Supreme court of India
-
సంభాల్ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి
న్యూఢిల్లీ: సంభాల్‌లోని మొఘలుల నాటి జామా మసీదు సమీపంలోని వివాదాస్పద బావిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)తోపాటు ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం, ఏఎస్ఐలతోపాటు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్‌కు, హరి శంకర్ జైన్ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, రెండు వారాల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట రాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచాలంది. -
అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్ వాదించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. -
నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యత
అనధికార లావాదేవీలను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి బ్యాంకులు సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించాలని గువాహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల సమర్థించింది. థర్డ్ పార్టీ యాప్స్, టూల్స్ ఉల్లంఘనల వల్ల తలెత్తే అనధికార లావాదేవీలను బ్యాంకులే కట్టడి చేయాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్న వినియోగదారులపై ఎలాంటి భారం మోపకూడదని, పూర్తి బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకించింది. తన ఖాతాలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు నివేదించిన భౌమిక్ అనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.అసలేం జరిగిందంటే..పల్లబ్ భౌమిక్ అనే ఎస్బీఐ కస్టమర్ ఆన్లైన్లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అది డెలివరీ అయ్యాక తనకు కొన్ని కారణాల వల్ల ప్రోడక్ట్ రిటర్న్ పెట్టాడు. రిటర్న్ ప్రాసెస్ పూర్తవ్వడానికి, తన పేమెంట్ రిటర్న్ చేయడానికి కొన్ని వివరాలు చెప్పాలంటూ కస్టమర్ సర్వీస్‌గా నటిస్తూ భౌమిక్‌కు ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను అనధికార లావాదేవీలను సులభతరం చేసే మొబైల్ యాప్(Mobile App)ను డౌన్లోడ్ చేయమని ఆదేశించాడు. కానీ తాను ఎలాంటి నగదును తిరిగి పొందలేదని భౌమిక్ చెప్పాడు. దీనికి సంబంధించి 24 గంటల్లోనే బ్యాంకుకు సమాచారం అందించాడు. కానీ బ్యాంకు రీఫండ్ ఇవ్వలేదు. దాంతో భౌమిక్ కోర్డును ఆశ్రయించాడు. ఆ క్రమంలో భౌమిక్ ఓటీపీలు, ఎంపీఐఎన్లు వంటి సున్నితమైన సమాచారాన్ని సైబర్ మోసగాళ్లతో షేర్ చేసుకున్నాడని ఎస్బీఐ మొదట్లో వాధించింది. అయితే, తాను ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని, రిటైలర్ వెబ్సైట్లో డేటా ఉల్లంఘన కారణంగానే ఈ మోసం జరిగిందని భౌమిక్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ..థర్డ్ పార్టీ యాప్‌లు, ఆన్లైన్ టూల్స్(Online Tools) ఉల్లంఘనల వల్ల జరిగే అనధికార లావాదేవీలకు వినియోగదారులను బాధ్యులను చూయకూడదని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ గౌహతి హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ భౌమిక్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. దీన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. వినియోగదారుడికి రూ.94,204.80 తిరిగి చెల్లించాలని ఇటీవల తీర్పు ఇచ్చింది. -
న్యాయస్థానాలే నిర్లక్ష్య ధోరణితో తప్పులు చేస్తే..!
