సుప్రీంకోర్టుకు 9 మంది జడ్జీలు... | Centre Approves 9 Judges For Elevation to Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు 9 మంది జడ్జీలు...

Published Fri, Aug 27 2021 5:32 AM | Last Updated on Fri, Aug 27 2021 8:38 AM

Centre Approves 9 Judges For Elevation to Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ విక్రమ్‌నాథ్, సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సీటీ రవికుమార్, మద్రాస్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ బీవీ నాగరత్న, గుజరాత్‌  హైకోర్టు జడ్జి బేలా త్రివేది, బార్‌ నుంచి న్యాయవాది పీఎస్‌ నరసింహలను కొలిజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. 31న జడ్జీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో 34 జడ్జీ పోస్టులుండగా వీరి నియామకంతో జడ్జీల సంఖ్య 33కు చేరనుంది. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం !

జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌

జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌  సెప్టెంబర్‌ 24, 1962లో అలహాబాద్‌లో జన్మిం చారు. అలహాబాద్‌ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సెప్టెంబర్‌ 10, 2019న గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

చరిత్రలో మైలురాయి!..జస్టిస్‌ నాగరత్న 

సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందిన కర్ణాటక హైకోర్టు జడ్జి బీవీ నాగరత్న సెప్టెంబర్‌ 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. జస్టిస్‌ నాగరత్న  1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్‌స్టిట్యూషనల్‌ లా, కమర్షియల్‌ లా, ఆర్బిట్రేషన్‌లకు సంబంధించిన కేసులకు పేరుగాంచారు.

జస్టిస్‌ జేకే మహేశ్వరి

మధ్యప్రదేశ్‌లో జన్మించిన జస్టిస్‌ మహేశ్వరి 1985లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. నవంబర్‌ 25, 2005న మధ్యప్రదేశ్‌ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్‌ 25, 2008న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్టోబర్‌ 7, 2019న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇటీవల సిక్కింకు బదిలీ అయ్యారు.

జస్టిస్‌ బేలా మాందుర్య త్రివేది

1983లో కెరియర్‌ ప్రారంభించిన జస్టిస్‌ త్రివేది సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పేరుగాంచారు. 1995లో అహ్మదాబాద్‌ సిటీ సివిల్, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గుజరాత్‌ హైకోర్టు ప్రత్యేక అధికారి(నిఘా)గా పనిచేసిన ఆమె గుజరాత్‌ ప్రభుత్వం న్యాయ సలహాదారుగా పనిచేశారు.

జస్టిస్‌ సీటీ రవికుమార్‌

కేరళకు చెందిన జస్టిస్‌ చుడలాయిళ్‌ తేవన్‌ రవికుమార్‌ జనవరి 6, 1960న జన్మించారు. జనవరి 5, 2009న కేరళ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబరు 15, 2010న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్‌ సీటీ రవికుమార్‌ జనవరి 5, 2022 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.

జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా

మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా మే 25, 1960లో జన్మించారు. జూన్‌ 28, 1983లో బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. నవంబర్‌ 12, 2005న బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మే10, 2019న పదోన్నతి పొందారు.

జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌

తమిళనాడుకు చెందిన జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ మద్రాస్‌ లా కళాశాల నుంచి న్యాయ పట్టా అందుకున్నారు. 1985లో తమిళనాడు, పుదుచ్చేరి బార్‌కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. మార్చి 31, 2009న అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ మార్చి 29, 2011న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

నాలుగో తెలుగు న్యాయమూర్తి..జస్టిస్‌ పీఎస్‌ నరసింహ

ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి తర్వాత నాలుగో తెలుగు న్యాయమూర్తిగా సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ బాధ్యతలు చేపట్టను న్నారు. బార్‌ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వ్యక్తి పీఎస్‌ నరసింహ. మే 3, 1953లో హైదరాబాద్‌లో జన్మించారు.

జస్టిస్‌ హిమా కోహ్లి

1984లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యురాలు అయిన జస్టిస్‌ హిమా కోహ్లి ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు.  మే 29, 2006న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ హిమా కోహ్లి ఆగస్టు 29, 2007న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి  పొందారు. జనవరి 7, 2021లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement