
మానవాళి ఎదుర్కొంటున్న పెను విపత్తు ఉగ్రవాదం. ఇది నాగరిక సమాజపు అత్యు న్నత విలువలకు మాయని మచ్చ. విప్లవం, బలిదానం, హింసను గొప్పగా చేసి చెప్పడం లాంటి తప్పుడు భావనలు ఉగ్రవాదం పెచ్చ రిల్లడానికి ప్రాతిపదికలవుతున్నాయి. ‘ఒక రికి స్వాతంత్య్ర యోధుడైనవాడు మరొకరికి ఉగ్రవాది’ అన్న వాదన అతి ప్రమాదకర మైన అపోహ.
భయమూ, రక్తపాతాలపై నిజమైన స్వతంత్రాన్ని ఎన్నటికీ నిర్మించలేం.ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచుతున్నది భయమే. కానీ, ఆ భయాన్ని వ్యాపింపజేయడంలోనూ ఉగ్రవాదులు విఫలురయ్యారు. 26/11 దాడి, 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఇటీవలి పహల్ గామ్ దాడి... ఘటన ఏదయినా, భారత్ దృఢంగా నిలబడింది.
ఉగ్రవాదుల దుష్ట పన్నాగం
పాకిస్తాన్ నుంచి ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదా నికి దశాబ్దాలుగా మనం బాధితులం. పర్యాటకులను వారి మతమే మిటో అడిగి మరీ చంపేయడాన్ని బట్టి ఉగ్రవాదుల పన్నాగం స్పష్టమవుతోంది. దేశ ఐక్యతకు ముప్పు కలిగించాలన్న దురుద్దేశంతో, వివిధ విశ్వాసాలకు చెందిన పలు ఆధ్యాత్మిక ప్రదేశాలపై పాక్ దాడికి తెగబడటం కూడా ఇలాంటి చర్యే. ఇలాంటి దుర్మార్గపు చర్యలను ఏ మతమూ ఆమోదించదు. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా మతాన్ని దుర్వినియోగం చేస్తూ, తమ ఆటవిక చర్యలకు సమర్థింపుగా దాన్ని వాడుకుంటున్నారు. ఈ మత దుర్వినియోగం ప్రమాదవశాత్తు జరిగినదో, లేదా హఠాత్పరిణా మమో కాదు, ఇది ఉద్దేశపూర్వక పన్నాగం. దురాగతాలకు తప్పుడు సమర్థనలను చెప్పుకునే కుటిల వ్యూహం.
ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించబోమన్న విధానాన్ని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాద చర్యలూ, చర్చలూ ఒకేసారి సాధ్యం కావు. భవిష్యత్తులో పాకిస్తాన్ తో జరిగే ఏ చర్చలయినా ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పైనే ప్రధానంగా దృష్టి పెడ తాయి. పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తే ఐక్యరాజ్యసమితి గుర్తించిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను అప్పగించాలి.
పాక్ మూల్యం చెల్లించాలి!
మనం చాలాకాలంగా దీర్ఘకాలిక దృక్పథంతో, సమర్థమైన వ్యూహాలను అన్వేషిస్తూనే ఉగ్రవాద చర్యలపై ప్రతిస్పందించాం. మన సాయుధ దళాలకు గతంలో రక్షణాత్మక చర్యలకు మాత్రమే అనుమతి ఉండేది. సర్జికల్ స్ట్రైక్స్ (2016), బాలాకోట్ దాడులు (2019), ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ (2025)లతో పాక్‌లోని ఉగ్ర వాదులు, ఉగ్రవాద సూత్రధారుల పట్ల తన వైఖరిలో భారత్ సమూల మార్పులు చేసింది.
నైతిక, రాజకీయ అసమ్మతితోపాటు కేవలం రక్షణాత్మక వైఖరి ఇక సరిపోదని ఇప్పుడు తేటతెల్లమైంది. ఏ ఉగ్ర వాద చర్యనైనా ఇకపై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. భారత్‌పై ఏ ఉగ్రవాద దాడి జరిగినా... ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికీ ఉగ్రవాదులకూ తేడా లేదనే భావిస్తూ దీటుగా బదులిస్తాం. పాక్ తన గడ్డపై ఉగ్రవాదులను నిలువరించలేకపోతే, ఆ అసమర్థతకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఉగ్రవాదానికి ఆర్థిక చేయూతను నిరోధించడంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ‘నో మనీ ఫర్ టెర్రర్’ మూడో మంత్రివర్గ సదస్సులో ప్రధాని మోదీ, ‘‘ఒక్క దాడినీ తేలిగ్గా తీసుకోం, ఒక్క ప్రాణం పోయినా తీవ్రంగా పరిగణిస్తాం. కాబట్టి, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించే వరకు మేము విశ్రమించబోం’’ అని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మనం కట్టుబడి ఉన్నామని ఆప రేషన్ సిందూర్ ద్వారా భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ప్రపంచానికి చాటాయి. స్పష్టమైన, కచ్చితమైన, తీవ్రతరం కాని ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ–కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను మనం లక్ష్యంగా చేసుకున్నాం.