సంచలన సృష్టించిన ఓ హత్య కేసులో అతనొక నిందితుడు. కింది కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. హైకోర్టు, ఆపైన సుప్రీం కోర్టు కూడా కోర్టు తీర్పునే సమర్థించాయి. క్షమాభిక్ష కోరితే.. రాష్ట్రపతి సున్నితంగా తిరస్కరించారు. కొడుకు కోసం అతని తల్లి మరోసారి రాష్ట్రపతి భవన్ తలుపు తట్టింది. ఈసారి రాష్ట్రపతి కనికరించి జీవితఖైదుగా శిక్షను మార్చారు. కట్ చేస్తే.. దాదాపు 25 ఏళ్ల తర్వాత అతని విషయంలో పెద్ద తప్పే జరిగిందని దేశసర్వోన్నత న్యాయస్థానమే ఒప్పుకుంది. అతన్ని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏంటా తప్పు?.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే..వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని అంటారు. అయితే నిందితులతో పాటు దోషులకూ మన చట్టాలు కొన్ని హక్కులు కల్పిస్తున్నాయి. అయితే ఆ హక్కును న్యాయస్థానాలే నిర్లక్ష్యం చేస్తే..?! ఫలితంగా ఓం ప్రకాశ్లాగా పాతికేళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది.ఉత్తరాఖండ్‌కు చెందిన ఓం ప్రకాశ్(Om Prakash).. తన యజమానితో పాటు అతని కుటుంబాన్ని హతమార్చిన కేసులో నిందితుడు. 1994లో ఈ నేరం జరిగింది. నేరం రుజువు కావడంతో 2001లో ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అయితే నేరం జరిగిననాటికి అతను మైనర్. తన కొడుకు మైనర్ అని మరణశిక్షపై అతని తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు.. నిందితుడి పేరిట ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ ఆధారంగా నేరం జరిగిన నాటికి అతనికి 20 ఏళ్లని అధికారులు వాదించారు. కోర్టు ఓం ప్రకాష్ తల్లి అభ్యర్థనను పక్కనపెట్టి మరణశిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లారు. అయితే అక్కడా ఆ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. రివ్యూ పిటిషన్లు వేస్తే వాటిని కొట్టేశాయి. దీంతో చివరి అవకాశంగా ఆమె రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. అయితే మొదటి పిటిషన్ తిరస్కరణకు గురికాగా.. 2012లో రెండో పిటిషన్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కాకుంటే.. ఓం ప్రకాశ్‌కు 60 ఏళ్లు వచ్చేదాకా జైల్లోనే ఉంచాలంటూ సూచించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో అతని తల్లి మరో పిటిషన్ వేసినప్పటికీ.. అది చెల్లదంటూ రిజిస్ట్రీ కొట్టిపారేశారు. 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే.. అదీ తిరస్కరణకే గురైంది. చివరకు.. సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఆధారంగా బోన్ ఆసిఫికేషన్(ఎముక పరిణామంచెందే క్రమం) పరీక్ష నిర్వహించగా.. నేరం జరిగిననాటికి అతని వయసు 14 ఏళ్లుగా తేలింది!. అంతేకాదు.. సమాచారం హక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల వయసువాళ్లకూ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జువైనల్ జస్టిస్ యాక్ట్(Juvenile Justice Act) 2015 ప్రకారం.. జువైనల్‌కు కఠిన శిక్షలు విధించరాదని మన చట్టం చెబుతోంది. కానీ, ఈ కేసులో ఓం ప్రకాశ్‌కు ఏకంగా మరణశిక్ష విధించాయి కోర్టులు. అయితే.. ఈ తరహా కేసుల్లో శిక్షలు ఖరారైన తర్వాత కూడా నిందితుడి మైనర్ అని నిరూపించుకునేందుకు పిటిషన్ వేయొచ్చు. అందుకు సెక్షన్ 9(2) వెసులుబాటు కల్పించింది. అయితే.. కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఓం ప్రకాశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించాయి. సెక్షన్‌కు విరుద్ధంగా ప్రవర్తించాయి.‘‘మన దేశంలో న్యాయస్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటిది ఇలాంటి కేసుల్లో.. అభ్యర్థలను కోర్టులు జాగ్రత్తగా పరిశీలించాలి. నిర్లక్ష ధోరణితో పక్కన పడేయకూడదు. 2015 జువైనల్ చట్టం.. పిల్లలను అపరాధిగా కాకుండా బాధితుడిగా పరిగణించాల చెప్పింది. వాళ్లలో పరివర్తన తీసుకొచ్చి.. సమాజంలోకి పంపించి పునరావాసం కల్పించాలని చెబుతోంది. అయితే ఇక్కడ కోర్టులు చేసిన తప్పిదానికి అప్పీలుదారుడు శిక్షను అనుభవించాడు. సమాజంలో కలిసిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. తన తప్పులేకుండా అతను కోల్పోయిన కాలాన్ని ఎలాగూ వెనక్కి తేలేము’’ అంటూ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్‌కుమార్ బెంచ్ వ్యాఖ్యానించింది. మరేయిత కేసులతో గనుక అతనికి సంబంధం లేకుంటే తక్షణమే అతన్ని విడుదల చేయాలంటూ ఉత్తరాఖండ్ జైళ్ల శాఖను ఆదేశించింది. అలాగే ప్రభుత్వ పునరావాస పథకాల కింద అతనికి ఏదైనా ఉపాధి కల్పించాలని ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్‌సర్వీసెస్ అథారిటీకి ధర్మాసనం సూచించింది.1994లో ఏం జరిగిందంటే..డెహ్రాడూన్(Dehradun)లో ఓ ఇంట్లో జరిగిన హత్యలు కలకలం రేపాయి. శ్యామ్‌లాల్ ఖన్నా అనే రిటైర్ట్ ఆర్మీ ఆఫీసర్‌ను, ఆయన కొడుకు సరిత్, భార్య సోదరిని ఎవరో కిరాతకంగా హతమార్చారు. పోలీసుల విచారణలో ఆ ఇంట్లోనే పని చేసే ఓం ప్రకాశ్ పనేనని తేలింది. ఐదేళ్ల గాలింపు తర్వాత పశ్చిమ బెంగాల్లో నిందితుడ్ని, అతని స్నేహితుడు నితేష్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో నితేష్ ప్రమేయం లేదని తేలడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.ప్రతీక్ చాదా అనే లాయర్ సుప్రీం కోర్టులో ఓం ప్రకాశ్ తరఫున పిటిషన్ వేయగా.. ఎస్ మురళీధర్ ఓం ప్రకాశ్ తరఫున వాదనలు వినిపించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, అడ్వొకేట్ వన్షజా శుక్లా వాదనలు వినిపించారు. -
