంతినాడు మొదలైన ఈ కార్యక్రమం నెహ్రూ జయంతి రోజున ముగుస్తుందన్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు చేరుకోవడానికి యతి్నస్తున్నామని, దీనికి అందరి సహకారం కావాలన్నారు. న్యాయవాది అయిన రాష్ట్రపతిని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమణ చెప్పారు. చట్టపరమైన సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్రపతి అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధికి పాటుపడాలి సీనియర్ న్యాయవాదులు మహాత్మా గాంధీ ఆదర్శాలను పాటించి, పేదలకు సేవలందించాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. మహిళాభివృద్ధికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళాభివృద్ది భావన నుంచి మహిళల వల్ల అభివృద్ధి అనే భావనకు మరలాలన్నారు. సహేతుకమైన మూల్యానికి ఉత్తమ న్యాయ ప్రతిభ అందుబాటులో ఉండాలని గాంధీ కోరుకునేవారన్నారు. లాయర్లు తమ సమయంలో కొంత బలహీనవర్గాల సేవలకు కేటాయించాలన్నారు. కోర్టు బయట పరిష్కారాలను గాం«దీజీ బలంగా విశ్వసించేవారన్నారు. న్యాయవాద వృత్తిలో మహిళల పాత్ర మరింత పెరగాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ న్యాయ సేవలు అందించడానికి నల్సా చేస్తున్న సేవలనుకోవింద్ ప్రశంసించారు. -
16 మందికి న్యాయమూర్తులుగా పదోన్నతి!
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి గాను సుప్రీంకోర్టు కొలీజియం 16 పేర్లను సూచించింది. బాంబే, గుజరాత్, ఒడిశా, పంజాబ్–హరియాణాల హైకోర్టుల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమై 16 మంది పేర్లను సూచించింది. వీరిలో ఆరుగురు జ్యుడీషియల్ ఆఫీసర్లు కాగా, మరో 10 మంది అడ్వొకేట్లు ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించి, హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం పేర్కొంది. ఈ మేరకు గురువారం ఆ జాబితాను తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. నలుగురు జ్యుడీషియల్ అధికారులు ఎల్.పన్సారే, ఎస్.సి.మోరె, యూ.ఎస్.జోషి ఫాల్కే , బి.పి.దేశ్‌పాండేలను బాంబే హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. అడ్వొకేట్లు ఆదిత్యకుమార్ మహాపాత్రా, మృగాంక శేఖర్ సాహూ, జ్యుడీషియల్ ఆఫీసర్లు రాధాకృష్ణ పట్నాయక్, శశికాంత్ మిశ్రాలకు ఒడిశా హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. గుజరాత్ హైకోర్టుకు అడ్వొకేట్లు మౌన మనీష్ భట్, సమీర్ జె.దేవ్, హేమంత్ ఎం.పృచ్ఛక్, సందీప్ ఎన్.భట్, అనిరుద్ధ ప్రద్యుమ్న, నీరల్ రష్మీకాంత్ మెహతా, నిషా మహేంద్రభాయ్ ఠాగూర్ పేర్లను సూచించింది. పంజాబ్–హరియాణా హైకోర్టుకు అడ్వొకేట్ సందీప్ మౌడ్గిల్ పేరును సూచించింది. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతోపాటు జస్టిస్ యు.యు.లలిత్, ఎ.ఎం.ఖాన్వి ల్కర్లతో కూడిన కొలీజియం హైకోర్టుల్లో జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీకి సత్వర చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 100 మంది పేర్లను సూచించారు. సుప్రీంకోర్టులో ఉన్న తొమ్మిది ఖాళీలను భర్తీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో 1,080 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది మే నాటికి 420 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఖాళీలని్నంటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కొలీజియం కృషి చేస్తోంది. -
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులపై కేంద్రం మౌనం
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం 68 మంది జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదుల పేర్లను సిఫారసు చేయగా, కేంద్రం ఇంకా స్పందించలేదని తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు 8 నుంచి సెపె్టంబర్ 1 దాకా వివిధ హైకోర్టులు సిఫారసు చేసిన 100కు పైగా జ్యుడీషియల్ అధికారులు, అడ్వొకేట్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలించింది. ఇందులో నుంచి 12 హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం చివరకు 68 పేర్లను ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసిన ఈ 68 పేర్లపై కేంద్రం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ 68 పేర్లలో కర్ణాటక నుంచి ఇద్దరి పేర్లను, జమ్మూకశ్మీర్ నుంచి ఒకరి పేరును కొలీజియం మూడోసారి కేంద్రానికి పంపడం గమనార్హం. మరో 10 మంది పేర్లను రెండోసారి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఆగస్టు 17న కొలీజియం ముగ్గురు మహిళలతో సహా మొత్తం 9 పేర్లను కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర సర్కారు వేగంగా నిర్ణయం తీసుకుంది. సానుకూలంగా స్పందించింది. సుప్రీం చరిత్రలోనే తొలిసారిగా ఒకేరోజు 9 మంది ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేశారు. మొత్తం 25 హైకోర్టుల్లో మంజూరైన జడ్జీ పోస్టులు 1,098 కాగా. కేంద్ర న్యాయ శాఖ సమాచారం ప్రకారం.. సెపె్టంబర్ 1వ తేదీ నాటికి 465 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
హైకోర్టు జడ్జిలుగా 68 మంది పేర్లు
-
హైకోర్టు జడ్జిలుగా 68 మంది పేర్లు
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68మంది పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఆగస్టు25, సెపె్టంబర్1న జరిపిన సమావేశాల్లో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలిజియం 112మంది పేర్లను పదోన్నతి కోసం పరిశీలించింది. ఇందులో 82మంది బార్‌కు చెందినవారు కాగా, 31మంది జ్యుడిషియల్ సర్వీసెస్‌కు చెందినవారు. వీరిలోనుంచి 68మంది పేర్లను 12 హైకోర్టులకు కొలిజియం రికమండ్ చేసింది. వీరిలో 44మంది బార్‌కు, 24 మంది జ్యుడిషియల్ సర్వీసెస్‌కు చెందినవారు. ఈ దఫా సిఫార్సుల్లో కూడా కొలిజియం చరిత్ర సృష్టించింది. తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఒకరిని ఎంపిక చేసింది. మిజోరాంకు చెందిన ఎస్టీ జ్యుడిషియల్ అధికారి మర్లి వాంకుంగ్‌ను గౌహతి హైకోర్టుకు జడ్జిగా కొలిజియం రికమండ్ చేసింది. అలాగే సిఫార్సు చేసిన 68మందిలో 10మంది మహిళలున్నారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన జడ్జిలను అలహాబాద్, రాజస్తాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్ము కాశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్ అండ్ హర్యానా, కేరళ, చత్తీస్‌గఢ్, అస్సాం హైకోర్టుల్లో నియమిస్తారు. ఇటీవలే కొలిజయం ఏడుగురు జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు, 9మందిని సుప్రీంకోర్టుకు రికమండ్ చేసింది. వీరందరితో ఒకేరోజు సీజేఐ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంలో జడ్జిల సంఖ్య 33కు చేరింది. -
సుప్రీంకోర్టుకు 9 మంది జడ్జీలు...
సాక్షి, న్యూఢిల్లీ: తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేశారు. కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ విక్రమ్‌నాథ్, సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు జడ్జి బేలా త్రివేది, బార్ నుంచి న్యాయవాది పీఎస్ నరసింహలను కొలిజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. 31న జడ్జీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో 34 జడ్జీ పోస్టులుండగా వీరి నియామకంతో జడ్జీల సంఖ్య 33కు చేరనుంది. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! జస్టిస్ విక్రమ్‌నాథ్ జస్టిస్ విక్రమ్‌నాథ్ సెప్టెంబర్ 24, 1962లో అలహాబాద్‌లో జన్మిం చారు. అలహాబాద్ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సెప్టెంబర్ 10, 2019న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. చరిత్రలో మైలురాయి!..జస్టిస్ నాగరత్న సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందిన కర్ణాటక హైకోర్టు జడ్జి బీవీ నాగరత్న సెప్టెంబర్ 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. జస్టిస్ నాగరత్న 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, ఆర్బిట్రేషన్లకు సంబంధించిన కేసులకు పేరుగాంచారు. జస్టిస్ జేకే మహేశ్వరి మధ్యప్రదేశ్‌లో జన్మించిన జస్టిస్ మహేశ్వరి 1985లో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. నవంబర్ 25, 2005న మధ్యప్రదేశ్ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్ 25, 2008న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్టోబర్ 7, 2019న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇటీవల సిక్కింకు బదిలీ అయ్యారు. జస్టిస్ బేలా మాందుర్య త్రివేది 1983లో కెరియర్ ప్రారంభించిన జస్టిస్ త్రివేది సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పేరుగాంచారు. 1995లో అహ్మదాబాద్ సిటీ సివిల్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గుజరాత్ హైకోర్టు ప్రత్యేక అధికారి(నిఘా)గా పనిచేసిన ఆమె గుజరాత్ ప్రభుత్వం న్యాయ సలహాదారుగా పనిచేశారు. జస్టిస్ సీటీ రవికుమార్ కేరళకు చెందిన జస్టిస్ చుడలాయిళ్ తేవన్ రవికుమార్ జనవరి 6, 1960న జన్మించారు. జనవరి 5, 2009న కేరళ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబరు 15, 2010న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సీటీ రవికుమార్ జనవరి 5, 2022 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా మహారాష్ట్రకు చెందిన జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా మే 25, 1960లో జన్మించారు. జూన్ 28, 1983లో బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. నవంబర్ 12, 2005న బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మే10, 2019న పదోన్నతి పొందారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ తమిళనాడుకు చెందిన జస్టిస్ ఎంఎం సుందరేశ్ మద్రాస్ లా కళాశాల నుంచి న్యాయ పట్టా అందుకున్నారు. 1985లో తమిళనాడు, పుదుచ్చేరి బార్కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. మార్చి 31, 2009న అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎంఎం సుందరేశ్ మార్చి 29, 2011న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగో తెలుగు న్యాయమూర్తి..జస్టిస్ పీఎస్ నరసింహ ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి తర్వాత నాలుగో తెలుగు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ బాధ్యతలు చేపట్టను న్నారు. బార్ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వ్యక్తి పీఎస్ నరసింహ. మే 3, 1953లో హైదరాబాద్‌లో జన్మించారు. జస్టిస్ హిమా కోహ్లి 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలు అయిన జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. మే 29, 2006న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లి ఆగస్టు 29, 2007న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 7, 2021లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు. -
సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బేలా త్రివేది, బార్ నుంచి సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమైంది. కొలీజియం చేసిన సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను బుధవారం రాత్రి అధికారికంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి 21 నెలల తర్వాత కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 25 మంది ఉన్నారు. బుధవారం జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య 10కి చేరింది. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదిస్తే న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. మొదటిసారి ముగ్గురు మహిళలు ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతుండడం ఇదే తొలిసారి. వీరి నియామకం తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు చేరనుంది. ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే ఉన్నారు. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా కేవలం ఎనిమిది మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు. 1989లో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో నియమితురాలైన తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. కాబోయే తొలి మహిళా సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) తొలిసారిగా ఒక మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సీజేఐ కానున్నారు. ఆమె 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, బీమా, సేవలు, కుటుంబ చట్టాలు, ఆర్బిట్రేషన్లకు సంబంధించి కేసుల్లో మంచి పేరు సంపాదించారు. కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2008 ఫిబ్రవరి 18న నియమితులైన జస్టిస్ బీవీ నాగరత్న 2010 ఫిబ్రవరి 17న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎనగలగుప్పే వెంకటరామయ్య కుమార్తె జస్టిస్ బీవీ నాగరత్న. ‘‘ఏదైనా బ్రాడ్‌కాస్టింగ్ చానల్ నిజాయితీగా వార్తలు ప్రసారం చేయాలని భావించినప్పుడు ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్‌లతో సంచలనాలను నిలిపివేయాలి’’ అని 2012లో ఓ కేసు విషయంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. బార్ నుంచి తొమ్మిదో న్యాయవాది కొలీజియం సిఫార్సు చేసిన సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ బార్ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. కృష్ణా జిల్లా గణపవరానికి చెందిన ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కోదండరామయ్య కుమారుడు పీఎస్ నరసింహ. ఆయన హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు. యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన ఆయన పదవీ కాలం పూర్తికాక ముందే రాజీనామా చేశారు. అయోధ్య కేసులో రాంలల్లా విరాజ్‌మాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మహంత్ రామచంద్రదాస్ తరఫున పీఎస్ నరసింహ వాదనలు వినిపించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. బీసీసీఐ కార్యకలాపాల్లో భారీ మార్పులకు అమికస్ క్యూరీగా సేవలందించారు. బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి న్యాయవాది జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ కూడా 13వ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్ కూడా 2014లో బార్ నుంచి సుప్రీం కోర్టు న్యాయయూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. నాలుగో తరం న్యాయవాది తమ పూర్వీకుల పరంపరను కొనసాగిస్తూ నాలుగో తరంలో న్యాయవాది వృత్తి చేపట్టారు జస్టిస్ విక్రమ్‌నాథ్. గుజరాత్‌లోని కౌశంబి జిల్లాకు చెందిన ఆయన అలహాబాద్ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 సెప్టెంబరు 10న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతంలో ఒకసారి సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఆన్లైన్ ద్వారా కోర్టు కార్యకలాపాలు చేపట్టి లైవ్ స్ట్రీమ్‌కు జస్టిస్ విక్రమ్ నాథ్ నాంది పలికారు. జస్టిస్ హిమా కోహ్లి ప్రస్థానం జస్టిస్ హిమా కోహ్లి 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1999 నుంచి 2004 వరకూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి సహా పలు విభాగాలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయ సేవల కమిటీలో పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లి 2007 ఆగస్టు 29న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 జనవరి 7న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైతే 2024 సెప్టెంబర్ వరకు సేవలు అందించనున్నారు. -