ఉగ్రవాదులపై సైనిక చర్య ఆవశ్యకమనీ, కానీ అదొక్కటే సరి పోదనీ మనకు తెలుసు. పాక్ ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయో గిస్తుండటంతో... ఆ దేశాన్ని దౌత్యపరంగానూ, ఆర్థికంగానూ ఏకాకిని చేయడంలో భారత్ విజయం సాధించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతివ్వడాన్ని పూర్తిగా మానేసే వరకూ, ఆ దిశగా విశ్వసనీయతను పొందే వరకూ సింధూ జలాల ఒప్పందాన్ని మనం ‘నిలిపివేశాం’. ఈ నిర్ణయం పాక్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆ దేశం తన 1.6 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి 80%, మొత్తం నీటి వినియోగంలో 93% సింధూనది వ్యవస్థపైనే ఆధారపడుతుంది. అలాగే 23.7 కోట్ల మంది దీనిపై ఆధారపడి ఉండగా, పాక్ జీడీపీలో నాలుగో వంతుకు ఇదే దోహదపడుతోంది.
ఐదు కీలక చర్యలు!
ఉగ్రవాదం కేవలం భారత్ సమస్యే కాదు, ఇది ప్రపంచ సమస్య. అంతర్జాతీయ ఉగ్రవాద సూచీ (జీటీఐ) ప్రకారం– ఉగ్ర వాద సంఘటనలను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య కొన్నేళ్లుగా పెరిగింది. ఉగ్రవాద వ్యవస్థలను సమర్థంగా నిర్వీర్యం చేయడానికీ, రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తును అందించడానికీ మనం సమష్టిగా ముందుకు సాగాలి. సూత్రప్రాయమైన, సమగ్రమైన, స్థిరమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ వ్యూహాన్ని మనం అవలంబించాలి. ఈ దిశగా అయిదు కీలక చర్యలు తీసుకోవాలి.
మొదటిది: ‘ఉగ్రవాదం’ పదాన్ని నిర్వచించడం. ఉగ్రవాదమంటే ఏమిటన్న దానిపై ఏకాభిప్రాయం లేదు. భారత్ ప్రతిపాదన ఆధారంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ‘అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్ర ఒడంబడిక’లో ఉగ్రవాద నిర్వచనం విషయంలో అతి సమీపంగా వచ్చాం. అర్థపరమైన అంశాలు ఉగ్రవాదంపై పోరా టాన్ని పరిమితం చేయకూడదు. ఉగ్రవాద చర్యల దర్యాప్తునకు లేదా విచారణకు లేదా విదేశాల నుంచి వారిని అప్పగించేందుకు విస్తృతంగా ఆమోదం పొందిన నిర్వచనం అవసరం.
రెండోది: ఉగ్రవాద సంస్థలవే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్స హిస్తున్న దేశాల ఆర్థిక వనరులను కూడా స్తంభింపజేయాలి. పాక్‌కు ఇచ్చే నిధులు సైనిక–ఉగ్రవాద చర్యలు రెండింటితో ప్రపంచాన్ని అస్థిరపరచడానికే దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, పాకిస్తాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్ తిరిగి గ్రే లిస్టులో చేర్చాల్సిన అవసరముంది.
మూడోది: పాకిస్తాన్‌లో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తులు ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని తెలిసిన విషయమే. ఉగ్రవాదు లకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం, సైనికాధి కారులు యూనిఫామ్‌లో హాజరు కావడం దీన్ని మరింతగా తేట తెల్లం చేస్తోంది. పాకిస్తాన్ లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర సంస్థల చేతికి చేరే ప్రమాదం ఎప్పటికైనా ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ తీవ్రమైన ప్రమాదాన్ని గుర్తించి, పాక్ అణ్వాయుధాలను అంతర్జా తీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో ఉంచాలి.
నాలుగోది: తమ సౌలభ్యం లేదా ప్రయోజనాల ప్రాతిపదికన మాత్రమే ఏ ఉగ్రవాద చర్యలను ఖండించాలో దేశాలు నిర్ణయించుకుంటే– అది సమష్టి బాధ్యతను బలహీనపరుస్తుంది. అటువంటి చర్యలకు అది వ్యూహాత్మకమైన సమర్థింపునూ అందిస్తుంది.
అయిదోది: కృత్రిమ మేధ, అటానమస్ సిస్టమ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ వంటి అధునాతనసాంకేతికతలను కూడా స్వీకరిస్తున్న పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు ప్రపంచమంతటికీ ప్రమాదకరమే. ఈ ముప్పులను అధిగమించడం కోసం అంతర్జాతీయ సహకారం అత్యావశ్యం.
9/11 దాడుల అనంతరం, ‘‘ఉగ్రవాదానికి సంబంధించి ఏ సైద్ధాంతిక, రాజకీయ లేదా మతపరమైన సమర్థననైనా మనందృఢంగా ఖండించాలి’’ అని నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పేర్కొన్నారు. ఏ రూపంలో ఉన్నా సరే, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న సంకల్పానికి భారత్ స్థిరంగా కట్టుబడి ఉంది. శాంతికాముక దేశాలన్నీ మాతో కలిసి రావాలని కోరుతున్నాం.
- వ్యాసకర్త భారత రక్షణ మంత్రి
-రాజ్‌నాథ్ సింగ్