‘స్వలింగ వివాహాల’పై తీర్పు సరైనదే: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టినట్లు తేల్చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేమంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ క్షుణ్నంగా పరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆధారం లేదని 2023 అక్టోబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ తదితర వర్గాలు ఆందోళనకు దిగాయి. స్వలింగ వివాహాలపై అప్పట్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఆయా పిటిషన్లను పరిశీలించింది. 2023 నాటి తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చిచెప్పింది. అప్పటి తీర్పులో వెల్లడించిన అభిప్రాయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఆ తీర్పులో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది. -
చదువు ఖర్చులు తల్లిదండ్రుల నుంచి పొందడం కుమార్తెల హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కుమార్తెలు తమ చదువులకయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందడం చట్టబద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆడబిడ్డలను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంది. విద్యాభ్యాసానికి అయ్యే సొమ్మును పొందడం ఆడపిల్లల చట్టబద్ధమైన హక్కు అని తేల్చిచెప్పింది. పెద్దలు తమ స్థోమత మేరకు కుమార్తెలకు చదువులు చదివించాలని వెల్లడించింది. విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. సదరు దంపతులు 26 ఏళ్ల క్రితం విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. మనోవర్తి కింద భార్యకు రూ.73 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. ఇందులో కుమార్తె చదువులకు అయ్యే ఖర్చు రూ.43 లక్షలు కలిపే ఉంది. కుమార్తె ఐర్లాండ్‌లో చదువుతోంది. తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకొనేందుకు నిరాకరించింది. తన సొంత డబ్బుతో చదువుకోగలనని, ఇంకొకరి సాయం అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కన్నబిడ్డను చదివించుకోగలనని, చదువుకయ్యే సొమ్మును తన కుమార్తె తీసుకొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం ఈ నెల 2వ తేదీన విచారణ చేపట్టింది. చదవులకయ్యే ఖర్చును తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెకు ఉందని వెల్లడించింది. తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే తల్లికి ఇవ్వాలని సూచించింది. -
ఒకసారి రిజర్వేషన్లు పొందిన వారికి...ఆ సౌకర్యం నిలిపేయాలి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆ ఫలాలు పొంది, ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరినవారికి రిజర్వేషన్లను తొలగించవచ్చని అభిప్రాయపడింది. అయితే ఇది శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్ట్‌లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఎస్సీల్లోని వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా సభ్యుడే. మెజారిటీ నిర్ణయంతో సమ్మతిస్తూనే నాడు ఆయన విడిగా తీర్పు వెలువరించారు. ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్లను నిలిపేయాలని అందులో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు. ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ‘ఒకసారి లబ్ధి పొందినవారికి రిజర్వేషన్లను తొలగించాలి. గత 75 ఏళ్ల పరిణామాలను బేరీజు వేసిన మీదట ఈ అభిప్రాయం వెలువరిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచినా ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వాలు ఆ పని చేయవు. చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది‘ అన్నారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఆ పని చేసేందుకు శాసన, కార్యనిర్వాహక విభాగాలు ఉన్నాయి. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్లు చట్టం చేయాలి‘ అని పునరుద్ఘాటించింది. అయితే సంబంధిత వర్గాలనే ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడంతో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. -
కుదరదు.. 15నే విచారణ చేపడతాం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు(KTR)కు ఊరట దక్కలేదు. పిటిషన్‌ను తక్షణ విచారణకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ.. కేటీఆర్ సుప్రీం కోర్టులో క్వాష్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను రేపు(శుక్రవారం) విచారణకు స్వీకరించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే.. అందుకు సీజే బెంచ్ నిరాకరించింది. ఈ నెల 15వ తేదీన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే వేస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ఏసీబీ తరఫున తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఏసీబీ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ ఇంతకుముందు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోమని పేర్కొంటూ.. ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ సైతం ఇవ్వలేదు. -