హైకోర్టు జడ్జీలుగా సుప్రీం కొలీజియం నుంచి 80 పేర్లు
న్యూఢిల్లీ: గత సంవత్సర కాలంలో వేర్వేరు హైకోర్టుల్లో జడ్జీలుగా నియమాకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం 80 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ పేర్లలో 45 మందిని జడ్జీలుగా నియమించడం పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. మిగతా వారి నియామకానికి సంబంధించిన ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంల వద్ద వేర్వేరు దశల్లో కొనసాగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 1,098 మంది జడ్జీల నియామకానికి అనుమతి ఉండగా ప్రస్తుతం 645 మంది జడ్జీలు విధుల్లో ఉన్నారు. 453 జడ్జీ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ► 2020 ఏడాదిలో సివిల్స్ పరీక్షను రాయలేకపోయిన వారికి మరో అవకాశం ఇచ్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద పరిశీలనలో లేదని సిబ్బంది శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
సుప్రీం, హైకోర్టుల్లో ఖాళీగా జడ్జీ పోస్టులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు గాను కొలీజియం సిఫారసుల కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా, రెండు హైకోర్టులు శాశ్వత ప్రధాన న్యాయమూర్తులు లేకుండానే నడుస్తున్నాయని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో ఇద్దరు ఒకటిన్నర నెలల్లో రిటైర్ కానున్నారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని వివరించారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు(సీజేఐ)లుగా రిటైర్ కాగా, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రా పదవీ విరమణ చేశారు. మరో న్యాయమూర్తి ఎం.శంతను గౌడర్ గత నెలలో కన్నుమూశారని ఆయన తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో 34 జడ్జీలకుగాను ప్రస్తుతం 27 మందే ఉన్నారని చెప్పారు. కోల్‌కతా, అలహాబాద్ హైకోర్టులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులతోనే నడుస్తున్నాయన్నారు. దేశంలోని 25 హైకోర్టుల్లో కలిపి 1,080 జడ్జీలకు గాను ప్రస్తుతం 660 మంది ఉన్నారని చెప్పారు. పదోన్నతులు, రాజీనామాలు, పదవీ విరమణల కారణంగా జడ్జీల పోస్టుల్లో ఖాళీలు పెరుగుతున్నాయని తెలిపారు. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య నిరంతరం సహకార ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు జడ్జీలు, 25 హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించిన పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. వాటిని పరిశీలించాక కేంద్రం ఆ సిఫారసులకు ఆమోదం తెలపవచ్చు లేదా పునఃపరిశీలనకు తిప్పి పంపవచ్చు. హైకోర్టులో జడ్జీల ఖాళీలపై హైకోర్టు కొలీజియం తన సిఫారసులను ముందుగా న్యాయ శాఖకు అందజేస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలను వాటికి జత చేసి, ఆ సిఫారసులను న్యాయశాఖ తిరిగి సుప్రీం కోలీజియంకు పంపిస్తుంది. సీజేఐతోపాటు నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలు సుప్రీంకోర్టు కొలీజియంలో ఉంటారు. ఇక్కడ చదవండి: 2-డీజీ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది: కేంద్ర ఆరోగ్య మంత్రి Ambulance Couple: పెళ్లి బహుమతిగా అంబులెన్స్! -
సుప్రీం కొలీజియం భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అయ్యింది. సుప్రీంకోర్టులో త్వరలో ఖాళీ అయ్యే న్యాయమూర్తుల స్థానంలో ఎంపిక చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పరిశీలించింది. ఇందులో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు ఇద్దరు హైకోర్టు జడ్జీల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ పేర్లను కేంద్రం పరిశీలన నిమిత్తం పంపాల్సి ఉంది. అయితే, ఈ భేటీలో పేర్ల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్‌లో జరిగే తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 నవంబర్ 18వ తేదీన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే వచ్చే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు తన స్థానంలోకి ఎవరినీ ప్రతిపాదించలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్నారు. -
జస్టిస్ పుష్ప నియామకం: కొలీజియం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పోక్సో చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె నియామకానికి సంబంధించి శాశ్వత హోదా కల్పించాల్సిందిగా చేసిన ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. కాగా కొలీజియం సిఫార్సుల మేరకు జడ్జీల శాశ్వత నియామకం జరుగుతుందన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదించవచ్చు లేదా మరికొన్ని ప్రతిపాదనలు చేస్తూ తిరిగి పంపించవచ్చు. కాగా 2018లో జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైనప్పటికీ, న్యాయస్థానం వ్యతిరేకించడంతో ఆమె కొన్నాళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు నిరాశ ఎదురైంది.(చదవండి: తనతో పాటు ఆమెను వివస్త్రను చేయడం అసాధ్యం: హైకోర్టు ) అయితే 2019లో జస్టిస్ పుష్ప నియామకం ఖరారు కావడంతో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా ఆమెకు అవకాశం లభించింది. కానీ శాశ్వత హోదా లభించలేదు. ఈ క్రమంలో జనవరి 20న సుప్రీంకోర్టు జస్టిస్ పుష్పను పర్మినెంట్ చేస్తూ సిఫారసు చేసింది. అయితే, అంతకుముందు రోజు శరీరాన్ని శరీరం తాకలేదు(స్కిన్-స్కిన్ టూ కాంటాక్ట్ లేదు) గనుక పోక్సో చట్టం కింద దానిని లైంగికదాడికగా పరిగణించలేమంటూ ఆమె ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే విధించింది.(చదవండి: పోక్సో చట్టంపై తీర్పులు: ఎవరీ జస్టిస్ పుష్ప గనేడివాలా?) ఈ నేపథ్యంలో గతంలో ఆమె ఇచ్చిన మరికొన్ని తీర్పులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కొలీజియం తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అరుదైన కేసుల్లో తప్ప కొలీజియం ఈ మేరకు సిఫారసులు ఉపసంహరించుకున్న దాఖలాలు లేవు. ‘‘వ్యక్తిగతంగా ఆమెకు ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే న్యాయవాదిగా ఉన్న సమయంలో ఇలాంటి కేసులు వాదించిన అనుభవం ఆమెకు లేదు అనిపిస్తోంది. కాబట్టి మరింత ఎక్స్పోజర్ కావాలి. శిక్షణ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని సర్వోన్నత న్యాయస్థాన వర్గాలు పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది. -
సుప్రీం కొలీజియంలోకి జస్టిస్ యు.యు.లలిత్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ యు.యు.లలిత్ నూతనంగా చేరారు. జస్టిస్ ఆర్.భానుమతి పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో జస్టిస్ లలిత్ కొలీజియం ఐదో సభ్యుడయ్యారు. కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ ఉన్నారు. అత్యున్నత న్యాయ స్థానంలోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియం సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీలను కొలీజియం ఎంపిక చేసి, ప్రభుత్వానికి పేర్లను ప్రతిపాదిస్తుంది. జస్టిస్ లలిత్ కొలీజియంలో 2022లో పదవీ విరమణ చేసే వరకు కొనసాగుతారు. -
ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఎస్. మురళీధర్‌ను అకస్మాత్తుగా బదిలీ చేసిన తీరుపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. విద్వేషపూరిత ఉపన్యాసంతో అల్లర్లకు కారణమైన బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాపై ఎందుకు కేసు పెట్టరంటూ ఢిల్లీ పోలీసులను నిలదీసినందుకే జస్టిస్ మురళీధర్‌పై వేటు పడిందని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తుండగా, ఆయనను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టు కొలీజియం ఫిబ్రవరి 12వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకే తాము చర్య తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. (రాత్రికి రాత్రే... ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీ) హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీ వ్యవహారాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం చేసే సిఫార్సులను అమలు చేయడానికి సరాసరి నాలుగు నెలల వ్యవధి తీసుకునే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ మురళీధర్ విషయంలో 15 రోజుల్లోగా స్పందించడం ఏమిటన్నది రాజకీయ విశ్లేషకుల మెలిక ప్రశ్న. అందులోనూ ఢిల్లీలో శాంతి, భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉండడం ఎంత వరకు సబబనే కీలకమైన వివాదాంశాన్ని విచారిస్తున్న జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయడం ఏమిటన్నది రాజకీయ విశ్లేషకుల విశేష ప్రశ్న. (వాచ్మెన్ పారిపోయాడు.. నిప్పు పెట్టారు..) 1987లో హాషింపుర ఊచకోత కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రావిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ) శిక్ష విధించినప్పటి నుంచి జస్టిస్ మురళీధర్‌పై బీజేపీ పెద్దలకు ఆగ్రహం ఉందన్నది విశ్లేషకుల ఆరోపణ. ఆ మాటకొస్తే 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు శిక్ష విధించిన జస్టిస్ మురళీధర్‌కు న్యాయవర్గాల్లో నిష్పక్షపాతిగా పేరుంది. అందుకే ఆయన బదిలీపై ఢిల్లీ బార్ అసోసియేషన్ బుధవారం నాడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయడానికి 2018, డిసెంబర్లో, 2019, జనవరిలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ నేతత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం ముందుకు జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయాలంటూ రెండు సార్లు ప్రతిపాదనలు రాగా కొలీజియం సభ్యులు అడ్డుకున్నారు. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతత్వంలోని కొలీజియం సభ్యులు ఆమోదించారు. రాజ్యాంగబద్ధంగా సుప్రీం కోర్టుకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కేంద్రంలోని ప్రభుత్వానికి లోబడి తీర్పులిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని న్యాయ వర్గాలే చెబుతున్నాయి. (సీజేఐపై కుట్ర.. ప్రత్యేక విచారణ) నాడు ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’ని సమర్థించిన సుప్రీం కోర్టు, వలస పాలన నాటి నుంచి కొనసాగుతున్న ‘దేశ ద్రోహం (సెడిషన్)’ చట్టాన్ని సమర్థించడం, గోవధ చట్టాలను సమర్థించడం, కోహినూరు వజ్రం కంటే ఆవు పేడ ప్రశస్తమైనదని అభివర్ణించడం ఉదాహరణలుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. న్యాయవ్యవస్థ తన ఉనికినే కాపాడుకోలేకపోతే ఎలా అన్నది శేష ప్రశ్న! -
సుప్రీం ‘కొలీజియం’లో జస్టిస్ భానుమతి
న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల తర్వాత సుప్రీంకోర్టు కొలీజియంలో ఓ మహిళా జడ్జి నియమితులయ్యారు. ఇప్పటి వరకూ కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయడంతో తమిళనాడుకు చెందిన జస్టిస్ ఆర్. భానుమతి ఎంపికయ్యారు. 2014 ఆగస్టు 13 నుంచి ఆమె సుప్రీంకోర్టులో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె మద్రాసు హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టులలో పనిచేశారు. ప్రస్తుతం కొలీజియంలో జస్టిస్ భానుమతితో పాటు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సభ్యులుగా ఉన్నారు. -
కొలీజియం నిర్ణయాల్లో గోప్యత అవసరమే
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియంలో జరిగే చర్చలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు. జడ్జీలుగా నియమించాలని సిఫారసు చేసేందుకు కొలీజియం తిరస్కరించిన వారికి సంబంధించి జరిగిన చర్చల వివరాలను వెల్లడించనక్కరలేదన్నారు. ఈ మేరకు బుధవారం పీటీఐ వార్తాసంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నవంబర్ 18న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. కేవలం సమాచారం తెలుసుకోవాలన్న పౌరుల కోరిక తీర్చడం కోసం వ్యక్తుల ప్రతిష్టకు సంబంధించిన విషయాన్ని బహిర్గత పరచడం సరికాదని తన అభిప్రాయమని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఒకరు. న్యాయమూర్తులిచ్చే తీర్పులపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కూడా జస్టిస్ బాబ్డే తప్పుపట్టారు. అలాంటి విమర్శలతో చాలామంది న్యాయమూర్తులు ఆవేదన చెందుతుంటారన్నారు. ‘ఉదాహరణకు.. ఒక హైకోర్టు జడ్జికి సుప్రీంజడ్జీగా పదోన్నతి కల్పించాలనుకుని, ఆ తరువాత పరిశీలనలో తమకందిన సమాచారం మేరకు సుప్రీంకోర్టు జడ్జీగా ఆయన సరికాదని కొలీజియం నిర్ణయిస్తుంది. ముందుగా, ఆయన పేరును పరిశీలించడం ఎందుకు? ఆ తరువాత పదోన్నతికి పనికిరాడని నిర్ణయించి, ఆ విషయాన్ని బహిర్గం చేయడం ఎందుకు? ఆ జడ్జీ ఆ తరువాత కూడా ఆ హైకోర్టులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కదా! అతనికి అది ఇబ్బందికరంగా ఉండదా?’ అని ప్రశ్నించారు. వారిని బాధపెట్టడం సరికాదన్నారు. -
ఆయన నియామకాన్ని తిరస్కరించిన కేంద్రం!?
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అఖిల్ ఖురేషిని నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. గుజరాత్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న అఖిల్ ఖురేషి పదోన్నతి విషయమై కొలీజియం మే 10న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయంపై మంగళవారం స్పందించిన కేంద్రం..కొలీజియం సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు అడ్వకేట్ల సంఘం బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అఖిల్ ఖురేషి నియామకాన్ని అడ్డుకుంటోందని పిటిషన్లో న్యాయవాదులు ఆరోపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ విషయంలో కేంద్రం, కొలీజియం మధ్య చర్చలు జరిగిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలిపింది. కాగా నిబంధనల ప్రకారం కొలీజియం రెండోసారి గనుక అఖిల్ ఖురేషి పేరును ప్రతిపాదించినట్లైతే కేంద్రం తప్పనిసరిగా ఆయన నియామకాన్ని ఆమోదించాల్సిందే. ఇక గతేడాది ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పదోన్నతి విషయమై కేంద్రం, కొలీజియంల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జిగా జోసెఫ్ పేరును కొలీజియం ప్రతిపాదించిగా.. కేరళ నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో తగిన ప్రాతినిథ్యం ఉన్నందు వల్ల ఆయన పేరును పునఃసమీక్షించాలని కేంద్రం కోరింది. అయితే మరోసారి కొలీజియం ఆయన పేరునే సిఫారసు చేసింది. ఈ క్రమంలో ఇందుకు అంగీకరించిన కేంద్రం మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే కేంద్రం కావాలనే జోసెఫ్ సీనియారిటీని తగ్గించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక సీనియారిటీ ఆధారంగానే అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టే అవకాశం లభిస్తుంది. -
ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఆర్.రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, డి.రమేశ్, ఎన్.జయసూర్యల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు టి.వినోద్‌కుమార్, ఎ.అభిషేక్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌లను సిఫారసు చేసింది. ఉమ్మడి హైకోర్టులో అప్పటి హైకోర్టు కొలీజియం 2018 అక్టోబర్ 9న ఈ ఏడుగురు పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. తాజాగా ఈ ఏడుగురితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, న్యాయమూర్తులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం గురువారం ముఖాముఖీ సమావేశమైంది. అనంతరం రెండు రాష్ట్రాల హైకోర్టులకు వీరి పేర్లను సిఫారసు చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు వీరు సరిగ్గా సరిపోతారని కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత రాష్ట్రపతి వద్దకు వెళతాయి. రాష్ట్రపతి ఆమోదించాక వీరి నియామకాలపై కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ నలుగురు న్యాయమూర్తుల నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరుకుంటుంది. -
జడ్జీలుగా పదోన్నతిలో నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: జడ్జీలుగా పదోన్నతి కల్పించే విషయంలో కొన్ని కేటగిరీల్లో నిబంధనలను సుప్రీంకోర్టు కొలీజియం సడలించింది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 13 మందికి హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం కేంద్రానికి సిఫారసు చేసింది. వీరిలో అలహాబాద్ హైకోర్టుకు 12 మంది, కేరళ హైకోర్టుకు ఒకరు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డేలతో కూడిన కొలీజియం ఈ నెల 12వ తేదీన తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం వెబ్సైట్లో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతోపాటు ప్రభుత్వ ప్లీడర్లుగా పనిచేస్తున్న వారి వృత్తిపరమైన ఆదాయం ఏడాదికి కనీసం రూ.7 లక్షలు ఉండాలన్న నిబంధనను కొలీజియం పక్కన పెట్టినట్లు అందులో సుప్రీంకోర్టు తెలిపింది. కేరళ హైకోర్టు జడ్జీగా లాయర్ పీవీ కున్హికృష్ణన్‌తోపాటు అలహాబాద్ హైకోర్టుకు జడ్జీలుగా 10 మంది లాయర్లు, ఒక జడ్జీని పదోన్నతిపై పంపాలని సిఫారసు చేసింది. ప్రభుత్వ ప్లీడర్లుగా పనిచేస్తున్న వారికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల వృత్తిపర ఆదాయం ఏడాదికి కనీసం రూ.7లక్షలు ఉండాలన్న పరిమితి సహేతుకంగా లేనందున, దానిని పక్కనబెట్టినట్లు అందులో పేర్కొంది. -
30 రోజుల్లో 33 మంది జడ్జీల నియామకం
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలోని వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో జడ్జీల నియామక వేగం పెరిగింది. జస్టిస్ గొగోయ్ గతనెల 3న 46వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 30 రోజుల్లో ఆయన ఆరు సార్లు కొలీజియం భేటీని నిర్వహించారు. కొలీజియంలో సీజేఐతో కలుపుకుని ఐదుగురు జడ్జీలున్నారు. కలకత్తా, బాంబే, సిక్కిం, గౌహతి, ఉత్తరాఖండ్ హైకోర్టులకు ప్రధాన జడ్జీలను కొలీజియం నియమించింది. బాంబే, కలకత్తా హైకోర్టుల్లోనే న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఎన్‌హెచ్ పాటిల్, డీకే గుప్తాలను అవే హైకోర్టుల ప్రధాన జడ్జీలుగా నియమించేందుకు ఎంవోపీ (మెమరాండం ఆఫ్ ప్రొసీజర్)ను కొలీజియం వినియోగించింది. సాధారణంగా ఇలా చేయడం అరుదు. కర్ణాటక, కేరళ, మద్రాస్, గౌహతి, మధ్యప్రదేశ్, కలకత్తా, పంజాబ్, హరియాణ, అలహాబాద్, ఒడిశా, ఉత్తరాఖండ్ హైకోర్టులకు కొత్త జడ్జీల పేర్లను కొలీజియం ప్రతిపాదించింది. -
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుభాష్‌రెడ్డి నియామకం
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుభాష్‌రెడ్డిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన రెండు రోజు ల్లోనే రాష్ట్రపతి ఆ సిఫారసులకు ఆమోదం తెలపడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ కుటుంబం నుంచి సుప్రీంకు... జస్టిస్ సుభాష్‌రెడ్డి 1957 జనవరి 5న మెదక్ జిల్లా శంకరంపేట మండలం కమరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశాలాదేవి, జగన్నాథరెడ్డి. శంకరంపేటలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ సాధించి 1980 అక్టోబర్ 30న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ బి. సుభాషణ్‌రెడ్డి వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో వృత్తి నైపుణ్యాన్ని సాధించారు. కళలు, సంగీతంపై మక్కువ చూపే జస్టిస్ సుభాష్‌రెడ్డి... 2001–02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2002 డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన... 2004 జూన్ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2016 ఫిబ్రవరి 13న పదోన్నతిపై గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి న్యాయ నైపుణ్యాన్ని, నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం... ఆయన పేరును సిఫారసు చేస్తూ గత నెల 30న తీర్మానం చేసింది. -
సుప్రీంకు మరో నలుగురు జడ్జీలు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నాలుగు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసులు పంపాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం నిర్ణయించింది. ఆ నలుగురిలో తెలుగు వ్యక్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. సీజేఐ సహా ప్రస్తుత సుప్రీంకోర్టు జడ్జీల్లో ఐదుగురు అత్యంత సీనియర్లు కొలీజియం సభ్యులుగా ఉంటారు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో భేటీ అయిన కొలీజియం.. జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి (ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు సీజే), జస్టిస్ హేమంత్ గుప్తా (మధ్యప్రదేశ్ హైకోర్టు), జస్టిస్ అజయ్ రస్తోగీ (త్రిపుర హైకోర్టు), జస్టిస్ ఎంఆర్ షా (పట్నా హైకోర్టు)లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాల్సిందిగా కేంద్రానికి సిఫారసులు పంపాలని నిర్ణయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య 24కాగా, కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే ఆ సంఖ్య 28కి పెరగనుంది. మెదక్ నుంచి సుప్రీంకోర్టు వరకు.. జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు. 1980ల్లో లాయర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2002 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో ఏపీ హైకోర్టు శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. అక్కడే దాదాపు 12 ఏళ్లు పనిచేశారు. 2016 గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. ఇప్పుడు కేంద్రం కొలీజియం సిఫారసులను ఆమోదిస్తే ఆయన సుప్రీంకోర్టు జడ్జి అవుతారు. -
సీఈసీ, ఈసీల నియామకాలకూ కొలీజియం!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), కమిషనర్ల(ఈసీ) నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థ కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది. పిటిషనర్ తరఫు లాయర్ ప్రశాంత్ భూషణ్, ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ల వాదోపవాదనలు విన్న తరువాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. సామాజిక కార్యకర్త, న్యాయవాది అనూప్ బరన్వాల్ 2015లో ఈ పిల్ వేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే అధికారాలు, పర్యవేక్షణను ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన నిబంధన 324ను సునిశితంగా పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం, రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన అంశాల్ని విచారించే సందర్భంలో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేయొచ్చని ఆర్టికల్ 145(3)ని ప్రస్తావించింది. మరోవైపు, ప్రశాంత్ భూషణ్ వాదనలతో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విభేదించారు. -
సీజేల పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: దేశంలోని ఐదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం కేంద్రానికి సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.హెచ్.పాటిల్‌ను, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీకే గుప్తాను నియమించాలని సూచించింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం.. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను, జస్టిస్ ఏఎస్ బోపన్నను గువాహటి హైకోర్టు సీజేగా, జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్‌ను సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది. బాంబే హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ పాటిల్ పదవీకాలం మరో 7 నెలల్లో ముగియనున్నందున.. ఆయనకు సొంతరాష్ట్రంలోనే పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కొలీజియం తెలిపింది. అలాగే మద్రాస్ హైకోర్టులో అదనపు జడ్జీలుగా ఉన్న జస్టిస్ ఆర్ఎంటీ టికా రామన్, జస్టిస్ ఎన్.సతీశ్ కుమార్, జస్టిస్ ఎన్.శేషసాయిలకు శాశ్వత జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే కర్ణాటక హైకోర్టులో ఏడుగురు అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని తీర్మానించింది. వీరితోపాటు ఇద్దరు న్యాయాధికారులు, ఇద్దరు లాయర్లను కేరళ హైకోర్టులో జడ్జీలుగా నియమించాలంది. -
న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి కొలీజియం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా న్యాయమూర్తుల పోస్టులకు న్యాయవాదుల కోటా నుంచి ఏడుగురిని ఎంపిక చేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వీరి పేర్లను శుక్రవారం సుప్రీం కోర్టుకు పంపనున్నట్లు సమాచారం. కొలీజియం ఎంపిక చేసిన వారిలో సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు (వెలమ), తడకమళ్ల వినోద్‌కుమార్ (బ్రాహ్మణ), బట్టు దేవానంద్ (ఎస్సీ), నైనాల జయసూర్య (కాపు), డి.రమేశ్ (కమ్మ), అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి (రెడ్డి), కూనురు లక్ష్మణ్ (గౌడ్) ఉన్నారు. వీరిలో రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, జయసూర్య, రమేశ్‌లు ఏపీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు తెలంగాణకు చెందిన వారు. వీరితో పాటు జిల్లా జడ్జీల కోటా నుంచి ఏడుగురు న్యాయాధికారులకు సైతం హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాలనీ కొలీజియం నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా, ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. మిగిలిన 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తే మిగిలిన న్యాయమూర్తుల్లో 10 మంది న్యాయమూర్తులు న్యాయాధికారుల కోటా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఖాళీలతో జడ్జీలపై భారం.. దాదాపు 50 శాతం న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులు తీవ్ర పనిభారంతో ఒత్తిడికి గురవుతున్నారు. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడంతో కేసులు విచారణకు నోచుకోక న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బం ది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ఈ అక్టోబర్‌తో ఆ బాధ్యతలు చేపట్టి 3 నెలలు పూర్తయింది. ఈ కాలంలో హైకోర్టు న్యాయవాదుల గురించి ఆయన తగిన అవగాహన తెచ్చుకున్నారు. దీంతో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. కొలీజియంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కలసి న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ వడపోత.. కొలీజియం ఈ నెల 9న ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో సమావేశమై సుదీర్ఘ సమయం పాటు వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పలు సమీకరణల ఆధారంగా ఏడుగురు న్యాయవాదులను ఎం పిక చేసింది. ఈ ఎంపిక గురించి ఆ ఏడుగురికీ తెలియజేసి వారి అంగీకారం కూడా తీసుకుంది. అనంతరం వారి ఆదాయపు పన్ను వివరాలు, వాదించిన కేసులు, లా జర్నల్స్‌లో రిపోర్ట్ అయిన కేసులు తదితర వివరాలను పరిశీలించి వారి పేర్లను సుప్రీం కోర్టుకు పం పాలని నిర్ణయించింది. మరో కాపీ కేంద్రానికి కూడా వెళ్తుంది. ఈ జాబితా లోని వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా కేంద్రం తెప్పించుకుం ది. ఆ వ్యక్తుల ఐబీ నివేదికలను కేంద్రం సుప్రీం కోర్టుకు పంపుతుంది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు తమ ముందున్న జాబితా విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. జాబితా అందుకున్న రెండు నెలల్లోపు కేంద్రం ఐబీ నివేదికలను సుప్రీం కోర్టుకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పంపకపోతే ఆ జాబితా విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు భావించి ఆ జాబితాను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతుంది. -
జస్టిస్ జోసెఫ్‌కే సుప్రీం కొలీజియం మొగ్గు
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కొలీజియం మరోసారి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కేంద్రానికి పంపింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జోసెఫ్ పేరును గతంలో కొలీజియం కేంద్రానికి పంపగా సీనియారిటీ, ప్రాంతీయ సమీకరణాలతో ఆయన పేరును పున:పరిశీలించాలని ప్రభుత్వం వెనక్కి పంపిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ జస్టిస్ జోసెఫ్ బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించినందుకే కేంద్రం ఆయన పేరును పక్కనపెట్టిందని విపక్షాలు విమర్శించాయి. తాజాగా జస్టిస్ జోసెఫ్ పేరునే సుప్రీం కొలీజియం మరోసారి కేంద్రానికి పంపడంతో దీన్ని ఆమోదించడం మినహా ప్రభుత్వానికి మరో అవకాశం లేదు. జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్ పేర్లను కూడా కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. మరోవైపు కలకతా హైకోర్టు జడ్జ్ అనిరుద్ధ బోస్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సును కేంద్రం తోసిపుచ్చుతూ ఆయన పేరును పున:పరిశీలించాలని కొలీజియంను కోరింది. -
నెహ్రూ, ఇందిర హయాంలో జరిగిందేంటి..?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సును కేంద్రం తిప్పిపట్టడంపై వెల్లువెత్తిన విమర్శలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. గతంలో న్యాయమూర్తులపై పెత్తనం చెలాయించిన, తీర్పులను ప్రభావితం చేసిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జస్టిస్ జోసెఫ్ నియామకంపై సిఫార్సును పునఃపరిశీలించాలని కేంద్రం ఆయన పేరును తిప్పిపంపడాన్ని కాంగ్రెస్‌లో కొందరు నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కొన్ని అంశాలపై కేంద్రం తన అభిప్రాయాలను కొలీజియం దృష్టికి తీసుకురావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో న్యాయమూర్తులపై ప్రభుత్వం పెత్తనం చెలాయించిన తీరు, తీర్పులను ప్రభావితం చేయడం, సుప్రీం కోర్టు సూచనలను విస్మరించడం వంటి ఉదంతాలెన్నో జరిగాయని జైట్లీ గుర్తుకుతెచ్చారు. నెహ్రూ, ఇందిర హయాంలలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తుల నియామకంపై చేసిన సిఫార్సులను పెడచెవినపెట్టారని ఫేస్బుక్ పోస్ట్‌లో జైట్లీ పేర్కొన్నారు. -
జస్టిస్ జోసెఫ్ పేరు మళ్లీ కేంద్రానికి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేలా కేంద్రానికి మరోసారి సిఫారసు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారినీ సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు సిఫారసు చేయాలనీ, వారి పేర్లతోపాటే జస్టిస్ జోసెఫ్ పేరును కేంద్రానికి పంపాలని కొలీజియం శుక్రవారం తీర్మానించింది. ఏపీæ–తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, రాజస్తాన్, కలకత్తా హైకోర్టుల న్యాయమూర్తుల పేర్లూ సిఫార్సుచేయొచ్చని సమాచారం. ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై నిర్ణయించేందుకు సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల కొలీజియం మే 16న సాయంత్రం భేటీ కానుంది. ఇదీ నేపథ్యం.. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియమించాలని కొలీజియం ఈ ఏడాది జనవరిలో సిఫారసు చేయగా, కేంద్రం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. సిఫార్సు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం అప్పట్లో సుప్రీం జడ్జీలను కోరింది. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండటానికి అవసరమైన ప్రమాణాలు, అనుభవం జస్టిస్ జోసెఫ్‌కు లేవనీ కొలీజియం సిఫారసును కేంద్రం తిరస్కరించింది. తర్వాత జస్టిస్ జోసెఫ్ విషయంపై చర్చించేందుకు కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ చలమేశ్వర్ సీజేఐకి మే 9న లేఖ రాయగా కొలీజియం శుక్రవారం భేటీ అయ్యి పై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ జోసెఫ్ పేరును తిరస్కరిస్తూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లేవనెత్తిన అన్ని అంశాలతో జస్టిస్ చలమేశ్వర్ విభేదించారు. కొలీజియం సిఫారసులను కేంద్రం ఒకసారి తిరస్కరించాక రెండోసారి కూడా కొలీజియం అదే న్యాయమూర్తి పేరునే సిఫారసు చేస్తే మరోసారి తిరస్కరించే అవకాశం కేంద్రానికి లేదు. కొలీజియం సిఫారసులను ఆమోదించి ఆ వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాల్సిందే. -
కేఎం జోసెఫ్ వైపే కొలీజియం మొగ్గు..!!
