
ఇటీవల ఒక న్యాయ, చట్ట సంబంధమైన వార్తల వెబ్ సైట్‌లో ఒక ఆశ్చర్యకరమైన వార్తా కథనం కనబడింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం ముందు, తన కక్షిదారు చనిపోయాడనీ, ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇరవై ఆరు మందీ చనిపోయారనీ ఒక న్యాయవాది చెప్పారు. అవి ప్రతీకార హత్యలేమీ కావు, సహజ మరణాలు. ఈ దేశంలో సామాజిక వ్యవస్థ గురించీ, న్యాయవ్యవస్థ గురించీ ఎన్నో పాఠాలు చెప్పగల నేరమూ–శిక్షా కథ ఇది.
బిహార్ లోని అర్వాల్ జిల్లా లక్ష్మణ్ పూర్ బాతే అనే గ్రామంలో 1997 డిసెంబర్ 1న నరసంహారం జరిగింది. రాజధాని పట్నాకు తొంభై కి.మీ. దూరంలో సోన్ నదీ తీరగ్రామం లక్ష్మణ్ పూర్ బాతే. అప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో అరాచకాలకూ, హత్యాకాండలకూ పాల్పడిన రణ వీర్ సేన అనే అగ్రవర్ణాల సేన ఆ గ్రామంలోని దళితుల ఇళ్ల మీద దాడి చేసి చిన్నారి పిల్లలు, స్త్రీలతో సహా 58 మందిని ఊచకోత కోసింది. హతులలో ఒక ఏడాది పసిపాప, ఒక గర్భిణి కూడా ఉన్నారు. నదికి అవతలి ఒడ్డు నుంచి రాత్రి పదకొండు గంటలకు పడవలలో వచ్చి దళిత వాడలో ఇళ్ల తలుపులు విరగ్గొట్టి, లోపలికి చొరబడి, పడుకున్నవాళ్లను పడుకున్నట్టే కాల్చి చంపారు. మూడు గంటల పాటు జరిగిన మారణకాండలో యువతుల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులకు అత్యాచారానికి గురైన ఐదుగురు బాలికల నగ్న మృతదేహాలు కనిపించాయి. ఈ నరసంహారం సాగించి, తిరిగి అదే పడవలలో నది దాటిన హంతకులు సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి తమను నది దాటించిన ఇద్దరు పడవవాళ్ల గొంతులు కోసి చంపేశారు.
అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ‘దేశానికి సిగ్గు చేటు’ అని అభివర్ణించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఈ మారణకాండ కారణాలు, పూర్వరంగం ఏమైనప్పటికీ, తర్వాత జరిగిన న్యాయ విచారణా ప్రక్రియ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. జహానాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో జరగవలసిన ఈ విచారణను పట్నా హైకోర్టు ఆదేశాల మేరకు 1999 అక్టో బర్‌లో పట్నాకు బదిలీ చేశారు. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2008 డిసెంబర్‌లో 46 మంది రణవీర్ సేన కార్యకర్తల మీద నేరారోపణలు నమోద య్యాయి. రెండు సంవత్సరాల తర్వాత 2010 ఏప్రిల్ 7న పట్నా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి విజయ్ ప్రకాష్ మిశ్రా నిందితులలో 16 మందికి మరణశిక్ష, 10 మందికి యావ జ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ హత్యాకాండ ‘పౌర సమాజం మీద మచ్చ’ అనీ, ‘పాశవికత్వంలో అరుదైన వాటిలోకెల్లా అరుదైనది’ అనీ తీర్పులో రాశారు.