నగదు రహిత చికిత్స పథకం తీసుకురావాలి
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కాలంలో బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించేలా ఒక పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 162(2) ప్రకారం ఈ పథకం అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని రూపొందించి, అమలు చేయాలని స్పష్టంచేసింది. దీనివల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంది. సెక్షన్ 2(12–ఎ) ప్రకారం గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట. రోడ్ ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన వారికి తొలి గంటలో చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాణాలు కాపాడడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. చట్టప్రకారం గోల్డెన్ అవర్‌లో బాధితు లకు నగదు రహిత చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని తీసుకురావాల్సిందేనని, ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. -
సుప్రీంలో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురదచల్లేందుకు పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఉన్న హక్కు లను ఉపయోగించుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్కడ న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు.మరోవైపు 9న జరిగే ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో పాటు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టు నుంచి ఉపశమనం దొరికితే ఏసీబీతో పాటు ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని ప్రకటించారు. మంగళవారం రాత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. లొట్టపీసు కేసులో శునకానందం ‘చట్టంపై గౌరవంతో ఏసీబీ విచారణకు సోమవారం న్యాయవాదితో కలిసి వెళ్లి 45 నిమిషాలు ఎదురుచూశా. లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను కూడా ఇచ్చినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కోరుకుంటే నా హక్కులకు భంగం వాటిల్లేలా చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తున్నా. ఏసీబీ తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయమంటూ నేను వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే నాకు ఉరిశిక్ష వేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. బ్రోకర్లు, దొంగలకు అవినీతే కన్పిస్తుంది ఫార్ములా–ఈ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టకుండా సీఎం పారిపోయాడు. రేవంత్.. మొగోడైతే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ప్రత్యక్ష చర్చ పెట్టాలి. అవినీతిపరులు, రూ.50 లక్షల సంచులతో దొరికిన బ్రోకర్లు, దొంగలకు ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నా మీద లొట్టపీసు కేసు పెట్టి చిట్టినాయుడు పైశాచిక, శునకానందం పొందుతున్నాడు. సీఎం నోట వచ్చేది వేదవాక్కులు, సీఎం ఆఫీసు నుంచి వచ్చే లీకులు సూక్తులు కాదు. దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కోరితే కాంగ్రెస్ నేతలు ఆగమవుతున్నారు. కొందరు మంత్రులు న్యాయమూర్తుల తరహాలో శిక్షలు వేస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు ‘ఫార్ములా –ఈ రేస్‌లో అణాపైసా అవినీతి జరగలేదు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు. హైకోర్టు విచారణకు మాత్రమే అనుమతించింది, కుంభకోణం అని ఎక్కడా చెప్పలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజనీరింగ్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రూ.4,600 కోట్లు పనులు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేఘా సంస్థ ఎలక్టొరల్ బాండ్లు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుందా లేదా మంత్రి పొంగులేటి చెప్పాలి.మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటి తరలింపు, మూసీ సుందరీకరణ పనులు కూడా మేఘా సంస్థకు ఇస్తున్నట్లు సమాచారం వ చ్చిoది. ఓ కాంట్రాక్టర్ మంత్రి, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని విమర్శించారు. కేటీఆర్ నివాసానికి పార్టీ నేతలు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకుని పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తా నేతృత్వంలోని బీఆర్ఎస్ లీగల్ టీమ్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 35 పేజీల కోర్టు తీర్పును లీగల్‌టీమ్ అధ్యయనం చేయడంతో పాటు హైకోర్టులో కేటీఆర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ దవేతో ఫోన్లో చర్చించారు. ఏసీబీ, ఈడీ తాజా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని న్యాయవాదులు సూచించినట్లు సమాచారం. ఇంతకంటే బలంగా తిరిగి వస్తా: కేటీఆర్ ‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. ఈ ఎదురుదెబ్బ నుంచి ఇంతకంటే బలంగా తిరిగి వస్తా. మీ అబద్ధాలు నన్ను పడగొట్టలేవు. మీ విమర్శలు నా స్థాయిని తగ్గించలేవు. నా లక్ష్యాన్ని మీ చర్యలు అడ్డుకోలేవు. మీ అరుపులు, పెడ»ొబ్బలు నా గొంతు నొక్కలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ప్రపంచమంతా త్వరలో దీనిని చూసి తీరుతుంది. మన న్యాయ వ్యవస్థపై నాకు అచంచల విశ్వాసం ఉంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది..’