-
కేఎం జోసెఫ్ వైపే కొలీజియం మొగ్గు..!!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని కొలీజియం శుక్రవారం తీవ్రంగా చర్చించింది. ఇతర న్యాయమూర్తులతో పాటు కేఎం జోసెఫ్‌ను పేరును మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కొలీజియం నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ మేరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. గంటపాటు తర్జనభర్జనల అనంతరం కొలీజియంలోని ఐదుగురు న్యాయమూర్తులు జోసెఫ్ నియామకంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా, గత నెలలో జోసెఫ్‌ను న్యాయమూర్తిగా తీసుకోవాలనే కొలీజియం సిఫార్సును కేంద్రం తిప్పి పంపిన విషయం తెలిసిందే. -
నేడు కొలీజియం భేటీ!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరోసారి ప్రతిపాదించేందుకు నేడు సుప్రీం కొలీజియం సమావేశం కావచ్చని తెలుస్తోంది. ఈ అంశంపై కొలీజియం సభ్యుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ నేపథ్యంలో నేడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా కొలీజియాన్ని సమావేశపర్చవచ్చని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు అత్యవసరంగా కొలీజియాన్ని సమావేశపర్చాలని కోరుతూ సీజేఐకు సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ జే.చలమేశ్వర్ బుధవారం లేఖ రాశారు. జస్టిస్ జోసెఫ్ పేరును పునఃపరిశీలించాలంటూ కొలీజియా నికి ప్రతిపాదనల్ని ఏప్రిల్ 26న కేంద్రం తిప్పిపంపిన సంగతి తెలిసిందే. గతంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రమాణాలకు ప్రతిపాదనలు అనుగుణంగా లేదని, అత్యున్నత న్యాయవ్యవస్థలో ఇప్పటికే కేరళ నుంచి తగిన ప్రాధాన్యం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సీనియారిటీ జాబితాలో జస్టిస్ జోసెఫ్ కంటే అనేక మంది ముందు వరుసలో ఉన్నారని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘జనవరి 10న జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కొలీజియానికి సిఫార్సు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఆయన పేరును సుప్రీం జడ్జీగా పునరుద్ఘాటిస్తున్నాను’ అని లేఖలో జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ జోసెఫ్‌కు పదోన్నతిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు లేఖలో జస్టిస్ చలమేశ్వర్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చలమేశ్వర్ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా కొలీజియం బుధవారం సమావేశమవుతుందని భావించినప్పటికీ.. జస్టిస్ చలమేశ్వర్ సెలవులో ఉండటం వల్ల జరగలేదని తెలుస్తోంది. కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్లు సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి ప్రతిపాదించేందుకు తాను అనుకూలంగా ఉన్నానని జస్టిస్ జోసెఫ్ కురియన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతిపై నిర్ణయం వాయిదా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించే విషయంపై సుప్రీం కోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్‌కు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం గత వారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కోర్టు కార్యకలాపాలు ముగిసిన అనంతరం సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జస్టిస్ జోసెఫ్ అంశం కాకుండా కొలీజియంఎజెండాలో కలకత్తా, రాజస్తాన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లోని కొందరు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. అయితే నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సమావేశం తీర్మానం కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం కోర్టుకు హాజరుకాని జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అయితే కొలీజియం తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందనే విషయంపై ఎటుంటి అధికారికా ప్రకటనా వెలువడలేదు. -
సుప్రీం కోర్టులోనూ మహిళల పట్ల వివక్ష!
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రాను నియమించాల్సిందిగా సుప్రీం కోర్టు కొలీజియం గురువారం నాడు సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఇలా సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఓ మహిళను నేరుగా అదే కోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడం దేశంలో ఇదే మొదటిసారి. పురుషులైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించిన సందర్భాలు గతంలో ఉన్నాయిగానీ ఓ మహిళా న్యాయవాదిని నియమించడం ఇదే తొలి అవుతుంది. హైకోర్టుల్లో జడ్జీలుగా పనిచేసిన మహిళా న్యాయవాదులే సుప్రీం కోర్టుకు న్యాయవాదులుగా పదోన్నతులై వచ్చారు తప్ప నేరుగా రాలేదు. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సాక్షాత్తు సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాతినిధ్యం లేదంటే ఇక్కడ కూడా మహిళల పట్ల వివక్షత కొనసాగుతోందని అర్థం అవుతోంది. సుప్రీం కోర్టు పాలనా వ్యవహారాలు కూడా సవ్యంగా లేవన్న విషయం శుక్రవారం మధ్యాహ్నం జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో సహా నలుగురు జస్టిస్‌లు వెలుగులోకి తెచ్చారు. సుప్రీం కోర్టు రుజువర్తన నేడు ప్రశ్నార్థకమైందని, సకాలంలో సరైన చర్యలు తీసుకోలేకపోతే వ్యవస్థ మరింత భ్రష్టుపట్టి పోతుందని కూడా వారు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను హెచ్చరించినప్పటికీ ఆయన పట్టించుకోలేదట. ఈ వ్యవస్థ తీరుతెన్నుల గురించి మరిన్ని దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇందూ మల్హోత్రా నియామక సిఫార్సును ఆమోదించినట్లయితే ఆమె సుప్రీం కోర్టుకు ఏడవ మహిళా న్యాయమూర్తి అవుతారు. మొత్తం సుప్రీం కోర్టులోని 27మంది జడ్జీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న రెండవ మహిళా న్యాయమూర్తి అవుతారు. ఆమెతోపాటు జస్టిస్ భానుమతి ప్రస్తుతం సర్వీసులో ఉన్నారు. సుప్రీం కోర్టుకు 1989లో మొదటిసారి ఓ మహిళా న్యాయమూర్తి నియమితులుకాగా, రెండోసారి మరో మహిళా న్యాయమూర్తి 1994లో నియమితులయ్యారు. 1950 నుంచి ఇప్పటి వరకు (సిఫార్సు దశలోనే ఉన్న ఇందూ మల్హోత్రా, మరో న్యాయవాది జస్టిస్ జోసెఫ్‌లు కాకుండా) సుప్రీం కోర్టుకు 229 మంది న్యాయమూర్తులు నియమితులు కాగా, వారిలో ఆరుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మొత్తం నియామకాల్లో మహిళల ప్రాతినిథ్యం రెండు శాతం మాత్రమే. హైకోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం చూసినట్లయితే ఇంతకంటే కాస్త బెటరే. ప్రతిష్టాకరమైన బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాస్ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో మహిళల ప్రాతినిథ్యం దాదాపు పది శాతం ఉంది. దిగువ స్థాయి కోర్టుల్లో మహిళల ప్రాతినిథ్యం 28 శాతం ఉంది. లా చదువుతున్న విద్యార్థుల్లో స్త్రీ, పురుషుల సంఖ్య దాదాపు సమంగానే ఉన్నా, న్యాయవాది వృత్తిలో పది శాతం మహిళలే కొనసాగుతున్నారు. ఫలితంగా వివాహేతర సంబంధాలు, ట్రిపుల్ తలాక్, భార్యలపై బలత్కారం లాంటి మహిళా సంబంధిత అంశాలపై మగవాళ్ల బెంచీలే తీర్పులు వెలువరిస్తున్నాయి. మగవాళ్లు తీర్పుల్లో లింగ వివక్ష చూపిస్తారనికాదు, మహిళల సమస్యల పట్ల వారికే ఎక్కువగా నమ్మకం ఉంటుందన్న అభిప్రాయం ఉంది కనుక. ఇక ముందు అత్యున్నత న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు సుప్రీం కొలీజియం ఎంతో కృషి చేయాల్సి ఉంది. -
అదనపు జడ్జీల పనితీరు మదింపునకు ఓకే
న్యూఢిల్లీ: అదనపు న్యాయమూర్తులను హైకోర్టుల్లో శాశ్వత జడ్జీలుగా నియమించేందుకు పనితీరు మదింపును చేపడతామని సుప్రీం కోర్టు కొలీజియం తెలిపింది. ఈ మేరకు గురువారం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హైకోర్టుల్లో అదనపు జడ్జీలు ఇచ్చిన తీర్పుల్ని ఆయా కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల కమిటీకి నివేదిస్తారని పేర్కొంది. ఈ కమిటీని సీజేఐ జస్టిస్ ఖేహర్ ఏర్పాటు చేస్తారంది. ఈ వివరాలను సుప్రీం తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ఇప్పటివరకు హైకోర్టుల్లో అదనపు జడ్జీల పనితీరును అంచనా వేసేందుకు ‘తీర్పుల మదింపు కమిటీలు’ ఉండేవి. వీటిని రద్దు చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ ఖేహర్ మార్చిలో ప్రకటించగా.. ఈ విషయమై పునరాలోచించాల్సిందిగా సుప్రీంను కేంద్రం కోరింది. దీంతో అత్యున్నత ధర్మాసనం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి నేపథ్యం లేని సామాన్యులైన తొలి తరం లాయర్లు కూడా సుప్రీం కోర్టు జడ్జీలుగా ఎంపికయ్యారని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. సుప్రీంలో జడ్జీల ఎంపికలో వివక్ష పాటిస్తున్నారంటూ సీనియర్ న్యాయవాది ఆర్పీ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యుయు లలిత్‌ల బెంచ్ తిరస్కరించింది. సుప్రీంలో కేవలం రెండే ఖాళీలు ఉన్నప్పుడు వంద మంది వ్యక్తుల నుంచి అత్యంత అర్హులైన ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఇలాంటి సమయంలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చని వెల్లడించింది. -
భారత ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ మంగళవారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీకాలం ఆగస్టు 27తో ముగియనుండటంతో ఆయన స్థానంలో మిశ్రా బాధ్యతలు చేపట్టనున్నారు. ఖేహర్ తర్వాత న్యాయస్ధానంలో అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్ మిశ్రాను కొలిజియం ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మిశ్రా.. ఒడిశా హైకోర్టులో అడిషనల్ జడ్జిగా, మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. -
మీ ప్రతిపాదనలను ఆమోదించలేం..
⇒ జడ్జీల నియామకాల విధివిధానాల మార్పునకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత ⇒ మా సిఫారసును జాతీయ భద్రతా కారణంతో తిరస్కరించలేరు ⇒ ఆధారాలిస్తే మేమే ఆ పని చేస్తాం.. మీకు వీటో అధికారం ఇవ్వలేం ⇒ అలా ఇస్తే రాజకీయ జోక్యం పెరిగిపోతుంది ⇒ ఎంఓపీపై కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఏళ్లతరబడి కొనసాగుతూ వస్తున్న కొన్ని విధివిధానాల్ని మార్చేందుకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చేసిన పలు సూచనలను, ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని కొలీజియం తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా న్యాయ మూర్తుల పోస్టుకు సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరి పేరునైనా జాతీయ భద్రత కారణంతో తిరస్కరించే వెసులుబాటు తమకు కల్పించా లన్న కేంద్ర సూచనను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. అలాగే న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లపై పరిశీలన జరిపేందుకు శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలన్న సూచననూ తిరస్కరిం చింది. న్యాయమూర్తుల మీద వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు కొలీజియంలో సభ్యులు కాని ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదననూ తోసిపుచ్చింది. అయితే న్యాయమూర్తులుగా నియమితులయ్యేవారి వయోపరిమితి విషయంలో మాత్రం కేంద్రం సిఫారసులను ఆమోదించింది. ఈ విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి లేఖద్వారా తెలియచేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ న్యాయమూర్తుల నియామకాల విషయంలో కొలీజియం వ్యవస్థకు స్వస్తి పలికే దిశగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ)ను కేంద్రం తీసుకురావడం, దీనిపై పిటిషన్ దాఖలవగా.. ఎన్‌జేఏసీ చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడం విదితమే. కొలీజియమే న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన విధివిధానాల తాలూకు మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు కేంద్రం ఎంఓపీని తయారుచేసి సుప్రీంకోర్టు కొలీజియం ముందుంచింది. ఈ ఎంఓపీపై కేంద్రానికి, సుప్రీంకోర్టు కొలీజియానికి పలు అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో న్యాయమూర్తుల నియామకాల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకుంది. ఎంఓపీపై జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీజే జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై కేంద్రం చేసిన పలు సూచనలు, ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించింది. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించి తీరాల్సిందే.. న్యాయమూర్తుల పోస్టుకు తాము సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరైనా వ్యక్తి నియామకం జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉందని కేంద్రం భావిస్తే, అందుకు ఆధారాలను తమ ముందుంచితే కొలీజియం వాటిని ఎన్నటికీ పక్కనపెట్టదని తెలిపింది. కానీ జాతీయ భద్రతా కారణంతో కేంద్రం తమ సిఫారసులను వీటో చెప్పడానికి వీల్లేదని కొలీజియం తేల్చిచెప్పింది. ఇందుకు అనుమతినిస్తే న్యాయ నియామక ప్రక్రియ మొత్తం రాజకీయజోక్యంతో నిండిపోతుందని తన అభిప్రాయాన్ని కేంద్రానికి స్పష్టంచేసింది. అలాగే న్యాయమూర్తుల పేర్లపై విచారణ జరిపేందుకు ఎన్నో ఏళ్లనుంచి అనుసరిస్తూ వస్తున్న విధానం సక్రమంగానే ఉందని, అందువల్ల శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు ఎంతమాత్రం అవసరం లేదంది. కొలీజియం తన సిఫారసులను మరోసారి కేంద్రానికి పంపినప్పుడు వాటిని కేంద్రం తప్పనిసరిగా ఆమోదించి తీరాల్సిందేనని కూడా స్పష్టంచేసింది. వయోపరిమితికి పచ్చజెండా.. న్యాయమూర్తుల నియామకాలకు పరిగణనలోకి తీసుకునే న్యాయవాదుల కనీస, గరిష్ట వయస్సుల విషయంలో కేంద్రం ప్రతిపాదనలకు కొలీజియం పచ్చజెండా ఊపింది. కనీసం 45 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉన్న న్యాయవాదినే న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను అంగీకరించింది. జల్లా జడ్జీల కోటా నుంచి న్యాయమూర్తిగా నియమించే వ్యక్తి గరిష్ట వయస్సు 58 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదననూ కొలీజియం ఆమోదిం చింది. ఇప్పుడు దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. -
కొలీజియంకు పార్లమెంటరీ కమిటీ మద్దతు
న్యూఢిల్లీ: జడ్జీల నియామక ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయి దాలో వివాదాస్పద నిబంధనపై న్యాయవ్యవస్థకు పార్లమెంటరీ కమిటీ బాసటగా నిలిచింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం దృష్ట్యా జడ్జి పదవికి అభ్యర్థిని తిరస్కరించే అధికారం ఈ నిబంధన ప్రభుత్వానికి కల్పిస్తోంది. ఈ నిబంధన వీటో అధికారంతో సమానమని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమంటూ న్యాయ, వ్యక్తిగత వ్యవహారాలపై ఏర్పాౖటెన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలపై తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం పేరుతో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల్ని తిరస్కరించాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తమకు అర్థమైందని కమిటీ పేర్కొంది. ఇది న్యాయ వ్యవస్థపై ప్రభుత్వం పెత్తనం చేయడమే అవుతుందని, కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది. -
స్టాక్‌హోమ్ సిండ్రోమ్
అవును, అది జరిగిపోయింది. జడ్జీల నియామకానికి కొల్లీజియం వ్యవస్థ అవతరించింది. అది అత్యున్నత న్యాయస్థానంవారి ముద్దుబిడ్డ! ఆవ్యవస్థను విమర్శించాలన్నా, లోపాలు కనిపెట్టాలన్నా అది వృథా ప్రయాస. ఎందుకంటే దానిమీద అప్పీలుచేసుకునే అవకాశం లేదు. సుప్రీంకోర్టుపైన ఏ కోర్టూ లేదు. ఆ వ్యవహారం అంతటితో ఆగిపోవలసిందే! అందుకోసం అందరూ ఆ వ్యవస్థను అంగీకరించవలసిందేనన్నఅభిప్రాయానికి వచ్చినట్లు కనపడుతున్నది. అది రాజ్యాంగబద్ధంకాదని తెలిసినా చెయ్యగలిగిందేమీలేదు. తప్పదనుకున్నప్పుడు ఒప్పుకుంటే పోతుందిగదా!తప్పులున్నాయనుకుంటే సరిదిద్దుకుని వాడుకోవాలి గాని ఒద్దంటే లాభమేమిటి? చొక్కా చిరిగితే కుట్టుకుని తొడుక్కోవటం లేదూ? కొల్లీజియం విధానంలోపారదర్శకత లేదని విస్మరించలేము. ఆపారదర్శకత ఏవిధంగా సాధించాలో ఆలోచించాలి. అది విజ్ఞులైన పౌరుల లక్షణం. అందుకే న్యాయశాస్త్రపారంగతులు వివిధమార్గాలను ప్రతిపాదిస్తున్నారు. రాజ్యాంగపరంగా తమకున్న హక్కులను హరించిన కొల్లీజియంను ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అన్నిపార్టీలసహకారంతో తాము అంగీకరించి పంపిన న్యాయాధికారుల నియామక చట్టాన్ని కోర్టువారు తమ అధికారాన్ని గుర్తించలేదన్నసాకుతో కొట్టివేస్తే పార్లమెంటుకూడా సరేనని తల ఊపింది. రాజ్యాంగాన్నికాపాడి అనుసరించవలసిన బాధ్యత ఉన్నవారు ఆ రాజ్యాంగాన్ని విస్మరించి, అధిగమించి అధికారాలను చేజిక్కించుకున్నారంటే అర్థమేమిటి? రాజ్యాంగంఉన్నదెందుకు? ప్రజాస్వామ్యమంటే అర్థమేమిటి? ఐనా అన్నివ్యవస్థలుఅందుకంగీకరించిన వంటే మనం ఇప్పుడు స్టాక్‌హోమ్ సిండ్రోమ్ ప్రభావంలోఉన్నామా? అవును, అవి సిండ్రోమ్ ప్రభావ లక్షణాలే! 1973 లో ఇద్దరు సాయుధ దుండగులు స్టాక్‌హోమ్‌లో ఒక బాంకు ని దోచుకోవటానికి ప్రయత్నించారు. అక్కడున్న రక్షక సిబ్బందిని, పోలీసులను కాల్చివేశారు. నిర్భయంగా డబ్బుని దోచుకుని సంచులలో పెట్టుకున్నారు. అంతలో పోలీసు బలగాలు చేరాయి. దుండగులు డబ్బుని ప్రక్కనపెట్టి ఆత్మరక్షణకు తయారయ్యారు. బాంకు ఉద్యోగులను బందీలుగా పట్టుకుని పోలీసులు తమను కాల్చకుండా కాపాడుకున్నారు. నలుగురు ఉద్యోగులను పట్టుకుని వారిమీద తుపాకులు గురిపెట్టి, వారిని స్ట్రాంగ్ రూంలోకి నెట్టిద్వారం దగ్గర నిలుచున్నారు. పోలీసులు వారినేమీ చెయ్యగల స్థితిలోలేరు. ఆపరిస్థితి ఆరురోజులు సాగింది. బందీలు ఎక్కడ ఉన్నారో, ఏస్థితిలో ఉన్నారో తెలుసుకోవటానికి పైకప్పులో రంధ్రం చేసి చూడవలసి వచ్చింది. వారంతా ఒకమూల బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. వారిమీదకు తుపాకులు గురిపెట్టి ఉన్నవి. దుండగులను హతమార్చాలన్న విషయం ప్రక్కనపెట్టి బందీలను సురక్షితంగా బయటకు తేవటం ఎలాగన్న సమస్య పోలీసులకు వచ్చింది. వారికి ఆహారాన్ని అందించటానికి దుండగులు ఒప్పుకున్నారు. ఎదురుగా ఉన్నబందీలతో మాటకలపక తప్పలేదు. దుండగులు ఏక్షణాన్నయినా తమను కాల్చివెయ్యవచ్చునని బందీలకు భయంగానే ఉన్నది. అయినా వారేమీ చెయ్యలేదు. పైగా కబుర్లు చెపుతున్నారు. ఏదో కృతజ్ఞతా భావం తొంగిచూచింది. ఆరవరోజుకి పోలీసుల ప్లాను ఫలించింది. దుండగుల దృష్టి మళ్ళించి వారిమీద దాడిచేసి, ఆయుధాలను వదిలించి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బలప్రయోగం తప్పదుగదా! ఆరురోజులపాటు తమ సహనాన్నిపరీక్షించి, తమ సామర్థ్యాన్ని పరిహసించిన వారిమీద పోలీసులకు కసిగానే ఉంటుంది. ఆస్థితిలో బందీలుగా ఉండి విడుదలైనవారు దుండగుల మీద బలప్రయోగం చెయ్యవద్దని పోలీసులను బ్రతిమాలటం మొదలు పెట్టారు. పోలీసులకు అది అర్థం కాలేదు. తమనుబందీలుగా పట్టుకుని భయపెట్టినవారిపైన బందీలకెందుకింత సానుభూతి? మానసిక శాస్త్రజ్ఞలు దానినే "సిండ్రోమ్" అన్నారు. అది స్టాక్‌హోమ్ లో జరిగింది గనుక "స్టాక్‌హోమ్ సిండ్రోమ్" అన్నారు. ఆవిధమైన సానుభూతి కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనది ఆ పరిస్థితి నుంచి తాము తప్పించుకోలేమన్న నమ్మకం. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ప్రాణాపాయమే జరుగవచ్చు. తరువాత తమను ఏక్షణమైనా నిర్జించగలిగిన దుండగులు తమకు ఏమీ హాని కలిగించకుండా ఉండటం. తమకు కావలసిన కనీస సౌకర్యాలకు లోటులేకుండా చూసుకున్నారు. ఆ కారణంగా వారిమీద సద్భావం కలుగుతుంది. ఆ లక్షణాల సముదాయమే సిండ్రోమ్. ఇప్పుడు మనమంతా ఆవిధమైన లక్షణాలనే ప్రదర్శిస్తున్నామా? పైన చెప్పినట్లుగా, కొల్లీజియం వ్యవస్థను కాదనలేము. అది అత్యున్నత న్యాయస్థానంనిర్ణయం. అది నీకు నచ్చకపోయినా, దానిలో లోపాలున్నా నీవు చెయ్యగలిగిందేమీలేదు. ఒకవేళ దానిని అధిగమించటం కోసం పార్లమెంటు ఏదైనా చట్టం చేసినా, దానిని కోర్టు కొట్టివెయ్యవచ్చు. న్యాయాధికారుల నియామకం చట్టాన్ని ఆవిధంగానే కొట్టివేశారు - కేవలం న్యాయాధికారుల ఆధిక్యతను నిర్ద్వందంగా ఒప్పుకోవటంలేదని ఆకారణంతో ఏ చట్టాన్నైనా కొట్టివెయ్యవచ్చు.అది రాజ్యాంగ విరుద్ధమని ఎవరైనా అనుకోవచ్చు. కాని దానిని కోర్టు సమర్థించేటంత వరకు అది అనుసరణీయమే అవుతుంది. దానిని అంగీకరించవలసిందే, పాటించవలసిందే! ఇన్నిఅధికారాలున్న సుప్రీం కోర్టు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్నివిస్మరించిందని అనలేము. కొల్లీజియం నిర్ణయాలు తీసుకునే పద్ధతిని నిర్వచించేఅవకాశం ప్రభుత్వానికే ఇచ్చారు. నిజానికి కొల్లీజియం ని సృష్టించినన్యాయాధికారులకు ఆమాత్రం చేతగాక కాదు. కాని ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండాచేశారన్న నింద రాకుండా ఉండాలని ఆబాధ్యతను ప్రభుత్వానికి అప్పగించారు.ప్రభుత్వం కూడా ఆమాత్రానికే సంతోషించి విధివిధానాలను రూపొందించింది. కానిఅవేవీ కోర్టువారికి నచ్చలేదు. ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ ప్రతిష్టంభనకు కారణమేమిటి? ఎవరైనా ఒక అబద్ధం ఆడితే, దానిని కప్పిపుచ్చుకోవటానికి పదిఅబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఒకతప్పు చేస్తే, దానిని సమర్థించుకోవటంకోసం ఇంకా పది తప్పులు చెయ్యవలసి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే ఇప్పుడుజరుగుతున్నది. రాజ్యాంగాన్ని రక్షించి పాటించవలసిన వ్యవస్థ దానిని కాదని అతిక్రమించి, అందులోలేని అధికారాలను తమకుతాముగా ఆపాదించుకోవటం మౌలికమైన తప్పు. జడ్జీలనియామకంలో ప్రభుత్వం తప్పులు చేస్తున్నదని ఆ అధికారాన్ని తాములాక్కున్నారు. కాని వారుకూడా మానవ మాత్రులేగదా! అవే తప్పులు వారుకూడా చేస్తున్నారని బయటపడింది. దానిని కప్పిపుచ్చి, రాజ్యాంగసమ్మతం కాని వ్యవస్థను రక్షించటానికి న్యాయ శాస్త్రకోవిదులంతా నడుంకట్టారు. కొల్లీజియం నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలన్నారు. నిజమే. కాని ఏవిధంగా ఆపారదర్శకతను సాధించాలి? అనేదానికి రకరకాల సలహాలు చేస్తున్నారు. జడ్జీల ఖాళీలు ప్రకటించి దరఖాస్తులు స్వీకరించి పారదర్శకంగా ఎన్నుకుని ప్రకటించాలని కొందరు సూచించారు. అంటే న్యాయాధికారులనుగూడా ప్రభుత్వాధికారుల స్థాయికి దించారన్నమాట! అలాకాక కొల్లీజియం లో జరిగే సంప్రతింపులు, తర్జనభర్జనలు బహిరంగం చెయ్యాలన్నారు కొందరు. దరఖాస్తుల పరిశీలనకు అవసరమైన వ్యవస్థ ఏదీ ప్రస్తుతం కోర్టు అధీనంలో లేదుగనుక, అటువంటి కార్యదర్శక వ్యవస్థను స్థాపించి కోర్టు అధీనంలో పెట్టాలని కొందరు సూచించారు. అందులో విశ్రాంత న్యాయాధికారులే ఉండాలని కొందరు సూచించారు. ఏమిటీ సూచనలు? ఎందుకు చేస్తున్నారు? ఎక్కడికి పోతున్నాం మనం? రాజ్యాంగబద్ధం కాని ఒకవ్యవస్థను పటిష్ఠం చెయ్యటం కోసం విజ్ఞులు, న్యాయశాస్త్రవేత్తలు ఈవిధంగా పోటీపడటమేమిటి?పారదర్శకంగా ఉన్నంత మాత్రాన ఏదైనాతప్పు ఒప్పవుతుందా? 1974లో స్టాక్‌హోమ్ సిండ్రోమ్ ప్రభావం చూపే సంఘటన మరొకటి జరిగింది. నిజానికి ఈ సిండ్రోమ్ కి ఎక్కువ ప్రచారం వచ్చింది ఈసంఘటన కారణంగానే! కాలిఫోర్నియా లోపత్రికారంగానికి అధికారులైన కుటుంబానికి వారసురాలైన ఒక అమ్మాయిని -సింబయోనియన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక ఉగ్రవాద సంస్థ అపహరించుకు పోయింది. బందీగా ఉన్న ఆ అమ్మాయికి కావలసిన అన్ని సౌకర్యాలూ అమర్చారు. తోడుగా ఉండటానికి సమవయస్కుడైన ఒక యువకుడి గూడా ఇచ్చారు. దానికి తోడు తమ ఆదర్శాలను వివరించారు. తాము దుండగులం కాదనీ, బీదలకోసం దోపిడీలు చేసి పంచి పెడుతున్నామని వివరించారు. అందుకు ఉదాహరణగా పత్రికాధిపతులను ప్రతిదినము బీదలకు అన్నదానం చెయ్యవలసిందిగా ఆదేశించటాన్ని చూపించారు. ఆ అమ్మాయికి వారిపట్ల సానుభూతి కలిగింది. తరువాత జరిగిన దోపిడీలలో ఆమె కూడా పాలుపంచుకున్నది. అది చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆతరువాత జరిగిన ఒక దోపిడిలో వారిని పట్టుకున్నారు. ఆ అమ్మాయిని కుటుంబానికి అప్పగించారు. అయినా ఆమె తనను అపహరించినవారినే ఆదర్శం గా వాదించేది. కాని కొన్నాళ్ళకు ఆపద్ధతిలోని దుష్ప్రభావాలను గుర్తించి విమర్శించటం మొదలు పెట్టింది. అంటే సిండ్రోమ్ ప్రభావం నుంచి బయటపడిందన్న మాట! ఆవిధంగా బయటపడటం సంభవమేనని సూచించింది. ఒక దుశ్చర్య చేసినవారు తమను సానుభూతితో చూచినంత మాత్రాన ఆ దుశ్చర్యను సమర్థించవలసిన అవసరం లేదని గ్రహించటం సంభవమేనని అవగాహన అయింది. దాదాపు ఇరవైఏళ్ళుపైగా కొల్లీజియం వ్యవస్థ అమలులో ఉన్నది. దానికి అందరూ అలవాటుపడి పోయారు. అది రాజ్యాంగబద్ధమైన విధానం కాదన్న విషయం మరచిపోయారు. కొల్లీజియం లో సభ్యుడైన ఒక న్యాయమూర్తి అందులోని లోపాలను ఎత్తిచూపిన తరువాతగూడా, అందులోని మౌలిక లోపాన్ని గురించి ఆలోచించకుండా దానిని ఏవిధంగా సమర్థించాలనే ఆలోచిస్తున్నారు. అలాకాక, మౌలికలోపాన్ని గుర్తించి, సవరించటానికి ఇది మంచి అవకాశంగా భావించి తగిన చర్యలు తీసుకోవటం అవసరం. అది అత్యున్నతన్యాయస్థాన నిర్ణయం గనుక సవరించేదారిలేదని సందేహించవలసిన అవసరంలేదు. విశ్రాంత న్యాయమూర్తి కె.టి.థామస్ వంటి వారు దారి చూపించారు. జడ్జీలనియామకానికి ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొట్టివెయ్యటం సమంజసం కాదని, ఆనిర్ణయాన్ని సుప్రీం కోర్టు తిరిగి పరిశీలించి సరిదిద్దవచ్చునని సూచించారు. కోర్టువారు అది ప్రతిష్ఠాభంగం అనుకోకుండా ఆసలహాను పాటించి ఈ ప్రతిష్ఠంభన నుంచి, రాజ్యాంగబద్ధం కాని పరిస్థితినుంచి దేశాన్నిరక్షించగలరని ఆశించవచ్చు. ప్రభుత్వము, పార్లమెంటు కూడా తమ రాజ్యాంగబద్ధమైనబాధ్యతలను, అధికారాలను విస్మరించకుండా, సక్రమంగా పాటించటం అవసరం. జాస్తి జవహర్లాల్ -
మరోసారి ‘కొలీజియం’
జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం, అందుకు సంబంధిం చిన 99వ రాజ్యాంగ సవరణ చెల్లవంటూ సుప్రీంకోర్టు నిరుడు అక్టోబర్‌లో మెజారిటీ తీర్పు వెలువరించాక దాదాపు కనుమరుగవుతుందనుకున్న కొలీజియం చర్చ కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కొలీజియం సభ్యుడు అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కొలీజియం సమావేశంలో పాల్గొనడానికి నిరాకరిం చడం ప్రస్తుత చర్చకు ప్రధాన కారణం. న్యాయమూర్తుల నియామకం, బదిలీ ప్రక్రియల్లో పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌కు ఆయన లేఖ రాశారని వెలువడి కథనాలు సంచలనం కలిగిం చాయి. కొలీజియం సమావేశాల మినిట్స్‌ని నమోదు చేయాలని, అంతవరకూ తాను అందులో పాల్గొనలేనని కూడా ఆయన ఆ లేఖలో చెప్పారు. కొలీజియంకు సంబంధించి ఆయన అభిప్రాయమేమిటో నిరుడు మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ జస్టిస్ చలమేశ్వర్ విడిగా ఇచ్చిన తీర్పులోనే వెల్లడైంది. అయితే ఇప్పుడాయన నిర్దిష్టంగా కొలీజియం సమావేశాల తీరును, అందులో పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నించారు. అంతేకాదు... కొలీజియంలో జస్టిస్ ఠాకూర్‌తోసహా మిగిలిన నలు గురు న్యాయమూర్తుల అభిప్రాయాలు తన వద్దకు వస్తే తన అభిప్రాయాన్ని కూడా చేరుస్తానని తెలియజేశారు. ఇలా అనడం ద్వారా కొలీజియం సభ్యుల అభిప్రా యాలు లిఖితపూర్వకంగా ఉండాలన్న తన మనోగతాన్ని ఆయన విస్పష్టంగా చెప్పినట్టయింది. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించుకుంటామని జస్టిస్ ఠాకూర్ చెప్పారుగానీ అదంత సులభమేమీ కాదు. కొలీజియం పని తీరుపై అసంతృప్తి కొత్తగాదు. న్యాయ వ్యవస్థలో పనిచేసిన వారినుంచే అలాంటి అభిప్రాయాలు లోగడ కూడా వ్యక్తమయ్యాయి. ఇరవైయ్యేళ్ల క్రితం కొలీజియం విధానం ఏర్పడటానికి ఆద్యుడైన జస్టిస్ జేఎస్ వర్మ అది సరిగా పని చేయడంలేదని అనంతరకాలంలో భావించారు. జస్టిస్ మార్కండేయ కట్జూ, జస్టిస్ కె జి బాలకృష్ణన్ వంటివారు కూడా అలానే అనుకుంటున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తులుగానో, న్యాయమూర్తులుగానో పని చేసి రిటైరయ్యాకే వీరంతా కొలీజియం గురించి విమర్శించారు. పదవుల్లో ఉండగా ఆ పని చేయలేదు. పైగా ఈ విధానంలో కొందరు అనర్హులు న్యాయమూర్తులు కాగలిగారని ఆరోపిం చారు తప్ప ఆ కొలీజియం పనితీరు ఎలా ఉంటున్నదో వెల్లడించలేదు. అందువల్లే జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాసిన లేఖ అంత సంచలనం కలిగించింది. వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండటం, కొన్నిచోట్ల ప్రధాన న్యాయమూర్తులు లేకపోవడం ఈ మధ్యకాలంలో బాగా చర్చనీయాంశమైంది. ఎన్‌జేఏసీ చట్టాన్ని, రాజ్యాంగ సవరణను కొట్టేసి పది నెలలు గడుస్తున్నా కొలీ జియం విధానానికి అనుగుణంగా న్యాయమూర్తుల నియామకం జరగకపోవడంపై ఇటీవల జస్టిస్ ఠాకూర్ ఒకటి రెండు సందర్భాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మార్చిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ సదస్సు జరిగినప్పుడు జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే ఆయన కంటతడి పెట్టారు. న్యాయమూర్తుల కొరతపై దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించవద్దని కూడా హెచ్చ రించారు. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీ ప్రసంగం పూర్తయ్యాక అందులో జడ్జీల నియామకం ప్రస్తావన లేకపోవడాన్ని జస్టిస్ ఠాకూర్ ఎత్తి చూపారు. నియామకాలు పూర్తయి కేసుల పెండింగ్ సమస్య తీరాలన్న ఆయన ఆత్రుతను ఇవన్నీ తెలియజేస్తున్నాయి. కొలీజియం విధానానికి అనుగుణంగా కేంద్రం విధాన పత్రం(ఎంఓపీ) విడుదల చేయకపోవడమే నియామకాలకు ఇప్పు డున్న అడ్డంకి. ఇలాంటి దశలో జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాశారు. కొందరంటున్నట్టు ఈ లేఖ వల్ల జడ్జీల నియామకం అంశం మరింత జటిలం అయి ఉండొచ్చు. న్యాయవ్యవస్థ వైపు వినవస్తున్న వాదన బలహీనపడి ఉండొచ్చు. అయితే ఆయన ఎత్తి చూపిన అంశాలు సాధారణమైనవేమీ కాదు. కొలీజియం వ్యవస్థే అన్నివిధాలా అత్యుత్తమైనదని భావించినప్పుడు అది అందుకు తగ్గట్టుగా ఉండాలి. ఎంఓపీ విషయంలో కేంద్రానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య ప్రధానంగా రెండు అంశాలపై తీవ్ర విభేదాలున్నాయి. కొలీజియం సమావేశాల మినిట్స్ నమోదు చేయాలన్నది అందులో మొదటిది కాగా, అసమ్మతి వ్యక్తంచేసిన న్యాయ మూర్తి అభిప్రాయాన్ని కూడా అందులో చేర్చాలని కేంద్రం పట్టుబడుతోంది. ఒకరకంగా జస్టిస్ చలమేశ్వర్ లేఖ సైతం దాన్నే సూచిస్తున్నది. ఈ రెండు అంశాలూ న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ మరింత ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఉండేందుకు దోహదం చేస్తాయి తప్ప దానికి విఘాతం కలిగించవు. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీయవు. అలాంటప్పుడు న్యాయ వ్యవస్థకు అభ్యంతరం ఉండవలసిన అవసరమేమిటో సామాన్యులకు బోధ పడదు. ఇంతకు ముందు సంగతేమోగానీ... న్యాయమూర్తుల నియామకాలు, బది లీల ప్రక్రియకు సంబంధించిన రికార్డు ఉండదని జస్టిస్ చలమేశ్వర్ లేఖ తర్వాత స్పష్టమైంది. జడ్జీల నియామకంలో వివిధ దేశాల్లో వేర్వేరు విధానాలున్నాయి. బ్రిటన్‌లో స్వతంత్రంగా పనిచేసే న్యాయ నియామకాల కమిషన్ ఉంటుంది. దాని సిఫార్సులను పునఃపరిశీలించమని కోరవచ్చు. లేదా తిరస్కరించవచ్చు. అమె రికాలో అయితే సెనేట్‌లో చర్చిస్తారు. జాబితాలోని వారిని పిలుస్తారు. లోతుగా ప్రశ్నిస్తారు. అభ్యర్థుల మంచి చెడ్డల గురించి బహిరంగ చర్చ జరుగుతుంది. ఇవన్నీ అయ్యాకే తుది నిర్ణయం ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లోనే కావొచ్చుగానీ మన దేశంలో న్యాయమూర్తులపై ఆరోపణలు రావడం, అవి అభి శంసన వరకూ వెళ్లడం గతంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఎటూ కొలీజియం వ్యవస్థే అమల్లో ఉంటుంది. జస్టిస్ చలమేశ్వర్ లేఖ నేపథ్యంలో దాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా రూపొందించాల్సిన అవసరం ఉన్నదని గుర్తిం చడం మంచిది. -
ఆ వివాదం సమసిపోతుంది
కొలీజియంపై సీజేఐ ఠాకూర్ న్యూఢిల్లీ: కొలీజియం సమావేశాల్లో పాల్గొనడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిరాకరించడంతో తలెత్తిన వివాదం సమసిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ అభిప్రా యపడ్డారు. శనివారం ఢిల్లీలో నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఠాకూర్ పైవిధంగా స్పందించారు. తాము ఆ సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత లేదంటూ గురువారం కొలీజియం సమావేశానికి చలమేశ్వర్ గైర్హాజరయ్యారు. దీంతో సమావేశం వాయిదా పడింది. కొలీజియంలో ఠాకూర్‌తో పాటు జస్టిస్ దవే, జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ దీపక్, జస్టిస్ చలమేశ్వర్ సభ్యులు. న్యాయవిద్య మారాలి: జస్టిస్ చలమేశ్వర్ మారుతున్న న్యాయ అవసరాలకు అనుగుణంగా న్యాయ విద్యలో మార్పులు రావాలని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కొలీజియం సమావేశానికి గైర్హాజరుపై మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి ఆయన నిరాకరించారు. అయితే న్యాయమూర్తుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. కేవలం ఇద్దరు వ్యక్తులే న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేస్తారని.. సమావేశంలో వాటికి ఓకేనా కాదా అని మాత్రమే అడుగుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తిని ఎంపిక చేసే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. -
కొలీజియంలో న్యాయమంత్రి ఉంటే తప్పేంటి?
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకం కోసం రూపొందిస్తున్న కొలీజియం వ్యవస్థలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని చేర్చటం వల్ల న్యాయ స్వతంత్రతకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో న్యాయవ్యవస్థపై జరిగిన ఓ కార్యక్రమంలో.. మాజీ న్యాయశాఖ మంత్రి కూడా అయిన శాంతి భూషణ్ మాట్లాడుతూ.. ‘కొలీజియంలో న్యాయమంత్రిని చేర్చటం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు. ఐదుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులున్న కొలీజియంలో మంత్రి ఒక్కడే ఏం చేయగలరు? మీ ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఆయనకుంటుందా? దీని వల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని నేననుకోవటం లేదు’ అని అన్నారు. 1950-60 నాటి రాజకీయ నాయకులు ఇప్పుడు లేరని.. అందువల్ల న్యాయవ్యవస్థే పలు అంశాల్లో బాధ్యత తీసుకోవాలని శాంతి భూషణ్ సూచించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉన్నత వర్గానికి చెందిన వారుండటం వల్ల మిగిలిన వెనకబడిన, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగటం లేదని జాతీయ జ్యుడిషియల్ అకాడమీ మాజీ డెరైక్టర్ మోహన్ గోపాల్ అన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత లోపిస్తోందని సీపీఐ నేత నీలోత్పల్ బసు అభిప్రాయపడ్డారు. -
ఇది పద్ధతి కాదు!
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టులకు జడ్జీల నియామకం, బదిలీలపై కొలీజియం తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అమలు చేయకపోవడంపై సుప్రీం కోర్టు మండిపడింది. దీనివల్ల న్యాయవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా స్పందించకపోతే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. న్యాయసేవలకు ఆటంకం కలిగేలా జడ్జీల నియామకంలో ప్రతిష్టంభన సహించేది లేదని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ ఠాకూర్... కొలీజియంకు కూడా నేతృత్వం వహిస్తున్నారు. 8 నెలల కిందటి నిర్ణయం... దేశంలోని 24 హైకోర్టుల్లో 478 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, వాటిల్లో 39లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని రాజ్యసభకు ప్రభుత్వం తెలపడంపై బెంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. 8 నెలల కిందట తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ ఆచరణలో పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. జడ్జీల నియామకానికి సంబంధించిన మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)లో న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్యనున్న భిన్నాభిప్రాయాలను సాకుగా చూపి ఖాళీల భర్తీ ప్రక్రియను పక్కన పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ‘ఎందుకీ జాప్యం? ఎందుకంత అపనమ్మకం? కొలీజియం 75 మంది పేర్లను ప్రతిపాదించింది. కానీ కేంద్రం నేటికీ స్పందించలేదు. హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల నియామకమూ పెండింగ్‌లోనే ఉంది. బదిలీలు లేవు. బదిలీ అయినవారూ కదల్లేదు. ఒకవేళ జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వారి పేర్లను కొలీజియానికి పంపండి, పునఃపరిశీలిస్తాం. జాప్యాన్ని సహించం’ అని తేల్చి చెప్పింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భాన్ని ప్రస్తావించిన జస్టిస్ ఠాకూర్... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం 40% సిబ్బందితోనే పనిచేస్తోందన్నారు. విచారణలో తీవ్ర జాప్యం వల్ల 13-14 ఏళ్ల నుంచి బాధితులు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. ఈ అంశంపై 4 వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏజీని ఆదేశించింది. కోర్టుల్లో అనేక కేసులు విచారణకు నోచుకోవడం లేదని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ మాజీ సైన్యాధికారి కల్నల్ అనిల్ కబోత్రా వేసిన పిల్‌ను కోర్టు విచారించింది. -
జడ్జీల నియామకంలో జాప్యంపై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ: కొలీజియం ఖరారు చేసిన హైకోర్టు జడ్జీల నియామకం, బదిలీల సిఫారసులు అమలుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం అసహనం వ్యక్తం చేసింది. కొలీజియం ఖరారు చేసిన 75 మంది హైకోర్టు జడ్జీల నియామకంపై ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేదని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. 1971 యుద్ధ సమయంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పనిచేసిన అనిల్ కబోత్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టుల్లో దాదాపు 43 శాతం జడ్జీల కొరత ఉందని, హైకోర్టుల్లో మొత్తం 40 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. దీనివల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోతోందని ఠాకూర్ అన్నారు. -
‘సుప్రీం’ తీర్పులతో తిప్పికొడతాం
కొలీజియం అభ్యంతరాలపై కేంద్రం న్యూఢిల్లీ: జడ్జీ నియామకాలకు సంబంధించిన ముసాయిదా విధివిధానాల పత్రంపై కొలీజియం సిఫారసును జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికపై తిరస్కరించే హక్కును ప్రశ్నించటంతో పాటు కొలీజియం వ్యక్తంచేసిన అభ్యంతరాలను తిప్పికొట్టేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరించాలని కేంద్రం నిర్ణయించింది. సుప్రీం 1993, 1998, 2015లో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తమ వాదనలన్నీ ఉంటాయని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు, 24 హైకోర్టులకు జడ్జీల నియామకానికి మార్గదర్శనం చేసే సవరించిన విధివిధానాల ముసాయిదా పత్రంలో కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని సూచిస్తూ కొలీజియం గత నెల కేంద్రానికి తిప్పి పంపింది. ఏదైనా నియామకానికి సంబంధించి సుప్రీం పునరుద్ఘాటించినట్లయితే ప్రభుత్వం మర్యాదపూర్వకంగా దానిని ఆమోదిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఆ కేసులను మర్యాదపూర్వకంగా ఆమోదిస్తాం. అంతే కానీ సుప్రీం మమ్మల్ని ఆదేశించినట్లు కాదు. ఈ విషయాన్ని సుప్రీం తీర్పుల్లోనే స్పష్టంచేయటం జరిగింది. వాటి ప్రాతిపదికగానే కొలీజియం మనుగడలోకి వచ్చింది’ అని ప్రభుత్వ ప్రతినిధి ఒకరన్నారు. పత్రంలోని కీలక అంశాలను కొలీజియం తిరస్కరించటంపై న్యాయ మంత్రి డి.వి.సదానందగౌడను ప్రశ్నించగా.. ఆ విషయం ఇంకా పరిశీలనలో ఉందన్నారు. -
కొలీజియం రాకతో కొలువుల మేళా!