శిక్షితులు అప్పీలుకు వెళ్లగా పట్నా హైకోర్టు జస్టిస్ వీఎన్ సిన్హా, జస్టిస్ ఏకే లాల్ ద్విసభ్య ‘ధర్మాసనం’ 2013 అక్టోబర్ 9న ‘సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా’ శిక్షలన్నిటినీ కొట్టివేసింది. ఇంత అన్యాయమైన హైకోర్టు తీర్పు వార్త ప్రధాన స్రవంతి పత్రికలకు పట్టనే లేదు. యాభై ఎనిమిది మందిని హత్య చేసి, కింది కోర్టులో నేరం రుజువై తీవ్రమైన శిక్షలు కూడా పడిన నేరస్థులను, అలా సాక్ష్యాధారాలు లేవంటూ వదిలివేసిన దుర్మార్గమైన వార్త కన్నా ఆ రోజే క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ చేసిన ప్రకటన పెద్ద వార్త అయింది! హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వమూ, బిహార్‌లోని రాజకీయ పార్టీలన్నీ తప్పు పట్టాయి. ఈ తీర్పును ఎంత మాత్రమూ అంగీకరించడానికి వీలు లేదని, తీర్పును సమీక్షించమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని బిహార్ రాజకీయ పార్టీలు కోరాయి.
పట్నా హైకోర్టు తీర్పును సమీక్షించి, కొట్టివేయాలని, మారణకాండ దోషులకు కఠిన శిక్షలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. 2014 జనవరి 13న సుప్రీంకోర్టు కేసు నమోదు చేసుకుని నోటీసులు పంపింది. నాలుగు సంవత్సరాల తర్వాత 2018, 2019లలో కాస్త విచారణ జరిగి, కేసు మౌలిక దస్తావేజులు, అదనపు పత్రాలు పంపమని కింది కోర్టులను ఆదేశించడంలోనే సమయం గడిచిపోయింది. 2023 ఒక్క సంవత్సరంలోనే ఎటువంటి వాదనలు, విచా రణ జరగకుండా ఆరుసార్లు వాయిదాలు పడ్డాయి. ఈ మధ్యలో కొందరు నిందితులు మరణించారని న్యాయ వాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెస్తూనే ఉన్నారు. 2025 జనవరి 1 నాటికి ఇరవై ఆరు మందిలో ఐదుగురు మర ణించారని నమోదయింది. పన్నెండేళ్లుగా వాయిదాలు పడుతూ నత్తనడకలతో సాగుతూ సాగుతూ వచ్చిన ఆ కేసులో 2025 ఏప్రిల్ 3న ఒక నిందితుడి తరఫున వాది స్తున్న న్యాయవాది ‘ఇరవై ఆరు మంది నిందితులూ మరణించారని ధర్మాసనానికి తెలియజేస్తున్నాం’ అన్నారు. వాస్తవ స్థితి ఏమిటో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం కేసును మళ్లీ వాయిదా వేసింది.
ఆలస్యం చేయడమంటే న్యాయాన్ని నిరాకరించినట్టే అనే నానుడిని నిజం చేస్తూ మన న్యాయవ్యవస్థ సాచివేత ద్వారా న్యాయాన్ని నిరాకరిస్తున్న తీరు ఇది! ఇప్పుడు నడుస్తున్న మందకొడి వేగంతోనే నేర విచారణలు సాగుతూ పోతే దేశంలో ఆ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ పూర్తి కావడానికి 324 సంవ త్సరాలు పడుతుందని 2018లో నీతి ఆయోగ్ ఒక వ్యూహ పత్రంలో నిర్ధారించింది. ఆ నాటికి దేశం మొత్తం మీద పెండింగ్‌లో ఉన్న కేసులు రెండు కోట్ల తొంబై లక్షలు కాగా, 2025 జనవరి నాటికి ఆ సంఖ్య ఐదు కోట్ల ఇరవై లక్షలకు చేరింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారమే చూస్తే, ప్రస్తుత పెండింగ్ కేసులు పూర్తి కావడానికి 580 సంవ త్సరాలు పడుతుంది!! అప్పటికి వాదులూ ఉండరు, ప్రతి వాదులూ ఉండరు. అటు, ఇటు వాదించే న్యాయ వాదులూ ఉండరు! న్యాయం ఉంటుందా?
ఎన్. వేణుగోపాల్
సీనియర్ జర్నలిస్ట్