అని కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా పేర్కొన్నారు. -
తెలంగాణ ‘సీజే’ బదిలీ..కొలీజియం సిఫారసు
సాక్షి,ఢిల్లీ:సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాల చీఫ్ జస్టిస్లను మంగళవారం(జనవరి7) బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ముంబై హైకోర్టుకు,ముంబై హైకోర్టు చీఫ్‌జస్టిస్ దేవేంద్ర ఉపాధ్యయ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేస్తూ కొలీజియం రాష్ట్రపతి సిఫారసుచేసింది.ప్రస్తుతం పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న వినోద్ చంద్రన్‌ను సుప్రీంకోర్టుజడ్జిగా నియమించింది. కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్‌లో ఎవరూ లేకపోవడంతో జస్టిస్ వినోద్ చంద్రన్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. -
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనవడిని తమకు అప్పగించాలంటూ అతుల్ తల్లి అంజు దేవి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో.. నాలుగేళ్ల అతుల్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నదానిపై నిఖితా సింఘానియా తరఫు న్యాయవాది స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఫరిదాబాద్(హర్యానా)లోని బోర్డింగ్స్కూల్లో చదువుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం నిఖిత షరతులతో బెయిల్ మీద ఉన్న దృష్ట్యా.. ఆ పిల్లాడిని బెంగళూరుకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపాడాయన. అయితే.. వచ్చే విచారణ టైంలో ఆ చిన్నారిని కోర్టులో ప్రవేశపెట్టాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే..అంజు దేవీ(Anju Devi) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆరేళ్లలోపు పిల్లలను బోర్డింగ్ స్కూల్‌కు పంపడం ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని, కాబట్టి అతని సంరక్షణను నాయనమ్మకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని.. ‘‘ఆ చిన్నారి నాయనమ్మతో గడిపిన సమయం చాలా తక్కువ. ఒకరకంగా చూసుకుంటే పిటిషనర్ ఆ పిల్లాడికి కొత్త ముఖమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో.. అంజుదేవి తరఫు లాయర్ గతంలో ఆ నానమ్మ-మనవడు కలిసి దిగిన ఫొటోలను బెంచ్‌కు సమర్పించారు.అయితే నిఖితా సింఘానియా(Nikita Singhania) ఈ కేసులో దోషిగా ఇంకా నిరూపించబడాల్సి ఉందని, కేవల మీడియా కథనాల ఆధారంగా ఆమెను దోషిగా గుర్తించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున పిల్లాడి సంరక్షణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉందని పేర్కొంటూ.. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో..మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్(Atul Subash) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. అయితే.. వాళ్లకు కోర్టు తాజాగా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఒకవైపు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో, మరోవైపు కర్ణాటక హైకోర్టులో.. ఇంకోవైపు సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. -
బాబా ఆశారాంకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ:అత్యాచార కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబా ఆశారాం(Asaram Bapu)నకు మధ్యంతర బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు(Supreme court) ఆయనకు మార్చి 31 దాకా మధ్యంతర బెయిల్(Interim Bail) ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో అత్యాచార కేసులోనూ మధ్యంతర బెయిల్ వచ్చేదాకా ఆయన జైలులోనే ఉండనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన అనుచరులను కలవడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించ వద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. గుజరాత్ మోతేరాలోని ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేశారు. అనంతరం ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. జోధ్‌పూర్‌లోని మరో ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు.ఈ కేసులోనూ ఆయనకు జీవితఖైదు పడింది. రెండు కేసుల్లో ఆశారం ఒకేసారి శిక్ష అనుభవిస్తున్నారు.ఇదీ చదవండి: 16 ఏళ్లకే ఇంటిని వదిలి..తాళాల బాబా సాధన ఇదే -
సుప్రీం కోర్టుకు ఈ-కార్ రేసు పంచాయితీ!