న్యూఢిల్లీ: నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రద్దయి దాని స్థానంలో తిరిగి కొలీజియం వ్యవస్థ రానున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో ఆయా రాష్ట్రాల్లోని ఖాళీగా ఉన్న ప్రధాన న్యాయమూర్తుల స్థానాలు భర్తీ కానున్నాయి. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు ప్రధాన న్యాయమూర్తులతోపాటు 400మంది ఇతర కోర్టు సిబ్బంది తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ సేకరించిన సమాచారం ద్వారా వెల్లడైంది. గత శుక్రవారం ఎన్ జేఏసీ ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకం అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆ తీర్పుతో ఎన్ జేఏసీని రద్దయింది. దీంతో తిరిగి ఆరు నెలల తర్వాత మరోసారి కొలీజియం వ్యవస్థ అమల్లోకి వస్తుంది. కాగా, కేంద్ర న్యాయశాఖ అక్టోబర్ 1 వరకు దేశంలోని ఆయా రాష్ట్రాల్లోని ఖాళీల వివరాలను సేకరించింది. దాని ప్రకారం మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 24 కోర్టులకు కలిపి 1017మంది న్యాయమూర్తులు అవసరం ఉండగా 611మందితోనే నడుస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బొంబే, పాట్నా, కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, గువాహటి, రాజస్థాన్ కు చెందిన కోర్టులు మాత్రమే ప్రధాన న్యాయమూర్తులతో నడుస్తున్నాయని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. -
కొలీజియం పారదర్శకత ఎంత?: కేంద్రం
న్యూఢిల్లీ: ఎన్‌జేఏసీని సుప్రీం కోర్టు కొట్టేయటంపై కేంద్రం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొలీజియం పారదర్శకతపై సందేహాలు వ్యక్తం చేసింది. కొలీజియం పనితీరు సరిగా లేనందునే కొత్త చట్టాన్ని రూపొంచిందించామని.. న్యాయవస్థ గౌరవం ఏమాత్రం తగ్గకుండా కొత్త బిల్లును రూపొందించినా.. దీన్ని తిరస్కరించటం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నవంబర్ 3 తర్వాత కొలీజియం వ్యవస్థలో మార్పులకు సంబంధించిన వాదనలు వింటామని కోర్టు చెప్పటం.. వ్యవస్థలో తప్పులను ఒప్పుకున్నట్లేనన్నారు. సుప్రీం తీర్పు భారతదేశ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నించేలా ఉందని న్యాయ మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. తీర్పు ఆశ్చర్యం కలిగించిందని మరో మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. అయితే.. కొలీజియం వ్యవస్థపై అనుమానాలున్నందునే పార్లమెంటులో ఎన్‌జేఏసీకి మద్దతు తెలిపామన్నారు. కొలీజియం స్థానంలో ఎన్‌జేఏసీ ఏర్పాటు అవసరమని వామపక్షాలు అన్నాయి. పాత వ్యవస్థ పనితీరుపై అనుమానాలున్నందునే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా తెలిపారు. కింకర్తవ్యం! న్యూఢిల్లీ: సుప్రీం తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యచరణ ఎలా ఉండాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి కీలకమైన ఈ చట్టంపై అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి. కొలీజియాన్ని మెరుగుపర్చేందుకు తదుపరి విచారణ కొనసాగించాలని సుప్రీం నిర్ణయించడంతో..ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వవాదనను మళ్లీ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కొలీజియాన్ని కొనసాగిస్తూనే, న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతినకుండా దాన్ని మెరుగుపర్చేందుకు కొన్ని మార్పులను సూచించే అవకాశం ఉంది. -
ఎన్‌జేఏసీ చెల్లదు
అది రాజ్యాంగవిరుద్ధం; ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నాం: సుప్రీం రాజ్యాంగ మౌలిక స్వరూపానికది విరుద్ధం * ఆ చట్టంతో రాజ్యాంగంలోని అధికార విభజన నిబంధనల ఉల్లంఘన * మళ్లీ అమల్లోకి కొలీజియం; కోర్టు సంచలన తీర్పు * ఎన్‌జేఏసీని సమర్థించిన జస్టిస్ చలమేశ్వర్.. కానీ, మెజారిటీకే మొగ్గు.. * విచారణను విస్తృత బెంచ్‌కి నివేదించాలన్న కేంద్రం అభ్యర్థన తిరస్కరణ న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ. మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ న్యాయ నియామకాల సంస్థ(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్-ఎన్‌జేఏసీ) చెల్లనేరదంటూ శుక్రవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2014లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన ఎన్‌జేఏసీ చట్టం, సంబంధిత 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థకు మళ్లీ ప్రాణప్రతిష్ట చేసింది. ‘రాజ్యాంగ(99వ సవరణ) చట్టం-2014 రాజ్యాంగ విరుద్ధం. అది చెల్లనేరదు. అలాగే, ఎన్‌జేఏసీ కూడా రాజ్యాంగ విరుద్ధమని, చెల్లనేరదని ప్రకటిస్తున్నాం. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి ఈ చట్టాల కన్నాముందు నాటి వ్యవస్థ(కొలీజియం)నే అమల్లో ఉంటుంది’ అని తీర్పునిచ్చింది. విచారణను మరింత విస్తృత ధర్మాసనం మందుకు తీసుకువెళ్లాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన 99వ రాజ్యాంగ సవరణ చట్టం, తదనుగుణంగా వచ్చిన ఎన్‌జేఏసీ చట్టం.. ఈ రెండూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మారుస్తున్నాయంటూ వాటి రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం ధర్మాసనం పై తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య పోరు మరో ఆసక్తికర మలుపు తీసుకుంది. తీర్పుపై రాజకీయ, న్యాయ, ప్రభుత్వ రంగాల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ఈ తీర్పు తనను విస్మయానికి గురిచేసిందన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ.. దీనిపై ప్రధాని మోదీ, ఇతర కేబినెట్ సహచరులతో చర్చించిన అనంతరం ప్రభుత్వపరంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. కొలీజియం అనేది అసలు రాజ్యాంగంలో లేనేలేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యానించారు. ఎన్‌జేఏసీ చట్టాన్ని రద్దు చేస్తూ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సభ్యులుగా ఉన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ 1,030 పేజీలతో తుది తీర్పునిచ్చింది. జస్టిస్ చలమేశ్వర్ మాత్రం మిగతా నలుగురితో విభేదించి, 99వ సవరణ చట్టబద్ధతను సమర్థించారు. కానీ మెజారిటీ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంచ్ తుది తీర్పుకు కట్టుబడి ఉన్నారు. ఈ అంశాన్ని 9 లేక 11 మంది సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను, గతంలో వచ్చిన ‘రెండో జడ్జీల కేసు(1993), మూడో జడ్జీల కేసు(1998)’లను పునః సమీక్షించాలన్న అభ్యర్థనను కూడా బెంచ్ తిరస్కరించింది. కొలీజియాన్ని మరింత మెరుగుపర్చే సూచనలు స్వీకరించేందుకు ఉద్దేశించిన విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.కొలీజియాన్ని సమర్థంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని, సీనియర్ లాయర్లను జస్టిస్ ఖేహర్ కోరారు. ఎన్‌జేఏసీలో ఇద్దరు ప్రముఖులకు స్థానం కల్పించడం రాజ్యాంగవిరుద్ధమని, రాజ్యాంగ మౌలిక స్వరూపానికే అది వ్యతిరేకమని ఆయన తీర్పులో పేర్కొన్నారు. ‘జడ్జీల నియామక అధికారాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా కార్యనిర్వాహక వర్గం లేదా ప్రభుత్వానికి అప్పజెప్పడం ప్రమాదకరమని రాజ్యాంగ పరిషత్‌లో అంబేద్కర్ చేసిన హెచ్చరికను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 124, 217 అధికరణాల్లో పేర్కొన్న ‘సంప్రదింపులు’ అనే పదం కార్యానిర్వాహక వర్గ అధికారాల కుదింపునకు ఉద్దేశించినదేనని వివరించారు. తమకున్న వీటో అధికారంతో, ఎలాంటి కారణం చూపకుండానే ఆ ఇద్దరిలో ఎవరైనా నియామక ప్రక్రియను అడ్డుకునే అవకాశముందని జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అది ఎలాంటి జవాబుదారీతనం లేని అధికారం’ అని వ్యాఖ్యానించారు. ఖేహర్ భావోద్వేగం.. తీర్పు వెలువరించేముందు జస్టిస్ ఖేహర్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈ కేసు విచారణలో సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ ఐదుగురు సభ్యుల బెంచ్‌లో భాగం పంచుకోవాలన్న నిర్ణయం హృదయంతో కాదు.. ఆలోచనతో తీసుకున్నది. అది నేను నా సొంత నిర్ణయం’ అన్నారు. గతంలో అమల్లో ఉన్న కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందువల్ల, ఎన్‌జేఏసీ అమల్లోకి వస్తే అందులోనూ భాగం పంచుకునే అవకాశమున్నందువల్ల ఈ విచారణలో పాలుపంచుకోకూడదన్న విషయంపై ఖేహర్ స్పందించారు. ఖాళీలే... ఖాళీలు ఎన్‌జేఏసీ ద్వారా నియామకాలు చేపట్టొద్దని ఈ ఏడాది ఏప్రిల్ 23న కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ఆరునెలలుగా కొత్త జడ్జీ నియామకాల్లేవు. రిటైరయ్యే వారు మాత్రం రిటైరైపోయారు. దాంతో వివిధ హైకోర్టుల్లో ఖాళీలు విపరీతంగా పెరిగిపోయాయి. కేంద్ర న్యాయశాఖ లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నాటికి ఉన్న ఖాళీలివి... సుప్రీంకోర్టు 3 హైకోర్టులు 406 చక్రవర్తుల్లా అధికారమిస్తోంది ‘‘ఎన్‌జేఏసీలో నియమితులయ్యే ఇద్దరు ప్రముఖులకు వీటో అధికారాన్ని కల్పించడం... వారికి చక్రవర్తుల్లా అపరిమిత అధికారాలను కట్టబెట్టడమే. ప్రజాజీవితంలో ఏ రంగంలో నుంచి వచ్చిన ప్రముఖులతోనైనా సంప్రదింపులు జరపడానికి అభ్యంతరమేమీ లేదు. అయితే జడ్జీల నియామకాలకు సంబంధించి... రాష్ట్రపతి లేదా భారత ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలను కూడా వారు వీటో చేయగలరనేదే మింగుడుపడటం లేదు. అపరిమిత అధికారాలను ఎన్‌జేఏసీ చట్టం వీరికి కట్టబెడుతోంది. పైగా ఎలాంటి జవాబుదారీతనం లేకుండా. ఏదైనా నియామకాన్ని వీటో ద్వారా అడ్డుకున్నపుడు... దానికి వీరు కారణం కూడా చెప్పనక్కర్లేదు (ఎన్జేఏసీలోని ఆరుగురు సభ్యుల్లో ఏ ఇద్దరు వీటో చేసినా నియామకం ఆగిపోతుంది). నామినేట్ అయ్యే ప్రముఖ వ్యక్తులను కూడా కొన్ని వర్గాల నుంచే ఎంపిక చేయాలని పరిమితం చేయడం సబబు కాదు. అయితే ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి దానిపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేం. అయితే పునరాలోచన చేయాలని మాత్రం చెప్పగలం’’ - సుప్రీం ధర్మాసనం కొలీజియం పారదర్శకమే: జస్టిస్ ఖేహర్ ‘‘కొలీజియంలో రహస్యం ఏమీ లేదు. అంతా పారదర్శకంగానే ఉంటుంది. న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వర్గం మధ్య సంప్రదింపులు బహిరంగంగానే జరుగుతాయి. నియామకాలకు సంబంధించి ఇరువర్గాల మధ్య సౌహార్ద్రత ఉంది. ఎన్‌జేఏసీలో న్యాయవ్యవస్థకు సరైన ప్రాతినిధ్యం లేదు. అది న్యాయవ్యవస్థ సర్వోత్కృష్టతను నిలబెట్టేలా లేదు. ఇది జ్యుడీషియరీ స్వతంత్రతకు వ్యతిరేకమే. కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఎన్‌జేఏసీలో సభ్యుడిగా చేర్చడం రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల విభజన నిబంధనలను ఉల్లంఘించడమే. ఎన్‌జేఏసీలో ఇద్దరు ప్రముఖులకు స్థానం కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. రాజ్యాంగంలో చేర్చిన 124(ఏ) అధికరణలో అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయి’’ ప్రాథమిక బాధ్యతకే ఎసరు: జస్టిస్ గోయెల్ భారత రాజ్యాంగం ప్రకారం జడ్జిల నియామక బాధ్యత న్యాయవ్యవస్థది. దీనికి 99వ రాజ్యాంగ సవరణ ఎసరు తెస్తోంది కనుక ఇది చెల్లదు. ఎన్‌జేఏసీ ఏర్పాటుకు భూమిక అయిన 99వ రాజ్యాంగ సవరణే చెల్లనపుడు, ఎన్‌జేఏసీ చట్టం రాజ్యాంగబద్ధతను సమీక్షించాల్సిన అవసరం ఉందని నేననుకోవడం లేదు. న్యాయ మంత్రికి సీజేఐతో సమానపాత్ర కల్పించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటిదెప్పుడూ లేదు. జడ్జిల నియామక ప్రక్రియ ప్రారంభం నుంచి, ఉత్తర్వులు ఇచ్చే దాకా న్యాయమంత్రి పాత్ర పరిమితంగానే ఉండేది. న్యాయమంత్రి, ఇద్దరు నామినేటెడ్ సభ్యులు జడ్జిల నియామకాలను తీవ్రంగా ప్రభావితం చేయగలుగుతారు. అలాంటపుడు న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం పడుతుంది. రాష్ట్రపతిని డమ్మీని చేస్తుంది: జస్టిస్ లోకుర్ జడ్జీల నియామకాల్లో రాష్ట్రపతి పాత్రను ఎన్‌జేఏసీ నామమాత్రం చేస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తికి రాజ్యాంగమిచ్చిన ప్రాధాన్యతను తగ్గిస్తుంది. ఎన్‌జేఏసీలో ఆరుగురు సభ్యుల్లో ఒకరిగా సీజే మారిపోతారు. రాష్ట్రపతి సీజేల మధ్య ప్రత్యక్ష సంప్రదింపులు ఉండవు. ఎన్‌జేఏసీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత సంక్షోభంలో పడుతుంది. ఎంపిక ప్రక్రియలో సీజేఐ ప్రాధాన్యత తగ్గిపోతుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి 99వ రాజ్యాంగ సవరణ చెల్లదు. కొలీజియం వ్యవస్థను మరింత మెరుగ్గా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు సలహాలు, సూచనలు స్వీకరించడానికి తదుపరి విచారణ జరగాలి. కొలీజియం మెరుగవ్వాలి: జస్టిస్ జోసెఫ్ కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయి. నమ్మకం సడలడం వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఇది మెరుగుపడాలి. అర్హులైన వారిపై శీతకన్ను వేశారని, ఎవరి ప్రయోజనాల కోసమే... మరొకరి నియామకాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆరోగ్యకరమైన వ్యవస్థ అయితే లేదు. అందువల్ల దీన్ని మెరుగుపర్చడానికి తదుపరి విచారణ అవసరం. 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగవిరుద్ధం. దీని ద్వారా ఏర్పడిన ఎన్‌జేఏసీ చట్టపరంగా ఉనికిలో లేదు. ఇంకా పుట్టని బిడ్డ జాతాకాన్ని రాయడమెందుకు. పారదర్శకత లేదు: జస్టిస్ చలమేశ్వర్ ‘‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదు. ఆ ప్రక్రియలో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. రాజ్యాంగబద్ధ పాలనలో పారదర్శకత అత్యంతావశ్యక అంశం. న్యాయమూర్తుల నియామకమనేది న్యాయవ్యవస్థకున్న విశేష అధికారం అని, అది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని ఉన్న భావన పూర్తిగా తప్పు. గత 20 ఏళ్లుగా హైకోర్టు కొలిజియాలు ఇచ్చిన అనేక సిఫారసులను సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది. ఇందులో జవాబుదారీతనం లేదు. దీనివల్ల జ్యుడీషియరీ విశ్వసనీయత దెబ్బతింటుంది. జడ్జీల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గం పాలు పంచుకోవడం మంచిదే. అది ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా. ఈ కారణాల వల్ల 99 వ రాజ్యాంగ సవరణను నేను సమర్ధిస్తున్నాను. అయితే, మెజారిటీ జడ్జీల నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పును ఆమోదిస్తున్నాను. 99వ రాజ్యాంగ సవరణే అక్రమమని తేల్చిన తరువాత.. దాని పర్యవసానంగా ఉద్భవించిన ఎన్‌జేఏసీ చట్టం రాజ్యాంగబద్ధతపై చర్చించడం శుద్ధ దండుగ. ఇంకాపుట్టని పాపాయికి జాతక చక్రం రాయడమెందుకు?’’ కొలీజియం అంటే.. * రెండో జడ్జీల కేసు, మూడో జడ్జీల కేసుల పర్యవసానంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి 1993లో కొలీజియం అమల్లోకి వచ్చింది. * కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ), సుప్రీం కోర్టులోని నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు స్థాయిలో హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జీలు ఉంటారు. కొలీజియంపై అభ్యంతరాలు.. * ఇది జడ్జీలే జడ్జీలను నియమించే విధానం. నియామకాల్లో పూర్తిగా న్యాయవ్యవస్థదే అధికారం. నియామకం, బదిలీల్లో పారదర్శకత లేదు. * సమర్థత కన్నా వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్ద పీట. అవినీతికి, అవకతవకలకు ఆస్కారం. ఎన్‌జేఏసీ అంటే.. * 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్నత న్యాయవ్యవస్థలోని నియామకాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత పెరిగేలా ఎన్‌జేఏసీని ముందుకు తెచ్చింది. * ఎన్‌జేఏసీకి సుప్రీంకోర్టు సీజేఐ చైర్మన్‌గా ఉంటారు. ఇద్దరు సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి(ఎక్స్ అఫీషియొ), ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆ ఇద్దరు ప్రముఖులను సీజేఐ, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. ఇవీ ఎన్‌జేఏసీపై అభ్యంతరాలు.. * న్యాయవ్యవస్థ ప్రాధాన్యతను, స్వతంత్రతను తగ్గించేలా ఉంది. * కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉండటం వల్ల ప్రభుత్వ జోక్యం పెరుగుతుంది. * ఇద్దరు ప్రముఖులకు న్యాయపరమైన అవగాహన లేనట్లయితే, నియామకాల్లో వారు పోషించే పాత్ర ఏమిటి? -
'సుప్రీం' తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయం
న్యూఢిల్లీ: జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. కాగా ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు తీర్పును సమర్థించగా, జస్టిస్ జే చలమేశ్వర్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. 4:1తో ధర్మాసనం ఈ తీర్పును ఆమోదించింది. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. రాజకీయ జోక్యం లేకుండా పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది. -
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేసింది. పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొలీజియం వ్యవస్థను పక్కకు పెట్టి నేషనల్ జ్యూడిషియల్ కమిషన్ తీసుకొచ్చింది. అయితే, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కీలక తీర్పును శుక్రవారం వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యవస్థను కొట్టి పారేస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘ప్రయోజనాల ఘర్షణ’ కొట్టివేత
న్యూఢిల్లీ: జడ్జీల నియామకంపై కొలీజియం స్థానంలో తేవడానికి ఉద్దేశించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు ఏర్పాటైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి.. ఈ కేసు విచారణ ప్రారంభించటంలో ఎదురవుతున్న ప్రయోజనాల సంఘర్షణ, పక్షపాతం సిద్ధాంతం అవరోధాలకు అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఈ కేసు విచారణ నుంచి ధర్మాసనానికి వహిస్తున్న జస్టిస్ జె.ఎస్.ఖేహర్ తప్పుకోబోరని జస్టిస్ జె.చలమేశ్వర్ బెంచ్ తరఫున బుధవారం స్పష్టంచేశారు. జస్టిస్ ఖేహర్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ మంగళవారం విచారణ ప్రారంభించగానే.. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు.. జస్టిస్ ఖేహర్ జడ్జీల కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందున ఈ కేసు విచారణలో ప్రయోజనాల సంఘర్షణ, పక్షపాతానికి అవకాశముంటుందని అభ్యంతరాలు లేవనెత్తారు. వారి అభ్యంతరాలను ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ఎన్‌జేఏసీ చట్టం చెల్లుబాటు కేసుపై ఈ నెల 27 నుంచి విచారణ ప్రారంభిస్తామంది. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. -
దుష్ప్రచారంపై సుప్రీంకోర్టు ఆందోళన
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా దుష్ప్రచారం చేస్తుండడం పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రచారం ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోథా అన్నారు. సమాజంలో భాగమే న్యాయవ్యవస్థపై జరుగుతుస్తున్న దుష్ప్రచారం అందరినీ ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కొలీజయం ఎంపిక చేసిన న్యాయమూర్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఉంచాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. -
ఎక్స్ అఫీషియోనా?.. శాశ్వత వ్యవస్థా?
‘జ్యుడీషియల్ కమిషన్’పై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకానికి సిఫారసులు చేసే ప్రస్తుత వ్యవస్థ ‘కొలీజియం’ స్థానంలో ‘జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(జేఏసీ)’ను ఏర్పాటు చేసే బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ జేఏసీ నిర్మాణం, విధివిధానాలపై న్యాయనిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే. జేఏసీ నిర్మాణంపై వారి నుంచి ప్రభుత్వానికి రెండు రకాల అభిప్రాయాలు వచ్చాయి. కమిషన్ అధ్యక్షుడు, సభ్యులకు కచ్చితమైన పదవీకాలం ఉండేలా ఒక శాశ్వతమైన స్థిరవ్యవస్థలా జేఏసీ ఉండాలన్నది ఒక అభిప్రాయం కాగా.. యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఎక్స్ అఫీషియో’ యంత్రాంగంలా ఉండాలన్నది మరో వాదన. ఎక్స్ అఫీషియో విధానంలో..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చైర్మన్‌గా, ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు, ఇద్దరు ప్రముఖ న్యాయనిపుణులు, కేంద్ర న్యాయమంత్రి సభ్యులుగా ఉంటారు. వారు ఆ పదవుల్లో ఉన్నంతకాలం మాత్రమే కమిషన్‌లో బాధ్యతలు నిర్వర్తించే అవకాశం వారికి ఉంటుంది. ఈ రెండు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ‘లోక్‌పాల్’ నిబంధనల్లో సవరణలకు కమిటీ లోక్‌పాల్ సెర్చ్ ప్యానల్ నిబంధనల్లో సవరణలు చేయడానికి అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ నేతృత్వంలోకమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.సవరణలు చేర్చిన తర్వాతే లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టనుందని అధికారులు చెప్పారు. కాగా, బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుపై విపక్షాలతో చర్చించి, మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. హైజాకింగ్ నిరోధకచట్ట సవరణ బిల్లునూ పార్లమెంటులో ప్రవేశపెట్టేందకు కేంద్రం కసరత్తు చేస్తోంది. -
కొలీజియం’ వ్యవస్థ విఫలం!
ప్రఖ్యాత న్యాయకోవిదుల అభిప్రాయం సమూల మార్పులు అవసరం ప్రభుత్వంతో భేటీలో స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం సహా.. న్యాయవ్యవస్థలో పలు సంస్కరణలకు తెరతీసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం ప్రఖ్యాత రాజ్యాంగ, న్యాయ కోవిదులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సిఫారసులు చేసే ‘కొలీజియం’ వ్యవస్థ విఫలమైందని, జడ్జీలను జడ్జీలే నియమించే ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని భేటీలో పాల్గొన్న న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారని భేటీ అనంతరం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వెల్లడించారు. ‘కొలీజియం వ్యవస్థ ఉండాలా? వద్దా? అనే అంశంపై వారు తమ అభిప్రాయాలు చెప్పారు. కానీ ఇంకా చర్చ ముగియలేదు. ఎలాంటి మార్పులు అవసరం? న్యాయమూర్తుల నియామక వ్యవస్థ నిర్మాణం ఎలా ఉండాలి?.. అనే విషయాలపై చర్చ కొనసాగించాల్సి ఉంది’ అన్నారు. ‘ఈ వ్యవస్థను మెరుగుపర్చాలనే విషయంలో, జడ్జీల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది’ అని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ‘కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందా?’ అన్న ప్రశ్నకు.. ఆ విషయాన్ని బహిరంగపరచడం సరికాదని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం అహ్మదీ, జస్టిస్ వీఎన్ ఖరే.. లా కమిషన్ చైర్మన్ ఏపీ షా, మాజీ అటార్నీ జనరల్ కే పరాశరన్, ప్రఖ్యాత న్యాయవాదులు సొలీ సొరాబ్జీ, ఫాలీ నారిమన్, కేటీఎస్ తులసి, కేకే వేణుగోపాల్, ప్రభుత్వం తరఫున న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు.. మూడున్నర గంటలపాటు జరిగిన సమాలోచనల్లో పాలు పంచుకున్నారు. న్యాయవ్యవస్థదే పై చేయి ఉండాలి సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణ ఉండకూడదని దాదాపు భేటీలో పాల్గొన్న న్యాయ నిపుణులంతా తేల్చిచెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(జేఏసీ)లోనూ న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉండాలని, ప్రభుత్వ ప్రతినిధిగా న్యాయ మంత్రి ఉంటే సరిపోతుందన్నారు. అలాగే, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో మార్పు ఉండకూడదని ఫాలి నారిమన్, సొలి సొరాబ్జీ హెచ్చరించారు. ‘న్యాయప్రమాణాలు, జవాబుదారీతనం బిల్లు’ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కానీ ఎక్కువ సమయం కొలీజియంపైనే చర్చ జరిగింది. ‘కొలీజియం’ స్థానంలో జేఏసీ’ను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. జేఏసీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తామని ఇటీవలే రవిశంకర్ ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
పీఎంఓ ఒత్తిడితోనే సీజేఐల ‘రాజీ’
రవి శంకర్ ప్రసాద్ వివరణ పార్లమెంటులో రెండోరోజూ దుమారం మాజీ సీజేఐల రాజీ ఆరోపణలపై విరుచుకుపడ్డ విపక్షాలు న్యూఢిల్లీ/చెన్నై: అవినీతి ఆరోపణలున్న ఆ మద్రాస్ హైకోర్టు జడ్జిని కొనసాగించడంపై కొలీజియం మొదట్లో తటపటాయించిందని, అయితే, యూపీఏ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి కొనసాగింపునకు సిఫారసు చేసిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. ‘‘2003లో ఆ న్యాయమూర్తిని కొనసాగించేందుకు కొలీజియం విముఖత వ్యక్తం చేసింది. తరువాత యూపీఏ హయాంలో ఆ న్యాయమూర్తిని ఎందుకు కొనసాగించకూడదో వివరణ ఇవ్వాలంటూ ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి సందేశం వచ్చింది. అప్పటికీ ఆ న్యాయమూర్తిని కొనసాగించేందుకు సిఫారసు చేయకూడదని కొలీజియం గట్టిగానే ఉంది. అనంతరం న్యాయశాఖ నుంచి రెండు లేఖలు రావడంతో కొనసాగింపునకు అనుకూలంగా కొలీజియ నిర్ణ యం తీసుకోవాల్సి వచ్చింది.’’ అని ప్రసాద్ చెప్పారు. కానీ, ఆరోపణలున్న ఆ జడ్జి మరణించారని, ఆ కొలీజియంలోని న్యాయమూర్తులు రిటైరయ్యారని రవిశంకర్ అన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇకపై ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు. పార్లమెంటులో రెండోరోజూ దుమారం జస్టిస్ కట్జూ చేసిన ఆరోపణలపై వరుసగా రెండోరోజు మంగళవారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. అవినీతి జడ్జిని కొనసాగించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన డీఎంకేకు చెందిన ఆ కేంద్ర మంత్రి ఎవరో పేరు బయటపెట్టాలంటూ అన్నాడీఎంకే సభ్యులు లోక్‌సభ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. ఇదే అంశంపై అన్నాడీఎంకే, డీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదంతో రాజ్యసభ కూడా కాసేపు వాయిదా పడింది. ఈ వ్యవహారంలో నిజమేంటో మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎవరి ఒత్తిడితోనో.. కరుణానిధి: రాజకీయంగా దుమా రం రేపుతున్న న్యాయమూర్తి కొనసాగింపు అంశంపై డీఎంకే అధినేత ఎం.కరుణానిధి పెదవి విప్పారు. పదేళ్ల కిందటి అంశాన్ని లేవనెత్తడంలో ఉద్దేశమేంటో తెలపాలని జస్టిస్ కట్జూని ప్రశ్నించారు. ఏదో పరోక్ష ఒత్తిడి కారణంగానే కట్జూ ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థలో భాగంగా ఉంటూ అదే వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కట్జూపై మండిపడ్డారు. -
ఇక కొలీజియం వ్యవస్ధ కనుమరుగు