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేటీఆర్ క్వాష్‌పై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ దూకుడు ప్రదర్శించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న గ్రీన్కో, దాని అనుబంధ సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితుల ఇళ్లపై సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్(Search Warrant) తెచ్చుకుంది.ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా.. కోర్టు అనుమతితో ఏ క్షణమైనా వీళ్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై వాళ్లను విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. హెచ్ఎండీ ద్వారా రేసు కోసం జరిగిన ఒప్పంద పత్రాలను సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. తెెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఫాార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక.. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం, బీఆర్ఎస్(BRS Party) కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం ఉంది. -
ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: పౌరులు ఆస్తిని కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్టప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తగిన పరిహారం చెల్లించకుండా వారికి ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. బెంగళూరు–మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ విషయంలో 2022 నవంబర్‌లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. తీర్పు వెలువరించింది. రాజ్యాంగ(44 సవరణ) చట్టం–1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారని ధర్మాసనం వెల్లడించింది. అయినప్పటికీ సంక్షేమ రాజ్యంలో అది మానవీయ హక్కు అని ఉద్ఘాటించింది. ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగ హక్కేనని వెల్లడించింది. ఆర్టికల్ 300ఏ ప్రకారం.. ప్రజలను వారి ఆస్తి నుంచి దూరం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలను ఆదేశించింది. -
కేంద్ర అధికారులపై కేసు నమోదుకు.. సీబీఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది. -
‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం⇒ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. ⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్‌లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్‌లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్ బ్యాంక్, ఏపీ సర్కార్‌తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ్ రవిచందర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్‌జీపీ) బి.రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. 6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్‌కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.అక్రమాలను నిర్ధారించిన రంగాచారిమార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టుచట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టుఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా గతేడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. -
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్‌ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
గౌతమ్ రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో గౌతమ్ రెడ్డికి ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం.. కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది.ఇక, సుప్రీంకోర్టులో గౌతమ్ రెడ్డి తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. గౌతమ్ రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఈ కేసులో ఏపీ ప్రభుత్వం కేవియట్ ఎలా దాఖలు చేస్తుందని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు కాకుండా, ప్రభుత్వమే ఎందుకు యాక్టివ్‌గా ఉందని కోర్టు ప్రశ్నించింది. -
న్యాయమూర్తుల సంతానానికి హైకోర్టు జడ్జిలుగా నో చాన్స్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల సంతానం, అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లను సిఫార్సు చేయరాదంటూ హైకోర్టు కొలీజియాలకు సూచిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా అర్హులైన కొందరికి అన్యాయం జరిగినా బంధుప్రీతి వంటి ఆరోపణలకు తావుండదని, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొలీజియం సభ్యుడైన సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. తొలి తరం న్యాయవాదులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశం లభిస్తుందన్నది దీని ఉద్దేశమని వివరించాయి. మళ్లీ తెరపైకి ‘సంప్రదింపులు’ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మరో ఇటీవల కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 22న వ్యక్తిగతంగా భేటీ అయింది. తద్వారా గత సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. అనంతరం రాజస్తాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టులకు న్యాయ మూర్తులుగా ఆరుగురు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే సాగాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘సంప్రదింపు’ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల బయోడేటా, వారి అర్హత, సామర్థ్యాలపై కొలీజియం అంచనా, నిఘా సమాచారం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తుండటం తెలిసిందే. -
దలేవాల్ బతికుండాలా? చనిపోవాలా?
న్యూఢిల్లీ: రైతాంగం సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా పంజాబ్–హరియాణా సరిహద్దులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్య సాయం అందించడానికి అడ్డు తగులుతున్న రైతు సంఘాల నాయకులు, రైతులపై మండిపడింది. వారు నిజంగా దలేవాల్‌కు శ్రేయోభిలాషులు కాదని ఆక్షేపించింది. దలేవాల్‌ను ఆసుపత్రికి ఎందుకు తరలించడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నెల 31వ తేదీలోగా ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నుంచి సాయం తీసుకోవచ్చని సూచించింది. దలేవాల్‌కు వైద్య చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీక్షలో ఉన్న దలేవాల్ చుట్టూ రైతులు మోహరించారని, ఆయనను ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకుంటున్నారని, తమ ప్రభు త్వం నిస్సహాయ స్థితిలో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇదంతా జరగడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దలేవాల్ చుట్టూ కోట కట్టడానికి అనుమతి ఉందా? దీక్షా స్థలానికి భారీ సంఖ్యలో రైతు లు ఎలా చేరుకున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరోగ్యం క్షీణించి తక్షణమే వైద్య చికిత్స అవసరమైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా చుట్టుముట్టడం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. చికిత్స తీసుకోవడానికి దలేవాల్ అంగీకరించడం లేదని, ఎంత ఒప్పించినా ఫలితం ఉండడం లేదని, దీక్ష విరమిస్తే ఉద్యమం బలహీనపడుతుందని ఆయన భావిస్తున్నారని గుర్మీందర్ సింగ్ చెప్పారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని, అందుకే వెనుకంజ వేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాస నం అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభు త్వం సక్రమంగా వ్యవహరించడం లేదని పేర్కొంది. రైతు సంఘాల నాయకుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం నేరమేనని, ఆత్మహత్యకు పురికొల్పినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. దలేవాల్ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్లాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘కొందరు రైతు సంఘాల నేతల ప్రవర్తనపై మేము ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారు స్పందించడం లేదు. వారేం నాయకులు? దలేవాల్ బతికి ఉండాలని కోరుకుంటున్నారా? లేక దీక్ష చేస్తూ చనిపోవాలని కోరుకుంటున్నారా? వారి ఉద్దేశం ప్రశ్నార్థకంగా ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం విరుచుకుపడింది. సెలవు రోజునా ప్రత్యేక విచారణ సుప్రీంకోర్టుకు సాధారణంగా సెలవుదినం. రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమై విచారణ చేపట్టింది. -
టీడీఎస్ వ్యవస్థ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ట్యాక్స్ డిడక్షన్ యట్ సోర్స్ (TDS) వ్యవస్థను ‘ఏకపక్షం, అసంబద్ధమైనది’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(PIL) దాఖలైంది. సమానత్వంసహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా పేర్కొంటూ టీడీఎస్‌ను రద్దు చేయాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.మూలం వద్దే పన్నును మినహాయించడం, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేయడం తగిన విధానం కాదని పిటిషన్ వివరించింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే లాయర్, అడ్వొకేట్ అశ్వనీ దూబే ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్రం, న్యాయ మంత్రిత్వ శాఖ, లా కమిషన్, నీతి ఆయోగ్‌లు ప్రతివాదులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 14 (సమానత్వపు హక్కు), 19 (వృత్తి చేసే హక్కు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ఆర్టికల్స్‌కు వ్యతిరేకంగా టీడీఎస్ ఉందని, ఈ వ్యవస్థ ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉందని ప్రకటించాలని పిల్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుటీడీఎస్ అంటే ఏమిటి?టీడీఎస్ అనేది ఆదాయ వనరు వద్దే పన్ను వసూలు చేసే పద్ధతి.. పేమెంట్ సమయంలోనే పన్నును మినహాయించి పన్ను చెల్లింపుదారు తరఫున ప్రభుత్వానికి పంపుతారు. జీతభత్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, కమీషన్ వంటి విభిన్న చెల్లింపులు చేసేప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. -
ECపై ‘సుప్రీం’లో కాంగ్రెస్ పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోర్టుకెక్కింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఒక రూల్‌కు ఇటీవల ఈసీ సవరణ చేసింది. అయితే.. ఈ చర్యతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత క్షీణిస్తోందంటూ కాంగ్రెస్ సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం ఓ రిట్ పిటిషన్ వేసింది. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే ఈసీ ఈ మధ్యే ఈ రూల్‌కు సవరణ చేసింది. కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. కొత్త సవరణతో(Amendments) ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీవల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ఫుటేజ్‌ను వినియోగించుకుని కృత్రిమ మేధ(Artificial Intelligence) ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి. రూల్ 93కి సవరణ తర్వాతా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టత ఇచ్చింది.ఎన్నికల సంఘం(Election Commission) సిఫార్సు మేరకే.. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతోపాటు న్యాయశాఖ వేర్వేరుగా గత శుక్రవారం వివరణ ఇచ్చాయి. ఇక.. అయితే ఈ పరిణామంపై కాంగ్రెస్(Congress Party) మండిపడింది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనను మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని ఇంతకు ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ.. అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరమని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ముంచెత్తిన మంచులో వాహనాలు -
మా తీర్పు.. మీ భాషలోనే..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్.. వైడ్ సెపరేట్ జడ్జ్మెంట్ యాజ్ ఫర్ సెక్షన్ 235 సీఆర్పీసీ’ అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితులు, బాధితులకు అర్థమయ్యేలా వెబ్సైట్లలోనూ స్థానిక భాషల్లోనే పొందుపరుస్తున్నారు. ‘మా తీర్పులు.. మీ భాషల్లోనే’ అంటూ జడ్జిమెంట్స్ వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బాటలోనే హైకోర్టులు సైతం నడుస్తున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున తీసుకున్న కీలక నిర్ణయం న్యాయస్థానాల్ని అన్నివర్గాలకు చేరువ చేసింది. సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటివరకూ 73,963 తీర్పుల్ని సుప్రీంకోర్టు వివిధ భాషల్లో తర్జుమా చేసి తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇదే నేపథ్యంలో 30,944 తీర్పుల్ని ఆయా హైకోర్టులు స్థానిక భాషల్లోకి మార్చాయి.షెడ్యూల్డ్ భాషల్లోనూ..షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకూ 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సంథాలీ ఇలా.. విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా వెబ్సైట్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 73,963 తీర్పులు పొందుపరిచింది. రాజస్థాన్ హైకోర్టుతో మొదలై..సుప్రీంకోర్టుతో పాటు ప్రతి హైకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆంగ్ల భాషలో జరగాలని భారత రాజ్యాంగంలోని 348(1)(ఏ) అధికరణం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని 348(2) అధికరణం రాష్ట్రాల్లో అధికారిక వ్యవహారాలు, రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రొసీడింగ్స్ కోసం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హిందీ లేదా మరేదైనా భాషను వినియోగించేందుకు గవర్నర్‌కు అధికారం కల్పించింది. అధికారిక భాషా చట్టం–1963లోని సెక్షన్–7 కూడా ఇదే సూచిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్‌లో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణం ప్రకారం 1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ కోర్టులు హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి.బీజం వేసిన మద్రాస్ హైకోర్టుమద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులో గుజరాతీ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ప్రతిపాదనలు అందాయి. 1965 కేబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రతిపాదనలపై అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సలహాను అడగ్గా.. 2012 అక్టోబర్ 11న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో ఈ ప్రతిపాదనలను అంగీకరించవద్దని తొలుత నిర్ణయించారు. అయితే.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం పట్టుబట్టింది. గత నిర్ణయాన్ని సమీక్షించి తమిళంలో కోర్టు తీర్పులు వెలువరించేందుకు అంగీకారం తెలపాలంటూ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టును కోరింది. అప్పుడు కూడా తిరస్కరించారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.స్థానిక భాషల్లో తర్జుమా చేయాల్సిందేఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ(ఏఐ)తో పాటు ట్రాన్స్లేషన్ టూల్స్‌ని ఉపయోగించి ఈ–ఎస్సీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సీజేఐ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. మొత్తం షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు. గతేడాది వరకూ 16 భాషల్లో మాత్రమే చేయగా.. ప్రస్తుతం 18 భాషలకు తర్జుమా చేరుకుంది. ఇలాంటి కమిటీలే దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ఆయా హైకోర్టుల న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. తీర్పులను 16 స్థానిక భాషల్లోకి అనువదించేందుకు హైకోర్టులతో సుప్రీంకోర్టు భాగస్వామ్యమవుతోంది. -
క్రెడిట్ కార్డు యూజర్లకు అలెర్ట్
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.అసలేం జరిగిందంటే..క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్సీడీఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్సీడీఆర్సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులుఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి.